Chronological
35 ఎలీహు మాట్లాడటం కొనసాగించాడు. అతడు అన్నాడు:
2 “యోబూ, యోబు అనే నేను
‘దేవునికంటె ఎక్కువ సక్రమంగా ఉన్నాను’ అని నీవు చెప్పటం న్యాయం కాదు.
3 యోబూ, నీవు దేవుణ్ణి,
‘దేవా, ఒక మనిషి, దేవుని సంతోష పరచుటవలన ఏమి పొందుతాడు?
నా పాపం నిన్నెలా బాధిస్తుంది?
నేను పాపం చేయక పోతే నాకేం మంచి లభిస్తుంది?’ అని అడుగు.
4 “యోబూ, ఎలీహు అనే నేను నీకు, ఇక్కడ నీతో ఉన్న స్నేహితులకు జవాబు ఇవ్వగోరుతున్నాను.
5 యోబూ, పైన ఆకాశం చూడు.
పైకి చూచి, మేఘాలు నీకంటే ఎత్తుగా ఉన్నాయని తెలుసుకో.
6 యోబూ, నీవు పాపం చేస్తే అది దేవుణ్ణి బాధపెట్టదు.
ఒకవేళ నీ పాపాలు చాలా ఉంటే అవి దేవునికి ఏమీ చేయలేవు.
7 యోబూ, నీవు మంచివానిగా ఉంటే అదేమి దేవునికి సహాయం చేయదు.
నీనుండి దేవునికి ఏమీ రాదు.
8 యోబూ, నీవు చేసే మంచిచెడ్డలు నీలాంటి వాళ్లను మాత్రమే బాధిస్తాయి.
(అవి దేవునికి సహాయకారి కావు మరియు దేవుణ్ణి బాధించవు.)
9 “మనుష్యులు దుర్మార్గంగా, అన్యాయంగా పరామర్శించబడితే సహాయం కోసం వారు మొరపెడతారు.
శక్తివంతమైన వాళ్లు తమకు సహాయాన్ని చేయాలని వారు బతిమలాడుతారు.
10 కానీ సహాయం కోసం వారు దేవుణ్ణి వేడుకోరు.
‘నన్ను తయారు చేసి, నా ఆనందం కోసం రాత్రులలో పాటలు ఇచ్చినటువంటి దేవుడెక్కడ? అని ఎవరూ అనరు.
11 సహాయం కోసం వారు దేవుణ్ణి అడగరు. దేవుడే మనుష్యుల్ని జ్ఞానం గల వారినిగా చేశాడు.
జంతువులను, పక్షులను దేవుడు జ్ఞానంగల వాటినిగా చేయలేదు.’
12 “కాని చెడ్డవాళ్లు గర్వంగా ఉంటారు.
కనుక వారు సహాయం కోసం దేవునికి మొరపెడితే దేవుడు వారికి జవాబు ఇవ్వడు.
13 వారి పనికిమాలిన విన్నపం దేవుడు వినడు, అది నిజం.
సర్వశక్తిగల దేవుడు వారిపట్ల శ్రద్ధ చూపడు.
14 యోబూ, అదే విధంగా దేవుడు నీకు కనబడలేదని నీవు చెప్పినప్పుడు,
దేవుడు నీ మాట వినడు.
దేవుణ్ణి కలుసుకొని, నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకొనే అవకాశంకోసం
నిరీక్షిస్తున్నానని నీవు అంటున్నావు.
15 “యోబూ, దేవుడు దుర్మార్గులను శిక్షించడనీ,
పాపాన్ని దేవుడు లక్ష్యపెట్టడనీ నీవు తలస్తున్నావు.
16 కనుక యోబు తన పనికిమాలిన మాటలు కొనసాగిస్తున్నాడు.
యోబు మాట్లాడుతోంది ఏమిటో అతనికే తెలియదు.”
36 ఎలీహు మాట్లాడటం కొనసాగించాడు.
2 “యోబూ, నాతో ఇంకొంచెం ఓపికగా ఉండు.
దేవుని పరంగా చెప్పాల్సింది ఇంకా ఉందని నేను నీకు చూపిస్తాను.
3 నా జ్ఞానాన్ని అందరితోనూ పంచుకొంటాను.
దేవుడు నన్ను సృష్టించాడు. దేవుడు న్యాయంగల వాడని నేను రుజువు చేస్తాను.
4 యోబూ, నేను చెప్పేది ప్రతీదీ సత్యం.
నేను చెబుతున్నదేమిటో తెలిసే చెబుతున్నాను.
5 “దేవుడు శక్తివంతమైనవాడు,
కానీ ఆయన మనుష్యులను ద్వేషించడు.
దేవుడు మహత్తర శక్తిమంతుడు,
ఆయన సంకల్పాలు ఆయనకు ఉన్నాయి.
6 దుర్మార్గులను దేవుడు బ్రతుకనివ్వడు.
పేద ప్రజలకు దేవుడు ఎల్లప్పుడు న్యాయం జరిగిస్తాడు.
7 ఏది సరైనదో, దాన్ని చేసే ప్రజల విషయం దేవుడు శ్రద్ధ చూపిస్తాడు.
మంచి వాళ్లను ఆయన పాలకులుగా ఉండనిస్తాడు.
మంచి వాళ్లకు దేవుడు శాశ్వతమైన ఘనత ఇస్తాడు.
8 కానీ మనుష్యులు శిక్షించబడుతూ
సంకెళ్లతో ఉంటే ఒకవేళ మనుష్యులు శ్రమపడతూ, కష్టాలు అనుభవిస్తోంటే,
9 వారు చేసిన తప్పు ఏమిటో ఆయన వారికి చెబుతాడు.
వారు పాపం చేశారని, వారు అతిశయించారని దేవుడు వారికి చెబుతాడు.
10 దేవుడు వాళ్ల చెవులు వినేలా తెరుస్తాడు.
వారు పాపం చేయటం చాలించాలని ఆయన వారికి ఆజ్ఞ ఇస్తాడు.
11 ఆ మనుష్యులు దేవుని మాట విని ఆయనకు విధేయులైతే,
దేవుడు వారిని విజయవంతమైన ఆనంద జీవితాన్ని జీవింపనిస్తాడు.
12 కానీ ఆ మనుష్యులు దేవునికి విధేయులయ్యేందుకు నిరాకరిస్తే వారు మృతుల లోకంలో చేరిపోతారు.
ఏది నిజమైన జ్ఞానమో తెలియకుండా వాళ్లు (మూర్ఖులుగా) చనిపోతారు.
13 “దేవుని గూర్చి లక్ష్యపెట్టని మనుష్యులు ఎల్లప్పుడూ కక్షతో ఉంటారు.
దేవుడు వారిని శిక్షించినప్పటికీ, వారు సహాయం కోసం దేవుణ్ణి ప్రార్థించ నిరాకరిస్తారు.
14 ఆ మనుష్యులు ఇంకా యవ్వనంలో ఉండగానే మరణిస్తారు.
మగ వ్యభిచారులతోబాటు వారుకూడా అవమానంతో మరణిస్తారు.
15 కానీ శ్రమ పడుతున్న మనుష్యులను దేవుడు వారి కష్టాల్లోనుంచి రక్షిస్తాడు.
మనుష్యులు మేల్కొని దేవుని మాట వినేలా ఆయన ఆ కష్టాలను ప్రయోగిస్తాడు.
16 “యోబూ, దేవుడు నీ మీద దయ చూపించి,
నీ కష్టాల నుండి నిన్ను బయటకు రప్పించి నీకు సహాయం చేయాలని కోరుతున్నాడు.
దేవుడు నీకు క్షేమకరమైన స్థలం ఇవ్వాలనీ నీ బల్లమీద సమృద్ధిగా భోజనం ఉంచాలనీ కోరుతున్నాడు.
17 కానీ యోబూ, దుర్మార్గులవలె నీవు శిక్షించబడుతున్నావు. దేవుని న్యాయం, తీర్పు నిన్ను పట్టేశాయి.
18 యోబూ, ధనం నీ చేత తప్పు చేయించనీయకుండును గాక.
విస్తారమైన ధనాశ చూపించినందువల్ల మోసపోవద్దు.
19 నీ ధనం అంతా ఇప్పుడు నీకు సహాయం చేయలేదని నీకు తెలుసు.
శక్తిమంతుల సహాయం కోసం మొరపెట్టినందువల్ల ఏమి లాభం లేదు.
20 ప్రజలు నశించిపోయే సమయంలో రాత్రికోసం ఆశించకు.
(వాళ్లు దేవున్నుండి దాక్కోగలమని అనుకొంటున్నారు.)
21 యోబూ, తప్పు చేయకుండా జాగ్రత్త పడు.
ఎందుకంటే నీవు ఈ కష్టాన్ని ఎన్నుకొన్నావు.
22 “దేవునికి చాలా శక్తి ఉంది.
దేవుడే అందరిలోకెల్ల గొప్ప ఉపదేశకుడు.
23 ఏమి చేయాలి అనేది దేవునికి ఎవరూ చెప్పలేరు.
‘దేవా నీవు తప్పు చేశావు’ అని ఎవరూ దేవునికి చెప్పలేరు.
24 దేవునిని తాను చేసిన పనిని బట్టి స్తుతించటం మరువకు.
మనుష్యులు దేవునిని కీర్తనలతో స్తుతించారు.
25 ప్రతి మనిషీ దేవుని పనిని చూశాడు.
మనుష్యులు దేవుని పనిని దూరం నుండి చూశారు.
26 దేవుడు గొప్పవాడు. అది నిజం. ఆయన గొప్పతనాన్ని మనం గ్రహించలేం.
దేవునికి ఎన్ని సంవత్సరాలో ఏ మనిషీ లెక్కించలేడు.
27 “దేవుడు భూమినుండి నీళ్లు తీసుకొని
దాన్ని వర్షంగా మారుస్తాడు.
28 ఆయన మేఘాన్ని చేసి వాటి నీళ్లను కుమ్మరిస్తాడు.
మనుష్యుల మీద అధిక వర్షం కురుస్తుంది.
29 దేవుడు మేఘాలను ఎలా వ్యాపింపజేస్తాడో మనిషి గ్రహించలేడు.
దేవుడు నివసించే ఆకాశంలోనుంచి ఉరుము ఎలా ఉరుముతుందో ఏ మనిషీ గ్రహించలేడు.
30 అగాధ సముద్రాన్ని ఆవరిస్తూ ఆకాశం అంతటా
దేవుడు మెరుపును ఎలా విస్తరింపజేస్తాడో చూడు.
31 రాజ్యాలను అదుపులో ఉంచి సమృద్ధిగా ఆహారం ఇచ్చేందుకు
దేవుడు ఈ మేఘాలను ప్రయోగిస్తాడు.
32 దేవుడు మెరుపులను తన చేతితో పట్టుకొంటాడు.
దేవుడు కోరుకొన్న చోటనే పిడుగుపడేటట్టు దానికి ఆజ్ఞాపిస్తాడు.
33 తుఫాను వస్తోందని ఉరుము తెలియజేస్తుంది.
తుఫాను వస్తోందని చివరికి పశువులకు కూడా తెలుసు.
37 “ఉరుములు, మెరుపులు నన్ను భయపెడతాయి.
నేను ఈ విషయాలు తలచినప్పుడు నా గుండె చాలా వేగంగా కొట్టుకొంటుంది.
2 ప్రతి ఒక్కరూ వినండి. దేవుని స్వరం ఉరుములా ధ్వనిస్తుంది.
దేవుని నోటి నుండి వస్తోన్న ఉరుము శబ్దం వినండి
3 మొత్తం ఆకాశం అంతటా వెలిగేలా దేవుడు తన మెరుపును పంపిస్తాడు.
అది భూమి అంతట మెరిసింది.
4 మెరుపు మెరిసిన తర్వాత గర్జించే దేవుని స్వరం వినవచ్చును.
దేవుడు తన ఆశ్చర్యకరమైన స్వరంతో ఉరుముతాడు.
మెరుపు మెరుస్తూ ఉండగా దేవుని స్వరం ఉరుముతుంది.
5 దేవుడు ఉరిమే స్వరం అద్భుతం.
మనం గ్రహించజాలని గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు.
6 ‘నేలమీద పడు’
అని ఆయన మంచుతో చెబుతాడు.
‘నేలమీద వర్షించు’
అని దేవుడు వర్షంతో చెబుతాడు.
7 దేవుడు ఏమి చేయగలడో అనేది
ఆయన సృజించిన మనుష్యులంతా తెలుసుకొనేందుకు అలా చేస్తాడు.
8 మృగాలు వాటి గుహల్లోకి పరుగెత్తిపోయి, అక్కడ నివసిస్తాయి.
9 తుఫాను దక్షిణం నుండి వస్తుంది.
చలి ఉత్తరం నుండి వస్తుంది.
10 దేవుని ఊపిరి మంచును చేస్తుంది.
అది మహాసముద్రాలను గడ్డ కట్టిస్తుంది
11 దేవుడు మేఘాలను నీళ్లతో నింపుతాడు.
ఆయన తన మెరుపును మేఘాల ద్వారా విస్తరింప చేస్తాడు.
12 భూమి మీద అంతటికీ చెదరిపోయేలా దేవుడు మేఘాలను ఆజ్ఞాపిస్తాడు.
దేవుడు ఏమి చెబితే అది మేఘాలు చేస్తాయి.
13 దేవుడు మనుష్యులను శిక్షించేందుకు,
వరదలను లేదా తన ప్రేమ చూపుటకై వర్షం రప్పించేందుకు మేఘాలను తీసుకొని వస్తాడు.
14 “యోబూ, ఒక నిమిషం ఆగి విను.
ఆగి, దేవుడు చేసే అద్భుత విషయాలను గూర్చి ఆలోచించు.
15 యోబూ, దేవుడు మేఘాలను ఎలా అదుపు చేస్తాడో నీకు తెలుసా?
దేవుడు తన మెరుపును ఎలా ప్రకాశింప చేస్తాడో నీకు తెలుసా?
16 ఆకాశంలో మేఘాలు ఎలా వ్రేలాడుతాయో నీకు తెలుసా?
దేవుని జ్ఞానం పరిపూర్ణం. మేఘాలు, దేవుని ఆశ్చర్యకార్యాలు.
17 లేదు, యోబూ, ఈ సంగతులు నీకు తెలియవు.
దక్షిణపు వేడి గాలిలో భూమి నిశ్చలంగా ఉన్నప్పుడు నీకు చెమటపోసి, నీ బట్టలు జిడ్డుగా ఉండటం మాత్రమే నీకు తెలుసు.
18 యోబూ, ఆకాశాన్ని విశాలపరచేందుకు
మెరుగుదిద్దిన అద్దంలా దానిని గట్టిగా చేసేందుకు నీవు దేవునికి సహాయం చేయగలవా?
19 “యోబూ, దేవునితో మేము ఏమి చెప్పాలో చెప్పు.
మేము చీకటిలో ఉన్నందువల్ల సరియైన మా వాగ్వివాదాన్ని దేవునికి మేము చెప్పలేకున్నాము.
(దేవుని సన్నిధిలో) ఏమి చెప్పడానికీ మాకు తెలియడంలేదు.
20 నేను దేవునితో మాట్లాడాలని ఆయనతో చెప్పను.
అలా చెప్పటం నాశనం చేయమని అడిగినట్టే ఉంటుంది.
21 ఇప్పుడు ప్రకాశిస్తున్న సూర్యుణ్ణి ఏ మనిషీ చూడలేడు.
గాలి మేఘాలను తరిమి వేసిన తరువాత అది ఆకాశంలో చాలా తేజోవంతంగా ప్రకాశిస్తుంది.
22 (అదే విధంగా దేవుడు ఉన్నాడు) దేవుని బంగారు మహిమ ఉత్తరం నుండి ప్రకాశిస్తుంది.
దేవుడు అద్భుత మహిమతో వస్తాడు.
23 సర్వశక్తిమంతుడైన దేవుడు నిజంగా గొప్పవాడు.
మనం దేవుని దగ్గరగా వెళ్లలేం. దేవుడు మనుష్యుల్ని ఎల్లప్పుడూ సరిగ్గాను, న్యాయంగాను చూస్తాడు.
24 అందువల్లనే మనుష్యులు దేవుణ్ణి గౌరవిస్తారు.
కానీ తెలివిగల వాళ్లం అనుకొనే గర్విష్ఠులను దేవుడు లక్ష్యపెట్టడు.”
© 1997 Bible League International