Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ఆదికాండము 32-34

ఏశావును మళ్లీ కలుసుకొనుటకు యాకోబు సిద్ధపడుట

32 యాకోబు కూడ అక్కడ నుండి వెళ్లి పోయాడు. అతడు ప్రయాణం చేస్తుండగా దేవుని దూతలను చూశాడు. యాకోబు వారిని చూసినప్పుడు, “ఇది దేవుని శిబిరం” అన్నాడు. కనుక ఆ స్థలానికి “మహనయీము”[a] అని యాకోబు పేరు పెట్టాడు.

యాకోబు అన్న ఏశావు శేయీరు అనే ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఇది ఎదోం పర్వత ప్రాంతం. యాకోబు ఏశావు దగ్గరకు వార్తాహరులను పంపాడు. “ఏశావుకు ఇలా చెప్పండి” అని వార్తాహరులతో చెప్పాడు యాకోబు: “‘మీ సేవకుడైన యాకోబు, నా యజమాని ఏశావుకు చెప్పేదేమిటంటే, ఇన్ని సంవత్సరాలు నేను లాబానుతో నివసించాను. పశువులు, గాడిదలు, మందలు, అనేక మంది సేవకులు, దాసీలు నాకు ఉన్నారు. అవన్నీ నేను నీకు పంపిస్తున్నాను. నీవు మమ్మల్ని చేర్చుకోవాలని మనవి.’”

వార్తాహరులు తిరిగి వచ్చి, “నీ అన్న ఏశావును కలుసుకొనేందుకు మేము వెళ్లాం. నిన్ను కలుసుకొనేందుకు అతడు వస్తున్నాడు. అతనితో 400 మంది మనుష్యులు ఉన్నారు” అని యాకోబుతో చెప్పారు.

ఆ వార్త యాకోబుకు భయం కలిగించింది. తనతో ఉన్న మనుష్యులందరినీ అతడు రెండు గుంపులుగా విభజించాడు. మందలను, పశువులను, ఒంటెలను రెండు గుంపులుగా విభజించాడు. “ఏశావు వచ్చి ఒక గుంపును హతమార్చినా, మరో గుంపు పారిపోయి తప్పించుకోవచ్చు” అనుకున్నాడు యాకోబు.

యాకోబు ఇలా అన్నాడు “నా తండ్రి అబ్రాహాము దేవా! నా తండ్రి ఇస్సాకు దేవా! ఓ యెహోవా, నన్ను మళ్లీ నా కుటుంబం దగ్గరకు, నా స్వదేశానికి నీవే వచ్చేయమన్నావు. నీవు నాకు మేలు చేస్తానన్నావు. 10 నా యెడల నీవు ఎంతో దయ చూపించావు. నాకు ఎన్నో మేళ్లు చేశావు. మొదటిసారి నేను యోర్దాను దాటినప్పుడు, నా చేతి కర్ర తప్ప యింకేమీ నా స్వంతం లేదు. ఇప్పుడు రెండు గుంపులకు సరిపడినంత నాకు ఉన్నది. 11 దయచేసి నా అన్న ఏశావు నుంచి నన్ను కాపాడు. నాకు అతడంటే భయంగా ఉంది. అతడు వచ్చి మమ్మల్ని అందరిని, చివరికి తల్లులను, పిల్లలను కూడ చంపేస్తాడని భయంగా ఉంది. 12 ‘నేను నీతో మంచిగా ఉంటాను. నేను నీ కుటుంబాన్ని వర్ధిల్లచేసి, నీ పిల్లల్ని ఇసుక రేణువులంత విస్తారంగా చేస్తాను. లెక్కింప జాలనంత విస్తారంగా వారుంటారు’ అని నీవు నాతో అన్నావు గదా ప్రభూ!”

13 యాకోబు ఆ రాత్రి అక్కడే ఉండిపోయాడు. ఏశావుకు కానుకలుగా ఇచ్చేందుకు కొన్ని వస్తువులను యాకోబు సిద్ధం చేశాడు. 14 యాకోబు 200 ఆడ మేకలను, 20 మేకపోతులను, 200 ఆడ గొర్రెలను, 20 పొట్టేళ్లను తీసుకొన్నాడు. 15 30 ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఎద్దులను, 20 ఆడ గాడిదలను, 10 మగ గాడిదలను యాకోబు తీసుకొన్నాడు. 16 “ఒక్కొక్క రకం జంతువుల మందను యాకోబు తన సేవకులకు అప్పగించాడు. అప్పుడు యాకోబు తన సేవకులతో ఒక్కో రకం జంతువుల మందను వేరు చేయండి నాకు ముందుగా నడుస్తూ, ఒక్కో మందకు మధ్య ఎడం ఉంచండి” అన్నాడు. 17 యాకోబు వారికి ఇవ్వవలసిన ఆజ్ఞలన్నీ ఇచ్చాడు. మొదటి మంద వెంబడి ఉన్న సేవకునితో యాకోబు “నా అన్న ఏశావు నీ దగ్గరకు వచ్చి, ‘ఇవి ఎవరి జంతువులు? నీవు ఎక్కడికి వెళ్తున్నావు? నీవు ఎవరి సేవకుడువి?’ అని అడిగితే, 18 ‘ఇవి నీ సేవకుడైన యాకోబు మందలు. నా యజమాని ఏశావుకు కానుకగా యాకోబు వీటిని పంపించాడు. యాకోబు కూడా మా వెనుక వస్తున్నాడు’ అని నీవు చెప్పాలి” అన్నాడు.

19 అందరూ అలాగే చేయాలి అని రెండవ సేవకునికి, మూడవ సేవకునికి, మిగిలిన సేవకులందరికి యాకోబు ఆజ్ఞాపించాడు. “ఏశావును మీరు కలుసుకొన్నప్పుడు, ఏశావుకు మీరు ఇలానే చేయాలి. 20 ‘ఇది నీ కోసం కానుక, నీ సేవకుడైన యాకోబు వెనుక ఉన్నాడు’ అని మీరు చెప్పాలి” అన్నాడు యాకోబు.

“ఈ కానుకలు ఇచ్చి వీళ్లను ముందు పంపిస్తే, ఒకవేళ ఏశావు నన్ను క్షమించి చేర్చుకొంటాడేమో” అనుకొన్నాడు యాకోబు. 21 కనుక యాకోబు ఏశావుకు కానుకలు పంపించాడు. అయితే యాకోబు మాత్రం ఆ రాత్రి శిబిరంలోనే వుండిపోయాడు.

22 ఆ రాత్రి చాలా గడిచిన తర్వాత యాకోబు లేచి బయల్దేరాడు. అతని భార్యలను, ఇద్దరు దాసీలను, తన పదకొండుమంది పిల్లలను అతడు తనతో కూడ వెంటబెట్టుకొని బయల్దేరాడు. యబ్బోకు నదిని దాటవలసిన చోట యాకోబు దాటాడు. 23 తన కుటుంబాన్ని నది దాటించాడు యాకోబు. తర్వాత యాకోబు తనకి కలిగిన దాన్ని అంతటినీ నది దాటించాడు.

దేవునితో పోరాటం

24 అందరికంటే చివర యాకోబు నదిని దాటాడు. అయితే అతడు దాటక ముందు, అతడు ఇంకా ఒంటరిగా ఉండగానే, ఒక మనిషి వచ్చి అతనితో పోరాడాడు. సూర్యుడు ఉదయించే వరకు ఆ మనిషి అతనితో పోరాడాడు. 25 ఆ మనిషి యాకోబును ఓడించలేనట్లు గ్రహించాడు. అందుచేత అతడు యాకోబు కాలును తాకాడు. అప్పుడే యాకోబు కాలి కీలు జారిపోయింది.

26 అప్పుడు ఆ మనిషి, “నన్ను వెళ్లనివ్వు, సూర్యుడు వచ్చేస్తున్నాడు” అని యాకోబుతో అన్నాడు.

కాని యాకోబు, “నేను నిన్ను వెళ్లనియ్యను. నీవు నన్ను ఆశీర్వదించాల్సిందే” అన్నాడు.

27 “నీ పేరేమిటి?” ఆ మనిషి అడిగాడు.

“నా పేరు యాకోబు” అన్నాడు యాకోబు.

28 అప్పుడు, “నీ పేరు ఇకమీదట యాకోబు కాదు. ఇప్పుడు నీ పేరు ఇశ్రాయేలు.[b] దేవునితోను, మనుష్యులతోను నీవు పోరాడి, ఓడిపోలేదు గనుక నీకు నేను ఈ పేరు పెడుతున్నాను” అన్నాడు ఆ మనిషి.

29 అప్పుడు యాకోబు, “దయచేసి నీ పేరు ఏమిటో చెప్పు” అని అడిగాడు.

అయితే ఆ మనిషి “నీవు నా పేరెందుకు అడగాలి?” అన్నాడు. అప్పుడే యాకోబును అతడు ఆశీర్వదించాడు.

30 అందుచేత ఆ స్థలానికి పెనూయేలు[c] అని యాకోబు పేరు పెట్టాడు. “ఇక్కడ దేవుణ్ణి నేను ముఖాముఖిగా చూశాను. అయినప్పుటికి నా ప్రాణం దక్కింది” అన్నాడు యాకోబు. 31 అతడు పెనూయేలు దాటుతుండగా సూర్యుడు ఉదయించాడు. యాకోబు కాలికి అలా జరిగినందువల్ల అతడు కుంటుతూ ఉన్నాడు. 32 అందుచేత తొడ గూటి మీద ఉన్న కండరమును ఇశ్రాయేలీయులు ఈ రోజువరకు తినరు, ఎందుకంటే అక్కడే యాకోబుకు దెబ్బ తగిలింది.

యాకోబు ఏశావును కలిసికొనుట

33 యాకోబు చూడగా ఏశావు రావడం కనబడింది. ఏశావు, అతనితో 400 మంది మనుష్యులు వస్తున్నారు. యాకోబు తన కుటుంబాన్ని నాలుగు గుంపులుగా చేశాడు. లేయా, ఆమె పిల్లలు ఒక గుంపులో ఉన్నారు, రాహేలు, యోసేపు ఒక గుంపులో ఉన్నారు, ఇద్దరు దాసీలు, వారి పిల్లలు మరి రెండు గుంపుల్లో ఉన్నారు. దాసీలను వారి పిల్లలను యాకోబు ముందు ఉంచాడు. తర్వాత యాకోబు లేయాను ఆమె పిల్లలను ఉంచాడు. ఆ తర్వాత, చివరగా రాహేలును, యోసేపును ఉంచాడు యాకోబు.

యాకోబు తానే ఏశావు వస్తున్న వైపు ముందుగా వెళ్లాడు. కనుక ఏశావు దగ్గరకు వచ్చిన మొదటివాడు అతడే. యాకోబు తన అన్న దగ్గరకు నడుస్తూ ఏడు సార్లు నేలమీద సాగిలపడ్డాడు.

యాకోబును చూడగానే అతణ్ణి కలుసుకొనేందుకు ఏశావు పరుగెత్తాడు. ఏశావు అతణ్ణి కౌగిలించుకొని హత్తుకొన్నాడు. ఏశావు అతని మెడమీద ముద్దు పెట్టుకొని, వారిద్దరు సంతోషముతో ఏడ్చేశారు. ఏశావు చూడగా స్త్రీలు, పిల్లలు అతనికి కనబడ్డారు. “నీతో ఉన్న వీళ్లంతా ఎవరు?” అని అతడు అడిగాడు.

“దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు వీళ్లంతాను. దేవుడు నాకు మేలు చేశాడు” అంటూ జవాబు చెప్పాడు యాకోబు.

తర్వాత ఇద్దరు దాసీలు, వారితో ఉన్న పిల్లలు ఏశావు దగ్గరకు వెళ్లారు. వాళ్లంతా అతని ముందు సాష్టాంగపడ్డారు. తర్వాత లేయా, ఆమెతో ఉన్న పిల్లలు ఏశావు దగ్గరకు వెళ్లి సాష్టాంగపడ్డారు. తరువాత, రాహేలు, యోసేపు ఏశావు దగ్గరకు వెళ్లి సాష్టాంగపడ్డారు.

“నేను ఇక్కడికి వస్తున్నప్పుడు నాకు కనబడిన ప్రజలంతా ఎవరు? పైగా ఆ జంతువులన్నీ దేని కోసం?” అని ఏశావు అడిగాడు.

దానికి యాకోబు “నీవు నన్ను స్వీకరించాలని అవన్నీ నీకు నా కానుకలు” అని జవాబిచ్చాడు.

కాని ఏశావు, “సోదరా, నాకు నీవు కానుకలు ఇవ్వాల్సిన పని లేదు. నాకు కావాల్సినంత ఉన్నది” అన్నాడు.

10 యాకోబు ఇలా అన్నాడు: “అలా కాదు, నేను నిన్ను బతిమాలుకొంటున్నాను. నీవు నిజంగా నన్ను అంగీకరిస్తుంటే, నీవు నా కానుకలు కూడా అంగీకరించాలి. మరలా నేను నీ ముఖం చూడటం నాకెంతో సంతోషంగా ఉంది. దేవుని ముఖము చూసినట్లు ఉంది. నీవు నన్ను అంగీకరించటం చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంది. 11 అందుచేత నేను నీకు ఇస్తున్న కానుకలను కూడ స్వీకరించమని ప్రార్థిస్తున్నా. దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు. నాకు కావల్సిన దానికంటే ఎక్కువగా ఉంది.” ఈ విధంగా తన కానుకల్ని తీసుకోమని యాకోబు ఏశావును బతిమాలాడు. కనుక ఏశావు ఆ కానుకలను స్వీకరించాడు.

12 అప్పుడు ఏశావు, “ఇంక నీవు ప్రయాణం కొనసాగించు. నేను కూడ నీతో వస్తాను” అన్నాడు.

13 కాని యాకోబు అతనితో ఇలా చెప్పాడు: “నా పిల్లలు బలహీనులని నీకు తెలుసు. పైగా నా మందలు, వాటి పిల్లలను గూర్చిన జాగ్రత్త నేను తీసుకోవాలి. ఒక్క రోజునే నేను వాటిని చాలా దూరం నడిపిస్తే అవి చస్తాయి. 14 అందుచేత నీవు ముందు వెళ్లు. నేను మెల్లగా నీ వెనుక వస్తాను. పశువులు, మిగిలిన జంతువులు క్షేమంగా ఉండగలిగినంత నిదానంగా నేను నడుస్తాను. మరియు నా పిల్లలు కూడ మరీ అలసిపోకుండా నేను మెల్లగా వస్తాను. శేయీరులో నేను నిన్ను కలుసుకొంటాను.”

15 ఏశావు, “అలాగైతే నీకు సహాయంగా నా మనుష్యులను కొందర్ని నీతో ఉంచుతాను” అన్నాడు.

కానీ యాకోబు, “అదంతా నీ దయ. కాని అలా చేయాల్సిన అవసరం ఏమీ లేదు” అన్నాడు. 16 కనుక ఆ రోజు ఏశావు శేయీరుకు తిరుగు ప్రయాణం కట్టాడు. 17 అయితే యాకోబు సుక్కోతుకు వెళ్లాడు. అక్కడ తనకోసం ఒక యిల్లు, తన పశువుల కోసం కొట్టములు కట్టాడు. అందుకే ఆ చోటుకు సుక్కోతు[d] అని పేరు.

18 ఆ తర్వాత, యాకోబు పద్దనరాము నుండి కనానులో ఉన్న షెకెము పట్టణం వరకు తన ప్రయాణాన్ని క్షేమంగా ముగించాడు. ఆ పట్టణానికి సమీపంగా ఒక పొలంలో యాకోబు తన నివాసం ఏర్పాటు చేసుకొన్నాడు. 19 షెకెము తండ్రియైన హమోరు కుటుంబం దగ్గర యాకోబు ఆ పొలాన్ని కొన్నాడు. యాకోబు నూరు వెండి నాణ్యాలు చెల్లించాడు. 20 దేవుణ్ణి ఆరాధించటానికి యాకోబు అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. ఆ స్థలానికి “ఏల్, ఇశ్రాయేలీయుల దేవుడు” అని పేరు పెట్టాడు.

దీనాను చెరచుట

34 యాకోబు లేయాల కుమార్తె దీనా. ఒక రోజు, ఆ ఊరి స్త్రీలను చూడాలని దీనా బయటకు వెళ్లింది. ఆ దేశం రాజైన హమోరు కుమారుడు షెకెము దీనాను చూశాడు. అతడు ఆమెను బంధించి, బలవంతంగా ఆమెతో శయనించాడు. షెకెము దీనాను ప్రేమించాడు. ఆమె తనను పెళ్లి చేసుకునేలా ఒప్పించేందుకు ఆమెతో మాట్లాడాడు. “నేను పెళ్లి చేసుకోవటానికి దయచేసి ఈ అమ్మాయినే తెచ్చి పెట్టమని” షెకెము తన తండ్రితో చెప్పాడు.

ఆ యువకుడు తన కూతురికి చేసిన దుష్కార్యాన్ని గూర్చి యాకోబు విన్నాడు. అయితే యాకోబు కుమారులంతా పశువులతోబాటు పొలాల్లో ఉన్నారు. అందుచేత వాళ్లు ఇంటికి తిరిగి వచ్చేంత వరకు యాకోబు ఏమీ చేయలేదు. అదే సమయంలో షెకెము తండ్రి హమోరు యాకోబుతో మాట్లాడేందుకు వెళ్లాడు.

జరిగినదాన్ని గూర్చి యాకోబు కుమారులకు పొలంలోనే తెలిసింది. ఇది విని వాళ్లకు చాలా కోపం వచ్చింది. యాకోబు కూతురుతో షెకెము శయనించి, ఇశ్రాయేలీయుల వంశానికి అవమానం తెచ్చాడు గనుక వారికి పిచ్చి కోపం రెచ్చిపోయింది. షెకెము చాలా చెడ్డపని చేశాడు కనుక ఆ సోదరులంతా పొలాలనుండి వచ్చేశారు.

అయితే హమోరు ఆ సోదరులతో మాట్లాడాడు. “నా కుమారుడు షెకెముకు దీనా కావాలని ఉంది. దయచేసి వాడిని ఆమెను పెళ్లి చేసుకోనివ్వండి. మనకు ఒక ప్రత్యేక ఒడంబడిక ఉన్నట్లు ఈ వివాహం వ్యక్తం చేస్తుంది. అప్పుడు మా మగవాళ్లు మీ అమ్మాయిలను, మీ మగవాళ్లు మా అమ్మాయిలను పెళ్లి చేసుకోవచ్చు. 10 ఈ దేశంలోనే మీరు కూడ మాతో కలిసి ఉండవచ్చును. భూమిని స్వంతం చేసుకొనేందుకు, వ్యాపారం చేసేందుకు ఇక్కడ మీకు స్వేచ్ఛ ఉంటుంది” అన్నాడు.

11 షెకెము కూడ యాకోబుతోను, దీనా అన్నదమ్ములతో మాట్లాడాడు. షెకెము అన్నాడు: “దయచేసి నన్ను స్వీకరించండి, నేను చేసిన దాని విషయంలో నన్ను క్షమించండి. మీరు నన్నేమి చేయమంటే అది చేస్తా. 12 మీరు నన్ను దీనాను పెళ్లి చేసుకోనిస్తే, మీరు కోరిన కన్యాశుల్కం మీకు ఇస్తా. మీరు ఏమి అడిగితే అది ఇస్తా కాని దీనాను నన్ను పెళ్లాడనివ్వండి.”

13 షెకెముతో, అతని తండ్రితో అబద్ధం చెప్పాలని యాకోబు కుమారులు నిశ్చయించుకున్నారు. వారి సోదరి దీనాకు షెకెము చేసిన నీచకార్యాన్నిబట్టి ఆ సోదరులు ఇంకా కోపంగానే ఉన్నారు. 14 కనుక ఆ సోదరులు, “నీకు ఇంకా సున్నతి కాలేదు గనుక నిన్ను మా సోదరిని పెళ్లి చేసుకోనివ్వం. మా సోదరి నిన్ను చేసుకోవడం తప్పు అవుతుంది. 15 అయితే నీవు ఈ ఒక్క పని చేస్తే నిన్ను ఆమెను పెళ్లి చేసుకోనిస్తాం. మీ పట్టణంలో ప్రతి పురుషుడూ మాలాగే సున్నతి చేసుకోవాలి. 16 అప్పుడు మీ పురుషులు మా స్త్రీలను, మా పురుషులు మీ స్త్రీలను పెళ్లి చేసుకోవచ్చు. అప్పుడు మనమంతా ఒక్క ప్రజ అవుతాం. 17 సున్నతికి మీరు నిరాకరిస్తే, దీనాను మేము తీసుకెళ్ళిపోతాం” అని అతనితో చెప్పారు.

18 ఈ ఒడంబడిక హమోరుకు, షెకెముకు చాలా సంతోషం కలిగించింది. 19 దీనా సోదరులు అడిగినట్లు చేయాలంటే షెకెముకు చాలా సంతోషంగా ఉంది.

షెకెము, అతని కుటుంబంలోకెల్లా చాలా గౌరవం గలవాడు. 20 హమోరు, షెకెము వారి పట్టణంలో సమావేశ స్థలానికి వెళ్లారు. ఆ పట్టణంలోని పురుషులతో వారు మాట్లాడి, అన్నారు: 21 “ఈ ఇశ్రాయేలీయులు మనతో నిజంగా స్నేహంగా ఉండాలని కోరుతున్నారు. వాళ్లను మన దేశంలోనే నివసించి వ్యాపారం చేసుకోనిద్దాం. మనందరికి సరిపోయేంత భూమి మనకు ఉంది. మనం వాళ్ల స్త్రీలను స్వేచ్ఛగా వివాహం చేసుకోవచ్చు. అలానే వారి పురుషులు వివాహం చేసుకొనేందుకు మన స్త్రీలను సంతోషంగా మనం ఇవ్వవచ్చు. 22 అయితే మన పురుషులంతా ఒక పని చేయడానికి ఒప్పుకోవాలి. ఇశ్రాయేలు ప్రజల్లాగే మన మగవాళ్లంతా సున్నతి చేసుకొనేందుకు సమ్మతించాలి. 23 మనం ఇలా చేస్తే, వాళ్ల ఆల మందలు, జంతువులు, వస్తుజాలం అన్నీ మనకి దక్కి, మనం ధనికులం అవుతాం. కనుక మనం వాళ్లతో ఈ ఒడంబడిక చేయాల్సిందే, వాళ్లు మనతోనే ఉంటారు.” 24 సమావేశ స్థలంలో ఈ మాటను విన్న మగవాళ్లంతా షెకెము, హమోరులతో ఏకీభవించారు. ఆ సమయంలో ప్రతి పురుషునికి సున్నతి జరిగింది.

25 మూడు రోజుల తర్వాత, సున్నతి పొందిన మగవాళ్లు ఇంకా బాధపడుతూనే ఉన్నారు. ఈ సమయంలో ఆ మనుష్యులు బలహీనంగా ఉంటారని యాకోబు ఇద్దరు కుమారులు షిమ్యోను, లేవీలకు తెలుసు. కనుక వారు పట్టణంలోకి వెళ్లి, ఆ పురుషులందర్నీ అక్కడే చంపేశారు. 26 దీనా సోదరులు షిమ్యోను, లేవీ కలిసి హమోరును, అతని కుమారుని చంపేసారు. అంతట వారు షెకెము యింటినుండి దీనాను తీసుకొని వెళ్లిపోయారు. 27 యాకోబు మిగిలిన కుమారులు ఆ పట్టణంలోకి వెళ్లి, అక్కడ ఉన్న సమస్తం దోచుకొన్నారు. వారి సోదరికి, షెకెము చేసిన దాని విషయంలో వారు ఇంకా కోపంగా ఉన్నారు. 28 కనుక వారి జంతువులన్నింటినీ ఆ సోదరులు తీసుకుపోయారు. వారి గాడిదలను, పట్టణంలో, పొలాల్లో మిగిలినదంతా వారు దోచుకొన్నారు. 29 ప్రజలకు ఉన్నదంతా ఆ సోదరులు దోచుకుపోయారు. చివరికి వారి భార్యలను, పిల్లలను కూడా ఆ సోదరులు తీసుకొని వెళ్లిపోయారు.

30 అయితే షిమ్యోనుతోనూ, లేవీతోనూ యాకోబు అన్నాడు, “మీరు నాకు చాలా కష్టం తెచ్చి పెట్టారు. ఈ దేశంలో ఉన్న ప్రజలంతా నన్ను అసహ్యించుకొంటారు. కనానీ ప్రజలు, పెరిజ్జీ ప్రజలు అంతా నాకు వ్యతిరేకంగా లేస్తారు. మనమేమో చాలా కొద్దిమందిమే ఉన్నాం. ఈ దేశంలో ఉన్నవాళ్లంతా ఏకమై మనమీద యుద్ధానికి వస్తే, నన్ను నాశనం చేస్తారు. నాతోబాటే మన ప్రజలందర్నీ నాశనం చేస్తారు.”

31 అయితే ఆ సోదరులు, “ఈ ప్రజలు మా సోదరిని ఒక వేశ్యలా చేస్తే, చూస్తూ ఊరుకోమంటావా? లేదు, మా సోదరికి అలా చేయటం వారిది తప్పు” అని చెప్పారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International