Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
రోమీయులకు 14-16

విమర్శించకండి

14 సంపూర్ణమైన విశ్వాసం లేనివాణ్ణి నిరాకరించకండి. వాదగ్రస్థమైన సంగతుల్ని విమర్శించకండి. ఒకడు అన్నీ తినవచ్చని విశ్వసిస్తాడు. కాని సంపూర్ణ విశ్వాసం లేని ఇంకొకడు కూరగాయలు మాత్రమే తింటాడు. అన్నీ తినే వ్యక్తి అలా చెయ్యని వ్యక్తిని చిన్న చూపు చూడకూడదు. అదే విధంగా అన్నీ తినని వాడు, తినేవాణ్ణి విమర్శించకూడదు. అతణ్ణి కూడా దేవుడు అంగీకరించాడు కదా. ఇతర్ల సేవకునిపై తీర్పు చెప్పటానికి నీవెవరవు? అతడు నిలిచినా పడిపోయినా అది అతని యజమానికి సంబంధించిన విషయం. ప్రభువు అతణ్ణి నిలబెట్ట గలడు కనుక అతడు నిలబడ గలుగుతున్నాడు.

ఒకడు ఒక రోజు కన్నా మరొక రోజు ముఖ్యమైనదని భావించవచ్చు. ఇంకొకడు అన్ని రోజుల్ని సమానంగా భావించవచ్చు. ప్రతి ఒక్కడూ తాను పూర్తిగా నమ్మిన వాటిని మాత్రమే చెయ్యాలి. ఒక రోజును ప్రత్యేకంగా భావించేవాడు ప్రభువు పట్ల అలా చేస్తాడు. మాంసాన్ని తినేవాడు తినటానికి ముందు దేవునికి కృతజ్ఞతలు చెపుతాడు. కనుక అతనికి ప్రభువు పట్ల విశ్వాసం ఉందన్నమాట. తిననివాడు కూడా ప్రభువుకు కృతజ్ఞతలు చెపుతాడు కనుక అతనికి కూడా ప్రభువు పట్ల విశ్వాసము ఉందన్నమాట.

మనలో ఎవ్వరూ తమకోసం మాత్రమే బ్రతకటం లేదు. అదే విధంగా తమ కోసం మాత్రమే మరణించటం లేదు. మనం జీవిస్తున్నది ప్రభువు కొరకు జీవిస్తున్నాము. మనం మరణించేది ప్రభువు కోసం మరణిస్తున్నాము. అందువల్ల మనం మరణించినా, జీవించినా ప్రభువుకు చెందిన వాళ్ళమన్నమాట. ఈ కారణంగానే మరణించిన వాళ్ళకు, జీవించే వాళ్ళకు ప్రభువుగా ఉండాలని క్రీస్తు చనిపోయి తిరిగి బ్రతికి వచ్చాడు.

10 ఇక ఇదిగో, నీవు నీ సోదరునిపై ఎందుకు తీర్పు చెపుతున్నావు? మరి మీలో కొందరెందుకు మీ సోదరుని పట్ల చిన్నచూపు చూస్తున్నారు? మనమంతా ఒక రోజు దేవుని సింహాసనం ముందు నిలబడతాము. 11 దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది:

“ప్రభువు ఈ విధంగా అన్నాడు: నాపై ప్రమాణం చేసి చెపుతున్నాను.
    నా ముందు అందరూ మోకరిల్లుతారు,
    దేవుని ముందు ప్రతి నాలుక ఆయన అధికారాన్ని అంగీకరిస్తుంది.”(A)

12 అందువల్ల మనలో ప్రతి ఒక్కడూ తనను గురించి దేవునికి లెక్క చూపవలసి ఉంటుంది.

ఇతరులు పాపం చేసేలా చేయకు

13 కాబట్టి ఇతర్లపై తీర్పు చెప్పటం మానుకొందాం. అంతేకాక, మీ సోదరుని మార్గంపై అడ్డురాయి పెట్టనని, అతనికి ఆటంకాలు కలిగించనని తీర్మానం చేసుకోండి. 14 ఏ ఆహారం అపవిత్రం కాదని యేసు ప్రభువు ద్వారా నేను తెలుసుకొన్నాను. కానీ ఎవరైనా ఒక ఆహారం అపవిత్రమని తలిస్తే అది అతనికి అపవిత్రమౌతుంది.

15 నీవు తినే ఆహారం వల్ల నీ సోదరునికి దుఃఖం కలిగితే నీవు ప్రేమగా ఉండటం మానుకొన్నావన్న మాట. నీ ఆహారం కారణంగా నీ సోదరుణ్ణి నాశనం చెయ్యవద్దు. అతని కోసం క్రీస్తు మరణించాడు. 16 నీ మంచి పనుల్ని ఇతర్లు దూషించకుండా ప్రవర్తించు. 17 దేవుని రాజ్యం అంటే తినటం, త్రాగటం కాదన్నమాట. అది పవిత్రాత్మ ద్వారా లభించే నీతికి, శాంతికి, ఆనందానికి సంబంధించింది. 18 ఈ విధంగా క్రీస్తు సేవ చేసినవాణ్ణి దేవుడు మెచ్చుకొంటాడు. ఇతర్లు కూడా మెచ్చుకొంటారు.

19 అందువల్ల మనము శాంతికి, మన అభివృద్ధికి దారి తీసే కార్యాలను చేద్దాం. 20 ఆహారం కొరకు దేవుని పనిని నాశనం చెయ్యకూడదు. అన్ని ఆహారాలు తినవచ్చు. కాని, ఇతర్ల ఆటంకానికి కారణమయ్యే ఆహారాన్ని తినటం అపరాధం. 21 నీ సోదరుడికి ఆటంక కారకుడివి అవటం కన్నా, మాంసాన్ని తినకుండా ఉండటం, ద్రాక్షారసం త్రాగకుండా ఉండటంలాంటి పన్లేవీ చెయ్యకుండా ఉండటం ఉత్తమం.

22 అందువల్ల వీటి విషయంలో నీవు ఏది నమ్మినా ఎలా ఉన్నా అది నీకు, దేవునికి సంబంధించిన విషయం. తానంగీకరిస్తున్న వాటి విషయంలో తనను తాను నిందించుకోని వ్యక్తి ధన్యుడు. 23 సందేహిస్తూ తినే వ్యక్తి విశ్వాసం లేకుండా తింటున్నాడు. కనుక దేవుడతనికి శిక్ష విధిస్తాడు. విశ్వాసంతో చేయని పనులన్నీ పాపంతో కూడుకొన్నవి.

15 సంపూర్ణ విశ్వాసం గల మనము సంపూర్ణ విశ్వాసం లేనివాళ్ళ బలహీనతల్ని సహించాలి. మనం మన ఆనందం మాత్రమే చూసుకోకూడదు. ప్రతి వ్యక్తి తన సోదరుని మేలు కోసం, అభివృద్ధి కోసం అతనికి అనుగుణంగా నడుచుకోవాలి. క్రీస్తు కూడా తన ఆనందం మాత్రమే చూసుకోలేదు. దీన్ని గురించి ఈ విధంగా వ్రాసారు: “దేవా! నిన్ను అవమానించినవాళ్ళు నన్నూ అవమానించారు.” గతంలో వ్రాసిన లేఖనాలు మనకు బోధించటానికి వ్రాశారు. వాటి ద్వారా సహనము, ప్రోత్సాహము పొంది, రక్షణ లభిస్తుందన్న నమ్మకం మనలో కలగాలని దానిలోని ఉద్దేశ్యం. మనలో సహనము, ప్రోత్సాహము కలుగచేసే దేవుడు, యేసు క్రీస్తు ద్వారా మీ మధ్య ఐకమత్యము కలుగచేయునుగాక! అప్పుడు మనము ఒకే హృదయంతో, ఒకే నాలుకతో మన యేసు క్రీస్తు ప్రభువుకు తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్తుతించగలుగుతాము. దేవునికి ఘనత కలగాలని క్రీస్తు మిమ్మల్ని అంగీకరించినట్లే మీరు కూడా ఇతర్లను అంగీకరించండి. మూలపురుషులకు దేవుడు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టాలని, దేవుడు సత్యవంతుడని నిరూపించాలని, క్రీస్తు యూదుల సేవకుడు అయ్యాడు. యూదులు కానివాళ్ళు దేవుని అనుగ్రహం కోసం ఆయన్ని స్తుతించాలని క్రీస్తు ఉద్దేశ్యం. ఈ సందర్భాన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది:

“ఈ కారణంగానే యూదులు కాని వాళ్ళతో కలిసి నిన్ను స్తుతిస్తాను.
    నీ పేరిట భక్తి గీతాలు పాడతాను.”(B)

10 మరొక చోట:

“యూదులు కాని ప్రజలారా!
    మీరు కూడా దేవుని ప్రజలతో ఆనందించండి.”(C)

11 ఇంకొక చోట ఇలా వ్రాయబడి వుంది:

“యూదులు కాని ప్రజలారా! ప్రభువును స్తుతించండి.
    ఆయన్ని స్తుతిస్తూ గీతాలు పాడండి!”(D)

12 యెషయా ఒక చోట ఈ విధంగా అన్నాడు:

“యెష్షయి వంశ వృక్షం యొక్క వేరు చిగురిస్తుంది.
    ఆయన దేశాలను పాలిస్తాడు.
    యూదులు కానివాళ్ళు ఆయనలో నిరీక్షిస్తారు.”(E)

13 రక్షణ లభిస్తుందని నిరీక్షణ కలిగించే ఆ దేవుడు మీలో ఉన్న విశ్వాసం ద్వారా మీకు సంపూర్ణమైన ఆనందాన్ని, శాంతిని కలుగ చేయుగాక! అప్పుడు మీలో ఉన్న నిరీక్షణ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పొంగి పొర్లుతుంది.

ఉద్దేశ్యం

14 సోదరులారా, మీలో మంచితనముందని, సంపూర్ణమైన జ్ఞానం మీలో ఉందని, పరస్పరం బోధించుకోగల సామర్థ్యం మీలో ఉందని నాకు నమ్మకం ఉంది. 15 అయినా నేను కొన్ని విషయాల్ని గురించి మీకు జ్ఞాపకం చెయ్యాలని వాటిని గురించి మీకు ధైర్యంగా వ్రాసాను. దేవుడిచ్చిన వరం వల్ల ఇది చెయ్యగలిగాను. ఆ వరము ఏదనగా 16 నేను యాజకునిగా పని చేస్తూ దైవసందేశాన్ని యూదులు కానివాళ్ళకు బోధించాలని దేవుడు నన్ను యేసు క్రీస్తుకు సేవకునిగా చేసాడు. ఇందువలన యూదులు కానివాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా పవిత్రం చేయబడి దేవునికి అంగీకారమైన సంతానం కాగలరు.

17 అందువల్ల, నేను యేసు క్రీస్తు ద్వారా దేవుని సేవ చేస్తున్నందుకు గర్విస్తున్నాను. 18 క్రీస్తు నా ద్వారా చేసినవాటిని గురించి మాత్రమే నేను ధైర్యంగా చెప్పుకుంటాను. యూదులు కానివాళ్ళు నేను చేసిన బోధనల ద్వారా, నా కార్యాల ద్వారా దైవసందేశాన్ని అనుసరించేటట్లు క్రీస్తు చేసాడు. 19 గుర్తుల ద్వారా, అద్భుతాల ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ పని సాధించాడు. అందుకే యెరూషలేము నుండి ఇల్లూరికు దాకా అన్ని ప్రాంతాలలో క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించగలిగాను. 20 క్రీస్తును గురించి తెలియని ప్రాంతాలలో సువార్తను ప్రకటించాలనే ఆశయం నాలో ఉంది. మరొకడు వేసిన పునాదిపై ఇల్లు కట్టటం నాకిష్టం లేదు. 21 అందుకే ఈ విధంగా వ్రాయబడి ఉంది:

“ఆయన్ని గురించి చెప్పబడినవాళ్ళు చూస్తారు.
    కాని వాళ్ళు తెలుసుకొంటారు. ఆయన్ని గురించి విననివాళ్ళు అర్థం చేసుకొంటారు.”(F)

రోము నగరాన్ని దర్శించాలని ప్రయత్నం

22 మీ దగ్గరకు రావటానికి ఈ పరిస్థితుల కారణంగా నాకు ఎన్నో ఆటంకాలు కలిగాయి.

23 ఈ ప్రాంతంలో నేను చేయవలసిన పని ముగిసింది. అంతేకాక ఎన్నో సంవత్సరాల నుండి మిమ్ముల్ని కలుసుకోవాలనుకొంటున్నాను. 24 నేను స్పెయిను దేశానికి వెళ్ళేటప్పుడు రోము నగరానికి వచ్చి కొన్ని రోజులు మీతో ఆనందంగా గడపాలని ఆశిస్తున్నాను. అక్కడి నుండి నేను ప్రయాణం సాగించినప్పుడు మీరు నాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను.

25 కాని ప్రస్తుతం నేను యెరూషలేములోని దేవుని ప్రజలకు సహాయం చెయ్యటానికి అక్కడికి వెళ్తున్నాను. 26 ఎందుకంటే యెరూషలేములోని దేవుని ప్రజల్లో ఉన్న పేదవాళ్ళ కోసం మాసిదోనియ, అకయ ప్రాంతాలలోని సోదరులు చందా ఇవ్వటానికి ఆనందంగా అంగీకరించారు. 27 వాళ్ళు ఈ చందా ఆనందంగా ఇచ్చారు. వాళ్ళకు వీళ్ళు సహాయం చెయ్యటం సమంజసమే. ఎందుకంటే, యూదులు కానివాళ్ళు, యెరూషలేములోని దేవుని ప్రజలు ఆత్మీయ ఆశీర్వాదంలో భాగం పంచుకొన్నారు. కనుక తమకున్న వాటిని వీళ్ళు వాళ్ళతో పంచుకోవటం సమంజసమే. 28 ఈ కార్యాన్ని ముగించి వాళ్ళందరికీ చందా తప్పక ముట్టేటట్లు చూసి స్పెయిను దేశానికి వెళ్ళే ముందు మిమ్మల్ని చూడటానికి వస్తాను. 29 నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు క్రీస్తునుండి సంపూర్ణంగా ఆశీస్సులు పొంది వస్తానని నాకు తెలుసు.

30 సోదరులారా! మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేమ ద్వారా మిమ్మల్ని వేడుకొనేదేమిటంటే, నా కోసం దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థించండి. 31 యూదయ ప్రాంతంలోని విశ్వాసహీనులనుండి నేను రక్షింపబడాలని, యెరూషలేములోని దేవుని ప్రజలు నా సహాయాన్ని ఆనందంగా అంగీకరించాలని ప్రార్థించండి. 32 తదుపరి, నేను దేవుని చిత్తమైతే మీ దగ్గరకు ఆనందంగా వచ్చి మీతో సమయం గడుపుతాను. 33 శాంతి ప్రదాత అయినటువంటి దేవుడు మీ అందరికీ తోడుగా ఉండు గాక! ఆమేన్.

కుశలములు

16 కేంక్రేయ పట్టణంలో ఉన్న సంఘానికి సేవ చేస్తున్న మన సోదరి ఫీబే చాలా మంచిది. దేవుని ప్రజలకు తగిన విధంగా ప్రభువు పేరట ఆమెకు స్వాగతం చెప్పండి. ఆమె అనేకులకు చాలా సహాయం చేసింది. నాకు కూడా చాలా సహాయం చేసింది. కనుక ఆమె మీ నుండి సహాయం కోరితే ఆ సహాయం చెయ్యండి.

నాతో కలిసి యేసు క్రీస్తు సేవ చేస్తున్న ప్రిస్కిల్లకు, ఆమె భర్త అకులకు నా వందనాలు చెప్పండి. వాళ్ళు నా కోసం తమ ప్రాణాలనే తెగించారు. నేనే కాక, యూదులు కానివాళ్ళ సంఘాలన్నీ వాళ్ళకు కృతజ్ఞతతో ఉంటాయి.

వాళ్ళ ఇంట్లో సమావేశమయ్యే వాళ్ళందరికీ నా వందనాలు చెప్పండి.

ఆసియ ప్రాంతంలో క్రీస్తును నమ్మినవాళ్ళలో నా ప్రియమిత్రుడు ఎపైనెటు మొదటివాడు. అతనికి నా శుభములు అందించండి.

మీ కోసం చాలా కష్టపడి పని చేస్తున్న మరియకు నా వందనములు చెప్పండి.

నాతో సహా కారాగారంలో గడిపిన నా బంధువులు ఆంద్రొనీకుకు, యూనీయకు నా వందనాలు చెప్పండి. వాళ్ళు అపొస్తలులలో గొప్పవారు. అంతేకాక వాళ్ళు నాకన్నా ముందే క్రీస్తును అంగీకరించారు.

ప్రభువు వల్ల నేను, అంప్లీయతు స్నేహితులమయ్యాము. అతనికి నా వందనాలు చెప్పండి. మాతో కలిసి క్రీస్తు సేవచేస్తున్న ఊర్బానుకు,

నా ప్రియ మిత్రుడైనటువంటి స్టాకుకు నా వందనాలు చెప్పండి. 10 అపెల్లెకు క్రీస్తు పట్ల నిజమైన భక్తి ఉన్నట్లు నిరూపించబడింది. అతనికి నా వందనాలు చెప్పండి.

అరిస్టొబూలు కుటుంబానికి చెందిన వాళ్ళకు వందనాలు చెప్పండి. 11 హెరోదియోను నా బంధువు. అతనికి వందనాలు చెప్పండి.

ప్రభువుకు చెందిన నార్కిస్సు కుటుంబాన్ని అడిగానని చెప్పండి. 12 ప్రభువు కోసం కష్టించి పని చేస్తున్న త్రుపైనా, త్రుఫోసా అనే స్త్రీలకు నా వందనాలు చెప్పండి.

మరొక స్త్రీ పెర్సిసు చాలా కష్టించి పని చేసింది. ఆమెకు నా వందనాలు చెప్పండి.

13 ప్రభువు ఎన్నుకొన్న రూపునకు, అతని తల్లికి నా వందనాలు చెప్పండి. అతని తల్లి నాకు కూడా తల్లిలాంటిది.

14 అసుంక్రితుకు, ప్లెగోనుకు, హెర్మేకు, పత్రొబకు, హెర్మాకు, వాళ్ళతో ఉన్న ఇతర సోదరులకు వందనాలు చెప్పండి.

15 పిలొలొగుకు, యూలియా అనే సోదరికి, నేరియకు, అతని సోదరికి, ఒలుంపాకు, వాళ్ళతో ఉన్న దేవుని ప్రజలందరికి వందనాలు చెప్పండి.

16 మీరు ఒకరినొకరు కలిసినప్పుడు పవిత్రమైన ముద్దులతో పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకోండి.

క్రీస్తు సంఘాలన్నీ మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి.

17 సోదరులారా! నేను మిమ్మల్ని అర్థించేదేమిటంటే చీలికలు కలిగించేవాళ్ళను, మీ దారికి ఆటంకాలు కలిగించేవాళ్ళను, మీరు నేర్చుకొన్నవాటికి వ్యతిరేకంగా బోధించేవాళ్ళను గమనిస్తూ వాళ్ళకు దూరంగా ఉండండి. 18 అలాంటివాళ్ళు యేసు క్రీస్తు ప్రభువు సేవ చెయ్యరు. దానికి మారుగా వాళ్ళు తమ కడుపులు నింపుకొంటారు. మంచి మాటలు ఆడుతూ, ముఖస్తుతి చేస్తూ అమాయకుల్ని మోసం చేస్తూ ఉంటారు. 19 మీరు క్రీస్తును చాలా విధేయతతో అనుసరిస్తున్నారన్న విషయం అందరూ విన్నారు. అందువల్ల మీ విషయంలో చాలా ఆనందంగా ఉంది. మీరు మంచివాటిని గురించి జ్ఞానం సంపాదిస్తూ చెడు విషయంలో అజ్ఞానులుగా ఉండాలని నా కోరిక!

20 శాంతిదాత అయినటువంటి దేవుడు త్వరలోనే సాతాన్ను మీ కాళ్ళ క్రింద అణగ త్రొక్కుతాడు.

మన యేసు క్రీస్తు ప్రభువు యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉండుగాక!

21 నాతో కలిసి సేవ చేస్తున్న తిమోతి మీకు వందనములు తెలుపుతున్నాడు. నా బంధువులు, లూకియ, యాసోను, సోసిపత్రు కూడా మీకు వందనాలు తెలుపుతున్నారు.

22 పౌలు చెప్పుచున్న ఈ లేఖను వ్రాస్తున్న తెర్తియు అనే నేను ప్రభువు పేరిట మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

23 మొత్తం సంఘానికి, నాకు ఆతిథ్యమిస్తున్న గాయి మీకు వందనాలు చెపుతున్నాడు. పట్టణ కోశాధికారి అయిన ఎరస్తు, మా సోదరుడు క్వర్తు మీకు వందనాలు తెలుపమన్నారు.

24-25 నేను బోధించే సువార్తానుసారం, యేసు క్రీస్తును గురించి ప్రకటించిన సందేశానుసారం ఎన్నో సంవత్సారాలనుండి దాచబడి ప్రస్తుతం వ్యక్తం చెయ్యబడిన ఈ రహస్య సత్యం ప్రకారం, మీలో ఉన్న విశ్వాసాన్ని దృఢ పరచగలుగుతున్న ఆ దేవుణ్ణి స్తుతించుదాం.[a] 26 కాని ఇప్పుడు ప్రవక్తల వ్రాతల మూలంగా ఆ రహస్య సత్యం బయటపడింది. అందరూ దేవుణ్ణి విశ్వసించి విధేయతతో ఆయన్ని అనుసరించాలని అమరుడైన దేవుని ఆదేశానుసారం అన్ని దేశాలకు ఆ రహస్యం తెలుపబడింది. 27 సర్వజ్ఞుడైనటువంటి దేవునికి, యేసు క్రీస్తు ద్వారా సదా మహిమ కలుగుగాక! ఆమేన్.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International