Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 కొరింథీయులకు 5-8

నీతిలేని సోదరుణ్ణి బహిష్కరించండి

మీలో లైంగిక అవినీతి బాగా వ్యాపించి పోయిందని నాకు సృష్టంగా తెలిసింది. అలాంటి అవినీతి, క్రైస్తవులు కానివాళ్ళలో కూడా లేదు. ఒకడు తన సవతి తల్లితో సంబంధం పెట్టుకొన్నాడని విన్నాను. ఇది గర్వించతగిన విషయమా? ఇది చాలా దుఃఖించవలసిన విషయము. ఈ పని చేసినవాణ్ణి మీరు సంఘం నుండి బహిష్కరించవలసి ఉంది. నేను శరీరముతో మీ దగ్గర లేకున్నా నా ఆత్మలో మీతో ఉన్నాను. నేను మీతో ఉన్నట్లు భావించి ఈ అపరాధము చేసిన వానిపై తీర్పు చెపుతున్నాను. మీరు యేసు ప్రభువు పేరిట సమావేశమైనప్పుడు నా ఆత్మలో మీతో ఉంటాను. యేసు ప్రభువు శక్తి మీలో ఉంటుంది. అప్పుడు అతణ్ణి సాతానుకు అప్పగించండి. తద్వారా వాని పాపనైజం నశించి అతని ఆత్మ మన ప్రభువు వచ్చిన రోజున రక్షింపబడుతుంది.

“పులుపు కొంచెమైనా, పిండినంతా పులుపు చేస్తుందని తెలియదా? మీరు గర్వించటం మంచిది కాదు.” పులిసిన పాత పిండిని పారవేయండి. క్రీస్తు మన పస్కా గొఱ్ఱెపిల్లగా బలి ఇవ్వబడ్డాడు. అప్పుడు మీరు క్రొత్త పిండిలా ఉంటారు. నిజానికి మీరు పులియని క్రొత్త పిండివంటివాళ్ళు. కనుక పులియని రొట్టెతో పండుగ చేసుకొందాము. ద్వేషంతో, పాపంతో కూడుకొన్న పాత పులిసిన పిండితో కాక నిష్కపటంతోనూ, సత్యంతోనూ కూడుకొన్న పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాము.

నేను నా లేఖల్లో లైంగిక అవినీతి కలవాళ్ళతో సాంగత్యం చేయవద్దని వ్రాసాను. 10 అంటే, సంఘానికి చెందని అవినీతిపరులతో, లోభులతో, మోసగాళ్ళతో, విగ్రహారాధకులతో సాంగత్యం చేయవద్దని నేను చెప్పటం లేదు. అలా చేస్తే మీరు ఈ ప్రపంచాన్నే వదిలివేయవలసి వస్తుంది. 11 నేను ప్రస్తుతం వ్రాసేది ఏమిటంటే తాను సోదరుణ్ణని చెప్పుకొంటూ, లైంగిక అవినీతితో జీవించేవానితో, లోభత్వం చేసేవానితో, విగ్రహారాధన చేసేవానితో, ఇతరులను దూషించేవానితో, త్రాగుబోతుతో, మోసం చేసేవానితో, సహవాసం చేయవద్దని చెపుతున్నాను. అలాంటి వానితో కలిసి భోజనం కూడా చేయవద్దు.

12 సంఘానికి చెందనివానిపై తీర్పు చెప్పే అధికారం నాకు లేదు. కాని సంఘంలో ఉన్నవానిపై తీర్పు చెప్పవలసిన అవసరం ఉంది. 13 “ఆ దోషిని మీ సంఘం నుండి వెలివేయండి.”(A) కాని సంఘానికి చెందనివాళ్ళపై దేవుడు తీర్పు చెపుతాడు.

క్రైస్తవుల మధ్య వివాదాలు

ఒకవేళ మీ మధ్య తగువులొస్తే, మన సంఘంలో ఉన్న పవిత్రుల దగ్గరకు వెళ్ళాలి కాని, సంఘానికి చెందనివాళ్ళ దగ్గరకు వెళ్ళేందుకు మీ కెంత ధైర్యం? పవిత్రులు ప్రపంచం మీద తీర్పు చెపుతారన్న విషయం మీకు తెలియదా? మీరు ప్రపంచంమీద తీర్పు చెప్పగలిగినప్పుడు, సాధారణమైన విషయాలపై తీర్పు చెప్పే స్తోమత మీలో లేదా? మనము దేవదూతల మీద కూడా తీర్పు చెపుతామన్న విషయం మీకు తెలియదా? అలాంటప్పుడు ఈ జీవితానికి సంబంధించిన విషయాలు ఏ పాటివి? మీ మధ్య వివాదాలొస్తే, సంఘం లెక్కచెయ్యనివాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళను న్యాయం చెప్పమంటారా? సిగ్గుచేటు! సోదరుల మధ్య కలిగే తగువులు తీర్చగలవాడు మీలో ఒక్కడు కూడా లేడా? సంఘానికి చెందినవాని దగ్గరకు వెళ్ళకుండా ఒక సోదరుడు మరొక సోదరునిపై నేరారోపణ చేయటానికి న్యాయస్థానానికి వెళ్ళుతున్నాడు. అంటే సంఘానికి చెందనివాళ్ళను అడుగుతున్నాడన్న మాట.

మీ మధ్య వ్యాజ్యాలు ఉండటం వల్ల మీరు పూర్తిగా ఓడిపొయ్యారని చెప్పవచ్చు. వ్యాజ్యాలు పెట్టు కోవటంకన్నా అన్యాయం సహించటం, మోసపోవటం మంచిది. దానికి మారుగా మీరే అన్యాయాలు, మోసాలు చేస్తున్నారు. ఇతరులను కాక, మీ సోదరులనే మోసం చేస్తున్నారు.

దుష్టులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోకండి. లైంగిక విషయాల్లో అవినీతిగా జీవించేవాళ్ళకు, విగ్రహారాధికులకు, వ్యభిచారులకు, మగ వేశ్యలు, మగవాళ్ళతో మగవాళ్ళు, ఆడవాళ్ళతో ఆడవాళ్ళు తమ కామాన్ని తీర్చుకొనే వాళ్ళకు, 10 దొంగలకు, దురాశాపరులకు, త్రాగుబోతులకు, అపవాదాలు లేవదీసేవాళ్ళకు, మోసగాళ్ళకు, దేవుని రాజ్యం దొరకదు. 11 మీలో కొందరు ఆ విధంగా జీవించారు. కాని దేవుడు మీ పాపాలు కడిగివేశాడు. కనుక మీరు పవిత్రంగా ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువు పేరిట మన దేవుని ఆత్మ ద్వారా మీరు నిర్దోషులుగా పరిగణింపబడ్డారు.

లైంగిక అవినీతి

12 “ఏది చెయ్యటానికైనా నాకు అనుమతి ఉంది.” కాని వాటివల్ల లాభం కలుగదు. “ఏది చెయ్యటానికైనా నాకు అనుమతి ఉంది” కాని నేను దానికి బానిసను కాను, 13 “తిండి కడుపు కోసము, కడపు తిండి కోసం సృష్టింపబడినాయి.” కాని దేవుడు రెంటినీ నాశనం చేస్తాడు. దేహం ఉన్నది వ్యభిచారం చేయటానికి కాదు. అది ప్రభువు కోసం ఉంది. ప్రభువు దేహం కోసం ఉన్నాడు. 14 దేవుడు తన శక్తితో ప్రభువును బ్రతికించాడు. అదే విధంగా మనల్ని కూడా బ్రతికిస్తాడు. 15 మీ దేహాలు క్రీస్తుకు అవయవాలని మీకు తెలియదా? మరి అలాంటప్పుడు క్రీస్తు అవయవాల్ని, వేశ్య దేహంతో కలుపమంటారా? అసంభవము. 16 తన దేహాన్ని వేశ్య దేహంతో కలిపినవాడు ఆ దేహంతో ఒకటైపోతాడని మీకు తెలియదా? దీన్ని గురించి, “రెండు దేహాలు ఒక దేహంగా అవుతాయి”(B) అని లేఖనాల్లో వ్రాయబడి ఉంది. 17 కాని ప్రభువుతో ఐక్యమైన వాడు ఆయన ఆత్మతో ఐక్యమౌతాడు.

18 లైంగిక అవినీతికి దూరంగా ఉండండి, మనిషి చేసే మిగతా పాపాలు తన దేహానికి సంబంధించినవి కావు. కాని వ్యభిచారం చెయ్యటంవల్ల వ్యక్తి తన స్వంత దేహంపట్ల పాపం చేసినట్లౌతుంది. 19 మీ దేహం పరిశుద్ధాత్మకు మందిరమని మీకు తెలియదా? దేవుడు యిచ్చిన పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు. మీ దేహంపై మీకు హక్కులేదు. 20 మీ కోసం వెల చెల్లించబడింది. కనుక మీ దేహాల్ని దేవుని మహిమ కోసం ఉపయోగించండి.

వివాహం

ఇక మీరు వ్రాసిన ప్రశ్నలకు నా సమాధానం ఇది: ఔను. వివాహం చేసుకోకుండా ఉండటం మంచిది. కాని లైంగిక అవినీతి చాలా వ్యాపించిపోయింది కనుక స్త్రీపురుషులు వివాహం చేసుకోవటం మంచిది. ప్రతీ పురుషుడు భర్తగా తన కర్తవ్యాలు నిర్వహించాలి. అలాగే ప్రతీ స్త్రీ భార్యగా తన కర్తవ్యాలు నిర్వహించాలి. భార్యకు తన శరీరంపై అధికారం లేదు. భర్తకు మాత్రమే ఆమె శరీరంపై అధికారం ఉంది. అలాగే భర్తకు తన శరీరంపై అధికారం లేదు. అతని శరీరంపై అతని భార్యకు మాత్రమే అధికారం ఉంది. భార్యాభర్తలు ఇరువురు సమ్మతించి దేవుని ప్రార్థించటంలో తమ కాలాన్ని గడపదలిస్తే తప్ప వేరువేరుగా ఉండకూడదు. ప్రార్థనా సమయం ముగిసాక మళ్ళీ మీరు కలిసికొనండి. మీలో ఆత్మనిగ్రహంలేదు. కనుక సాతాను ప్రేరేపణకు లొంగిపోకుండా జాగ్రత్త పడటానికి ఇలా చెయ్యటం అవసరం. ఇలా చెయ్యమని నేను ఆజ్ఞాపించటం లేదు. ఇలా చెయ్యటానికి నా అనుమతి తెలుపుతున్నాను. అందరూ నాలా ఉండాలని నా కోరిక. కాని ప్రతి ఒక్కనికీ దేవుడు ఒక ప్రత్యేకమైన వరం ఇచ్చాడు. ఒకనికి ఒక వరం, ఇంకొకనికి ఇంకొక వరం ఇచ్చాడు.

అవివాహితులకు, వితంతువులకు నా సలహా ఇది: వాళ్ళు నాలాగే పెళ్ళి చేసుకోకుండా ఉండటం మంచిది. కాని వాళ్ళలో నిగ్రహం లేకపోతే పెళ్ళి చేసుకోవటం ఉత్తమం. కామంతో కాలిపోవటం కన్నా పెళ్ళి చేసుకోవటం మంచిది.

10 వివాహితులకు నా ఆజ్ఞ ఇది. ఇది నా ఆజ్ఞ కాదు. ప్రభువుయొక్క ఆజ్ఞ. భార్య తన భర్తను వదిలివేయరాదు. 11 అలా వదిలివేస్తే ఆమె తిరిగి పెళ్ళి చేసుకోకూడదు. లేదా భర్తతో సమాధాన పడాలి. అలాగే భర్త తన భార్యకు విడాకులు ఇవ్వకూడదు.

12 మిగతా వాళ్ళకు నా ఆజ్ఞ యిది. ఇది ప్రభువు ఆజ్ఞ కాదు. నా ఆజ్ఞ. ఒక విశ్వాసి భార్య ప్రభువును నమ్మనిదై అతనితో ఉండటానికిష్టపడితే అతడు ఆమెకు విడాకులు ఇవ్వకూడదు. 13 అలాగే ఏ స్త్రీకైనను అవిశ్వాసియైన భర్తయుండి అతడు ఆమెతో జీవించాలని అనుకొంటే ఆమె అతనికి విడాకులు ఇవ్వకూడదు. 14 అంటే, విశ్వాసం లేని భర్త విశ్వాసురాలైన భార్యతో కలిసి జీవించటంవల్ల పవిత్రమౌతాడు. అదే విధంగా అవిశ్వాసియైన భార్య విశ్వాసియైన భర్తతో కలసి జీవించటం వల్ల పవిత్రమౌతుంది. అలాకానట్లయితే మీ సంతానం అపవిత్రంగా ఉంటుంది. కాని ఇప్పుడున్న ప్రకారం వాళ్ళు పవిత్రులే.

15 కాని, విశ్వాసి కానివాడు వెళ్ళిపోవాలని అనుకొంటే వెళ్ళిపోనివ్వండి. ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాసికి కాని, విశ్వాసురాలికి కాని ఏ నిర్భంధం ఉండకూడదు. దేవుడు శాంతితో జీవించటానికే మనల్ని పిలిచాడు. 16 ఓ స్త్రీ! నీ వల్ల నీ భర్త రక్షింపబడుతాడో లేదో! నీకేమి తెలుసు? ఓ పురుషుడా! నీ వల్ల నీ భార్య రక్షింబడుతుందో లేదో! నీకేమి తెలుసు?

దేవుడు నిన్ను పిలిచినట్లే జీవించు

17 ప్రతి ఒక్కడూ తన జీవితాన్ని ప్రభువు ప్రసాదించిన వరం ప్రకారం జీవించాలి. మీ జీవితం ప్రభువు నియమించిన ప్రకారముగా పిలుపుకు తగినట్టుగా ఉండాలి. ఈ నియమాన్ని అన్ని సంఘాలు పాటించాలని ఆజ్ఞాపిస్తున్నాను. 18 సున్నతి చేయించుకొన్నవాడు దేవుని పిలుపును అంగీకరిస్తే, అతడు ఆ సున్నతి లేనివానిగా ఉండుటకు ప్రయత్నించరాదు. సున్నతి చేయించుకొననివాడు దేవుని పిలుపును అంగీకరిస్తే అతడు సున్నతి చేయించుకోవటానికి ప్రయత్నం చేయరాదు. 19 సున్నతి చేయించుకొన్నా, చేయించుకోక పోయినా జరిగేది ఏమిలేదు. దేవుని ఆజ్ఞల్ని పాటించటం ముఖ్యం. 20 ప్రతి ఒక్కడూ, దేవుడు పిలిచినప్పుడు ఏ విధంగా ఉన్నాడో అదేవిధంగా ఉండాలి. 21 దేవుడు పిలిచినప్పుడు నీవు బానిసవా? చింతించకు. కాని నీవు స్వేచ్ఛ పొందగలిగితే అందుకు ప్రయత్నం చేయి. 22 ప్రభువు పిలిచినప్పుడు బానిసగా ఉన్నవాడు, ప్రభువులో ఐక్యత పొందటంవల్ల స్వేచ్ఛను పొందుతాడు. అదే విధంగా ప్రభువు పిలిచినప్పుడు స్వేచ్ఛగా ఉన్నవాడు ప్రభువుకు బానిస అవుతాడు. 23 మీకోసం వెల చెల్లించి దేవుడు మిమ్మల్ని కొన్నాడు. మానవులకు బానిసలు కాకండి. 24 సోదరులారా! దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు మీరేవిధంగా ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా ఉండి దేవునితో కలిసి ఉండండి.

పెండ్లి చేసుకొనుటలో గల సమస్యలు

25 ఇక కన్యలను గురించి: ప్రభువు మీకు ఏ ఆజ్ఞ ఇవ్వలేదు. కాని దేవుని అనుగ్రహంవల్ల నేను మీకు చెపుతున్న సలహాలు నమ్మతగినవి. 26 ప్రస్తుతమున్న క్లిష్ట పరిస్థితుల వల్ల మీరు కన్యలుగా ఉండిపోవటం మంచిది. 27 ఇక పురుషులు, మీరు వివాహితులైనట్లయితే విడాకులు ఇవ్వకండి. మీరు అవివాహితులైనట్లయితే భార్యల కోసం వెతక్కండి. 28 అలాగని మీరు వివాహం చేసుకొంటే పాపం కాదు. అదే విధంగా కన్యలు కూడా వివాహం చేసుకొంటే పాపం కాదు. కాని వివాహం చేసుకొన్నవాళ్ళు జీవితంలో చాలా కష్టాలు అనుభవిస్తారు. మీకా కష్టాలు కలుగరాదని ఇలా చెపుతున్నాను.

29 సోదరులారా! ఇక వ్యవధి లేదు. ఇక మీదటనుండి భార్యలున్నవాళ్ళు భార్యలు లేనట్లు జీవించాలి. 30 దుఃఖించేవాళ్ళు దుఃఖించనట్లు, ఆనందిస్తున్నవాళ్ళు ఆనందించనట్లు, కొనేవాళ్ళు కొన్నవి తమని కానట్లు జీవించాలి. 31 ఇప్పుడున్న ప్రపంచం నశించబోతోంది. కనుక ఈ ప్రపంచంలో జీవిస్తున్నవాళ్ళు దానిలో ఉన్న వస్తువుల పట్ల ఆశ పెంచుకోకుండా జీవించాలి.

32 మీరు చింతించరాదని నా కోరిక. “వివాహం చేసుకోనివాడు ప్రభువును ఏ విధంగా ఆనంద పరచాలా” అని, అంటే ఆత్మీయమైన విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటాడు. 33 కాని, వివాహితుడు తన భార్యను ఎలా ఆనందపరచాలని ఆలోచిస్తూ ఉంటాడు. కనుక ప్రాపంచిక విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటాడు. 34 అందువల్ల అతని మనస్సు రెండు రకాలుగా పని చేస్తూ ఉంటుంది. పెళ్ళికాని స్త్రీలు, కన్యలు ప్రభువు ఆజ్ఞల్ని పాటించటంలో నిమగ్నులై ఉంటారు. తమ మనస్సును, శరీరాన్ని ప్రభువుకు అర్పించి పని చేస్తుంటారు. కాని పెళ్ళిచేసుకొన్న స్త్రీలు తమ భర్తను ఆనందపరచటానికి, ప్రాపంచిక విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటారు. 35 ఇది నేను మీ మంచి కోసం చెపుతున్నాను. అనవసరమైన కట్టుబాట్లు నియమించాలని కాదు. మీరు సక్రమంగా నడుచుకోవాలని, మనస్ఫూర్తిగా మిమ్నల్ని మీరు ప్రభువుకు అర్పించుకోవాలని నా ఉద్ధేశ్యం.

36 తనతో పెళ్ళి నిశ్చయమైన కన్యను పెళ్ళి చేసుకోకుండా ఉండటం అక్రమమని భావించినవాడు, లేక ఆమెకు వయస్సు పెరిగిపోవటంవల్ల పెళ్ళి చేసుకోవటం అవసరమని భావించినవాడు పెళ్ళి చేసుకోవచ్చు. ఇది పాపం కాదు. 37 కాని పెళ్ళి చేసుకోరాదని తన మనస్సులో నిశ్చయించుకొన్నవాడు, పెళ్ళి చేసుకోవాలనే నిర్బంధం లేనివాడు, తన మనస్సును అదుపులో పెట్టుకోగలవాడు కూడా పెళ్ళి మాని సరియైన పని చేస్తున్నాడు. 38 కనుక తనతో పెళ్ళి నిశ్చయమైన కన్యను పెళ్ళి చేసుకొన్నవాడు మంచి పని చేస్తున్నాడు. కాని పెళ్ళి చేసుకోనివాడు ఇంకా మంచి పని చేస్తున్నాడు.

39 భర్త బ్రతికి ఉన్నంత కాలము భార్య అతనికి కట్టుబడి ఉండాలి. అతడు చనిపోతే ఆమె తనకు ఇష్టమున్నవాణ్ణి వివాహం చేసుకోవచ్చు. కాని అతడు ప్రభువు యొక్క విశ్వాసియై ఉండాలి. 40 ఆమె విధవరాలుగా ఉండిపోతే ఆనందంగా ఉంటుందని నా అభిప్రాయం. నాకును దేవుని ఆత్మ సహాయం ఉన్నదని తలస్తున్నాను.

విగ్రహార్పితమైన పదార్ధం

ఇక విగ్రహాలకు బలి యిచ్చిన వాటిని గురించి: మనలో జ్ఞానం ఉందని మనకు తెలుసు. జ్ఞానం గర్వాన్ని కలిగిస్తుంది. ప్రేమ మనిషిని అభివృద్ధి పరుస్తుంది. తనలో జ్ఞానముందని భావిస్తున్నవానిలో నిజానికి ఉండవలసిన జ్ఞానం లేదు. కాని తనను ప్రేమిస్తున్న మనిషిని దేవుడు గుర్తిస్తాడు.

ఇక విగ్రహాలకు బలి ఇచ్చినవాటి విషయం: విగ్రహానికి అర్థం లేదని, ఒక్కడే దేవుడున్నాడని మనకు తెలుసు. దేవుళ్ళని పిలువబడేవాళ్ళు ఆకాశంలోగాని, భూమిమీదగాని ఉన్నా, వాళ్లు “దేవుళ్ళని”, “ప్రభువులని” పిలవబడుచున్నారు. అయితే నిజానికి మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయనే మన తండ్రి. అన్నిటినీ ఆయనే సృష్టించాడు. ఆయన కోసమే మనము జీవిస్తున్నాము. మనకు ఒక్కడే ప్రభువు. ఆయనే యేసుక్రీస్తు. ఆయన ద్వారానే అన్నీ సృష్టింపబడ్డాయి. ఆయనవల్ల మనము జీవిస్తున్నాము.

కాని ఈ విషయం తెలియనివాళ్ళు చాలమంది ఉన్నారు. ఈనాటికీ విగ్రహారాధనకు అలవాటు పడ్డ కొందరు ఆ పదార్థాన్ని తిన్నప్పుడు అది విగ్రహానికి అర్పించింది అనుకొని తింటారు. వాళ్ళ మనసులు బలహీనమైనవి కనుక వాళ్ళు మలినమయ్యారు. ఆహారంవల్ల మనము దేవునికి సన్నిహితులము కాలేము. ఆ ఆహారం తినకపోతే నష్టం ఏమీ లేదు. తింటే వచ్చిన లాభం లేదు.

కాని మీ నిర్ణయము దృఢవిశ్వాసం లేనివాళ్ళకు నష్టం కలిగించకుండా జాగ్రత్తపడండి. 10 ఈ విషయంపై గట్టి అభిప్రాయం లేనివాడొకడు ఈ విషయాన్ని గురించి జ్ఞానమున్న మిమ్మల్ని గుడిలో నైవేద్యం తినటం చూస్తాడనుకోండి. అప్పుడు అతనికి విగ్రహాలకు నైవేద్యం పెట్టిన ఆహారం తినటానికి ధైర్యం కలుగుతుంది. 11 బలహీనమైన మనస్సుగల మీ సోదరుని కోసం క్రీస్తు మరణించాడు. కాని మీ అజ్ఞానంవల్ల ఆ సోదరుడు నశిస్తాడు. 12 అలా చేస్తే మీ సోదరునిపట్ల పాపం చేసి అతని మనస్సును గాయపరచిన వాళ్ళవుతారు. తద్వారా మీరు క్రీస్తుపట్ల పాపం చేసిన వాళ్ళవుతారు. 13 నా సోదరుడు పాపం చేయటానికి నా ఆహారం కారణమైతే నేనిక మీదట మాంసం తినను! ఏ విధంగానైనా అతని పతనానికి కారకుణ్ణి కాకుండా ఉంటాను.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International