Chronological
నాలుగు మృగాల్ని గూర్చి దానియేలుకు కల
7 బెల్షస్సరు[a] బబులోనుకు రాజుగా ఉన్న మొదటి సంవత్సరంలో, దానియేలు ఒక కలగన్నాడు. దానియేలు ఈ దర్శనాలు చూశాడు. అప్పుడతను తన పడకమీద పడుకునివున్నాడు. తాను కలగన్న విషయాల్ని దానియేలు వ్రాశాడు. 2 దానియేలు ఇలా చెప్పాడు: “నేను రాత్రివేళ ఒక దర్శనం చూశాను. అందులో నాలుగు వైపులనుండి గాలి వీచింది. ఆ గాలులకు సముద్రం అల్లకల్లోలంగా ఉండింది. 3 నేను నాలుగు పెద్ద మృగాల్ని చూశాను. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా వున్నాయి. ఆ నాలుగు మృగాలు సముద్రం నుండి పైకి వచ్చాయి.
4 “మొదటి మృగము సింహంవలె ఉండింది. దానికి గ్రద్ద రెక్కలున్నాయి. ఆ మృగాన్ని గమనిస్తూండగా దాని రెక్కలు విరిచివేయబడ్డాయి. అది నేలనుండి పైకి లేచి, మనిషిలాగ రెండు కాళ్లమీద నిలబడింది. దానికి మానవుని మనస్సువంటి మనస్సు ఇవ్వబడింది.
5 “ఆ తర్వాత నా ఎదుట రెండవ మృగాన్ని చూశాను. ఇది ఎలుగుబంటివలె కనిపించింది. ఒక వైపుకి అది లేవనెత్తబడింది. దాని నోట్లో పళ్ల మధ్య మూడు ప్రక్కటెముకలున్నాయి. పైకి లేచి, నీకు కావలసినంత మాంసం తిను” అని దానికి చెప్పబడింది.
6 “తర్వాత నేను చూడగా నా ఎదుట మూడవ మృగము ఉంది. ఇది చిరుతపులిలాగ ఉంది. దానివీపుమీద నాలుగు పక్షి రెక్కలున్నాయి. దీనికి నాలుగు తలలున్నాయి. పరిపాలించే అధికారం దానికి ఇవ్వబడింది.
7 “ఆ తర్వాత, నా దర్శనాలలో రాత్రివేళ చూస్తూండగా నా ఎదుట నాలుగవ మృగము ఉంది. ఇది చాలా ఘోరంగాను, భయంకరంగాను కనిపించింది. అది మహా బలంగా ఉంది. దానికి ఇనుప పళ్లు ఉన్నాయి. ఈ మృగం సమస్తాన్ని ముక్కలుగా చీల్చి మ్రింగుచూ, మిగిలిన దాన్ని తన కాళ్ల క్రింద త్రొక్కుచుండినది. అంతకు మునుపు నేను చూసిన ఇతర మృగాలకంటె ఈ నాలుగవ మృగం భిన్నంగా ఉంది. దీనికి పది కొమ్ములున్నాయి.
8 “ఈ కొమ్ముల విషయం నేను తలస్తూండగా వాటిమధ్యలో ఒక చిన్న కొమ్ము పైకి వచ్చింది. దాని స్థానంలో మొదట ఉన్న మూడు కొమ్ములు కుదురుతో సహా పెరికివేయబడ్డాయి. ఈ చిన్న కొమ్ముమీద మానవ కళ్లలాంటి కళ్లు, డంబాలు పలికేనోరు దానికి ఉన్నాయి.
నాలుగవ మృగం తీర్పు
9 “నేను చూస్తూండగా సింహాసనాలు వేయబడ్డాయి.
మరియు ప్రాచీన రాజు[b] తన సింహాసనమున ఆసీనుడై ఉన్నాడు.
ఆయన వస్త్రాలు మంచులా తెల్లగాను,
ఆయన తల వెంట్రుకలు స్వచ్ఛమైన ఉన్నివలె తెల్లగా ఉండినవి.
ఆయన సింహాసనం అగ్ని జ్వాలలతోను,
ఆ సింహాసనపు చక్రాలు మంటలతోను మండుచున్నవి.
10 ఆయన ఎదుట నుండి
అగ్ని ప్రవాహము బయలు వెళ్లింది.
వేవేల కొలది ఆయనకు సేవ చేస్తూ ఉన్నారు.
కోట్లకొలది ఆయన ఎదుట నిలబడ్డారు.
తీర్పుకై ఆయన న్యాయసభలో
కూర్చుండగా గ్రంథాలు తెరువబడ్డాయి.
11 “చిన్న కొమ్ము గర్వపు మాటలు మాట్లాడుచున్న శబ్దం విని అటు చూశాను. నేను చూస్తుండగా ఆ నాలుగవ మృగం చంపబడింది. దాని శరీరం నాశనం చేయబడింది. అది మండుచున్న మంటల్లోకి త్రోసివేయబడింది. 12 మిగిలిన మృగాల అధికారం వాటినుండి తీసివేయబడింది. కాని కొంతకాలంపాటు అవి నివసించి ఉండడానికి అనుమతి ఇవ్వబడింది.
13 “రాత్రి దర్శనాలలో, మానవ కుమారుని పోలిన ఒక వ్యక్తి రావటం నేను చూశాను. ఆయన ఆకాశంలోని మబ్బులమీద ప్రాచీన రాజు[c] వద్దకు వచ్చి, ఆయన ముందు నిలబడ్డాడు.
14 “మానవ కుమారునివలె కనిపించిన ఆ వ్యక్తికి అధికారం, ప్రభావం, సంపూర్ణ పరిపాలనాధికారం ఇవ్వబడ్డాయి. అందునుబట్టి ప్రజలందరు, అన్ని దేశాలు, ప్రతి భాషకు చెందినవారు ఆయన్ని సేవిస్తారు. ఆయన పరిపాలన ఎప్పటికీ ఉంటుంది. ఆయన రాజ్యం ఎప్పుడూ కొనసాగుతూ ఉంటుంది. అది ఎన్నటికీ అంతం కానిది.
దానియేలు కల భావము
15 “దానియేలు అను నేను నా ఆత్మలో చింతించాను. నేను చూసిన దర్శనాలు నన్ను కలవర పెట్టాయి. 16 అక్కడ నిలబడిన ఒకనిని నేను సమీపించి ఇదంతా ఏమిటని అతన్ని అడిగాను. 17 అందువల్ల, అతను వాటి అర్థాలేమిటో వివరించి చెప్పాడు, ‘నాలుగు మృగాలు నాలుగు రాజ్యాలు.[d] ఆ నాలుగు రాజ్యాలు భూమిమీద ఉద్భవిస్తాయి. 18 కాని మహోన్నతుడైన దేవుని ప్రత్యేక జనులే ఆ రాజ్యాన్ని పొందుతారు. వారా రాజ్యాన్ని ఎల్లప్పుడూ కలిగియుంటారు.’
19 “తర్వాత ఆ నాలుగవ మృగంయొక్క అర్థం తెలుసుకోదలచాను. మిగిలిన మృగాలకంటె నాలుగవ మృగం భిన్నమైంది, మహా భయంకరంగా ఉండింది. దానికి ఇనుప పళ్లు, కంచు గోళ్లు ఉన్నాయి. అది తన బలి పశువుల్ని అన్నింటిని చీల్చి తిని, మిగిలినదాన్ని కాళ్ల క్రింద త్రొక్కి వేసింది. 20 నాలుగవ మృగం తలమీదవున్న పది కొమ్ముల గురించి తెలుసు కోవాలను కున్నాను. అక్కడ పెరిగిన చిన్న కొమ్ము గురించి తెలుసుకోదలిచాను. వాటిలో మూడు కొమ్ముల్ని చిన్న కొమ్ము పెరికివేసింది. ఇతర కొమ్ముల కంటె చిన్న కొమ్ము గొప్పదిగా, నీచంగా కనిపించింది. అది మానవ కన్నులవంటి కన్నులు కలిగియుండినది. అది డంబములు పలుకుతూనే ఉండినది. 21 నేనది గమనిస్తూండగా, ఈ చిన్న కొమ్ము దేవుని ప్రత్యేక జనుల్ని ఎదిరించి వారితో యుద్ధం చేయసాగింది. 22 మరియు ఆ కొమ్ము వారిని చంపుతూ ఉండెను. ప్రాచీన రాజు వచ్చి, న్యాయవిచారణ చేసేంతవరకు అది దేవుని ప్రత్యేక జనుల్ని చంపుచుండెను. ప్రాచీన రాజు చిన్న కొమ్మును గురించి తీర్పు ప్రకటించాడు. ఆ తీర్పు దేవుని ప్రత్యేక జనులకు సహాయము చేసింది. మరియు వారు రాజ్యమును స్వీకరించే సమయము వచ్చింది.
23 “అతను నాకిది వివరించాడు: ‘భూమిమీద అవతరించే నాలుగవ రాజ్యమే ఆ నాలుగవ మృగం. అది యితర రాజ్యాలకు భిన్నంగా వుంటుంది. ఆ నాలుగవ రాజ్యం ప్రపంచమంతట వుండే ప్రజల్ని తన వశం చేసుకొంటుంది. ప్రపంచంలో వుండే రాజ్యాలను అణచివేస్తుంది. 24 ఈ నాలుగవ రాజ్యం నుండి వచ్చే పదిమంది రాజులే పది కొమ్ములు. ఆ పదిమంది రాజులు పోయిన తర్వాత, మరొక రాజు వస్తాడు. తనకు పూర్వం పరిపాలించిన రాజులకంటె ఈ రాజు భిన్నంగా ఉంటాడు. ఇతర ముగ్గురు రాజుల్ని అతను జయిస్తాడు. 25 ఈ ప్రత్యేక రాజు సర్వోన్నతుడైన ఆ దేవునికి విరుద్ధంగా మాట్లాడుతాడు. ఆ రాజు దేవుని ప్రత్యేక జనుల్ని గాయపరచి చంపివేస్తాడు. అంతకు పూర్వమే వున్న సమయాలను, చట్టాలను మార్చివేయడానికి అతను ప్రయత్నిస్తాడు. దేవుని ప్రత్యేక జనులు ఆ రాజు ఆధిపత్యంలో మూడున్నర సంవత్సరాలుంటారు.
26 “‘కాని ఏమి జరగవలెనో, (దేవుని) న్యాయ స్థానమే నిర్ణయిస్తుంది. మరియు ఆ రాజుయొక్క అధికారము తీసివేయ బడుతుంది. వాని రాజ్యం సమూలంగా నాశనమవుతుంది. 27 తర్వాత దేవుని ప్రత్యేక జనులు రాజ్యాన్ని పరిపాలిస్తారు. వారు భూమిమీద సర్వరాజ్యాలను పాలిస్తారు. ఈ రాజ్యం ఎన్నటికీ ఉంటుంది. ఇతర రాజ్యాలకు చెందిన ప్రజలు వారిని గౌరవిస్తారు, సేవిస్తారు.’
28 “ఇదే కలయొక్క ముగింపు. దానియేలు అను నేను చాలా భయపడ్డాను. ఆ భయంవల్ల నా ముఖం పాలిపోయింది. మరియు నేను చూసిన, విన్న విషయాలను నా మనస్సులో ఉంచుకొన్నాను.”
దానియేలు దర్శనం-పొట్టేలుమరియు మేకపోతు
8 బెల్షస్సరు రాజుగా ఉన్న మూడవ సంవత్సరంలో, నాకు ఈ దర్శనము కలిగింది. ఇది మొదటి దర్శనానికి తర్వాత వచ్చింది. 2 ఆ దర్శనంలో నేను షూషనులో ఉన్నట్లు చూశాను. ఏలాం రాష్ట్రంలో షూషను ఒక రాజధాని నగరం. నేను ఊలయి నది ప్రక్క నిలబడి ఉన్నాను. 3 నా కన్నులెత్తి ఊలయి నదికి ప్రక్కగా ఒక పొట్టేలు నిలబడి ఉండడం చూశాను. ఆ పొట్టేలుకి రెండు పొడుగాటి కొమ్ములున్నాయి. కాని ఒకటి మరొకదాని కంటె పొడుగైనది. పొడుగాటి కొమ్ము తర్వాత పుట్టింది. 4 ఆ కొమ్ములతో పొట్టేలు పడమరకి, ఉత్తరానికి, దక్షిణానికి పరుగెత్తడం చూశాను. ఏ మృగమూ పొట్టేలుని ఎదిరించలేక పోయింది. మరియు ఎవ్వరూ దీనినుండి ఇతర జంతువుల్ని కాపాడలేక పోయారు. ఆ పొట్టేలు చేయదలచిందంతా చేస్తూంది. అందువల్ల పొట్టేలు చాలా శక్తివంత మయింది.
5 నేను ఆ పొట్టేలు గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఒక మేకపోతు పడమరనుండి రావడం చూశాను. అది భూమి అంతటా చుట్టి వచ్చింది. దాని కాళ్లు భూమిని కూడా తాకలేదు. ఈ మేకపోతుకు ఒక పెద్ద కొమ్ము దాని కళ్ల మధ్యన ఉంది.
6 ఆ మేకపోతు ఊలయి నదికి ప్రక్కగా నిలబడివున్న రెండు కొమ్ములు గల పొట్టేలు వద్దకు వచ్చింది. మేకపోతు చాలా కోపంగా ఉంది. 7 మేకపోతు పొట్టేలువైపు పరుగెత్తి చాలా కోపంతో కలబడి పొట్టేలు రెండు కొమ్ముల్ని విరుగ కొట్టింది. మేకపోతును పొట్టేలు ఎదిరించలేకపోయింది. మేకపోతు పొట్టేలుని నేలకు పడవేసి దాన్ని త్రొక్కివేసింది. ఆ మేకపోతునుండి పొట్టేలుని కాపాడగలిగినవారెవ్వరూ లేకపోయిరి.
8 అందువల్ల మేకపోతు చాలా బలంగా పెరిగింది. కాని అది శక్తివంతంగా వున్నప్పుడు, దాని పెద్ద కొమ్ము విరిగిపోయింది. తర్వాత ఆ పెద్ద కొమ్ము స్థానంలో నాలుగు వేరే కొమ్ములు మొలిచాయి. ఆ నాలుగు కొమ్ములు ఆకాశపు నాలుగు దిక్కులలో పెరిగాయి.
9 తర్వాత ఆ నాలుగు కొమ్ములలో ఒకదానినుండి ఒక చిన్న కొమ్ము పెరిగి బాగా పెద్దదయింది. అది దక్షిణ దిక్కుగా, తూర్పు దిక్కుగా, సుందర దేశం దిక్కుగా పెరిగింది. 10 ఆ చిన్నకొమ్ము బాగా పెద్దదయి ఆకాశాన్ని అంటేంత వరకు పెరిగింది. అది నక్షత్రాల్ని కూడా క్రిందికి త్రోసి కాళ్ల క్రింద త్రొక్కి వేసింది. 11 ఆ చిన్న కొమ్ము బాగా గర్వించి ఆ నక్షత్రాల సైన్యాధిపతికి ఎదురు తిరిగింది. అది పరిపాలకుని అనుదిన బల్యర్పణాన్ని ఆపివేసి. ఆయన ఆలయాన్ని పడగొట్టింది. 12 తిరుగుబాటు జరిగినందున (పరిశుద్ధుల) సైన్యం మరియు అనుదిన బలి దాని వశం చేయ బడ్డాయి. సత్యం నేలకు అణచి వేయబడింది. చేసిన ప్రతి దానిలో అది బాగా అభివృద్ధి చెందింది.
13 అంతట ఒక పరిశుద్ధుడు మాట్లాడటం విన్నాను. ఇంకొక పరిశుద్ధుడు మొదటి వానిని ఇలా అడిగాడు: “ఈ దర్శనం నెరవేరటానికి ఎంత కాలం పడుతుంది? అనుదిన బలిని గూర్చిన దర్శనం, నాశనం కలిగించు తిరుగుబాటు, పరిశుద్ధ స్థలం మరియు పరిశుద్ధుల సైన్యం కాళ్ల క్రింద త్రొక్కబడటం ఇవన్నియు నెరవేరటానికి ఎంతకాలము పడుతుంది?”
14 అతడు నాతో ఇలా అన్నాడు: “దానికి రెండువేల మూడువందల రోజులు పడతాయి. అప్పుడు పవిత్ర స్థలం తిరిగి పరిశుద్ధం చేయబడుతుంది.”
దానియేలుకి దర్శనం వివరించబడింది
15 దానియేలు అను నేను ఈ దర్శనం చూశాను. అది యేమిటో తెలుసుకోవడానికి నేను ప్రయత్నిస్తూండగా మానవునివంటి ఒకతను నా ఎదుట నిలిచాడు. 16 తర్వాత ఒక మనిషి స్వరం ఊలయి నదిమీదినుంచి ఇలా వినవచ్చింది, “గాబ్రియేలూ, ఈ దర్శనమును ఈ వ్యక్తికి వివరింపుము.”
17 నేను నిలుచుండిన స్థలానికి గాబ్రియేలు రాగా నేను భయభ్రాంతుడనై నేలమీద సాష్టాంగపడ్డాను. గాబ్రియేలు దూత నాతో, “మానవపుత్రుడా!, ఈ దర్శనం అంత్యకాలానికి సంబంధించిందని తెలుసుకో” అని చెప్పాడు.
18 గాబ్రియేలు దూత నాతో మాటలాడుతూ ఉండగా, నేను నేలమీద సాష్టాంగపడి, గాఢనిద్ర పోయాను. అప్పుడు అతను నన్ను తాకి పైకి లేవనెత్తాడు. 19 గాబ్రియేలు దూత ఇలా చెప్పాడు: “శ్రమకాలంపు చివరిలో ఏమి జరుగుతుందో నీకు ఇప్పుడు చెపుతాను. ఈ దర్శనం నియమించబడిన అంత్యకాలానికి సంబంధించింది” అని అన్నాడు.
20 “రెండు కొమ్ములు గల పొట్టేలును నీవు చూశావు. ఆ కొమ్ములు మాదీయ, పారసీక దేశాలు. 21 బొచ్చుగల మేకపోతు గ్రీకు రాజు, దాని కళ్ల మధ్యవున్న పెద్ద కొమ్ము మొదటి రాజు. 22 ఆ కొమ్ము విరిగి పోయింది. ఆ స్థానంలో నాలుగు కొమ్ములు మొలిచాయి. ఆ కొమ్ములు మొదటి రాజు సామ్రాజ్యంనుంచి చీలిన నాలుగు రాజ్యాలు. కాని ఆ నాలుగు రాజ్యాలు మొదటి రాజువలె బలిష్ఠంగా ఉండవు.
23 “ఆ రాజ్యాలకు అంతం సమిపించే సమయాన, వారి దుష్టత్వం నిండినప్పుడు, మొండితనపు ముఖముగలిగి జిత్తులమారి అయిన ఒక రాజు లేస్తాడు. ఈ రాజు తన శక్తి వల్ల కాకుండానే మహా శక్తిమంతుడవుతాడు. 24 ఇతడు భయంకరమైన నాశనాన్ని తెస్తాడు. ఇతడు చేసే ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది. అతను శక్తిమంతులైన మనుష్యుల్ని, చివరికి దేవుని ప్రత్యేక జనుల్ని కూడా నాశనం చేస్తాడు.
25 “ఈ రాజు చాలా మోసగాడు, జిత్తులమారి అయివుండి, తన యుక్తి ఉపయోగించి, వంచనతో గెలుపొందుతాడు. తాను అతి ముఖ్యుడనని భావిస్తాడు. ప్రజలు క్షేమంగా ఉన్నామని తలస్తూన్నప్పుడు ఇతడు చాలా మందిని, రాజాధిరాజును సహితం ఎదిరిస్తాడు. అయినా ఇతడు నాశనం చేయబడతాడు, కాని మానవ శక్తివల్ల కాదు.
26 “ఆ కాలాన్ని గురించి నీకివ్వబడిన దర్శనం నిజమైంది. కాని ఆ దర్శనానికి ముద్ర వేయి. ఎందుకనగా అది అంత్యకాల సంబంధమైనది.”
27 దానియేలు అను నేను అలసిపోయి చాలా రోజలు జబ్బు పడ్డాను. రాజుకు పనిచేసే నిమిత్తం నేను మరల లేచి వెళ్ళాను. కాని నేను ఆ దర్శనాన్ని తలంచుకుని కలతచెందాను. కాని దాని అర్థమేమిటో నాకు తెలియలేదు.
దానియేలు ప్రార్థన
9 మాదీయుడైన అహష్వేరోషు కుమారుడగు దర్యావేషు బబులోను రాజ్యానికి రాజైన మొదటి సంవత్సరంలో జరిగిన సంగతి ఇది. 2 దర్యావేషు రాజుగా ఉండిన మొదటి సంవత్సరంలో, దానియేలు అను నేను, దేవుని ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా వ్రాయించిన సంగతిని గ్రహించాను. ఏమనగా యెరూషలేము డెబ్బై సంవత్సరాలు పాడుబడినదిగా ఉండవలసిన సమయము పూర్తి అవుతూందని గ్రహించాను.
3 తర్వాత నేను గోనెపట్ట ధరించి, బూడిదలో కూర్చొని ఉపవాసముండి నా ప్రభువైన దేవునికి నా మనవిని ప్రార్థన విజ్ఞాపన ద్వారా తెలియపర్చుకొన్నాను. 4 నా దేవుడైన యెహోవాకు ప్రార్థించి నా పాపములన్నిటినీ ఒప్పుకొన్నాను.
“ప్రభువా! నీవు భయంకరుడవైన మహా దేవుడవు. నిన్ను ప్రేమించి, నీ ఆజ్ఞలకు లోబడే ప్రజలపట్ల నీ ఒడంబడికను నెరవేరుస్తావు.
5 “ప్రభువా! మేము పాపాలు చేశాము. మేము చెడ్డ పనులు చేసి నీకు విరుద్ధంగా ప్రవర్తించాము. మేము నీ ఆజ్ఞలకు, నీ విధులకు అవిధేయులమయ్యాం. 6 ప్రవక్తలు నీ తరపున మా రాజులతోను, నాయకులతోను, మా తండ్రులతోను, దేశంలోని ప్రజలందరితోను మాట్లాడారు. మేము నీ సేవకులైన ప్రవక్తల మాటలు వినలేదు.
7 “ప్రభువా, నవు నీతిమంతుడవు. మేము అనగా యూదా, యెరూషలేము ప్రజలు, మా పితరులు నీకు ద్రోహము చేసిన కారణాన దూర, సమీప దేశాలకు చెదరగొట్టబడిన ఇశ్రాయేలువారమైన మేము ఈ దినాన సిగ్గు పడవలసినవారమై యున్నాము.
8 “ప్రభువా! మా రాజులు, నాయకులు, మా పూర్వీకులు నీకు విరోధంగా పాపం చేసినందువల్ల మేము సిగ్గు పడవలసినవారమైతిమి.
9 “ప్రభువు దయామయుడు, క్షమాపణా స్వభావం గలవాడు. అయినను మేము నిజంగానే నీకు విరుద్ధంగా పాపం చేశాము. 10 మేము మా దేవుడైన యెహోవా మాటలు పాటించలేదు. తన సేవకులైన ప్రవక్తలద్వారా యెహోవా మాకు ప్రసాదించిన ఆ చట్టాలను అతిక్రమించాము. 11 ఇశ్రాయేలు ప్రజలు నీ బోధనలకు విధేయులు కాకుండా వారందరూ నీకు విముఖులయ్యారు. దేవుని సేవకుడైన మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన శాపాలు, ప్రమాణాలు మా మీద క్రుమ్మరించ బడ్డాయి. ఎందుకంటే, మేము నీ యెడల పాపం చేశాము
12 “దేవుడు మాకును, రాజులకును విరోధంగా పలికిన మాటలు మా యెడల జరిగేటట్లు చేశాడు. ఎలాగనగా ఆకాశం క్రింద ముందెన్నడూ జరుగని మహా విపత్తును యెరూషలేము యెడల జరిగించుట ద్వారా మాపై ఈ శిక్షను విధించాడు. 13 ఆ భయంకర విషయాలన్నీ మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్లుగానే మాకు జరిగాయి. మేము మా పాపాలు మాని, ఆయన సత్యాన్ననుసరించి నడుచుకొని, ప్రభువు దయను పొందేటట్లు ప్రయత్నించలేదు. 14 ప్రభువు మా మీదికి నాశనాన్ని రప్పించటానికి వెనుకాడలేదు. ఎందుకంటే మా దేవుడైన ప్రభువు ఈ కార్యాలన్నిటిలో నీతిమంతుడు. కాని మేము ఆయనకు విధేయులం కాలేదు.
15 “మా దేవుడవైన యెహోవా, నీవు నీ మహాశక్తివల్ల నీ ప్రజల్ని ఈజిప్టునుండి వెలుపలికి తెచ్చావు. అందువలననే నీవీనాటికినీ నీ నామాన్ని గొప్పదిగా చేశావు. కాని మేము చెడుగా ప్రవర్తించి పాపం చేశాము. 16 దేవా, నీ నీతి క్రియలను దృష్టిలో ఉంచుకొని, పరిశుద్ధ పట్టణంపట్ల, యెరూషలేంపట్ల నీ కోపాన్ని మానుము. మా పాపాలవల్ల, మా పూర్వీకుల అపరాధాలవల్ల యెరూషలేము, నీ ప్రజలు మా పొరుగువారి మధ్యలో అవమానం పాలైరి.
17 “కాబట్టి మా దేవా! ఇప్పుడు, నీ సేవకుడనైన నా ప్రార్థన, మనవి ఆలకించుము. నీ నామం కొరకు, ప్రభువా! నీ ముఖకాంతి పాడుబడిన నీ పరిశుద్ధ స్థలంమీద ప్రకాశించుగాక! 18 నా దేవా, నీ చెవి వంచి నా ప్రార్థన వినుము! నీ కన్నులు తెరిచి, పాడుబడిన, నీ పేరు పెట్టబడిన ఈ నగరముపైన నీ దృష్టినుంచుము. మేము నీతిమంతులమని కాదుగాని, నీవు కృపామయుడవని నీకు మొర పెట్టుచున్నాము. 19 ప్రభువా! నా మొర ఆలకించు. ప్రభువా! మమ్ము మన్నించుము. ప్రభువా, మా ప్రార్థన విని, సహాయం చేయి. నా దేవా! ఆలస్యం చేయవద్దు. నా దేవా, నీ నామ మహిమ కొరకు నీ పట్టణం, నీ ప్రజలు నీ పేరును ధరించియున్నారు.”
డెబ్బై వారాల దర్శనం
20 నేనింకా మాట్లాడుచూ, ప్రార్థిస్తూ, నా పాపాన్ని గురించి, ఇశ్రాయేలు పాపాలను గురించి ఒప్పుకుంటూ ఉంటిని. నా దేవుని పరిశుద్ధ పర్వతాన్ని గురించి ప్రభువైన నా దేవునికి ప్రార్థిస్తూ ఉంటిని. 21 నేను ప్రార్థన చేస్తూ ఉండగా నా దర్శనంలో ఇంతకు ముందు నేను చూసిన గాబ్రియేలు దూత త్వరగా సాయంకాలపు బలియర్పణ సమయాన వచ్చాడు. 22 అతడు వచ్చి, నాతో ఇలా చెప్పాడు: “దానియేలూ, నేను నీకు వివేకము, గ్రహింపు ఇవ్వడానికి వచ్చాను. 23 నీవు ప్రార్థన చేయడానికి మొదలు పెట్టినప్పుడు దాని సమాధానం నాకు యివ్వబడింది. దాన్ని నేను నీకు చెప్పడానికి వచ్చాను. ఎందుకంటే నీవు దేవునికి ప్రియమైన వాడవు. కాబట్టి నా మాట విని దర్శనాన్ని అర్థం చేసుకో.
24 “నీ ప్రజలకు, నీ పవిత్ర నగరానికి డెబ్బై వారాల గడువు ఇవ్వబడింది: అనగా అతిక్రమాన్ని ముగించటానికి, పాపాన్ని అంతం చేయటానికి, అపరాధాన్ని ప్రాయశ్చిత్తం చేయటానికి, నీతిని శాశ్వతంగా తేవటానికి, దర్శనాన్ని, ప్రవచనాన్ని ముద్రించటానికి మరియు పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించటానికి డెబ్బై వారాలు పడుతుంది.
25 “కాబట్టి ఈ విషయం తెలుసుకొని గ్రహించుకో. యెరూషలేమును తిరిగి కట్టమని సందేశం బయలు వెళ్లిన సమయంనుండి, అభిషేకింపబడిన రాజు వరకు ఏడు వారాలు మరియు అరవైరెండు వారాలు. యెరూషలేము రాజవీధులతోను, కందకములతోను మరల కట్టబడుతుంది, కాని కష్ట సమయాల్లో అది కట్టబడుతుంది. 26 అరవై రెండు వారాల తర్వాత అభిషేకింపబడిన రాజు[e] చంపబడతాడు. అప్పుడు రాబోయే రాజుయొక్క ప్రజలు నగరాన్ని, పరిశుద్ధ స్థలాన్ని నాశనం చేస్తారు. దాని అంతం ఒక ప్రళయంతో వస్తుంది. అంతం వరకు యుద్ధం కొనసాగుతుంది. నాశనాలు జరగటానికి ఆజ్ఞాపించబడ్డాయి.
27 “ఒక వారంపాటు రాబోయే రాజు చాలామందితో ఒక స్థిరమైన ఒప్పందం చేస్తాడు. అర్ధవారంకు బలి అర్పణలు నిలుపు చేస్తాడు. అసహ్య కార్యాలు జరిగించే (దేవాలయములో) నాశనకారుడు ఒకడు వస్తాడు. ఆజ్ఞా పించబడిన అంతము ఈ నాశనకారుని మీద క్రుమ్మరించబడేవరకు ఈ విధముగా జరుగుతుంది”
© 1997 Bible League International