Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ఆదికాండము 43-45

బెన్యామీను వెళ్లటానికి యాకోబు ఒప్పుకొనుట

43 దేశంలో కరువు చాలా దారుణంగా ఉంది. అక్కడ ఎలాంటి ఆహారం పండటం లేదు. ప్రజలు ఈజిప్టునుండి తెచ్చుకొన్న ధాన్యం అంతా తినేసారు. ధాన్యం అయిపోయినప్పుడు, “మళ్లీ ఈజిప్టుకు వెళ్లి, మనం తినేందుకు మరింత ధాన్యం కొనండి” అని యాకోబు తన కుమారులతో చెప్పాడు.

అయితే యాకోబుతో యూదా చెప్పాడు: “మీ సోదరుడ్ని మీరు నా దగ్గరకు తీసుకొని రాకపోతే నేను మీతో మాట్లాడను అని ఆ దేశ పాలకుడు మమ్మల్ని హెచ్చరించాడు. బెన్యామీనును నీవు మాతో పంపిస్తేనే మేము వెళ్లి ధాన్యం కొంటాం. కానీ బెన్యామీనును పంపించేందుకు నీవు ఒప్పుకొనకపోతే మేము వెళ్లం. అతడు లేకుండా తిరిగి రావద్దని ఆయన మమ్మల్ని హెచ్చరించాడు.”

“మీకు ఇంకో సోదరుడు ఉన్నాడని అసలు మీరెందుకు చెప్పారు? ఇంత కీడు మీరెందుకు నాకు చేశారు?” ఇశ్రాయేలు (యాకోబు) అడిగాడు.

ఆ సోదరులు జవాబు చెప్పారు: “ఆ మనిషి మమ్మల్ని అనేక ప్రశ్నలు వేశాడు. మా విషయం, మా కుటుంబం విషయం అతడు తెలుసుకోవాలనుకున్నాడు, ‘మీ తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడా? ఇంటి దగ్గర మీకు ఇంకో సోదరుడు ఉన్నాడా?’ అని అతడు మమ్మల్ని అడిగాడు. అతని ప్రశ్నలకు మాత్రమే మేము జవాబిచ్చాం. మా మిగిలిన సోదరుని కూడ తన దగ్గరకు తీసుకొని రమ్మంటాడని మాకు తెలియదు!”

అప్పుడు యూదా తన తండ్రి ఇశ్రాయేలుతో ఇలా చెప్పాడు: “బెన్యామీనును నాతో పంపించు. అతని విషయం నేను జాగ్రత్తగా చూసుకొంటాను. మేము మాత్రం ఈజిప్టుకు వెళ్లాలి, ఆహారం తీసుకురావాలి. మేము వెళ్లకపోతే మనమూ, మన పిల్లలూ అందరం చస్తాం. అతని క్షేమం నేను చూసుకొంటాను. అతని భాద్యత నాది. అతణ్ణి నేను తిరిగి నీ దగ్గరకు తీసుకొని రాకపోతే శాశ్వతంగా నీవు నన్ను నిందించవచ్చు. 10 నీవు మమ్మల్ని వెళ్లనిచ్చి ఉంటే ఇప్పటికి రెండు సార్లు వెళ్లి వచ్చే వాళ్లం.”

11 అప్పుడు వారి తండ్రి ఇశ్రాయేలు అన్నాడు: “ఇదే గనుక నిజంగా సత్యమైతే, అలాగే బెన్యామీనును నీతో తీసుకొని వెళ్లు. అయితే ఆ పాలకునికి కానుకలు తీసుకొని వెళ్లు. మన దేశంలో మనం సంపాదించగలిగినవి కొన్ని తీసుకొని వెళ్లు. కొంచెం మస్తకి, కొంచెం తేనె, సుగంధద్రవ్యాలు, బోళం, పిస్తాచ కాయలు, బాదం కాయలు, అతనికి తీసుకొని వెళ్లండి. 12 ఈ సారి రెండంతల డబ్బు మీతో తీసుకు వెళ్లండి. పోయిన సారి మీరు చెల్లించగా తిరిగి మీకు ఇవ్వబడిన సొమ్ము మళ్లీ తీసుకు వెళ్లండి. ఒకవేళ ఆ పాలకుడు పొరబడ్డాడేమో. 13 బెన్యామీనును తీసుకొని ఆ మనిషి దగ్గరకు తిరిగి వెళ్లు. 14 మీరు ఆ పాలకుని ముందర నిలిచినప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు సహాయం చేయాలని నేను ప్రార్థన చేస్తాను. బెన్యామీను, షిమ్యోనులను అతడు క్షేమంగా తిరిగి వెళ్లనిచ్చేటట్లు నేను ప్రార్థన చేస్తాను. లేనట్లయితే నా కుమారుని పోగొట్టుకొని నేను మరల దుఃఖంలో మునిగిపోతాను.”

15 కనుక ఆ పాలకుని కోసం కానుకలన్నీ తీసుకొన్నారు ఆ సోదరులు. వారు మొదటిసారి తీసుకొని వెళ్లిన దానికి రెట్టింపు సొమ్ము వారితో కూడా తీసుకొని వెళ్లారు. బెన్యామీను ఆ సోదరులతో కలిసి ఈజిప్టుకు వెళ్లాడు.

యోసేపు ఇంటియందు సోదరులు

16 ఈజిప్టులో, వారితోబాటు బెన్యామీను ఉండటం యోసేపు చూశాడు. యోసేపు, “ఆ మనుష్యుల్ని నా ఇంటికి తీసుకొని రండి. ఒక పశువును చంపి వంట చేయండి. ఈవేళ మధ్యాహ్నం వాళ్లు నాతోనే భోజనం చేస్తారు” అని తన గృహనిర్వాహకునితో చెప్పాడు. 17 అతను చెప్పినట్లే ఆ సేవకుడు చేశాడు. అతడు వాళ్లను యోసేపు ఇంటికి తీసుకొని వచ్చాడు.

18 వాళ్లు యోసేపు ఇంటికి తీసుకొని రాబడినప్పుడు ఆ సోదరులు భయపడ్డారు. “పోయినసారి మన సంచుల్లో డబ్బు ఉంచబడినందువల్లనే మనల్ని ఇక్కడకు తీసుకు వచ్చారు. మనల్ని నేరస్తులుగా నిరూపించటానికి దాన్ని వారు వినియోగిస్తారు. తర్వాత మన గాడిదల్ని దొంగిలించి, మనల్ని బానిసలుగా చేస్తారు” అని వారనుకొన్నారు.

19 కనుక యోసేపు ఇంటికి బాధ్యుడైనవాని దగ్గరకు ఆ సోదరులు వెళ్లారు. 20 వారు చెప్పారు: “అయ్యా, ప్రమాణం చేసి సత్యం చెబుతున్నాం. పోయినసారి మేము వచ్చినప్పుడు ఆహారం కొనుగోలు చేసేందుకే మేము వచ్చాం. 21-22 ఇంటికి వెళ్తూ మార్గంలో మేము మా సంచులు విప్పితే, మా ప్రతి ఒక్కరి సంచిలోనూ డబ్బు కనబడింది. ఆ డబ్బు అక్కడికి ఎలా వచ్చిందో మాకు తెలియదు. అయితే ఆ డబ్బు మళ్లీ మీకు ఇచ్చేయాలని ఇప్పుడు మాతో తెచ్చాం. పైగా ఇప్పుడు మేము కొనాలనుకొంటున్న ధాన్యంకోసం ఇంకా ఎక్కువ మొత్తంకూడ మళ్లీ ఇప్పుడు తెచ్చాం.”

23 అయితే ఆ సేవకుడు, “భయపడకండి, నన్ను నమ్మండి. మీ దేవుడు, మీ తండ్రి దేవుడు ఆ డబ్బును మీ సంచుల్లో కానుకగా పెట్టి ఉంటాడు. పోయినసారి ధాన్యంకోసం డబ్బును మీరు నాకే చెల్లించినట్లు నాకు గుర్తు” అని వారితో చెప్పాడు.

ఆ సేవకుడు షిమ్యోనును చెరసాలలోనుంచి బయటకు తీసుకొని వచ్చాడు. 24 ఆ సేవకుడు వాళ్లందరిని యోసేపు ఇంటికి తీసుకొని వెళ్లాడు. అతడు వారికి నీళ్లు ఇస్తే, వాళ్లు కాళ్లు కడుక్కొన్నారు. తర్వాత అతడు వారి గాడిదలకు మేత పెట్టాడు.

25 ఆ సోదరులు తాము యోసేపుతోబాటు భోంచేయబోతున్నట్లు విన్నారు. కనుక వారు అతనికోసం తెచ్చిన కానుకల్ని మధ్యాహ్నంవరకు సిద్ధం చేసుకొన్నారు.

26 యోసేపు ఇంటికి వచ్చాడు, ఆ సోదరులు వారితో తెచ్చిన కానుకలు అతనికి ఇచ్చారు. తర్వాత వారు నేలమీద సాష్టాంగపడ్డారు.

27 వారెలా ఉన్నారని యోసేపు వాళ్లను అడిగాడు, “మీరు నాతో చెప్పిన మీ ముసలి తండ్రి క్షేమంగా ఉన్నాడా? ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడా?” అన్నాడు యోసేపు.

28 ఆ సోదరులు, “అయ్యా, మా తండ్రి బాగున్నాడు. ఆయన ఇంకా బ్రతికి ఉన్నాడు” అని జవాబిచ్చారు. మళ్లీ వాళ్లంతా యోసేపు ముందర సాష్టాంగపడ్డారు.

29 అప్పుడు యోసేపు తన సోదరుడు బెన్యామీనును చూశాడు, (బెన్యామీను, యోసేపు ఒక్క తల్లి పిల్లలు). “మీరు నాతో చెప్పిన మీ చిన్న సోదరుడు ఇతడేనా?” అని యోసేపు అడిగాడు. అప్పుడు యోసేపు, “కుమారుడా, దేవుడు నిన్ను ఆశీర్వదించు గాక!” అన్నాడు బెన్యామీనుతో.

30 అప్పుడు యోసేపు ఆ గదిలోనుంచి పరుగెత్తిపోయాడు. బెన్యామీను మీద తనకు ఉన్న ప్రేమను అతనికి చూపెట్టాలని యోసేపు ఎంతో ఆశించాడు. అతనికి ఏడ్చెయ్యాలనిపించింది గాని అతడు ఏడ్వటం అతని సోదరులు చూడకూడదు అనుకొన్నాడు. కనుక యోసేపు తన గదిలోనికి పరుగెత్తి పోయి అక్కడ ఏడ్చాడు. 31 తర్వాత యోసేపు తన ముఖం కడుక్కొని బయటకు వచ్చాడు. అతడు తనను తాను ఓదార్చుకొని, “భోజనానికి వేళ అయ్యింది” అన్నాడు.

32 ఆ సేవకులు యోసేపు ఒక్కడిని ఒక బల్ల దగ్గర వేరుగాను, సోదరులను మరో బల్ల దగ్గర వేరుగాను కూర్చుండబెట్టారు. వారితో భోంచేస్తున్న ఈజిప్టు వారిని వారి మట్టుకే ఒక బల్లదగ్గర కూర్చుండ బెట్టారు. ఈజిప్టువాళ్లు హీబ్రూవారితో కలిసి భోజనం చేయరు, అది ఈజిప్టు మత విరోధం. 33 యోసేపు సోదరులు అతనికి ఎదురుగా ఇంకో బల్ల దగ్గర కూర్చున్నారు. ఆ సోదరులను పెద్దవానితో మొదలుబెట్టి చిన్నవాని వరకు వరుసక్రమంలో కూర్చోబెట్టారు. అందువల్ల వాళ్ళకు ఆశ్చర్యమైంది. జరుగుతున్నదంతా ఏమిటా అన్నట్లు అన్నదమ్ములంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొంటున్నారు.[a] 34 సేవకులు యోసేపు బల్లమీద నుంచే వారికి భోజనం వడ్డిస్తున్నారు. అయితే ఆ సేవకులు మిగిలిన వాళ్లకంటె అయిదు రెట్లు ఎక్కువగా బెన్యామీనుకు వడ్డించారు. ఆ సోదరులు దాదాపు మత్తెక్కినంత వరకు యోసేపుతో కలిసి తిని త్రాగారు.

యోసేపు పరీక్షించుట

44 అప్పుడు యోసేపు తన సేవకునికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు: “ఈ మనుష్యులు మోసుకొని పోగలిగినంత ధాన్యం వారి సంచుల్లో నింపు. ప్రతి ఒక్కరి సొమ్మును తిరిగి వారి వారి ధాన్యపు సంచుల్లో పెట్టు. అందరిలో చిన్న తమ్ముని సంచిలో డబ్బు పెట్టు. అయితే నా ప్రత్యేకమైన వెండి పాత్రనుకూడ అతని సంచిలో పెట్టు.” ఆ సేవకుడు యోసేపు చెప్పినట్లు చేశాడు.

మర్నాటి ఉదయాన్నే ఆ సోదరులు వారి గాడిదలతోబాటు వారి దేశం పంపించబడ్డారు. వారు పట్టణం విడిచిన తర్వాత యోసేపు తన సేవకునితో చెప్పాడు: “నీవు వెళ్లి ఆ మనుష్యుల్ని వెంబడించు. వాళ్లను ఆపుజేసి మేము మీతో మంచిగా ఉన్నాం. అయినా మీరెందుకు మాతో చెడ్డగా ప్రవర్తిస్తున్నారు? మా యజమాని వెండి పాత్రను మీరెందుకు దొంగిలించారు? ఇది నా యజమాని యోసేపు పానం చేసే పాత్ర. రహస్య విషయాలను తెలుసుకొనేందుకు ఆయన ఉపయోగించే పాత్ర ఇది. ఆయన పాత్రను దొంగిలించి మీరు తప్పు చేశారు అని వాళ్లతో చెప్పు.”

అందుచేత ఆ సేవకుడు విధేయుడయ్యాడు. అతడు సవారి చేసి ఆ సోదరులను ఆపుజేసాడు. అతడు చెప్పాల్సిందిగా యోసేపు అతనికి చెప్పిన విషయాలు ఆ సేవకుడు వారితో చెప్పాడు.

అయితే ఆ సోదరులు ఆ సేవకునితో ఇలా అన్నారు: “ఆ పాలకుడు యిలా ఎందుకు అన్నాడు? అలాంటిదేమీ మేము చేయము. ఇంతకు ముందు మా సంచుల్లో మాకు దొరికిన డబ్బు మేము తెచ్చి ఇచ్చాం. అందుచేత మీ యజమాని ఇంటినుండి వెండి బంగారం ఏవీ మేము నిజంగా దొంగిలించం. మాలో ఎవరి సంచిలోనైనా సరె ఆ వెండి పాత్ర నీకు కనబడితే, వాడు చావాల్సిందే. అతణ్ణి నీవు చంపేయి, మేము మీకు బానిసలమవుతాం.”

10 “మీరు చెప్పినట్లే చేద్దాం. కాని నేను మాత్రం ఎవర్నీ చంపను. వెండి పాత్ర గనుక నాకు కనబడితే ఆ మనిషి మాత్రం నాకు బానిస అవుతాడు. మిగిలిన వాళ్లు స్వేచ్ఛగా వెళ్లొచ్చు” అన్నాడు ఆ సేవకుడు.

బెన్యామీను పట్టుబడుట

11 అప్పుడు ప్రతి ఒక్క సోదరుడూ తన సంచిని నేలమీద పెట్టి తెరిచాడు. 12 సేవకుడు సంచుల్లో చూశాడు. అతడు పెద్దవానితో మొదలు పెట్టి చిన్నవానితో ముగించాడు. బెన్యామీను సంచిలో ఆ పాత్ర అతనికి కనబడింది. 13 సోదరులకు దుఃఖం వచ్చేసింది. దుఃఖంతో వాళ్లు వారి వస్త్రాలు చింపేసుకొన్నారు. వారు వారి సంచుల్ని మళ్లీ గాడిదలమీద పెట్టి తిరిగి ఆ పట్టణం వెళ్లారు.

14 యూదా, అతని సోదరులు యోసేపు ఇంటికి వెళ్లారు. యోసేపు ఇంకా అక్కడే ఉన్నాడు. ఆ సోదరులంతా నేలమీద సాష్టాంగపడ్డారు. 15 యోసేపు “మీరెందుకు ఇలా చేశారు? రహస్యాలు తెలుసుకొనే ఒక ప్రత్యేక పద్ధతి నా దగ్గర ఉందని మీకు తెలియదా? ఈ పని నాకంటె బాగా ఇంకెవ్వరూ చేయలేరు” అన్నాడు.

16 యూదా, “అయ్యా, మేము ఇంకేమీ చెప్పలేం. వివరించే దారి యింకొకటి లేదు. మేము నేరస్థులం కాదని చూపించే విధం ఇంకొకటి లేదు. మేము చేసిన మరో పని మూలంగా దేవుడు మమ్మల్ని నేరస్థులుగా తీర్పు తీర్చాడు. కనుక మేము అందరం చివరకు బెన్యామీనుతో కూడ బానిసలమవుతాం” అన్నాడు.

17 కానీ యోసేపు, “నేను మిమ్మల్ని అందరినీ బానిసలుగా చేయను. పాత్రను దొంగిలించిన మనిషి ఒక్కడే నాకు బానిస అవుతాడు. మిగిలిన మీరు సమాధానంగా మీ తండ్రి దగ్గరకు వెళ్లవచ్చు” అన్నాడు.

బెన్యామీను కోసం యూదా బ్రతిమలాడుట

18 అప్పుడు యోసేపు దగ్గరకు యూదా వెళ్లి ఇలా చెప్పాడు: “అయ్యా, దయచేసి తమరితో నన్ను తేటగా చెప్పనివ్వండి. దయచేసి నాపై కోపగించకండి. మీరు ఫరో అంతటి వారని నాకు తెలుసు. 19 క్రితంసారి మేము ఇక్కడ ఉన్నప్పుడు, ‘మీకు తండ్రిగాని, సోదరుడు గాని ఉన్నాడా?’ అని తమరు అడిగారు. 20 దానికి మేము, ‘మాకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన ముసలివాడు. మాకు ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు, వాడు మా తండ్రికి ముసలితనంలో పుట్టాడు, అందుచేత మా తండ్రికి వాడంటే చాలా ప్రేమ. పైగా ఆ చిన్న కుమారుని అన్న చనిపోయాడు. అందుచేత ఆ తల్లికి పుట్టిన కుమారులలో మిగిలినవాడు ఇతడు ఒక్కడే. మా తండ్రికి ఇతనంటే ఎంతో ప్రేమ’ అని జవాబు చెప్పాం. 21 అప్పుడు ‘ఆ సోదరుని నా దగ్గరకు తీసుకొని రండి, నేను అతడ్ని చూడాలి’ అన్నారు తమరు. 22 దానికి మేము ‘ఆ చిన్నవాడు రావటానికి వీల్లేదు. అతడ్ని అతని తండ్రి విడిచిపెట్టలేడు. అతని తండ్రి అతణ్ణి గనుక పోగొట్టుకొంటే, ఆయన దుఃఖంతో మరణిస్తాడు’ అని తమరితో చెప్పాం. 23 కానీ తమరేమో ‘మీరు మీ చిన్న తమ్ముడ్ని తప్పక తీసుకొని రావాల్సిందే, లేకపోతే మీకు ధాన్యం అమ్మేది లేదు’ అన్నారు మాతో. 24 కనుక మేము తిరిగి మా తండ్రి దగ్గరకు వెళ్లి, మీరు మాతో చెప్పినది ఆయనకు చెప్పాం.

25 “తర్వాత మా తండ్రి ‘మీరు మళ్లీ వెళ్లి మనకోసం ధాన్యం కొనండి’ అన్నాడు. 26 మేము మా తండ్రితో ‘మా చిన్న తమ్ముడు లేకుండా మేము వెళ్లలేం. మా చిన్న తమ్ముడ్ని చూచేంత వరకు మళ్లీ మాకు ధాన్యం అమ్మనని ఆ పాలకుడు అన్నాడు’ అని చెప్పాం. 27 అప్పుడు మా తండ్రి మాతో, ‘నా భార్య రాహేలు ఇద్దరు కుమారుల్ని నాకు కన్నది. 28 ఒక కుమారుడ్ని నేను బయటకు వెళ్లనిస్తే, అతణ్ణి అడవి మృగం చంపేసింది. అప్పట్నుండి నేను అతణ్ణి చూడలేదు. 29 రెండో కుమారునిగూడా మీరు నా దగ్గర్నుండి తీసుకొని పోతే, అతనికి ఏమైనా సంభవిస్తే ఆ దుఃఖంతో నేను మరణించాల్సిందే!’ అన్నాడు. 30 కనుక ఇప్పుడు మేము మా చిన్నసోదరుడు మాతో లేకుండా ఇంటికి వెళ్తే, ఏమి జరుగుతుందో ఊహించండి. మా తండ్రి జీవితంలో ఈ కుర్రవాడు చాలా ముఖ్యం. 31 ఈ కుర్రవాడు మాతో లేకపోవటం గమనిస్తే, మా తండ్రి చనిపోతాడు. ఆ తప్పు మాదే అవుతుంది. మహాగొప్ప దుఃఖంతో మా తండ్రి చనిపోయేటట్లు చేసిన వాళ్లమవుతాం.

32 “ఈ పిల్లవాని విషయం నేను బాధ్యత తీసుకొన్నాను. ‘ఇతణ్ణి మళ్లీ నీ దగ్గరకు తీసుకొని రాకపోతే నా జీవితకాలమంతా నన్ను నీవు నిందించమని’ నా తండ్రితో నేను చెప్పాను. 33 కనుక ఇప్పుడు నేను మీకు మనవి చేసేది, మిమ్మల్ని బ్రతిమాలాడేది ఏమిటంటే, దయచేసి ఈ పిల్లవాణ్ణి తన సోదరులతో వెళ్లనివ్వండి. నేను ఇక్కడే ఉండి, మీకు బానిసను అవుతాను. 34 ఈ పిల్లవాడు నాతో లేకపోతే, నేను తిరిగి నా తండ్రి దగ్గరకు వెళ్లలేను. నా తండ్రికి ఏం జరుగుతుందోనని నాకు చాలా భయంగా ఉంది.”

యోసేపు తానెవరని చెప్పుట

45 యోసేపు ఇంకెంతమాత్రం తనను తాను ఓర్చుకోలేక పోయాడు. అక్కడున్న ప్రజలందరి ముందు అతడు గట్టిగా ఏడ్చేశాడు. “అందర్నీ ఇక్కడనుండి వెళ్లిపొమ్మనండి” అన్నాడు యోసేపు. అందుచేత అందరూ అక్కడనుండి వెళ్లిపోయారు. ఆ సోదరులు మాత్రమే యోసేపు దగ్గర ఉన్నారు. అప్పుడు యోసేపు తాను ఎవరయిందీ వారితో చెప్పేశాడు. యోసేపు ఇంకా ఏడుస్తూనే ఉన్నందుచేత, ఫరో ఇంటిలో ఉన్న ఈజిప్టు ప్రజలంతా అది విన్నారు. యోసేపు తన సోదరులతో “మీ సోదరుడు యోసేపును నేనే, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా?” అన్నాడు. కాని ఆ సోదరుల నోట మాట రాలేదు. వారు భయంతో కలవరపడిపోయారు.

కనుక యోసేపు మళ్లీ తన సోదరులతో, “నా దగ్గరకు రండి. ఇలా నా దగ్గరకు రమ్మని బ్రతిమాలుతున్నాను, రండి” అన్నాడు. కనుక ఆ సోదరులంతా యోసేపుకు దగ్గరగా వెళ్లారు. యోసేపు వాళ్లతో చెప్పాడు, “నేనే మీ సోదరుణ్ణి, యోసేపును. ఈజిప్టుకు బానిసగా మీరు అమ్మిన వాడిని నేనే. ఇప్పుడేమీ బాధపడకండి. మీరు చేసినదాన్నిబట్టి మీ మీద మీరు కోపం తెచ్చుకోవద్దు. నేను ఇక్కడికి రావటం దేవుని ఏర్పాటు. మీ ప్రాణం కాపాడేందుకు నేను ఇక్కడికి వచ్చాను. భయంకరమైన ఈ కరవు కాలం ఇప్పటికే రెండు సంవత్సరాలనుండి ఉంది. నాట్లు వేయకుండా, కోతలు కోయకుండా ఇంకా అయిదు సంవత్సరాలు గడచిపోవాలి. కనుక మీ వాళ్లందరినీ ఈ దేశంలో నేను రక్షించాలని దేవుడే నన్ను మీకంటె ముందుగా ఇక్కడికి పంపించాడు. నేను యిక్కడికి పంపబడటం మీ తప్పుకాదు. అదంతా దేవుని సంకల్పం. దేవుడు నన్ను ఫరోకు తండ్రిలా చేశాడు. ఆయన దివాణం అంతటిమీదను, మొత్తం ఈజిప్టు అంతటికిని నేను పాలకుడ్ని.”

ఇశ్రాయేలుకు ఈజిప్టు వచ్చుటకు ఆహ్వానం

“కనుక మీరు త్వరగా నా తండ్రి దగ్గరకు వెళ్లండి. ఆయన కుమారుడు యోసేపు పంపిన సందేశం ఇది అని నా తండ్రితో చెప్పండి అన్నాడు యోసేపు. ‘దేవుడు నన్ను ఈజిప్టు అంతటి మీద అధికారినిగా చేశాడు. ఇక్కడికి నా దగ్గరకు వచ్చేయండి. ఇంకా వేచి ఉండవద్దు. ఇప్పుడే వచ్చేయండి. 10 గోషెను దేశంలో నా దగ్గర మీరు నివసిస్తారు. మీరు, మీ పిల్లలు, మీ పిల్లల పిల్లలు, మీ జంతువులు, మీ మందలు ఇక్కడికి రావాలని ఆహ్వానిస్తున్నాను. 11 వచ్చే అయిదు కరువు సంవత్సరాల కాలంలోనూ నేను మిమ్మల్ని చూచుకొంటాను. అందుచేత మీరూ, మీ కుటుంబాలు, మీ స్వంతది ఏదీ నష్టపోదు.’”

12 యోసేపు తన సోదరులతో మాట్లాడటం కొనసాగిస్తూనే ఉన్నాడు. “ఇప్పుడు మీరు నిజంగా, నేను యోసేపును అని చూడగలుగుతున్నారు. నేనే అని మీ సోదరుడు బెన్యామీనుకు తెలుసు. మీతో మాట్లాడుతున్న నేను మీ సోదరుణ్ణి. 13 కనుక ఇక్కడ ఈజిప్టులో నాకు ఉన్న సమస్త ఘనతను గూర్చి నా తండ్రికి చెప్పండి. మీరు ఇక్కడ చూచిన వాటన్నింటి గూర్చి నా తండ్రికి చెప్పండి. ఇక మీరు త్వరపడి నా తండ్రిని నా దగ్గరకు తీసుకురండి.” అన్నాడు అతడు. 14 అప్పుడు యోసేపు తన తమ్ముడు బెన్యామీనును కౌగలించుకొని ఏడ్చాడు. బెన్యామీను కూడ ఏడ్చాడు. 15 తర్వాత యోసేపు తన సోదరులందరినీ ముద్దు పెట్టుకొని, వారి మీదపడి ఏడ్చాడు. ఆ తర్వాత ఆ సోదరులు అతనితో మాట్లాడటం మొదలు బెట్టారు.

16 యోసేపు సోదరులు అతని దగ్గరకు వచ్చినట్లు ఫరోకు తెలిసింది. ఫరో ఇల్లంతా ఈ వార్త పాకిపోయింది. దీని విషయమై ఫరో, అతని సేవకులు చాలా సంతోషించారు. 17 కనుక యోసేపుతో ఫరో అన్నాడు: “నీ సోదరులకు కావలసినంత ఆహారం తీసుకొని తిరిగి కనాను దేశం వెళ్లమని చెప్పు. 18 నీ తండ్రిని, వారి కుటుంబాలను తిరిగి ఇక్కడికి నా దగ్గరకు తీసుకొని రమ్మని వారితో చెప్పు. ఈజిప్టులో శ్రేష్ఠమైన భూమిని నివాసానికి నేను నీకు ఇస్తాను. ఇక్కడ మనకు ఉన్న శ్రేష్ఠ ఆహారం నీ కుటుంబం భోంచేస్తారు.” 19 తర్వాత ఫరో అన్నాడు: “మన బండ్లలో మంచి వాటిని కొన్నింటిని మీ సోదరులకు ఇయ్యి. కనాను వెళ్లి, మీ తండ్రిని, స్త్రీలందరిని, పిల్లలను ఆ బండ్లమీద తీసుకొని రమ్మని వారితో చెప్పు. 20 వారి అన్ని సామానులు తెచ్చుకొనే విషయంలో ఏమీ చింత పడవద్దు. ఈజిప్టులో మనకు ఉన్న శ్రేష్ఠ వస్తువులు మనం వారికి ఇద్దాం.”

21 కనుక ఇశ్రాయేలు కుమారులు అలా చేశారు. ఫరో వాగ్దానం చేసినట్లే యోసేపు వారికి మంచి బండ్లు ఇచ్చాడు. వారి ప్రయాణానికి సరిపడినంత ఆహారం యోసేపు వారికి ఇచ్చాడు. 22 ఒక్కో సోదరునికి ఒక్కో జత చక్కని వస్త్రాలు యిచ్చాడు యోసేపు. అయితే బెన్యామీనుకు అయిదు జతల మంచి బట్టలు యోసేపు ఇచ్చాడు. మరియు 300 వెండి నాణాలు కూడ యోసేపు బెన్యామీనుకు ఇచ్చాడు. 23 యోసేపు తన తండ్రికి కానుకలు కూడా పంపించాడు. ఈజిప్టులోని మంచి వస్తువులు చాలా సంచులనిండా నింపి, పది గాడిదలమీద అతడు పంపించాడు. అతని తండ్రి తిరిగి వచ్చేటప్పుడు అవసరమైన ఆహారం, రొట్టె, ధాన్యం విస్తారంగా పది ఆడగాడిదల మీద అతడు పంపించాడు. 24 అప్పుడు యోసేపు అతని సోదరులను వెళ్లమన్నాడు. వారు వెళ్తూ ఉండగా యోసేపు “తిన్నగా ఇంటికి వెళ్లండి. దారిలో పోట్లాడకండి” అని వారితో చెప్పాడు.

25 కనుక ఆ సోదరులు ఈజిప్టు దేశం విడిచి, కనాను దేశంలో ఉన్న తమ తండ్రి దగ్గరకు వెళ్లారు. 26 ఆ సోదరులు “నాయనా, యోసేపు బ్రతికే ఉన్నాడు, ఈజిప్టు దేశం అంతటికి అతడే అధికారి” అని అతనితో చెప్పారు. వారి తండ్రి ఆశ్చర్యచకితుడయ్యాడు. అతడు వాళ్లను నమ్మలేదు. 27 అయితే యోసేపు చెప్పినదంతా ఆ సోదరులు వారి తండ్రికి చెప్పారు. తర్వాత తనని ఈజిప్టు తీసుకొని రమ్మని యోసేపు పంపిన బండ్లను యాకోబు చూశాడు. అప్పుడు యాకోబు సంతోషంతో ఉప్పొంగిపొయ్యాడు. 28 “ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతాను. నా కుమారుడు యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు! నేను మరణించక ముందు అతణ్ణి చూస్తాను” అన్నాడు ఇశ్రాయేలు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International