Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యోహాను 14-17

యేసు తన శిష్యులను ఆదరించటం

14 “మీరు ఆందోళన చెందకండి. దేవుణ్ణి నమ్మండి. నన్ను కూడా నమ్మండి. నా తండ్రి యింట్లో ఎన్నో గదులున్నాయి. అలా లేక పోయినట్లైతే మీకు చెప్పేవాణ్ణి. మీకోసం ఒక స్థలము నేర్పాటు చేయటానికి అక్కడికి వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకోసం స్థలం ఏర్పాటు చేశాక తిరిగి వచ్చి మిమ్మల్ని నాతో పిలుచుకొని వెళ్తాను. నేను ఎక్కడ ఉంటే మీరు అక్కడ ఉండటం నా ఉద్దేశ్యం. నేను వెళ్ళే చోటికి వచ్చే దారి మీకు యిదివరకే తెలుసు” అని యేసు అన్నాడు.

తోమా ఆయనతో, “ప్రభూ! మీరు వెళ్ళే చోటు ఎక్కడుందో మాకు తెలియదు. అలాంటప్పుడు మాకా దారి ఏ విధంగా తెలుస్తుంది?” అని అన్నాడు.

యేసు, “మార్గము, సత్యము, జీవము, నేనే! నా ద్వారా తప్ప తండ్రి దగ్గరకు ఎవ్వరూ రాలేరు. నేను ఎవరో మీకు నిజంగా తెలిసివుంటే నా తండ్రి ఎవరో మీకు తెలుస్తుంది. యిప్పుడు ఆయన్ని చూసారు. ఆయనెవరో మీకు తెలుసు” అని సమాధానం చెప్పాడు.

ఫిలిప్పు, “ప్రభూ! మాకు తండ్రిని చూపండి. అది చాలు” అని అన్నాడు.

యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “నేను యింత కాలం మీతో కలిసి ఉన్నాను కదా! అయినా నేనెవరినో నీకు తెలియదా ఫిలిప్పు? నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే. అలాగైతే తండ్రిని చూపుమని ఎందుకు అడుగుతున్నావు? 10 నేను తండ్రిలో, తండ్రినాలో ఉన్నాడని, నీవు నమ్మటం లేదా? నేను చెప్పే మాటలు నా స్వంతవి కావు. నాలో నివసిస్తున్న తండ్రి తన పనిని చేస్తున్నాడు. 11 నేను తండ్రిలో, తండ్రినాలో ఉన్నామని నమ్మండి. లేక మహాత్కార్యాలు చూసైనా నమ్మండి.

12 “ఇది నిజం. నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను. నన్ను నమ్మిన ప్రతి ఒక్కడూ నేను చేసిన కార్యాలు చేస్తాడు. వీటికన్నా యింకా గొప్ప కార్యాలే చేస్తాడు. 13 కుమారుని ద్వారా తండ్రి మహిమ పొందటానికి మీరు నా పేరిట ఏమి అడిగినా చేస్తాను. 14 నా పేరిట నన్ను ఏమడిగినా నేను చేస్తాను.

పవిత్రాత్మ వాగ్దానం

15 “మీకు నా మీద ప్రేమ ఉంటే నేను ఆజ్ఞాపించినట్లు చేస్తారు. 16-17 మీతో చిరకాలం ఉండి, మీకు సహాయం చెయ్యటానికి మరొక ఉత్తరవాదిని[a] పంపుమని నేను తండ్రిని అడుగుతాను. ఆయన ఆత్మను పంపుతాడు. ఆ పవిత్రాత్మ సత్యాన్ని ప్రకటించటం తన కర్తవ్యం. ప్రపంచం ఆయన్ని చూడలేదు. ఆయన గురించి ప్రపంచానికి తెలియదు. కనుక ఆయన్ని అంగీకరించలేదు. ఆయన మీతో ఉన్నాడు కనుక మీకు ఆయన గురించి తెలుసు. ఆయన భవిష్యత్తులో మీతో ఉంటాడు. లోకం ఆయన్ని అంగీకరించలేదు, ఎందుకంటే అది ఆయన్ని చూడలేదు, తెలుసుకోలేదు.

18 “నేను మిమ్మల్ని అనాథలుగా వదిలి వేయను. మీ దగ్గరకు తిరిగి వస్తాను. 19 కొద్ది రోజుల తర్వాత ఈ ప్రపంచం నన్ను చూడదు. కాని మీరు నన్ను చూస్తారు. ఎందుకంటే నేను ఏ విధంగా జీవిస్తున్నానో అదే విధంగా మీరు కూడా జీవిస్తారు. 20 ఆ రోజు నేను తండ్రిలో, మీరు నాలో, నేను మీలో ఉన్నామన్న విషయం మీరు గ్రహిస్తారు. 21 నా ఆజ్ఞలు విని వాటిని అనుసరించినవాడే నన్ను ప్రేమించిన వానిగా పరిగణింపబడతాడు. నన్ను ప్రేమించిన వాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. నేను కూడా అతణ్ణి ప్రేమించి అతనికి ప్రత్యక్షమౌతాను.”

22 అప్పుడు యూదా (యూదా ఇస్కరియోతు కాదు), “కాని ప్రభూ! మీరు మాకు మాత్రమే ప్రత్యక్షమై, ప్రపంచానికి ప్రత్యక్షంకానని ఎందుకంటున్నారు?” అని అన్నాడు.

23 యేసు, ఈ విధంగా సమాధానం చెప్పాడు: “నన్ను ప్రమించేవాడు నేను చెప్పినట్లు చేస్తాడు. అలాంటివాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. మేము వచ్చి అతనితో నివసిస్తాము. 24 నన్ను ప్రేమించనివాడు నా మాట వినడు. మీరు వింటున్న నా ఈ మాటలు నావి కావు. అవి నన్ను పంపిన తండ్రివి.

25 “నేను వెళ్ళిపోక ముందే ఈ విషయాలన్నీ మీకు చెప్పాను. 26 తండ్రి నా పేరిట పంపనున్న ఆదరణకర్త, అంటే పవిత్రాత్మ, మీకు సహాయం చెయ్యటానికి వస్తాడు. ఆయన మీకు అన్నీ బోధిస్తాడు. నేను చెప్పిన వన్నీ మీకు జ్ఞాపకం చేస్తాడు.

27 “‘శాంతిని’ మీకు యిస్తున్నాను. అది నాలో ఉన్న శాంతి. ప్రపంచం దాన్ని మీకివ్వ జాలదు. కనుక చింతించకండి. భయపడకండి. 28 నేను వెళ్తున్నానని, మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తానని చెప్పటం మీరు విన్నారు. మీకు నా మీద ప్రేమ ఉంటే నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నందుకు మీరు ఆనందిస్తారు. ఎందుకంటే తండ్రి నాకన్నా గొప్పవాడు. 29 ఇది జరిగినప్పుడు మీరు విశ్వసించాలని మీకీ విషయం ముందే చెబుతున్నాను.

30 “ఈ లోకాధికారి రాబోతున్నాడు. అందువలన మీతో ఎక్కువ కాలం మాట్లాడను. వాడు నన్నేమీ చెయ్యలేడు. 31 కాని నాకు తండ్రిపై ప్రేమ ఉందన్న విషయము, ఆయన ఆజ్ఞాపించినట్లు నేను చేస్తున్న విషయము ప్రపంచానికి తెలియాలి. అందుకే యిలా చేస్తున్నాను.

“రండి, యిక్కడి నుండి వెళ్దాం!”

తీగ, కొమ్మలు

15 “నా తండ్రి తోట యజమాని. నేను నిజమైన ద్రాక్షా తీగను. నాలో ఫలం కాయని కొమ్మలన్నిటిని నా తండ్రి పూర్తిగా కొట్టి వేస్తాడు. ఫలమిచ్చే కొమ్మల్ని, అవి యింకా ఎక్కువ ఫల మిచ్చేటట్లు చెయ్యటానికి వాటికొనల్ని కత్తిరిస్తాడు. నేను మీకు బోధించిన విషయాలవల్ల ఎక్కువ ఫల మిచ్చేటట్లు మీరిదివరకే కత్తిరింపబడ్డారు. నాలో ఐక్యమై ఉండండి. నేను మీలో ఐక్యమై ఉంటాను. కొమ్మ స్వతహాగా ఫలమివ్వ లేదు. అది తీగకు అంటుకొని ఉండాలి. అదేవిధంగా మీరు నాలో ఉంటేనే ఫలమివ్వగలరు.

“నేను తీగను. మీరు నా కొమ్మలు. ఒక వ్యక్తి నాలో ఉండి నేను అతనిలో ఉంటే అతడెక్కువ ఫల మివ్వగలడు. నాకు దూరంగా ఉండి మీరేమీ చెయ్యలేరు. నాలో ఉండని వాళ్ళు కొమ్మవలే పారవేయబడతారు. అప్పుడు కొమ్మలు ఎండి పోతాయి. వాటిని ప్రోగుచేసి ప్రజలు మంటల్లో వేస్తారు. అవి కాలిపోతాయి. మీరు నాలో, నా ఉపదేశాలు మీలో ఉంటే మీరు మీకిష్టమైన దేదైనా అడగండి. అది మీకిస్తాను. కోరింది జరుగుతుంది. మీరు ఎక్కువ ఫలం ఫలించి నా శిష్యులుగా ఉంటే నా తండ్రి మహిమ వ్యక్తం చేసిన వాళ్ళౌతారు.

“నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్మల్ని ప్రేమించాను. నా ప్రేమకు పాత్రులైఉండండి. 10 నేను నా తండ్రి ఆజ్ఞలకు లోబడి ఆయన ప్రేమలో నిలిచియున్నట్లుగా మీరు నా ఆజ్ఞలకు లోబడినట్లైతే నా ప్రేమలో నిలిచియుంటారు. 11 నా ఆనందం మీరు కూడా పంచుకోవాలని, మీరు సంపూర్ణంగా ఆనందించాలని మీకీ విషయాలన్నీ చెప్పాను. 12 నా ఆజ్ఞ యిది: నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నానో, అదే విధంగా మీరు కూడా పరస్పరం ప్రేమతో ఉండండి. 13 స్నేహితుల కోసం ప్రాణాలివ్వటం కన్నా గొప్ప ప్రేమ లేదు. 14 నేను ఆజ్ఞాపించినట్లు చేస్తే మీరు నా స్నేహితులు. 15 నేను యిక మీదటి నుండి మిమ్మల్ని సేవకులుగా భావించను. ఎందుకంటే, సేవకునికి తన యజమాని చేస్తున్నదేమిటో తెలియదు. కాని నేను నా తండ్రి నుండి విన్న వాటినన్నిటిని మీకు చెప్పాను. అందుకే మీరు నా స్నేహితులని అన్నాను.

16 “మీరు నన్ను ఎన్నుకో లేదు. నేను మిమ్మల్ని ఎన్నుకొన్నాను. మీరు వెళ్ళి చిరకాలం ఉండే ఫలమివ్వాలని మిమ్మల్ని ఎన్నుకొని నియమించాను. మీరు నా పేరిట ఏది అడిగినా నా తండ్రి మీకిస్తాడు. 17 ఒకరిపట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. ఇది నా ఆజ్ఞ.

ప్రపంచం యొక్క ద్వేషం

18 “ప్రపంచం మిమ్మల్ని ద్వేషిస్తే, ఆ ప్రపంచం మీకన్నా ముందు నన్ను ద్వేషించిందన్న విషయం జ్ఞాపకం ఉంచుకోండి. 19 మీరు ప్రపంచానికి చెందిన వాళ్ళైతే ఆ ప్రపంచంలోని ప్రజలు మిమ్మల్ని తమ వాళ్ళుగా ప్రేమిస్తారు. నేను మిమ్మల్ని ఈ ప్రపంచంనుండి ఎన్నుకొన్నాను. కనుక యిప్పుడు మీరు ఈ ప్రపంచానికి చెందరు. అందుకే ప్రపంచం మిమ్మల్ని ద్వేషిస్తుంది.

20 “‘యజమాని కంటే సేవకుడు గొప్పకాదు’ అని నేను చెప్పిన మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. వాళ్ళు నన్నే హింసించారు. కనుక మిమ్మల్ని కూడా హింసిస్తారు. వాళ్ళు నా సందేశం పాటించి ఉంటే మీ సందేశం కూడా పాటిస్తారు. 21 నన్ను పంపింది ఎవరో వాళ్ళకు తెలియదు. కనుక నా పేరిట వెళ్ళిన మీ పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తారు. 22 నేను రాకుండా, వాళ్ళకు బోధించకుండా ఉండివుంటే పాపదోషము వాళ్ళ మీద ఉండేది కాదు. కాని ఇప్పుడు వాళ్ళు తమ పాపాల నుండి తప్పించుకోలేరు.

23 “నన్ను ద్వేషించిన వాడు నా తండ్రిని కూడా ద్వేషించిన వానిగా పరిగణింపబడతాడు. 24 నేను వాళ్ళ కోసం ఎవరూ చేయని ఈ మహాత్కార్యాలు చేసివుండక పోయినట్లైతే వాళ్ళకు ఈ పాపం అంటి ఉండేది కాదు. కాని యిప్పుడు వాళ్ళు నా అద్భుతాన్ని చూసారు. అయినా నన్ను, నా తండ్రిని ద్వేషిస్తున్నారు. 25 కాని ధర్మశాస్త్రంలో, ‘వాళ్ళు నిష్కారణంగా నన్ను ద్వేషించారు’[b] అని వ్రాయబడింది. నెరవేరటానికి యిలా జరిగింది.

26 “నేను నా తండ్రి నుండి సత్య స్వరూపియైన ఆత్మను మీకు ఆదరణకర్తగా పంపుతాను. తండ్రిలో నుండి వచ్చిన ఈ ఆత్మ నన్ను గురించి సాక్ష్యమిస్తాడు. 27 మీరు నాతో మొదటి నుండి ఉన్న వాళ్ళు కనుక మీరు కూడా సాక్ష్యం చెప్పాలి.

16 “మీ విశ్వాసం చెదిరిపోకూడదని ఈ విషయాలన్నీ మీకు చెప్పాను. వాళ్ళు మిమ్మల్ని సమాజ మందిరాల నుండి వెలి వేస్తారు. నిజం చెప్పాలంటే, మిమ్మల్ని చంపితే దేవుని సేవ చేసిన దానితో సమానంగా భావించే కాలం వస్తుంది. వాళ్ళకు నా గురించి కాని, తండ్రిని గురించి కాని, తెలియదు కనుక అలా చేస్తారు. ఆ సమయం వచ్చినప్పుడు నేను హెచ్చరించినట్లు మీకు జ్ఞాపకం ఉండాలని ఈ విషయం చెపుతున్నాను. ఇన్నాళ్ళు మీతో ఉన్నాను. కనుక మీకీ విషయం మొదట చెప్పలేదు.

పవిత్రాత్మ చేసిన క్రియలు

“కాని యిప్పుడు నేను నన్ను పంపిన వాని దగ్గరకు వెళ్తున్నాను. కాని మీలో ఒక్కరైనా నేను ఎక్కడికి వెళ్తున్నానని అడగలేదు. నేను ఈ విషయం చెప్పటంవల్ల మీ హృదయాలు దుఃఖంతో నిండిపోయాయి. కాని నేను వెళ్ళటం మీ మంచి కోసమే. ఇది నిజం. నేను వెళ్ళకపోతే మీకు సహాయం చెయ్యటానికి ఆదరణకర్త రాడు. నేను వెళ్తే ఆయన్ని పంపగలను.

“ఆయన వచ్చాక పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ప్రపంచాన్ని ఒప్పింప చేస్తాడు. ప్రజలు నన్ను విశ్వసించలేదు కనుక వాళ్ళలో ‘పాపం’వుందని రుజువు చేస్తాడు. 10 మీరు చూడలేని చోటికి, అంటే తండ్రి దగ్గరకు, వెళ్తున్నాను. కనుక తండ్రితో నాకున్న సంబంధాన్ని ఆయన రుజువు చేస్తాడు. 11 కనుక నీతి విషయంలో ఈ లోకాధికారియైన సైతానుకు ఇదివరకే శిక్ష విధింపబడింది. కనుక ‘తీర్పు’ విషయంలో ఒప్పింప చేస్తాడు.

12 “నేను మీకు చెప్పవలసిన విషయాలు ఎన్నోఉన్నాయి. కాని వాటికి మీరు ప్రస్తుతం తట్టుకొనలేరు. 13 కాని సత్యాన్ని ప్రకటించే ఆత్మ వచ్చాక మిమ్మల్ని సంపూర్ణంగా సత్యంలోకి నడిపిస్తాడు. ఆయన స్వతహాగ మాట్లాడడు. తాను విన్న వాటిని మాత్రమే మాట్లాడుతాడు. జరుగనున్న వాటిని గురించి మీకు చెబుతాడు. 14 నా సందేశం మీకు తెలియజేయుటవల్ల ఆయన నన్ను మహిమ పరుస్తాడు. 15 తండ్రికి చెందినవన్నీ నావి. అందువల్లే ఆత్మ నా సందేశం తీసుకొని మీకు తెలియచేస్తాడని చెప్పాను.

దుఃఖము సంతోషముగా మారటం

16 “కొంత కాలం గడిచాక మీరు నన్ను చూడరు. ఆ తదుపరి మరి కొంత కాలం గడిచాక మీరు నన్ను చూస్తారు.”

17 ఆయన శిష్యుల్లో కొందరు, “‘కొంత కాలం గడిచాక మీరు నన్ను చూడరు’ అని అనటంలోను మరియు, ‘మరి కొంత కాలం గడిచాక మీరు మళ్ళీ నన్ను చూస్తారు’ అని అనటంలో అర్థమేమిటి? పైగా ‘నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను’ అని అంటున్నాడే! అంటే ఏమిటి?” అని పరస్పరం మాట్లాడుకున్నారు. 18 “‘కొంత కాలం’ తర్వాత అని అనటంలో ఆయన ఉద్దేశ్యమేమిటి? ఆయనేమంటున్నాడో అర్థం కావటం లేదు!” అని వాళ్ళు మళ్ళీ మళ్ళీ అనుకొన్నారు.

19 ఈ విషయాన్ని గురించి వాళ్ళడగాలని అనుకుంటున్నారని యేసు గ్రహించాడు. అందువలన ఆయన వాళ్ళతో ఈ విధంగా అన్నాడు, “‘కొంత కాలం గడిచాక నన్ను చూడరు, మరి కొంత కాలం గడిచాక నన్ను చూస్తారు’ అని నేనటంలో అర్థమేమిటని పరస్పరం మాట్లాడుకుంటున్నారా? 20 మీరు దుఃఖిస్తున్నప్పుడు ప్రపంచం ఆనందిస్తుంది. మీ మనస్సుకు చాలా బాధ కలుగుతుంది. కాని మీ దుఃఖం ఆనందంగా మారుతుంది. ఇది నిజం.

21 “ప్రసవించే సమయం వచ్చినప్పుడు గర్భంతో ఉన్న స్త్రీ నొప్పులు అనుభవిస్తుంది. శిశువు పుట్టాక ఒక జీవిని ఈ ప్రపంచంలోకి తెచ్చిన ఆనందంలో తన వేదన మరచి పోతుంది. 22 అదే విధంగా యిది మీరు దఃఖించే సమయం. కాని నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అప్పుడు మీ హృదయాలు ఆనందంతో నిండిపోతాయి. ఆ ఆనందాన్ని ఎవ్వరూ దోచుకోలేరు. 23 ఆ రోజు మీరు నన్ను ఏమీ అడగరు. ఇది నిజం. నా పేరిట మీరేది అడిగినా తండ్రి మీకిస్తాడు. 24 ఇంత కాలం మీరు నా పేరిట ఏమీ అడగలేదు. ‘అడగండి; మీకు లభిస్తుంది’ అప్పుడు మీకు సంపూర్ణమైన ఆనందం కలుగుతుంది.

లోకముపై జయము

25 “నేను యింతవరకూ ఉపమానాలతో మాట్లాడుతూ వచ్చాను. కాని యిలాంటి భాష ఉపయోగించకుండా నేను స్పష్టంగా మాట్లాడే సమయం వస్తోంది. అప్పుడు నేను మీకు తండ్రిని గురించి స్పష్టంగా చెబుతాను. 26 ఆ రోజు మీరు నా పేరిట తండ్రిని అడుగుతారు. మీ పక్షాన నేను తండ్రిని అడుగుతున్నానని అనటం లేదు. 27 నేను తండ్రి నుండి వచ్చానని మీరు నమ్మారు. మీకు నా పట్ల ప్రేమ ఉంది. కనుక తండ్రికి స్వయంగా మీ పట్ల ప్రేమ ఉంది. 28 నేను తండ్రి నుండి ఈ ప్రపంచంలోకి వచ్చాను. ఇప్పుడు నేనీ ప్రపంచాన్ని వదిలి తండ్రి దగ్గరకు వెళ్తున్నాను.”

29 శిష్యులు, “ఇప్పుడు మీరు ఉపమానాల ద్వారా కాకుండా స్పష్టంగా మాట్లాడుతున్నారు. 30 మీకు అన్నీ తెలుసునని మేము ఇప్పుడు గ్రహించాము. ఎవరునూ మీకు ప్రశ్న వేయవలసిన అవసరం లేదు. అందువల్ల మీరు దేవుని నుండి వచ్చారని విశ్వసిస్తున్నాము” అని అన్నారు.

31 యేసు, “చివరకు నమ్ముతున్నారన్న మాట! 32 మీరు నన్ను ఒంటరిగా ఒదిలి మీమీ యిండ్లకు వెళ్ళే సమయం రానున్నది. ఇప్పుడే వచ్చింది. నా తండ్రి నాతో ఉన్నాడు. కనుక నేను ఒంటరిగా ఉండను.

33 “నా ద్వారా మీకు శాంతి కలగాలని యివన్నీ మీకు చెప్పాను. ఈ ప్రపంచంలో మీకు కష్టాలు కలుగుతాయి. కాని ధైర్యంగా ఉండండి. నేను ప్రపంచాన్ని జయించాను” అని అన్నాడు.

యేసు తనకోసం, తన శిష్యులకోసం ప్రార్థించటం

17 ఆ తర్వాత యేసు ఆకాశం వైపు చూసి ఈ విధంగా ప్రార్థించాడు: “తండ్రి! సమయం వచ్చింది. నీ కుమారునికి మహిమ కలిగించు. అప్పుడు కుమారుడు నీకు మహిమ కలిగిస్తాడు. ప్రజలందరిపై కుమారునికి అధికారమిచ్చావు. నీవు అప్పగించిన వాళ్ళకు, ఆయన అనంత జీవితం యివ్వాలని నీ ఉద్దేశ్యం. నీవు మాత్రమే నిజమైన దేవుడవు. నిన్నూ, నీవు పంపిన ‘యేసుక్రీస్తు’ను తెలుసుకోవటమే అనంత జీవితం. పూర్తి చేయుమని నీవు నాకు అప్పగించిన కార్యాన్ని పూర్తిచేసి ఈ ప్రపంచంలో నీకు మహిమ కలిగించాను. తండ్రీ! ఈ ప్రపంచం ఆరంభం కాక ముందు నీతో పాటు నాకు కూడా మహిమ ఉండేది. ఇప్పుడు ఆ మహిమ నీ సమక్షంలో నాకు కలిగేటట్లు చేయుము.

“ఈ ప్రపంచంలో నీవు నాకు అప్పగించిన వాళ్ళకు నిన్ను గురించి తెలియ చేసాను. వాళ్ళు నీ వాళ్ళు. కాని వాళ్ళను నీవు నాకు అప్పగించావు. వాళ్ళు నీ సందేశాన్ని పాటించారు. నీవు నాకు ఎన్నోయిచ్చావు. అవన్నీ నాకిచ్చినావని వాళ్ళకిప్పుడు తెలిసింది. ఎందుకంటే, నీవు నాకు చెప్పిన సందేశాన్ని వాళ్ళకు చెప్పాను. వాళ్ళు దాన్ని అంగీకరించారు. నేను నిజంగా నీ నుండి వచ్చానని వాళ్ళకు తెలుసు. నీవు నన్ను పంపావన్న విశ్వాసం యిప్పుడు వాళ్ళలో కలిగింది. నేను వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాను. ప్రపంచాని కోసం ప్రార్థించటం లేదు. నీవు నాకు అప్పగించిన వాళ్ళు నీ వాళ్ళు కావాలని ప్రార్థిస్తున్నాను. 10 నావన్నీ నీవి, నీవన్నీ నావి. నా వాళ్ళ ద్వారా నాకు మహిమ కలుగుతోంది.

11 “నేనీ ప్రపంచంలో యిక ఉండను. కాని వాళ్ళు ఈ ప్రపంచంలోనే ఉన్నారు. నేను నీ దగ్గరకు రాబోతున్నాను. ఓ తండ్రీ! నీలో పవిత్రత ఉంది. నీవు నాకిచ్చిన, నీ నామంలో ఉన్న మహిమతో వాళ్ళను రక్షించు. అలా చేస్తే మనం ఒకటిగా ఉన్నట్లు వాళ్ళు కూడా ఒకటిగా ఉంటారు. 12 నేను వాళ్ళతో ఉన్నప్పుడు, నీవు నా కిచ్చిన నామంతో వాళ్ళను రక్షించి కాపాడాను. లేఖనాల్లో వ్రాసినవి నిజం కావటానికి నాశనం కావలసిన వాడు తప్ప మరెవ్వరూ నాశనం కాలేదు.

13 “నేను నీ దగ్గరకు వస్తున్నాను. నా ఆనందం వాళ్ళ హృదయాల్లో పూర్తిగా నిండి పోవాలని నేనీ ప్రపంచంలో ఉన్నప్పుడే ఈ విషయాలు చెబుతున్నాను. 14 నీ సందేశం నా శిష్యులకు చెప్పాను. నేను ఈ ప్రపంచానికి చెందిన వాణ్ణి కాదు. అదే విధంగా నా శిష్యులు కూడా ఈ ప్రపంచానికి చెందిన వాళ్ళు కాదు. కనుక ప్రపంచం వాళ్ళను ద్వేషిస్తుంది.

15 “వాళ్ళనీ ప్రపంచం నుండి తీసుకు వెళ్ళమని నేను ప్రార్థించటం లేదుగాని దుర్మార్గుని నుండి వాళ్ళను రక్షించుమని ప్రార్థిస్తున్నాను. 16 నేను ఏ విధంగా ఈ ప్రపంచానికి చెందనో అదే విధంగా వాళ్ళు కూడా ఈ ప్రపంచానికి చెందరు. 17 సత్యంలో వారిని పవిత్రపరచు, నీ వాక్యమే సత్యం. 18 నీవు నన్ను ఏ విధంగా పంపావో, అదే విధంగా వాళ్ళను నేను ఈ ప్రపంచంలోనికి పంపాను. 19 వాళ్ళ కోసం నన్ను నేను ప్రత్యేకపరచు కొన్నాను. వాళ్ళు కూడా నిజంగా ప్రత్యేకించబడాలని నా ఉద్దేశ్యం.

20 “నా ప్రార్థన వాళ్ళ కోనం మాత్రమే కాదు. వాళ్ళ సందేశం ద్వారా నన్ను విశ్యసించే వాళ్ళ కోసం కూడా నేను ప్రార్థిస్తున్నాను. 21 తండ్రీ! నేను నీలో, నీవు నాలో ఉన్నట్లే వాళ్ళందరూ ఒకటిగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. నీవు నన్ను పంపినట్లు ఈ ప్రపంచం నమ్మాలంటే వాళ్ళను కూడా మనలో ఐక్యం చేయుము. 22 మనము ఒకటిగా ఉన్నట్లు వాళ్ళు కూడా ఒకటిగా ఉండాలని, నీవు నాకిచ్చిన మహిమను నేను వాళ్ళకిచ్చాను. 23 నేను వాళ్ళలో ఉన్నాను. నీవు నాలో ఉన్నావు. వాళ్ళలో సంపూర్ణమైన ఐక్యత కలిగేటట్లు చేయుము. అలా చేస్తే నీవు నన్ను పంపావని, నన్ను ప్రేమించినంతగా వాళ్ళను కూడా ప్రేమించావని ప్రపంచానికి తెలుస్తుంది.

24 “తండ్రీ! నీవు నాకు అప్పగించిన వాళ్ళు నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ప్రపంచం పుట్టక ముందు నుండి నన్ను ప్రేమించావు. నాకు మహిమను ఇచ్చావు. ఆ మహిమను వాళ్ళు చూడాలని నా అభిలాష. 25 నీతి స్వరూపుడవగు తండ్రీ! ప్రపంచానికి నీవెవరవో తెలియక పోయినా నీవు నాకు తెలుసు. నీవు నన్ను పంపావని వీళ్ళకు తెలుసు. 26 నీవెవరవో వాళ్ళకు తెలియచేసాను. తెలియచేస్తూ ఉంటాను. నాయందు నీకున్న ప్రేమ వాళ్ళయందు కూడా ఉండాలని, వాళ్ళలో నేను స్వయంగా ఉండాలని నా ఉద్దేశ్యం.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International