Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
రోమీయులకు 4-7

అబ్రాహాము యొక్క విశ్వాసం

అబ్రాహాము మన మూలపురుషుడు. అతడు ఈ విషయంలో ఏమి నేర్చుకొన్నాడు! అబ్రాహాము చేసిన కార్యాలవలన అతడు నీతిమంతునిగా పరిగణింపబడి ఉంటే అతడు గర్వించటానికి కారణం ఉండేది. కాని దేవుని యెదుట కాదు ఈ విషయాన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది: “అబ్రాహాము దేవుణ్ణి విశ్వసించాడు కనుక దేవుడు అతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు.”(A)

పనిచేసేవానికి కూలి దొరుకుతుంది. అది అతని హక్కు. ఆ వచ్చిన జీతం బహుమానం కాదు. దుర్మార్గుల్ని నీతిమంతులుగా చెయ్యగల దేవుడు, వాళ్ళు కార్యాలు చెయ్యకపోయినా వాళ్ళు తనను విశ్వసిస్తే, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళను నీతిమంతులుగా పరిగణిస్తాడు. క్రియలు చేయకున్నా దేవునిచే నీతిమంతునిగా పరిగణింపబడిన మానవుడు ధన్యుడు. ఈ విషయాన్ని గురించి దావీదు ఈ విధంగా అన్నాడు:

“దేవుడు ఎవరి తప్పుల్ని,
    పాపాల్ని క్షమిస్తాడో వాళ్ళు ధన్యులు.
ఎవరి పాపాల్ని ప్రభువు వాళ్ళ లెక్కలో
    వెయ్యడో వాళ్ళు ధన్యులు.”(B)

మరి, సున్నతి చేయించుకొన్నవాళ్ళు మాత్రమే ధన్యులా లేక సున్నతి చేయించుకోనివాళ్ళు కూడా ధన్యులా? అబ్రాహాములో విశ్వాసం ఉండటం వల్ల దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడని మనమంటూ వచ్చాము. 10 దేవుడు అతణ్ణి నీతిమంతునిగా ఎప్పుడు అన్నాడు? సున్నతి చేయించుకొన్న పిదపనా లేక ముందా? సున్నతి చేయించుకున్న పిదప కాదు, ముందే. 11 అబ్రాహాము సున్నతి చేయించుకోకముందు అతనిలో విశ్వాసముండటం వల్ల దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు. దీనికి చిహ్నంగా అబ్రాహాము సున్నతిని ఒక ముద్రగా పొందాడు. తద్వారా సున్నతి పొందకున్నా, విశ్వాసం ఉన్నవాళ్ళకు అతడు తండ్రి అయ్యాడు. వీళ్ళను నీతిమంతులుగా పరిగణించాలని దేవుని ఉద్దేశం. 12 అబ్రాహాము సున్నతి చేయించుకొన్నవాళ్ళకు కూడా తండ్రి. అంటే అందరికి కాదు. మన తండ్రి అబ్రాహాము సున్నతి చేయించుకోకముందు నుండి అతనిలో ఉన్న విశ్వాసాన్ని తమలో చూపిన వాళ్ళకు మాత్రమే అతడు తండ్రి.

విశ్వాసంద్వారా దేవుని వాగ్దానం పొందెను

13 అబ్రాహాము మరియు అతని సంతానం ప్రపంచాన్ని వారసత్వంగా పొందుతారని దేవుడు వాగ్దానం చేసాడు. ఈ వాగ్దానం ధర్మశాస్త్రాన్ని పాటించినందుకు చెయ్యలేదు. అతనిలో విశ్వాస ముండటంవలన దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించి ఈ వాగ్దానం చేసాడు. 14 ఒకవేళ వారసులు కావటానికి ధర్మశాస్త్రం కారణమైతే, విశ్వాసానికి విలువ ఉండదు. పైగా వాగ్దానానికి అర్థం ఉండదు. 15 ధర్మశాస్త్రం ఉంటే దేవుని ఆగ్రహం ఉంటుంది. కాని ధర్మశాస్త్రం లేకపోతే దాన్ని అతిక్రమించే ప్రశ్నేరాదు.

16 ఆ వాగ్దానము విశ్వాసము ఉండటంవల్ల సంభవిస్తోంది. అది ఉచితంగా లభించాలని దేవుని ఉద్దేశ్యం. అది అబ్రాహాము సంతానానికంతా వర్తిస్తుందని దేవుడు అభయమిచ్చాడు. అంటే ధర్మశాస్త్రం ఉన్నవాళ్ళకే కాకుండా అబ్రాహాములో ఉన్న విశ్వాసాన్ని తమలో వ్యక్తం చేసేవాళ్ళకు కూడా అది వర్తిస్తుందన్న మాట. అబ్రాహాము మనందరికీ తండ్రి. 17 దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది: “నేను నిన్ను ఎన్నో జనాంగములకు తండ్రిగా చేస్తాను.”(C) దేవుని దృష్టిలో అబ్రాహాము మనకు తండ్రిలాంటి వాడు. దేవుడు చనిపోయినవాళ్ళకు ప్రాణం పొయ్యగలడు. తన ఆజ్ఞలతో లేనివాటిని సృషించగలడు. అలాంటి దేవుణ్ణి అబ్రాహాము విశ్వసించాడు.

18 నిరాశ సమయంలో అబ్రాహాము ఆశతో నమ్ముకొన్నాడు. అందుకే అతడు ఎన్నో జనములకు తండ్రి అయ్యాడు. “నీ సంతతివాళ్ళు చాలా మంది ఉంటారు” అని దేవుడు చెప్పిన ప్రకారమే జరిగింది. 19 అప్పటికి అబ్రాహాముకు సుమారు నూరు సంవత్సరాల వయస్సు. అతని శరీరం బలహీనంగా ఉండింది. పైగా శారాకు గర్భం దాల్చే వయస్సు దాటిపోయి ఉంది. ఈ సంగతులు అబ్రాహాముకు తెలుసు. అయినా అతని విశ్వాసం సన్నగిల్లలేదు. 20 దేవుడు చేసిన వాగ్దానంలో అతడు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. దానికి మారుగా అతడు దృఢ విశ్వాసంతో దేవుణ్ణి స్తుతించాడు. 21 దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని నిలుపుకోగలడని, ఆ శక్తి ఆయనలో ఉందని అబ్రాహాముకు సంపూర్ణమైన విశ్వాసం ఉండినది. 22 ఈ కారణంగానే, “దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు” 23 “నీతిమంతునిగా పరిగణించాడు” అన్న పదాలు అతనికొరకు మాత్రమే వ్రాయబడలేదు. 24 అవి మనకోసం కూడా వ్రాయబడ్డాయి. మనము మన యేసు ప్రభువును బ్రతికించిన దేవునియందు విశ్వసిస్తున్నాము. కనుక దేవుడు మనల్ని కూడా నీతిమంతులుగా పరిగణిస్తాడు. 25 దేవుడు మన పాపాల కోసం ఆయన్ని మరణానికి అప్పగించాడు. మనం నీతిమంతులం కావాలని ఆయన్ని బ్రతికించాడు.

దేవునితో స్నేహము

మనలో విశ్వాసము ఉండటం వలన దేవుడు మనము నీతిమంతులమని తీర్పు చెప్పాడు. ఆ కారణంగా, మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా మనకు దేవునితో స్నేహం కలిగింది. మనం ప్రస్తుతం జీవిస్తున్న జీవితం దేవుని అనుగ్రహం వల్ల సంభవించింది. ఇది విశ్వాసంగల మనకు యేసు క్రీస్తు ద్వారా లభించింది. దేవుని తేజస్సులో భాగం పంచుకొంటామనే ఆశ మనలో ఉండటం వల్ల మనకు ఎంతో ఆనందం కలుగుతోంది. అంతేకాదు, కష్టాలు సహనాన్ని పెంపొందింపచేస్తాయని మనకు తెలుసు. కనుక మనము కష్టాలు అనుభవించటంలో కూడా ఆనందాన్ని పొందుతున్నాము. సహనం వల్ల దేవుని మెప్పు, మెప్పువల్ల ఆయన తేజస్సులో భాగం పంచుకొంటామనే నిరీక్షణ కలుగతోంది. దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రేమను మనపై కురిపించాడు. కనుక ఆ ఆశ విషయంలో మనకు నిరాశ కలుగదు.

నిజానికి మనలో శక్తి లేని సమయాన భక్తిహీనులమైన మన కోసం క్రీస్తు మరణించాడు. నీతిమంతుల కోసం మరణించటం చాలా అరుదు. మంచి స్నేహితుని కోసం ఒకడు ధైర్యం చేసి, మరణిస్తే మరణించవచ్చు. కాని మనమింకా పాపంలో ఉన్నప్పుడే క్రీస్తు మనకోసం మరణించాడు. ఈ విధంగా దేవుడు తన ప్రేమను మనకోసం వ్యక్తం చేసాడు.

దేవుడు యేసు క్రీస్తు రక్తంద్వారా మనము నీతిమంతులమని తీర్పు చెప్పాడు. కనుక మనము దేవుని ఆగ్రహం నుండి తప్పకుండా రక్షింపబడుతాము. ఇది యేసు క్రీస్తు ద్వారా సంభవిస్తుంది. 10 ఒకప్పుడు మనం దేవుని శత్రువులం. అయినా తన కుమారుని మరణంవల్ల మనకు ఆయనతో సమాధానం కలిగింది. కనుక క్రీస్తు జీవితం ద్వారా ఆయన మనల్ని తప్పకుండా రక్షిస్తాడు. 11 పైగా మన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవునితో స్నేహం కలిగినందుకు మనం ఇప్పుడు ఆనందిస్తున్నాము.

ఆదాము వల్ల మరణం, క్రీస్తు వల్ల జీవం

12 పాపం ఈ ప్రపంచంలోకి ఆదాము ద్వారా ప్రవేశించింది. పాపం ద్వారా మరణం సంభవించింది. అంతేకాక అందరూ పాపం చేసారు కనుక అందరికీ మరణం ప్రాప్తించింది. 13 ధర్మశాస్త్రానికి ముందే పాపం ఈ ప్రపంచంలో ఉండేది. కాని ధర్మశాస్త్రం లేక పోయినట్లైతే పాపం లెక్కలోకి వచ్చేది కాదు. 14 అయినా, ఆదాము కాలంనుండి మోషే కాలం వరకు మానవులపై మరణం రాజ్యం చేసింది. ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. కాని అతనివలే పాపం చెయ్యనివాళ్ళపై కూడా మరణం రాజ్యం చేసింది.

ఆదాముకు, రానున్నవానికి కొంత పోలిక ఉంది. 15 కాని దేవుడు ఇచ్చిన వరానికి, ఆదాము చేసిన పాపానికి పోలిక లేదు. ఒకడు చేసిన పాపం వల్ల చాలా మంది మరణించారు. మరొకని అనుగ్రహం వల్ల, అంటే యేసు క్రీస్తు అనుగ్రహంవల్ల, దేవునిలో వరము, ఆయన అనుగ్రహము ఉచితంగా లభించాయి. 16 పైగా ఆదాము ఒక్కసారి చేసిన పాపానికి నేరస్థుడుగా తీర్పు ఇవ్వబడింది. కాని ఎన్నో పాపాలు చేసిన మనకు దేవుని నుండి నీతిమంతులముగా అయ్యే వరం లభించింది. అందువల్ల ఆదాము పాపాన్ని దేవుని వరంతో పోల్చలేము. 17 ఆదాము పాపం చేసాడు. ఆ ఒక్కని పాపంవల్ల మరణం రాజ్యం చేసింది. కాని ఆ “ఇంకొకని” ద్వారా అంటే యేసు క్రీస్తు ద్వారా ఆధ్యాత్మిక జీవితం పొంది రాజ్యం చెయ్యటం తథ్యం. ఇది దేవుని నుండి నీతియను వరాన్ని, సంపూర్ణమైన ఆయన అనుగ్రహాన్ని పొందినవాళ్ళకు సంభవిస్తుంది.

18 అందువల్ల ఒకడు చేసిన పాపంవల్ల ప్రజలందరికీ శిక్ష విధించబడింది. అదే విధంగా ఒకడు ఒక నీతికార్యాన్ని చేయటంవల్ల, అందరూ శిక్షను తప్పించుకొని అనంతజీవితం పొందుటకు మార్గమేర్పడింది. 19 ఒకని అవిధేయతవల్ల అనేకులు పాపులుగా చేయబడిరి. అలాగే ఒకని విధేయతవల్ల అనేకులు నీతిమంతులగుదురు. 20 పాపం అధికం కావాలని దేవుడు ధర్మశాస్త్రాన్నిచ్చాడు. కాని పాపం అధికమైన చోటే అనుగ్రహం ఇంకా అధికమయ్యింది. 21 పాపం మరణం ద్వారా రాజ్యం చేసినట్లు దైవానుగ్రహం నీతిద్వారా రాజ్యం చేసింది. మన యేసు క్రీస్తు ప్రభువుద్వారా అది మనకు అనంత జీవం కలిగిస్తుంది.

పాపం విషయంలో మరణించాము గాని క్రీస్తులో బ్రతికినాము

దైవానుగ్రహం అధికం కావాలని మనం పాపం చేసుకొంటూ పోదామంటారా? ఎన్నటికి కాదు. పాపపు జీవితం విషయంలో మనం మరణించినవారము. అలాంటప్పుడు మనం పాపంలో జీవించుకొంటూ ఎట్లా ఉండగలము? బాప్తిస్మము పొందిన మన మందరము క్రీస్తు యేసులో ఐక్యత పొందాము. ఈ బాప్తిస్మము ద్వారా ఆయన మరణంలో కూడా భాగం పంచుకొన్నామని మీకు తెలియదా? ఈ బాప్తిస్మము ద్వారా మరణించి మనం ఆయనతో సహా సమాధి పొందాము. తండ్రి తేజస్సు ద్వారా క్రీస్తు బ్రతికింపబడినట్లుగానే మనం కూడా నూతన జీవితాన్ని పొందటమే ఇందులోని ఉద్దేశ్యం.

మనం ఆయన మరణంలో ఐక్యమైనట్లుగా ఆయన పునరుత్ధానములో కూడా మనం ఐక్యం కాగలం. మన పాపజీవితం క్రీస్తుతో కూడ సిలువ వేయబడినందున, ఈ పాప శరీరం బలహీనమై, మనమిక పాపానికి దాసులుగానుండమని మనకు తెలుసు. ఎందుకంటే మరణించిన ప్రతి వ్యక్తి పాపంనుండి విముక్తి పొందుతాడు.

మనం క్రీస్తుతో కలిసి మరణిస్తే ఆయనతో కూడా జీవిస్తామని నమ్ముచున్నాము. దేవుడు క్రీస్తును బ్రతికించాడని, ఆయనకు మళ్ళీ మరణం ప్రాప్తించదని మనకు తెలుసు. మరణానికి ఆయనపై అధికారం ఉండదు. 10 పాపం విషయమై ఆయన ఒకే ఒకసారి మరణించాడు. కాని ఆయన జీవిస్తున్న జీవితం దేవుని కోసం జీవిస్తున్నాడు. 11 అదే విధంగా, మీరు పాపం విషయంలో మరణించినట్లు దేవునికోసం యేసుక్రీస్తులో జీవిస్తున్నట్లు భావించండి.

12 నశించిపోయే మన శరీరాన్ని పాపం పాలించకుండా జాగ్రత్త పడండి. దాని కోరికలకు లోబడకండి. 13 మీ అవయవాలను దుర్నీతికి సాధనాలుగా పాపానికి అర్పించకండి. దానికి మారుగా మీరు చనిపోయి బ్రతికివచ్చిన విషయం జ్ఞాపకం పెట్టుకొని మిమ్మల్ని మీరు దేవునికి అర్పించుకోండి. మీ అవయవాలను నీతికి సాధనాలుగా దేవునికి అర్పించండి. 14 మీరు ధర్మశాస్త్రం యొక్క ఆధీనంలో లేరు. కాని దైవానుగ్రహంలో ఉన్నారు. కనుక పాపం మీపై రాజ్యం చెయ్యదు.

నీతికి బానిసలు

15 అంటే? మనం ధర్మశాస్త్రం యొక్క ఆధీనంలో లేమని దానికి మారుగా దైవానుగ్రహంలోనున్నామని పాపం చెయ్యవచ్చా? అలా చెయ్యలేము. 16 సేవ చెయ్యటానికి మిమ్నల్ని మీరు బానిసలుగా అర్పించుకొంటే మీరు సేవ చేస్తున్న యజమానికి నిజంగా బానిసలై ఉంటారు. ఇది మీకు తెలియదా? మీరు పాపానికి బానిసలైతే అది మరణానికి దారితీస్తుంది. కాని, దేవుని పట్ల విధేయతగా ఉంటే మీరు నీతిమంతులౌతారు. 17 ఒకప్పుడు మీరు పాపానికి బానిసలు. కాని మీకందివ్వబడిన బోధనా విధానాన్ని మనసారా స్వీకరించి దాన్ని అనుసరించారు. దానికి మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పకొందాం. 18 మీరు పాపం నుండి విముక్తులై నీతికి బానిసలయ్యారు. 19 మీకు వీటిని అర్థం చేసుకొనే శక్తి లేదు కనుక నేను మాములు ఉదాహరణలు ఉపయోగిస్తూ మాట్లాడుతున్నాను. ఇదివరలో మీరు మీ అవయవాల్ని అపవిత్రతకు, దుర్మార్గపు పనులు చెయ్యటానికి బానిసలుగా అర్పించుకొన్నారు. అదే విధంగా ఇప్పుడు మీ అవయవాల్ని నీతికి, పవిత్రతకు నడిపించే బానిసలుగా అర్పించుకోండి.

20 మీరు పాపానికి బానిసలుగా ఉన్నప్పుడు నీతి మీపై రాజ్యం చెయ్యలేదు. 21 ఆ పనుల వల్ల మీరు ఏమి ఫలం పొందారు? వాటివల్ల మరణమే కలుగుతుంది. 22 ఇక ఇప్పుడు మీరు పాపంనుండి విముక్తులై దేవునికి బానిసలయ్యారు. కనుక మీరు పొందుతున్న ఫలం పవిత్రతకు దారి తీస్తుంది. చివరకు అనంత జీవితం లభిస్తుంది. 23 పాపం మరణాన్ని ప్రతి ఫలంగా ఇస్తుంది. కాని దేవుడు యేసు క్రీస్తు ప్రభువు ద్వారా అనంత జీవితాన్ని బహుమానంగా ఇస్తాడు.

వివాహ బంధం

సోదరులారా! నేను ధర్మశాస్త్రం తెలిసినవాళ్ళతో మాట్లాడుతున్నాను. ధర్మశాస్త్రానికి ఒక వ్యక్తిపై అతడు బ్రతికి ఉన్నంతవరకే అధికారం కలిగి ఉంటుందని మీకు తెలియదా? ఉదాహరణకు, ధర్మశాస్త్రం ప్రకారం స్త్రీ ఆమె భర్త జీవించి ఉన్నంతవరకే అతనికి బద్ధురాలై ఉంటుంది. ఒకవేళ అతడు మరణిస్తే ధర్మశాస్త్ర బంధం నుండి ఆమెకు విముక్తి కలుగుతుంది. ఆమె భర్త జీవించి ఉండగా ఇంకొకణ్ణి వివాహమాడితే ఆమె వ్యభిచారి అనబడుతుంది. కాని ఆమె భర్త మరణిస్తే ఆమెకు ఆ చట్టం నుండి విముక్తి కలుగుతుంది. అప్పుడు ఆమె ఇంకొకణ్ణి వివాహం చేసుకొన్నా ఆమె వ్యభిచరించినదానిగా పరిగణింపబడదు.

అదే విధంగా నా సోదరులారా! మీరు కూడా క్రీస్తు శరీరంతో పాటు చనిపోయి ధర్మశాస్త్ర బంధం నుండి విముక్తి పొందారు. మీరు బ్రతికింపబడ్డ క్రీస్తుకు చెందినవారై దేవుని కొరకు ఫలిస్తారు. ధర్మశాస్త్రం మూలంగా కలిగిన దురాశలు మన శరీరాల్లో పని చేయటంవల్ల మనం మరణాన్ని పొందాము. మనల్ని బంధించి ఉంచిన ధర్మశాస్త్రం విషయంలో మనం మరణించాము కనుక ఇప్పుడు మనము ఆ బంధం నుండి స్వేచ్ఛను పొందాము. అందువల్ల వ్రాత పూర్వకంగా ఉన్న ధర్మశాస్త్రానికి మనమిక బానిసలము కాము. దేవుని ఆత్మ చూపించిన క్రొత్త మార్గాన్ని అనుసరించి మనము ఆయన సేవ చేస్తున్నాము.

ధర్మశాస్త్రము, పాపము

అంటే, ధర్మశాస్త్రం పాపంతో కూడుకున్నదని అర్థమా? కాదు. ధర్మశాస్త్రం లేకపోయినట్లయితే పాపమంటే నాకు తెలిసేది కాదు. “ఇతర్లకు చెందిన వాటిని ఆశించవద్దని”(D) ధర్మశాస్త్రం చెప్పి ఉండకపోతే, ఆశించటమంటే ఏమో నాకు తెలిసేది కాదు. ధర్మశాస్త్రం చెప్పిన ఆజ్ఞను ఉపయోగించి పాపం నాలో అన్ని రకాల దురాశల్ని కలిగించింది. ధర్మశాస్త్రం లేకపోయినట్లైతే పాపంలో ప్రాణముండేది కాదు. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించాను. కాని ఆజ్ఞ రాగానే పాపం మొలకెత్తింది. దానితో నేను మరణించాను. 10 జీవాన్నివ్వటానికి ఉద్దేశింపబడిన ఆ ఆజ్ఞ నాకు మరణాన్ని కలుగ చెయ్యటం గమనించాను. 11 ఆజ్ఞ కలుగ చేసిన అవకాశాన్ని ఉపయోగించుకొని, పాపం నన్ను మోసంచేసి ఆ ఆజ్ఞద్వారా నన్ను చంపివేసింది.

12 సరే! మరి, ధర్మశాస్త్రం పవిత్రమైంది. ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఆజ్ఞ పవిత్రమైంది. దానిలో నీతి, మంచితనము ఉన్నాయి. 13 అలాగైతే, మరి ఆ మంచి ధర్మశాస్త్రం నాకు మరణాన్ని కలిగించిందా? ఎన్నటికి కాదు. ధర్మశాస్త్రాన్ని ఉపయోగించి పాపం నాకు మరణాన్ని కలిగించి తన నిజ స్వరూపాన్ని వ్యక్త పరిచింది. అందువల్ల ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞ ద్వారా పాపం ఇంకా గొప్ప పాపంగా కనిపించింది.

మనలోని యుద్ధం

14 ధర్మశాస్త్రం ఆధ్యాత్మికమైనదని మనకు తెలుసు. కాని నేను బలహీనమైన మనిషిని, పాపానికి బానిసగా అమ్ముడుపోయినవాణ్ణి. 15 నేనేం చేస్తున్నానో నాకు తెలియదు. నేను చెయ్యలనుకొన్నదాన్ని చెయ్యటంలేదు. దేన్ని ద్వేషిస్తున్నానో దాన్నే చేస్తున్నాను. 16 నేను వద్దనుకున్నదాన్నే చేస్తే ధర్మశాస్త్రం మంచిదని అంగీకరిస్తున్నాను. 17 నిజానికి చేస్తున్నది నేను కాదు. నాలో నివసిస్తున్న పాపం ఇలా చేస్తోంది. 18 నా శరీరంలో మంచి అనేది నివసించటం లేదని నాకు తెలుసు. మంచి చెయ్యాలనే కోరిక నాలో ఉంది కాని, అలా చెయ్యలేకపోతున్నాను. 19 చెయ్యాలనుకొన్న మంచిని నేను చెయ్యటం లేదు. దానికి మారుగా చెయ్యరాదనుకొన్న చెడును నేను చేస్తూ పోతున్నాను. 20 చెయ్యకూడదనుకొన్నదాన్ని నేను చేస్తున్నానంటే, దాన్ని చేస్తున్నది నేను కాదు. నాలో నివసిస్తున్న పాపమే అలా చేయిస్తోంది.

21 అందువల్ల, “నేను మంచి చెయ్యాలని అనుకొన్నప్పుడు చెడు నాతో అక్కడే ఉంటుంది” అనే ఈ నియమం నాలో పని చేస్తున్నట్లు గమనిస్తున్నాను. 22 నా అంతరాత్మ దేవుడిచ్చిన ధర్మశాస్త్ర విషయంలో ఆనందం పొందుతోంది. 23 కాని, నా అవయవాల్లో వేరొక నియమం పని చేస్తున్నట్లు గమనిస్తున్నాను. నన్ను పాపాత్మునిగా చేస్తున్న ఈ నియమం నా మెదడులో ఉన్న ధర్మశాస్త్రంతో పోరాడి నన్ను ఖైదీగా చేస్తోంది. 24 నేనంత దౌర్భాగ్యుణ్ణి! మరణం యొక్క ఆధీనంలో ఉన్న ఈ నా శరీరంనుండి నన్ను ఎవరు రక్షిస్తారు? 25 అందువల్ల మన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనం దేవునికి కృతజ్ఞతలు తెలుపుకొందాం.

స్వయంగా, బుద్ధి పూర్వకంగా నేను దేవుని ధర్మశాస్త్రానికి బానిసను. కాని నా శరీరం పాపాన్ని కలుగచేసే నియమానికి బానిస.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International