Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యోబు 38-39

దేవుడు యోబుతో మాట్లాడటం

38 అప్పుడు యెహోవా తుఫానులో నుండి యోబుకు ఇలా జవాబు ఇచ్చాడు.

“నా జ్ఞానమును అంగీకరించక పనికిమాలిన,
    తెలివితక్కువ మాటలతో నన్ను ప్రశ్నించే వీడు ఎవడు?
యోబూ, మగవాడిలా గట్టిగా ఉండు.
    నేను నిన్ను అడిగే ప్రశ్నలకు జవాబు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండు.

“యోబూ, నేను భూమిని చేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు?
    నీవు అంత తెలివిగల వాడెవైతే నాకు జవాబు చెప్పు.
యోబూ, ప్రపంచం ఎంత పెద్దగా ఉండాలో నిర్ణయించింది ఎవరు?
    నీకు తెలిసినట్టే ఉంది! కొలబద్దతో ప్రపంచాన్ని ఎవరు కొలిచారు?
భూమికి ఆధారాలు దేనిమీద ఉన్నాయి?
    భూమికి అత్యంత ముఖ్యమైన రాయిని దాని పునాదిలో వేసింది ఎవరు?
అది జరిగినప్పుడు ఉదయ నక్షత్రాలు కలిసి పాడాయి.
    దేవదూతలు కేకలు వేసి, ఎంతో సంతోషించారు.

“యోబూ, భూమి అగాధములో నుండి
    సముద్రం ప్రవహించినప్పుడు దానిని నిలిపేందుకు దాని తలుపులు మూసినవారు ఎవరు?
ఆ సమయంలో నేనే సముద్రాన్ని మేఘాలతో కప్పి వేశాను.
    మరియు సముద్రాన్ని చీకటితో చుట్టి వేశాను.
10 సముద్రానికి హద్దులు నేనే నియమించాను.
    మూయబడిన ద్వారాల వెనుక నేను దానిని ఉంచాను.
11 నీవు ఇంత మట్టుకు రావచ్చు. కాని ఇంకా ముందుకు రాకూడదు.
    నీ గర్వపు అలలు ఆగి పోవాల్సింది ఇక్కడే, అని నేను సముద్రంతో చెప్పాను.

12 “యోబూ, ప్రారంభం కావాలని ఉదయంతోను, ప్రారంభం కావాలని రోజుతోను నీ జీవితంలో
    నీవు ఎప్పుడైనా చెప్పావా?
13 యోబూ, ఉదయపు వెలుగు భూమిని ఆవరించాలని,
    దుర్మార్గులు తాము దాగుకొనే స్థలాలు విడిచిపెట్టేలా ఉదయపు వెలుగు వారిని బలవంతం చేయాలని నీవు ఎన్నడయినా దానితో చెప్పావా?
14 ఉదయపు వెలుగు కొండలు,
    లోయలు కనబడేటట్టు చేస్తుంది.
పగటి వెలుగు భూమి మీదికి వచ్చినప్పుడు
    ఆ స్థలాల ఆకారాలు చోక్కా మడతల్లా తేటగా కనబడతాయి.
అచ్చు వేయబడిన మెత్తని మట్టిలా
    ఆ స్థలాల ఆకారాలు రూపొందుతాయి.
15 దుర్మార్గులకు పగటి వెలుగు ఇష్టం లేదు.
    అది బాగా ప్రకాశించినప్పుడు, వారు వారి చెడ్డ పనులు చేయకుండా అది వారిని వారిస్తుంది.

16 “యోబూ, సముద్రం మొదలయ్యే దాని లోతైన చోట్లకు నీవు ఎప్పుడైనా వెళ్లావా?
    మహా సముద్రపు అట్టడుగున నీవు ఎప్పుడైనా నడిచావా?
17 యోబూ, మరణపు చీకటి చోటు ఎదుట నిలిచే ద్వారాలను
    ఎవరైనా, ఎన్నడయినా నీకు చూపించారా?
18 యోబూ, భూమి ఎంత పెద్దదో నిజంగా నీవు గ్రహిస్తున్నావా?
    ఇదంతా నీకు తెలిస్తే నాతో చెప్పు.

19 “యోబూ, వెలుగు వచ్చే దిశగా పోయేందుకు ఎటు వెళ్లాలి?
    చీకటి ఎక్కడ నుండి వస్తుంది?
20 యోబూ, చీకటి వెలుగు ఎక్కడ నుండి వస్తాయో అక్కడికి వాటిని నీవు తీసుకొని వెళ్లగలవా?
    అవి నివసించే చోటుకు ఎటుగా వెళ్లాలో నీకు తెలుసా?
21 యోబూ, నీవు చాలా ముసలివాడివి కదా?
    భూమి చేయబడినప్పుడు నీవు అక్కడ ఉన్నావు కనుక నీకు ఈ సంగతులన్నీ తెలుసు అని నాకు గట్టిగా తెలుసు. నీవు లేవూ?

22 “యోబూ, నేను హిమమును, వడగండ్లను నిలువ ఉంచే గిడ్డంగులకు
    నీవు ఎప్పుడైనా వెళ్లావా?
23 కష్టదినాల్లో, యుద్ధ దినాల్లో, పోరాట దినాల్లో ఉపయోగించేందుకు హిమమును,
    వడగండ్లను నేను దాచిపెడతాను.
24 యోబూ, సూర్యుడు ఎక్కడ నుండి పైకి వస్తాడో అక్కడికి నీవు ఎన్నడయినా వెళ్లావా?
    భూమి అంతటా వీచేందుకు తూర్పు గాలులు ఎక్కడనుండి వస్తాయో అక్కడికి నీవు ఎన్నడయినా వెళ్లావా?
25 యోబూ, భారీ వర్షం కోసం ఆకాశంలో మార్గాన్ని ఎవరు తవ్వారు?
    ఉరుములోని మెరుపుకు మార్గం ఎవరు చేశారు?
26 యోబూ, మనుష్యులు ఎవరూ నివసించని చోట నీళ్లు ఉండునట్లు.
27 బీడు భూమిని తృప్తిపరచుటకు దానిని విస్తారమైన గడ్డితో పచ్చగా చేయుటకు నీళ్లు ఇచ్చి,
    ఈ సంగతులను చేసిన వారు ఎవరు?
28 యోబూ, వర్షానికి తండ్రి ఉన్నాడా?
    మంచు బిందువులు ఎక్కడ నుండి వస్తాయి?
29 యోబూ, హిమమునకు తల్లి ఎవరు?
    ఆకాశంనుండి కురిసే మంచుకు జన్మ ఇచ్చేది ఎవరు?
30 జలాలు బండలా గట్టిగాను మహా సముద్రాల పైభాగాలు
    గట్టిగాను ఎప్పుడు బిగిసిపోతాయి?

31 “యోబూ, కృత్తిక నక్షత్రాలను నీవు బిగించగలవా?
    మృగశీర్షిక కట్లు నీవు విప్పగలవా?
32 యోబూ, నక్షత్రరాసులు సరియైన కాలములలో సమకూడునట్లు నీవు చేయగలవా?
    లేక ఎలుగుబంటిని దాని పిల్లలతో నీవు నడిపించగలవా?
33 యోబూ, ఆకాశాన్ని పాలించే నియమాలు నీకు తెలియునా?
    భూమి మీద వాటి పాలనను నీవు ప్రారంభించగలవా?

34 “యోబూ, మేఘాలు భారీ వర్షంతో నిన్ను ముంచెత్తునట్లు
    నీవు కేకవేసి వాటికి ఆజ్ఞలు ఇవ్వగలవా?
35 యోబూ, నీవు కోరిన చోటికి మెరుపును పంపగలవా?
    మెరుపు నీ దగ్గరకు వచ్చి యోబూ, ‘ఇదిగో మేము వచ్చాం, నీకు ఏమి కావాలి?’
    అని అంటాయా?

36 “ఒక మనిషి మనస్సులో జ్ఞానం కలిగించేది ఎవరు?
    మనస్సుకు గ్రహింపును ఇచ్చేది ఎవరు?
37 యోబూ, మేఘాలను లెక్కించుటకు,
    అవి వాటి వర్షమును కురియునట్లు వాటికి లంచం ఇచ్చుటకు అంతటి తెలివిగలవారు ఎవరు?
38 ఆ వర్షం దుమ్మును గట్టి పరుస్తుంది.
    ఆ మట్టి గడ్డలు ఒక్కటిగా అతుక్కుంటాయి.

39 “యోబూ, ఆడ సింహమునకు ఆహారం నీవు కనుగొంటావా?
    ఆకలితో ఉన్న సింహపు పిల్లలకు నీవు ఆహారం పెడతావా?
40 అవి దాగుకొనే చోట్ల వాటి గుహలలో
    పండుకొని లేక కూర్చొని ఉంటాయి.
41 యోబూ, కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు ఆహారం లేక అటు ఇటు తిరుగునప్పుడు
    కాకులను పోషించేది ఎవరు?

39 “యోబూ, కొండ మేకలు ఎప్పడు పుట్టాయో నీకు తెలుసా?
    తల్లి జింక పిల్లను పెట్టెటప్పుడు నీవు గమనిస్తావా?
యోబూ, తల్లి కొండ మేక, తల్లి జింక వాటి పిల్లలను ఎన్నాళ్లు మోస్తాయో నీకు తెలుసా?
    అవి పుట్టడానికి సరైన సమయం ఎప్పుడో నీకు తెలుసా?
అవి పండుకొంటాయి, వాటి పిల్లలు పుడతాయి.
    అప్పుడు వాటి పురిటినొప్పులు పోతాయి.
తల్లి కొండ మేక పిల్లలు, తల్లి జింక పిల్లలు పొలాల్లో బలంగా పెరుగుతాయి.
    అప్పుడు అవి వాటి నివాసాలు వదలి పోతాయి, తిరిగి రావు.

“యోబూ, అడవి గాడిదలను స్వేచ్ఛగా తిరుగనిచ్చినది ఎవరు?
    వాటి తాళ్లు ఊడదీసి, వాటిని స్వేచ్ఛగా పోనిచ్చినది ఎవరు?
అడవి గాడిదకు నివాసంగా అరణ్యాన్ని ఇచ్చింది నేనే (యెహోవాను).
    అవి నివాసం ఉండుటకు ఉప్పు భూములను నేను వాటికి ఇచ్చాను.
అడవి గాడిద అల్లరి పట్టణాలకు దగ్గరగా వెళ్లదు.
    ఏ మనిషీ వాటిని సాధువు చేసి, బండి లాగుటకు బలవంతం చేయలేడు.
అడవి గాడిదలు కొండల్లో నివసిస్తాయి.
    అక్కడే అవి గడ్డి తింటాయి.
    తినుటకు పచ్చగా ఏమైనా ఉంటుందేమో అని అక్కడే అవి చూస్తాయి.

“యోబూ, అడవి ఆబోతు నీకు పని చేయటానికి లోబడుతుందా?
    రాత్రిపూట అది నీ కొట్టంలో ఉంటుంది?
10 యోబూ, కేవలం తాడుతోనే అడవి ఆబోతు నీ పొలం దున్నేటట్టు చేయగలవా?
    నీ కోసం అది లోయలను దున్నుతుందా?
11 యోబూ, అడవి ఆబోతు బలాన్ని నీ పని కోసం ఉపయోగించుకొనేందుకు
    నీవు దానిమీద ఆధార పడగలవా?
    మహా కష్టతరమైన నీ పని అది చేస్తుంది అనుకొంటావా?
12 నీ ధాన్యాన్ని పోగుచేసి నీ కళ్లం చోటుకు
    అది తీసుకొని వస్తుందని దాన్ని నీవు నమ్మగలవా?

13 “నిప్పుకోడి సంతోషంగా ఉంది, గనుక అది దాని రెక్కలు రెప రెప లాడిస్తుంది.
    (కానీ అది ఎగుర లేదు) కానీ నిప్పుకోడి రెక్కలు కొంగ రెక్కల్లాంటివి కావు.
14 నిప్పుకోడి నేలమీద గుడ్లు పెడుతుంది.
    ఇసుకలో అవి వెచ్చగా అవుతాయి.
15 ఎవరైనా ఆ గుడ్లు మీద నడచి వాటిని పగులగొట్టవచ్చని
    లేక ఏదైనా అడవి జంతువు వాటిని పగుల గొట్టవచ్చని నిప్పుకోడి మరచిపోతుంది.
16 నిప్పుకోడి తన పిల్లలను చూడదు.
    ఆ పిల్లలు తనవి కానట్టే చూస్తూంది.
    దాని పిల్లలు చస్తే దాని ప్రయాసం అంతా వ్యర్థం అయిందనే విషయం దానికి లక్ష్యం లేదు.
17 ఎందుకంటే, నేను (దేవుణ్ణి) నిప్పుకోడికి జ్ఞానం ఇవ్వలేదు.
    నిప్పుకోడి తెలివి తక్కువది. నేను దాన్ని అలాగే చేశాను.
18 కానీ నిప్పుకోడి పరుగెత్తటానికి లేచినప్పుడు గుర్రాన్ని, దాని రౌతును చూచి అది నవ్వుతుంది.
    ఎందుకంటే, అది గుర్రం కంటే వేగంగా పరుగెత్తుతుంది గనుక.

19 “యోబూ, గుర్రానికి బలం నీవు ఇచ్చావా?
    లేక దాని మెడ మీద జూలు వెంట్రుకలను నీవు పెట్టావా?
20 యోబూ, మిడత ఎగిరినట్టుగా నీవు గుర్రాన్ని దూకించగలవా?
    గుర్రం గట్టిగా సకిలిస్తుంది, మనుష్యుల్ని భయపెడ్తుంది.
21 గుర్రం, తనకు చాలా బలం ఉందని సంతోషిస్తుంది.
    అది నేలమీద కాలితో గీకుతుంది. యుద్ధానికి వెళ్లేటప్పుడు గుర్రం వేగంగా పరుగెత్తుతుంది
22 భయాన్ని చూచి గుర్రం నవ్వుతుంది.
    అది భయపడదు. యుద్ధం నుండి అది పారిపోదు.
23 గుర్రం మీద అంబులపొది వణకుతుంది.
    దాని రౌతు వద్ద ఉన్న బల్లెం, ఆయుధాలు సూర్యకాంతిలో తళతళలాడుతాయి.
24 గుర్రం చాలా ఉల్లాసంగా ఉంటుంది. నేలమీద అది చాలా వేగంగా పరుగెత్తుతుంది.
    బూరధ్వని వింటే గుర్రం ఇంక నిలబడలేదు.
25 బూర మ్రోగినప్పుడు గుర్రం ‘ఓహో’ అంటుంది.
    దూరం నుంచే అది యుద్ధాన్ని పసికడుతుంది.
    సేనాని కేకలు వేసే ఆజ్ఞలను, ఇతర యుద్ధ ధ్వనులను అది వింటుంది.

26 “యోబూ, డేగ దాని రెక్కలు విప్పి దక్షిణంగా ఎగిరేటప్పుడు ఎలా ఎగరాలో డేగకు నీవు నేర్పించావా?
27 యోబూ, పక్షిరాజు ఎగరాలని,
    పర్వతాల్లో ఎత్తుగా దాని గూడు కట్టుకోవాలని నీవు దానికి ఆజ్ఞాపించావా?
28 పక్షిరాజు కొండ మీద బండపైన నివసిస్తుంది.
    ఆ బండ పక్షిరాజు యొక్క కోట.
29 పక్షిరాజు తన దుర్గంలోనుండి తన ఆహారం కోసం వెదకుతుంది.
    దూరంలో ఉన్న ఆహారాన్ని అది చూడగలదు.
30 పక్షిరాజు పిల్లలు రక్తం తాగుతాయి.
    అవి చచ్చిన శవాల చుట్టూరా చేరుతాయి.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International