Chronological
ఎలీహు తన వాదాన్ని పెంచటం
32 అప్పుడు యోబు స్నేహితులు ముగ్గురూ యోబుకు జవాబు ఇచ్చే ప్రయత్నం విరమించుకొన్నారు. యోబు తన మట్టుకు తాను నిర్దోషినని అనుకోవడం చేత వారు విరమించుకొన్నారు. 2 ఎలీహు అనే పేరు గల ఒకతను అక్కడ ఉన్నాడు. ఎలీహు బరకెయేలు కుమారుడు. బరకెయేలు బూజు సంతతి వాడు. ఎలీహు రాము వంశస్థుడు. ఎలీహు యోబు మీద చాలా కోపగించాడు. ఎందుకంటే యోబు తన మట్టుకు తానే మంచివాడినని చెప్పుకొంటున్నాడు. మరియు యోబు తాను దేవునికంటే నీతిమంతుణ్ణి అని చెబుతున్నాడు. 3 కాబట్టి ఎలీహు యోబు స్నేహితుల మీద కూడా కోపగించాడు. ఎందుకంటే యోబు స్నేహితులు ముగ్గురూ యోబు ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేక యోబుదే తప్పు అని రుజువు చేయలేకపోయారు. 4 అక్కడ ఉన్న వారిలో ఎలీహు చాలా చిన్నవాడు. కనుక ప్రతి ఒక్కరూ మాట్లాడటం అయ్యేంత వరకు అతడు వేచి ఉన్నాడు. అప్పుడు అతడు మాట్లాడటం ప్రారంభించవచ్చు అని అనుకొన్నాడు. 5 యోబు స్నేహితులు ముగ్గురూ చెప్పాల్సింది ఇంక ఏమీలేదని ఎలీహు చూచినప్పుడు అతనికి కోపం వచ్చింది. 6 కనుక ఎలీహు మాట్లాడటం ప్రారంభించాడు. అతడు ఇలా అన్నాడు:
“నేను చిన్నవాడిని. మీరు పెద్దవాళ్లు.
అందుకే నేను అనుకొంటున్నది ఏమిటో మీతో చెప్పాడానికి భయపడుతున్నాను.
7 ‘పెద్దవాళ్లు ముందుగా మాట్లాడాలి.
చాలా సంవత్సరాలు బ్రతికిన మనుష్యులు తమ జ్ఞానాన్ని పంచి ఇవ్వాలి’ అని నాలో నేను అనుకొన్నాను.
8 కాని ఒక వ్యక్తిలో దేవుని ఆత్మ, సర్వశక్తిమంతుడైన దేవుని ‘ఊపిరి’
ఆ వ్యక్తికి జ్ఞానం ప్రసాదిస్తుంది.
9 వృద్ధులు మాత్రమే జ్ఞానం గల మనుష్యులు కారు.
వయస్సు పైబడిన వాళ్లు మాత్రమే సరియైన అవగాహన గలవారు కారు.
10 “అందువల్లనే ఎలీహు అనే నేను నా మాట వినమని చెబుతున్నాను.
నేను తలచేదేమిటో కూడా నేను మీతో చెబుతాను.
11 మీరు మాట్లాడుతూ ఉన్నంతసేపూ నేను సహనంతో వేచి ఉన్నాను.
మీరు యోబుకు చెప్పిన జవాబులు నేను విన్నాను.
12 మీరు తెలివిగల మాటలతో యోబుకు జవాబు చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నంతసేపూ నేను శ్రద్ధగా విన్నాను.
కాని యోబుదే తప్పు అని మీరు ముగ్గురూ రుజువు చేయలేదు.
యోబు వాదాలకు మీలో ఒక్కరూ జవాబు చెప్పలేదు.
13 మీరు ముగ్గురూ జ్ఞానం కనుగొన్నట్టు చెప్పలేరు.
యోబు వాదాలకు దేవుడే జవాబు చెప్పాలి కాని మనుష్యులు కాదు.
14 కాని యోబు నాతో వాదించలేదు.
అందుచేత మీరు ముగ్గురూ ప్రయోగించిన వాదాలను నేను ఉపయోగించను.
15 “యోబూ, నీ ముగ్గురు స్నేహితులూ ఇబ్బంది పడిపోతున్నారు.
వారు చెప్పాల్సింది ఇంక ఏమీ లేదు.
వారి వద్ద జవాబులు ఇంకేమీ లేవు.
16 ఈ ముగ్గురు మనుష్యులూ మౌనంగా ఉన్నారు,
అక్కడే నిలబడ్డారు, జవాబు ఏమీ లేదు.
కనుక నేను ఇంకా వేచి ఉండాలా?
17 లేదు! నేను కూడా నా జవాబు చెబుతాను.
నేను తలుస్తున్నది కూడ నీతో చెబుతాను.
18 ఎందుకంటే, నేను చెప్పాల్సింది చాలా ఉంది.
నాలో ఉన్న ఆత్మ నన్ను మాట్లాడమని బలవంతం చేస్తోంది.
19 కొద్ది సేపట్లో పొర్లిపోయే ద్రాక్షారసంలా నా అంతరంగంలో నేను ఉన్నాను.
త్వరలో పగిలిపోబోతున్న కొత్త ద్రాక్షా తిత్తిలా నేను ఉన్నాను.
20 కనుక నేను మాట్లాడాలి. అప్పుడు నాకు బాగుంటుంది.
నేను నా పెదాలు తెరచి యోబు ఆరోపణలకు జవాబు చెప్పాలి.
21 ఈ వాదంలో నేను ఎవరి పక్షమూ వహించను.
నేను ఎవరినీ పొగడను. నేనేమి చెప్పాలో దానిని చెబుతాను.
22 ఒక మనిషిని ఎలా పొగడాలో నాకు తెలియదు.
ఒకరిని ఎలా పొగడాలో నాకు తెలిసి ఉంటే వెంటనే దేవుడు నన్ను శిక్షిస్తాడు.
33 “అయితే యోబూ, దయచేసి నా సందేశాన్నివిను.
నేను చెప్పే మాటలు గమనించు.
2 త్వరలోనే నేను మాట్లాడటం మొదలు పెడతాను. చెప్పటానికి నేను దాదాపు సిద్ధంగా ఉన్నాను.
3 నా హృదయం నిజాయితీ గలది. కనుక నిజాయితీగల మాటలను నేను చెబుతాను.
నాకు తెలిసిన సంగతులను గూర్చి నేను సత్యం చెబుతాను.
4 దేవుని ఆత్మ నన్ను చేసింది.
నా జీవం సర్వశక్తిమంతుడైన దేవుని నుండి వచ్చింది.
5 యోబూ, విను. నీవు చెప్పగలవనుకొంటే నాకు జవాబు చెప్పు.
నీవు నాతో వాదించగలిగేందుకు నీ జవాబులు సిద్ధం చేసుకో.
6 దేవుని ఎదుట నీవు, నేను సమానం.
మన ఇద్దరిని చేసేందుకు దేవుడు మట్టినే ఉపయోగించాడు.
7 యోబూ, నన్ను గూర్చి భయపడకు.
నేను నీ యెడల కఠినంగా ఉండను.
8 “కాని యోబూ, నీవు చెబుతూండగా
నేను విన్నది ఇదే.
9 నీవు అన్నావు: ‘యోబు అనే నేను నిర్దోషిని,
నేను పాపం చేయలేదు. లేక ఏ తప్పు చేయలేదు. నేను దోషిని కాను.
10 నేను ఏ తప్పు చేయక పోయినప్పటికి దేవుడు నాలో ఏదో తప్పుకనుగొన్నాడు.
యోబు అనేనేను దేవుని శత్రువును అని ఆయన తలుస్తున్నాడు.
11 కనుక దేవుడు నా పాదాలకు సంకెళ్లు వేస్తున్నాడు.
నేను చేసేది సమస్తం దేవుడు గమనిస్తున్నాడు.’
12 “కాని యోబూ, దీని విషయం నీది తప్పు అని నేను నీతో చెప్పాలి.
ఎందుకంటే దేవునికి అందరి కంటే ఎక్కువ తెలుసు కనుక.
13 యోబూ, నీవు ఎందుకు ఆరోపణ చేస్తూ దేవునితో వాదిస్తావు?
దేవుడు చేసే ప్రతిదాని గూర్చీ ఆయన నీకు వివరించటం లేదని నీవెందుకు ఆలోచిస్తావు?
14 అయితే దేవుడు చేసే దాన్ని గూర్చి ఆయన వివరిస్తాడు.
దేవుడు వేరువేరు విధానాలలో మాట్లాడతాడు. కానీ మనుష్యులు దాన్ని గ్రహించరు.
15-16 ఒక వేళ మనుష్యులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు కలలో లేక రాత్రి వేళ దర్శనంలో ఆయన వారి చెవులలో చెబుతాడేమో.
అప్పుడు వారు దేవుని హెచ్చరికలు విని చాలా భయపడతారు.
17 మనుష్యులు చెడు సంగతులు జరిగించటం మాని వేయాలని,
గర్విష్టులు, కాకుండా ఉండాలని దేవుడు హెచ్చరిస్తాడు.
18 మనుష్యులు మరణస్థానానికి వెళ్లకుండా రక్షించాలని హెచ్చరిస్తాడు.
ఒక వ్యక్తి నాశనం చేయబడకుండా రక్షించటానికి దేవుడు అలా చేస్తాడు.
19 “లేక ఒక వ్యక్తి పడక మీద ఉండి దేవుని శిక్ష అనుభవిస్తున్నప్పుడు దేవుని స్వరం వినవచ్చును.
ఆ వ్యక్తిని దేవుడు బాధతో హెచ్చరిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎముకలన్నీ నొప్పి పెట్టినట్లు అతడు బాధ పడుతున్నాడు.
20 ఆ వ్యక్తి భోజనం చేయలేడు.
శ్రేష్టమైన భోజనం కూడ అసహ్యించుకొనేంతగా అతడు బాధ పడతాడు.
21 అతని చర్మం వేలాడేటంతగా, అతని ఎముకలు పొడుచుకొని వచ్చేంతగా
అతని శరీరం పాడైపోతుంది.
22 ఆ మనిషి ఖనన స్థలానికి సమీపంగా ఉన్నాడు.
అతని జీవితం చావుకు దగ్గరగా ఉంది.
23 కాని ఒకవేళ ఆ మనిషికి సహాయం చేయటానికి ఒక దేవదూత ఉండునేమో.
నిజంగా దేవునికి వేలాది దూతలు ఉంటారు. అప్పుడు ఆ దూతలు ఆ మనిషి చేయాల్సిన సరియైన సంగతిని అతనికి తెలియజేస్తాడు.
24 మరియు ఆ దేవదూత ఆ మనిషి ఎడల దయగా ఉంటాడు,
‘ఈ మనిషిని చావు స్థలం నుండి రక్షించండి.
అతని పక్షంగా చెల్లించేందుకు నేను ఒక మార్గం కనుగొన్నాను’
25 అప్పుడు ఆ మనిషి శరీరం మరల యవ్వనాన్ని, బలాన్ని పొందుతుంది.
ఆ మనిషి యువకునిగా ఉన్నప్పటివలెనే ఉంటాడు.
26 ఆ మనిషి దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవుడు అతని ప్రార్థన వింటాడు.
అప్పుడు ఆ మనిషి దేవుని ఆరాధిస్తూ సంతోషంగా ఉంటాడు.
ఎందుకంటే, దేవుడు అతనికి సహజమైన మంచి జీవితాన్ని మరల ఇస్తాడు గనుక.
27 అప్పుడు ఆ మనిషి ప్రజల దగ్గర ఒప్పుకొంటాడు. అతడు చెబుతాడు, ‘నేను పాపం చేశాను.
మంచిని నేను చెడుగా మార్చాను.
కానీ దేవుడు శిక్షించాల్సినంత కఠినంగా నన్ను శిక్షించలేదు.
28 నా ఆత్మ ఖనన స్థలానికి వెళ్లకుండా దేవుడు నన్ను రక్షించాడు. నేను చాలా కాలం జీవిస్తాను.
నేను మరల జీవితాన్ని అనుభవిస్తాను.’
29 “ఒక మనిషికి దేవుడు ఈ సంగతులను మరల మరల చేస్తాడు.
30 ఆ మనిషిని హెచ్చరించి, అతని ఆత్మను మరణ స్థలం నుండి రక్షించేందుకు.
ఆ మనిషి తన జీవితాన్ని అనుభవించవచ్చు.
31 “యోబూ, నా మాట గమనించు. నా మాటవిను.
మౌనంగా ఉండి, నన్ను మాట్లాడనియ్యి.
32 యోబూ, నీవు చెప్పాల్సింది ఏమైనా ఉంటే నన్ను విననీ.
ఎందుకంటే, నీవు నిర్దోషివి అని రుజువు చేయగోరుతున్నాను గనుక.
నీ వాదాన్ని సరిదిద్దేలాగా నాకు వినిపించు.
33 కానీ యోబూ, నీవు చెప్పాల్సింది ఏమీ లేకపోతే నా మాట విను.
మౌనంగా ఉండు, జ్ఞానం గలిగి ఉండటం ఎలాగో నేను నేర్పిస్తాను.”
34 ఎలీహు మాట్లాడటం కొన సాగించాడు:
2 “జ్ఞానంగల మనుష్యులారా, నేను చెప్పే విషయాలు వినండి.
తెలివిగల మనుష్యులారా నా మాటలు గమనించండి.
3 చెవి తను వినే సంగతులను పరీక్షిస్తుంది.
అదే విధంగా నాలుక, తను తాకే వాటిని రుచి చూస్తుంది.
4 అందుచేత మనం ఈ పరిస్థితిని పరిశీలించాలి. ఏది సరైనదో మనమే నిర్ణయించాలి.
ఏది మంచిది అనేది కూడా మనం అంతా ఏకంగా నేర్చుకొంటాం.
5 యోబు అంటున్నాడు, ‘యోబు అనే నేను నిర్దోషిని.
కానీ దేవుడు నాకు న్యాయం చేయలేదు.
6 నాది సరిగ్గా ఉంది, కానీ ప్రజలు నాది తప్పు అనుకొంటారు.
నేను అబద్దీకుణ్ణి అని వాళ్లు అనుకొంటారు. నేను నిర్దోషిని అయినప్పటికి నా గాయం మానదు.’
7 “యోబులాంటి వ్యక్తి మరొకడు లేడు.
మీరు యోబును అవమానించినప్పటికి అతడు లెక్క చేయడు.
8 చెడ్డ వాళ్లతో యోబు స్నేహంగా ఉన్నాడు.
దుర్మార్గులతో కలిసి సహవాసం యోబుకు యిష్టం.
9 ‘ఎందుకంటే, ఒకడు దేవునికి విధేయత చూపించేందుకు ప్రయత్నిస్తే
దానివల్ల అతనికి ప్రయోజనం ఏమీ కలుగదు’ అని యోబు చెబుతున్నాడు.
10 “కనుక గ్రహించగలిగిన ఓ మనుష్యులారా, నా మాట వినండి.
దేవుడు ఎన్నటికీ చెడు చేయడు.
సర్వశక్తిమంతుడైన దేవుడు ఎన్నటికీ తప్పు చేయడు.
11 ఒకడు చేసిన విషయాలనే తిరిగి దేవుడు అతనికి చెల్లిస్తాడు.
మనుష్యులకు రావలసిందే దేవుడు వారికి ఇస్తాడు.
12 ఇది సత్యం. దేవుడు తప్పు చేయడు.
సర్వశక్తిమంతుడైన దేవుడు ఎల్లప్పుడూ న్యాయంగానే ఉంటాడు.
13 భూమికి పర్యవేక్షకునిగా ఉండేందుకు దేవుణ్ణి ఎవరు నియమించారు?
భూభారాన్ని దేవునికి ఎవరు అప్పగించారు? (దేవుడు అన్నింటినీ పుట్టించాడు మరియు అన్నీ ఆయన అధీనంలో ఉంటాయి.)
14 దేవుడు తన ఆత్మను,
తన ప్రాణవాయువును మనుష్యుల్లోనుండి తీసివేయాలని ఒకవేళ అనుకొంటే
15 అప్పుడు భూమి మీద మనుష్యులు అందరూ చనిపోతారు.
అప్పుడు మనుష్యులు మరల మట్టి అయిపోతారు.
16 “మీరు జ్ఞానంగల వారైతే,
నేను చెప్పేది వినండి.
17 న్యాయంగా ఉండటం యిష్టంలేని మనిషి పరిపాలకునిగా ఉండజాలడు.
యోబూ, బలమైన మంచి దేవుణ్ణి నీవు దోషిగా తీర్చగలవని నీవు తలుస్తున్నావా?
18 ‘మీరు పనికిమాలిన వాళ్లు’ అని రాజులతో చెప్పేవాడు దేవుడు.
‘మీరు దుర్మార్గులు’ అని నాయకులతో దేవుడు చెబుతాడు.
19 దేవుడు నాయకులను మనుష్యులకంటె ఎక్కువేమీ ప్రేమించడు.
దేవుడు ధనికులను దరిద్రుల కంటే ఎక్కువేమీ ప్రేమించడు.
ఎందుకంటే, ప్రతి మనిషినీ దేవుడే చేశాడు గనుక.
20 ఒక వ్యక్తి రాత్రిపూట అకస్మాత్తుగా మరణించవచ్చును.
మనుష్యులను దేవుడు రోగులుగా చేస్తాడు.
వారు మరణిస్తారు.
ఏ కారణం లేకుండానే శక్తిగల మనుష్యులు మరణిస్తారు.
21 “మనుష్యులు ఏమి చేస్తున్నదీ దేవుడు గమనిస్తూ ఉంటాడు.
ఒక వ్యక్తి నడిచే ప్రతి నడత దేవునికి తెలుసు.
22 దుర్మార్గుడు దేవునికి కనబడకుండా దాగుకొనేందుకు చీకటి చోటు ఏమీ లేదు.
ఏ చోటైన చీకటిగా ఉండదు.
23 మనుష్యులను మరింత పరీక్షించేందుకు దేవునికి ఒక నిర్ణీత సమయం అవసరం లేదు.
మనుష్యులకు తీర్పు తీర్చేందుకు దేవుడు వారిని తన ఎదుటికి తీసుకొని రానవసరం లేదు.
24 దేవుడు ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు.
కానీ దేవుడు శక్తివంతమైన వారిని నాశనం చేసి ఇతరులను వారి స్థానంలో ఉంచుతాడు.
25 కనుక మనుష్యులు ఏమి చేస్తారో దేవునికి తెలుసు.
అందుకే దేవుడు దుర్మార్గులను రాత్రిపూట ఓడించి, వారిని నాశనం చేస్తాడు.
26 చెడ్డవాళ్లు చేయు దుర్మార్గపు పనులను బట్టి దేవుడు వారిని నాశనం చేస్తాడు.
ఆ చెడ్డవారిని అందరూ చేసేలా ఆయన శిక్షిస్తాడు
27 ఎందుకంటే ఆ చెడ్డవాళ్లు దేవునికి విధేయత కావటం మానివేశారు గనుక.
మరియు ఆయన కొరిన వాటిని చేయటం ఆ చెడ్డవాళ్లు లక్ష్య పెట్టలేదు గనుక.
28 పేద ప్రజలను బాధించి, వారు సహాయం కోసం దేవునికి మొర పెట్టేలాగా ఆ చెడ్డవాళ్లు చేశారు.
మరియు పేదవారు సహాయం కోసం మొరపెట్టినప్పుడు ఆయన వింటాడు.
29 కానీ ఒకవేళ పేద ప్రజలకు సహాయం చేయకూడదని
కనుక దేవుడు నిర్ణయంచేస్తే ఎవరూ ఆయనను దోషిగా నిర్ణయించలేరు
ఒకవేళ దేవుడు ప్రజలకు తన ముఖం మరుగు చేసికొంటే వారికి సహాయం చేయగలవాడు ఎవడూ ఉండడు.
అయితే ఆయన వ్యక్తులను, రాజ్యాలను పాలిస్తాడు.
30 తర్వాత దేవునికి విరోధంగా ఉండి మనుష్యులను మోసగించే వ్యక్తిని
దేవుడు పాలకునిగా ఉండనివ్వడు.
31 “ఒకవేళ ఒక వ్యక్తి దేవునితో అనవచ్చును:
‘నేను దోషిని, నేను ఇంకెంత మాత్రం పాపం చేయను.
32 దేవా, నాకు తెలియని విషయాలు నాకు నేర్పించు.
నేను తప్పు చేసి ఉంటే ఇకమీదట ఎన్నటికి మరల దానిని చేయను.’
33 కానీ యోబూ, నీవు మారటానికి తిరస్కరిస్తూ ఉండగా,
నీవు ఏ విధంగా ప్రతిఫలం కావాలని కోరుకొంటావో అలా దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలా?
యోబూ, ఇది నీ తీర్మానం, నాది కాదు.
నీవు ఏమి అనుకొంటున్నావో నాకు చెప్పు.
34 జ్ఞానం గలిగి, గ్రహింపు ఉన్న ఏ మనిషిగాని నాతో ఏకీభవిస్తాడు.
నా మాటలు వినే జ్ఞానం గల మనిషి ఎవరైనా సరే అని అంటారు,
35 ‘యోబు తెలియనివానిలా మాట్లాడతాడు.
యోబు చెప్పే మాటలకు అర్థం లేదు.’
36 యోబును పరీక్షించేందుకు అతనికి ఇంకా ఎక్కువ కష్టాలు వస్తే బాగుండునని, నా ఆశ.
ఎందుకంటే ఒక దుర్మార్గుడు జవాబిచ్చినట్టుగా యోబు మనకు జవాబు ఇస్తున్నాడు గనుక.
37 యోబు తన పాపం అంతటికి తిరుగుబాటుతనం అదనంగా కలిపాడు.
యోబు మనలను అవమానించి, మన ఎదుట దేవుణ్ణి హేళన చేస్తున్నాడు.”
© 1997 Bible League International