Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యోబు 21-23

యోబు జవాబు

21 అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు:

“నేను చెప్పేది వినండి.
    మీరు వినటమే మీరు నాకు ఇచ్చే ఆదరణ.
నేను మాట్లాడేటప్పుడు ఓపిగ్గా ఉండండి.
    ఆ తర్వాత నేను మాట్లాడటం ముగించాక మీరు నన్ను గేళి చేయవచ్చు.

“నేను మనుష్యుల మీద ఆరోపణ చేయటం లేదు.
    నేను ఓపికగా ఉండకపోవటానికి ఒక మంచి కారణం ఉంది.
నన్ను చూచి, అదరిపొండి.
    మీ నోటిమీద చేయి పెట్టుకొని అదురుతో నన్ను అలానే తేరి చూడండి.
నాకు సంభవించిన దానిని గూర్చి
    తలచినప్పుడు నేను భయపడతాను, నా శరీరం వణకుతుంది.
దుర్మార్గులు చాలాకాలం బ్రతుకుతారెందుకు?
    వారు ముసలివాళ్లవ్వటం, విజయం పొందటం ఎందుకు?
దుర్మార్గులు వారితోబాటు వారి పిల్లలు ఎదగటం చూస్తారు.
    దుర్మార్గులు వారి మనుమలు, మనుమరాండ్రను చూసేంత వరకు బ్రతుకుతారు.
వారి ఇండ్లు భద్రంగా ఉన్నాయి. వారికి భయం లేదు.
    దుర్మార్గులను శిక్షించడానికి దేవుడు తన దండం ఉపయోగించడు.
10 వారి ఆబోతులు ఆవులను దాటటం తప్పవు.
    వారి ఆవులకు దూడలు పుడతాయి.
    ఆ దూడలు పుట్టినప్పుడు అవి ఎన్నడూ చావవు.
11 దుర్మార్గులు వారి పిల్లలు ఆడుకొనేందుకు గొర్రె పిల్లల్లా బయటకు పంపిస్తారు.
    వారి పిల్లలు గంతులు వేస్తారు.
12 స్వరమండలాలు, పిల్లనగ్రోవుల ధ్వనులతోబాటు వారి పిల్లలు పాడుతూ, నాట్యం చేస్తారు.
13 దుర్మార్గులు వారి జీవితకాలంలో విజయం అనుభవిస్తారు.
    అనగా వారు మరణించి, శ్రమ అనుభవించకుండానే తమ సమాధికి వెళ్తారు.
14 కానీ దుర్మార్గులు, దేవునితో ఇలా చెబుతారు, ‘మమ్మల్ని ఇలా విడిచిపెట్టండి,
    మేము ఏమి చేయాలని మీరు కోరుతారో అది మాకు లెక్కలేదు’ అంటారు.
15 మరియు దుర్మార్గులు, ‘సర్వశక్తిమంతుడైన దేవుడు ఎవరు?
    మేము ఆయనను సేవించాల్సిన అవసరం లేదు.
    ఆయనకు ప్రార్థన చేసిన లాభం లేదు’ అంటారు.

16 “దుర్మార్గులు తమ మూలంగానే వారికి విజయం కలుగుతుందని తలస్తారు.
    కానీ నేను వారి తలంపును అంగీకరించను.
17 అయితే దుర్మార్గుల దీపం ఆర్పివేయబడటం అనేది, ఎంత తరచుగా జరుగుతుంది?
    దుర్మార్గులకు ఎన్నిసార్లు కష్టం వస్తుంది?
    దేవుడు వారి మీద కోపగించి వారిని శిక్షిస్తాడా?
18 గాలి గడ్డిని ఎగురగొట్టినట్టు, బలమైన గాలి ఊకను ఎగురగొట్టినట్లు
    దేవుడు దుర్మార్గులను ఎగురగొట్టి వేస్తాడా?
19 ‘తండ్రి పాపాల మూలంగా దేవుడు అతని కుమారుణ్ణి శిక్షిస్తాడు’ అని మీరంటారు.
    కాదు! ఆ దుర్మార్గుడినే దేవుడు శిక్షించనివ్వండి. అప్పుడు ఆ దుర్మార్గుడు తన స్వంత పాపాల కోసమే శిక్షించబడుతున్నట్టు అతనికి తెలుస్తుంది.
20 పాపి తన స్వంత శిక్షను చూడాలి.
    సర్వశక్తిమంతుడైన దేవుని కోపాన్ని అతడు అనుభవిస్తాడు.
21 దుర్మార్గుని జీవిత కాలం అయిపోయి, అతడు చనిపోయినప్పుడు
    అతడు విడిచిపెడుతున్న తన కుటుంబం విషయమై అతడు లెక్కచేయడు.

22 “దేవునికి ఎవరూ జ్ఞానం ఉపదేశించలేరు.
    ఉన్నత స్థానాల్లో ఉండే మనుష్యులకు కూడ దేవుడు తీర్పు తీరుస్తాడు.
23 ఒక వ్యక్తి నిండుగా, విజయవంతంగా జీవించాక మరణిస్తాడు.
    అతడు పూర్తిగా క్షేమం, సుఖం ఉన్న జీవితం జీవించాడు.
24 అతని శరీరం బాగా పోషించబడింది,
    అతని ఎముకలు మూలుగతో యింకా బలంగా ఉన్నాయి
25 అయితే మరో మనిషి కష్టతరంగా జీవించి, వేదనగల ఆత్మతో మరణిస్తాడు.
    అతడు మంచిది ఎన్నడూ, ఏదీ అనుభవించలేదు.
26 వీళ్లద్దరూ ఒకే చోట దుమ్ములో పండుకొని ఉంటారు.
    వాళ్లిద్దర్నీ పురుగులు పట్టేస్తాయి.

27 “కానీ మీరు ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు.
    మరియు మీరు నాకు అపకారం చేయాలని తలపెడుతున్నారని నాకు తెలుసు.
28 ‘యువరాజు ఇల్లు ఎక్కడ?
    దుర్మార్గుడు నివసించిన ఆ ఇల్లు ఏది?’ అని మీరు అంటారు.

29 “కానీ ప్రయాణం చేసే మనుష్యులను మీరు ఎన్నడూ అడగలేదు.
    వారి కథలను మీరు అంగీకరించనూ లేదు.
30 విపత్తు కలిగినప్పుడు దుర్మార్గులు వదలిపెట్టబడతారు.
    ఏ రోజు దేవుడు కోపంతో శిక్షిస్తాడో ఆ రోజు వాళ్లు రక్షింపబడతారు.
31 దుర్మార్గుడు చేసిన దుర్మార్గాన్ని గూర్చి దుర్మార్గుని ముఖంమీదే అతణ్ణి విమర్శించే వ్యక్తి ఎవ్వడూ లేడు.
    అతడు చేసిన కీడుకు అతనిని ఎవ్వరూ శిక్షించరు.
32 దుర్మార్గుడు సమాధికి మోసికొని పోబడినప్పుడు
    ఒక కాపలావాడు అతని సమాధి దగ్గర నిలుస్తాడు.
33 ఆ దుర్మార్గునికి లోయలోని మట్టి తియ్యగా ఉంటుంది.
    వాని చావు ఊరేగింపులో వేలాది మంది ఉంటారు.

34 “అందుచేత మీ వట్టి మాటలతో మీరు నన్ను ఆదరించలేరు.
    మీ జవాబులు ఇంకా అబద్ధాలే!”

ఎలీఫజు జవాబు

22 అప్పుడు తేమానువాడైన ఎలీఫజు జవాబు యిచ్చాడు:

“దేవునికి నరుడు ఉపకారికాగలడా?
    జ్ఞానం గల వ్యక్తి తప్పక తనకు తానే ఉపయోగికారిగా వుంటాడు.
ఒకవేళ నీవు సక్రమమయినదే చేసినప్పటికీ,
    సర్వ శక్తిమంతుడైన దేవునికి అది సంతోషం కలిగించదు. నీవు ఎల్లప్పుడూ మంచివాడివిగానే వున్నా దేవునికి ఏమీ లాభంలేదు.
యోబూ, దేవుడు నిన్ను శిక్షించినది
    ఆయనను నీవు ఆరాధించినందుకా?
కాదు, అది నీవు విస్తారంగా పాపం చేసినందువల్లనే.
    యోబూ, నీ పాపాలు ఎప్పటికీ నిలిచిపోవు.
యోబూ, నీ సోదరులు నీకు ఋణపడి ఉన్న ధనాన్ని నీకు తిరిగి చెల్లించేందుకు నీవు వారిని బలవంతం చేశావు.
    అది కారణం లేకుండా నీవు చేశావు. ప్రజల దగ్గర్నుండి వస్త్రాలు నీవు లాగేసు కొని, వారు ధరించటానికి ఏమీ లేకుండా చేశావు.
అలసిపోయిన మనుష్యులకు నీవు నీళ్లు ఇవ్వలేదు.
    ఆకలిగొన్న మనుష్యులకు నీవు అన్నం పెట్టలేదు.
యోబూ! నీవు అధికారం, ఐశ్వర్యం గలవాడవైనప్పటికీ నీవు ఆ ప్రజలకు సహాయం చేయలేదు.
    నీకు చాలా భూమి ఉంది, నీవు చాలా గౌరవం పొందినవాడవు.
కాని విధవలకు నీవు ఏమీ ఇవ్వకుండానే వారిని పంపించివేశావు.
    యోబూ! అనాధ పిల్లలను నీవు దోచుకొని నీవు వారి యెడల చెడుగా ప్రవర్తించావు.
10 అందుకే నీ చుట్టూరా బోనులు ఉన్నాయి.
    మరియు ఆకస్మిక కష్టం నిన్ను భయపెడుతుంది.
11 అందుకే నీవు చూడలేనంత కటిక చీకటిగా ఉంది.
    మరియు అందుకే నీళ్ల ప్రవాహం నిన్ను కప్పేస్తుంది.

12 “ఆకాశంలో అతి ఉన్నత స్థానంలో దేవుడు నివసిస్తాడు.
    మహా ఎత్తయిన నక్షత్రాలను దేవుడు వంగి కిందికి చూస్తాడు. నక్షత్రాలు ఎంత ఎత్తుగా ఉన్నాయో నీవు చూడగలవు.
13 కాని యోబూ, నీవు, ‘దేవునికి ఏమీ తెలియదు!
    అంధకార మేఘాల్లోంచి దేవుడు మాకు ఎలా తీర్పు తీరుస్తాడు?
14 ఆయన ఆకాశపు అత్యున్నత స్థానంలో నడిచేటప్పుడు
    మనం చూడకుండా మేఘాలు ఆయనను కప్పివేస్తాయి.’ అని అంటావు.

15 “యోబూ! దుర్మార్గులు తిరిగే పాత మార్గంలోనే
    నీవు నడుస్తున్నావు.
16 దుర్మార్గులు మరణించాల్సిన సమయం రాకముందే వారు తీసుకోబడ్డారు.
    ఒక వరదలో వారు కొట్టుకొని పోయారు.
17 ‘మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టండి.
    సర్వశక్తిమంతుడైన దేవుడు మాకు ఏమీ చేయలేదు’
    అని దేవునితో చెప్పేవాళ్లు ఆ మనుష్యులే.
18 కానీ ఆ మనుష్యులనే దేవుడు విజయం పొందిన ధనికులుగా చేశాడు.
    దుర్మార్గులు తలచే పద్ధతి నేను అంగీకరించలేను.
19 దుర్మార్గులు నాశనం అయినప్పుడు మంచివాళ్లు చూచి సంతోషిస్తారు.
    నిర్దోషులు దుర్మార్గులను చూచి నవ్వుతూ.
20 ‘మన శత్రువులు నిజంగా నాశనం చేయబడ్డారు.
    వారి ఐశ్వర్యాలను అగ్ని కాల్చేస్తుంది’ అని అంటారు.

21 “యోబూ, నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. అప్పుడు నీకు ఆయనతో శాంతి ఉంటుంది.
    ఇలా నీవు చేస్తే, నీవు ధన్యుడవవుతూ, విజయం పొందుతావు.
22 ఈ ఉపదేశము స్వీకరించి
    ఆయన మాటలు నీ హృదయంలో భద్రం చేసుకో.
23 యోబూ! సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గరకు నీవు తిరిగి వస్తే, నీకు మరల మామూలు స్థితి ఇవ్వబడుతుంది.
    నీవు మాత్రం దుర్మార్గాన్ని నీ ఇంటినుండి దూరంగా తొలగించి వేయాలి.
24 నీ బంగారాన్ని నీవు మట్టిపాలు చేయాలి,
    ఓఫీరునుండి తెచ్చిన నీ బంగారాన్ని నదుల్లోని బండలకేసి విసిరికొట్టు.
25 సర్వశక్తిమంతుడైన దేవుడే నీకు బంగారంగాను,
    వెండిగాను ఉండనియ్యి.
26 అప్పుడు నీవు ఎంతో సంతోషిస్తావు. సర్వశక్తిమంతుడైన దేవునిలో ఆనందం కనుగొంటావు.
    నీవు నీ ముఖాన్ని దేవుని వైపు ఎత్తగలవు.
27 నీవు ఆయనను ప్రార్థించినప్పుడు ఆయన నీ ప్రార్థన వింటాడు.
    నీవు ఏం చేస్తానని ఆయనకు ప్రమాణం చేస్తావో దానిని నీవు చేస్తావు.
28 నీవు చేసే ప్రతి దానిలో విజయం పొందుతావు.
    నీ త్రోవలో వెలుగు ప్రకాశిస్తుంది
29 గర్విష్ఠులను దేవుడు సిగ్గు పరుస్తాడు
    కానీ దీనులను దేవుడు రక్షిస్తాడు.
30 నిర్దోషి కాని మనిషిని కూడా దేవుడు రక్షిస్తాడు.
    నీ చేతుల పవిత్రత మూలంగా అతడు రక్షించబడతాడు.”

యోబు జవాబు

23 అప్పుడు యోబు ఇలా జవాబు ఇచ్చాడు:

“ఈవేళ నేను ఇంకా కోపంగా ఆరోపిస్తూనే ఉన్నాను.
    దేవుడు నన్ను కఠినంగా శిక్షిస్తున్నాడు, కనుక నేను ఆరోపిస్తూనే ఉంటాను.
దేవునిని ఎక్కడ వెదకాలో
    ఆయన యొద్దకు ఎలా వెళ్లాలో నాకు తెలిస్తే బాగుండేది, అని నా ఆశ.
నేను దేవునికి నా గాధ వివరించుకొంటాను.
    నేను నిర్దోషిని అని చూపించటంకోసం నా నోరు వాదాలతో నిండిపోతుంది.
నా వాదాలకు దేవుడు ఎలా జవాబు ఇస్తాడో నేను తెలిసికోవాలని కోరుతున్నాను.
    అప్పుడు నేను దేవుని జవాబులు గ్రహిస్తాను.
దేవుడు గొప్ప శక్తితో నాకు విరోధంగా ఉంటాడా?
    లేదు, ఆయన నా మాట వింటాడు!
అక్కడ, దేవుని యెదుట ఒక మంచి మనిషి తన గాధను దేవునికి వివరించవచ్చును.
    అప్పుడు నా న్యాయమూర్తి నన్ను విముక్తుణ్ణి చేయవచ్చును.

“కానీ నేను తూర్పుకు వెళ్తే దేవుడు అక్కడ లేడు.
    ఒకవేళ నేను పడమటికి వెళ్తే ఇంకా దేవుడు నాకు కనబడలేదు.
దేవుడు ఉత్తరాన పని చేస్తున్నప్పుడు నాకు ఆయన కనబడడు.
    దేవుడు దక్షిణంగా తిరిగినప్పుడు ఇంకా ఆయన నాకు కనబడడు.
10 కానీ నేను వేసే ప్రతి అడుగూ దేవునికి తెలుసు.
    ఆయన నన్ను పరీక్షించటం ముగించినప్పుడు నాలో మైల ఏమీ లేనట్టుగా ఆయన చూస్తాడు. నేను స్వచ్ఛమైన బంగారంలా ఉన్నట్టు ఆయన చూస్తాడు.
11 నేను ఎల్లప్పుడూ దేవుడు కోరిన మార్గంలోనే నడిచాను.
    దేవుని మార్గం అనుసరించకుండా నేను ఎన్నడూ తిరిగిపోలేదు.
12 దేవుడు ఆజ్ఞాపించే వాటినే నేను ఎల్లప్పుడూ చేస్తాను.
    నా భోజనం కంటే దేవుని నోటినుండి వచ్చే మాటలు నాకు ఇష్టం.

13 “కానీ దేవుడు ఎన్నటికీ మారడు.
    ఏ మనిషి ఆయనకు విరోధంగా నిలబడలేడు.
    దేవుడు అనుకొన్నది ఆయన చేస్తాడు.
14 దేవుడు నాకు వ్యతిరేకంగా ఏమి పథకం వేశాడో దాన్ని ఆయన చేస్తాడు.
    నా కోసం ఆయనకు ఇంకా ఎన్నో పథకాలు ఉన్నాయి.
15 అందుకే నేను దేవుని ఎదుట జీవిస్తూ ఉండగా నేను భయపడతాను.
    వీటన్నింటిని గూర్చీ నేను తలచినప్పుడు దేవునికి నేను భయపడతాను.
16 దేవుడు నా హృదయాన్ని బలహీనం చేస్తాడు.
    నేనేమో నా ధైర్యం కోల్పోతాను. సర్వశక్తిమంతుడైన దేవుడు నన్ను భయపెడతాడు.
17 కానీ చీకటి నన్ను మౌనంగా ఉండేటట్టు చేయదు.
    గాఢాంధకారం నా ముఖాన్ని కప్పేస్తుంది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International