Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ఎజ్రా 7-10

యెరూషలేముకు ఎజ్రా రాక

ఈ సంఘటనల తర్వత[a] పారసీక రాజు అర్తహషస్త పాలన కాలంలో ఎజ్రా బబులోను నుంచి యెరూషలేముకి వచ్చాడు. ఎజ్రా శెరాయా కొడుకు. శెరాయా అజర్యా కొడుకు, అజర్యా హిల్కీయా కొడుకు, హిల్కీయా షల్లూము కొడుకు. షల్లూము సాదోకు కొడుకు, సాదోకు అహిటూబు కొడుకు, అహిటూబు అమర్యా కొడుకు. అమర్యా అజర్యా కొడుకు. అజర్యా మెరాయోతు కొడుకు. మెరాయోతు జెరహ్యా కొడుకు. జెరహ్యా ఉజ్జీ కొడుకు. ఉజ్జీ బుక్కీ కొడుకు. బుక్కీ అబీషూవ కొడుకు. అబీషూవ ఫీనెహాసు కొడుకు. ఫీనెహాసు ఎలియాజరు కొడుకు. ఎలియాజరు ప్రధాన యాజకుడైన అహరోను కొడుకు.

బబులోను నుండి యెరూషలేముకు వచ్చిన ఎజ్రా గొప్ప ఉపదేశకుడు.[b] అతనికి మోషే ధర్మశాస్త్రం యెహోవా ద్వారా ఇవ్వబడింది. యెహోవా ఎజ్రాకి తోడుగా వున్నాడు. అందుకని, అర్తహషస్త మహారాజు ఎజ్రా కోరుకున్నదల్లా ఇచ్చాడు. ఎజ్రాతోబాటు అనేక మంది ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చారు. వాళ్లతో యాజకులు, లేవీయులు, గాయకులు, ద్వార పాలకులు, ఆలయ సేవకులు వున్నారు. ఆ ఇశ్రాయేలీయులు అర్తహషస్త రాజు పాలన ఏడవ సంవత్సరంలో యెరూషలేముకి తిరిగి వచ్చారు. అర్తహషస్త రాజుగా అయిన ఏడవ సంవత్సరం, అయిదవ నెలలో ఎజ్రా యెరూషలేముకి చేరుకున్నాడు. ఎజ్రా, అతనితో ఒక బృందం మొదటి నెల మొదటి రోజున బబులోను నుంచి బయల్దేరారు. ఎజ్రా యెరూషలేముకి అయిదవ నెల ఒకటవ రోజున చేరుకున్నాడు. యెహోవా దేవుడు అతనికి తోడుగా వున్నాడు. 10 ఎజ్రా యెహోవా ధర్మశాస్త్ర అధ్యయనానికి, దాన్ని అనుసరించేందుకూ తన కాలమంతటినీ ఎంతో శ్రద్ధగా వినియోగించాడు. ఎజ్రా ఇశ్రాయేలీయులకు యెహోవా ఆజ్ఞలనూ, ఆదేశ సూత్రాలనూ బోధించాలని కోరుకున్నాడు. అంతమాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలు ఆ ఆజ్ఞలను అనుసరించడంలో వారికి తోడ్పడాలని కూడా అతను కోరుకున్నాడు.

ఎజ్రాకి అర్తహషస్త రాజు లేఖ

11 ఎజ్రా యాజకుడు, ఉపదేశకుడు, యెహోవా ప్రభువు ఆదేశాలను గురించీ, ధర్మశాస్త్ర నిబంధనలను గురించీ అతనికి బాగా తెలుసు.

12 ఎజ్రా ఉపదేశకునికి అర్తహషస్త మహారాజు పంపిన లేఖనకలు: యాజకుడూ, పరలోక దేవుని ధర్మశ్రాస్త ఉపదేశకుడూ అయిన ఎజ్రాకి:

అభివందనాలు!

13 ఈ క్రింది ఆజ్ఞ జారీ చేస్తున్నాను, నా సామ్రాజ్యంలో నివసిస్తున్న ఏ వ్వక్తి, యాజకుడు, లేక లేవీయుడు అయినా ఎజ్రాతోబాటు యెరూషలేముకు పోవాలనుకుంటే, అతనలా పోవచ్చు.

14 ఎజ్రా! నా ఏడుగురు మంత్రులూ, నేనూ, నిన్ను పంపిస్తున్నాం. నీవు యూదాకి, యెరూషలేముకి వెళ్లాలి. మీ దేవుని ధర్మశాస్త్రాన్ని మీ ప్రజలు ఎలా ఆచరిస్తున్నారో పరిశీలించు, పర్యవేక్షించు. ఆ ధర్మశాస్త్రం నీ దగ్గర వుంది కదా.

15 నా మంత్రులూ, నేనూ ఇశ్రాయేలు దేవునికి వెండి బంగారాలు యిస్తున్నాం. దేవుడు యెరూషలేములో వుంటాడు. నీవు నీతో ఈ వెండి, బంగారాలు తీసుకువెళ్లాలి. 16 అంతేకాదు, నీవు బబులోను దేశంలోని రాష్ట్రాలన్నింట్లోనూ పర్యటించి, మీ ఇశ్రాయేలు ప్రజలనుంచీ, యాజకుల నుంచీ, లేవీయుల నుంచీ కానుకలు పోగుచెయ్యి. ఆ కానుకలు యెరూషలేములోని ఆలయ నిర్మాణం నిమిత్తం ఉద్దేశింపబడ్డాయి.

17 ఆ సొమ్మును ఎడ్లను, పొట్టేళ్లను, గొర్రె పిల్లలను కొనేందుకు వినియోగించు. ఆ బలులతోబాటు సమర్పించవలసిన ధాన్యార్పణలనూ, పానార్పణలనూ కొను. తర్వాత యెరూషలేములోని మీ దేవుని దేవాలయంలో వాటిని బలి ఇవ్వు. 18 తర్వాత నీవూ, నీ సోదర యూదులూ ఇంకా మిగిలిపోయిన వెండి బంగారాలను మీ ఇష్టం వచ్చిన విధంగా వాడు కోవచ్చు. దాన్ని మీ దేవునికి ప్రీతికరమైన పద్ధతిలో ఉపయోగించు. 19 నీవు వస్తువులన్నీ యెరూషలేము దేవుని సన్నిధికి తీసుకుపో. ఆ వస్తువులు మీ దేవుని ఆరాధన కోసం. 20 మీ దేవుని ఆలయం కోసం అవసరమైన అనేక ఇతర వస్తువులను కూడ మీరు పొందవచ్చు. నీకు అవసరమైన ఏ వస్తువు కోసమైనా సొమ్మును రాజ ఖజానా నుంచి తీసుకో.

21 అర్తహషస్త రాజునైన నేను ఈ క్రింది ఆజ్ఞను జారీచేస్తున్నాను: యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంతంలో రాజధనాన్ని పర్యవేక్షిస్తున్న వ్యక్తులందరికీ ఎజ్రా ఏమి కోరుకుంటే, దాన్ని అతనికి ఇవ్వవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. ఎజ్రా యాజకుడు, పరలోక దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించే ఉపదేశకుడు. మీరీ పనిని సత్వరం సంపూర్ణంగా చెయ్యండి. 22 మీరు ఎజ్రా 3,400 కిలో గ్రాముల వెండిని, వెయ్యి తూముల గోధుమలను, 2,200 లీటర్ల ద్రాక్షారసమును, 2,200 కిలో గ్రాములు ఒలీవ నూనెను అడిగినంత ఉప్పును యివ్వండి. 23 పరలోక దేవుడు ఎజ్రా కోసం ఏమి ఆదేశిస్తే, దాన్ని మీరు ఎజ్రాకి సత్వరం, సంపూర్ణంగా ఇవ్వండి. మీరీ పనులు పరలోక దేవుని ఆలయంకోసం చెయ్యండి. దేవునికి నా సామ్రాజ్యం మీదా, నా కొడుకుల మీదా కోపం రావడం నాకు యిష్టం లేదు.

24 యాజకులు, లేవీయులు, గాయకులు, ద్వారపాలకులు, దేవాలయ సేవకులు, దేవాలయంలోని యితర పనివాళ్ల దగ్గర పన్నులు వసూలు చేయడం ధర్మశాస్త్ర విరుద్ధమన్న విషయం మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. వాళ్లు పన్నులు, రాజుగారికి నజరానాలు, ఏ విధమైన సుంకపు పన్నులు చెల్లించ నక్కర్లేదు. 25 ఎజ్రా, మీ దేవుని యొద్ద నుంచి నీవు పొందిన వివేకాన్ని వినియోగించి పౌర, మతపర న్యాయాధిపతులను ఎంపికచేసే అధికారాన్ని నేను నీకు ఇస్తున్నాను. వాళ్లు యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంతంలో నివసించే ప్రజలందరికీ న్యాయాధిపతులుగా వ్యవహరిస్తారు. నీ దేవుని ఆజ్ఞలను ఎరిగిన ప్రజలకందరికీ వారు తీర్పుతీరుస్తారు. దేవుని ఆజ్ఞలను గురించి వారు తెలియని వారికి నేర్పాలి. 26 మీ దేవుని ధర్మశాస్త్రాన్నిగాని, రాజ శాసనాన్నిగాని ఎవరైనా మన్నించకపోతే, అతను శిక్షించబడాలి. నేరాన్ని బట్టి అతనికి మరణ దండనో లేక దేశాంతరవాస శిక్షో విధించాలి, లేక అతని ఆస్తిని జప్తు చేయాలి, లేక అతన్ని చెరసాలలో పెట్టాలి.

దేవునికి ఎజ్రా స్తోత్రాలు

27 [c] యెరూషలేములో వున్న యెహోవా ఆలయానికి ఘనత చేకూర్చాలనే తలంపును రాజు మదిలో నాటిన ప్రభువుకు, మా పూర్వీకుల దేవుడైన యెహోవాకు కీర్తి కలుగునుగాక! 28 రాజు, ఆయన మంత్రుల, ఇతరేతర ముఖ్యాధికారుల ఎదుట నాపై నిజమైన ప్రేమను ప్రభువు చూపించాడు. దేవుడైన యెహోవా నాతో ఉన్నాడు, అందుకే నేను ధైర్యంగా ఉన్నాను. యెరూషలేముకు నాతో పోయేందుకు నేను ఇశ్రాయేలీయుల నాయకులను ప్రోగుచేశాను.

ఎజ్రాతో తిరిగివచ్చిన పెద్దల జాబితా

రాజు అర్తహషస్త పాలన కాలంలో బబులోను నుంచి యెరూషలేముకు నాతో (ఎజ్రా) పాటు తిరిగివచ్చిన ఆయా కుటుంబాల పెద్దల, తదితరుల పేర్ల జాబితా ఇది:

ఫీనెహాసు సంతతి నుంచి గెర్షోము; ఈతామారు సంతతినుంచి దానియేలు; దావీదు సంతతి నుంచి హట్టూషు:

షెకన్యా సంతతినుంచి పరోషు; పరోషు సంతతినుంచి జెకర్యా, మరో 150 మంది పురుషులు;

పహత్మోయాబు సంతతినుంచి జెరహ్యా కొడుకు ఎల్యోయేనై, మరో 200 మంది పురుషులు;

షెకన్యా సంతతి నుంచి యహజీయేలు కొడుకు షెకన్యా, మరో 300 మంది పురుషులు;

అదీను సంతతినుంచి యోనాతాను కొడుకు ఏబెదు, మరో 50 మంది పురుషులు;

ఏలాము సంతతి నుంచి అతల్యా కొడుకు యెషయా, మరో 70 మంది పురుషులు;

షెపట్య సంతతినుంచి మిఖాయేలు కొడుకు జెబద్యా, మరో 80 మంది పురుషులు;

యోవాబు సంతతినుంచి యెహీయేలు కొడుకు ఓబద్యా, మరో 218 మంది పురుషులు;

10 షెలోమీతు సంతతినుంచి యోసిప్యా కొడుకు షెలోమీతు, మరో 160 మంది పురుషులు;

11 బేబై సంతతినుంచి బేబై కొడుకు జెకర్యా, మరో 28 మంది పురుషులు;

12 అజ్గాదు సంతతినుంచి హక్కాటాను కొడుకు యోహానాను, మరో 110 మంది పురుషులు;

13 అదోనీకాము సంతతిలో చివరి వారినుంచి ఎలీఫెలెటు; యెహీయేలు, షెమాయా, మరో 60 మంది పురుషులు;

14 బిగ్వయి సంతతినుంచి ఊతైయు, జబ్బూదు, మరో 70 మంది పురుషులు.

యెరూషలేముకు తిరిగి రాక

15 నేను (ఎజ్రా) వాళ్లందరినీ అహవా వైపు పారే ఒక నది దగ్గర సమావేశపరిచాను. మేము మూడు రోడుల పాటు అక్కడనే యుంటిమి. ఆ బృందంలో యాజకులు వున్నారుగాని, లేవీయులెవ్వరూ లేరన్న విషయం నేను గమనించాను. 16 అందుకని, నేను ఎలియెజెరు, అరీయేలు, షెమయా, ఎల్నాతాను, యారీబు, (మరో) ఎల్నాతాను, నాతాను, జెకర్యా, మెషుల్లూము అనే పెద్దలను పిలిచాను. వీరికి తోడు యోయారీబు, ఎల్నాతాను అనే మరో ఇద్దర్ని (వీళ్లిద్దరూ ఉపాధ్యాయులు) కూడా పిలిచాను. 17 వాళ్లని ఇద్దో వద్దకు పంపించాను. ఇద్దో కాసిఫ్యా పట్టణానికి నాయకుడు. ఇద్దోకీ, అతని బంధువులకు ఏమి చెప్పాలో వివరించి నేను నా మనుష్యులను అక్కడికి పంపాను. ఇద్దో బంధువులు కాసిఫ్యాలో దేవాలయ సేవకులు దేవాలయంలో పనిచేసే సేవకులను పంపవచ్చునన్న ఆశతో నేను నా మనుష్యులను ఇద్దో దగ్గరికి పంపాను. 18 దేవుడు మాతో ఉన్నాడు కాబట్టి, ఇద్దో బంధువులు ఈ క్రిందివాళ్లను మాకు పంపారు: మావీ సంతతి నుంచి షేరేబ్యా అనే ఒక వివేకి (మాలీ లేవీ సంతతుల్లో ఒకడు. లేవీ ఇశ్రాయేలు కొడుకుల్లో ఒకడు. వాళ్లు అతని కొడుకునీ, అన్నదమ్ముల్నీ కూడా పంపారు. మొత్తంమీద ఆ కుటుంబానికి చెందిన వాళ్లు 18 మంది). 19 మెరారీ సంతతివారి నుంచి హషబ్యా, యెషయా (వాళ్లు తమ కొడుకులను, సోదరులను, బందువులను కూడా పంపారు, ఆ కుటుంబం నుంచి మొత్తం 20 మంది మగాళ్లు వచ్చారు) 20 వారితోపాటు 220 మంది దేవాలయ పరిచారకులు వచ్చారు. (వాళ్లు లేవీయులకు సాయం చేసేవాళ్లు. వాళ్ల పూర్వీకులు దావీదు చేత, ముఖ్యాధికారుల చేత ఎంపిక చేయబడినవాళ్లు. వాళ్లందరి పేర్లూ వ్రాసి వుంచబడ్డాయి).

21 అక్కడ, ఆ అహవా నది దగ్గర నేను (ఎజ్రా) మనమందరం ఉపవాసం చెయ్యాలని ప్రకటించాను. మన దేవుని ముందు విధేయత చూపేందుకుగాను మనం ఉపవాసం చెయ్యాలి. మేమూ, మా పిల్లలూ, మాకున్న సమస్త వస్తువులూ క్షేమంగా యెరూషలేము చేరేలా దీవించుమని దేవుణ్ణి వేడు కోవాలనుకున్నాము. 22 మా ప్రయాణ మార్గంలో మా రక్షణ కోసం సైనికుల్నీ, అశ్వికుల్నీ పంపమని అర్తహషస్త రాజుని అర్థించడం నాకు సిగ్గుగా తోచింది. మార్గంలో శత్రువులున్నారని నాకు తెలుసు. అయితే అర్తహషస్త రాజుకి మేమంతకు ముందు ఇలా చెప్పివున్నాము: “మా దేవుడు తనని నమ్మే ప్రతి ఒక్కరికీ తోడుగా ఉంటాడు. అయితే, దేవుడు తనకు ఎడముఖంగా వున్న ప్రతి ఒక్కనిపట్లా చాలా కోపంగా వుంటాడు.” 23 అందుకని, మేము ఉపవాసం వుండి, మా ప్రయాణం గురించి మేము దేవుణ్ణి ప్రార్థించాము. ఆయన మా ప్రార్థనలకు జవాబిచ్చాడు.

24 తర్వాత నేను పన్నెండుగురు ముఖ్య యాజకులను, షెరేబ్యాను, హషబ్యాను, వాళ్ల సొదరులు పది మందిని ఎంపికచేశాను. 25 దేవాలయం కోసం ఇవ్వబడిన వెండిని, బంగారాన్ని తదితర వస్తువులను తూకం వేయించాను. నేను ఎంపికచేసిన పన్నెండుగురు యాజకులకు నేను వాటిని అప్పగించాను. అర్తహషస్త రాజు, ఆయన మంత్రులు, ఆయన ముఖ్యాధికారులు, బబులోనులోని ఇశ్రాయేలీయులు అందరూ దేవుని దేవాలయం కోసం యిచ్చిన వస్తువులవి. 26 నేను వాటన్నింటినీ తూకం వేశాను. వెండి 25 టన్నులు వుంది. వెండిగిన్నెలు, వస్తువులు మూడుమ్ముప్పాతిక టన్నులున్నాయి. మూడుమ్ముప్పాతిక టన్నుల బంగారం వుంది. 27 నేను వాళ్లకి 20 బంగారు గిన్నెలు యిచ్చాను. అవి 19 పౌనుల బరువున్నాయి. నేను వాళ్లకి మెరుగు పెట్టిన కంచుతో చేసిన అందమైన రెండు పాత్రలు ఇచ్చాను. అవి బంగారు వస్తువులంతటి విలువైనవి. 28 తర్వాత నేనా పన్నెండుగురు యాజకులతో యిలా చెప్పాను: “యెహోవా దేవుని దృష్టిలో మీరు పవిత్రులు, ఆ వస్తువులు పవిత్రమైనవి. ప్రజలు యీ వెండి బంగారాలను మీ పూర్వీకుల దేవునికి యిచ్చారు. 29 అందుకని, మీరీ వస్తువులను జాగ్రత్తగా కాపాడండి. యెరూషలేములోని దేవాలయ పెద్దలకు మీరు వీటిని అప్పగించేదాకా, యీ వస్తువులకు మీరే బాధ్యులు. మీరు వీటిని ముఖ్య లేవీయులకి, ఇశ్రాయేలు కుటుంబ పెద్దలకీ యిచ్చినప్పుడు వాళ్లు వీటిని తూకం వేసి, యెరూషలేములోని యెహోవా దేవాలయంలోని గదుల్లో పదిలపరుస్తారు.”

30 ఎజ్రా తూకం వేసి తమకిచ్చిన వెండి బంగారాలనూ, ప్రత్యేక వస్తువులనూ యాజకులూ, లేవీయులు స్వీకరించి, ఎజ్రా చెప్పినట్లు, వాటిని యెరూషలేము లోని దేవాలయానికి చేర్చేందుకు సంసిద్ధులయ్యారు.

31 మొదటి నెల పన్నెండవ రోజున మేము అహవానది దగ్గరనుంచి యెరూషలేముకు బయల్దేరాము. దేవుడు మాకు తోడుగావుండి, మార్గంలో శత్రువులనుంచీ, దోపిడిగాండ్రనుంచీ మమ్మల్ని కాపాడాడు. 32 చివరకు మేము యెరూషలేము చేరుకున్నాము. మేమక్కడ మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నాము. 33 నాల్గవ రోజున దేవాలయానికి వెళ్లి వెండి బంగారాలనూ, ప్రత్యేక వస్తువులనూ తూకం వేశాము. మేమా వస్తువులను ఊరియా యాజకుని కొడుకైన మెరేమోతుకు అప్పగించాము. అతనితో ఫినేహాసు కుమారుడు ఎలీయాజరు వున్నాడు. వాళ్లతోబాటు లేవీయులైన యేషూవ కొడుకు యోజాబాదు, బిన్నూయి కొడుకు నోవద్యా కూడా వున్నారు. 34 మేము అన్ని వస్తువులనూ లెక్క పెట్టి, వాటన్నింటినీ తూకం వేశాము. తర్వాత మేము అప్పటి మొత్తం బరువును వ్రాసి పెట్టాము.

35 అటు తర్వాత నిర్బంధంనుంచి తిరిగివచ్చిన యూదులు ఇశ్రాయేలు దేవునికి దహనబలులు అర్పించారు. వాళ్లు ఇశ్రాయేలీయులందరి కొరకు 12 ఎడ్లను, 96 పోట్టేళ్లను, 77 మగ గొర్రెపిల్లలను, పాప పరిహారార్థబలి నిమిత్తం 12 మేక పోతులను బలి యిచ్చారు. ఇవన్నీ దహసబలిగా ఇవ్వబడ్డాయి.

36 అటుతర్వాత వాళ్లు అర్తహషస్త ఆజ్ఞలను రాజ ప్రతినిధులైన సామంత నాయకులకు, యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంతపు పాలనాధికారులకు అందజేశారు. కనుక వారందరూ వచ్చి దేవుని ఆలయపు పనిలో సహాయపడ్డారు.

యూదేతరులతో మిశ్రమ వివాహాలు

మేమీ పనులన్నీ ముగించాక ఇశ్రాయేలు నాయకులు నా దగ్గరకు వచ్చి ఇలా చెప్పారు: “ఎజ్రా, ఇశ్రాయేలీయులు తమ చుట్టూ వున్నవారితో తమని తాము వేరుగా నిలుపుకోలేదు. యాజకులు, లేవీయులు సైతం తమ ప్రత్యేకతను కాపాడుకోలేదు. కనాను, హిత్తీ, పెరిజ్జీ, యెబూషీ, అమ్మోను, మెయాబు, ఈజిప్టు అమోరీ జాతులవారు చేసే పాపపు పనులతో ఇశ్రాయేలీయులు చెడుగా ప్రభావితులవుతున్నారు. ఇశ్రాయేలీయులు మన చుట్టూ వున్న ఆయా జాతులవారిని పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇశ్రాయేలీయులు తమ ప్రత్యేకతను నిలుపుకొని వుండవలసింది. కాని. వాళ్లు తమ చుట్టూవున్న ఇతర జాతీయులను పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇశ్రాయేలీయులు నాయకులు, ముఖ్య అధికారులు ఈ విషయంలో చెడ్డ విధానాన్ని అనుసరించారు.” ఈ విషయాలు విన్న నేను నా మనో దుఃఖాన్ని తెలిపేందుకు అంగీని, పైవస్తాన్ని చింపుకున్నాను. నా జుట్టు, గడ్డం పీక్కున్నాను. కలత చెంది దిగ్భ్రాంతుడనై నేను కూర్చుండి పోయాను. అప్పుడు, దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించే ప్రతి ఒక్కడూ భయకంపితుడయ్యాడు. చెరనుంచి తిరిగివచ్చిన ఇశ్రాయేలీయులు దేవుని పట్ల నమ్మక ద్రోహులుగా వ్యవహారించినందుకు వాళ్లందరూ భయపడ్డారు. సాయంత్రపు బలివరకు కలతచెందిన నేను మాటలాడక అక్కడే కూర్చుండిపోయాను. అందరూ నా చుట్టూ మూగారు.

సాయంత్రపు బలివేళ అవడంతో, నేను లేచి నిలబడ్డాను. నా అంగీ, పై వస్త్రమూ చీలికలు పేలికలైవున్నాయి. యెహోవా దేవునివైపు చేతులు చాపి ప్రార్థిస్తూ, మోకరిల్లాను. అప్పుడు నేనిలా ప్రార్థించాను:

“ఓ దేవా, ఎక్కువ సిగ్గుచేత, కలవరపాటుచేత నేను నీవైపు ముఖము ఎత్తలేకపోతున్నాను. మా పాపాలు, దోషాలు మా తలల ఎత్తును మీరిపోయి ఆకాశాన్ని అంటుతున్నాయి. మా పూర్వీకుల నాటినుంచి నేటి మా తరందాకా మేము అనేకానేక పాపాలు చేశాము. అందుకే మా రాజులూ, యాజకులూ శిక్షింపబడ్డారు. విదేశాల రాజులు మా పైన దాడి చేసి మా ప్రజలను బందీలుగా తీసుకుపోయారు. ఆ రాజులు మా సంపదను కొల్లగొట్టి, మమ్మల్ని అవమానానికి గురిచేశారు. ఈ నాటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది.

“చివరికి ఇప్పుడు, దేవా, నీవు మాపట్ల దయ చూపావు. మాలో కొద్దిమంది చెరనుంచి తప్పించుకొని ఈ పవిత్ర ప్రాంతంలో నివసించడాన్ని సాధ్యంచేశావు. ప్రభువా, నీవు మాకు కొత్త జీవితం, దాస్యములో నుంచి విముక్తి ప్రసాదించావు. మేము బానిసలుగా వున్నమాట నిజమే, కాని, నీవు మమ్మల్మి శాశ్వతంగా బానిసలుగా ఉండనియ్యవు. నీవు మాపట్ల దయ చూపావు. పారసీక ప్రభువులు మాపట్ల దయ చూపేలా నీవు చేశావు. నీ దేవాలయం ధ్వంసం చేయబడింది. కాని, నీవు మాకు నూతన జీవితం ప్రసాదించి, మేము నీ ఆలయాన్ని తిరిగి నిర్మించి, దాన్ని సరికొత్తదానిలా మలచగలిగే అవకాశం మాకు కల్పించావు. దేవా! యూదా, యెరూషలేములకు రక్షణగా ప్రాకారం కట్టేందుకు నీవు మాకు తోడ్పడ్డావు.

10 “ఇప్పుడు దేవా, నీకు మేము చెప్పగలిగింది ఏముంది? మేము మళ్లీ నీ మాట పాటించడం మానేశాం! 11 దేవా, నీవు నీ సేవకులైన నీ ప్రవక్తల ద్వారా ఆ ఆదేశాలను మాకు ఇచ్చావు. నీవు ఇలా అన్నావు, ‘మీరు స్వంతం చేసుకొని, నివసించబోయే ప్రాంతం అపవిత్రమైన భూమి. అక్కడ నివసిస్తూ వచ్చిన మనుష్యులు చేసిన చెడ్డపనుల మూలంగా అది అపవిత్రమైనది. వాళ్లు ఈ దేశంలో అన్నిచోట్లా ఇలాంటి చెడ్డపనులు చాలా చేశారు. వాళ్లు తమ పాపాలతో ఈ దేశాన్ని అపవిత్రం చేశారు. 12 అందుకని, ఇశ్రాయేలీయులారా, మీ బిడ్డలు వారి బిడ్డలను పెళ్లి చేసుకోకుండా చూడండి. మీరు వాళ్లతో కలవకండి! నా ఆదేశాలను పాటించండి, వారితో శాంతి ఒప్పందం చేయకండి. అప్పుడు మీరు శక్తి కలిగి, దేశంలోని మంచి వాటిని ఆనందంగా అనుభవించగలుగుతారు. అప్పుడు మీరు ఈ దేశాన్ని నిలుపుకొని, దాన్ని మీ బిడ్డలకు సంక్రమింప జేయగలుగుతారు.’

13 “మనకి వాటిల్లిన కష్టాలకు మన చెడ్డక్రియలే కారణం. మనం పాపాలు చేశాం, మన దోషాలు అనేకమైనవి. అయితే, ఓ దేవా, నీవు మమ్ముల్ని శిక్షించ వలసినంతగా శిక్షించలేదు. మేము ఘోరమైన పాపాలు ఎన్నో చేశాము. మమ్మల్ని నీవు ఇంకెంతో కఠినంగా శిక్షించియుండవలసింది. మాలో కొందర్ని దాస్యంలో సహితం తప్పించుకోనిచ్చావు. 14 నీ ఆదేశాలను భంగ పరచకూడదని మేము తెలుసుకున్నాము. మేము వాళ్లను పెళ్లి చేసుకోకూడదు. వాళ్లు చేసేవి చాలా చెడ్డ పనులు. దేవా, మేమా చెడ్డవాళ్లతో పెళ్లి కొనసాగించినట్లయితే, నీవు మమ్మల్ని నాశనం చేస్తావని మాకు తెలుసు! అప్పుడిక ఇశ్రాయేలీయుల్లో ఏ ఒక్కడూ ప్రాణాలతో మిగిలివుండడు.

15 “యెహోవా, ఇశ్రాయేలు ప్రజల దేవా, నీవు నీతి మంతుడవై యున్నావు. మాలో కొందర్ని ప్రాణాలతో మిగిల్చావు. మా దోషం కారణంగా, మాలో ఒక్కడుకూడా నీ ముందు నిలిచేందుకు అర్హుడుకాడు.”

తమ పాపాలను ఒప్పుకున్న ప్రజలు

10 ఎజ్రా ఎడతెగకుండా శోకిస్తూ, ప్రార్థిస్తున్నాడు. అతడు దేవుని ఆలయం ముందు విలపిస్తూ సాష్టాంగపడ్డాడు. ఎజ్రా అలా ప్రార్థిస్తూ వుండగా, ఇశ్రాయేలీయుల పెద్దల బృందం ఒకటి పురుషులు, స్త్రీలు, బాలబాలికలు అతని చుట్టూ గుమికూడింది. వాళ్లు కూడా భోరున విలపించసాగారు. అప్పుడు ఏలాము సంతతివాడైన యెహీయేలు కొడుకు షెకన్యా ఎజ్రాతో ఇలా అన్నాడు: “మేము దేవునికి విశ్వాస పాత్రంగా వ్యవహరించలేదు. మేము మా చుట్టూ వున్న పరాయి జాతుల స్త్రీలను పెండ్లాడాము. అయితే, మేమీ పని చేసినా కూడా, ఇశ్రాయేలీయులకు ఇంకా ఆశవుంది. ఇప్పుడిక్కడ మనం మన దేవుని ముందు ఆ స్త్రీలను, వాళ్ల పిల్లలను అందర్నీ బయటికి పంపేస్తామని ఒడంబడిక చేద్దాము. ఎజ్రా సలహానూ, మన దేవుని ఆదేశాలను గౌరవించేవారి సలహాలను పాటించేందుకుగాను మనం యీ పని చేద్దాము. మనం దేవుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తాము. ఎజ్రా, నీవు లే, ఇది నీ బాధ్యత, అయితే, మేమూ నీకు తోడ్పాటు ఇస్తాము. అందుకని నీవు ధైర్యంగా వుండి ఈ పని నిర్వహించు.”

అప్పుడు ఎజ్రా లేచి నిలబడ్డాడు. ముఖ్య యాజకుల చేత, లేవీయుల చేత, ఇశ్రాయేలీయులందరి చేత తాను చెప్పినది చేస్తామని వాగ్దానం చేయించుకున్నాడు. తర్వాత, ఎజ్రా దేవుని ఆలయం ముందునుంచి ఎల్యాషీబు కొడుకు యోహానాను గదికి వెళ్లాడు. ఎజ్రా అక్కడ వున్నప్పుడు తిండి తినలేదు, నీరు తాగలేదు. యెరూషలేముకి చెరనుండి తిరిగి వచ్చిన ప్రజలు చేసిన దేవుని చట్ట ఉల్లంఘన విషయంలో ఇంకా చాలా దుఃఖితుడై పున్న కారణంగానే, అతనలా తిండి ముట్టకుండా ఉండిపోయాడు. అటు తర్వాత, అతను యూదా, యెరూషలేములలో అన్నిచోట్లా చాటింపు వేయించాడు. ఆ చాటింపు సందేశంలో నిర్బంధంనుంచి తిరిగి వచ్చిన యూద వ్యక్తులందరూ యెరూషలేములో సమావేశమవ్వాలని పేర్కొనబడింది. మూడు రోజుల్లో అలా యెరుషలేముకి రాని వ్యక్తి తన ఆస్తినంతటినీ వదులుకోవలసివుంటుంది. అతను నివసిస్తున్న ప్రజాబృందం నుంచి వెలివేయ బడతాడు. ముఖ్య అధికారులూ, యూదా పెద్దలూ (నాయకులూ) యెరూషలేము వెళ్లాలని నిర్ణయం చేశారు.

దానితో, మూడు రోజుల్లో యూదా, బెన్యామీను వంశాలకు చెందిన పురుషులందరూ యెరూషలేములో సమావేశమయ్యారు. తొమ్మిదోనెల[d] ఇరవయ్యవ రోజున ప్రజలందరూ దేవాలయ ఆవరణలో సమావేశమయ్యారు. సమావేశ లక్ష్యం దృష్ట్యానూ, భారీ వర్షం మూలంగానూ వాళ్లందరూ ఎంతో కలవరపడ్డారు. 10 అప్పుడు ఎజ్రా యాజకుడు ఆ జనాన్ని ఉద్దేశించి యిలా ప్రసంగించాడు: “మీరు దేవునిపట్ల నమ్మకంగా వ్యవహరించలేదు. మీరు విదేశీయులను పెళ్లాడారు. మీరు అలా చేయడం ద్వారా ఇశ్రాయేలును మరింతగా నేరస్థం చేశారు. 11 మీరిప్పుడు నేరం చేసినట్లు యెహోవా ముందు ఒప్పుకోవాలి. యెహోవా మీ పూర్వీకుల దేవుడు. మీరు యెహోవా ఆజ్ఞను పాటించాలి. మీరు మీ చుట్టూ నివసించే అన్య ప్రజలనుంచీ, విదేశీ భార్యలనుంచీ వేరుపడాలి.”

12 అప్పుడు అక్కడ కూడిన అందరూ ఎజ్రాకి బిగ్గరగా ఇలా బదులిచ్చారు, “ఎజ్రా, నీవు చెప్పింది సరైన మాట! మేము నీవు చెప్పిన పనులు చెయ్యాలి. 13 అయితే, ఇక్కడ చాలామంది వున్నారు. ఇది వర్షాకాలం. మేమిక్కడ బయట నిలబడి వుండటం కష్టం. మేము చాలా తీవ్రమైన పాపం చేశాము. అందుకని, ఈ సమన్యను ఒకటి రెండు రోజుల్లో పరిష్కరించడం సాధ్యంకాదు. 14 ఇక్కడ సమావేశమైన వాళ్లందరి తరపున మా నాయకుల్ని నిర్ణయం తీసుకోమనండి. అటు తర్వాత, మా పట్టణాల్లో విదేశీ స్త్రీని పెళ్లి చేసుకున్న ప్రతివ్యక్తి ఒక నిర్ణీత సమయంలో యెరూషలేముకు రావాలి. వాళ్లు ఇక్కడికి తమ పెద్దలతో (నాయకులు) న్యాయాధిపతులతో కలిసి రావాలి. అప్పుడు మనపట్ల దేవుని కోపం ఆగుతుంది.”

15 కొద్దిమంది మాత్రమే ఈ ఏర్పాటును వ్యతిరేకించారు. అశాహేలు కొడుకు యోనాతాను, తిక్వా కొడుకు యహజ్యాయు. మెషుల్లాము, షబ్బెతైయు కూడా యీ తీర్మానాన్ని వ్యతిరేకించారు.

16 చెరనుంచి యెరూషలేముకు తిరిగివచ్చిన ఇశ్రాయేలీయులందరూ ఈ తీర్మానాన్ని ఆమోదించారు. యాజకుడు ఎజ్రా ఆయా వంశాల నాయకులను ఎంపికచేశాడు. అతను ఒక్కొక్క వంశం నుంచి ఒక్కొక్కరిని పేరు వరుసన ఎన్నుకున్నాడు. పదవ నెల[e] మొదటి రోజున ఎంపిక చేయబడిన వ్యక్తులు కూర్చుని ఒక్కొక్కరి విషయాన్ని విచారణ చేయనారంభించారు. 17 మొదటి నెల[f] మొదటిరోజు నాటికి విదేశీ స్త్రీలను పెళ్లి చేసుకున్న వాళ్లందర్ని గురించీ చర్చలు ముగించారు.

విదేశీ స్త్రీలను వివాహం చేసుకున్నవాళ్ల జాబితా

18 విదేశీ స్త్రీలను వివాహం చేసుకున్న యాజకుల సంతతివారి పేర్లు యివి:

యోజాదాకు కొడుకు యేషూవ వంశీకుల నుంచి యేషూవ సోదరులు, మయశేయ, ఎలీయెజెరు, యారీబు, గెదల్యా. 19 వీళ్లందరూ తమ భార్యలకు విడాకులు ఇస్తామని ప్రమాణం చేశారు. తర్వాత వాళ్లలో ప్రతి ఒక్కడూ తన నేర పరిహారం నిమిత్తం అపరాధ పరిహారార్థ బలిగా తన మంద నుంచి ఒక్కొక్క పొట్టేలును సమర్పించారు.

20 ఇమ్మేరు సంతతివారు: హనానీ, జెబద్యా

21 హారీము సంతతివారు: మయశేయా, ఏలియా, షెమయా, యెహీయేలు, ఉజ్జియా.

22 పషూరు సంతతివారు: ఎల్యోయేనై, మయశేయా, ఇష్మాయేలు, నెతనేలు, యోజాబాదు, ఎల్యాశా.

23 లేవీయుల్లో పరాయి స్త్రీలను పెళ్లి చేసుకున్నవారు:

యోజాబాదు, షిమీ, కెలిథా, పెతహయా, యూదా, ఎలీయెజెరు.

24 గాయకులలో: ఎల్యాషీబు. ద్వారపాలకులలో: షల్లూము, తెలెము, ఊరి.

25 ఇశ్రాయేలీయుల్లో ఈ క్రిందివారు పరజాతి స్త్రీలను పెళ్లిచేసుకున్నారు.

పరోషు సంతతివారు: రమ్యా, యిజ్జీయా, మల్కీయా, మీయామిను, ఎలియేజరు, మల్కీయా, బెనాయా.

26 ఏలాము సంతతివారు: మత్తన్యా, జెకర్యా, యెహీయేలు, అబ్దీ, యెరేమోతు, ఏలియా.

27 జత్తూ సంతతివారు: ఎల్యోయేనై, ఎల్యాషీబు, మత్తన్యా, యెరేమోతు, జాబాదు, అజీజా.

28 బేబై వంశీకులు: యెహోహానాను, హనన్యా, జబ్బయి, అత్లాయి.

29 బానీ సంతతివారు: మెషుల్లాము, మల్లూకు, అదాయా, యాషూబు, షెయాలు, రామోతు.

30 పహత్మోయాబు సంతతివారు: అద్నా, కెలాలు, బెనాయా, మయశేయా, మత్తన్య, బెసలేలు, బన్నూయి, మనష్షే.

31 హారీము సంతతివారు: ఎలీయెజెరు, ఇష్షీయా, మల్కీయా, షెమయా, షీమ్యోను, 32 బెన్యామీను, మల్లూకు, షెమర్యా.

33 హాషుము సంతతివారు: మతైనై, మత్తత్తా, జాబాదు, ఎలీపేలెటు, యెరేమై, మనష్షే, షిమీ,

34 బానీ సంతతివారు: మయదై, అమ్రాము, ఊయేలు, 35 బెనాయా, బేద్యా, కెలూహు, 36 వన్యా, మెరేమోతు, ఎల్యాషీబు, 37 మత్తన్యా, మతైనై, యహశావు.

38 బిన్నూయి సంతతివారు: షిమీ, 39 షెమర్యా, నాతాను, అదాయా, 40 మక్నద్బయి, షామై, షారాయి, 41 అజరేలు, షెలెమ్యా, షెమర్యా, 42 షల్లూము, అమర్యా, యోసేవు.

43 నెబో సంతతివారు: యెహీయేలు, మత్తిత్యా, జాబాదు, జెబీనా, యద్దయి, యోవేలు, బెనాయా.

44 పై పురుషులందరూ పరాయి జాతుల స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. వాళ్లలో కొందరు ఆ స్త్రీల ద్వారా సంతానం పొందారు కూడా.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International