Chronological
మెల్కీసెదెకు
7 ఈ మెల్కీసెదెకు షాలేము రాజు, మరియు మహోన్నతుడైన దేవుని యాజకుడు. అబ్రాహాము రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు మెల్కీసెదెకు అతన్ని కలుసుకొని ఆశీర్వదించాడు. 2 అబ్రాహాము తాను జయించిన వాటిలో పదవవంతు మెల్కీసెదెకుకు యిచ్చాడు.
మొదటిదిగా “మెల్కీసెదెకు” అనే పదానికి నీతికి రాజు అనే అర్థం. రెండవదిగా “షాలేము రాజు” అను యితని పేరుకు శాంతికి రాజు అనే అర్థం కూడా వుంది. 3 మెల్కీసెదెకు తల్లిదండ్రులెవరో మనకు తెలియదు. అతని పూర్వికులెవరో మనకు తెలియదు. అతని బాల్యాన్ని గురించి కాని, అంతిమ రోజుల్ని గురించి కాని మనకు తెలియదు. దేవుని కుమారునివలె అతడు కూడా చిరకాలం యాజకుడుగా ఉంటాడు.
4 మూల పురుషుడైన అబ్రాహాము కూడా తాను జయించినదానిలో పదవ వంతు అతనికిచ్చాడంటే, అతడు ఎంత గొప్పవాడో గ్రహించండి. 5 ఇశ్రాయేలు ప్రజలు అబ్రాహాము వంశానికి చెందినవాళ్ళు, లేవి జాతికి చెందిన యాజకుల సోదరులు. అయినా ధర్మశాస్త్రంలో ఈ లేవి యాజకులు ప్రజలు ఆర్జించినదానిలో పదవవంతు సేకరించాలని ఉంది. 6 మెల్కీసెదెకు లేవి జాతికి చెందినవాడు కాకపోయినా, అబ్రాహాము నుండి అతని ఆదాయంలో పదవవంతు సేకరించాడు. దేవుని వాగ్దానాలు పొందిన అతణ్ణి ఆశీర్వదించాడు. 7 ఆశీర్వదించేవాడు, ఆశీర్వాదం పొందే వానికన్నా గొప్ప వాడవటంలో అనుమానం లేదు.
8 ఒకవైపు చనిపోయేవాళ్ళు పదవ వంతు సేకరిస్తున్నారు. మరొక వైపు చిరకాలం జీవిస్తాడని లేఖనాలు ప్రకటించిన మెల్కీసెదెకు పదవ వంతు సేకరిస్తున్నాడు. 9 ఒక విధంగా చూస్తే పదవవంతు సేకరించే లేవి, అబ్రాహాము ద్వారా పదవవంతు చెల్లించాడని చెప్పుకోవచ్చు. 10 ఎందుకంటే, మెల్కీసెదెకు అబ్రాహామును కలుసుకొన్నప్పుడు లేవి యింకా జన్మించ లేదు. అతడు, తన మూల పురుషుడైన అబ్రాహాములోనే ఉన్నాడు.
11 మోషే ధర్మశాస్త్రంలో లేవి జాతికి చెందిన యాజకుల గురించి వ్రాసాడు. ఒకవేళ, ఆ యాజకుల ద్వారా ప్రజలు పరిపూర్ణత పొంద గలిగి ఉంటే అహరోనులాంటి వాడు కాకుండా మెల్కీసెదెకులాంటి యాజకుడు రావలసిన అవసరమెందుకు కలిగింది? 12 దేవుడు మన కోసం క్రొత్త యాజకుణ్ణి నియమించాడు కాబట్టి ఆయనకు తగ్గట్టుగా యాజక ధర్మాన్ని కూడా మార్చాడు, 13 ఈ విషయాలు ఎవర్ని గురించి చెప్పబడ్డాయో, ఆయన వేరొక గోత్రపువాడు. ఆ గోత్రానికి చెందినవాళ్ళెవ్వరూ ఎన్నడూ బలిపీఠం ముందు నిలబడి యాజకునిగా పనిచేయ లేదు. 14 మన ప్రభువు యూదా వంశానికి చెందినవాడనే విషయం మనకు స్పష్టమే! ఈ గోత్రపువాళ్ళు యాజకులౌతారని మోషే అనలేదు.
యేసు మెల్కీసెదెకులాంటి యాజకుడు
15 పైగా మెల్కీసెదెకు లాంటి మన ప్రభువు యాజకుడై ఈ విషయం ఇంకా స్పష్టం చేశాడు. 16 మన ప్రభువు ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వంశావళిని అనుసరించి యాజకుడు కాలేదు. ఆయన చిరంజీవి గనుక యాజకుడయ్యాడు. 17 ఎందుకంటే, “నీవు మెల్కీసెదెకు క్రమంలో చిరకాలం యాజకుడవై ఉంటావు”(A) అని లేఖనాలు ప్రకటిస్తున్నాయి.
18 పాత నియమం సత్తువ లేనిది, నిరుపయోగమైనది. కనుక, అది రద్దు చేయబడింది. 19 ఆ ధర్మశాస్త్రం ఎవనిలోనూ పరిపూర్ణత కలిగించలేక పోయింది. అందువల్ల దేవుడు మనలో క్రొత్త నిరీక్షణను ప్రవేశపెట్టాడు. ఈ నిరీక్షణ మనల్ని ఆయనకు దగ్గర చేస్తుంది.
20 దీని విషయంలో దేవుడు ప్రమాణం కూడా చేశాడు. మిగతావాళ్ళు యాజకులైనప్పుడు ఎవ్వరూ ప్రమాణం చెయ్యలేదు. 21 కాని యేసు ప్రమాణం ద్వారా యాజకుడైనాడు. ఈయన విషయంలో దేవుడాయనతో ఇలా అన్నాడు:
“ప్రభువు ప్రమాణం చేశాడు.
తన మనస్సును మార్చుకోడు.
‘నీవు చిరకాలం యాజకుడుగావుంటావు.’”(B)
22 ఈ ప్రమాణం ద్వారా యేసు శ్రేష్ఠమైన క్రొత్త ఒడంబడికకు బాధ్యుడయ్యాడు.
23 ఎందరో యాజకులయ్యారు కాని, చావు వాళ్ళని యాజకులుగా పనిచేయకుండా అడ్డగించింది. 24 కాని యేసు చిరంజీవి గనుక చిరకాలం యాజకుడుగా ఉంటాడు. 25 అందువలన తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళను ఆయన ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. ఆయన వాళ్ళ పక్షాన దేవుణ్ణి వేడుకోటానికి చిరకాలం జీవిస్తూ ఉంటాడు.
26 పవిత్రమైన వాడు, ఏ కళంకం లేనివాడు, పరిశుద్ధమైన వాడు, పాపుల గుంపుకు చెందనివాడు, పరలోకంలో ఉన్నత స్థానాన్ని పొందినవాడు, ఇలాంటి ప్రధానయాజకుడై అవసరాన్ని తీరుస్తున్నాడు. 27 ఆయన, ఇతర ప్రధానయాజకులవలె తన పాపాల కొరకు గానీ, ప్రజల పాపాల కొరకు గానీ ప్రతి రోజు బలుల్ని అర్పించవలసిన అవసరం లేదు. ఆయన తనను తానే బలిగా అర్పించుకున్నాడు. అంటే మొదటి బలి, చివరి బలి ఆయనే! 28 ధర్మశాస్త్రం బలహీనులైనవాళ్ళను యాజకులుగా నియమించింది: కాని, ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన ప్రమాణం కుమారుణ్ణి ప్రధానయాజకునిగా నియమించింది. అంతేకాక, ఆయన చిరకాలం పరిపూర్ణునిగా చేయబడ్డాడు.
క్రొత్త ఒడంబడిక
8 మేము చెబుతున్న దానిలో ముఖ్య అంశం ఏమిటంటే: పరలోకంలో మహోన్నతుని సింహాసనానికి కుడివైపు కూర్చోగల అధికారమున్న ప్రధాన యాజకుడు మనకున్నాడు. 2 అంతేకాక ఆయన నిజమైన గుడారంలో, అంటే ప్రభువు నిర్మించిన పరిశుద్ధాలయములో సేవ చేస్తున్నాడు. ఈ గుడారం మానవుడు నిర్మించింది కాదు.
3 కానుకల్ని, బలుల్ని అర్పించటానికి ప్రధాన యాజకుడు నియమించబడతాడు. అందువల్ల ఈయన దగ్గర కూడా అర్పించటానికి ఏదైనా ఉండవలసిన అవసరం ఏర్పడింది. 4 ఈయన భూలోకంలో ఉండినట్లయితే యాజకుడుగా పని చేసేవాడు కాదు. ఎందుకంటే, ధర్మశాస్త్రం ఆదేశించిన విధంగా కానుకలు అర్పించే యాజకులు యిదివరకే భూలోకంలో ఉన్నారు. 5 వాళ్ళు భూమ్మీదనున్న పరిశుద్ధ స్థలములో సేవచేస్తూ ఉంటారు. భూలోకంలో ఉన్న ఈ పరిశుద్ధ స్థలము పరలోకంలో ఉన్న దానికి నీడ లాంటిది, అంటే ప్రతిబింబం. ఈ కారణంగానే, మోషే గుడారాన్ని నిర్మించటానికి మొదలు పెట్టినప్పుడు దేవుడు అతనితో, “నేను నీకు కొండమీద చూపించిన విధంగా దాన్ని నిర్మించు!”(C) అని హెచ్చరించాడు. 6 యేసు మధ్యవర్తిగా ఉండి నియమించిన ఒడంబడిక పాత దానికన్నా ఉత్తమమైనది. అందులో ఉత్తమ వాగ్దానాలున్నాయి. అందువల్ల దేవుడు యేసుకిచ్చిన యాజకత్వము వాళ్ళు చేసే యాజకత్వం పనికన్నా ఉత్తమమైనది.
7 ఎందుకంటే ఒకవేళ మొదటి ఒడంబడికలో ఏ తప్పూ లేక పోయినట్లయితే యింకొక ఒడంబడిక యొక్క అవసరం ఉండక పోయేది. 8 కాని ప్రభువు ప్రజల పొరపాట్లను కనిపెట్టి వాళ్ళతో ఈ విధంగా అన్నాడు:
“ఇశ్రాయేలు, యూదా,
ప్రజలతో క్రొత్త ఒడంబడిక చేయవలసిన సమయం వస్తుంది!
9 వాళ్ళ ముత్తాతల్ని ఈజిప్టు దేశంనుండి, చేయి పట్టుకొని వెలుపలికి పిలుచుకొని వచ్చాను.
ఆనాడు వాళ్ళతో ఒక ఒడంబడిక చేసాను. నేను మీతో చేయబోతున్న ఒడంబడిక ఆనాటి ఒడంబడికలా ఉండదు.
వాళ్ళు నా ఒడంబడిక ప్రకారం నడుచుకోలేదు
గనుక వాళ్ళను నేను లెక్క చెయ్యలేదు.
10 ఆ తర్వాత, ఇశ్రాయేలు ప్రజలతో ఈ విధంగా ఒడంబడిక చేస్తాను:
నా నియమాల్ని వాళ్ళ మనస్సుల్లో ఉంచుతాను.
వాటిని వాళ్ళ హృదయాలపై వ్రాస్తాను.
నేను వాళ్ళ దేవునిగా ఉంటాను.
వాళ్ళు నా ప్రజలుగా ఉంటారు.
11 అప్పుడు ప్రభువుని తెలుసుకోమని ప్రక్కింటివానికి గాని, తన సోదరునికి గాని బోధించవలసిన అవసరం ఉండదు.
ఎందుకంటే ఆ రోజుల్లో అధముడు, గొప్పవాడు, అందరు నన్ను తెలుసుకొంటారు.
12 నేను వాళ్ళ దోషాల్ని క్షమిస్తాను.
వాళ్ళ పాపాల్ని మరచిపోతాను.(D)
13 ఈ ఒడంబడికను “క్రొత్త ఒడంబడిక” అని పిలవటం వల్ల మొదటిది పాత ఒడంబడిక అయిపోయింది. పురాతనమైనది, శిథిలమైనది, త్వరలోనే అదృశ్యమైపోతుంది.
భూలోక గుడారములో సేవ
9 సేవా నియమాలను గురించి, మానవ నిర్మితమైన గుడారమును గురించి మొదటి ఒడంబడికలో వ్రాయబడి ఉంది. 2 గుడారం వేసి మొదటి గదిని సిద్ధం చేసేవాళ్ళు. ఆ గదిలో ఒక దీప స్థంభం, ఒక బల్ల, ప్రతిష్ఠించబడిన రొట్టె ఉంచేవాళ్ళు. ఈ గదిని పవిత్రస్థానమని పిలిచేవాళ్ళు. 3 మరొక తెరవేసి రెండవ గదిని సిద్ధం చేసేవాళ్ళు. దీన్ని అతి పవిత్ర స్థానమని పిలిచేవాళ్ళు. 4 ఇక్కడ బంగారు ధూప వేదిక, మరియు బంగారు రేకుచేత కప్పబడిన ఒడంబడిక మందసము ఉండేవి. ఈ మందసంలో మన్నా[a] ఉంచబడిన బంగారుగిన్నె, చిగురు వేసిన అహరోను చేతికర్ర, ఒడంబడిక పలకలు ఉండేవి. 5 ఈ మందసం మీద కరుణాపీఠం ఉండేది. దానికి యిరువైపులా దేవదూతలు ఉండేవారు. వారి రెక్కలు ఆ కరుణాపీఠాన్ని కప్పి ఉంచేవి. కాని వీటిని గురించి ప్రస్తుతం వివరంగా చర్చించలేము.
6 అన్నీ ఈ విధంగా అమర్చబడిన తర్వాత, యాజకులు నియమానుసారం ముందున్న గదిలోకి ప్రవేశించి సేవ చేసేవాళ్ళు. 7 కాని ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి అతిపరిశుద్ధ స్థలంలోకి రక్తంతో ప్రవేశించేవాడు. తన పక్షాన, అజ్ఞానంతో పాపాలు చేసిన ప్రజల పక్షాన తప్పకుండా రక్తాన్ని తెచ్చి దేవునికి అర్పించేవాడు.
8 అంటే మొదటి గది ఉన్నంతకాలం అతి పవిత్ర స్థానానికి ప్రవేశం కలుగదని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. 9 ఇది ప్రస్తుత కాలాన్ని సూచిస్తోంది. అంటే కానుకలు, బలులు అర్పించటం వల్ల యాజకుని అంతరాత్మ పరిశుద్ధం కాదని పరిశుద్ధాత్మ సూచిస్తున్నాడు. 10 ఇవి కేవలం అన్నపానాలకు పలురకాల పరిశుద్ద స్నానాలకు సంబంధించిన ఆచారాలు. క్రొత్త క్రమం వచ్చేదాకా ఈ బాహ్య నియమాలు వర్తిస్తాయి.
యేసు రక్తం
11 దేవుడు చేసిన మంచి పనులు సాగించటానికి క్రీస్తు ప్రధాన యాజకుడై పరలోకంలోని గుడారానికి వెళ్ళాడు. ఆ గుడారం చాలా పెద్దది. శ్రేష్ఠమైనది. అది మానవుడు నిర్మించింది కాదు. 12 ఆయన మేకల రక్తం ద్వారా, దూడల రక్తం ద్వారా ఆ గుడారంలోకి వెళ్ళలేదు. తన స్వంత రక్తంతో అతి పవిత్రమైన ఆ స్థలాన్ని శాశ్వతంగా ప్రవేశించి, మనకు శాశ్వతమైన రక్షణ కలిగించాడు.
13 మేకల రక్తాన్ని, ఎద్దుల రక్తాన్ని, దూడలను కాల్చిన బూడిదను, అపవిత్రంగా ఉన్నవాళ్ళపై ప్రోక్షించి, వాళ్ళను పవిత్రం చేసేవాళ్ళు. ఇలా చేయటం వల్ల వాళ్ళు బాహ్యంగా మాత్రమే పవిత్రులౌతారు. 14 కాని, నిష్కళంకుడైన యేసు శాశ్వతమైన తన ఆత్మను దేవునికి అర్పించుకొన్నాడు. తద్వారా క్రీస్తు రక్తం మన చెడు అంతరాత్మల్ని కూడా పరిశుద్ధం చేస్తోంది. మనము సజీవుడైన దేవుణ్ణి ఆరాధించాలని ఆయనీవిధంగా చేసాడు.
15 ఈ కారణంగా క్రీస్తు క్రొత్త ఒడంబడికకు మధ్యవర్తి అయ్యాడు. ఈయన దేవుడు పిలిచినవాళ్ళకు దేవుడు వాగ్దానం చేసిన శాశ్వత వారసత్వం లభించేటట్లు చేస్తాడు. మొదటి ఒడంబడిక చెలామణిలో ఉండగా ప్రజలు చేసిన పాపాలకు తన ప్రాణాన్ని వెలగా చెల్లించి వాళ్ళకు స్వేచ్ఛ కలిగించాడు.
16 వీలునామా చెలామణిలోకి రావాలంటే, దాన్ని వ్రాసిన వ్యక్తి యొక్క మరణాన్ని నిరూపించటం అవసరం. 17 ఎందుకంటే, వ్రాసిన వాడు మరణిస్తే వీలునామా చెలామణిలోకి వస్తుంది. వీలునామా వ్రాసినవాడు జీవిస్తుంటే, అది ఎలా చెలామణిలోకి వస్తుంది? 18 ఈ కారణంగానే, మొదటి ఒడంబడిక కూడా రక్తాన్ని ఉపయోగించకుండా చెలామణి కాలేకపోయింది. 19 ధర్మశాస్త్రంలో ఉన్న నియమాల్ని మోషే ప్రజలకు ప్రకటించిన తర్వాత దూడల రక్తాన్ని నీళ్ళలో కలిపి, ఆ మిశ్రమాన్ని హిస్సోపు చెట్ల కొమ్మలతో, సింధూర వర్ణముగల గొఱ్ఱె బొచ్చుతో ధర్మశాస్త్ర గ్రంథం మీద, ప్రజల మీద చల్లాడు. 20 ఆ తర్వాత మోషే వాళ్ళతో, “దేవుడు తన ఒడంబడికను ఆచరించమని ఆజ్ఞాపించి ఈ ఒడంబడిక రక్తాన్ని మీకిచ్చాడు” అని అన్నాడు. 21 అదే విధంగా అతడు గుడారం మీద, సేవా సామగ్రి మీద ఆ రక్తాన్ని ప్రోక్షించాడు. 22 నిజానికి, యించుమించు అన్ని వస్తువుల్ని రక్తంతో పరిశుద్ధం చెయ్యాలని ధర్మశాస్త్రం ఆదేశిస్తుంది. రక్తం చిందించకపోతే పాపపరిహారం కలగదు.
యేసు క్రీస్తు మన పాపాలకు బలి
23 అందువల్ల పరలోకంలో ఉన్న వస్తువుల ప్రతిరూపాలను బలి యిచ్చి పరిశుద్ధం చేయవలసిన అవసరం ఏర్పడింది. కాని, పరలోకంలో ఉన్న వాటిని పవిత్రం చెయ్యటానికి యింకా మంచిరకమైన బలులు కావాలి. 24 భూమ్నీదవున్న ఈ పవిత్ర స్థానం నిజమైన దానికి ప్రతిరూపం మాత్రమే. క్రీస్తు మానవుడు నిర్మించిన ఈ పవిత్ర స్థానాన్ని కాదు ప్రవేశించింది. ఆయన మనకోసం పరలోకంలో ఉన్న దేవుని యొద్దకు వెళ్ళాడు.
25 ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం పశువుల రక్తంతో అతి పవిత్ర స్థానాన్ని ప్రవేశించినట్లు, ఆయన తనను తాను పదే పదే బలిగా సమర్పించుకోవటానికి పరలోకానికి వెళ్ళలేదు. 26 అలా అర్పించి ఉంటే ప్రపంచం సృష్టింప బడినప్పటి నుండి క్రీస్తు ఎన్నోసార్లు మరణించ వలసి వచ్చేది. కాని, ప్రస్తుతం యుగాల అంతంలో తనను తాను ఒకే ఒకసారి బలిగా అర్పించుకుని పాపపరిహారం చెయ్యాలని ప్రత్యక్ష్యమయ్యాడు.
27 ప్రతి ఒక్కడూ, ఒక్కసారే మరణించాలి. తర్వాత దేవుని తీర్పుకు గురి అవ్వాలి. వాళ్ళపై తీర్పు చెబుతాడు. 28 అందువల్ల, అనేకుల పాపపరిహారం కోసం క్రీస్తు ఒకసారి మాత్రమే తనను తాను బలిగా అర్పించుకున్నాడు. ఆయన రెండవసారి ప్రత్యక్ష్యమౌతాడు. పాపం మోయటానికి కాదు తనకోసం కాచుకొని ఉన్నవాళ్లకు రక్షణ కలిగించటానికి ప్రత్యక్ష్యమౌతాడు.
యేసు క్రీస్తు—మనకవసరమైన ఏకైక బలి
10 ధర్మశాస్రం రాబోవు మంచి విషయాల నీడలాంటిది. అది అస్పష్టమైనది. అంటే, ఆ మంచి విషయాలు అప్పటికింకా రాలేదన్నమాట. ధర్మశాస్రం ఆదేశించిన విధంగా ప్రజలు దేవుని దగ్గరకు ప్రతి సంవత్సరం వచ్చి తప్పకుండా ఒకే రకమైన బలులు అర్పించేవాళ్ళు. కాని ధర్మశాస్త్రం వాళ్ళలో పరిపూర్ణత కలిగించలేదు. 2 అలా చేసినట్లైతే, వాళ్ళు ఆ బలులు యివ్వటం మాని ఉండేవాళ్ళు. పాపాలు శాశ్వతంగా పరిహారమై వాళ్ళు పశ్చాత్తాపం చెందవలసిన అవసరం ఉండేది కాదు. 3 కాని దానికి మారుగా ఆ బలులు వాళ్ళు చేసిన పాపాల్ని ప్రతి సంవత్సరం వాళ్ళకు జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. 4 ఎద్దుల రక్తంతో, మేకల రక్తంతో పాపపరిహారం కలగటమనేది అసంభవం.
5 ఆ కారణంగానే, క్రీస్తు ఈ ప్రపంచంలోకి వచ్చాక దేవునితో ఈ విధంగా అన్నాడు:
“బలుల్ని, అర్పణల్ని నీవు కోరలేదు
కాని, నేనుండటానికి ఈ శరీరాన్ని సృష్టించావు.
6 జంతువుల్ని కాల్చి అర్పించిన ఆహుతులు కాని,
పాపపరిహారం కోసం యిచ్చిన బలులు కాని,
నీకు అనందం కలిగించలేదు.
7 అప్పుడు నేను, ‘ఇదిగో దేవా! ఇక్కడ ఉన్నాను!
నన్ను గురించి గ్రంథాల్లో వ్రాశారు.
నేను నీ యిచ్ఛ నెరవేర్చటానికి వచ్చాను’ అని అన్నాను.”(E)
8 “బలుల్ని, అర్పణల్ని, జంతువుల్నికాల్చి యిచ్చిన ఆహుతుల్ని, పాప పరిహారం కోసం యిచ్చిన ఆహుతుల్ని నీవు కోరలేదు. అవి నీకు ఆనందం కలిగించలేదు” అని మొదట అన్నాడు. కాని, ధర్మశాస్త్రం ఈ ఆహుతుల్ని యివ్వమని ఆదేశించింది. 9 ఆ తర్వాత క్రీస్తు, “ఇదిగో దేవా! ఇక్కడ ఉన్నాను. నీ యిచ్ఛ నెరవేర్చటానికి వచ్చాను” అని అన్నాడు. ఆయన రెండవదాన్ని నెరవేర్చటానికి మొదటిదాన్ని రద్దుచేశాడు. 10 దైవేచ్ఛ నెరవేర్చటానికి క్రీస్తు తన శరీరాన్ని బలిగా అర్పించి మనల్ని శాశ్వతంగా పవిత్రం చేశాడు. ఆయన యిచ్చిన మొదటి బలి, చివరి బలి యిదే.
11 ప్రతి యాజకుడు మత సంబంధమైన కర్తవ్యాన్ని ప్రతిరోజు నెరవేరుస్తూ ఉంటాడు. ఇచ్చిన బలుల్నే మళ్ళీ మళ్ళీ యిస్తూ ఉంటాడు. ఈ బలులు పాపపరిహారం చెయ్యలేవు. 12 కాని క్రీస్తు మన పాపపరిహారార్థం ఒకే ఒక బలి యిచ్చి దేవుని కుడిచేతి వైపు శాశ్వతంగా కూర్చుండిపొయ్యాడు. 13 అప్పటినుండి, ఆయన శత్రువుల్ని దేవుడు ఆయన పాదపీఠంగా చెయ్యాలని కాచుకొని ఉన్నాడు. 14 ఆయన ఒకే ఒక అర్పణ చేసి పరిశుద్ధులలో శాశ్వతమైన పరిపూర్ణత కలిగించాడు.
15 ఈ విషయాన్ని గురించి పరిశుద్ధాత్మ మనకు యిలా ప్రకటిస్తున్నాడు:
16 “ఆ తర్వాత నేను వాళ్ళతో ఈ ఒడంబడిక చేస్తాను.
నా నియమాల్ని వాళ్ళ హృదయాల్లో ఉంచుతాను.
వాటిని వాళ్ళ మనస్సులపై వ్రాస్తాను.”(F)
17 పరిశుద్ధాత్మ ఇంకా యిలా అన్నాడు:
“వాళ్ళ పాపాల్ని,
దుర్మార్గాల్ని నేను మరిచిపోతాను!”(G)
18 వాళ్ళ పాపాల్ని దేవుడు క్షమించాడు కాబట్టి, పాపం కోసం బలుల్ని అర్పించవలసిన అవసరం తీరిపోయింది.
విశ్వాసాన్ని వదులుకోకండి
19 సోదరులారా! యేసు తన రక్తాన్ని అర్పించాడు. తద్వారా అతి పవిత్ర స్థానానికి వెళ్ళగలమనే విశ్వాసం మనలో కలిగింది. 20 ఆయన శరీరం ఒక తెరగా ఉంది. దాన్ని తొలగించి మనకోసం సజీవమైన నూతన మార్గాన్ని వేశాడు. 21 అంతేకాక, ఆ ప్రధాన యాజకుడు మన దేవాలయంపై అధికారిగా పనిచేస్తున్నాడు. 22 తప్పు చేసి బాధపడ్తున్న మన హృదయాలపై రక్తం ప్రోక్షింపబడింది. స్వచ్ఛమైన నీళ్ళతో మన దేహాలు పరిశుభ్రం చేయబడ్డాయి. ఇప్పుడిక మంచి హృదయాలతో, సంపూర్ణ విశ్వాసంతో దైవ సన్నిధిని చేరుకొందాం. 23 మనకు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. అందువల్ల మనం బహిరంగంగా ప్రకటిస్తున్న విశ్వాసాన్ని విడవకుండా ధైర్యంతో ఉందాం.
ఒకరికొకరు సహాయం చేసుకొంటూ బలవంతులై యుండండి
24 ప్రేమిస్తూ మంచిపనులు చేస్తూ ఉండమని పరస్పరం ప్రోత్సాహపరుచుకొందాం. 25 సమావేశాలకు రాకుండా ఉండటం కొందరికి అలవాటు. కాని, మనం పరస్పరం కలుసుకొంటూ ఉందాం. ముఖ్యంగా ప్రభువు రానున్నదినం[b] సమీపిస్తోంది గనుక పరస్పరం ప్రోత్సాహపరచుకొంటూ ఉందాం.
దైవకుమారున్నుండి వెళ్ళిపోకండి
26 సత్యాన్ని గురించి జ్ఞానం సంపాదించిన తర్వాత కూడా, మనం కావాలని పాపాలు చేస్తూ ఉంటే, యిక అర్పించటానికి మన దగ్గర బలి ఎక్కడుంది? 27 తీర్పు జరుగుతుందనే భయము, దేవుని శత్రువుల్ని కాల్చివేసే మంటలు రానున్నాయనే భయము మాత్రమే మిగిలిపోతాయి. 28 మోషే నియమాల్ని ఉల్లంఘించినవానిపై యిద్దరు లేక ముగ్గురు చెప్పిన సాక్ష్యాలతో దయ చూపకుండా మరణ శిక్ష విధించేవాళ్ళు. 29 మరి దేవుని కుమారుణ్ణి కాళ్ళ క్రింద త్రొక్కినవాణ్ణి, తనను పవిత్రం చేసిన ఒడంబడిక రక్తాన్ని అపవిత్రంగా పరిగణించేవాణ్ణి, అనుగ్రహించే ఆత్మను అవమాన పరిచేవాణ్ణి, యింకెంత కఠినంగా శిక్షించాలో మీరే ఊహించండి. 30 “పగ తీర్చుకోవలసిన పని నాది, తిరిగి చెల్లించేవాణ్ణి నేను” అని అన్నవాడు, “ప్రభువు తన ప్రజలపై తీర్పు చెపుతాడు”(H) అని అన్నవాడు ఎవరో మనకు తెలుసు. 31 సజీవంగా ఉన్న దేవుని చేతుల్లో పాపాత్ములు చిక్కుకోవటమనేది భయానకమైన విషయము.
మీకు కలిగిన ధైర్యసహనాల్ని కాపాడుకోండి
32 మీరు వెలిగింపబడిన రోజుల్ని జ్ఞాపకం తెచ్చుకోండి. ఆ రోజుల్లో మీరు ఎన్నో కష్టాలు అనుభవించారు. అయినా మీరు వాటిని సహించారు. 33 కొన్నిసార్లు మీరు అవమానాన్ని, హింసను బహిరంగంగా అనుభవించారు. మరికొన్నిసార్లు అవమానాన్ని, హింసను అనుభవించేవాళ్ళ ప్రక్కన నిలుచున్నారు. 34 అంతేకాక, చెరసాలల్లో ఉన్నవాళ్ళ పట్ల మీరు సానుభూతి చూపించారు. పైగా “మీ ఆస్తుల్ని” దోచుకొంటుంటే ఆనందంగా అంగీకరించారు. ఎందుకంటే, మీరు పొందిన ఆస్తి మీరు పోగొట్టుకొన్న ఆస్తికన్నా ఉత్తమమైనదని మీకు తెలుసు. అది శాశ్వతమైనదని కూడా మీకు తెలుసు.
35 అందువల్ల మీ విశ్వాసాన్ని వదులుకోకండి. దానికి మంచి ప్రతిఫలం లభిస్తుంది. 36 మీరు పట్టుదలతో ఉండాలి. దైవేచ్ఛ ప్రకారం నడుచుకోవాలి. ఆ తర్వాత దేవుడు, తాను వాగ్దానం చేసినదాన్ని ప్రసాదిస్తాడు. 37 ఎందుకంటే,
“త్వరలోనే వస్తున్నాడు, వస్తాడు,
ఆలస్యం చెయ్యడు!
38 నీతిమంతులైన నా ప్రజలు
నన్ను విశ్వసిస్తూ జీవిస్తారు.
కాని వాళ్ళలో ఎవరైనా వెనుకంజ వేస్తే
నా ఆత్మకు ఆనందం కలుగదు.”(I)
39 కాని, మనం వెనుకంజ వేసి నశించిపోయేవాళ్ళలాంటి వారం కాదు. గాని విశ్వాసం ద్వారా రక్షంచబడేవాళ్ళ లాంటివారం.
© 1997 Bible League International