Chronological
యోబు మంచి మనిషి
1 ఊజు దేశంలో ఒక మంచి మనిషి జీవించాడు. అతని పేరు యోబు. యోబు మంచివాడు, నమ్మక మైనవాడు. యోబు తన జీవితాంతము దేవుని ఆరాధించాడు. యోబు చెడు క్రియలకు దూరంగా ఉండేవాడు. 2 యోబుకు ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలుండిరి. 3 యోబుకు ఏడు వేల గొర్రెలు, మూడు వేల ఒంటెలు, వెయ్యి ఎద్దులు, ఐదు వందల ఆడ గాడిదలు సొంతంగా ఉన్నాయి. వీటికి తోడు అతనికి చాలా మంది పనివాళ్లు ఉన్నారు. తూర్పు ప్రాంతంలో యోబు మిక్కిలి ధనవంతుడుగా ఉండేవాడు.
4 యోబు కుమారులు వంతుల ప్రకారం వారి ఇండ్లలో విందులు చేసుకొంటూ, వారి సోదరీలను ఆహ్వానిస్తుండేవారు. 5 యోబు పిల్లలు విందు చేసుకొన్న తర్వాత, అతడు ఉదయం పెందలాడే లేచేవాడు. అతడు తన పిల్లల్లో ఒక్కొక్కరి కోసం ఒక్కోక్క దహనబలి అర్పించేవాడు. “ఒకవేళ నా పిల్లలు నిర్లక్ష్యంగా ఉండి, వారి విందులో దేవునికి విరోధంగా పాపం చేశారేమో” అని అతడు తలచేవాడు. తన పిల్లలు వారి పాపాల విషయంలో క్షమించబడాలని అతడు ఎల్లప్పుడు ఇలా చేస్తూ ఉండేవాడు.
6 అప్పుడు దేవదూతలు యెహోవా సముఖంలో సమావేశమయ్యే ఒక రోజు వచ్చింది. అప్పుడు ఆ దేవదూతలతోబాటు సాతానుకూడ వచ్చాడు. 7 “ఎక్కడి నుండి వస్తున్నావు?” అని సాతానును యెహోవా అడిగాడు.
“నేను భూలోకంలో సంచారం చేస్తూ వచ్చాను” అని యెహోవాకు సాతాను జవాబు చెప్పాడు.
8 అంతట యెహోవా, “నా సేవకుడైన యోబును నీవు చూశావా? భూమి మీద అతనిలాంటి వారు ఎవ్వరూ లేరు. యోబు నిజంగా మంచి మనిషి మరియు నమ్మకమైనవాడు. అతడు దేవుణ్ణి ఆరాధిస్తాడు. దుర్మార్గపు పనులకు అతడు దూరంగా ఉంటాడు” అని సాతానుతో అన్నాడు.
9 “ఓ తప్పకుండా! కానీ యోబు దేవుణ్ణి ఆరాధించటానికి ఒక గట్టి కారణం ఉంది! 10 అతణ్ణి, అతని కుటుంబాన్ని, అతనికి ఉన్న సర్వాన్ని నీవు ఎల్లప్పుడూ కాపాడుతూ ఉన్నావు. అతడు చేసే ప్రతిపనిలో నీవు అతణ్ణి విజయుణ్ణి చేస్తున్నావు. అవును, నీవు అతణ్ణి ఆశీర్వదించావు. అతడు చాలా ధనికుడు గనుక అతని పశువుల మందలు, గొర్రెల మందలు దేశం అంతటానిండి ఉన్నాయి. 11 కానీ అతనికి ఉన్న సర్వాన్నీ నీవు గనుక నాశనం చేస్తే అతడు నీకు వ్యతిరేకంగా, నీముఖం మీదనే శపిస్తాడని ప్రమాణం చేస్తున్నాను” అని సాతాను జవాబిచ్చాడు.
12 “సరే, యోబుకు ఉన్న వాటన్నింటికీ నీవు ఏమైనా చేయి. కాని అతని శరీరానికి మాత్రం హానిచేయవద్దు” అని యెహోవా సాతానుతో చెప్పాడు.
అప్పుడు సాతాను యెహోవా సన్నిధి నుండి వెళ్లిపోయాడు.
యోబు సర్వం పోగొట్టుకొన్నాడు
13 ఒకరోజు యోబు కుమారులు, కుమార్తెలు అతని జ్యేష్ఠ కుమారుని ఇంటివద్ద తినుచూ ద్రాక్షారసం తాగుతూ ఉన్నారు. 14 అంతలో ఒక సందేశకుడు యోబు దగ్గరకు వచ్చి, “ఎడ్లు దున్నుతూ, ఆ దగ్గరలోనే గాడిదలు గడ్డి మేస్తూ వుండగా, 15 షెబాయీయులు[a] మా మీద దాడి చేసి నీ జంతువులను తీసుకొనిపోయారు! నన్ను తప్ప మిగిలిన నీ సేవకులనందరినీ షెబాయీయులు చంపేశారు. నీతో చెప్పటానికే నేనొక్కడినే తప్పించుకొన్నాను” అని చెప్పాడు.
16 ఆ సందేశకుడు ఇంకా మాట్లాడుతూ ఉండగానే మరో సందేశకుడు యోబు దగ్గరకు వచ్చాడు. “ఆకాశంనుండి మెరుపుల ద్వారా అగ్నిపడి నీ గొర్రెలను, సేవకులను కాల్చివేసింది. నీతో చెప్పేందుకు నేను ఒక్కణ్ణి మాత్రమే తప్పించుకొన్నాను!” అని రెండో సందేశకుడు చెప్పాడు.
17 ఆ సందేశకుడు ఇంకా మాట్లాడుతూండగానే ఇంకో సందేశకుడు వచ్చాడు. “కల్దీయులు పంపిన మూడు గుంపులవారు వచ్చి మా మీద పడి ఒంటెలను తీసుకొని పోయారు. పైగా వారు సేవకులను చంపేశారు. నీతో చెప్పేందుకు నేనొక్కణ్ణి మాత్రం తప్పించుకొన్నాను” అని ఈ మూడో సందేశకుడు చెప్పాడు.
18 మూడో సందేశకుడు ఇంకా చెబుతూ ఉండగానే మరో సందేశకుడు వచ్చాడు. “నీ పెద్ద కుమారుని యింటి వద్ద నీ కుమారులు, కుమార్తెలు భోజనం చేస్తూ, ద్రాక్షారసం తాగుతూ ఉండగా. 19 అకస్మాత్తుగా ఎడారినుండి ఒక బలమైన గాలి వీచి ఇంటిని పడ గొట్టేసింది. ఆ ఇల్లు నీ కుమారులు, కుమార్తెల మీద పడగానేవారు మరణించారు. నీతో చెప్పేందుకు నేను ఒక్కణ్ణి మాత్రమే తప్పించుకొన్నాను” అని నాలుగో సందే శకుడు చెప్పాడు.
20 యోబు ఇది వినగానే తన విచారాన్ని, కలవరాన్ని తెలియజేయడానికి తన బట్టలు చింపుకొని, తల గుండు చేసుకొన్నాడు. తరువాత యోబు సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించాడు. 21 అతడు ఇలా చెప్పాడు:
“నేను ఈ లోకంలో పుట్టినప్పుడు
నేను దిగంబరిని, నాకు ఏమీ లేదు.
నేను మరణించి లోకాన్ని విడిచి పెట్టేటప్పుడు
నేను దిగంబరినిగా ఉంటాను. నాకు ఏమీ ఉండదు.
యెహోవా ఇచ్చాడు.
యెహోవా తీసుకున్నాడు.
యెహోవా నామాన్ని స్తుతించండి!”
22 ఇవన్నీ సంభవించినాగానీ యోబు మాత్రం పాపం చేయలేదు. అతడు దేవుణ్ణి నిందించనూలేదు.
సాతాను యోబును మరల శ్రమ పెట్టటం
2 మరో రోజు దేవదూతలు[b] యెహోవాను కలుసు కొనేందుకు వచ్చారు. సాతాను వారితో కూడా ఉన్నాడు. సాతాను యెహోవాను కలుసుకొనేందుకు వచ్చాడు. 2 “ఎక్కడికి వెళ్లావు?” అని సాతానును యెహోవా అడిగాడు.
“నేను భూలోకంలో సంచారం చేస్తూ ఉన్నాను” అని సాతాను యెహోవాకు జవాబు ఇచ్చాడు.
3 “నా సేవకుడైన యోబును నీవు గమనిస్తున్నావా? భూమి మీద ఎవ్వరూ అతని వంటివారు లేరు. నిజంగా అతడు మంచి మనిషి. అతడు తన దేవుడనైన నన్ను మాత్రమే ఆరాధిస్తాడు. చెడుకార్యాలకు అతడు దూరంగా ఉంటాడు. అతనికి ఉన్నవాటన్నింటినీ నిష్కారణంగా నాశనం చేయమని నీవు నన్ను అడిగినప్పటికీ, అతడు ఇంకా నమ్మకంగా ఉన్నాడు” అని సాతానుతో యెహోవా అన్నాడు.
4 “చర్మానికి చర్మం[c] బ్రతికి ఉండటానికి మనిషి తనకు ఉన్నదంతా ఇస్తాడు. 5 అతని శరీరానికి హాని చేసేందుకు నీవు నాకు అనుమతిస్తే, అప్పుడు అతడు నీ ముఖం మీదే శపిస్తాడు!” అని సాతాను జవాబు ఇచ్చాడు.
6 “సరే, యోబు నీ అధికారం క్రింద ఉన్నాడు. కాని అతనిని చంపేందుకు నీకు అనుమతి లేదు” అని సాతానుతో యెహోవా చెప్పాడు.
7 అప్పుడు సాతాను యెహోవా దగ్గర నుండి వెళ్లిపోయి, యోబుకు బాధకరమైన పుండ్లు కలిగించాడు. యోబు అరికాలు మొదలుకొని నడినెత్తివరకు, అతని శరీరం అంతటా బాధకరమైన పుండ్లు ఉన్నాయి. 8 కనుక యోబు పెంటకుప్ప దగ్గర కూర్చున్నాడు. అతడు తన పుండ్లను గీకుకొనేందుకు ఒక చిల్లపెంకు ఉపయోగించాడు. 9 యోబు భార్య, “ఇంకా నీవు దేవునికి నమ్మకంగా ఉంటావా? నీ వెందుకు దేవుణ్ణి శపించి, చావకూడదు?” అని అతనితో అంది.
10 యోబు తన భార్యతో, “నీవు తెలివి తక్కువ స్త్రీలా మాట్లాడుతున్నావు! దేవుడు మనకు మంచి వాటిని ఇచ్చినప్పుడు, మనం వాటిని స్వీకరిస్తున్నాం. కనుక కష్టాల్ని కూడా మనం స్వీకరించాలి గాని ఆరోపణ చేయకూడదు” అని జవాబిచ్చాడు. ఇవన్ని జరిగినప్పటికీ కూడా యోబు పాపం చేయలేదు. దేవునికి విరుద్ధంగా ఏమియు మాట్లాడనూలేదు.
ముగ్గురు స్నేహితులు యోబును చూడటానికి వచ్చారు
11 తేమాను వాడైన ఎలీఫజు, షూహీవాడైన బిల్దదు, నయమాతీవాడైన జోఫరు అనే ముగ్గురు యోబుకు స్నేహితులు. యోబుకు సంభవించిన చెడు సంగతులు అన్నింటిని గూర్చి ఈ ముగ్గురు స్నేహితులూ విన్నారు. ఈ ముగ్గురు స్నేహితులూ వారి ఇండ్లు విడిచి ఒకచోట సమావేశమయ్యారు. వారు వెళ్లి యోబుకు సానుభూతి చూపించి, ఆదరించాలని తీర్మానించుకున్నారు. 12 కాని ఆ స్నేహితులు ముగ్గురూ యోబును దూరమునుండి చూచి, అతడు చాలా వేరుగా కనబడటం చేత అతడు యోబు అని సరిగ్గా గుర్తించ లేక పోయారు. వారు గట్టిగా ఏడ్వటం మొదలు పెట్టారు. వారు తమ వస్త్రాలు చింపుకొని, తాము విచారంగాను, కలవరంగాను ఉన్నట్టు తెలియ చేయడానికి తమ తలల మీద దుమ్మెత్తి పోసుకొన్నారు. 13 తరువాత ఆ ముగ్గురు స్నేహితులూ యోబుతో పాటు ఏడు రాత్రుళ్లు, ఏడు పగళ్లు నేలమీద కూర్చున్నారు. యోబు చాలా శ్రమ పడుతూ ఉన్న కారణంగా వారిలో ఏ ఒక్కరూ యోబుతో ఒక్క మాట కూడా పలుకలేదు.
యోబు తన పుట్టిన రోజును శపించుట
3 అప్పుడు యోబు తన నోరు తెరచి, తాను పుట్టిన రోజును శపించాడు. 2-3 అతడు ఇలా అన్నాడు:
“నేను పుట్టిన ఆ రోజు ఉండకుండా పోవును గాక.
‘పిల్లవాడు పుట్టాడు!’ అని చెప్పబడిన ఆ రాత్రి ఉండకుండా పోవునుగాక. అది పోవునుగాక.
4 ఆ రోజు చీకటి అవును గాక.
ఆ రోజును దేవుడు లక్ష్యపెట్టకుండును గాక. ఆ రోజున వెలుగు ప్రకాశింపకుండును గాక.
5 ఆ రోజు మరణాంధకారమవును గాక.
ఆ రోజును ఒక మేఘము కప్పివేయును గాక.
నేను పుట్టిన ఆనాటి వెలుగును కారు మేఘాలు భయపెట్టి వెళ్లగొట్టును గాక.
6 గాఢాంధకారము ఆ రాత్రిని పట్టుకొనును గాక.
ఆ రాత్రి సంవత్సరపు దినములలో ఒకటిగా ఎంచబడకుండును గాక.
ఆ రాత్రిని ఏ నెలలో కూడ చేర్చవద్దు.
7 ఆ రాత్రి ఎవడును జననం కాకపోవును గాక.
ఆ రాత్రి ఏ ఆనంద శబ్దం వినుపించకుండా ఉండును గాక.
8 శాపాలు పెట్టే మంత్రగాళ్లు నేను పుట్టిన ఆ రోజును శపించెదరు గాక.
సముద్రపు రాక్షసికి కోపం పుట్టించుట ఎట్లో ఎరిగిన మనుష్యులు వారు.
9 ఆ నాటి వేకువ చుక్క చీకటి అవునుగాక.
ఆ రాత్రి ఉదయపు వెలుగుకోసం కనిపెట్టి ఉండును గాక.
కానీ ఆ వెలుగు ఎన్నటికీ రాకుండును గాక.
ఆ రాత్రి సూర్యోదయపు మొదటి కిరణాలు చూడకుండును గాక.
10 ఎందుకనగా ఆ రాత్రి, నా తల్లి గర్భద్వారాలను మూసివేయలేదు.
(అది పుట్టకుండా అరికట్టలేదు) అది నా కన్నులనుండి కష్టాలను దాచలేదు.
11 నేను పుట్టినప్పుడే నేనెందుకు మరణించలేదు?
నా తల్లి గర్భం నుండి వచ్చేటప్పుడు నేనెందుకు మరణించలేదు?
12 నా తల్లి ఎందుకు నన్ను తన మోకాళ్లమీద పెట్టుకొంది?
నా తల్లి స్తనములు నాకెందుకు పాలిచ్చాయి?
13 నేను పుట్టినప్పుడే నేను మరణించి ఉంటే
ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండేవాణ్ణి.
14 భూమి మీద బ్రతికిన రాజులు, జ్ఞానులతో బాటు విశ్రాంతిలో ఉంటే ఎంత బాగుండును
ఆ రాజులు, జ్ఞానులచే నిర్మింపబడిన ఆ కట్టడాలు ఇప్పుడు నాశనమై పోయాయి.
15 నేను కూడ ఆ పాలకులతో పాటు పాతిపెట్టబడి ఉంటే ఎంత బాగుండును.
వారికి బంగారం ఉంది, వారి ఇండ్లను వెండితో నింపుకొన్నారు!
16 నేను పుట్టినప్పుడే చనిపోయి,
మట్టిలో పాతి పెట్టబడిన శిశువుగా ఎందుకు ఉండలేదు?
ఎన్నడూ వెలుగు చూడని శిశువులా నేను ఉంటే
ఎంత బాగుండును.
17 చెడ్డ మనుష్యులు సమాధిలో ఉన్నప్పుడు తొందర కలిగించటం మానివేస్తారు.
అలసిపోయిన మనుష్యులకు సమాధిలో విశ్రాంతి లభిస్తుంది.
18 ఖైదీలు కూడా సమాధిలో సుఖంగా ఉంటారు.
కాపలాదారుల స్వరం వారు వినరు.
19 ప్రముఖ ప్రజలు, సామాన్య ప్రజలు అన్ని రకాల ప్రజలు సమాధిలో ఉంటారు.
మరియు బానిస తన యజమాని నుండి విడుదల అవుతాడు.
20 “శ్రమ పడుతూ, చాలా విచారంగా ఉన్న మనిషిని ఇంకా బ్రతుకుతూ ఉండనియ్యటం ఎందుకు?
ఆత్మ వేదనతో ఉన్న వానికి జీవం ఇవ్వబడటం ఎందుకు?
21 ఆ మనిషి చావాలని కోరుకొంటాడు. కాని చావురాదు.
విచారంలో ఉన్న ఆ మనిషి దాగి ఉన్న ఐశ్వర్యాలకంటే మరణంకోసం ఎక్కువగా వెదకుతాడు.
22 ఆ మనుష్యులు సమాధిని కనుగొన్నప్పుడు చాలా సంతోషిస్తారు.
వారు పాతిపెట్టబడినప్పుడు ఆనందిస్తారు.
23 దేవుడు వారి భవిష్యత్తును రహస్యంగా ఉంచుతాడు.
వారి చుట్టూ ఒక గోడ కడతాడు.
24 నేను భోజనం చేయను. కాని నేను దుఃఖధ్వనులు చేస్తాను.
కాని సంతోషంతో కాదు. నా ఆరోపణలు నీళ్లలా ప్రవహిస్తున్నాయి.
25 నాకు ఏదో దారుణం జరుగుతుందేమో అని భయ పడ్డాను.
అలానే జరిగింది నాకు!
26 నాకు శాంతి లేదు. విశ్రాంతి లేదు.
నాకు విశ్రాంతి లేదు. కష్టం మాత్రమే ఉంది!”
ఎలీఫజు మాట్లాడుతున్నాడు
4 1-2 అప్పుడు తేమానువాడైన ఎలీఫజు జవాబు ఇచ్చాడు:
“నీతో ఎవరైనా మాట్లాడేందుకు ప్రయత్నిస్తే అది నిన్ను కలవర పెడుతుందా?
నేను మాట్లాడాల్సి ఉంది!
3 యోబూ, ఎంతో మంది మనుష్యులకు నీవు ఉపదేశాన్ని చేసావు.
బలహీన హస్తాలకు నీవు బలం ఇచ్చావు.
4 తొట్రిల్లిన మనుష్యులకు నీ మాటలు ఆదరణ కలిగించాయి.
బలహీనమైన మోకాళ్లను నీవు బలపరిచావు.
5 కాని ఇప్పుడు నీకు కష్టం వస్తే నీవు అధైర్య పడుతున్నావు.
కష్టం నిన్ను దెబ్బతీస్తే నీవు తల్లడిల్లి పోయావు!
6 నీవు దేవున్ని ఆరాధిస్తూ
ఆయన పట్ల నమ్మకంగా ఉన్నావు.
కనుక నీవు నీ విశ్వాస్యతను నమ్ముకోవాలి.
నీవు నిర్దోషివి కనుక అదే నీకు నిరీక్షణగా ఉండును గాక.
7 యోబూ, ఇప్పుడు దీనిని గూర్చి ఆలోచించు నిర్దోషియైన మనిషి ఎవ్వరూ, ఎన్నడూ నాశనం చేయబడలేదు.
మంచి మనుష్యులు ఎన్నడూ నాశనం చేయబడలేదు.
8 కీడు, కష్టం ప్రారంభించే మనుష్యులను నేను గమనించాను.
వారికి కూడా అవే సంభవిస్తాయి.
9 దేవుని శ్వాస ఆ మనుష్యులను చంపేస్తుంది.
దేవుని కోపం వారిని నాశనం చేస్తుంది.
10 దుర్మార్గులు సింహాలవలె గర్జించి గుర్రు పెడతారు.
కాని దేవుడు దుర్మార్గులను నోరు మూయిస్తాడు.
మరియు దేవుడు వారి పళ్లు విరుగగొడతాడు.
11 దుర్మార్గులు తినుటకు ఏమి లేని సింహాలవలె ఉంటారు.
వారు చస్తారు, వారి పిల్లలు చెదరి పోతారు.
12 “రహస్యంగా నాకు ఒక సందేశం అందించబడింది.
ఆ గుసగుసలు నా చెవులు విన్నాయి.
13 రాత్రివేళ వచ్చే ఒక చెడ్డ కలలా
అది నా నిద్రను భంగం చేసింది.
14 నేను భయపడి వణకిపోయాను.
నా ఎముకలన్నీ వణకిపోయాయి!
ఎలీఫజు మాట్లాడుతున్నాడు
15 ఒక ఆత్మ నా ముఖాన్ని దాటిపోగా
నా శరీరం మీది వెంట్రుకలు వేగంగా చలించాయి!
16 ఆత్మ ఇంకా నిలిచి ఉంది.
కాని అదేమిటో నేను చూడలేకపోయాను.
ఒక ఆకారం నా కళ్ల ఎదుట నిలిచింది.
నిశ్శబ్దంగా ఉంది.
అప్పుడు నేను ఒక మెల్లని స్వరం చెప్పడం విన్నాను.
17 ‘ఒక మనిషి దేవుని కంటే ఎక్కువ (నీతిమంతుడు)గా ఉండలేడు.
మనిషి తనను చేసిన వానికంటే ఎక్కువ పరిశుద్ధంగా ఉండలేడు.
18 దేవుడు తన పరలోకపు సేవకులను కూడా నమ్మలేడు.
తన దేవదూతల విషయంలో కూడా దేవుడు తప్పులు పట్టుకోగలడు
19 కనుక దేవుడు మనుష్యుల విషయంలో మరి ఎక్కవ తప్పులు పట్టుకోగలడు.
మనుష్యులు మట్టి ఇండ్లలో[d] నివసిస్తారు.
ఈ మట్టి ఇండ్ల పునాదులు మట్టిలో ఉన్నాయి.
వారు చిమ్మెట కంటే తేలికగా చావగొట్టబడతారు.
20 సూర్వోదయం, సూర్యాస్తమయం మధ్య ఈ మనుష్యులు మరణిస్తారు, వారిని ఎవ్వరూ గుర్తించరు.
వారు శాశ్వతంగా నశించిపోతారు.
21 వారి గుడారాల తాళ్లు లాగివేయబడతాయి,
ఈ మనుష్యులు బుద్ధిలేకుండా చస్తారు.’”
5 “యోబూ, నీవు కావాలంటే గట్టిగా పిలువు. కాని నీకు ఎవ్వరూ జవాబు ఇవ్వరు!
నీవు ఏ దేవదూతల తట్టూ తిరుగలేవు!
2 తెలివి తక్కువ మనిషి యొక్క కోపం వానినే చంపివేస్తుంది.
బుద్ధిహీనుని అసూయ వానినే చంపివేస్తుంది.
3 బాగా వేరూనుకొని, వృద్ధిపొందుతున్న ఒక బుద్ధి హీనుణ్ణి చూశాను. (అతను బలంగా, క్షేమంగా ఉన్నా ననుకొన్నాడు).
అయితే అకస్మాత్తుగా వాని ఇల్లు శపించబడింది.
4 ఆ బుద్ధిహీనుని పిల్లలు క్షేమంగా లేరు.
(న్యాయ స్థానంలో) వారిని ఆదుకొనేందుకు నగరద్వారం వద్ద ఎవ్వరూలేరు.
5 ఆ బుద్ధిహీనుని పంటలను ఆకలిగొన్న ప్రజలు తీసుకొంటారు.
ఆకలిగొన్న ఆ మనుష్యలు ముండ్లలో పెరుగుతున్న ధాన్యపు గింజలను కూడా తీసుకొంటారు.
ఆశగలవారు అతని ఐశ్వర్యాన్ని తీసుకొంటారు.
6 చెడ్డ కాలాలు మట్టిలోనుండి రావు.
కష్టం నేలలో నుండి పెరగదు.
7 నిప్పులో నుండి రవ్వలు పైకి లేచినంత
నిశ్చయంగా మనిషి కష్టం కోసమే పుట్టాడు.
8 కాని యోబూ, నేనే గనుక నీవైతే నేను దేవుని తట్టు తిరిగి
నా సమస్య ఆయనతో చెబుతాను.
9 దేవుడు చేసే ఆశ్చర్యకరమైన వాటిని మనుష్యులెవ్వరు గ్రహించలేరు.
దేవుడు చేసే అద్భుతాలకు అంతం లేదు.
10 దేవుడు భూమి మీద వర్షం కురిపిస్తాడు.
ఆయన పొలాలకు నీళ్లు పంపిస్తాడు.
11 దీనుడైన మనిషిని దేవుడు లేవనెత్తుతాడు.
దుఃఖంలో ఉన్న వ్యక్తిని ఆయన చాలా సంతోషపరుస్తాడు.
12 తెలివిగల దుర్మార్గులకు విజయం కలుగకుండా దేవుడు వారి పథకాలను నివారిస్తాడు.
13 దేవుడు తెలివిగల మనుష్యులను వారి కుయుక్తి పథకాల్లోనే పట్టేస్తాడు.
అందుచేత తెలివిగల మనిషి యొక్క పథకాలు విజయవంతం కావు.
14 పగటివేళ సైతం ఆ తెలివిగల మనుష్యులు చీకటిలో వలె తడబడుతారు.
మధ్యాహ్నపు వేళల్లో సైతం రాత్రిపూట ఒకడు తడబడునట్లు తడువులాడుతారు.
15 దేవుడు పేద ప్రజలను మరణం నుండి రక్షిస్తాడు.
బలవంతుల హస్తాలనుండి పేదలను ఆయనే రక్షిస్తాడు.
16 కనుక పేద ప్రజలకు నిరీక్షణ ఉంది.
న్యాయంగా లేని దుర్మార్గులను దేవుడు నాశనం చేస్తాడు.
17 “దేవుడు సరిదిద్దే మనిషి సంతోషంగా ఉంటాడు.
కనుక సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను శిక్షించినప్పుడు, దానిని తోసిపుచ్చకు.
18 దేవుడు చేసిన గాయాలకు
ఆయన కట్లు కడతాడు.
ఆయనే గాయపరుస్తాడు,
కాని ఆయన చేతులే తిరిగి స్వస్థపరుస్తాయి.
19 ఆరు కష్టాలనుండి ఆయన నిన్ను రక్షిస్తాడు;
అవును, ఏడు కష్టాల్లో కూడా నీవు బాధించబడవు.
20 కరువు వచ్చినప్పుడు దేవుడు నిన్ను
మరణంనుండి రక్షిస్తాడు.
యుద్ధంలో దేవుడు నిన్ను
మరణం నుండి కాపాడుతాడు.
21 మనుష్యులు వాడిగల తమ నాలుకలతో నిన్ను గూర్చి చెడుగా మాట్లాడినప్పుడు
దేవుడు నిన్ను రక్షిస్తాడు.
నాశనం వచ్చినప్పుడు
నీవు భయపడాల్సిన పనిలేదు.
22 నాశనం, కరువును చూసి నీవు నవ్వుతావు.
అడవి జంతువులను చూసి నీవు భయపడాల్సిన అవసరం లేదు.
23 నీ ఒడంబడిక దేవునితో ఉంది కనుక నీవు దున్నే పొలాల్లో బండలు ఉండవు.
మరియు అడవి మృగాలు ఎన్నటికీ నీ మీద పడవు.[e]
24 నీ గుడారం క్షేమంగా ఉంది గనుక
నీవు శాంతంగా జీవిస్తావు.
నీవు నీ ఆస్తి లెక్కించగా
ఏదీ పోయి ఉండదు.
25 నీకు చాలామంది పిల్లలు ఉంటారు.
నేలమీద గడ్డి పరకల్లా నీ పిల్లలు చాలామంది ఉంటారు.
26 కోతకాలం వరకు సరిగ్గా పెరిగే గోధుమలా నీవు ఉంటావు.
అవును, నీవు పక్వమయిన వృద్ధాప్యం వరకు జీవిస్తావు.
27 “యోబూ, ఈ విషయాలు మేము పరిశీలించాం. అవి సత్యమైనవని మాకు తెలుసు.
అందుచేత యోబూ, మేము చెప్పు సంగతులను విని, నీ మట్టుకు నీవే వాటిని తెలుసుకో.”
© 1997 Bible League International