Chronological
10 “నా స్వంత జీవితం నాకు అసహ్యం. అందుచేత నేను స్వేచ్ఛగా ఆరోపణలు చేస్తాను.
నా ఆత్మ చాలా వేదనగా ఉంది కనుక ఇప్పుడు నేను మాట్లాడతాను.
2 నేను దేవునితో చెబుతాను, ‘నన్ను నిందించవద్దు.
నేను ఏమి తప్పు చేశాను, నాకు చెప్పు. నా మీద నీకు ఎందుకు విరోధం?
3 దేవా, నీవు నన్ను ఇలా చులకనగా చూడటం నీకు సంతోషమా?
చూస్తుంటే, నీవు చేసిన దాని గూర్చి నీకు శ్రద్ధ లేనట్లుంది. దుర్మార్గులు వేసే పథకాలకు నీవు సంతోషిస్తున్నావా?
4 దేవా, నీకు మానవ నేత్రాలు ఉన్నాయా?
మనుష్యులు చూసినట్టుగా నీవు సంగతులు చూస్తున్నావా?
5 మా రోజుల్లాగ నీవి కొద్దిపాటి రోజులా?
మా సంవత్సరాల్లా నీవి కొన్ని సంవత్సరాలేనా?
6 నీవు నా తప్పుకోసం చూస్తూ
నాపాపం కోసం వెదకుతున్నావు.
7 కానీ నేను నిర్దోషిని అని నీకు తెలుసు.
అయితే నీ శక్తినుండి నన్ను ఎవ్వరూ రక్షించలేరు!
8 దేవా, నీ చేతులు నన్ను చేశాయి, నా శరీరాన్ని తీర్చిదిద్దాయి.
కానీ ఇప్పుడు నీవే నన్ను నాశనం చేస్తున్నావు.
9 దేవా, నీవు నన్ను మట్టిలా చేసావని జ్ఞాపకం చేసుకో.
కానీ, నీవు ఇప్పుడు నన్ను మరల మట్టిగా ఎందుకు మారుస్తున్నావు?
10 పాలు ఒలుకబోసినట్టుగా నీవు నన్ను సోస్తున్నావు.
నన్ను వెన్న చిలకరించినట్లుగా చేస్తున్నావు.
11 ఎముకల్ని, మాంసాన్ని ఒకటిగా కలిపి నీవు నన్ను చేశావు.
తర్వాత చర్మంతో, మాంసంతో నీవు నన్ను కప్పివేశావు.
12 నీవు నాకు జీవం ఇచ్చావు. నాకు చాలా దయ చూపించావు.
నా విషయమై నీవు శ్రద్ధ చూపించావు. నా ఆత్మను కాపాడావు.
13 కానీ నీవు నీ హృదయంలో దాచుకొన్నది ఇది. నీ హృదయంలో నీవు రహస్యంగా తలపెట్టింది
ఇదేనని నాకు తెలుసు. అవును, నీ మనసులో ఉన్నది ఇదేనని నాకు తెలుసు.
14 ఒకవేళ నేను పాపం చేస్తే, నేను చేసిన తప్పుకు నన్ను శిక్షించవచ్చునని
నీవు నన్ను గమనిస్తూ ఉంటావు.
15 నేను పాపం చేసినప్పుడు, నేను దోషిని.
అది నాకు చాలా చెడు అవుతుంది.
కానీ నేను నిర్దోషిని అయినా సరే, నేను నా తల ఎత్తుకోలేను.
ఎందుకంటే, నేను సిగ్గుతో, బాధతో నిండిపోయాను గనుక.
16 ఒకవేళ నాకు జయం కలిగి నేను అతిశయిస్తోంటే
ఒకడు సింహాన్ని వేటాడినట్టు నీవు నన్ను వేటాడుతావు.
నీవు మరోసారి నా మీద నీ శక్తి చూపిస్తావు.
17 నాకు విరోధంగా సాక్ష్యం చెప్పేందుకు
నీకు ఎల్లప్పుడూ ఎవరో ఒకరు ఉంటారు.
నామీద నీ కోపం ఎక్కువ అవుతుంది.
నీవు నా మీదికి కొత్త సైన్యాలను పంపిస్తావు.
18 అందుచేత, దేవా అసలు నీవు నన్ను ఎందుకు పుట్టనిచ్చావు?
నన్ను ఎవరూ చూడక ముందే నేను మరణించి ఉంటే ఎంత బాగుండేది.
19 నేను ఎన్నడూ ఒక మనిషిని కాకుండా ఉంటే బాగుండును.
నేను నా తల్లి గర్భం నుండి తిన్నగా సమాధికి మోసికొనిపోబడితే ఎంత బాగుండేది.?
20 నా జీవితం దాదాపు అయిపోయింది.
కనుక నన్ను ఒంటరిగా వదిలెయ్యి.
ఏదో కొద్దిపాటి వసతుల్ని అనుభవించనివ్వు.
21 ఏ చోటునుండి అయితే ఎవ్వరూ ఎన్నడూ తిరిగిరారో,
అంధకారం, మరణం ఉండే ఆ చోటుకు నేను వెళ్లక ముందు, నాకు మిగిలి ఉన్న కొద్ది సమయం నన్ను అనుభవించనివ్వు.
22 ఎవ్వరూ చూడలేని, అంధకార ఛాయల, గందరగోళ స్థలానికి నేను వెళ్లకముందు నన్ను అనుభవించనివ్వు.
అక్కడ వెలుగు కూడా చీకటిగా ఉండి ఉంటుంది.’”
జోఫరు యోబుతో మాట్లాడటం
11 అప్పుడు నయమాతీ వాడైన జోఫరు యోబుకు జవాబిచ్చాడు:
2 “ఈ మాటల ప్రవాహానికి జవాబు ఇచ్చి తీరాల్సిందే!
ఈ వాగుడు అంతా కలిసి, యోబు చెప్పింది సరే అనిపిస్తుందా? లేదు.
3 యోబూ, నీకు చెప్పేందుకు
మా వద్ద జవాబు లేదనుకొంటున్నావా?
నీవు దేవునిగూర్చి నవ్వినప్పుడు,
నిన్ను ఎవ్వరూ హెచ్చరించరు అనుకొంటున్నావా?
4 యోబూ! నీవు దేవునితో,
‘నా నమ్మకాలు సరియైనవే,
కనుక చూడు నేను పరిశుద్ధమైన వాడినే’ అని చెబుతున్నావు.
5 యోబూ! దేవుడే నీకు జవాబిచ్చి,
నీవు చేసేది తప్పు అని చెబితే బాగుండును అని నేను ఆశిస్తున్నాను.
6 అప్పుడు జ్ఞాన రహస్యాలు దేవుడు నీతో చెప్పగలడు.
ప్రతి విషయానికీ, నిజంగా రెండు వైపులు ఉంటాయని ఆయన నీతో చెబుతాడు.
అది నిజమైన జ్ఞానం! యోబూ! ఇది తెలుసుకో:
దేవుడు నిన్ను నిజంగా శిక్షించాల్సిన దానికంటె తక్కువగానే శిక్షిస్తున్నాడు.
7 “యోబూ, దేవుని రహస్య సత్యాలను నీవు గ్రహించగలవా?
సర్వశక్తిమంతుడైన దేవుని గొప్పదనాన్నీ, శక్తినీ చూపించే హద్దులను నీవు గ్రహించలేవు.
8 అతని జ్ఞానం ఆకాశమంత ఎత్తైనది!
ఆ హద్దులు సమాధి లోతులకంటె లోతైనవి.
కానీ, అది నీవు గ్రహించలేవు!
9 దేవుడు భూమికంటే గొప్పవాడు,
సముద్రంకంటే పెద్దవాడు.
10 “దేవుడు ఒకవేళ నిన్ను బంధిస్తే, నిన్ను న్యాయ స్థానానికి తీసుకొనివస్తే,
ఏ మనిషీ ఆయనను వారించలేడు.
11 నిజంగా, ఎవరు పనికిమాలిన వాళ్లో దేవునికి తెలుసు.
దేవుడు దుర్మార్గాన్ని చూసినప్పుడు, ఆయన దానిని జ్ఞాపకం ఉంచుకొంటాడు.
12 ఒక అడవి గాడిద ఎలాగైతే ఒక మనిషికి జన్మ ఇవ్వలేదో,
అలాగే బుద్ధిహీనుడు ఎన్నటికీ జ్ఞాని కాజాలడు.
13 అయితే యోబూ! దేవుణ్ణి మాత్రమే సేవించటానికి, నీవు నీ హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి.
ఆయన తట్టు నీవు నీ చేతులు ఎత్తి ఆరాధించాలి.
14 నీ ఇంట్లో ఉన్న పాపం నీవు తొలగించి వేయాలి.
నీ గుడారంలో చెడు నివాసం చేయనియ్యకు.
15 అప్పుడు నీవు సిగ్గుపడకుండా దేవుని తట్టు నిశ్చలంగా చూడగలుగుతావు.
నీవు బలంగా నిలబడతావు. భయపడవు.
16 యోబూ! అప్పుడు నీవు నీ కష్టం మరచిపోగలవు.
నీ కష్టాలను దొర్లిపోయిన నీళ్లలా నీవు జ్ఞాపకం చేసుకొంటావు.
17 అప్పుడు మధ్యాహ్నపు సూర్యకాంతి కంటె నీ జీవితం ఎక్కువ ప్రకాశమానంగా ఉంటుంది.
జీవితపు గాఢాంధకార ఘడియలు సూర్యోదయంలా ప్రకాశిస్తాయి.
18 యోబూ! నిరీక్షణ ఉంది గనుక నీవు క్షేమంగా ఉంటావు.
దేవుడు నిన్ను సురక్షితంగా వుంచి నీకు విశ్రాంతినిస్తాడు.
19 నీవు విశ్రాంతిగా పండుకొంటావు. నిన్ను ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు, బాధించరు.
మరియు అనేక మంది నీ సహాయం వేడుకొంటారు.
20 కానీ, చెడ్డవాళ్లు సహాయం కోసం చూస్తారు,
అయితే ఆశ ఏమి ఉండదు. వారు వారి కష్టాలు తప్పించుకోలేరు.
వారు చస్తారు అనేది ఒక్కటే వారికి ఉన్న ఆశ.”
తన స్నేహితులకు యోబు జవాబు
12 అప్పుడు యోబు జోఫరుకు ఇలా జవాబు ఇచ్చాడు:
2 “సందేహము లేకుండ, మీరు మాత్రమే
జ్ఞానం గల వాళ్లని మీరు తలస్తారు.
మీరు చనిపోయినప్పుడు మీతో బాటు
జ్ఞానం గతిస్తుందని మీరు తలస్తారు.
3 అయితే మీరు ఎంత జ్ఞానంగలవాళ్లో నేనూ అంత జ్ఞానంగలవాడిని.
నేను మీకంటే తక్కువేమి కాదు.
ఇది సత్యం అని ఇతరులకు కూడా తెలుసు.
4 “ఇప్పుడు నా స్నేహితులు నన్ను చూసి నవ్వుతారు.
వారిలా అంటారు: ‘వీడు దేవుణ్ణి ప్రార్థించాడు. వీనికి ఆయన జవాబు ఇచ్చాడు.’
కానీ నేను మంచివాణ్ణి, నిర్దోషిని.
అయినప్పటికీ ఇంకా నన్ను చూసి నా స్నేహితులు నవ్వుతూనే ఉన్నారు.
5 కష్టాలు లేని మనుష్యులు కష్టాలు ఉన్న వాళ్లను హేళన చేస్తారు.
అలాంటి వాళ్లు పడిపోతున్న వాళ్లను కొట్టేస్తారు.
6 దొంగల గుడారాలకు ఇబ్బంది లేదు.
దేవునికి కోపం రప్పించే వాళ్లు శాంతిగా జీవిస్తారు.
వారి ఒకే దేవుడు వారి స్వంత బలమే.
7 “అయితే జంతువుల్ని అడగండి,
అవి మీకు నేర్పిస్తాయి.
లేక ఆకాశ పక్షుల్ని అడగండి,
అవి మీకు నేర్పిస్తాయి.
8 లేక భూమితో మాట్లాడండి,
అది మీకు నేర్పిస్తుంది.
లేక సముద్రపు చేపలను వాటి జ్ఞానం గూర్చి
మీతో చెప్పనివ్వండి.
9 వాటిని యెహోవా సృష్టించాడని ప్రతి ఒక్కరికీ తెలుసు.
10 బ్రతికి ఉన్న ప్రతి జంతువూ శ్వాస పీల్చే
ప్రతి మనిషీ దేవుని శక్తి క్రిందనే.
11 భోజనం రుచి చూడడం నాలుకకు ఎంత ఆనందమో
చెవులు అవి వినే మాటలను పరీక్షించవా:
12 ముసలి వాళ్లకు కూడా జ్ఞానం ఉంది. దీర్ఘాయుష్షు అవగాహన కలిగిస్తుంది.
అని మేము అన్నాము.
13 జ్ఞానం, బలం దేవునికి చెందుతాయి.
మంచి సలహా మరియు గ్రహింపు ఆయనవే.
14 ఒక వేళ దేవుడు దేనినైనా పడగొడితే మనుష్యులు దాన్ని తిరిగి నిర్మించలేరు.
ఒక వేళ దేవుడు ఒక మనిషిని చెరసాలలో పెడితే మనుష్యులు అతనిని విడుదల చేయలేరు.
15 ఒక వేళ దేవుడు గాని వర్షాన్ని ఆపివేస్తే భూమి ఎండి పోతుంది.
ఒక వేళ దేవుడు గాని వర్షాన్నిరానిస్తే అది భూమిని వరదతో నింపివేస్తుంది.
16 దేవుడు బలవంతుడు, ఆయన ఎల్లప్పుడూ గెలుస్తాడు.
మోసపోయిన వాడు మోసం చేసిన వారూ ఇద్దరూ దేవునికి చెందిన వారే.
17 రాజుల జ్ఞానమును దేవుడు తీసి వేస్తాడు.
నాయకులు వెర్రిగా వ్రవర్తించేటట్టు చేస్తాడు.
18 రాజులు వారి బందీలకు గొలుసులు వేస్తారు. కాని దేవుడు వాటిని తీసివేస్తాడు.
అప్పుడు దేవుడు ఆ రాజుల మీద నడికట్టు వేస్తాడు.
19 తన వంశాన్ననుసరించి రక్షణ ఉందనుకొనే యాజకుల బలాన్ని దేవుడు అణచి,
వాళ్లను క్రిందికి దిగజారేటట్లు చేస్తాడు.
20 నమ్మకమైన సలహాదారులను దేవుడు నిశ్శబ్దం చేస్తాడు.
వృద్ధుల జ్ఞానమును ఆయన తీసివేస్తాడు.
21 నాయకులను అప్రముఖులనుగా చేస్తాడు.
పాలకుల బలాన్ని ఆయన తీసివేస్తాడు.
22 లోతైన అంధకారంలో నుండి రహస్య సత్యాలను దేవుడు చూపిస్తాడు.
మరణం లాంటి చీకటి గల స్థలాలలోనికి ఆయన వెలుగు పంపిస్తాడు.
23 దేవుడు రాజ్యాలను పెద్దవిగా, శక్తిగలవిగా విస్తరింపజేస్తాడు.
అప్పుడు ఆయన వాటిని నాశనం చేస్తాడు.
ఆయన రాజ్యాలను పెద్దవిగా పెరగనిస్తాడు.
అప్పుడు ఆ రాజ్యాల్లోని ప్రజలను ఆయన చెదరగొడతాడు.
24 భూలోక నాయకులను వెర్రివార్ని గాను అర్థం చేసుకోలేని వార్ని గాను దేవుడు చేస్తాడు.
మార్గం లేని అరణ్యంలో సంచరించేందుకు ఆయన వారిని పంపిస్తాడు.
25 ఆ నాయకులు చీకటిలో ముందుకు సాగుతారు. వారికి ఏ వెలుగూ లేదు.
వారు తాగుబోతుల్లా నడిచేటట్టు దేవుడు వారిని చేస్తాడు.”
13 యోబు ఇలా అన్నాడు:
“ఇదంతా ఇదివరకే నా కళ్లు చూశాయి.
మీరు చెప్పేది అంతా నేను ఇదివరకే విన్నాను.
అదంతా నేను గ్రహించాను.
2 మీకు తెలిసింది అంతా నాకు తెలుసు.
నేను మీకంటే తక్కువ కాదు.
3 కానీ (మీతో వాదించటం నాకు ఇష్టం లేదు)
సర్వశక్తిమంతుడైన దేవునితో మాట్లాడాలని నేను కోరుతున్నాను.
నా కష్టాలను గూర్చి నేను దేవునితో వాదించాలని కోరుతున్నాను.
4 కానీ, మీరు ముగ్గురూ మీ అజ్ఞానాన్ని అబద్ధాలతో కప్పిపుచ్చాలని ప్రయత్నిస్తున్నారు.
ఎవరినీ బాగుచేయలేని పనికిమాలిన వైద్యుల్లా మీరు ఉన్నారు.
5 మీరు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటే బాగుండేది.
అది మీరు చేయగలిగిన అతి జ్ఞానంగల పని.
6 “ఇప్పుడు, నా వాదం వినండి.
నేను నా విన్నపం చెబుతుండగా, వినండి
7 మీరు దేవుని కోసం అబద్ధాలు చెబుతున్నారా?
మీరు చెప్పాలని దేవుడు కోరుతున్నవి అబద్ధాలే అని మీరు నిజంగా నమ్ముచున్నారా?
8 మీరు నాకు విరోధంగా దేవుని ఆదుకొనేందుకు ప్రయత్నిస్తున్నారా?
న్యాయస్థానంలో మీరు దేవుని ఆదుకొంటారా?
9 దేవుడు మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలిస్తే
ఆయనకు మంచి ఏమైనా కనబడుతుందా?
మీరు మనుష్యులను మోసం చేసినట్టే దేవునిని కూడా మోసం చేయగలమని
నిజంగా అనుకొంటున్నారా?
10 మీరు కనుక న్యాయస్థానంలో ఒకరి పక్షం వహించాలని
రహస్యంగా నిర్ణయిస్తే దేవుడు విజంగా మిమ్మల్ని గద్దిస్తాడు.
11 దేవుని ప్రభావం మిమ్మల్ని భయపెట్టేస్తుంది.
ఆయన్ని చూచి మీరు భయపడతారు.
12 (మీరు తెలివిగానూ, జ్ఞానంగానూ మాట్లాడుతున్నాం అనుకొంటారు).
కానీ మీ మాటలు బూడిదలా పనికిమాలినవే. మీ వాదాలు మట్టిలా బలహీనమైనవే.
13 “నిశ్శబ్దంగా ఉండి, నన్ను మాట్లాడనివ్వండి. నివ్వండి.
14 నాకు నేను అపాయంలో చిక్కుకొనుచున్నాను,
నా ప్రాణం నా చేతుల్లోకి తీసుకొంటున్నాను.
15 దేవుడు నన్ను చంపివేసినా సరే నేనాయన్ని నమ్ముతూనే వుంటాను.
ముఖాముఖిగా, ఆయన ముందు నా విధానాలను రుజువు చేస్తాను.
16 కాని దేవుని ఎదుట నేను ధైర్యంగా ఉన్నాను, గనుక ఒక వేళ ఆయన నన్ను రక్షిస్తాడేమో.
చెడ్డ మనిషి ఎవ్వడూ దేవుణ్ణి ముఖాముఖిగా కలుసుకోడానికి సాహసించడు.
17 నేను చెప్పేది జాగ్రత్తగా వినండి.
నేను వివరిస్తూండగా మీ చెవులను విననివ్వండి.
18 ఇప్పుడు నన్ను నేను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాను.
నేను జాగ్రత్తగా నా వాదనలను మీ ముందు ఉంచుతాను.
నాదే సరి అని నాకు చూపించబడుతుంది అని నాకు తెలుసు.
19 నాది తప్పు అని ఏ మనిషీ రుజువు చేయలేడు.
అలా ఎవరైనా చేయగలిగితే నేను మౌనంగా ఉండి మరణిస్తాను.
20 “దేవా, కేవలం రెండు సంగతులు నాకు దయచేయుము.
అప్పుడు నేను నీవద్ద దాగుకొనను.
21 నన్ను శిక్షించడము ఆపివేయి.
నీ భయాలతో నన్ను బెదిరించకు.
22 అప్పుడు నన్ను పిలువు, అప్పుడు నేను నీకు జవాబు ఇస్తాను.
లేదా నన్ను నీతో మాట్లాడనివ్వు. నీవు నాకు జవాబు ఇవ్వు.
23 నేను ఎన్ని పాపాలు చేశాను?
నేను ఏం తప్పు చేశాను?
నా పాపాలు, నా తప్పులు నాకు చూపించు.
24 దేవా, నీవు నన్ను ఎందుకు తప్పిస్తున్నావు?
నన్ను నీ శత్రువులా ఎందుకు చూస్తున్నావు?
25 నీవు నన్ను బెదిరించటానికి ప్రయత్నిస్తున్నావా?
నేను (యోబు) గాలి చెదరగొట్టే ఒక ఆకును.
ఎండిపోయిన ఒక చిన్న గడ్డిపరక మీద నీవు దాడిచేస్తున్నావు.
26 దేవా, నా మీద నీవు కఠినమైన మాటలు పలుకుతున్నావు.
నేను యువకునిగా ఉన్నప్పుడు చేసిన పాపాలకు నీవు నన్ను శ్రమ పెడుతున్నావు.
27 నా సాదాలకు నీవు గొలుసులు వేశావు.
నేను వేసే ప్రతి అడుగూ నీవు జాగ్రత్తగా గమనిస్తున్నావు.
నా అడుగలను నీవు తక్కువ చేస్తున్నావు.
28 అందుచేత కుళ్లిపోయిన దానిలా,
చిమ్మెటలు తిని వేసిన గుడ్డ పేలికలా
నేను నిష్ప్రయోజనం అయిపోతున్నాను.”
© 1997 Bible League International