Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
జెకర్యా 8-14

యెరూషలేమును ఆశీర్వదించటానికి యెహోవా మాట యిచ్చుట

సర్వశక్తిమంతుడైన యెహోవానుండి వచ్చిన ఒక వర్తమానం ఇది. సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “నేను సీయోనును నిజంగా ప్రేమిస్తున్నాను. నేనామెను ఎంతగా ప్రేమిస్తున్నానంటే, ఆమె నాపట్ల విశ్వాసం లేకుండా ప్రవర్తించినప్పుడు నాకు కోపం వచ్చింది.” యెహోవా చెపుతున్నాడు, “నేను సీయోనుకు తిరిగి వచ్చాను. నేను యెరూషలేములో నివసిస్తున్నాను. యెరూషలేము విశ్వాసంగల నగరం అని పిలవబడుతుంది. నా పర్వతం పవిత్ర పర్వతం అని పిలవబడుతుంది.”

సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “వృద్ధులైన స్త్రీ వురుషులు మళ్లీ యెరూషలేము బహిరంగ ప్రదేశాలలో కనబడతారు. ప్రజలు నడవటానికి చేతి కర్రలు కావలసివచ్చే వయసువరకు నివసిస్తారు. వీధుల్లో ఆడుకునే పిల్లలతో నగరం నిండిపోతుంది. చావగా మిగిలినవారు ఇదంతా అద్భుతం అనుకుంటారు. నేనూ ఇది అద్భుతం అనుకుంటాను!”

సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “చూడు, తూర్పు, పడమటి దేశాలలో ఉన్న నా ప్రజలను నేను రక్షిస్తున్నాను. వారిని ఇక్కడికి తిరిగి తీసుకు వస్తాను. వారు యెరూషలేములో నివసిస్తారు. వారు నా ప్రజగా పుంటారు. నేను వారికి మెచ్చదగిన, విశ్వసనీయమైన దేవునిగా వుంటాను.”

సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “ధైర్యంగా ఉండండి! సర్వశక్తిమంతుడైన యెహోవా ముందుగా తన ఆలయాన్ని నిర్మించటానికి పునాదులు వేసినప్పుడు ప్రవక్తలు ఇచ్చిన సందేశాన్నే ప్రజలైన మీరు ఈనాడు వింటున్నారు. 10 అంతకు ముందు, పనివారిని పెట్టటానికి, జంతువులను బాడుగకు తీసుకోటానికి మనుష్యులవద్ద డబ్బు లేదు. పైగా మనుష్యులు రావటానికి, పోవటానికి కూడ క్షేమకరం కాని సమయం. బాధలన్నిటి నుండి ఉపశమనం లేదు. నేను ప్రతివాడిని తన పొరుగు వానిపై తిరుగబడేలా చేశాను. 11 కాని ఇప్పుడు పూర్వం మాదిరిగా లేదు. బతికివున్నవారికి ఇక అలా జరుగదు.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

12 “ఈ ప్రజలు శాంతియుత వాతావరణంలో మొక్కలు. నాటుతారు. వారి ద్రాక్షాతోటలు కాయలు కాస్తాయి. భూమి విస్తారంగా పంటనిస్తుంది. ఆకాశం వర్షిస్తుంది. వీటన్నిటినీ నా ప్రజలైన వీరికి ఇస్తాను. 13 ప్రజలు తమ శాపాలతో ఇశ్రాయేలును, యూదాను వాడటం మొదలు పెట్టారు. కాని ఇశ్రాయేలును, యూదాను నేను రక్షిస్తాను. ఆ పేర్లు ఒక దీవెనగా మారుతాయి. కావున భయపడవద్దు. ధైర్యంగా ఉండండి!”

14 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “మీ పూర్వీకులు నాకు కోపం కలిగించారు. అందువల్ల వారిని నేను నాశనం చేయ సంకల్పించాను. నా మనస్సు మార్చుకోకూడదని నేను నిర్ణయించుకున్నాను.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 15 “కాని ఇప్పుడు నా మనస్సు మార్చుకున్నాను. అదేమాదిరి నేను యెరూషలేముపట్ల, యూదాప్రజలపట్ల మంచిగా వుండటానికి నిర్ణయించుకున్నాను. కావున భయపడవద్దు! 16 అయితే మీరు మాత్రం ఇవి తప్పక చేయండి: మీ పొరుగు వారికి నిజం చెప్పండి. మీరు మీ నగరాలలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీరు సరిగా ప్రవర్తించండి. ధర్మమైన శాంతికి దోహదపడే పనులు చేయండి. 17 మీ పొరుగు వారిని బాధించడానికి మీరు రహస్య పథకాలు వేయకండి! బూటకపు వాగ్దానాలు చేయకండి! అటువంటి పనులు చేయటంపట్ల ఆసక్తి కనపరచకండి. ఎందుకంటే, వాటిని నేను అసహ్యించుకుంటాను!” యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

18 నేనీ వర్తమానం సర్వశక్తిమంతుడైన యెహోవానుండి అందుకున్నాను. 19 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “మీరు ప్రత్యేక సంతాప దినాలు, ఉపవాస దినాలు నాల్గవ నెలలోను, ఐదవ నెలలోను, ఏడవ నెలలోను, పదవ నెలలోను కలిగి ఉన్నారు. ఆ సంతాప దినాలు సంతోష దినాలుగా తప్పక మార్చబడాలి. అవి యోగ్యమైన, సంతోషదాయకమైన విశ్రాంతి దినాలవుతాయి. కావున మీరు సత్యాన్ని, శాంతిని ప్రేమించండి!”

20 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు,
“భవిష్యత్తులో అనేక నగరాలనుండి ప్రజలు యెరూషలేముకు వస్తారు.
21 ఒక నగరంనుండి వచ్చిన ప్రజలు, వారు కలిసిన మరొక నగరవాసులతో ఇలా అంటారు,
    వేరేవాళ్లు మేము మీతో వస్తాము అని అంటారు.
    ‘సర్యశక్తిమంతుడైన యెహోవాను ఆరాధించటానికి మేము వెళ్తున్నాము.
    మాతో రండి!’”

22 అనేక బలమైన రాజ్యాలనుండి అనేకమంది ప్రజలు సర్యశక్తిమంతుడైన యెహోవాను వెదుక్కుంటూ యెరూషలేముకు వస్తారు. ఆయనను ఆరాధించటానికి వారు అక్కడికి వస్తారు. 23 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “ఆ సమయంలో వివిధ భాషలు మాట్లాడేవారు ఒక యూదా మనిషి వద్దకు వచ్చి, ‘దేవుడు నీతో ఉన్నాడని మేము విన్నాము. ఆయనను ఆరాధించటానికి మేము నీతో రావచ్చునా?’ అని అడుగుతారు.”

ఇతర దేశాలకు వ్యతిరేకంగా తీర్పు

ఒక విషాద వర్తమానం. ఇది హద్రాకుయొక్క దేశాన్ని గురించి, అతని రాజధాని నగరమైన దమస్కును గురించిన యెహోవా వర్తమానం. దేవుడిని తెలుసుకున్న వారు కేవలం ఇశ్రాయేలు వంశాల వారు మాత్రమే కాదు. ప్రతి ఒక్కడూ సహాయంకొరకు ఆయనను ఆశ్రయించవచ్చు. హద్రాకుయొక్క దేశ సరిహద్దుల్లో హమాతు ఉంది. అలాగే తూరు, సీదోనులు కూడా ఉన్నాయి. (ఆ ప్రజలు చాలా తెలివిగల వారు). తూరు ఒక కోటలా కట్టబడింది. ఆ ప్రజలు వెండిని దుమ్మువలె విస్తారంగా సేకరించారు. బంగారం వారికి బంకమట్టివలె సామాన్యమై పోయింది. కాని మా ప్రభువైన యెహోవా దానినంతా తీసుకుంటాడు. ఆ నగరపు శక్తివంతమైన నౌకాబలాన్ని ఆయన నాశనం చేస్తాడు. ఆ నగరం అగ్నివల్ల నాశనం కాబడుతుంది!

“అష్కెలోను ప్రజలు వాటిని చూసి భయపడతారు. గాజా ప్రజలు భయంతో వణకుతారు. ఇవన్నీ జరగటం చూచినప్పుడు ఎక్రోను ప్రజలకు ఆశలుడుగుతాయి. గాజాలో రాజంటూ ఎవ్వడూ మిగలడు. అష్కెలోనులో ఇక ఎంతమాత్రం ఎవ్వరూ నివసించరు. అష్డోదులో ప్రజలు వారి నిజమైన తండ్రులు ఎవరో కూడ తెలుసుకోలేరు. గర్విష్ఠులైన ఫిలిష్తీయులను సర్వనాశనం చేస్తాను. రక్తం కలిసివున్న మాంసాన్నిగాని, నిషేధించబడిన ఏ ఇతర ఆహార పదార్థాన్నిగాని వారిక తినరు. జీవించివున్న ఫిలిష్తీయుడెవడైనా వుంటే, అతడు నా ప్రజల్లో భాగంగా ఉంటాడు. యూదాలో వారు మరొక వంశంగా ఉంటారు. యెబూసీయులవలె ఎక్రోను ప్రజలు నా ప్రజల్లో ఒక భాగమవుతారు. నేను నా దేశాన్ని రక్షిస్తాను. శత్తుసైన్యాలను దానిగుండా వెళ్లనీయను. ఇక ఎంత మాత్రం వారిని నా ప్రజలను బాధించనీయను. గతంలో నా ప్రజలు ఎంత బాధపడ్డారో నేను స్వయంగా చూశాను.”

రాబోయే రాజు

సీయోనూ, నీవు సంతోషంగా వుండు!
    యెరూషలేము ప్రజలారా, ఆనందంతో కేకలు పెట్టండి!
చూడండి, మీరాజు మీ వద్దకు వస్తున్నాడు!
    ఆయన విజయం సాధించిన మంచి రాజు.
    కాని ఆయన వినయం గలవాడు. ఆయన ఒక గాడిదపై స్వారీ చేస్తున్నాడు. ఒక గాడిద పిల్లపై వస్తున్నాడు.
10 రాజు చెపుతున్నాడు, “నేను ఎఫ్రాయిములో రథాలనూ,
    యెరూషలేములో గుర్రవు రౌతులను నాశనం చేశాను.
    యుద్ధంలో వాడిన విల్లంబులను నాశనం చేశాను.”

శాంతిని గూర్చిన వార్తను అన్య దేశాలు విన్నాయి.
    ఆ రాజు సముద్రంనుండి సముద్రంవరకు పరిపాలిస్తాడు.
    ఆయన నదినుండి భూమిపై సుదూర ప్రాంతాలవరకు పాలిస్తాడు.

యెహోవా తన ప్రజలను రక్షించటం

11 యెరూషలేమూ, మన ఒడంబడిక రక్తంతో స్థిరపర్చబడింది.
    కావున నీ బందీలను నేను విడుదల చేశాను. నీ ప్రజలు ఇక ఎంతమాత్రం ఆ ఖాళీ చెరసాలలో ఉండరు.
12 చెరపట్టబడిన ప్రజలారా, ఇంటికి వెళ్ళండి.
    మీకు ఇంకా ఆశపడదగింది ఉంది.
నేను మీవద్దకు తిరిగి వస్తున్నానని
    నేను మీకు చెపుతున్నాను!
13 యూదా, నిన్ను నేను ఒక విల్లులా వినియోగిస్తాను.
    ఎఫ్రాయిమూ, నిన్ను నేను బాణాల్లా వినియోగిస్తాను.
ఇశ్రాయేలూ, గ్రీసుతో యుద్ధం చేయటానికి
    నిన్ను ఒక బలమైన కత్తిలా ఉపయోగిస్తాను.
14 యెహోవా వారికి కన్పిస్తాడు.
    ఆయన తన బాణాలను మెరుపుల్లా వదులుతాడు.
నా ప్రభువైన యెహోవా బాకా ఊదుతాడు.
    అప్పుడు సైన్యం ఎడారిలో ఇసుక తుఫానులా ముందుకు చొచ్చుకు పోతుంది.
15 సర్వశక్తిమంతుడైన యెహోవా వారిని రక్షిస్తాడు.
    శత్రువును ఓడించటానికి సైనికులు బండరాళ్లను, వడిసెలలను ఉపయోగిస్తారు.
వారి శత్రువుల రక్తాన్ని వారు చిందిస్తారు.
    అది ద్రాక్షా మద్యంలా పారుతుంది.
    అది బలిపీఠం మూలలపై పోసిన రక్తంలా వుంటుంది!
16 ఒక కాపరి తన గొర్రెలను కాపాడినట్టు,
    దేవుడైన యెహోవా తన ప్రజలను ఆ సమయంలో కాపాడతాడు.
వారాయనకు చాలా విలువైనవారు.
    తన భూమిపై వారు మెరిసే రత్నాల వంటివారు.
17 ప్రతీదీ మెచ్చదగినదై, అందంగా ఉంటుంది!
    విచిత్రమైన పంట పండుతుంది.
కాని అది కేవలం ధాన్యం, ద్రాక్షారసం కాదు.
    ఆ పంట యువతీ యువకులే!

యెహోవా వాగ్దానాలు

10 వసంత ఋతువులో వర్షం కొరకు యెహోవాను ప్రార్థించండి. యెహోవా మెరుపులను కలుగజేస్తాడు. వర్షం కురుస్తుంది. ప్రతివాని పొలంలోనూ దేవుడు పైరులు పెరిగేలా చేస్తాడు.

భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలుసుకోవటానికి ప్రజలు తమ చిన్న విగ్రహాలను, మంత్రతంత్రాలను ఉపయోగిస్తారు. కాని అది నిరుపయోగం. ఆ జనులు దర్శనాలు చూసి, తమ కలలను వివరిస్తారు. కాని అవన్నీ పనికిరాని అబద్ధాలు. అందువల్ల ప్రజలు సహాయంకొరకు గొర్రెల్లా అరుస్తూ ఇక్కడా, అక్కడా తిరుగుతారు. కాని వారిని నడిపించటానికి కాపరిలేడు.

యెహోవా చెపుతున్నాడు: “కాపరుల (నాయకుల) పట్ల నేను చాలా కోపంగా వున్నాను. నా గొర్రెలకు (ప్రజలకు) జరిగిన దానికి నేను ఆ నాయకులను బాధ్యులనుగా చేశాను.” (యూదా ప్రజలు దేవుని యొక్క గొర్రెల మంద. సర్వశక్తిమంతుడైన యెహోవా తన మంద విషయంలో జాగ్రత్త తీసుకుంటాడు. ఒక సైనికుడు తన అందమైన యుద్ధగుర్రం విషయంలో శ్రద్ధ చూపినట్టు, ఆయన వారి పట్ల జాగ్రత్త తీసుకుంటాడు.)

“పునాదిరాయి, గుడారపు గుంజ, యుద్ధ విల్లు, ముందుకు చొచ్చుకువచ్చే సైన్యం అన్నీ యూదానుండి కలిసి వస్తాయి. వారు తమ శత్రువును ఓడిస్తారు. అది సైనికులు బురద వీధులగుండా నడిచినట్లు ఉంటుంది. వారు పోరాడతారు. యెహోవా వారితోవున్న కారణంగా వారు శత్రువుకు చెందిన గుర్రపు దళాలను కూడ ఓడిస్తారు. యూదా వంశాన్ని నేను బలపర్చుతాను. యోసేపు వంశాన్ని యుద్ధంలో గెలిచేలా చేస్తాను. వారిని సురక్షితంగా, ఆరోగ్యంగా తిరిగి తీసుకు వస్తాను. వారిని ఓదార్చుతాను. అది నేను వారిని ఎప్పుడూ విడిచి పెట్టనట్లుగా ఉంటుంది. నేను వారి దేవుడనైన యెహోవాను. నేను వారికి సహాయం చేస్తాను. ఎఫ్రాయిము ప్రజలు తాగటానికి పుష్కలంగా దొరికిన సైనికులవలె సంతోషంగా ఉంటారు. వారి పిల్లలు ఉల్లాసంగా ఉంటారు. వారు కూడ హాయిగా ఉంటారు. వారంతా యెహోవాతో కలిసి ఉండే ఆనందమయ సమయాన్ని కలిగి ఉంటారు.

“నేను వారికొరకు ఈల వేసి, వారందరినీ ఒక్కచోటికి పిలుస్తాను. నేను వారిని నిజంగా రక్షిస్తాను. వారి సంఖ్య విస్తారంగా ఉంటుంది. అవును, నా ప్రజలను అనేక దేశాలకు చెదరగొడుతూ వచ్చాను. కాని ఆ దూర దేశాలలో వారు నన్ను జ్ఞాపకం చేసుకుంటారు. వారు, వారి పిల్లలు బతుకుతారు. పైగా వారు తిరిగి వస్తారు. 10 నేను వారిని ఈజిప్టు (ఐగుప్తు) నుంచి, అష్షూరు నుంచి వెనుకకు తీసుకు వస్తాను. వారిని గిలాదు ప్రాంతానికి తిరిగి తీసుకువస్తాను. అక్కడ వారికి సరిపోయే స్థలం వుండదు గనుక, వారిని దగ్గరలోనేవున్న లెబానోనులో నివసించనిస్తాను.” 11 దేవుడు వారిని ఈజిప్టు (ఐగుప్తు) నుండి బయటకు తీసికొని వచ్చినప్పుడు ఉన్నట్లుగా ఇప్పుడు పరిస్థితి ఉంటుంది. ఆయన సముద్రపు అలలను కొట్టగా, సముద్రం రెండు పాయలు అయ్యింది. ప్రజలు ఆ కష్టాల సముద్రం మధ్యనుండి నడిచి వచ్చారు. యెహోవా నదీ ప్రవాహాలను ఇంకిపోయేలా చేస్తాడు. అష్షూరు గర్వాన్ని, ఈజిప్టు (ఐగుప్తు) అధికారాన్ని ఆయన నాశనం చేస్తాడు. 12 యెహోవా తన ప్రజలు బలపడేలా చేస్తాడు. వారు ఆయన ధ్యానంలో, ఆయన నామస్మరణ చేస్తూ జీవిస్తారు. యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

ఇతర రాజ్యాల్ని దేవుడు శిక్షించటం

11 లెబానోనూ, అగ్ని ప్రవేశించి నీ దేవదారు వృక్షాలను[a]
    కాల్చివేసేలాగు నీ ద్వారాలను తెరువు.
దేవదారు వృక్షాలు పడిపోయినందుకు సరళ వృక్షాలు విచారిస్తాయి.
    బలమైన ఆ చెట్లు దూరంగా తీసుకుపోబడ్డాయి.
బాషానులోని సింధూర వృక్షాలు
    నరికి వేయబడిన అడవికొరకు దుఃఖిస్తాయి.
విలపించే కాపరుల రోదనను వినండి.
    శక్తివంతులైన వారి నాయకులు పట్టుబడ్డారు.
యువకిశోరాల గర్జన వినండి.
    యొర్దాను నదివద్దగల వాటి చిక్కటి పొదలన్నీ తీసుకుపోబడ్డాయి.

దేవుడైన యెహోవా చెపుతున్నాడు, “చంపటానికి పెంచబడ్డ గొర్రెల విషయం జాగ్రత్త తీసుకో. వాటి నాయకులు యజమానులవలెను, వ్యాపారులవలెను ఉన్నారు. యజమానులు వారి గొర్రెలను చంపుతారు. అయినా వారు శిక్షింపబడరు. వ్యాపారులు గొర్రెలను అమ్మి, ‘దేవునికి జయం, నేను భాగ్యవంతుడనయ్యాను’ అని అంటారు. కాపరులు తమ గొర్రెల కొరకు విచారించరు. ఈ దేశంలో నివసించే ప్రజల కొరకు నేను విచారించను.” యెహోవా ఈ విషయాలు చెప్పాడు: “చూడండి, నేను ప్రతివాడినీ తన పొరుగువానిచేత, రాజుచేత దూషింపబడేటట్లు చేస్తాను. వారి దేశాన్ని నాశనం చేసేలాగు నేను వారిని వదులుతాను. నేను వారిని ఆపను!”

కావున చంపబడటానికి పెంచబడిన ఆ అభాగ్యపు గొర్రెలపట్ల నేను శ్రద్ధ తీసుకున్నాను. నాకు రెండు కర్రలు దొరికాయి. ఒక కర్రను “అభిమానం” అని, మరొక కర్రను “సమైక్యత” అని పిలిచాను. తరువాత నేను గొర్రెలపట్ల శ్రద్ధ తీసుకోవటం మొదలు పెట్టాను. ముగ్గురు కాపరులను ఒక్క నెలలో సంహరించాను. నేను గొర్రెలపట్ల కోపించగా, వారు నన్ను ద్వేషించటం మొదలు పెట్టారు. అప్పుడు నేను ఇలా అన్నాను: “నేను వదిలి వేస్తాను! నేను మిమ్మల్ని గురించి శ్రద్ధ తీసుకోను! చావు కోరేవారిని నేను చనిపోనిస్తాను. నాశనమైపోవాలని కోరుకొనేవారిని నేను నాశనం కానిస్తాను. ఇంకా మిగిలినవారు ఒకరినొకరు నాశనం చేసుకుంటారు.” 10 తరువాత “అభిమానం” అనే కర్రను నేను తీసుకొని విరుగగొట్టాను. తన ప్రజలతోగల దేవుని ఒడంబడిక రద్దయినట్లు చూపటానికే నేనిది చేశాను. 11 కావున ఆ రోజున నిబంధన రద్దయింది. నన్ను గమనిస్తున్న ఆ నిర్భాగ్యపు గొర్రెలకు ఈ వర్తమానం యెహోవానుండి వచ్చినదని తెలుసు.

12 అప్పుడు నేనిలా అన్నాను: “మీరు నాకు వేతనం ఇవ్వదలిస్తే ఇవ్వండి. వద్దనుకుంటే మానండి!” వారప్పుడు ముప్పై వెండి నాణెములిచ్చారు. 13 తరువాత యెహోవా నాతో ఇలా అన్నాడు: “అంటే నా విలువ అంత మాత్రమేనని వారనుకుంటున్నారన్నమాట. ఆ మహాధనాన్ని[b] ఆలయ ఖజానాలో పడవేయి.” కావున ఆ ముప్పై వెండి నాణాలను తీసుకొని యెహోవా ఆలయంలోని ఖజానాలో పడవేశాను. 14 పిమ్మట “సమైక్యత” అనే కర్రను తీసుకొని రెండుగా నరికాను. యూదా, ఇశ్రాయేలుల మధ్యగల ఐక్యతకు భంగం వాటిల్లిందని చూపటానికి నేనిది చేశాను.

15 పిమ్మట యెహోవా నాతో ఇలా చెప్పాడు: “ఇప్పుడు గొర్రెలను కాయటానికి అసలు పనికిరాని ఒక కర్రను చూడు. 16 ఈ దేశానికి ఒక కొత్త కాపరిని నేను తెస్తానని ఇది చూపుతుంది. కాని ఈ యువకుడు నాశనం కాబడుతున్న గొర్రెలపట్ల జాగ్రత్త తీసుకోలేడు. గాయపడిన గొర్రెలను అతడు బాగు చేయలేడు. బతికివున్న వాటికి అతడు గ్రాసం[c] ఇవ్వలేడు. ఆరోగ్యంగా ఉన్నవి పూర్తిగా తినబడతాయి. కేవలం వాటి గిట్టలు మాత్రం వదిలివేయబడతాయి.”

17 పనికిమాలిన ఓ నా కాపరీ,
    నీవు నా గొర్రెలను వదిలివేశావు.
అతనిని శిక్షించు!
    అతని కుడి చేతిని, కుడి కంటిని కత్తితో కొట్టు.
    అతని కుడిచేయి నిరుపయోగమవుతుంది.
    అతని కుడి కన్ను గ్రుడ్డిదవుతుంది.

యూదా చుట్టునున్న దేశాల గూర్చిన దర్శనాలు

12 ఇశ్రాయేలును గురించి యెహోవానుండి వచ్చిన విషాద వార్త. యెహోవా ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు. ఆయన మానవుని ఆత్మను అతనిలో పొందుపర్చాడు. యెహోవా ఈ విషయాలు చెప్పాడు: “చూడండి, నేను యెరూషలేమును దాని చుట్టూ ఉన్న దేశాలకు ఒక విషపు గిన్నెలా చేస్తాను. దేశాలు వచ్చి, ఆ నగరంపై దాడి చేస్తాయి. యూదా అంతా బోనులో చిక్కుతుంది. కాని నేను యెరూషలేమును ఒక బరువైన బండలా చేస్తాను. దానిని తీసుకోడానికి ఎవరైనా ప్రయత్నిస్తే అది అతనినే గాయపర్చుతుంది. ఆ ప్రజలు నిజంగా నరకబడతారు, గీకబడతారు. కాని భూమిపైగల దేశాలన్నీ కలిసి యెరూషలేము మీద యుద్ధానికి వస్తాయి. కాని ఆ సమయంలో నేను గుర్రాన్ని బెదర గొడతాను. దాని మీద స్వారీ చేసే సైనికునికి భయం పుట్టిస్తాను. శత్రు గుర్రాలన్నీ గుడ్డివై పోయేలా చేస్తాను. కాని నా కండ్లు తెరవబడి ఉంటాయి. నేను యూదా వంశాన్ని కనిపెడుతూ ఉంటాను. యూదా వంశ నాయకులు ప్రజలను ప్రోత్సహిస్తారు. వారు, ‘సర్వశక్తిమంతుడైన యెహోవా మీ దేవుడు, ఆయన మనల్ని బలవంతులుగా చేస్తాడు’ అని అంటారు. ఆ సమయంలో యూదా నాయకులను అరణ్యంలో చెలరేగిన అగ్నిలా నేను చేస్తాను. అగ్ని ఎండు గడ్డిని దగ్ధం చేసినట్లు, వారు తమ శత్రువులను నాశనం చేస్తారు. చుట్టూవున్న వారి శత్రువులను వారు నాశనం చేస్తారు. యెరూషలేము ప్రజలు మళ్లీ తీరికగా కూర్చుని విశ్రాంతి తీసుకుంటారు.”

యెరూషలేము ప్రజలు మిక్కిలి గొప్పలు చెప్పుకోకుండా చేయటానికి, యెహోవా యూదా ప్రజలను ముందుగా రక్షిస్తాడు. యూదాలో వున్న ప్రజలకంటె తాము గొప్పవారమని దావీదు వంశంవారు, యెరూషలేములో వుంటున్న ఇతర ప్రజలు గొప్పలు చెప్పుకోలేరు. కాని యెరూషలేము ప్రజలను యెహోవా రక్షిస్తాడు. ఏమీ చేతగానివాడు సహితం దావీదులా గొప్ప సైనికుడవుతాడు. దావీదు వంశంలోని మనుష్యులు దేవుళ్లవలె వుంటారు. ప్రజలను నడిపించే యెహోవా దూతలా వుంటారు.

యెహోవా చెపుతున్నాడు: “ఆ సమయంలో యెరూషలేముపై యుద్ధానికి వచ్చిన దేశాలను నేను నాశనం చేస్తాను. 10 దావీదు వంశాన్ని, యెరూషలేములో నివసిస్తున్న ప్రజలను దయాదాక్షిణ్య స్వభావంతో నింపివేస్తాను. వారు నన్ను పొడిచారు. అలాంటి నా సహాయం కొరకే వారు ఎదురు చూస్తారు. వారు చాలా విచారిస్తారు. తన ఏకైక కుమారుడు చనిపోయినవాడు విలపించేలా, తన మొదటి కుమారుడు చని పోయినవాడు విలపించేలా వారు దుఃఖిస్తారు. 11 యెరూషలేములో గొప్ప దుఃఖ సమయం ఉంటుంది. అది మెగిద్దోను లోయలో హదద్రిమ్మోను మరణంపట్ల ప్రజల దుఃఖంలా వుంటుంది. 12 ప్రతి ఒక్క కుటుంబం విడిగా దుఃఖిస్తుంది. దావీదు కుటుంబంలోని పురుషులు విడిగా దుఃఖిస్తారు. వారి భార్యలు విడిగా వారికి వారే దుఃఖిస్తారు. నాతాను కుటుంబంలోని పురుషులు ప్రత్యేకంగా విలపిస్తారు. వారి భార్యలు విడిగా దుఃఖిస్తారు. 13 లేవి కుటుంబంలోని పురుషులు విడిగా విచారిస్తారు. వారి భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు. షిమ్యోను (షిమీ) కుటుంబంలోని పురుషులు విడిగా విలపిస్తారు. వారి భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు. 14 ఇదే మాదిరి అన్ని వంశాలలోనూ జరుగుతుంది. పురుషులు, స్త్రీలు విడి విడిగా దుఃఖిస్తారు.”

13 కాని, ఆ సమయంలో దావీదు కుటుంబానికి, యెరూషలేములో నివసిస్తున్న ప్రజలకొరకు ఒక నీటి జల తీయబడుతుంది. ఆ జలం వారి పాపాలను కడిగి, వారిని పవిత్రులుగా చేయటానికి ఉద్దేశించబడుతుంది.

బూటకపు ప్రవక్తలు ఇక వుండరు

సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “ఆ సమయంలో విగ్రహాలన్నిటినీ భూమిపైనుండి తొలగిస్తాను. ప్రజలు కనీసం వాటి పేర్లయినా గుర్తు పెట్టుకోలేరు. ఈ భూమిపైనుండి బూటకపు ప్రవక్తలను, మురికి దయ్యాలను నేను తొలగిస్తాను. ఎవ్వరైనా భవిష్య ప్రకటనలు చేస్తే అట్టి వ్యక్తి శిక్షింపబడతాడు. అతని తల్లిదండ్రులు సహితం అతనితో, ‘యెహోవా పేరుమీద నీవు అబద్ధాలు చెప్పావు. కావున నీవు తప్పక చనిపోవాలి!’ అని అంటారు. అతని స్వంత తల్లిదండ్రులు అతడు భవిష్య ప్రకటనలు చేసినందుకు కత్తితో పొడుస్తారు. అప్పుడు ప్రవక్తలు తమ దర్శనాలపట్ల, తమ ప్రకటనలపట్ల సిగ్గు చెందుతారు. తాము ప్రవక్తలమని తెలియజేసే ముతక బట్టను వారు ధరించరు. భవిష్య ప్రకటనల పేరుతో అబద్ధాలు చెప్పి, ప్రజలను మోసగించటానికి వారు ఆ బట్టలు ధరించరు. ఆ జనులు ఇలా అంటారు: ‘నేను ప్రవక్తను కాను. నేనొక వ్యవసాయదారుడిని. నా చిన్నతనంనుండి నేను వ్యవసాయదారునిగానే పని చేశాను.’ ‘అయితే, నీ చేతులమీద ఈ గాయాలు ఏమిటి?’ అని ఇతరులు అడుగుతారు. అందుకతడు, ‘నా స్నేహితుల ఇంటిలో నాకు దెబ్బలు తగిలాయి’ అని అంటాడు.”

సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు: “ఖడ్గమా, గొర్రెల కాపరిని నరుకు! నా స్నేహితుని నరుకు! కాపరిని నరుకు! గొర్రెలన్నీ పారిపోతాయి. నేను ఆ చిన్నవాటిని శిక్షిస్తాను. దేశ జనాభాలో మూడింట రెండు వంతులు బాధింపబడగా చనిపోతారు. మూడింట ఒకవంతు బతుకుతారు. చనిపోగా మిగిలినవారిని నేను పరీక్షిస్తాను. వారికి నేను ఎన్నో కష్టాలు కలుగ జేస్తాను. వెండిని శుద్ధి చేయటానికి కాల్చబడే అగ్నిలా ఆ కష్టాలు వుంటాయి. ఒకడు బంగారాన్ని పరీక్ష చేసినట్లు నేను వారిని పరీక్ష చేస్తాను. అప్పుడు సహాయం కొరకు వారు నన్ను పిలుస్తారు. నేను వారికి సమాధానమిస్తాను. ‘మీరు నా ప్రజలు’ అని నేను అంటాను. అప్పుడు వారు ఇలా అంటారు: ‘యెహోవా మా దేవుడు.’”

తీర్పు రోజు

14 చూడండి. తీర్పుతీర్చటానికి యెహోవాకు ఒక రోజు ఉంది. మీరు తీసుకున్న ధనం మీ నగరంలో విభజించబడుతుంది. యెరూషలేము మీదికి దేశాలన్నిటినీ నేను రప్పిస్తాను. వారు నగరాన్ని పట్టుకొని ఇండ్లన్నీ నాశనం చేస్తారు. స్త్రీలు మానభంగం చేయబడతారు. జనాభాలో సగం మంది బందీలుగా పట్టుకుపోబడతారు. కాని, మిగిలిన ప్రజలు నగరంనుండి తీసుకుపోబడరు. అప్పుడు యెహోవా ఆయా దేశాలపైకి యుద్ధానికి వెళతాడు. అది నిజమైన యుద్ధం అవుతుంది. ఆ సమయంలో ఆయన యెరూషలేముకు తూర్పున వున్న ఒలీవల కొండమీద నిలబడతాడు. ఒలీవల కొండ రెండుగా చీలి పోతుంది. ఆ కొండలో ఒక భాగం ఉత్తరానికి, మరొక భాగం దక్షిణానికి తిరుగుతాయి. తూర్పునుండి పడమటికి ఒక లోతైన లోయ ఏర్పడుతుంది. ఆ పర్వతలోయ మీకు మరి సన్నిహితంగా రావటంతో మీరు పారిపోవటానికి ప్రయత్నిస్తారు. యూదా రాజైన ఉజ్జియా కాలంలో భూకంపం వచ్చినప్పుడు మీరు పారిపోయిన రీతిగా మీరిప్పుడు పారిపోతారు. కాని, నా దేవుడైన యెహోవా వస్తాడు. ఆయనయొక్క పవిత్ర జనులందరూ ఆయనతో ఉంటారు.

6-7 అది ఒక ప్రత్యేకమైన రోజు. ఆ రోజున వెలుతురుగాని, చలిగాని, మంచుగాని వుండవు. అప్పుడు పగలూ వుండదు, రాత్రీ వుండదు. అది ఎట్లాగో యెహోవా ఒక్కనికే తెలుసు. అప్పుడు మామూలుగా చీకటి పడేటప్పడు ఇంకా కొంత వెలుతురు ఉంటుంది. ఆ సమయంలో యెరూషలేమునుండి నీరు ఎడతెరిపి లేకుండా ప్రవహిస్తుంది. ఆ ప్రవాహం రెండు పాయలై ఒకటి తూర్పుగా పారుతుంది. రెండవది పడమటిగా మధ్యధరా సముద్రంవైపు ప్రవహిస్తుంది. అది సంవత్సరం పొడవునా వేసవిలోను, శీతాకాలంలోను ప్రవహిస్తుంది. ఆ సమయంలో యెహోవా ప్రపంచానికంతటికి రాజుగా వుంటాడు. యెహోవా ఒక్కడే. ఆయనకు పేరు ఒక్కటే. 10 అప్పుడు యెరూషలేము చుట్టూ వున్న ప్రాంతమంతా అరాబా ఎడారిలా నిర్మానుష్య మవుతుంది. గెబ నుండి దక్షిణాన రిమ్మోను వరకు దేశం ఎడారిలా మారిపోతుంది. కాని యెరూషలేము నగరమంతా బెన్యామీను ద్వారం నుండి మొదటి ద్వారం (మూల ద్వారం) వరకు, మరియు హనన్యేలు బురుజు నుండి రాజు యొక్క ద్రాక్ష గానుగల వరకు మళ్లీ నిర్మింపబడుతుంది. 11 నిషేధం తొలగింపబడుతుంది. ప్రజలు మళ్లీ అక్కడ ఇండ్లు కట్టుకుంటారు. యెరూషలేము సురక్షితంగా ఉంటుంది.

12 కాని యెరూషలేముతో యుద్ధం చేసిన దేశాలన్నిటినీ యెహోవా శిక్షిస్తాడు. ఆ మనుష్యులకు ఒక భయంకర వ్యాధి సోకేలా ఆయన చేస్తాడు. ఆ జనులు జీవించి వుండగానే వారి శరీరాలు కుళ్లిపోవటం ప్రారంభిస్తాయి. వారి కండ్లు కనుగుంటలలోనే కుళ్లిపోతాయి. నాలుక నోటిలోనే కుళ్లనారంభిస్తుంది. 13-15 ఆ భయంకర వ్యాధి శత్రు స్థావరంలో ప్రబలుతుంది. పైగా వారి గుర్రాలు, కంచర గాడిదలు, ఒంటెలు మరియు గాడిదలు కూడ ఆ భయంకర వ్యాధికి గురౌతాయి.

ఆ సమయంలో ఆ ప్రజలు యెహోవా అంటే నిజంగా భయపడతారు. వారు ఒకరి కొకరు విరోధులై, ఒకరినొకరు పట్టుకుంటారు. యూదా ప్రజలు కూడా యెరూషలేముకు విరుద్ధంగా యుద్ధం చేస్తారు. నగరం చుట్టూవున్న దేశాలనుండి వారికి ధనం లభిస్తుంది. వారికి బంగారం, వెండి, బట్టలు విస్తారంగా లభిస్తాయి. 16 యెరూషలేముపై యుద్ధానికి వచ్చినవారిలో కొంతమంది బ్రతుకుతారు. వారు ప్రతి సంవత్సరం రాజును, సర్వశక్తిమంతుడైన యెహోవాను ఆరాధించటానికి వస్తారు. పర్ణశాలల పండుగను చేసుకోటానికి వారు వస్తారు. 17 ఈ భూమిమీద ఏ వంశంవారైనా సర్వశక్తిమంతుడైన యెహోవాను ఆరాధించటానికి యెరూషలేముకు వెళ్ళకపోయినట్లయితే, యెహోవా వారికి వర్షాలు లేకుండా చేస్తాడు. 18 ఈజిప్టు (ఐగుప్తు) నుండి ఏ వంశంవారైనా పర్ణశాలల పండుగ జరుపుకోటానికి రాకపోయినట్లయితే, యెహోవా శత్రు దేశాలకు సంభవింపజేసిన ఆ భయంకర వ్యాధి వారికి సోకేలా చేస్తాడు. 19 పర్ణశాలల పండుగ జరుపుకోటానికి రానటువంటి ఈజిప్టుకు, మరి ఏ ఇతర దేశానికైనా అదే శిక్ష.

20 ఆ సమయంలో ప్రతిదీ దేవునికి చెందివుంటుంది. గుర్రాలమీది జీనులకు కూడ “యెహోవాకు పవిత్రమైనది” అని వ్రాసిన చీటీలు కట్టబడతాయి. బలిపీఠంవద్ద వుంచబడిన గిన్నెలవలె యెహోవా ఆలయంలో వాడబడే పాత్రలన్నీ ప్రాముఖ్యంగల వస్తువులే. 21 వాస్తవానికి యెరూషలేము, యూదాలలోగల ప్రతి పాత్రమీద “సర్వశక్తిమంతుడైన యెహోవాకు పవిత్రమైనది” అని వ్రానిన చీటి అంటించబడుతుంది. యెహోవాను ఆరాధించే ప్రతి వ్యక్తి ఆ పాత్రలలో వండి, తినగలిగినవారై ఉంటారు.

ఆ సమయంలో సర్వశక్తిమంతుడైన యెహోవా ఆలయంలో క్రయవిక్రయాలు జరిపే వ్యాపారస్తులెవ్వరూ వుండరు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International