Chronological
జల ప్రళయం ఆగి పోవుట
8 అయితే నోవహును దేవుడు మరచిపోలేదు. నోవహును, అతనితో కూడ ఓడలో ఉన్న జంతువులన్నింటిని, పశువులన్నింటిని దేవుడు జ్ఞాపకం చేసుకొన్నాడు. భూమిమీద గాలి వీచేటట్లు దేవుడు చేశాడు. నీళ్లన్నీ కనపడకుండా పోయాయి.
2 ఆకాశం నుండి వర్షం కురవటం ఆగిపోయింది. భూమి క్రింద నుండి నీళ్లు ఉబుకుట కూడ నిలిచిపోయింది. 3-4 నేలమీద నిండిన నీళ్లు బాగా ఇంకిపోవడం మొదలయింది. 150 రోజుల తర్వాత నీళ్లు బాగా తగ్గిపోయాయి, గనుక ఓడ మరల నేలమీద నిలిచింది. అరారాతు పర్వతాల్లో ఒకదాని మీద ఓడ నిలిచింది. ఇది ఏడవ నెల పదిహేడవ రోజు. 5 నీళ్లు ఇంకిపోతూనే ఉన్నాయి, పదవ నెల మొదటి రోజుకు కొండ శిఖరాలు నీళ్లకు పైగా కనబడ్డాయి.
6 నలభై రోజుల తర్వాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తెరిచాడు. 7 ఒక కాకిని నోవహు బయటకు పంపాడు. నీళ్లన్నీ ఇంకి పోయి, నేల ఆరిపోయేంత వరకు ఒక చోటునుండి మరో చోటుకు ఆ కాకి ఎగురుతూనే ఉంది. 8 ఒక పావురాన్ని కూడా నోవహు పంపించాడు. ఆరిన నేలను పావురం తెల్సుకోవాలనుకొన్నాడు నోవహు. అతడు నేల ఇంకా నీళ్లతో నిండి ఉందేమో తెల్సుకోవాలనుకొన్నాడు.
9 నేలమీద ఇంకా నీళ్లు నిండి ఉండటం చేత పావురం తిరిగి ఓడలోకి వచ్చేసింది. నోవహు చేయి బయటకు చాచి పావురాన్ని పట్టుకున్నాడు. ఆ పావురాన్ని నోవహు మళ్లీ ఓడలోకి తెచ్చాడు.
10 ఏడు రోజుల తర్వాత నోవహు పావురాన్ని మళ్లీ బయటకి పంపించాడు. 11 ఆ మధ్యాహ్నం ఆ పావురం మళ్లీ నోవహు దగ్గరకు వచ్చేసింది. తాజా ఒలీవ ఆకు ఆ పావురం నోటిలో ఉంది. భూమిమీద ఆరిన నేల ఉన్నట్లుగా నోవహుకు అది ఒక గుర్తు. 12 ఏడు రోజుల తర్వాత నోవహు పావురాన్ని మరల బయటకి పంపించాడు. అయితే ఈసారి పావురం మరల ఎన్నడూ తిరిగిరాలేదు.
13 ఆ తర్వాత నోవహు ఓడ తలుపులు తెరిచాడు. నేల ఆరిపోయినట్లుగా నోవహు చూశాడు. అది సంవత్సరములో మొదటి నెల మొదటి రోజు. అప్పుడు నోవహు వయస్సు 601 సంవత్సరాలు. 14 రెండవ నెల 27వ రోజుకు నేల పూర్తిగా ఆరిపోయింది.
15 అప్పుడు యెహోవా నోవహుతో అన్నాడు: 16 “ఓడ నేలకు దిగింది. నీవు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడళ్లు ఇప్పుడు బయటకు వెళ్లాలి. 17 జీవమున్న ప్రతి జంతువును, పక్షులన్నింటిని, భూమిమీద ప్రాకు ప్రాణులన్నిటిని నీతోబాటు బయటకు తీసుకొనిరా. ఆ జంతువులు సంతానాభివృద్ధి చెంది, అవి మరల భూమిని నింపుతాయి.”
18 తన కుమారులు, తన భార్య, తన కోడళ్లతో నోవహు బయటకు వెళ్లాడు. 19 జంతువులన్నీ ప్రాకు ప్రాణులన్నీ, ప్రతి పక్షి ఓడను విడచి వెళ్లాయి. జంతువులన్నీ వాటి జాతి ప్రకారం గుంపులుగా బయటకు వచ్చాయి.
20 అప్పుడు యెహోవాకు ఒక బలిపీఠాన్ని నోవహు కట్టాడు. పవిత్రమైన పక్షులన్నింటిలో నుండి, పవిత్రమైన జంతువులన్నింటిలో నుండి కొన్నింటిని నోవహు తీసుకొని, దేవునికి కానుకగా బలిపీఠం మీద వాటిని దహించాడు.
21 యెహోవా ఈ బలుల సువాసనను ఆఘ్రాణించి ఆనందించాడు. యెహోవా తనలో తాను అనుకొన్నాడు, “మనుష్యుల్ని శిక్షించేందుకోసం ఒక పద్ధతిగా మరల ఎన్నడు నేను భూమిని శపించను. మనుష్యులు చిన్నప్పటినుండే దుర్మార్గులు కనుక భూమిమీద జీవిస్తున్న వాటన్నింటిని మరల ఎన్నడును నాశనం చేయను. లేదు, మరల నేను ఇలా చేయను. 22 భూమి ఉన్నంత కాలమూ నాటుటకు, పంట కోయుటకు ఎల్లప్పుడూ ఒక సమయం ఉంటుంది. భూమిమీద ఎప్పటికీ చల్లదనం, వేడి, వేసవికాలం, చలికాలం, పగలు, రాత్రిళ్లు ఉంటాయి.”
నూతన ఆరంభం
9 నోవహును, అతని కుమారులను దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు అతనితో చెప్పాడు: “అధిక సంతానం కలిగి, నీ జనంతో భూమిని నింపు. 2 భూమిమీదనున్న ప్రతి జంతువు, గాలిలో ఎగిరే ప్రతి పక్షి, నేలమీద ప్రాకు ప్రతి ప్రాణి, సముద్రంలోని ప్రతి చేప నీకు భయపడతాయి. వాటన్నిటిపైన నీవు పాలకునిగా ఉంటావు.” 3 “గతంలో నీవు తినేందుకు పచ్చ మొక్కల్ని ఇచ్చాను. ఇప్పుడు ప్రతి జంతువు నీకు ఆహారం అవుతుంది. భూమిపైనున్న సమస్తాన్ని నీకు ఇస్తున్నాను. అదంతా నీదే. 4 అయితే నీకు నేను ఒక ఆజ్ఞ యిస్తున్నాను. దానిలో ఇంకా ప్రాణము (రక్తం) ఉన్న మాంసాన్ని మీరు తినకూడదు. 5 అనగా ఏ మనిషినైనా ఒక జంతువు చంపితే దాని రక్తాన్ని అడుగుతాను, అలానే ఏ మనిషినైనా మరో మనిషి ప్రాణం తీస్తే, ఆ మనిషి రక్తాన్ని అడుగుతాను.
6 “దేవుడు అచ్చం తనలాగే మనుష్యులను చేశాడు.
కనుక యింకొక మనిషిని చంపినవాడు మరో మనిషి చేత చంపబడాలి.
7 “నోవహూ! నీవు, నీ కుమారులు అధిక సంతానం కలిగి, నీ జనంతో భూమిని నింపుదురు గాక!”
8 తర్వాత నోవహుతో, అతని కుమారులతో దేవుడు ఇలా అన్నాడు: 9 “నీతోను నీ తర్వాత నీ ప్రజలతోను ఇప్పుడు నేను నా వాగ్దానం చేస్తున్నాను. 10 నీతోబాటు ఓడలో నుండి బయటకు వచ్చిన పక్షులన్నింటితోను, పశువులన్నింటితోను, జంతువులన్నింటితోను నేను వాగ్దానం చేస్తున్నాను. భూమి మీదనున్న ప్రతి ప్రాణితో నేను వాగ్దానం చేస్తున్నాను. 11 ఇదే నీకు నా వాగ్దానం. వరదనీటిచేత, భూమిమీద సకల ప్రాణులు నాశనం చేయబడ్డాయి. అయితే ఇక ఎన్నటికీ మరల అలా జరుగదు. భూమిమీద సకల ప్రాణులను ఒక వరద మాత్రం ఇక ఎన్నటికీ తిరిగి నాశనం చేయదు.”
12 తర్వాత నోవహు, అతని కుమారులతో యెహోవా యిలా అన్నాడు: “ఈ వాగ్దానం నేను మీకు యిచ్చినట్లు రుజువుగా నేను మీకు ఒకటి ఇస్తాను. మీతోను, భూమిమీద జీవించే ప్రతి ప్రాణితోను ఈ వాగ్దానం నేను చేశానని చెప్పేందుకు ఇది రుజువు. ఈ వాగ్దానం రాబోయే కాలములన్నిటిలో కొనసాగుతుంది. ఇదే ఆ రుజువు. 13 మేఘాల్లో నా రంగుల ధనస్సునుంచుచున్నాను. నాకు, భూమికి జరిగిన ఒడంబడికకు రుజువు ఆ రంగుల ధనస్సు. 14 భూమికి పైగా మేఘాలను నేను రప్పించినపుడు, మేఘాలలో రంగుల ధనస్సును మీరు చూస్తారు. 15 రంగుల ధనస్సును నేను చూపినప్పుడు నీతోను, భూమిమీదనున్న సకల ప్రాణులతోను జరిగిన ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. ఈ భూమిమీద సకల ప్రాణులను ఒక జలప్రళయం మాత్రం ఇంకెన్నడూ నాశనం చేయదు అని ఆ ఒప్పందం చెబుతోంది. 16 మేఘాల్లో ఆ రంగుల ధనస్సును నేను చూచినప్పుడు శాశ్వతంగా కొనసాగే ఆ ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. నాకును, భూమిమీద సకల ప్రాణులకును మధ్య జరిగిన ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను.”
17 కనుక, “భూమిమీద సకల ప్రాణులతోను నేను చేసిన ఒడంబడికకు ఆ మేఘ ధనస్సు రుజువు” అని యెహోవా నోవహుతో చెప్పాడు.
మళ్లీ సమస్యలు ప్రారంభం
18 నోవహుతో కూడ అతని కుమారులు ఓడలోనుండి బయటకు వచ్చారు. వారి పేర్లు షేము, హాము, యాఫెతు. (హాము కనానుకు తండ్రి). 19 ఆ ముగ్గురు మగవాళ్లు నోవహు కుమారులు. మరియు భూమిమీద ప్రజలంతా ఆ ముగ్గురి కుమారులనుండి వచ్చినవాళ్లే.
20 నోవహు వ్యయసాయదారుడయ్యాడు. అతడు ఒక ద్రాక్షతోట నాటాడు. 21 నోవహు ద్రాక్షారసం చేసి, దాన్ని త్రాగాడు. అతడు మత్తెక్కి తన గుడారంలో పండుకొన్నాడు. నోవహు బట్టలు ఏమీ వేసుకొనలేదు. 22 కనాను తండ్రి హాము, దిగంబరంగా ఉన్న తన తండ్రిని చూశాడు. గుడారం వెలుపలున్న తన సోదరులతో హాము ఈ విషయం చెప్పాడు. 23 అప్పుడు షేము, యాఫెతు కలసి ఒక అంగీని తెచ్చారు. వాళ్లు ఆ అంగీని తమ భుజాలమీద మోసి గుడారంలోకి తీసుకువెళ్లారు. వారు వెనక్కి గుడారంలోకి నడిచివెళ్లి బట్టలు లేకుండా ఉన్న తమ తండ్రి ఒంటిమీద బట్ట కప్పారు.
24 ఆ తర్వాత నోవహు మేల్కొన్నాడు. (ద్రాక్షారసంవల్ల అతడు నిద్రపోతూ ఉన్నాడు). అప్పుడు తన చిన్న కుమారుడు హాము తనకు చేసినదాన్ని అతడు తెలుసుకొన్నాడు. 25 కనుక నోవహు అన్నాడు:
“కనాను[a] శపించబడును గాక!
కనాను తన సోదరులకు బానిస అగును గాక!”
26 నోవహు ఇంకా ఇలా అన్నాడు:
“షేము దేవుడగు యెహోవా స్తుతించబడును గాక!
కనాను షేముకు బానిస అవును గాక.
27 యాఫెతుకు దేవుడు ఇంకా ఎక్కువ భూమిని ఇచ్చును గాక!
షేము గుడారాలలో దేవుడు నివసించును గాక!
కనాను వారికి బానిస అవును గాక!”
28 జలప్రళయం తర్వాత నోవహు 350 సంవత్సరాలు బ్రతికాడు. 29 నోవహు మొత్తం 950 సంవత్సరాలు బ్రతికాడు. తరువాత అతడు మరణించాడు.
జనముల అభివృద్ధి, విస్తరణ
10 నోవహు కుమారులు షేము, హాము, యాఫెతు. ప్రళయం తర్వాత ఈ ముగ్గురు మగవాళ్లు ఇంకా అనేకమంది కుమారులకు తండ్రులయ్యారు. షేము, హాము, యాఫెతు ద్వారా వచ్చిన కుమారుల జాబితా ఇది. యాఫెతు వంశస్థులు:
యాఫెతు సంతానము
2 యాఫెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు.
3 గోమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తోగర్మా
4 యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము.
5 మధ్యధరా సముద్రానికి చుట్టు ప్రక్కల దేశాల్లో నివసించు ప్రజలంతా ఈ యాఫెతు కుమారుల సంతానమే. ఒక్కో కుమారునికి ఒక్కో స్వంత దేశం ఉంది. కుటుంబాలన్ని పెరిగి వేరు వేరు జాతులవారయ్యారు. ప్రతి జాతివారికి వారి స్వంత భాష ఉంది.
హాము సంతానము
6 హాము కుమారులు కూషు, మిస్రాయిము,[b] పూతు, కనాను.
7 కూషు కుమారులు సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తకా.
రాయమా కుమారులు షేబ, దదాను.
8 కూషుకు నిమ్రోదు అనే కుమారుడు కూడా ఉన్నాడు. భూమిమీద నిమ్రోదు చాలా శక్తిమంతుడయ్యాడు. 9 నిమ్రోదు యెహోవా యెదుట గొప్ప వేటగాడు. అందుకే మనుష్యులు కొందరిని నిమ్రోదుతో పోల్చి, “ఆ మనిషి యెహోవా యెదుట గొప్ప వేటగాడైన నిమ్రోదువంటివాడు” అంటారు.
10 షీనారు దేశంలో బాబెలు, ఎరెకు, అక్కదుకల్నే అనే చోట్ల నిమ్రోదు రాజ్యం ఆరంభం అయింది. 11 నిమ్రోదు అష్షూరుకు కూడా వెళ్లాడు. అక్కడే నీనెవె, రహోబోతీరు, కాలహు, 12 రెసెను పట్టణాలను అతడు నిర్మించాడు. (నీనెవెకు, కాలహు పట్టణానికి మధ్య రెసెను ఉంది.)
13 లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నప్తుహీయులు, 14 పత్రుసీయులు, కస్లూహీయులు, కఫ్తోరీయుల జనాంగములకు మిస్రాయిము తండ్రి. (ఫిలిష్తీయులు కస్లూహీయులలోనుండి వచ్చినవారే.)
15 సీదోను తండ్రి కనాను. కనాను జ్యేష్ఠ కుమారుడు సీదోను. హేతుకు కనాను తండ్రి. 16 యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, 17 హివ్వీయులు, అర్కీయులు, సినీయులు, 18 అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు అందరికిని కనాను తండ్రి.
కనాను వంశాలు ప్రపంచంలోని వేర్వేరు భాగాలకు వ్యాప్తి చెందాయి. 19 ఉత్తరాన సీదోను నుండి దక్షిణాన గెరారు వరకు, పశ్చిమాన గాజా నుండి తూర్పున సొదొమ, గొమొఱ్ఱా, అద్మా, సెబోయిము నుండి లాషా వరకు కనాను ప్రజల భూభాగమే.
20 ఆ ప్రజలంతా హాము సంతానం. ఆ ప్రజలందరికీ వారి స్వంత భాషలు, స్వంత దేశాలు ఉన్నాయి. వారు వేరు వేరు జాతులయ్యారు.
షేము సంతానము
21 యాఫెతు అన్న షేము. షేము వంశస్థుల్లో ఒకడైన ఏబెరు హెబ్రీ ప్రజలందరికీ తండ్రి.
22 షేము కుమారులు, ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము.
23 అరాము కుమారులు ఊజు, హూలు, గెతెరు, మాష.
24 అర్పక్షదు షేలహుకు తండ్రి.
షేలహు ఏబెరుకు తండ్రి.
25 ఏబెరు ఇద్దరు కుమారులకు తండ్రి, ఒక కుమారునికి పెలెగు[c] అని పేరు పెట్టబడింది. అతని జీవిత కాలములోనే భూమి విభజించబడింది. కనుక అతనికి ఈ పేరు పెట్టబడింది. మరో సోదరుడి పేరు యొక్తాను.
26 యొక్తాను కుమారులు అల్మదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు, 27 హదోరము, ఊజాలు, దిక్లాను 28 ఓబాలు, అబీమాయెలు, షేబ, 29 ఓఫీరు, హవీలా, యోబాబు. ఈ మనుష్యులంతా యొక్తాను కుమారులు. 30 మేషాకు దేశానికి, తూర్పునున్న కొండ దేశానికి మధ్య ఆ ప్రజలు జీవించారు. సెపారా దేశపు దిశలో మేషా ఉంది.
31 వాళ్లు షేము వంశంనుండి వచ్చిన ప్రజలు. వంశాలు, భాషలు, దేశాలు, జాతులను బట్టి వారి క్రమం ఏర్పాటు చేయబడింది.
32 నోవహు కుమారుల వంశాల జాబితా అది. అవి వారి జాతుల ప్రకారం ఏర్పాటు చేయబడ్డాయి. జలప్రళయం తర్వాత భూమి అంతటా వ్యాపించిన ప్రజలందరూ ఆ వంశాల నుండి వచ్చిన వారే.
బాబెలు గోపురం
11 జలప్రళయం తర్వాత మానవులంతా ఒకే భాష మాట్లాడారు. ప్రజలంతా ఒకే పదజాలం ఉపయోగించారు. 2 తూర్పు నుండి ప్రజలు కదిలిపోయారు. షీనారు దేశంలో మైదాన భూమిని వారు కనుగొన్నారు. బ్రతుకుదెరువు కోసం ప్రజలంతా అక్కడే ఉండిపోయారు. 3 “మనం ఇటుకలు చేసి, అవి గట్టిపడేందుకు వాటిని కాల్చాలి” అనుకొన్నారు ప్రజలు. ఇళ్లు కట్టుటకు ప్రజలు రాళ్లు కాక ఇటుకలనే ఉపయోగించారు. అలానే అడుసు కాక తారు ఉపయోగించారు.
4 అప్పుడు ప్రజలు ఇలా అన్నారు: “మన కోసం మనం ఒక పట్టణం కట్టుకోవాలి. ఆకాశం అంత ఎత్తుగా మనం ఒక గోపుర శిఖరం కట్టుకోవాలి. ఇలా గనుక చేస్తే మనం ప్రఖ్యాతి చెందుతాం. ప్రపంచమంతటా మనం చెల్లా చెదురవకుండా ఒకే చోట మనమంతా కలసి ఉంటాం.”
5 ఆ పట్టణాన్ని, ఆ గోపుర శిఖరాన్ని చూచుటకు యెహోవా దిగి వచ్చాడు. వాటిని ప్రజలు నిర్మిస్తూ ఉండటం యెహోవా చూశాడు. 6 యెహోవా ఇలా అన్నాడు: “ఈ ప్రజలంతా ఒకే భాష మాట్లాడుతున్నారు. వీళ్లంతా కలసి ఉమ్మడిగా ఈ పని చేస్తున్నట్లు నాకు కనబడుతోంది. వారు చేయగలిగిన దానికి ఇది ప్రారంభం మాత్రమే. త్వరలో వాళ్లు యోచించినదేదైనా చేయ గలుగుతారు. 7 అందుచేత మనం క్రిందికి వెళ్లి, వారి భాషను గలిబిలి చేద్దాం. అప్పుడు వాళ్లు ఒకరినొకరు అర్థం చేసుకోలేరు.”
8 ఆ ప్రజలు భూలోకం అంతటా చెదిరిపోయేటట్లు యెహోవా చేశాడు. కనుక ఆ పట్టణాన్ని కట్టుకోవటం ఆ ప్రజలు ముగించలేకపోయారు. 9 మొత్తం ప్రపంచంలోని భాషను దేవుడు గలిబిలి చేసిన చోటు అదే. కనుక ఆ స్థలం బాబెలు[d] అని పిలువబడింది. కనుక ఆ స్థలం నుండి భూమిమీద ఇతర చోట్లన్నింటికీ ఆ ప్రజలను యెహోవా చెదరగొట్టాడు.
షేము కుటుంబ చరిత్ర
10 షేము కుటుంబ చరిత్ర ఇది. జలప్రళయం తర్వాత రెండు సంవత్సరాలకు, షేము 100 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, అతని కుమారుడు అర్పక్షదు పుట్టాడు. 11 ఆ తర్వాత షేము 700 సంవత్సరాలు జీవించాడు. అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు ఉన్నారు.
12 అర్పక్షదు 35 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, అతని కుమారుడు షేలహు పుట్టాడు. 13 షేలహు పుట్టిన తర్వాత అర్పక్షదు 403 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కొందరు కుమారులు, కుమార్తెలు పుట్టారు.
14 షేలహుకు 30 సంవత్సరాలు నిండిన తర్వాత అతని కుమారుడు ఏబెరు పుట్టాడు. 15 ఏబెరు పుట్టిన తర్వాత షేలహు 403 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కొందరు కుమారులు, కుమార్తెలు పుట్టారు.
16 ఏబెరుకు 34 సంవత్సరాలు నిండిన తర్వాత అతని కుమారుడు పెలెగు పుట్టాడు. 17 పెలెగు పుట్టిన తర్వాత ఏబెరు 430 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.
18 పెలెగుకు 30 సంవత్సరాలు నిండినప్పుడు అతని కుమారుడు రయూ పుట్టాడు. 19 రయూ పుట్టిన తర్వాత, పెలెగు ఇంకా 209 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కొందరు కుమారులు, కుమార్తెలు పుట్టారు.
20 రయూకు 32 సంవత్సరాలు నిండినప్పుడు, అతని కుమారుడు సెరూగు పుట్టాడు. 21 సెరూగు పుట్టిన తర్వాత రయూ 207 సంవత్సరాలు బ్రతికాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమార్తెలు, కుమారులు పుట్టారు.
22 సెరూగుకు 30 సంవత్సరాలు నిండినప్పుడు అతని కుమారుడు నాహోరు పుట్టాడు. 23 నాహోరు పుట్టిన తర్వాత, సెరూగు 200 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.
24 నాహోరుకు 29 సంవత్సరాలు నిండినప్పుడు అతని కుమారుడు తెరహు పుట్టాడు. 25 తెరహు పుట్టిన తర్వాత నాహోరు 119 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.
26 తెరహుకు 70 సంవత్సరాలు నిండినప్పుడు, అతని కుమారులు అబ్రాము, నాహోరు, హారాను పుట్టారు.
తెరహు కుటుంబ చరిత్ర
27 తెరహు కుటుంబ చరిత్ర ఇది. అబ్రాము, నాహోరు, హారానులకు తండ్రి తెరహు. లోతుకు హారాను తండ్రి. 28 కల్దీయుల ఊరు అనే తన స్వగ్రామంలో హారాను మరణించాడు. తన తండ్రి తెరహు బ్రతికి ఉన్నప్పుడే హారాను చనిపోయాడు. 29 అబ్రాము, నాహోరు పెళ్లి చేసుకొన్నారు. అబ్రాము భార్యకు శారయి అని పేరు పెట్టబడింది. నాహోరు భార్యకు మిల్కా అని పేరు పెట్టబడింది. మిల్కా హారాను కుమార్తె. మిల్కా, ఇస్కాలకు హారాను తండ్రి. 30 శారయికి పిల్లలను కనే అవకాశం లేనందువల్ల ఆమెకు పిల్లలు లేరు.
31 తెరహు తన కుటుంబముతోబాటు కల్దీయుల ఊరు అను పట్టణమును విడచిపెట్టేశాడు. కనానుకు ప్రయాణం చేయాలని వారు ఏర్పాటు చేసుకొన్నారు. తన కుమారుడు అబ్రామును, మనుమడు లోతును (హారాను కుమారుడు), కోడలు శారయిని తెరహు తన వెంట తీసుకు వెళ్లాడు. వారు హారాను పట్టణం వరకు ప్రయాణం చేసి, అక్కడ ఉండిపోవాలని నిర్ణయించుకొన్నారు. 32 తెరహు 205 సంవత్సరాలు జీవించాడు. తర్వాత అతడు హారానులో మరణించాడు.
© 1997 Bible League International