Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యోబు 24-28

24 “సర్వశక్తిమంతుడైన దేవుడు న్యాయవిచారణ కోసం ఒక సమయాన్ని ఎందుకు నిర్ణయించడు?
    దేవునికి విధేయులయ్యే మనుష్యులు ఆ న్యాయవిచారణ సమయం కోసం అనవసరంగా ఎందుకు వేచి ఉండాలి?”

“మనుష్యులు తమ పొరుగు వారి భూమిని ఆక్రమించేందుకు సరిహద్దు రాళ్లను జరిపివేస్తారు.
    మనుష్యులు మందలను దొంగిలించి ఇతర పచ్చిక బయళ్లకు వాటిని తోలుకొని పోతారు.
అనాధల గాడిదను వారు దొంగిలిస్తారు.
    ఒక విధవ వారి బాకీ తీర్చేంత వరకు ఆమె యొక్క ఆవును వారు తోలుకొని పొతారు.
ఇల్లు లేకుండా ఒక చోటు నుండి మరో చోటికి సంచారం చేసేటట్టు ప్రజలను వారు బలవంతం చేస్తారు.
    పేద ప్రజలంతా ఈ దుర్మార్గుల బారినుండి దాగుకొనేలా బలవంతం చేయబడతారు.

“అరణ్యంలో ఆహారం కోసం వెదకులాడే అడవి గాడిదలా ఉన్నారు ఈ పేద ప్రజలు.
    పేద ప్రజలకూ వారి పిల్లలకూ ఎడారి ఆహారమును ఇస్తుంది.
పేద ప్రజలు ఇంకెంత వరకు వారి స్వంతం కాని పొలాలలో గడ్డి, గడ్డిపరకలు కూర్చుకోవాలి?
    దుర్మార్గుల ద్రాక్షాతోటల నుండి వారు పండ్లు ఏరుకొంటారు.
పేద ప్రజలు బట్టలు లేకుండానే రాత్రిపూట వెళ్లబుచ్చాలి.
    చలిలో వారు కప్పుకొనేందుకు వారికి ఏమీ లేదు.
కొండల్లోని వర్షానికి వారు తడిసిపోయారు.
    వాతా వరణంనుండి వారిని వారు కాపాడుకొనేందుకు వారికి ఏమీ లేదు కనుక వారు పెద్ద బండలకు దగ్గరలో ఉండాలి.
దుర్మార్గులు తండ్రిలేని బిడ్డను తల్లి దగ్గర నుండి లాగివేసుకొంటారు.
    పేద మనిషియొక్క బిడ్డను వారు తీసివేసుకొంటారు. పేద మనిషి బాకీపడి ఉన్న దానిని చెల్లించటం కోసం దుర్మార్గులు ఆ చిన్న బిడ్డను బానిసగా చేస్తారు.
10 పేద ప్రజలకు బట్టలు లేవు, కనుక వారు దిగంబరులుగా పని చేస్తారు.
    దుర్మార్గుల కోసం వారు పనలు మోస్తారు. కానీ పేద ప్రజలు ఇంకా ఆకలితోనే ఉంటారు.
11 పేద ప్రజలు ఒలీవ నూనె పిండుతారు.
    వారు ద్రాక్షాగానుగను తిప్పుతారు. కానీ వారు ఇంకా దాహంతోనే ఉంటారు.
12 మరణిస్తున్న మనుష్యులు చేస్తున్న విచారకరమైన శబ్దాలు పట్టణంలో వినిపిస్తున్నాయి.
    బాధించబడిన మనుష్యులు సహాయం కోసం అరుస్తున్నారు. కానీ దేవుడు వినటం లేదు.

13 “వెలుగు మీద తిరుగుబాటు చేసే మనుష్యులు ఉన్నారు.
    వారు ఏమి చేయాలని దేవుడు కోరుతున్నాడో తెలుసుకోవటం వారికి ఇష్టం లేదు.
    వారు దేవుని మార్గంలో నడవరు.
14 నరహంతకుడు ఉదయాన్నే లేచి పేద ప్రజలను, అక్కరలో ఉన్న ప్రజలను చంపుతాడు.
    రాత్రివేళ అతడు దొంగగా మారిపోతాడు.
15 వ్యభిచారం చేసేవాడు రాత్రి కోసం వేచి ఉంటాడు.
    ‘నన్ను ఎవ్వరూ చూడడం లేదు’ అని అతడు అనుకొంటాడు. కనుక అతడు తన ముఖం కప్పు కొంటాడు.
16 రాత్రి వేళ చీకటిగా ఉన్నప్పుడు దుర్మార్గులు ఇళ్లలో చొరబడతారు.
    కానీ పగటివేళ వారు వారి స్వంత ఇళ్లలో దాగుకొంటారు. వెలుగును వారు తప్పించుకొంటారు.
17 ఆ దుర్మార్గులకు చీకటి ఉదయంలా ఉంటుంది.
    చీకటి దారుణాలకు వారు స్నేహితులు.

18 “కాని వరద నీటిపైనున్న నురగవలె దుర్మార్గులు తీసుకొనిపోబడతారు.
    వారి స్వంత భూమి శపించబడింది. కనుక ద్రాక్షా తోటలలో ద్రాక్షాపండ్లు కోసే పనికి వారు వెళ్లరు.
19 వేడిగా, పొడిగా ఉండే గాలి శీతాకాలపు మంచు నీళ్లను తొలగించి వేస్తుంది.
    అదే విధంగా దుర్మార్గులు కూడా తీసుకొనిపోబడతారు.
20 దుర్మార్గుడు చనిపోయినప్పుడు అతని స్వంత తల్లి సహితం వానిని మరిచిపోతుంది.
    దుర్మార్గుని శరీరాన్ని పురుగులు తినివేస్తాయి.
అతడు ఇంకెంత మాత్రం జ్ఞాపకం చేసుకోబడడు.
    దుర్మార్గులు పడిపోయిన ఒక చెట్టులా నాశనం చేయబడతారు.
21 దుర్మార్గులు గొడ్రాలికి అక్రమాలు చేస్తారు. పిల్లలు లేని స్త్రీని వారు బాధిస్తారు.
    వారు విధవరాలికి దయ చూపెట్టరు.
22 కానీ బలంగల మనుష్యులను నాశనం చేసేందుకు దేవుడు తన శక్తిని ఉపయోగిస్తాడు.
    బలంగల మనుష్యులు శక్తిమంతులవుతారు. కాని వారి స్వంత జీవితాలను గూర్చిన నమ్మకం వారికి లేదు.
23 ఒకవేళ దేవుడు శక్తిగల మనుష్యులను కొద్ది కాలం వరకు క్షేమంగా ఉండనిస్తాడేమో
    కాని దేవుడు వారిని ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటాడు.
24 కొద్ది కాలం పాటు దుర్మార్గులు విజయం సాధిస్తారు. ఆ తరువాత వారు అంతమై పోతారు.
    మనుష్యులందరిలాగే వారూ ఒక చోట చేర్చబడతారు. తర్వాత వారు కోసివేయబడిన ధాన్యపు గింజల్లా మరణిస్తారు.

25 “ఈ విషయాలు సత్యం కాకపోతే,
    నేను అబద్ధం చెప్పానని ఎవరు రుజువు చేయగలరు?
    నా మాటలు వట్టివి అని ఎవరు చెప్పగలరు?”

యోబుకు బిల్దదు జవాబు

25 అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలా జవాబు ఇచ్చాడు:

“దేవుడే పాలకుడు.
    ప్రతి మనిషీ దేవునికి భయపడి గౌరవించాలి.
    దేవుడు తన పరలోక రాజ్యాన్ని శాంతిగా ఉంచుతాడు.
దేవుని దూతలను ఏ మనిషీ లెక్కించలేడు.
    దేవుని సూర్యుడు మనుష్యులందరి మీద ఉదయిస్తాడు.
కానీ దేవుని ఎదుట ఒక మనిషి నిజంగా మంచి వాడుగా ఉండలేడు.
    స్త్రీకి జన్మించిన మనిషి నిజంగా పరిశుద్ధంగా ఉండలేడు.
దేవుని దృష్టికి చంద్రుడు కూడా ప్రకాశంగా ఉండడు.
    దేవుని దృష్టికి నక్షత్రాలు పరిశుద్ధంగా లేవు.
మనిషి అంతకంటే తక్కువ. మనిషి మట్టి పురుగులాంటివాడు.
    పనికి మాలిన పురుగులాంటివాడు!”

బిల్దదుకు యోబు జవాబు

26 అప్పుడు యోబు ఇలా జవాబు ఇచ్చాడు:

“బిల్దదూ, జోఫరూ, ఎలీఫజూ మీరు బలహీనులైన మనుష్యులకు నిజంగా సహాయం చేయగలరు.
    అవును, మీరు నన్ను ప్రోత్సహించారు. బలహీనమైన నా చేతులను మీరు తిరిగి బలం గలవిగా చేసారు.
అవును, జ్ఞానంలేని మనిషికి మీరు అద్భుతమైన సలహా ఇచ్చారు.
    మీరు చాలా జ్ఞానం ప్రదర్శించారు.
ఈ సంగతులు చెప్పటానికి మీకు ఎవరు సహాయం చేశారు.
    ఎవరి ఆత్మ మిమ్మల్ని ప్రేరేపించింది?

“మరణించిన వారి ఆత్మలు
    భూమి కింద నీళ్లలో విలవిల్లాడుతున్నాయి.
మరణ స్థలం దేవుని దృష్టికి బాహాటం.
    దేవునికి మరణం మరుగు కాదు.
ఉత్తర ఆకాశాన్ని శూన్య అంతరిక్షంలో దేవుడు విస్తరింపజేశాడు.
    దేవుడు భూమిని శూన్యంలో వేలాడతీశాడు.
మేఘాలను దేవుడు నీళ్లతో నింపుతున్నాడు.
    కానీ నీటి భారం మూలంగా మేఘాలు బద్దలు కాకుండా దేవుడు చూస్తాడు.
పున్నమి చంద్రుని దేవుడు కప్పివేస్తాడు.
    దేవుడు తన మేఘాలను చంద్రుని మీద విస్తరింపచేసి, దానిని కప్పుతాడు
10 మహా సముద్రం మీది ఆకాశపు అంచులను
    చీకటి వెలుగులకు మధ్య సరిహద్దుగా దేవుడు చేస్తాడు.
11 ఆకాశాలను ఎత్తిపట్టు పునాదులను
    దేవుడు బెదిరించగా అవి భయంతో వణకుతాయి.
12 దేవుని శక్తి సముద్రాన్ని నిశ్శబ్దం చేస్తుంది.
    దేవుని జ్ఞానము రాహాబు సహాయకులను నాశనం చేసింది.
13 దేవుని శ్వాస ఆకాశాలను తేటపరుస్తుంది.
    తప్పించుకోవాలని ప్రయత్నించిన సర్పాన్ని దేవుని హస్తం నాశనం చేస్తుంది.
14 దేవుని శక్తిగల కార్యాల్లో ఇవి కొన్ని మాత్రమే.
    దేవుని నుండి ఒక చిన్న స్వరం మాత్రమే మనం వింటాం. కానీ దేవుడు ఎంత గొప్పవాడో, శక్తిగలవాడో ఏ మనిషి నిజంగా అర్థం చేసుకోలేడు.”

27 అప్పుడు యోబు మాట్లాడటం కొనసాగించాడు:

“నిజంగా దేవుడు జీవిస్తున్నాడు.
మరియు దేవుడు జీవించటం ఎంత సత్యమో ఆయన నాకు అన్యాయం చేశాడు, అనటం కూడ అంతే సత్యం.
    అవును, సర్వశక్తిమంతుడైన దేవుడు నా జీవితాన్ని బాధించాడు.
    కానీ నాలో జీవం ఉన్నంతవరకు దేవుని జీవవాయువు నా నాసికా రంధ్రాలలో ఉన్నంతవరకు,
నా పెదవులు చెడు సంగతులు మాట్లాడవు.
    మరియు నా నాలుక ఎన్నడూ ఒక్క అబద్దం చెప్పదు.
మీదే సరి అని నేను ఎన్నటికీ అంగీకరించను.
    నేను నిర్దోషిని అని నేను చచ్చే రోజువరకు చెబుతూనే ఉంటాను.
నేను చేసిన సరియైన వాటిని నేను గట్టిగా పట్టుకొని ఉంటాను.
    సరియైన వాటిని చేయటం నేను ఎన్నటికీ మాని వేయను. నేను బతికి ఉన్నంత కాలం నా మనస్సాక్షి నన్ను బాధించదు.
ప్రజలు నాకు వ్యతిరేకులయ్యారు.
    నా శత్రువులు దుర్మార్గులు శిక్షించబడినట్లు శిక్షించబడుదురు గాక.
దేవుని లక్ష్యపెట్టని మనిషి చనిపోయినప్పుడు అతనికి ఆశ ఏమీ ఉండదు.
    అతని జీవాన్ని దేవుడు తీసివేసినప్పుడు అతనికి ఆశ లేదు.
ఆ దుర్మార్గునికి కష్టాలు వచ్చి,
    దేవునికి మొరపెడితే దేవుడు వినడు.
10 సర్వశక్తిమంతుడైన దేవుడు ఇచ్చే సంతోషాన్ని ఆ వ్యక్తి కోరుకొని ఉండాల్సింది.
    ఆ వ్యక్తి సదా దేవుని ప్రార్థించి ఉండాల్సింది.

11 “దేవుని శక్తిని గూర్చి నీకు నేను నేర్పిస్తాను.
    సర్వశక్తిమంతుడైన దేవుని పథకాలను నేను దాచి పెట్టను.
12 దేవుని శక్తిని మీరు మీ కళ్లారా చూశారు.
    కనుక మీరు అలాంటి పనికిమాలిన మాటలు ఎందుకు చెబుతారు?
13 దుర్మార్గులకు దేవుడు తలపెట్టినది ఇదే.
    సర్వశక్తిమంతుడైన దేవుని నుండి క్రూర మానవులకు లభించేది ఇదే.
14 ఒకవేళ దుర్మార్గునికి చాలామంది పిల్లలు ఉండవచ్చునేమో కాని వాని పిల్లలు యుద్ధంలో చంపి వేయబడతారు.
    దుర్మార్గుని పిల్లలు తినేందుకు సరిపడినంత ఆహారం ఎన్నడూ ఉండదు.
15 దుర్మార్గుడు చనిపోయిన తర్వాత అతని పిల్లలు ఇంకా బ్రతికి ఉంటే భయంకర రోగం వారిని చంపేస్తుంది.
    అతని కుమారుల విధవలు వారి కోసం విచారించరు.
16 ఒకవేళ దుర్మార్గుడు దుమ్ములా విస్తారమైన వెండిని రాశిగా పోయవచ్చు.
    ఒకవేళ మట్టి పోగుల్లా అతనికి చాలా బట్టలు ఉండవచ్చును.
17 దుర్మార్గుడు సంపాదిస్తూ విడిచిపోయిన బట్టలను ఒక మంచి మనిషి ధరిస్తాడు.
    దుర్మార్గుని వెండిని నిర్దోషులు పంచుకొంటారు.
18 దుర్మార్గుడు నిర్మించే యిల్లు ఎక్కువ కాలం నిలువదు.
    అది సాలె గూడులా ఉంటుంది లేక కావలివాని గుడారంలా ఉంటుంది.
19 దుర్మార్గుడు ధనికునిగా నిద్రకు ఉపక్రమిస్తాడు.
    కానీ ఆ తర్వాత అతను కళ్లు తెరిచినప్పుడు అతని సంపదంతా పోయినట్లు అతనికి తెలుస్తుంది.
20 ఆకస్మిక వరదలా భయాలు అతణ్ణి పట్టుకొంటాయి.
    రాత్రి వేళ ఒక తుఫాను అతణ్ణి కొట్టుకొని పోతుంది.
21 తూర్పుగాలి అతణ్ణి కొట్టుకొని పొతుంది. అప్పుడు అతడు అంతమై పోతాడు.
    తుఫాను అతణ్ణి అతని యింటినుండి తుడుచుకుని పోతుంది.
22 తుఫాను బలం నుండి దుర్మార్గుడు పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు.
    కానీ తుఫాను అతణ్ణి నిర్దాక్షిణ్యంగా కొడుతుంది.
23 దుర్మార్గుడు పారిపోతూ ఉండగా మనుష్యులు చప్పట్లు కొడతారు.
    దుర్మార్గుడు తన యింటినుండి పారిపోతూంటే, వానికి విరోధంగా వాళ్లు ఈల వేస్తారు.”
28 “మనుష్యులకు వెండి లభించే గనులు ఉన్నాయి.
    మనుష్యులు బంగారాన్ని కరిగించి, దానిని శుభ్రం చేసే స్థలాలు ఉన్నాయి.
మనుష్యులు భూమినుండి ఇనుమును తవ్వుతారు.
    బండల నుండి రాగి కరిగించబడుతుంది.
పనివాళ్లు గుహల్లోకి దీపం తీసుకొని వస్తారు.
    ఆ గుహల్లో లోపలికి వారు వెదుకుతారు. లోపలి చీకటిలో బండల కోసం వారు వెదుకుతారు.
మనుష్యులు నివసించే చోటికి దూరంగా పనివాళ్లు గోతులు తవ్వుతారు.
    మరి ఏ మనిషీ కూడ గోతులను ఎన్నడూ తాకలేదు.
    పనివాడు లోతైన ఆ గోతుల్లోనికి తాళ్లతో దిగేటప్పుడు అతడు యితరులకు చాలా దూరంలో ఉంటాడు.
భూమిపై నుండి ఆహారం వస్తుంది.
    కానీ భూమి క్రింద, వస్తువులను మంట మార్చివేసినట్టు,
    అది మార్చివేయబడుతుంది.
నేలక్రింద బండలలో నీల రత్నాలు లభ్యమవుతాయి.
    నేల కింద మట్టిలో బంగారం ఉంది.
ఆహారం కోసం జంతువులను తినే పక్షులకు భూమికింద మార్గాలు తెలియవు.
    డేగ కూడా ఈ మార్గం చూడదు.
క్రూర మృగాలు ఈ మార్గంలో నడవలేదు.
    సింహాలు ఈ మార్గంలో పయనించలేదు.
పనివాళ్లు కఠిన శిలలను తవ్వుతారు.
    ఆ పనివాళ్లు పర్వతాలను తవ్వి, వాటిని ఖాళీ చేస్తారు.
10 పనివాళ్లు బండల్లోనుంచి సొరంగాలు తవ్వుతారు.
    బండల్లోని ఐశ్వర్యాలు అన్నింటినీ వాళ్లు చూస్తారు.
11 నీళ్లు ప్రవహించకుండా నిలిపేందుకు పనివాళ్లు ఆన కట్టలు కడతారు.
    దాగి ఉన్న వాటిని వారు వెలుగు లోనికి తీసికొని వస్తారు.

12 “అయితే మనిషికి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది?
    గ్రహించటం ఎలా అనేది నేర్చుకొనేందుకు మనం ఎక్కడికి వెళ్లాలి?
13 జ్ఞానం చాలా అమూల్యమయిందని మనుష్యులు గ్రహించరు.
    భూమి మీద నివసించే మనుష్యులకు జ్ఞానం లేదు.
14 ‘జ్ఞానం నాలో లేదు’ అని అగాధ మహాసముద్రం అంటుంది.
    ‘జ్ఞానం నా దగ్గరా లేదు’ అని సముద్రం అంటుంది.
15 అతి ఖరీదైన బంగారంతో జ్ఞానం కొనలేము.
    జ్ఞానం ఖరీదు వెండితో లెక్క కట్టబడజాలదు.
16 ఓఫీరు బంగారంతో గాని, విలువైన గోమేధికంతోగాని,
    నీలంతో గాని, అది కొనబడేది కాదు.
17 బంగారం, స్ఫటికం కంటే జ్ఞానం విలువైనది.
    బంగారంతో చేయబడిన చాలా ఖరీదైన నగలతో జ్ఞానం కొనబడజాలదు.
18 జ్ఞానం పగడాలకంటె, పచ్చలకంటె విలువగలది.
    జ్ఞానం కెంపులకంటె ఖరీదైనది.
19 ఇథియోపియా (కూషు)దేశపు పుష్యరాగం జ్ఞానం కంటె విలువైనది కాదు.
    మేలిమి బంగారంతో మీరు జ్ఞానమును కొనలేరు.

20 “అలాగైతే జ్ఞానం కనుగొనాలంటే మనం ఎక్కడికి వెళ్లాలి?
    అవగాహన చేసికోవటం నేర్చుకొనేందుకు మనం ఎక్కడికి వెళ్లాలి?
21 భూమి మీద ప్రతి మనిషి నుండీ జ్ఞానం దాచబడింది.
    ఎత్తుగా ఆకాశంలో ఉన్న పక్షులు కూడా జ్ఞానాన్ని చూడలేవు.
22 ‘మేము జ్ఞానమును గూర్చిన ప్రచారం మాత్రమే విన్నాం’
    అని మరణం, నాశనం చెబుతాయి.

23 “కానీ జ్ఞానానికి మార్గం దేవునికి మాత్రమే తెలుసు.
    జ్ఞానం ఎక్కడ నివసిస్తుందో దేవునికి తెలుసు.
24 భూదిగంతాలకు గల మొత్తం మార్గాన్ని దేవుడు చూస్తాడు గనుక ఆయనకు జ్ఞానం తెలుసు.
    ఆకాశాల క్రింద ఉన్న సర్వాన్ని దేవుడే చూస్తాడు.
25 గాలికి దాని శక్తిని దేవుడు ఇచ్చినప్పుడు,
    మహా సముద్రాలు ఎంత పెద్దవిగా ఉండాలో ఆయన నిర్ణయించినప్పుడు,
26 వర్షాన్ని ఎక్కడ కురిపించాలి,
    ఉరుములు తుఫానులు ఎటువైపుగా వెళ్లాలి అని దేవుడు నిర్ణయించినప్పుడు
27 అది దేవుడు జ్ఞానాన్ని చూచిన సమయం, జ్ఞానం యొక్క విలువ ఎంతో చూచేందుకు
    దానిని పరీక్షించిన సమయం అవుతుంది.
    జ్ఞానాన్ని దేవుడు నిర్ధారణ చేశాడు.
28 ‘యెహోవాకు భయపడి, ఆయనను గౌరవించటం జ్ఞానం అవుతుంది.
    చెడు సంగతుల నుండి తప్పుకోవటం అవగాహన అవుతుంది’”
అని దేవుడు ప్రజలతో చెప్పాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International