Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ఆదికాండము 16-18

పనిపిల్ల హాగరు

16 అబ్రాము భార్య శారయి. ఆమెకు, అబ్రాముకు పిల్లలు లేరు. శారయికి ఈజిప్టుకు చెందిన పని పిల్ల ఉంది. ఆమె పేరు హాగరు. శారయి అబ్రాముతో యిలా చెప్పింది: “చూడండి, నాకు పిల్లలు పుట్టకుండా చేశాడు యెహోవా. కనుక మీరు నా పనిమనిషితో పొండి. ఆమె ద్వారా పుట్టే శిశువును నా స్వంత శిశువుగా నేను స్వీకరిస్తాను.” తన భార్య శారయి మాట అబ్రాము విన్నాడు.

కనాను దేశంలో అబ్రాము పది సంవత్సరాలు జీవించిన తర్వాత ఇది జరిగింది. హాగరును తన భర్త అబ్రాముకు శారయి యిచ్చింది. (హాగరు ఈజిప్టు నుండి వచ్చిన దాసి).

అబ్రాము వల్ల హాగరు గర్భవతి అయింది. హాగరు ఇది గమనించినప్పుడు. ఆమె చాలా గర్వపడి, తన యజమానురాలైన శారయికంటే తాను గొప్పదాన్ని అని తలంచడం మొదలు పెట్టింది. అయితే శారయి అబ్రాముతో, “నా పనిమనిషి ఇప్పుడు నన్నే అసహ్యించుకొంటుంది. దీనికి నేను నిన్నే నిందిస్తాను. ఆమెను నేను నీకు ఇచ్చాను. ఆమె గర్భవతి అయింది. అయితే ఆమె నాకంటే గొప్పదని భావిస్తుంది. మనలో ఎవరు సరియైనవాళ్లో యెహోవాయే నిర్ణయించాలని నేను కోరుతున్నాను” అని అనింది.

కాని అబ్రాము శారయితో, “హాగరుకు నీవు యజమానురాలివి, నీ యిష్టం వచ్చినట్లు నీవు ఆమెకు చేయవచ్చు” అన్నాడు. అందుచేత శారయి తన పనిమనిషిని చాలా చులకనగా చూసింది. ఆ పనిమనిషి పారిపోయింది.

హాగరు కొడుకు ఇష్మాయేలు

ఎడారిలో నీటి ఊట దగ్గర యెహోవా దూతకు ఆ పనిమనిషి కనబడింది. షూరు మార్గంలో ఆ ఊట ఉంది. “హాగరూ, నీవు శారయి పనిమనిషివి గదూ! ఇక్కడెందుకు ఉన్నావు? నీవు ఎక్కడికి వెళ్తున్నావు?” అని ఆ దూత అడుగగా,

“నా యజమానురాలు శారయి నుండి పారిపోతున్నాను” అని చెప్పింది హాగరు.

“నీ యజమానురాలి దగ్గరకు నీవు తిరిగి వెళ్లు, ఆమెకు లోబడి నడుచుకో” అని యెహోవా దూత ఆమెతో చెప్పడం జరిగింది. 10 “నీలో నుండి అనేక జనములు వస్తారు. వారు చాలామంది ఉంటారు గనుక వాళ్లను లెక్కపెట్టడం కూడ కుదరదు” అని కూడ యెహోవా దూత చెప్పడం జరిగింది.

11 ఇంకా యెహోవా దూత,

“ఇప్పుడు నీవు గర్భవతివి,
    మరి నీకు ఒక కుమారుడు పుడ్తాడు.
అతనికి ఇష్మాయేలు[a] అని పేరు పెడతావు.
    ఎందుచేతనంటే, నీ కష్టాల్ని గూర్చి యెహోవా విన్నాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు.
12 ఇష్మాయేలు అడవి గాడిదలా
    అదుపులేక, స్వేచ్ఛగా ఉంటాడు
అతడు అందరికి వ్యతిరేకమే
    ప్రతి ఒక్కరూ అతనికి వ్యతిరేకమే
తన సోదరులకు దగ్గరగా అతడు నివసిస్తాడు
    కాని అతడు వారికి వ్యతిరేకంగా ఉంటాడు.”

అని చెప్పాడు.

13 ఆ పనిమనిషితో యెహోవా మాట్లాడాడు. దేవునికి ఆమె ఒక క్రొత్త పేరు ప్రయోగించింది. “నన్ను చూసే దేవుడవు నీవు” అని ఆయనతో చెప్పింది. “ఈ స్థలంలో కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు, రక్షిస్తున్నాడు” అని అనుకొన్నందువల్ల ఆమె ఇలా చెప్పింది. 14 కనుక ఆ బావి బెయేర్ లహాయిరోయి[b] అని పిలువబడింది. కాదేషుకు బెరెదుకు మధ్య ఉంది ఆ బావి.

15 హాగరు ఒక కుమారునికి జన్మనిచ్చింది. ఆ కుమారునికి ఇష్మాయేలు అని అబ్రాము పేరు పెట్టాడు. 16 హాగరుకు ఇష్మాయేలు పుట్టినప్పుడు అబ్రాము వయస్సు 86 సంవత్సరాలు.

సున్నతి ఒడంబడికకు గురుతు

17 అబ్రాముకు 99 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడి యిలా చెప్పాడు: “నేను సర్వశక్తిమంతుడైన దేవుడిని. నా కోసం ఈ పనులు చేయి. నాకు విధేయుడవై, సరైన జీవితం జీవించు. ఇలా గనుక నీవు చేస్తే, మన ఇద్దరి మధ్య ఒక ఒడంబడికను నేను తయారు చేస్తాను. నిన్ను బాగా అభివృద్ధి చేస్తాను.”

అప్పుడు దేవునియెదుట అబ్రాము సాష్టాంగ పడ్డాడు. అతనితో దేవుడు అన్నాడు. “మన ఒడంబడికలో నా భాగం ఇది. అనేక జనములకు నిన్ను తండ్రిగా నేను చేస్తాను. నీ పేరు నేను మార్చేస్తాను. నీ పేరు అబ్రాము కాదు, నీ పేరు అబ్రాహాము. అనేక జనాంగములకు నీవు తండ్రివి అవుతావు గనుక, నీకు నేను ఈ పేరు పెడుతున్నాను. నీకు నేను పెద్ద సంతానాన్ని ఇస్తాను. నీనుండి క్రొత్త జనాంగాలు ఉద్భవిస్తాయి. నీనుండి క్రొత్త రాజులు వస్తారు. నీకు, నాకు మధ్య ఒక ఒడంబడికను నేను ఏర్పాటు చేస్తాను. నీ సంతానానికి ఈ ఒడంబడిక వర్తిస్తుంది. నేను నీకు దేవునిగా ఉంటాను. నీ సంతానానికి దేవునిగా ఉంటాను. నీవు పరాయివాడిగా నివసిస్తున్న ఈ దేశాన్ని, అంటే కనాను దేశాన్ని నీకును, నీ సంతానపు వారందిరికిని శాశ్వతపు హక్కుగా ఇస్తాను. నేను మీకు దేవునిగా ఉంటాను.”

అబ్రాహాముతో దేవుడు ఇంకా ఇలా చెప్పాడు: “ఇక, ఒడంబడికలో నీ భాగం యిది. ఒడంబడికను నీవు నిలబెట్టాలి. నీవూ, నీ సంతానమంతా నా ఒడంబడికకు విధేయులు కావాలి. 10 మీరు విధేయులు కావాల్సిన ఒడంబడిక ఇదే. ఇది మీకు, నాకు మధ్య ఒడంబడిక. ఇది నీ సంతానము వారి కోసమూను; పుట్టిన ప్రతి పిల్లవాడికి తప్పక సున్నతి చెయ్యాలి. 11 నీకు, నాకు మధ్యగల ఒడంబడికను నీవు అనుసరిస్తావని తెలియచేసేందుకు నీవు నీ మర్మాంగపు ముందు చర్మాన్ని కోయాలి. 12 నీ జనములో పుట్టిన ప్రతి బాలుడు, నీ జనమునుండి కాక, ఇతర జనములనుండి డబ్బుతో బానిసగా కొనబడిన వారిలో ప్రతి పురుషుడు సున్నతి చేయించుకొనవలెను. 13 కనుక నీ జాతి అంతటిలో ప్రతి పిల్లవానికి సున్నతి జరుగుతుంది. నీ వంశంలో పుట్టిన ప్రతి పిల్లవాడికి, లేక బానిసగా కొనబడిన పిల్లవాడికి సున్నతి జరుగుతుంది. 14 ఇది నా చట్టం, నీకు నాకు మధ్యనున్న ఒడంబడిక. సున్నతి చేయని ఏ మగవాడైనా సరే తన ప్రజల్లో నుండి తొలగించివేయబడతాడు. ఎందుచేతనంటే, ఆ వ్యక్తి నా ఒడంబడికను ఉల్లంఘించాడు కనుక.”

వాగ్దాన పుత్రుడు ఇస్సాకు

15 అబ్రాహాముతో దేవుడు అన్నాడు: “నీ భార్య శారయికి నేను ఒక క్రొత్త పేరు పెడ్తాను. ఆమె క్రొత్త పేరు శారా.[c] 16 ఆమెను నేను ఆశీర్వదిస్తాను. ఆమెకు ఒక కుమారుణ్ణి నేను ఇస్తాను, మరి నీవు తండ్రివి అవుతావు. అనేక క్రొత్త జనాంగములకు ఆమె తల్లి అవుతుంది. జనముల రాజులు ఆమెలోనుండి వస్తారు.”

17 దేవుణ్ణి గౌరవించుటకు అబ్రాహాము ముఖం క్రిందికి దించుకొన్నాడు. అయితే అతడు నవ్వి, తనలో తాను అనుకొన్నాడు: “నా వయస్సు 100 సంవత్సరాలు. నాకు కొడుకు పుట్టజాలడు. మరి శారా వయస్సు 90 సంవత్సరాలు. ఆమెకు శిశువు జన్మించడం అసాధ్యం.”

18 అప్పుడు అబ్రాహాము దేవునితో ఇలా అన్నాడు: “నా కుమారుడు ఇష్మాయేలు జీవించి నిన్ను సేవిస్తాడని ఆశిస్తున్నాను.”

19 దేవుడు చెప్పాడు: “లేదు! నీ భార్య శారాకు కుమారుడు పుడతాడని నేను చెప్పాను. అతనికి ఇస్సాకు[d] అని నీవు పేరు పెడ్తావు. అతనితో నేను నా ఒడంబడిక చేసుకొంటాను. ఆ ఒడంబడిక అతని సంతానాలన్నిటితోను శాశ్వతంగా కొనసాగే ఒడంబడికగా ఉంటుంది.

20 “ఇష్మాయేలును గూర్చి నీవు నన్ను అడిగావు, నేను విన్నాను. అతణ్ణి నేను ఆశీర్వదిస్తాను. అతనికి చాలా మంది పిల్లలు ఉంటారు. పన్నెండు మంది మహా నాయకులకు అతడు తండ్రి అవుతాడు. అతని కుటుంబం ఒక గొప్ప జాతి అవుతుంది. 21 అయితే ఇస్సాకుతో నేను నా ఒడంబడిక చేస్తాను. శారాకు పుట్టబోయే కుమారుడు ఇస్సాకు. వచ్చే సంవత్సరం సరిగ్గా ఇదే కాలంలో నీకు కుమారుడు పుడతాడు.”

22 అబ్రాహాముతో దేవుడు మాట్లాడటం ముగించిన తర్వాత అబ్రాహాము ఒంటరిగా ఉన్నాడు. దేవుడు లేచి అబ్రాహామును విడిచి వెళ్లిపోయాడు. 23 తన కుటుంబంలోని మగవాళ్లకు, బాలురకు సున్నతి చేయమని అబ్రాహాముతో దేవుడు చెప్పాడు కనుక ఇష్మాయేలును, తన ఇంట పుట్టిన సేవకులందరిని అబ్రాహాము సమావేశపర్చాడు. డబ్బుతో కొనబడిన సేవకులను గూడ అబ్రాహాము సమావేశపర్చాడు. అబ్రాహాము ఇంటిలోని ప్రతి పురుషుడు, బాలుడు ఒక చోట సమావేశ పర్చబడ్డారు. వారందరికి సున్నతి చేయబడింది. అబ్రాహాము దేవుడు చెప్పినట్లు వారందరికి సున్నతి చేశాడు.

24 అబ్రాహాముకు సున్నతి జరిగినప్పుడు అతని వయస్సు 99 సంవత్సరాలు. 25 అతని కుమారుడు ఇష్మాయేలుకి సున్నతి జరిగినప్పుడు అతడు 13 ఏండ్లవాడు. 26 అబ్రాహాము, అతని కుమారుడు ఇష్మాయేలు ఇద్దరును ఒకే రోజున సున్నతి చేయబడ్డారు. 27 ఆ రోజునే అబ్రాహాము ఇంటిలోని మగవాళ్లందరికి గూడ సున్నతి జరిగింది. అతని ఇంట పుట్టిన సేవకులందరికి, అతడు కొన్న సేవకులందరికి సున్నతి జరిగింది.

ముగ్గురు అతిథులు

18 తర్వాత మళ్లీ అబ్రాహాముకు యెహోవా ప్రత్యక్షమయ్యాడు. మమ్రేలోని సింధూర వనమునకు దగ్గర్లో అబ్రాహాము నివసిస్తున్నాడు. ఒకనాడు మిట్ట మధ్యాహ్నం అబ్రాహాము తన గుడార ద్వారం దగ్గర కూర్చున్నాడు. అబ్రాహాము తలెత్తి చూడగా, తన ముందర నిలచిన ముగ్గురు మనుష్యులు కనబడ్డారు. అబ్రాహాము వాళ్లను చూడగానే అతడు వారి దగ్గరకు వెళ్లి, వారి ముందు వంగి, ఇలా అన్నాడు, “అయ్యలారా, మీ దాసుడనైన నా దగ్గర దయచేసి కొంత కాలం ఉండండి. మీ కాళ్లు కడుక్కొనేందుకు నేను నీళ్లు తెస్తాను. చెట్ల క్రింద మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. మీ కోసం నేను భోజనం తెస్తాను, కడుపు నిండా భోంచేయండి. తర్వాత మీ దారిన మీరు వెళ్లొచ్చు.”

“చాలా బాగుంది, అలాగే కానీయి” అని ఆ ముగ్గురు మనుష్యులు అన్నారు.

అబ్రాహాము తన గుడారము దగ్గరకు త్వరత్వరగా వెళ్లాడు. “మూడు రొట్టెలకు సరిపడె గోధుమలు త్వరగా తయారు చేయి” అని అబ్రాహాము శారాతో అన్నాడు. తర్వాత అబ్రాహాము తన పశువుల దగ్గరకు పరుగెత్తాడు. అబ్రాహాము చాలా మంచి లేత దూడను తీసుకొని తన సేవకునికి ఇచ్చాడు. త్వరగా ఆ దూడను వధించి, దానితో భోజనం సిద్ధం చేయమని అబ్రాహాము చెప్పాడు. ఆ మాంసాన్ని ఆ ముగ్గురు మనుష్యులు భోంచేసేందుకు అబ్రాహాము ఇచ్చాడు. అతడు పాలు, వెన్న కూడ వాళ్లకు ఇచ్చాడు. ఆ ముగ్గురు చెట్టు క్రింద భోజనం చేస్తూ ఉండగా అబ్రాహాము వారి దగ్గర నిలబడ్డాడు.

“నీ భార్య శారా ఎక్కడ?” అంటూ ఆ ముగ్గురు అబ్రాహామును అడిగారు.

“ఆమె అక్కడ గుడారంలో ఉంది” అని అబ్రాహాము అన్నాడు.

10 అప్పుడు యెహోవా, “మళ్లీ వసంతకాలంలో నేను వస్తాను. అప్పటికి నీ భార్య శారాకు ఒక కుమారుడు కలిగి ఉంటాడు” అని అన్నాడు.

గుడారం లోపల శారా ఈ విషయాలు విన్నది. 11 అబ్రాహాము శారాలు చాలా ముసలివాళ్లు. స్త్రీలు పిల్లలను కనగల వయస్సు శారాకు దాటిపోయింది. 12 అందుచేత తాను విన్న మాటలను శారా నమ్మలేదు. “ఇప్పుడు నేను ముసలిదాన్ని, నా భర్త ముసలివాడు. నాకు కొడుకు పుట్టటానికి నేను మరీ ముసలిదాన్ని కదా” అనుకొంది తనలో తాను.

13 అప్పుడు అబ్రాహాముతో యెహోవా ఇలా అన్నాడు: “నేను చెప్పింది శారా నమ్మటం లేదు. ఆమె నవ్వింది. ‘నాకు కొడుకు పుట్టటానికి నేను మరీ ముసలిదాన్ని కదా!’ అంది. 14 యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నేను వస్తానని చెప్పిన వసంతకాలంలో మళ్లీ వస్తాను, అప్పుడు నీ భార్య శారాకు కుమారుడు ఉంటాడు.”

15 అయితే శారా, “నేను నవ్వలేదు” అంది. (భయపడి ఆమె అలా అంది.)

కాని యెహోవా, “కాదు, నీవు చెప్పేది నిజం కాదని నాకు తెలుసు. నీవు నవ్వావు” అన్నాడు.

16 అప్పుడు ఆ మనుష్యులు వెళ్లటానికి లేచారు. వారు సొదొమ వైపు చూసి, ఆ దిశగా నడక ప్రారంభించారు. వారికి వీడ్కోలు చెప్పటానికి అబ్రాహాము వాళ్లతో కొంత దూరం నడిచాడు.

దేవునితో అబ్రాహాము బేరం

17 యెహోవా తనలో తాను ఇలా అనుకొన్నాడు: “ఇప్పుడు నేను చేయబోతున్నది అబ్రాహాముకు నేను చెప్పాలా? 18 అబ్రాహాము గొప్ప శక్తిగల జనానికి మూల పురుషుడు అవుతాడు. అతని మూలంగా భూమి మీది ప్రజలంతా ఆశీర్వదించబడుతారు. 19 అబ్రాహాముతో నేను ఒక ప్రత్యేక ఒడంబడిక చేసుకున్నాను. అతని పిల్లలు, సంతానము యెహోవా ఇష్ట ప్రకారం జీవించేటట్లు అబ్రాహాము వారికి ఆజ్ఞాపించాలని నేను ఇలా చేశాను. సక్రమంగా న్యాయంగా వాళ్లు జీవించాలని నేను ఇలా చేశాను. అప్పుడు, యెహోవానైన నేను వాగ్దానం చేసిన వాటిని అతనికి ఇవ్వగలను.”

20 మరల యెహోవా ఇలా అన్నాడు: “సొదొమ గొమొఱ్ఱాల అరుపులు చాలా పెద్దవి. వారి పాపం చాలా భయంకరమైనది అని నేను విన్నాను. 21 కనుక నేను వెళ్లి, అక్కడి విషయాలు నేను విన్నంత చెడ్డగా ఉన్నాయేమో చూస్తాను. అప్పుడు నాకు నిశ్చయంగా తెలుస్తుంది.”

22 అంచేత ఆ మనుష్యులు మళ్లీ సొదొమవైపు నడక ప్రారంభించారు. అయితే అబ్రాహాము యెహోవాతో అక్కడ ఉండిపోయాడు. 23 అప్పుడు అబ్రాహాము యెహోవాను సమీపించి ఇలా అడిగాడు. “యెహోవా, నీవు దుష్టులను నాశనం చేసేటప్పుడు మంచివారిని కూడా నాశనం చేస్తావా? 24 ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది మంచివాళ్లు ఉంటే ఎలా? ఆ పట్టణాన్ని నాశనం చేసేస్తావా? అక్కడ నివసిస్తున్న 50 మంది మంచివాళ్ల కోసం తప్పక నీవు ఆ పట్టణాన్ని కాపాడు. 25 ఆ పట్టణాన్ని నీవు అసలు నాశనం చేయనే చేయవు. చెడ్డవాళ్లను చంపడంకోసం 50 మంది మంచివాళ్లను నీవు నాశనం చేయవు. అలా గనుక జరిగితే మంచివాళ్లు చెడ్డవాళ్లు సమానమై, ఇద్దరూ శిక్షించబడుతారు. భూలోకమంతటికి నీవు న్యాయమూర్తివి. నిజంగా నీవు సరైనదే చేస్తావని నాకు తెలుసు.”

26 అప్పుడు, “సొదొమ పట్టణంలో 50 మంది మంచివాళ్లు నాకు కనబడితే, నేను ఆ పట్టణం అంతటిని కాపాడుతాను” అన్నాడు యెహోవా.

27 దానికి అబ్రాహాము ఇలా అన్నాడు: “ప్రభూ, నీతో పోల్చుకొంటే, నేను ధూళిని, బూడిదను మాత్రమే. అయినా నేను మరోసారి తెగించి ఈ ప్రశ్న అడుగుతున్నాను. 28 ఒకవేళ అయిదుగురు మంచివాళ్లు తప్పిపోయి, 45 మంది మంచివాళ్లు మాత్రమే ఆ పట్టణంలో ఉంటే ఎలా? కేవలం అయిదుగురు తక్కువ అయినందువల్ల మొత్తం పట్టణమంతటిని నాశనం చేస్తావా?”

“అక్కడ 45 మంది మంచివాళ్లు గనుక నాకు కనబడితే, ఆ పట్టణాన్ని నేను వదిలివేస్తాను” అన్నాడు యెహోవా.

29 మరల అబ్రాహాము, “అక్కడ 40 మంది మంచివాళ్లు మాత్రమే నీకు కనబడినా, నీవు ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా?” అని యెహోవాను అడిగాడు.

“40 మంది మంచివాళ్లు నాకు కనబడితే, నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను” అన్నాడు యెహోవా.

30 అందుకు అబ్రాహాము, “ప్రభూ, నా మీద కోపగించకు. మరొక్క మాట అడుగుతాను. ఆ పట్టణంలో 30 మంది మంచివాళ్లు మాత్రమే కనబడితే, నీవు ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా?” అని అడిగాడు.

అందుకు యెహోవా, “అక్కడ 30 మంది మంచివాళ్లు నాకు కనబడితే, ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను” అని చెప్పాడు.

31 అప్పుడు అబ్రాహాము, “నా ప్రభువుతో మరోసారి మాటలాడ తెగించితిని. ఒకవేళ అక్కడ 20 మంది మంచివాళ్లే ఉంటే” అన్నాడు.

“20 మంది మంచివాళ్లు నాకు కనబడితే ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను” అని జవాబిచ్చాడు యెహోవా.

32 అప్పుడు అబ్రాహాము ఇలా అన్నాడు, “ప్రభూ, నాపై కోపగించకు, ఈ ఒక్కసారే చివరిగా నీతో మాటలాడ తెగిస్తున్నాను. పదిమంది మంచివాళ్లే గనుక అక్కడ నీకు కనబడితే, నీవేం చేస్తావు?”

“పదిమంది మంచివాళ్లు గనుక అక్కడ నాకు కనబడితే, ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను” అన్నాడు యెహోవా.

33 యెహోవా అబ్రాహాముతో మాట్లాడటం అయిపోయింది గనుక యెహోవా వెళ్లిపోయాడు. అబ్రాహాము తన ఇంటికి వెళ్లిపోయాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International