Chronological
ఇశ్రాయేలీయులు సణగగా దేవుడు ఆహారాన్ని పంపటం
16 తర్వాత ప్రజలు ఏలీము నుండి ప్రయాణం చేసి సీనాయి ఎడారి చేరుకొన్నారు. ఈ స్థలం ఏలీముకి, సీనాయికి మధ్య ఉంది. ఈజిప్టు వదలిన తర్వాత రెండోనెల 15వ రోజున వారు ఈ స్థలానికి వచ్చారు. 2 అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మళ్లీ ఫిర్యాదు చేయటం మొదలు పెట్టారు. ఆ ఎడారిలో వారు మోషే అహరోనులకు ఫిర్యాదు చేసారు. 3 “ఈజిప్టు దేశంలోనే యెహోవా మమ్మల్ని చంపేసి ఉంటే మాకు బాగుండేది. ఈజిప్టులో తినేందుకు మాకు సమృద్ధిగా ఉండేది. మాకు కావాల్సిన భోజనం అంతా మాకు ఉండేది. కానీ ఇప్పుడు నీవు మమ్మల్ని ఈ ఎడారిలోనికి తీసుకొచ్చావు. మేమంతా ఆకలితో ఇక్కడే చస్తాము” అంటూ ప్రజలు మోషే అహరోనులతో చెప్పారు.
4 అప్పుడు మోషేతో యెహోవా అన్నాడు, “ఆకాశం నుండి ఆహారం కురిపిస్తాను. ఈ ఆహారం మీరు తినేందుకే. ప్రతిరోజూ ప్రజలు బయటకు వెళ్లి ఆరోజు తాము తినేందుకు ఎంత భోజనం అవసరమో అంతే సమకూర్చు కోవాలి. నేను చెప్పినట్టు ప్రజలు చేస్తారో లేదో చూద్దామని నేను యిలా చేసాను. 5 ఒక్క రోజుకు ఎంత భోజనం సరిపోతుందో సరిగ్గా అంతే ప్రజలు ప్రతిరోజూ తీసుకోవాలి. అయితే శుక్రవారం నాడు ప్రజలు భోజనం సిద్ధం చేసుకొనేటప్పుడు రెండు రోజులకు సరిపడే భోజనం ఉండేటట్టు వారు చూసుకోవాలి.”
6 కనుక మోషే అహరోనులు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పారు, “ఈ రాత్రి యెహోవా శక్తి మీరు చూస్తారు. ఈజిప్టు దేశం నుండి ఆయనే మిమ్మల్ని రక్షించాడని మీరు తెలుసుకొంటారు. 7 యెహోవా మహిమను రేపు ఉదయం మీరు చూస్తారు. యెహోవాకు మీరు ఫిర్యాదు చేసారు. ఆయన మా మనవి విన్నాడు. (ఆయన మీకు సహాయం చేస్తాడు) మీరు మా దగ్గర ఫిర్యాదు మీద ఫిర్యాదు చేసారు. మేము ఏ పాటి వారం?”
8 “మీరు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు, యెహోవా మీ ఫిర్యాదులు విన్నాడు. కనుక రాత్రివేళ ఆయన మీకు మాంసం ఇస్తాడు. మీకు అవసరం ఉన్న భోజనం అంతా ప్రతి ఉదయం మీకు ఉంటుంది. నా దగ్గర, అహరోను దగ్గర మీరు ఫిర్యాదు చేస్తూ ఉండినారు. కానీ ఇప్పుడు మేము కొంచెం విశ్రాంతి తీసుకొంటాం. మీరు ఫిర్యాదు చేస్తోంది నా మీద, అహరోను మీద కాదని జ్ఞాపకం ఉంచుకోండి. మీరు యెహోవాకు విరోధంగా ఫిర్యాదు చేస్తున్నారు” అన్నాడు మోషే.
9 ఆ తర్వాత మోషే అహరోనుతో, “నీవు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడు: ‘యెహోవా, మీ ఫిర్యాదులు విన్నాడు గనుక ఆయన ఎదుట సమావేశం అవ్వండి’ అని వారితో చెప్పు అన్నాడు.”
10 అహరోను ఇశ్రాయేలు ప్రజలందరితో మాట్లాడాడు. వాళ్లంతా ఒక్కచోట చేరారు. అహరోను మాట్లాడుతూ ఉండగా, ప్రజలంతా పక్కకు తిరిగి ఎడారిలోకి చూచారు. యెహోవా మహిమ ఒక మేఘంలా ప్రత్యక్షమవడం వారు చూశారు.
11 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: 12 “ఇశ్రాయేలు ప్రజల ఫిర్యాదులు నేను విన్నాను. కనుక నేను చెబుతున్న నా మాటలు వారికి చెప్పు. ‘రాత్రివేళ మాంసం మీరు తింటారు. ప్రతి ఉదయం మీకు కావాల్సినంత భోజనం మీరు తింటారు. అప్పుడు మీ యెహోవా దేవుణ్ణి నమ్ముకోవచ్చని మీరు తెలుసుకొంటారు.’”
13 ఆ రాత్రి వారి బస అంతటా పూరేళ్లు (పిట్టలు) వచ్చాయి. (మాంసం కోసం ప్రజలు ఈ పిట్టల్ని పట్టుకొన్నారు) ప్రతి ఉదయం బసకు దగ్గర్లో నేలమీద మంచు కురిసింది. 14 సూర్యోదయం కాగానే ఆ మంచు కరిగిపోయింది. అయితే మంచు పోగానే నేలమీద నూగుమంచు ఉండేది. 15 ఇశ్రాయేలు ప్రజలు అది చూసి “అది ఏమిటి?” అంటూ ఒకళ్లనొకళ్లు ప్రశ్నించుకొన్నారు. ఈ పదార్థం ఏమిటో వారికి అర్థం కాలేదు కనుక వాళ్లు ఈ ప్రశ్న అడిగారు. మోషే వాళ్లతో చెప్పాడు: “మీరు భోజనంచేయడానికి యెహోవా మీకు ఇచ్చిన భోజనం ఇది. 16 ప్రతి వ్యక్తి తనకు అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. మీ కుటుంబంలో ప్రతి వ్యక్తికీ 2 పావుల[a] కొలత ప్రకారం మీలో ఒక్కొక్కరు తీసుకోవాలి అని యెహోవా చెబుతున్నాడు.”
17 కనుక ఇశ్రాయేలు ప్రజలు అలాగే చేసారు. ప్రతి వ్యక్తి ఈ భోజనం కూర్చుకొన్నారు. కొంతమంది మిగతా వాళ్ల కంటె ఎక్కువ కూర్చుకొన్నారు. 18 ఆ ప్రజలు వారి కుటుంబంలో ప్రతివొక్కరికీ ఆ భోజనం పెట్టారు. ఆ భోజన పదార్థం కొలుచుకొన్నప్పుడల్లా, ప్రతి వ్యక్తికీ సరిపడ్డంత మాత్రమే ఉండేది. కాని ఎన్నడూ ఎక్కువ మిగిలేది కాదు. ప్రతి వ్యక్తీ తాను, తన కుటుంబం ఎంత తినగలరో సరిగ్గా అంతే తీసుకొన్నారు.
19 “రేపటికోసం ఆ భోజనం దాచుకోకండి” అని మోషే వారితో చెప్పాడు. 20 కానీ ప్రజలు మోషేకు లోబడలేదు. కొంత మంది మర్నాడు తినవచ్చని తమ భోజనంలో కొంత దాచుకొన్నారు. అలా దాచుకొన్న భోజనం పురుగులు పట్టేసి, కంపు కొట్టేసింది. ఇలా చేసినవాళ్ల మీద మోషేకు కోపం వచ్చింది.
21 ప్రతి ఉదయం ప్రజలు భోజనం కూర్చుకొన్నారు. ప్రతి వ్యక్తీ తాను తిన గలిగినంత కూర్చుకొన్నాడు. అయితే, ఎండ ఎక్కువ కాగానే ఆహారం కరిగిపోయి కనబడకుండా పోయింది.
22 శుక్రవారంనాడు, రెండంతల ఆహారం ప్రజలు కూర్చుకొన్నారు. ఒక్కొక్క మనిషికి 4 పావుల ప్రకారం వారు కూర్చుకొన్నారు. కనుక ప్రజానాయకులు మోషే దగ్గరకు వచ్చి ఈ విషయం తెలియజేసారు.
23 “ఇలా జరుగుతుందని యెహోవా చెప్పాడు. ఎందుచేత? రేపు సబ్బాతు కనుక. అది యెహోవాకు ప్రత్యేకంగా విశ్రాంతి రోజు. ఈరోజు వండుకోవాల్సిన భోజనం అంతా వండుకోండి, అయితే మిగతా భోజనం రేపు ఉదయానికి దాచుకోండి” అన్నాడు మోషే వాళ్లతో.
24 కనుక ప్రజలు ఆ భోజనంలో మిగిలినదాన్ని మర్నాటికోసం దాచుకొన్నారు. ఆ భోజనంలో ఏమీ చెడిపోలేదు. అందులో కొంచెము కూడా పురుగుపట్టలేదు.
25 శనివారం నాడు ప్రజలతో మోషే ఇలా చెప్పాడు: “ఈవేళ సబ్బాతు, అంటే యెహోవా విశ్రాంతి రోజు. అందుచేత మీలో ఏ ఒక్కరూ బయట పొలాల్లో ఉండకూడదు. నిన్న కూర్చుకొన్న భోజనాన్ని తినండి. 26 ఆరు రోజుల కోసం మీరు ఆహారం కూర్చుకోవాలి. అయితే ఏడోరోజు విశ్రాంతి రోజు కనుక నేల మీద ప్రత్యేక ఆహారం ఏమీ దొరకదు.”
27 శనివారంనాడు ప్రజల్లో కొంతమంది ఆహారం కూర్చుకోవాలని బయటకు వెళ్లారు కాని వారికి ఆహారం ఏమీ కనబడలేదు. 28 అప్పుడు మోషేతో యెహోవా అన్నాడు. “నా ఆజ్ఞలకు ఉపదేశాలకు లోబడకుండా ఎన్నాళ్లు మీరు తిరస్కరిస్తారు? 29 చూడండి, శనివారం మీకు విశ్రాంతి రోజుగా చేసాడు యెహోవా. అందుచేత రెండు రోజులకు సరిపడేంత ఆహారం శుక్రవారమే యెహోవా మీకు ఇస్తాడు. కనుక శనివారంనాడు మీలో ప్రతి ఒక్కరూ కూర్చొని విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కడి వాళ్లు అక్కడే ఉండండి.” 30 కనుక శనివారంనాడు ప్రజలు విశ్రాంతి తీసుకొన్నారు.
31 ఆ ప్రత్యేక ఆహారాన్ని “మన్నా”[b] అని పిలవడం మొదలుబెట్టారు ప్రజలు. మన్నా కొత్తిమెర గింజల్లా చిన్నగా తెల్లగా ఉండి, తేనెపూసిన పూతరేకుల్లా ఉంది. 32 అప్పుడు మోషే అన్నాడు, “నేను మిమ్మల్ని ఈజిప్టునుండి బయటికి రప్పించినప్పుడు ఎడారిలో నేను మీకు ఇచ్చిన ఆహారాన్ని మీ సంతానం వాళ్లు చూడ గలిగేటట్టు ఈ ఆహారం 2 పావులు దాచి ఉంచమని యెహోవా చెప్పాడు.”
33 కనుక మోషే అహరోనుతో ఇలా అన్నాడు: “ఒక పాత్ర తీసుకొని దానిలో 8 పావులు మన్నా నింపు. ఈ మన్నాను మన సంతానం వారి కోసం దాచిపెట్టు” 34 మోషే యెహోవా చెప్పినట్టు చేసాడు. మన్నా పాత్రను ఒడంబడిక పెట్టె[c] ముందర పెట్టాడు అహరోను. 35 40 సంవత్సరాల పాటు ప్రజలు మన్నా తిన్నారు. కనాను దేశ సరిహద్దుల వచ్చేంతవరకు వారు దాన్ని తిన్నారు 36 (మన్నా కొలిచేందుకు వారి ఉపయోగించిన కొలత ఓమెరు. ఓమెరు అంటే ఏపాలో పదో భాగం.)
బండనుండి నీరు ఇవ్వటం
17 ఇశ్రాయేలు ప్రజలంతా కలసి సీను అరణ్యమునుండి ప్రయాణమయ్యారు. యెహోవా ఆజ్ఞాపించినట్లెల్లా ఒక తావు నుండి మరో తావుకు వాళ్లు ప్రయాణం చేసారు. ప్రజలు రెఫీదీముకు ప్రయాణం చేసి అక్కడ బసచేసారు. అక్కడ ప్రజలకు తాగేందుకు నీళ్లు లేవు. 2 కనుక ప్రజలు మోషే మీదికి లేచి, అతనితో వాదించటం మొదలు పెట్టారు. “తాగేందుకు నీళ్లు ఇమ్ము” అని ప్రజలు మోషేను అడిగారు.
అయితే మోషే, “మీరెందుకు నామీదికి ఇలా లేచారు? మీరు యెహోవాను ఎందుకు పరీక్షిస్తున్నారు?” (యెహోవా మనతో లేడని మీరనుకొంటున్నారా?) అని వారితో అన్నాడు.
3 కాని ప్రజలు మాత్రం నీళ్ల కోసం చాల దాహంగా ఉన్నారు. అందుచేత వాళ్లు మోషేకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు, “అసలు నీవు మమ్మల్ని ఈజిప్టు నుండి ఎందుకు తీసుకొచ్చావు? నీళ్లు లేక మేము, మా పిల్లలు, మా పశువులు చావాలని నీవు మమ్మల్ని యిక్కడికి తీసుకొచ్చావా?” అని అన్నారు ప్రజలు.
4 కనుక మోషే, “ఈ ప్రజల్ని నేనేమి చేయాలి? నన్ను చంపెయ్యటానికి వాళ్లు సిద్ధంగా ఉన్నారు” అంటూ యెహోవాకు మొరబెట్టాడు.
5 మోషేతో యెహోవా అన్నాడు, “ఇశ్రాయేలు ప్రజల ముందుకు వెళ్లు. ప్రజల పెద్దలలో (నాయకులు) కొందర్ని నీ వెంట తీసుకొని వెళ్లు. నీ చేతి కర్రను తీసుకొని వెళ్లు. నీవు నైలునదిని కొట్టిన కర్ర యిది. 6 హోరేబులో (సీనాయి పర్వతం) నీ యెదుట ఒక బండమీద నేను నిలబడతాను. కర్రతో ఆ బండను కొట్టు, దానిలో నుండి నీళ్లు వస్తాయి. అప్పుడు ప్రజలు తాగవచ్చు.”
మోషే ఈ పనులు చేసాడు, ఇశ్రాయేలు పెద్దలు (నాయకులు) అది చూచారు. 7 మెరీబా[d] అని మస్సా[e] అని ఆ స్థలానికి మోషే పేరు పెట్టాడు. ఎందుచేతనంటే, ప్రజలు తన మీదికి లేచి యెహోవాను పరీక్షించిన స్థలం ఇది. యెహోవా వారితో ఉన్నాడో లేదో తెల్సుకోవాలని ప్రజలు కోరారు.
అమాలేకీయులతో యుద్ధం
8 రెఫీదీము వద్ద అమాలేకీ ప్రజలు వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేసారు. 9 కనుక, “కొందరు మనుష్యుల్ని ఏర్పాటు చేసుకొని రేపు వెళ్లి అమాలేకీయులతో యుద్ధం చేయి. నేనేమో కొండ శిఖరం మీద నిన్ను గమనిస్తూంటాను. దేవుడు నాకు ఇచ్చిన కర్రను నేను పట్టుకొని ఉంటాను,” అని యెహోషువతో మోషే చెప్పాడు.
10 మోషే మాటకు విధేయుడై యెహోషువ మర్నాడు అమాలేకీ ప్రజలతో యుద్ధం చేసేందుకు వెళ్లాడు. అదే సమయంలో మోషే, అహరోను, హూరు అనువారు కొండ శిఖరం మీదికి వెళ్లారు. 11 మోషే తన చేతి కర్రను ఎప్పుడు పైకి ఎత్తితే అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం గెలుస్తున్నారు. అయితే మోషే తన చేయి కిందికి దించగానే ఇశ్రాయేలు ప్రజలు యుద్ధంలో ఓడిపోవడం మొదలవుతుంది.
12 కొంచెం సేపయ్యాక, మోషే చేతులు అలసి పోయి (మోషే చేతుల్ని అలానే పైకి ఎత్తి ఉంచే మార్గం చూడాలను కొన్నారు మోషేతో ఉన్న మనుష్యులు) అందుచేత వాళ్లు ఒక పెద్ద బండ తెచ్చి మోషే కూర్చొనేందుకు వేసారు. అప్పుడు అహరోను మోషే చేతుల్ని పైకి ఎత్తి పట్టి ఉంచాడు. మోషేకు ఒకపక్క అహరోను, మరోపక్క హూరు ఉన్నారు. సూర్యుడు అస్తమించే వరకు వారు ఆయన చేతులను అలాగే పట్టి ఉంచారు. 13 కనుక యెహోషువ (అతని మనుష్యులు) అమాలేకీయులను ఆ యుద్ధంలో ఓడించారు.
14 అప్పుడు యెహోవా, “ఈ యుద్ధాన్ని గురించి వ్రాసి ఉంచు. ఇక్కడ ఏమి జరిగిందో అది ప్రజలు జ్ఞాపకం ఉంచుకొనేటట్టు ఈ సంగతులన్నీ ఒక గ్రంథంలో వ్రాసి ఉంచు. అమాలేకీయులను ఈ భూమి మీద నుండి పూర్తిగ నాశనం చేసేస్తానని యెహోషువతో తప్పక చెప్పు” అని మోషేతో అన్నాడు.
15 తర్వాత మోషే ఒక బలిపీఠం నిర్మించాడు, “యెహోవా నా ధ్వజం”. అని మోషే దానికి పేరు పెట్టాడు. 16 “యెహోవా సింహాసనం వైపు నేను నా చేతులు ఎత్తాను. కనుక అతను ఎప్పుడూ చేసినట్టే, యెహోవా అమాలేకీయులతో పోరాడాడు,” అన్నాడు మోషే.
మోషే మామ నుండి సలహా
18 మోషే మామ యిత్రో, మిద్యానులో యాజకుడు. మోషేకు, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు సహాయం చేసిన ఎన్నో విధానాల గూర్చి యిత్రో విన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టు నుండి యెహోవా బయటకు నడిపించిన విషయం యిత్రో విన్నాడు. 2 దేవుని పర్వతం దగ్గర మోషే ఉన్నప్పుడు మోషే భార్య సిప్పోరాను వెంటబెట్టుకొని, యిత్రో మోషే దగ్గరకు వెళ్లాడు. (సిప్పోరాను మోషే ఇంటికి పంపించినందు చేత ఆమె మోషే వద్ద లేదు) 3 మోషే ఇద్దరు కుమారులను కూడ యిత్రో తన వెంట తీసుకొని వచ్చాడు. “ఒక దేశంలో నేను పరాయివాణ్ణి” అని మోషే చెప్పాడు గనుక, మొదటి కుమారునికి గెర్షోము అని పేరు పెట్టాడు. “నా తండ్రి దేవుడు నాకు సహాయం చేసాడు. ఈజిప్టు రాజు బారినుండి నన్ను రక్షించాడు” అని మోషే అన్నాడు గనుక, 4 మరో కుమారునికి ఎలీయెజరు అని పేరు పెట్టాడు. 5 దేవుని పర్వతం దగ్గర ఎడారిలో మోషే బస చేస్తున్నప్పుడు యిత్రో మోషే దగ్గరకు వెళ్లాడు. మోషే భార్య, అతని ఇద్దరు కుమారులు యిత్రోతోనే ఉన్నారు.
6 (మోషేకు యిత్రో ఒక సందేశం పంపించాడు), “నేను నీ మామ యిత్రోను. నీ భార్యను, నీ ఇద్దరు కుమారులను నేను నీ దగ్గరకు తీసుకొని వస్తున్నాను,” అన్నాడు యిత్రో.
7 కనుక మోషే తన మామను కలుసు కొనేందుకు బయటకు వెళ్లాడు. మోషే అతని ఎదుట వంగి, అతణ్ణి ముద్దు పెట్టుకొన్నాడు. వాళ్లిద్దరూ వారి వారి క్షేమాన్ని గూర్చి అడిగి తెలుసుకొన్నారు. తర్వాత ఇంకా మాట్లాడుకొనేందుకు వాళ్లిద్దరూ మోషే గుడారంలోకి వెళ్లారు. 8 ఇశ్రాయేలు ప్రజలకోసం యెహోవా చేసినదంతా మోషే యిత్రోకు చెప్పాడు. ఫరోకు, ఈజిప్టు ప్రజలకు యెహోవా చేసిన విషయాల్ని గూర్చి మోషే అతనితో చెప్పాడు. దారిలో వారికి కలిగిన సమస్యలన్నిటిని గూర్చీ మోషే చెప్పాడు. కష్టం వచ్చినప్పుడల్లా ఆ ప్రజల్ని యెహోవా ఏ విధంగా రక్షించిందీ, మోషే తన మామతో చెప్పాడు.
9 ఇశ్రాయేలీయుల కోసం యెహోవా చేసిన మంచి పనులన్నింటిని గూర్చి విన్నప్పుడు యిత్రో చాలా సంతోషించాడు. ఈజిప్టు వాళ్ల నుండి, ఇశ్రాయేలు ప్రజలను యెహోవా విడుదల చేసినందుకు యిత్రో సంతోషించాడు. 10 యిత్రో ఇలా అన్నాడు:
“యెహోవాను స్తుతించండి.
ఈజిప్టు మనుష్యులనుండి ఆయన మిమ్మల్ని విడిపించాడు.
ఫరో బారినుండి యెహోవా మిమ్మల్ని రక్షించాడు.
11 ఈజిప్టు వాళ్లకంటె నీ ప్రజలు గొప్ప వాళ్లుగా చేయబడిన విధానాన్ని బట్టి
దేవుళ్లందరికంటె యెహోవా గొప్ప వాడని ఇప్పుడు నాకు తెలిసింది.”
12 అప్పుడు యిత్రో బలి అర్పణలు, కానుకలు యెహోవాకు సమర్పించాడు. తర్వాత అహరోను, ఇశ్రాయేలు పెద్దలు (నాయకులు) మోషే మామ యిత్రోతో కలిసి భోజనం చేసేందుకు వచ్చారు. దేవుడ్ని ఆరాధించేందుకు ఒక ప్రత్యేక పద్ధతిగా వారు ఇలా చేసారు.
13 మర్నాడు ప్రజలకు న్యాయం తీర్చాల్సిన ప్రత్యేక పని మోషేకు ఉంది. (అక్కడ చాలామంది ప్రజలున్నారు) అందుచేత ప్రజలు రోజంతా మోషే ఎదుట నిలబడాల్సి వచ్చింది.
14 ప్రజలకు మోషే న్యాయం తీర్చడం యిత్రో చూసాడు, “నీవు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుచేత నీవు ఒక్కడివే న్యాయమూర్తిగా ఉన్నావు? ప్రజలు రోజంతా నీ దగ్గరకు రావడం ఏమిటి?” అన్నాడు అతను.
15 అప్పుడు మోషే తన మామతో ఇలా చెప్పాడు: “ప్రజలు వారి సమస్యల విషయంలో దేవుని నిర్ణయం ఏమిటో నేను అడిగి తెలుసుకోవాలని నన్ను అడిగేందుకు నా దగ్గరకు వస్తారు. 16 ఎవరిది సరిగ్గా ఉందో నేను నిర్ణయిస్తాను. ఈ విధంగా దేవుడి చట్టాన్ని, ఆయన ప్రబోధాల్ని నేను ప్రజలకు ప్రబోధిస్తాను.”
17 అయితే మోషే మామ అతనితో ఇలా అన్నాడు: “నీవు చేస్తున్న ఈ పని బాగుండలేదు. 18 నీవు ఒక్కడివే చెయ్యాలంటే, ఇది చాలా పెద్ద పని. దీనివల్ల నీవు అలసిపోతావు. ఇది ప్రజలు కూడ అలసిపొయ్యేటట్టు చేస్తుంది. ఈ పని నీవు ఒక్కడివీ చేయలేవు. 19 నీకు నేను సలహా ఇస్తాను, ఏమి చేయాలో నీకు చెబుతాను, దేవుడు నీకు తోడుగా ఉండాలని ప్రార్థిస్తాను. (నీవు చేయాల్సింది ఇది) ప్రజల సమస్యలను గూర్చి నీవు వింటూ ఉండాల్సిందే. ఈ విషయాలను గూర్చి నీవు దేవునితో చెబుతూ ఉండాల్సిందే. 20 దేవుడి కట్టడలను, విధులను నీవు ప్రజలకు బోధించాలి. కట్టడలను ఉల్లంఘించొద్దని ప్రజలను హెచ్చరించు. సరైన జీవిత విధానం ఏమిటో ప్రజలకు చెప్పు. వాళ్లేమి చేయాలో వాళ్లకు చెప్పు.” 21 అయితే, “ప్రజల్లోనుంచి మంచి మనుష్యుల్ని నీవు ఏర్పాటు చేసుకోవాలి. డబ్బుకోసం నిర్ణయాలు మార్చుకోనటువంటి మనుష్యుల్ని ఏర్పాటు చేసుకో.”
“వీళ్లను ప్రజల మీద పరిపాలకులుగా చేయి. 1,000 మంది 100 మందికి, 50 మందికి, చివరికి 10 మందికి పైన పరిపాలకులు ఉండాలి. 22 ఈ పరిపాలకుల్ని ప్రజలకు న్యాయం తీర్చనివ్వు. ముఖ్యమైన వ్యాజ్యము ఏదైనా వుంటే అప్పుడు నిర్ణయంకోసం వాళ్లు నీ దగ్గరకు రావచ్చు. అయితే మిగతా వ్యాజ్యాలను వాళ్లే నిర్ణయించవచ్చు. ఈ విధంగా నీకు తేలిక అవుతుంది. పైగా ఈ మనుష్యులు నీ పనిని నీతోబాటు పంచుకొంటారు. 23 నీవు ఈ నీ పనులు చేస్తే, యెహోవాకు ఇష్టమైతే, నీ పని నీవు కొనసాగించటానికి నీకు చేతనవుతుంది. అదే సమయంలో ప్రజలంతా వారి సమస్యలు పరిష్కారమై ఇంటికి వెళ్లగల్గుతారు.”
24 యిత్రో తనకు చెప్పినట్టు మోషే చేసాడు. 25 ఇశ్రాయేలు ప్రజల్లోనుంచి మంచి మనుష్యుల్ని మోషే ఏర్పాటు చేశాడు. మోషే వాళ్లను ప్రజలమీద నాయకులుగా చేసాడు. 1,000 మంది ప్రజల మీద 100 మంది ప్రజలమీద 50 మంది ప్రజలమీద 10 మంది ప్రజలమీద పరిపాలకులు ఉన్నారు. 26 ఈ పరిపాలకులే ప్రజలకు న్యాయమూర్తులు. ఎప్పుడైనా సరే ప్రజలు తమ వాదాలను ఈ పరిపాలకుల దగ్గరకు తీసుకురావచ్చు. ప్రాముఖ్యమైన వ్యాజ్యాలను మాత్రమే మోషే పరిష్కారం చేయాల్సి ఉంటుంది.
27 కొద్దికాలం తర్వాత మోషే తన మామ యిత్రోకు వీడ్కోలు చెప్పాడు. యిత్రో తన స్వగృహానికి వెళ్లిపోయాడు.
© 1997 Bible League International