Chronological
1 దేవుని సేవకుడును, యేసు క్రీస్తు యొక్క అపొస్తలుడును అయినటువంటి పౌలు వ్రాయుచున్న పత్రిక. దేవుడు తానెన్నుకున్న ప్రజల విశ్వాసాన్ని దృఢపరచడానికి, వాళ్ళను భక్తి కల్గించే మన సత్యం వైపు మళ్ళించటానికి నన్ను ఎన్నుకొన్నాడు. 2 ఈ సత్యం, అనంత జీవితం లభిస్తుందని విశ్వసించటంపై ఆధారపడి ఉంది. అబద్ధం ఆడని దేవుడు మనకీ జీవితం యిస్తానని కాలానికి ముందే వాగ్దానం చేసాడు. 3 సరియైన సమయానికి దాన్ని తన సందేశం ద్వారా మనకు తెలియచేసాడు. ఈ సందేశం నాకప్పగింపబడింది. మన రక్షకుడైనటువంటి దేవుడు దాన్ని మీకు ప్రకటించమని ఆజ్ఞాపించాడు. కనుక దాన్ని మీకు ప్రకటిస్తున్నాను.
4 మనలో ఉన్న విశ్వాసం మూలంగా నా ప్రియ కుమారునిగా భావిస్తున్న తీతుకు వ్రాయటమేమనగా, మన తండ్రియైన దేవుని నుండి, మన రక్షకుడైన యేసు క్రీస్తునుండి నీకు శాంతి, కృప లభించుగాక!
క్రేతులో తీతు చేయవలసిన పని
5 అసంపూర్ణంగా వదిలి వేయబడిన వాటిని పూర్తి చేయటానికి, నేను ఆదేశించిన విధంగా ప్రతి పట్టణంలో పెద్దలను నియమించటానికి నిన్ను క్రేతులో వదిలి వచ్చాను. 6 క్రీస్తు సంఘంలోనున్న అధ్యక్షుడు నిందారహితుడై, ఏకపత్నీవ్రతుడై ఉండాలి. తన పిల్లలు అవిధేయతగా ఉండక, అవినీతిగా ఉండక, చెడ్డపేరు లేకుండా, విశ్వసించిన వాళ్ళుగా ఉండాలి. 7 సంఘాధ్యక్షుడు దైవకార్యాన్ని నడిపించే బాధ్యత కలవాడు కనుక అతడు నిందారహితుడై ఉండాలి. అతనిలో గర్వము ఉండరాదు. ముక్కోపి కాకూడదు. త్రాగుబోతు కాకూడదు. పోట్లాడరాదు. అధర్మంగా లాభాలు సంపాదించ రాదు. 8 అతిథులను పరామర్శించే వాడైయుండాలి. మంచి పనులు చెయ్యాలి. మనో నిగ్రహం, నీతి, పవిత్రత, క్రమశిక్షణ మొదలగు గుణాలు అతనిలో ఉండాలి. 9 తనకు బోధింపబడిన సందేశాన్ని విశ్వాసంతో ఆచరించాలి. అప్పుడే యితరులకు ఈ గొప్ప సత్యాన్ని చెప్పి వాళ్ళను కూడా ప్రోత్సాహపరచగలడు. ఈ సందేశాన్ని అంగీకరించనివాళ్ళకు వాళ్ళు చేస్తున్న తప్పు చూపగలడు.
10 తాము అవిధేయతగా ఉంటూ, అధికంగా మాట్లాడి నమ్మించాలని ప్రయత్నించే మోసగాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా సున్నతి అవసరమని వాదించే యూదులు ఈ విధంగా చేస్తున్నారు. 11 అన్యాయంగా లాభం గడించటానికి బోధించరాని విషయాలు బోధించి కుటుంబాల్ని నాశనం చేస్తున్నారు. వాళ్ళను ఆపటం అవసరం. 12 “క్రేతీయులు అబద్ధాలాడుతున్నారనీ, క్రూర మృగాల్లాంటివాళ్ళనీ, సోమరిపోతులనీ, తిండి పోతులనీ” క్రేతీయులలో ప్రవక్తలలో ఒకడు అన్నాడు. 13 ఈ సాక్ష్యము నిజము. వాళ్ళను గట్టిగా వారించటం అవసరం. అలా చేస్తే, వాళ్ళ విశ్వాసం దృఢమౌతుంది. 14 అప్పుడు వాళ్ళు యూదుల కల్పిత కథలను మరిచిపోయి, మన సత్యాన్ని నిరాకరించే వాళ్ళ బోధలను లెక్క చెయ్యరు.
15 పవిత్రంగా ఉన్నవాళ్ళకు అన్నీ పవిత్రంగా కనిపిస్తాయి. కాని దుష్టులకు, విశ్వాసం లేనివాళ్ళకు ఏదీ పవిత్రంగా కనిపించదు. వాళ్ళ బుద్ధులు, మనస్సులు చెడుతో నిండి ఉంటాయి. 16 వాళ్ళు తమకు దేవుని గురించి తెలుసునంటారు కాని, వాళ్ళ ప్రవర్తన ఆ దేవుణ్ణి నిరాకరిస్తున్నట్లు చూపిస్తుంది. వాళ్ళు ద్వేషంతో, అవిధేయతతో ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు మంచి పని చేయటానికి అంగీకరించరు.
మంచి బోధ
2 ఉత్తమ సిద్ధాంతాల ప్రకారం సత్యాన్ని అనుసరించమని ప్రజలకు బోధించు. 2 వృద్ధులకు శాంతంగా ఉండమని, గౌరవంగా జీవించుని, ఆత్మనిగ్రహం, సంపూర్ణమైన విశ్వాసం, ప్రేమ, సహనము కలిగి ఉండమని బోధించు.
3 అదే విధంగా వృద్ధ స్త్రీలకు పవిత్రంగా జీవించమని, ఇతర్లను దూషించకూడదని, త్రాగుబోతులు కాకూడదని, మంచిని మాత్రమే ఉపదేశమిమ్మని చెప్పు. 4 అలా చేస్తే వాళ్ళు యౌవన స్త్రీలకు తమ భర్తల్ని, తమ పిల్లల్ని ప్రేమించాలని, 5 ఆత్మనిగ్రహం కలిగి ఉండి పవిత్రంగా జీవించాలని, తమ గృహనిర్వాహక కర్తవ్యాలను పూర్తి చెయ్యాలని, దయను అలవరచుకోవాలని, వారి భర్తలకు విధేయతగా ఉండాలని ఉపదేశించి శిక్షణనిస్తారు. అప్పుడు దైవసందేశాన్ని ఎవ్వరూ విమర్శించరు.
6 అదే విధంగా మనోనిగ్రహం కలిగి ఉండమని యువకులకు బోధించు. 7 నీవు స్వయంగా ఉత్తమ కార్యాలు చేస్తూ వాళ్ళకు ఆదర్శంగా ఉండాలి. నీవు బోధించేటప్పుడు మనస్పూర్తిగా, గంభీరంగా బోధించు. 8 విమర్శకు గురికాకుండా జాగ్రత్తగా బోధించు. అప్పుడు నీ శత్రువు విమర్శించటానికి ఆస్కారం దొరకక సిగ్గుపడతాడు.
9 బానిసలు తమ యజమానుల యిష్టానుసారం నడుచుకోవాలని బోధించు. తమ యజమానులకు ఆనందం కలిగేటట్లు మసలుకోవాలనీ, వాళ్ళకు ఎదురు తిరిగి మాట్లాడరాదని వాళ్ళకు బోధించు. 10 తమ యజమానులనుండి దొంగిలించరాదనీ, తమ యజమానులు తమను విశ్వసించేటట్లు నడుచుకోవాలనీ బోధించు. అప్పుడే మన రక్షకుడైన దేవుని గురించి నేర్చుకొన్నవి సార్థకమౌతాయి.
11 ఎందుకంటే, మానవులకు రక్షణ కలిగించే దైవానుగ్రహం అందరికి ప్రత్యక్షమైంది. 12 అది నాస్తికత్వాన్ని, ఐహిక దురాశల్ని మానివేయమని బోధిస్తుంది. మనోనిగ్రహం కలిగి, క్రమశిక్షణతో, ఆత్మీయంగా ఈ ప్రపంచంలో జీవించమని బోధిస్తుంది, 13 మనం ఆశిస్తున్న ఆ గొప్ప రోజు వస్తుందని, ఆ రోజున మన దేవుడునూ మన రక్షకుడునూ అయినటువంటి యేసు క్రీస్తు కనిపిస్తాడని నిరీక్షిస్తూ ఉన్నాము. 14 అన్ని పాపాలనుండి మనకు విముక్తి కలగాలని యేసు క్రీస్తు తనను తాను అర్పించుకొన్నాడు. సత్కార్యాలు చెయ్యాలని ఉత్సాహపడుతున్న ఈ ప్రజలు ఈ యేసు క్రీస్తుకు చెందినవాళ్ళు. ఆయన వాళ్ళను తనకోసం పవిత్రంగా చేసాడు.
15 నీవు ఈ విషయాలను బోధించాలి. సంపూర్ణమైన అధికారంతో ప్రజలను ఉత్సాహపరుస్తూ, ఖండిస్తూ, నిన్ను ఎవ్వరూ ద్వేషించకుండా జాగ్రత్త పడు.
విశ్వాసులు చేయవలసిన విధులు
3 పాలకులు, అధికారులు ఆజ్ఞాపించినట్లు నడుచుకోమని ప్రజలకు జ్ఞాపకం చేయి. విధేయతగా ఉండమని, సత్కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉండమని బోధించు. 2 ఇతర్లను దూషించకుండా శాంతిని, మంచితనాన్ని అలవర్చుకోమని, అందరిపట్ల దయ చూపమని బోధించు.
3 గతంలో మనం కూడా మూర్ఖంగా, అవిధేయంగా ఉంటిమి. తప్పులు చేస్తూ, మానసిక వాంఛలకు, సుఖాలకు లోనై, అసూయతో యితర్ల చెడును కోరుతూ, ద్వేషిస్తూ, ద్వేషింపబడుతూ జీవించాము. 4 అలాంటి సమయంలో మన రక్షకుడైనటువంటి దేవుని దయ, ప్రేమ మనకు కనిపించాయి. 5 మనం నీతికార్యాలు చేసినందుకు ఆయన మనలను రక్షించలేదు కాని తన కృప ద్వారానే మనల్ని పవిత్రపరచి, మనకు పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మీయ పునర్జన్మ కల్గించాడు. క్రొత్త జీవితాన్నిచ్చి, మనల్ని రక్షించాడు. 6 పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ధారాళంగా మనపై కురిపించాడు. 7 ఆయన అనుగ్రహం వల్ల మనం నీతిమంతులంగా వారసులం కావాలని ఆయన ఉద్దేశ్యం. ఈ విధంగా మనమాశిస్తున్న అనంత జీవితం పొందగలుగుతాము. 8 ఇది నిజం. నీవు ఈ విషయాన్ని నొక్కి చెప్పాలి.
అలా చేస్తే దేవుణ్ణి విశ్వసించినవాళ్ళు జాగ్రత్తగా ఉండి, మంచి చేయటంలో నిమగ్నులౌతారు. ఇది మంచిది. దాని వలన ప్రజలకు లాభం కలుగుతుంది.
9 కాని మూర్ఖంగా వాదించేవాళ్ళకు, వంశ చరిత్రల్ని చర్చించేవాళ్ళకు, ధర్మశాస్త్రాన్ని గురించి వాదించేవాళ్ళకు, పోట్లాడేవాళ్ళకు దూరంగా ఉండు. అలాంటి చర్చలవల్ల ఉపయోగమేమీ ఉండదు. వాటివల్ల లాభం కలుగదు. 10 చీలికలు కలిగించేవాణ్ణి ఒకటి రెండు సార్లు గద్దించు. ఆ తర్వాత అతనితో సంబంధం తెంపుకో. 11 అలాంటివాడు దుర్మార్గుడని, పాపి అని నీకు బాగా తెలుసు. అతడు తనకు తాను శిక్ష విధించుకొన్నాడు.
చివరి మాట
12 అర్తెమానును, తుకికును నీ దగ్గరకు పంపిన తక్షణం నీవు నికొపొలికి వచ్చి నన్ను కలుసుకో. ఈ చలికాలం నేనక్కడ గడపదలిచాను. 13 న్యాయవాది జేనా, అపొల్లోల ప్రయాణానికి కావలసినవన్నీ సమకూర్చి వాళ్ళకు సహాయం చెయ్యి. 14 మనవాళ్ళు సత్కార్యాలు చేయటానికి నేర్చుకొని వాటిలో నిమగ్నులై ఉండాలి. తమ నిత్యావసరాలకు కావలిసినవి సంపాదించుకోవాలి. వ్యర్థంగా జీవించకూడదు.
15 నాతో ఉన్నవాళ్ళు నీకు వందనాలు తెలుపుతున్నారు. విశ్వాసం మూలంగా మన స్నేహితులైనవాళ్ళకు నా శుభాకాంక్షలను తెలుపుము.
మీ అందరిపై దేవుని కృప ఉండునుగాక!
© 1997 Bible League International