Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెహెజ్కేలు 42-43

యాజకుని గది

42 పిమ్మట ఆ మనిషి ఉత్తరపు గుమ్మంనుండి బయటి ఆవరణకు తీసుకొని వెళ్లాడు. ఉత్తర నియమిత స్థలంలో అనేక గదులతో కూడుకున్న భవనానికి నన్ను నడిపించాడు. ఉత్తర దిశన ఉన్న భవనం పొడవు నూరు మూరలు; వెడల్పు ఏభైమూరలు ఉంది. ఈ కట్టడాల గోడల మీద మూడంతస్థుల్లో వసారాలు ఉన్నాయి. భవనానికి, ఆలయానికి మధ్య లోపలి ఆవరణం ఇరవై మూరలుంది. దాని ప్రక్కన గదులు బయట ఆవరణం యొక్క చదునుబాటను చూస్తూ ఉంది. ఆ గదుల ముందు ఒక చావడి ఉంది. దాని వెడల్పు పది మూరలు, పొడవు నూరు మూరలు (ఇది భవనానికి తూర్పుదిశగా ఉంది). వాటి తలుపులు ఉత్తరానికి ఉన్నాయి. భవనం మూడంతస్థుల ఎత్తు ఉండడం వల్లనూ, వాటి బయటి ఆవరణకు స్థంభాలు లేకపొవడంవల్లను పై అంతస్థుల్లో ఉన్న గదులు, మధ్యన మరియు క్రింది గదులకన్నా చాలా వెనుకనున్నాయి. పై అంతస్థులో వసారాలు ఎక్కువ స్థలం తీసుకోవటంతో పై అంతస్థులు మధ్య అంతస్థుకన్నా ఇరుకుగా ఉంది. మధ్య అంతస్థు క్రింది అంతస్థుకన్నా ఇరుకుగా ఉంది. బయట ఒక గోడ ఉంది. అది గదులకు సమాంతరంగా ఉంది. అది గదులకు ముందు ఏభై మూరల వరకు వెళ్తుంది. ఆ భవనం మొత్తం ఆలయం వైపుగా నూరు మూరల పొడవు వున్నా, బయట ఆవరణంలో అది ఏభై మూరల పొడవు ఉంది. ఈ గదుల ద్వారం భవనపు తూర్పు దిక్కుకు దిగువన ఉంది. కానీ ప్రజలు బయటి ఆవరణం నుండి ప్రవేశించవచ్చు. 10 ఆవరణం ప్రక్కనున్న గోడ మొదట్లో ఉంది.

ఈ గదుల ముందు దక్షిణ దిక్కున నియమిత స్థలంలో గదులు ఉన్నాయి. 11 ఒక చావడి కూడా ఉంది. అవి ఉత్తర దిశన వున్న గదులమాదిరే ఉన్నాయి. దక్షిణవైపు తలుపుల పొడవు వెడల్పులు ఉత్తర దిక్కున వున్నవాటి లెక్కనే ఉన్నాయి. ఉత్తర దిశ తలుపులకు వున్న కొలతలు, గుమ్మాల మాదిరే దక్షిణ తలుపులకు కూడ ఉన్నాయి. 12 క్రింది గదులకు ప్రవేశం భవనం తూర్పు దిక్కు చివరన ఉంది కాబట్టి ప్రజలు గోడ బయటి మార్గం గుండా ప్రవేశించవచ్చు.

13 ఆ మనిషి నాతో ఇలా అన్నాడు: “నియమిత స్థలానికి అడ్డంగా ఉన్న ఉత్తర గదులు, దక్షిణ గదులు పవిత్రమైనవి. యెహోవాకు బలులు సమర్పించే యాజకులకు ఈ గదులు కేటాయించబడ్డాయి. ఆ యాజకులు అతి పవిత్ర అర్పణలను ఈ గదులలోనే తింటారు. అతి పవిత్ర అర్పణలను వారక్కడ ఉంచుతారు. ఎందుకంటే, ఈ స్థలం పవిత్రమైనది. అతి పవిత్ర అర్పణలు ఏమంటే: ధాన్యపు నైవేద్యాలు, తప్పులను పరిహరించు బలులు మరియు అపరాధ పరిహారార్థ బలులు. 14 యాజకులు పవిత్ర ప్రదేశంలో ప్రవేశిస్తారు. కాని వారు బయటి ఆవరణంలోకి వెళ్లే ముందు, వారు సేవ చేసేటప్పుడు ధరించే బట్టలను పవిత్ర స్థలంలో వదిలి వేస్తారు. అవి అతి పవిత్రమైన బట్టలు గనుక వారలా చేస్తారు. ఒక యాజకుడు ఆలయంలో సామాన్య ప్రజలు వుండే చోటికి వెళ్లదలచినప్పుడు అతడు వేరే బట్టలు ధరించి వెళ్లవలసి ఉంటుంది.”

ఆలయపు బయటి ఆవరణ

15 ఆలయపు లోపలి భాగాన్ని ఆ మనిషి కొలవటం పూర్తి చేసిన పిమ్మట, తూర్పు ద్వారం గుండా అతడు నన్ను బయటకు తీసుకొని వచ్చాడు. గుడి బయటి భాగాన్నంతా అతడు కొలిచాడు. 16 ఆ మనుష్యుడు కొలకర్రతో తూర్పు భాగాన్నంతా కొలిచాడు. అది ఐదువందల మూరల పొడవుంది. 17 అతడు ఉత్తర భాగాన్ని కొలవగా అది ఐదువందల మూరల పొడవుంది. 18 అతడు దక్షిణ భాగాన్ని కొలవగా అది ఐదువందల మూరల పొడవుంది. 19 అతడు తిరిగి వెళ్లి పశ్చిమ దిశను కొలవగా అది ఐదువందల మూరల పొడవుంనుంది. 20 ఆ విధంగా అతడు ఆలయం యొక్క నాలుగు ప్రక్కలు కొలిచాడు. ఆలయం చుట్టూ గోడ కట్టబడింది. ఆ గోడ పొడవు ఐదువందల మూరలు, వెడల్పు ఐదువందల మూరలు ఉంది. అది మామూలు ప్రదేశాన్ని, పవిత్ర స్థలం నుండి వేరుచేసింది.

యెహోవా తన ప్రజల మధ్య నివసించుట

43 ఆ మనుష్యుడు నన్ను తూర్పు ద్వారం వద్దకు నడిపించాడు. అక్కడ ఇశ్రాయేలు దేవుని మహిమతూర్పు నుండి వచ్చింది. దేవుని కంఠస్వరం సముద్ర ఘోషలా గంభీరంగా ఉంది. దేవుని మహిమవల్ల భూమి ప్రకాశమానమయ్యింది. నేను చూచిన ఆ దర్శనం గతంలో నేను కెబారు కాలువవద్ద చూచిన దర్శనంవలెనే ఉంది. నేను సాష్టాంగ నమస్కారం చేశాను. తూర్పు ద్వారం గుండా దేవుని మహిమ ఆలయంలోకి వచ్చింది.

అప్పుడు ఆత్మ నన్ను పట్టుకొని లోపలి ఆవరణలోనికి తీసుకొని వచ్చాడు. యెహోవా మహిమ ఆలయాన్ని నింపివేసింది. ఆలయం లోపలి నుండి ఎవరో నాతో మాట్లాడుతున్నట్లు నేను విన్నాను. నా ప్రక్కన ఒక మనుష్యుడు నిలబడివున్నాడు. ఆలయంలో నుండి వచ్చిన కంఠస్వరం నాతో ఇలా అన్నది: “నరపుత్రుడా, ఇది నా సింహాసనం, పాదపీఠం నెలకొని వున్న చోటు. ఇశ్రాయేలు ప్రజల మధ్య ఈ ప్రదేశంలో నేను శాశ్వతంగా నివసిస్తాను. ఇశ్రాయేలు వంశం మరెన్నడూ నా పవిత్ర నామాన్ని పాడు చేయదు. వ్యభిచార పాపాల చేత, ఈ ప్రదేశంలో రాజుల శవాలను పాతిపెట్టిన దోషాలచేత రాజులు, వారి ప్రజలు నా పేరును అవమాన పర్చరు. వారి గడప నా గడప ప్రక్కన; వారి ద్వారం నా ద్వారం ప్రక్కన నెలకొల్పి వారు నా పవిత్ర నామాన్ని అపవిత్రం చేయరు. గతంలో కేవలం ఒక్క గోడ మాత్రమే నాకు, వారికి అడ్డంగా ఉండేది. అందుచే వారు పాపం చేసిన ప్రతిసారి, భయంకర కార్యాలు చేసినప్పుడల్లా వారు నా పేరును అవమానపర్చారు అందుచేత నాకు కోపం వచ్చి నేను వారిని నాశనం చేశాను. ఇప్పుడు వారు వ్యభిచార పాపాలకు దూరం కావాలి. వారి రాజుల కళేబరాలను నాకు దూరంగా తీసుకొనిపోవాలి. అప్పుడు నేను వారి మధ్య శాశ్వతంగా నివసిస్తాను.

10 “నరపుత్రుడా, ఇప్పుడు ఇశ్రాయేలు వంశానికి ఈ ఆలయాన్ని గురించి చెప్పు. అప్పుడు వారు తమ పాపాల పట్ల సిగ్గుపడతారు. వారు ఆలయానికి సంబంధించిన నమూనాలు నేర్చుకొంటారు. 11 పైగా వారు తాము చేసిన చెడ్డ పనులన్నిటినీ తలపోసి సిగ్గుపడతారు. ఆలయ నమూనాను వారు తెలుసుకోవాలి. అది ఎలా నిర్మింపబడిందో, ఎక్కడెక్కడ లోపలికి వచ్చే, బయటకు వెళ్లే ద్వారాలున్నాయో, ఇంకా దాని మీద వున్న చెక్కడపు పనులను గురించే వారిని తెలిసికోనిమ్ము. దానికి సంబంధించిన నియమ నిబంధనలన్నింటినీ వారికి నేర్పు. వారు చూడగలిగే విధంగా నీవు ఈ విషయాలన్నీ వ్రాసి పెట్టు. అప్పుడు ఆలయానికి సంబంధించిన నియమ నిబంధనలు వారు తప్పక పాటిస్తారు. అప్పుడు వారు వీటన్నిటినీ చేయగులుగుతారు. 12 ఆలయ ధర్మం ఇది, పర్వతం మీది శిఖరాగ్ర ప్రదేశమంతా అతి పవిత్ర స్థలం. ఇది ఆలయ ధర్మం.

బలిపీఠం

13 “పెద్ద కొలకర్రతో కొలవగా బలిపీఠం యొక్క కొలతలు ఇలా ఉన్నాయి, బలిపీఠం క్రింది అరుగు చుట్టూ మురికి నీరు పోయే దారి ఉంది. దాని లోతు ఒక మూర ఉంది. దాని ప్రతి ప్రక్కా ఒక మూర వెడల్పు ఉంది. దానిమీద అంచు చుట్టూ ఉన్న కట్టు జానెడు ఉంది. బలిపీఠం ఎత్తు 14 భూమి నుండి క్రింది అంచు వరకు అస్థిభారం రెండు మూరలు. అది ఒక మూర వెడల్పు. చిన్న అంచునుండి పై అంచు వరకు నాలుగు మూరలుంది. అది రెండు మూరల వెడల్పు ఉంది. అది చిన్న చూరు నుండి పెద్ద చూరు వరకు ఏడడుగులు ఉంది. అది మూడడుగుల ఆరంగుళాల వెడల్పు ఉంది. 15 బలిపీఠం మీద అగ్నిస్థానం (హోమగుండం) నాలుగు మూరల ఎత్తు ఉంది. నాలుగు మూలలు నాలుగు కొమ్ముల్లా మలచబడి ఉన్నాయి. 16 బలిపీఠం మీది అగ్ని గుండం పొడవు పన్నెండు మూరలు, వెడల్పు పన్నెండు మూరలు అది ఖచ్చితమైన నలుమూలల చదరంగా ఉంది. 17 అంచు కూడ పొడవు వెడల్పులు పన్నెండు మూరలు చొప్పున చదరంగా ఉంది. దాని చుట్టూ వున్న అంచు అరమూర ఉంది. అడుగు దిమ్మ చుట్టూ నీరు పోయే మార్గపు వెడల్పు రెండు మూరలు ఉంది. బలిపీఠం మీదికి మెట్లు తూర్పు దిక్కున ఉన్నాయి.”

18 అప్పుడు ఆ వ్యక్తి నాతో ఇలా అన్నాడు: “నరపుత్రుడా, నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: ‘ఈ బలిపీఠం కట్టబడిన రోజున ఈ బలులు, దాని మీద రక్తం చల్లడం అనే నియమాలు పాటించు. 19 సాదోకు వంశపు యాజకులకు పాప పరిహారార్థ బలి నిమిత్తం ఒక కోడె దూడను ఇవ్వాలి. వీరు లేవీ తెగకు చెందిన యాజకులు.’” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు, 20 “వారు నాకు బలులు తెచ్చి, నాకు సేవ చేస్తారు. మీరు కోడెదూడ రక్తాన్ని కొంత తీసుకొని బలిపీఠపు నాలుగు కొమ్ముల మీద, దాని చూరు నాలుగు మూలల మీద, మరియు దాని అంచు చుట్టూ వుంచాలి. తద్వారా మీరు బలిపీఠాన్ని పవిత్ర పర్చుతారు. 21 పాప పరిహారార్థ బలికొరకు మీరు కోడెదూడను తేవాలి. ఆలయంలోని భవనం బయట ఒక ప్రత్యేక స్థలంలో కోడెదూడ దహనపర్చ బడుతుంది.

22 “రెండవ రోజున దోషరహితమైన ఒక మేక పోతును బలి ఇవ్వాలి. ఇది పాపపరిహారార్థమైన బలి. కోడెదూడను బలి ఇచ్చిన సందర్భంగా బలిపీఠాన్ని పరిశుద్ధపర్చినట్లే యాజకులు ఇప్పుడు కూడా చేస్తారు. 23 మీరు బలిపీఠాన్ని శుద్ధి పర్చిన పిమ్మట దోష రహితమైన ఒక కోడెదూడను, మందలో ఏ దోషం లేని ఒక పొట్టేలును బలికి తెస్తారు. 24 మీరు వాటిని యెహోవా ముందు బలి ఇస్తారు. యాజకులు వాటి మీద ఉప్పు జల్లుతారు. పిమ్మట యాజకులు గిత్తను, పొట్టేలును యెహోవాకు దహనబలిగా అర్పిస్తారు. 25 ఏడు రోజులపాటు ప్రతిరోజూ మీరు ఒక మేకను పాపపరిహారార్థ బలికి సిద్ధం చేస్తారు. అలాగే మీరు ఒక కోడెదూడను, మందలో నుండి ఒక పొట్టేలును సిద్ధం చేస్తారు. కోడెదూడ, పొట్టేలు ఏ దోషమూ లేనివై యుండాలి. 26 ఏడు రోజుల పాటు యాజకులు బలిపీఠాన్ని శుద్ధిపర్చుతారు. తరువాత వారు దానిని యెహోవాకు అంకితం చేస్తారు. 27 ఏడు రోజులు అయిన తరువాత ఎనిమిదవ రోజు నుండి యాజకులు మీ దహనబలులను, సహవాస బలులను బలిపీఠం మీద ఇవ్వాలి. అప్పుడు నేను మిమ్మల్ని అంగీకరిస్తాను.” నా ప్రభువైన యెహోవా ఇది చెప్పాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International