Chronological
17 “నా ఆత్మ భగ్నమై పోయింది.
విడిచి పెట్టే సేందుకు నేను సిద్ధం.
నా జీవితం దాదాపు గతించిపోయింది,
సమాధి నాకోసం నిరీక్షిస్తోంది.
2 మనుష్యులు నా చుట్టూరా నిలిచి నన్ను చూసి నవ్వుతున్నారు.
వారు నన్ను ఆట పట్టిస్తూ అవమానిస్తూ ఉంటే నేను వారిని గమనిస్తున్నాను.
3 “దేవా, నీవు నన్ను (యోబు) నిజంగా బలపరుస్తున్నావని చూపించు,
మరి ఎవ్వరూ నన్ను బలపరచరు.
4 నా స్నేహితుల మనస్సులను నీవు బంధించేశావు,
కనుక వారు నన్ను అర్థం చేసుకోరు.
దయచేసి వారిని జయించనీయకు.
5 ‘ఒకడు[a] తన స్వంత పిల్లలను నిర్లక్ష్యం చేసి తన స్నేహితులకు సహాయం చేస్తాడు
అని ప్రజలు చెబుతారని నీకు తెలుసా?’
కాని ఇప్పుడు నా స్నేహితులే నాకు విరోధం అయ్యారు.
6 దేవుడు నా పేరును (యోబు) ప్రతి ఒక్కరికీ ఒక చెడ్డ పదంగా చేశాడు.
ప్రజలు నా ముఖం మీద ఉమ్మి వేస్తారు.
7 నేను చాలా బాధపడుతూ, చాలా విచారంగా ఉన్నాను, కనుక నా కన్నులు దాదాపు గుడ్డివి అయ్యాయి.
నా మొత్తం శరీరం ఒక నీడలా చాలా సన్నం అయ్యింది.
8 మంచి మనుష్యులు దీని విషయమై కలవరపడుతున్నారు.
దేవుని గూర్చి లక్ష్యపెట్టని ప్రజల విషయమై నిర్దోషులు కలవరపడుతున్నారు.
9 కాని నీతిమంతులు వాళ్ల పద్ధతులనే చేపడతారు.
నిర్దోషులు మరింత బలవంతులవుతారు.
10 “కానీ రండి, మీరంతా కలసి, మొత్తం తప్పు నాదే అని నాకు చూపించడానికి మరల ప్రయత్నం చేయండి.
మీలో ఎవరూ జ్ఞానం గలవారు కారు.
11 నా జీవితం గతించి పోతోంది. నా ఆలోచనలన్నీ నాశనం చేయబడ్డాయి.
నా ఆశ అడుగంటింది.
12 కాని నా స్నేహితులు రాత్రిని పగలు అనుకొంటారు.
చీకటి పడినప్పుడు వెలుగు వస్తోంది, అని వారు అంటారు.
13 “నేను కనిపెడుతున్న ఒకే గృహం కనుక పాతాళం
అయితే, అంధకార సమాధిలో నేను నా పడక వేసుకొంటే
14 సమాధిని చూచి, ‘నీవు నా తండ్రివి అని’
పురుగులను చూసి, ‘నా తల్లివి’ లేక ‘నా సోదరివి’ అని నేను చెప్పవచ్చు
15 కాని అదే నాకు ఆశ అయితే నాకు ఎలాంటి ఆశలేదు.
మరియు ప్రజలు నాయందు ఏ ఆశ చూడలేరు.
16 (నా ఆశ నాతోనే చనిపోతుందా?) అది నేను చనిపోయే స్థలంయొక్క లోతుల్లోకి వెళ్తుందా?
మనమంతా చేరి బురదలోకి వెళ్తామా?”
యోబుకు బిల్దదు జవాబు
18 అప్పుడు షూహీ దేశస్తుడైన బిల్దదు యోబుకు ఇలా జవాబు చెప్పాడు:
2 “యోబూ! ఈ మాటలన్నీ ఎప్పుడు చాలిస్తావు?
నీవు మౌనంగా ఉండి వినాలి. అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు
3 మేము పశువుల్లా బుద్ధిహీనులం అని నీవు ఎందుకు తలస్తావు?
4 యోబూ! నీ కోపంతో నీకు నీవే హాని చేసుకొంటున్నావు.
కేవలం నీ కోసం మనుష్యులు ఈ భూమిని విడిచిపోవాలా?
కేవలం నిన్ను తృప్తి పరచటం కోసం దేవుడు పర్వతాలను కదిపిస్తాడని నీవు తలస్తున్నావా?
5 “అవును నిజమే, దుర్మార్గుని దీపం ఆరిపోతుంది.
అతని అగ్ని కాలకుండా ఆగిపోతుంది.
6 అతని ఇంటిలోని వెలుగు చీకటి అవుతుంది.
అతని ప్రక్కగా ఉన్న దీపం ఆరిపోతుంది.
7 ఆ మనిషి అడుగులు మరల గట్టిగా, వేగంగా ఉండవు. కానీ అతడు నిధానంగా నడుస్తాడు, బలహీనంగా ఉంటాడు.
అతని స్వంత దుర్మార్గపు ఆలోచనలే అతడు పడిపోయేట్టు చేస్తాయి.
8 అతని స్వంత పాదాలే అతనిని వలలో పడదోస్తాయి.
అతడు బోనులోనికి నడచి, అందులో చిక్కుకొంటాడు.
9 ఒక బోను అతని మడిమెను పట్టేస్తుంది.
ఒక బోను అతన్ని గట్టిగా బంధిస్తుంది.
10 అతని కోసం నేలమీద ఒక తాడు దాచబడి ఉంటుంది.
అతని తోవలో ఒక బోను సిద్ధంగా ఉంది.
11 అతని చుట్టూరా భయం పొంచి ఉంది.
అతడు వేసే ప్రతి అడుగు వెనుక భయం ఉంటుంది.
12 చెడ్డ కష్టాలు అతని కోసం ఆకలితో వున్నాయి.
అతడు పడిపోయినప్పుడు పతనం, నాశనం అతని కోసం సిద్ధంగా ఉన్నాయి.
13 భయంకర రోగం అతని చర్మంలో కొన్ని భాగాలను తినివేస్తుంది.
అది అతని చేతులను, కాళ్లను కుళ్లిపోచేస్తుంది.
14 దుర్మార్గుడు క్షేమంగా ఉన్న తన ఇంటిలో నుండి తీసుకొని పోబడతాడు.
భయాన రాజును ఎదుర్కొనేందుకు అతడు నడిపించబడతాడు.
15 అతనికి తన ఇంటిలో ఏమీ విడిచిపెట్టబడదు.
ఎందుకంటే అతని ఇంటినిండా, మండుతున్న గంధకం చల్లబడుతుంది.
16 క్రింద అతని వేర్లు ఎండిపోతాయి.
పైన అతని కొమ్మలు చస్తాయి.
17 భూమి మీద మనుష్యులు అతనిని జ్ఞాపకం చేసుకోరు.
ఏ వ్యక్తికూడ అతన్ని ఇంకెంత మాత్రం జ్ఞాపకం చేసుకోడు.
18 మనుష్యులు అతనిని వెలుతురు నుండి నెట్టివేస్తారు.
అతడు చీకటిలోనికి శిక్షించబడతాడు.
వారు అతన్నిలోకంలో నుండి తరిమివేస్తారు.
19 అతనికి పిల్లలు లేక మనుమలు ఎవ్వరూ ఉండరు.
అతని కుమారుల నుండి వారసులు ఉండరు.
అతనియింట యింకా సజీవంగా ఉండే మనుష్యులు ఎవ్వరూ ఉండరు.
20 దుర్మార్గునికి సంభవించిన దానిని గూర్చి విన్నప్పుడు పడమట ఉన్న ప్రజలు అదిరిపోతారు.
తూర్పున ఉన్న ప్రజలు భయంతో మెత్తబడి పోతారు.
21 ఇది నిజం, దుర్మార్గునికి, అతని ఇంటికి ఇలాగే జరుగుతుంది.
దేవుని గూర్చి లక్ష్యపెట్టని వానికి ఇలాగే జరుగుతుంది!”
యోబు జవాబు
19 అప్పుడు యోబు ఇలా జవాబు చెప్పాడు:
2 “ఎంతకాలం మీరు నన్ను బాధిస్తారు;
మాటలతో నన్ను నలుగగొడతారు?
3 ఇప్పటికి మీరు నన్ను పదిసార్లు అవమానించారు.
మీరు నా మీద దాడి చేసేటప్పడు ఎలాంటి సిగ్గూ ఉండదు మీకు.
4 ఒకవేళ నేను పాపం చేసినా,
అది నా సమస్య అది మిమ్మల్ని బాధించదు.
5 మీరు కేవలం నా కంటే మంచివాళ్లలా చూపించుకోవాలని కోరుతున్నారు.
నా కష్టాలకు కారణం నా తప్పు మాత్రమే అని మీరు అంటారు.
6 కానీ నాకు అపకారం చేసినవాడు దేవుడు.
ఆయన నన్ను పట్టుకోవటానికి తన వలను నా చుట్టూరా వేశాడు.
7 ‘నాకు అపకారం జరిగింది.’ అని నేను కేకలు వేస్తాను.
నాకు జవాబు ఏమీ రాదు. సహాయం కోసం నేను గట్టిగా కేకలు వేసినా న్యాయం కోసమైనా నా మొర ఎవరూ వినరు.
8 నేను ముందుకు వెళ్లలేకుండా దేవుడు నా మార్గం మూసివేశాడు.
నా త్రోవను ఆయన చీకట్లో దాచి పెట్టేశాడు.
9 నా ఐశ్వర్యాన్ని దేవుడు తీసివేసుకొన్నాడు.
నా తలమీద కిరీటాన్ని ఆయన తీసివేసుకొన్నాడు.
10 నేను చచ్చేంతవరకు నన్ను ఈ ప్రక్క నుండి ఆ ప్రక్కవరకు దేవుడు విరుగగొడతాడు.
ఒక చెట్టుదాని వేళ్లతో సహా పెల్లగించబడ్డట్టు ఆయన నా ఆశ తీసివేస్తాడు
11 దేవుని కోపం నాకు వ్యతిరేకంగా మండుతుంది.
ఆయన నన్ను తన శత్రువు అని పిలుస్తున్నాడు.
12 నా మీద దాడి చేసేందుకు దేవుడు తన సైన్యాన్ని పంపుతాడు.
వారు నా చుట్టూరా దుర్గాలు నిర్మిస్తారు.
నా గుడారం చుట్టూరా వారు బసచేస్తారు.
13 “నా సోదరులు నన్ను ద్వేషించేటట్టు దేవుడు చేశాడు.
నా స్నేహితులందరికీ నేను పరాయివాడను.
14 నా బంధువులు నన్ను విడిచిపెట్టేశారు.
నా స్నేహితులు నన్ను మరచిపోయారు.
15 నా ఇంట్లో అతిధులు, పనికత్తెలు
నేనేదో పరాయివాడిలా, విదేశీయునిలా నన్ను చూస్తారు.
16 నేను నా సేవకుని పిలిస్తే వాడు జవాబివ్వడు.
సహాయం కోసం నేను బతిమలాడినా నా సేవకుడు జవాబు ఇవ్వడు.
17 నా శ్వాస వాసన అంటే నా బార్యకు అసహ్యం.
నా స్వంత సోదరులు నన్ను ద్వేషిస్తారు.
18 చిన్న పిల్లలు కూడా నన్ను గేళి చేస్తారు.
నేను వాళ్ల దగ్గరకు వస్తే వాళ్లు నాకు విరోధంగా చెడు సంగతులు మాట్లాడుతారు.
19 నాకు సన్నిహితమైన స్నేహితులు అందరూ నన్ను అనహ్యించుకొంటారు.
చివరికి నేను ప్రేమించే మనుష్యులు కూడా నాకు విరోధులయ్యారు.
20 “నేను ఎంత సన్నగా ఉన్నానంటే నా ఎముకల మీద నా చర్మం వ్రేలాడుతూ ఉంది.
నాలో నాకు కొద్దిపాటి ప్రాణం మాత్రమే మిగిలి ఉంది.
21 “నాపై దయ చూపండి, నా స్నేహితులారా, నాపై దయ చూపండి.
దేవుని హస్తం నాకు విరోధంగావుంది.
22 దేవుడు చేసినట్టు, మీరు ఎందుకు నన్ను హింసిస్తారు?
నన్ను బాధించి మీరెందుకు ఎన్నడూ తృప్తి చెందటం లేదు?
23 “నేను (యోబు) చెప్పేది ఎవరో ఒకరు జ్ఞాపకం ఉంచుకొని, ఒక గ్రంథంలో వ్రాస్తే బాగుంటుందని నా ఆశ.
నేను చెప్పే మాటలు ఒక గ్రంథపు చుట్టలో వ్రాయబడాలని నా ఆశ.
24 నేను చెప్పే మాటలు శాశ్వతంగా ఉండేటట్టు సీసంమీద ఇనుప పోగరతో చెక్కబడాలని
లేదా ఒక బండమీద వ్రాయబడాలని నా ఆశ.
25 నన్ను ఆదుకొనేవారు ఎవరో ఒకరు ఉన్నారని నాకు తెలుసు.
అంతంలో ఆయన నా పక్షంగా నిలబడతాడని నాకు తెలుసు.
26 నేను ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత నా చర్మం పాడైపోయిన తర్వాత కూడా
నేను దేవుణ్ణి చూస్తానని నాకు తెలుసు.
27 నా స్వంత కళ్లతో నేను దేవుణ్ణి చూస్తాను.
సాక్షాత్తూ దేవుణ్ణే, ఇంకెవరినీ కాదు.
నాలో నా హృదయం బలహీనం అవుతోంది.
28 “ఒకవేళ మీరు, ‘మనం యోబును ఇబ్బంది పెడ్దాం,
అతణ్ణి నిందించటానికి ఏదైనా కారణం వెదుకుదాం’ అనుకొవచ్చును.
29 కానీ మీ మట్టుకు మీరే ఖడ్గానికి భయపడాలి. ఎందుకంటే, పాపంమీద దేవుని కోపం శిక్షను రప్పిస్తుంది.
మిమ్మల్ని శిక్షించేందుకు యెహోవా ఖడ్గం ప్రయోగిస్తాడు.
అప్పుడు తీర్పు ఉంది అని మీరు తెలుసుకొంటారు.”
జోఫరు జవాబు
20 అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలా జవాబిచ్చాడు:
2 “యోబూ! నా తలంపులు నాకు జవాబిస్తాయి.
నేను అనుకొంటున్నది ఏమిటో నేను త్వరపడి నీకు చెప్పాలి.
3 మేము చెప్పిన దానికి నీవు ఇచ్చిన జవాబులు మాకు అవమానకరంగా ఉన్నాయి.
కానీ నేను జ్ఞానం గలవాడను, నీకు ఎలా జవాబు ఇవ్వాలో నాకు తెలుసు.
4-5 “మొట్ట మొదటిసారిగా ఆదాము భూమి మీద చేయ బడినప్పటి నుండి
ఒక దుర్మార్గుని సంతోషం ఎక్కువ సేపు ఉండదు అనే విషయం చాలా కాలంగా నీకు తెలిసిందే.
దేవుని లక్ష్యపెట్టని వాని ఆనందం కొంతసేపు మాత్రమే ఉంటుంది.
6 ఒకవేళ దుర్మార్గుని గర్వం ఆకాశాన్ని అంటవచ్చు.
అతని తల మేఘాలను తాకవచ్చు.
7 కానీ అతని స్వంత మలం పోయినట్లే అతడు శాశ్వతంగా పోతాడు.
అతన్ని ఎరిగిన ప్రజలు, ‘అతడు ఎక్కడ?’ అని అంటారు.
8 ఒక కల వేగంగా ఎగిరిపోయినట్టు అతడు ఎగిరి పోతాడు.
ఏ మనిషీ మరల అతణ్ణి చూడడు. అతడు పోయి ఉంటాడు. రాత్రి పూట పీడకలలా అతడు వదిలించబడతాడు.
9 అతనిని చూచిన మనుష్యులు అతన్ని మరల చూడరు
అతని కుటుంబం అతన్ని మరల ఎన్నడూ చూడదు.
10 దుర్మార్గుని పిల్లలు, పేదవారి దగ్గర అతడు తీసుకొన్న వాటిని తిరిగి ఇచ్చివేస్తారు.
దుర్మార్గుని స్వహస్తాలే తన ఐశ్వర్యాన్ని తిరిగి ఇచ్చివేయాలి.
11 అతడు యువకునిగా ఉన్నప్పుడు, అతని శరీరం బలంగా ఉంటుంది.
కాని త్వరలోనే అది మట్టి అవుతుంది.
12 “దుర్మార్గుని నోటిలో దుర్మార్గం తియ్యగా ఉంటుంది.
అతడు దానిని తన నాలుక కింద దాచిపెడతాడు.
13 చెడ్డ మనిషి తన దుర్మార్గాన్ని అలాగే పెట్టుకొని ఉంటాడు. దానిని పోనియ్యటం అతనికి అసహ్యం.
కనుక అతడు దానిని తియ్యని పదార్థంవలె తన నోటిలో ఉంచుకొంటాడు.
14 కానీ అతని భోజనం అతని కడుపులో విషం అవుతుంది.
అది అతని లోపల చేదు విషంలా, పాము విషంలా అవుతుంది.
15 దుష్టుడు ఐశ్వర్యం దిగమింగాడు. కానీ అతడు వాటిని కక్కివేస్తాడు.
అవును, దుష్టుని కడుపు వాటిని కక్కివేసేట్టుగా దేవుడు చేస్తాడు.
16 దుష్టుడు పాముల విషం పీల్చుతాడు.
పాము కోరలు వానిని చంపివేస్తాయి.
17 అప్పుడు నదులు తేనెతో, వెన్నతో ప్రవహించటం చూచి
దుష్టుడు ఆనందించ లేడు.
18 దుష్టుడు తన లాభాలను ఇచ్చివేసేలా బలాత్కారం చేయబడతాడు.
అతని కష్టార్జితం అనుభవించటానికి అతనికి అనుమతి ఇవ్వబడదు.
19 దుష్టుడు పేద ప్రజలను సక్రమంగా చూడలేదు గనుక, అతడు వారి విషయమై పట్టించుకోలేదు, మరియు అతడు వారి వస్తువులను తీసుకొన్నాడు.
ఇంకెవరో కట్టిన ఇండ్లు అతడు తీసివేసుకొన్నాడు.
20 దుష్టునికి ఎన్నటికీ తృప్తిలేదు.
వాని ఐశ్వర్యం వానిని రక్షించలేదు.
21 అతడు భోజనం చేసినప్పుడు ఏమీ మిగలదు.
అతని విజయం కొనసాగదు:
22 దుర్మార్గునికి సమృద్ధిగా ఉన్నప్పటికీ అతడు కష్టంతో కృంగిపోతాడు.
అతని సమస్యలు అతని మీదకు దిగి వస్తాయి.
23 దుర్మార్గుడు తనకు కావలసినదంతా తినివేసిన తర్వాత
దేవుడు తన కోపాన్ని ఆ మనిషి మీదకి మళ్లిస్తాడు.
దుర్మార్గుని మీద దేవుడు శిక్షా వర్షం కురిపిస్తాడు.
24 ఒకవేళ దుర్మార్గుడు ఇనుప ఖడ్గం నుండి పారిపోతాడేమో
కానీ ఒక ఇత్తడి బాణం వానిని కూల గొడుతుంది.
25 ఆ ఇత్తడి బాణం అతని శరీరం అంతటిలో గుచ్చుకొని పోయి అతని వీపులో నుండి బయటకు వస్తుంది.
ఆ బాణం యొక్క మెరుపు కొన అతని కాలేయంలో గుచ్చుకు పోతుంది.
అతడు భయంతో అదిరిపోతాడు.
26 అతని ఐశ్వర్యాలన్నీ నాశనం చేయబడుతాయి.
ఏ మనిషీ ఆరంభించని ఒక అగ్ని అతణ్ణి నాశనం చేస్తుంది.
అతని ఇంటిలో మిగిలివున్నదాన్ని అగ్ని నాశనం చేస్తుంది.
27 దుర్మార్గుడు దోషి అని ఆకాశం రుజువు చేస్తుంది.
భూమి అతనికి విరోధంగా సాక్ష్యం ఇస్తుంది.
28 అతని ఇంట్లో ఉన్న సమస్తం
దేవుని కోప ప్రవాహంలో కొట్టుకొని పోతుంది.
29 దుర్మార్గునికి దేవుడు చేయాలని తలపెడుతోంది అదే.
దేవుడు వారికి ఇవ్వాలని తలస్తోంది అదే.”
© 1997 Bible League International