Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
హగ్గయి 1-2

ఇది ఆలయ నిర్మాణానికి సమయం

దేవుడైన యెహోవా వాక్కు ప్రవక్తయైన హగ్గయి ద్వారా యూదా పాలనాధికారియైన జెరుబ్బాబెలుకు, మరియు ప్రధాన యాజకుడైన యెహోషువకు వినవచ్చింది. (జెరుబ్బాబెలు తండ్రి పేరు షయల్తీయేలు. యెహోషువ తండ్రి పేరు యెహోజాదాకు). ఈ వాక్కు రాజైన దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం ఆరవ నెల మొదటి రోజున వచ్చింది. ఈ సందేశమేమంటే, సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “దేవుడైన యెహోవా ఆలయ నిర్మాణానికి తగిన సమయం రాలేదని ఈ ప్రజలు అంటున్నారు.”

పిమ్మట దేపుడైన యెహోవా వాక్కు ప్రవక్తయైన హగ్గయి ద్వారా వచ్చి ఇలా చెప్పింది: “మీరు నగిషీ పనులు చేయబడ్డ చెక్క పలకలు గోడలకు అమర్చబడి అందంగా ఉన్న ఇండ్లలో నివసిస్తున్నారు. కాని యెహోవా ఇల్లు ఇంకా శిథిలావస్థలోనే ఉంది. అందువల్ల సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు: ‘మీ ప్రవర్తన విషయం మీరు ఆలోచించండి! నీవు నాటింది ఎక్కువ. కాని నీవు కోసేది తక్కువ. నీవు భోజనం తింటావు. అయినా నీ కడుపు నిండదు. నీవు నీరు తాగుతావు. అయినా నీ దాహం తీరదు. నీవు బట్టలు ధరిస్తావు. కాని నీకు వెచ్చగా ఉండదు. ధన సంపాదకుడు చిల్లులు ఉన్న సంచిలో డబ్బును వేయటానికే సంపాదిస్తాడు!’”

సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెపుతున్నాడు: “మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించండి! మీరు పర్వతాలకు వెళ్లండి. కలప తెచ్చి ఆలయ నిర్మాణం చేయండి. అప్పుడు ఆలయం విషయంలో నేను సంతోషపడతాను. అది నాకు గౌరవప్రదం.” దేవుడైన యెహోవా ఇది చెప్పాడు.

సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు: “మీరు ఎంతో పెద్ద పంటకొరకు ఎదురుచూస్తారు. కానీ మీకు లభించే ధాన్యం కొంతమాత్రమే. దానిని మీరు ఇంటికి తెచ్చినప్పుడు, నేను గాలిని పంపించి ఎగురగొడతాను. ఎందుకని ఈ సంగతులు జరుగుతున్నాయి? ఎందుకనగా నా ఇల్లు ఇంకా శిథిలావస్థలో ఉంది. కాని మీలో ప్రతి ఒక్కడూ తన ఇంటిని భద్రపరచుకోవడానికి పరుగు పెడతాడు. 10 ఈ కారణంవల్ల ఆకాశం మంచును పడనీయదు. మరియు భూమి పంటలను పండనీయదు.”

11 ప్రభువిలా చెపుతున్నాడు, “నేను భూమిని, పర్వతాలను ఎండి పోవాలని ఆజ్ఞ ఇచ్చాను. భూమి పండించే ధాన్యాలు, కొత్త ద్రాక్షారసం, ఒలీవ నూనె అన్నీ పాడై పోతాయి. మరియు మనుష్యులందరూ, జంతువులన్నీ బలహీనమౌతాయి.”

క్రొత్త ఆలయం పని ప్రారంభమవటం

12 పిమ్మట షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, మరియు యెహోజాదాకు కుమారుడును, ప్రధాన యాజకుడును అయిన యెహోషువయు, మిగిలియున్న ప్రజలును తమ దేవుడైన యెహోవా ప్రవక్తయైన హగ్గయిని పంపించి, తమకు తెలియజేసిన మాటలను విని, దేవుడైన యెహోవాపట్ల భయభక్తులను చూపారు.

13 దేవుడైన యెహోవా తన వార్తాహరుడైన హగ్గయికి ఒక వర్తమానం పంపాడు. ఈ వర్తమానం ప్రజలకొరకు ఉద్దేశించబడింది. ఆ వర్తమానం ఇలా ఉంది: దేవుడైన యెహోవా “నేను మీతో ఉన్నాను!” అని ప్రకటిస్తున్నాడు.

14 పిమ్మట యూదా దేశపు పాలనాధికారియు, షయల్తీయేలు కుమారుడును అయిన జెరుబ్బాబెలును దేవుడగు యెహోవా ప్రేరేపించాడు. దేవుడైన యెహోవా యెహోజాదా కుమారుడును, ప్రధాన యాజకుడును అయిన యెహోషువాను కూడా ప్రేరేపించాడు. మరియు దేవుడైన యెహోవా మిగిలివున్న జనులందరినీ ప్రేరేపించాడు. అప్పుడు వారంతా వచ్చి తమ దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఆలయ నిర్మాణం మొదలు పెట్టారు. 15 వారు ఈ పనిని, రాజైన దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం, ఆరవ నెల ఇరవై నాల్గవ రోజున ప్రారంభించారు.

యెహోవా ప్రజలను ప్రోత్సహించటం

దేవుడైన యెహోవా వాక్కు ఏడవనెల ఇరవై ఒకటో రోజున హగ్గయికి వినవచ్చింది. ఆ వాక్కు ఇలా చెప్పింది: ఇప్పుడు షయల్తీయేలు కుమారుడు, యూదారాజ్య పాలనాధికారి అయిన జెరుబ్బాబెలుతోను, యెహోజాదాకు కుమారుడు, ప్రధాన యాజకుడు అయిన యెహోషువాతోను, మరియు జనులందరితోను మాట్లాడి ఇలా చెప్పు: “ఈ ఆలయంయొక్క గత వైభవాన్ని చూసినవారు మీలో ఎవ్వరు మిగిలారు? ఇప్పుడు మీకు ఇది ఎలా కనిపిస్తు ఉంది? చాలా సంవత్సరాలక్రితం ఉన్న ఆలయంతో పోల్చిచూస్తే, మీ కండ్లకు ఇప్పటిది ఎందుకూ పనికిరానిదిగా ఉన్నట్లు అనిపిస్తూవుందా?” కాని ఇప్పుడు యెహోవా చెపుతున్నాడు, “జెరుబ్బాబెలూ! అధైర్యపడవద్దు. యెహోజాదాకు కుమారుడు, ప్రధాన యాజకడవునైన యెహోషువా! అధైర్యపడవద్దు. ఈ దేశనివాసులైన మీరందరు అధైర్యపడవద్దు అని యెహోవా చెపుతున్నాడు. ఈ పనిని కొనసాగించండి, ఎందుకంటే, నేను మీతో ఉన్నాను అని సర్వశక్తిమంతుడైన ప్రభువు ఈ విషయాలు చెప్పాడు!

“మీరు ఈజిప్టులోనుండి బయటికి వచ్చినప్పుడు నేను మీతో చేసిన ఒడంబడిక ప్రకారం, నా ఆత్మ మీ మధ్య ఉంది. భయపడవద్దు! ఎందువల్లనంటే సర్యశక్తిమంతుడైన యెహోవా ఇది చెపుతున్నాడు! ‘కొద్ది వ్యవధిలో మరొక్కసారి పరలోకాలను, భూమిని, సముద్రాన్ని, ఎండిన నేలను కంపించేలా చేస్తాను. దేశాలన్నింటినీ కుదిపివేస్తాను. వారంతా, వివిధ దేశాలలోవున్న ధనసంపదతో వస్తారు. అప్పుడు ఈ ఆలయాన్ని మహిమతో నింపుతాను.’ సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెపుతున్నాడు. ‘వెండి నాది. బంగారంనాది.’ సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెపుతున్నాడు. ‘ఈ ప్రస్తుత ఆలయంయొక్క మహిమ మొదటి ఆలయ మహిమకంటె ఇనుమడించి ఉంటుంది.’ సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెపుతున్నాడు. ‘మరియు ఈ ప్రదేశంలో నేను శాంతి నెలకొల్పుతాను అని’ సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు!”

పని ప్రారంభమయింది—ఆశీస్సులు వస్తాయి

10 దర్యావేషు కాలంలో రెండవ సంవత్సరం తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ రోజున దేవుడైన యెహోవా వాక్కు ప్రవక్త అయిన హగ్గయికి ఇలా వినవచ్చింది: 11 “సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు. ధర్మశాస్త్రం వీటిని గురించి ఏమి చెపుతున్నదో ఇప్పుడు యాజకులను అడుగు. 12 ‘ఒకడు తన వస్త్రముల మడతలో పవిత్ర బలి మాంసాన్ని పెట్టుకుని వెళ్లాడనుకో. పవిత్ర మాంసాన్ని ఉంచిన తన వస్త్రం రొట్టెనుగాని, వండిన ఆహారాన్నిగాని, ద్రాక్షారసం, నూనె లేక ఇతర తినుబండారాలనుగాని తాకిందనుకో. అలా ముట్టబడిన పదార్థం పవిత్రమౌతుందా?’ అని”

యాజకులు “కాదు” అని సమాధానమిచ్చారు.

13 పిమ్మట హగ్గయి అన్నాడు: “ఒకడు శవాన్ని ముట్టాడనుకో. అతడు అపవిత్రుడవుతాడు. అతడు గనుక దేన్నయినా ముట్టుకుంటే ఆ వస్తువు అపవిత్రమౌతుందా?”

“అది అపవిత్రమౌతుంది” అని యాజకులు సమాధానమిచ్చారు.

14 పిమ్మట హగ్గయి చెప్పాడు: “దేవుడైన యెహోవా ఇలా చెవుతున్నాడు: ‘ఈ జనులకు సంబంధించినంతవరకూ ఆ విషయం కూడా నిజమే. వాళ్లు నా ముందు అపరిశుద్ధులు, అపవిత్రులు. వాళ్ల చేతులతో తాకినవన్నీ అపరిశుద్ధమైనవి.

15 “‘యెహోవా ఆలయపు పని ప్రారంభించేందుకు ముందు జరిగిన సంగతుల విషయమై ఆలోచించు. 16 ప్రజలు ఇరవై బస్తాల ధాన్యం అవుతుందను కొన్నారు. కాని పది బస్తాల ధాన్యం మాత్రమే కుప్పలో ఉంది. ద్రాక్షారసం ఏభై కొలలు తీసికోటానికి ఒక తొట్టివద్దకు రాగా, వారికి ఇరవై కొలలు మాత్రమే దొరికేవి. 17 ఎందుకంటే నేను మిమ్మల్ని, మీ చేతులు చేసిన వస్తువులను శిక్షించాను. మొక్కలను చీడలతోను, బూజుతోనూ, మిమ్మల్ని వడగండ్లతోను శిక్షించాను. అయినా మీరు నా వద్దకు రాలేదు.’ దేవుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు.

18 “‘ఈ రోజు తొమ్మిదవ నెలలో ఇరవైనాల్గవ దినం. మీరు యెహోవా ఆలయానికి పునాది వేయటం ముగించారు. కావున ఈ రోజునుండి ఏమి జరుగుతుందో చూడండి. 19 గోదాముల్లో ధాన్యం నిలవవుందా? ద్రాక్షాలతలు, అంజూరపుచెట్లు, దానిమ్మ చెట్లు ఇంకను పండ్లనీయటం లేదా? (లేదు). అయితే నేను మిమ్మల్ని ఈ రోజునుండి ఆశీర్వదిస్తాను!’”

20 మళ్లీ తొమ్మిదవనెల, ఇరవై నాలుగవరోజు రెండవ సారి దేవుడైన యెహోవా వాక్కు హగ్గయికి వినవచ్చింది. ఆ వాక్కు ఇలా చెప్పింది: 21 “జెరుబ్బాబెలుకు చెప్పు: పరలోకాన్ని, భూమిని కదుపుతాను. 22 రాజ్యాల సింహాసనాలను తల్లక్రిందులు చేస్తాను. ఆ ఇతర రాజ్యాలవారిని నాశనం చేస్తాను. రథాలను, వాటిమీద ఉన్నవారిని పడదోస్తాను. గుర్రాలు, రౌతులు కూలిపోతారు. ఆ సైన్యాలు ప్రస్తుతం మిత్రులు. కానివాళ్లు ఒకరికొకరు ప్రతికూలులై, కత్తులతో ఒకరినొకరు పొడుచుకొని చంపుకొంటారు.” 23 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెపుతున్నాడు. “షయల్తీయేలు కుమారుడవు, నా సేవకుడవునైన జెరుబ్బాబెలూ, నిన్ను నేను ఎన్నుకొన్నాను. దేవుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు. ఆ సమయాన నేను నిన్నొక ముద్ర వేసే ఉంగరంగా[a] చేస్తాను. (ఈ పనులు నేను చేశానని మీరే ఋజువు.)”

సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెపుతున్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International