Chronological
పాలకుడు-పండుగలు
46 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, “లోపలి ఆవరణ తూర్పు ద్వారం ఆరు పని రోజులలోను మూసి ఉంచబడుతుంది. కాని అది సబ్బాతు రోజున, అమావాస్య రోజున తెరువబడుతుంది. 2 పాలకుడు ద్వారం మండపం గుండా లోనికి ప్రవేశించి, ద్వారం ప్రక్కన నిలబడతాడు. తరువాత యాజకులు పాలకుని తరుపున దహనబలి, సమాధాన బలులు సమర్పిస్తారు. ద్వారం గడపవద్దనే పాలకుడు ఆరాధించాలి, మరియు నమస్కరించాలి. అతడు బయటికి వెళతాడు. కాని సాయంత్రం వరకు ద్వారం మూయబడదు. 3 సబ్బాతు రోజులలోను, అమావాస్యలందు సాధారణ ప్రజలు కూడ యెహోవా ముందు ద్వారం తెరవబడిన దగ్గర పూజలు చేస్తారు.
4 “సబ్బాతు దినాన పాలకుడు యెహోవాకు దహన బలులు అర్పిస్తాడు. ఏ దోషమూలేని ఆరు గొర్రెపిల్లలను, ఏ దొషమూలేని ఒక పొట్టేలును అతడు సమకూర్చాలి. 5 పొట్టేలుతో పాటు ఒక ఏఫా (తొమ్మిది మానికెలు) ధాన్యాన్ని కూడ అతడు తప్పక ఇవ్వా్లి. పాలకుడు ధాన్యార్పణకు గొర్రె పిల్లలతో పాటు తను ఇవ్వగలిగినంత ఇస్తాడు. ప్రతి తొమ్మిది మానికెల (ఏఫా) ధాన్యానికి మూడు పడుల (ఒక గాలను) ఒలీవ నూనెను అతడు తప్పక ఇవ్వాలి.
6 “అమావాస్యనాడు ఏ దోషమూలేని ఒక కోడెదూడను అతడు తప్పక అర్పించాలి. ఏ దోషమూలేని ఆరు గొర్రె పిల్లలను, ఒక పొట్టేలును అతడు అర్పిస్తాడు. 7 కోడెదూడతో పాటు ఒక తూమెడు ధాన్యార్పణను, పొట్టేలుతో పాటు పాలకుడు తప్పక అందించాలి. గొర్రె పిల్లతోపాటు పాలకుడు తన శక్తికొలది సమర్పణలు ఇవ్వవచ్చు. ప్రతి తూమెడు ధాన్యానికి మూడు పడుల (ఒక గాలను) నూనె చొప్పున సమర్పించాలి.
8 “పాలకుడు వచ్చి తూర్పు ద్వారంలో గల మండపం ద్వారా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించాలి. బయటకు కూడా వెళ్లిపోవాలి.
9 “ప్రత్యేక పండుగల సందర్భంలో దేశ ప్రజలు యెహోవా దర్శనార్థం వచ్చినప్పుడు, వారు ఉత్తర ద్వారం గుండా ఆరాధనకు వచ్చి దక్షిణ ద్వారం గుండా నేరుగా బయటకు వెళ్లాలి. దక్షిణ ద్వారం గుండా ప్రవేశించిన వ్యక్తి ఉత్తర ద్వారం గుండా బయటకు వెళ్లాలి. ఏ వ్యక్తీ ప్రవేశించిన ద్వారం గుండా బయటకు వెళ్లరాదు. ప్రతి ఒక్కడూ తిన్నగా బయటకు సాగి పోవాలి. 10 ప్రజలు లోపల ప్రవేశించినప్పుడు, వారితో పాటు పాలకుడు లోనికి వెళతాడు. వారితో పాటు పాలకుడు బయటకు వెళ్లాలి.
11 “విందులప్పుడు, ప్రత్యేక సమావేశాల సమయాలలోను ప్రతి కోడెదూడతోను తొమ్మిది మానికెల (ఒక ఏఫా) ధాన్యార్పణ తప్పక చేయాలి. ప్రతి పొట్టేలుతోను, తొమ్మిది మానికెల ధాన్యార్పణ చేయాలి. ప్రతి గొర్రె పిల్లతోను అతడు తన శక్తి కొలదీ ధాన్యాన్ని అర్పించాలి. ప్రతి తొమ్మిది మానికెల ధాన్యంతో పాటు మూడు పడుల (ఒక గాలను) నూనెను సమర్పించాలి.
12 “పాలకుడు తను స్వంతంగా దహనబలులు గాని, సమాధాన బలులుగాని తన ఇష్టపూర్వక అర్పణ (స్వేచ్చార్పణ) గాని యెహోవాకు ఇవ్వదలచినప్పుడు అతనికోసం తూర్పు ద్వారం తెరువబడుతుంది. అప్పుడు తను విశ్రాంతి రోజున అర్పించినట్లు తన దహనబలిని, సమాధానబలిని అర్పిస్తాడు. అతడు వెళ్లినాక తిరిగి ద్వారం మూయబడుతుంది.
అనుదిన అర్పణ
13 “మరియు మీరు ఏ దోషమూలేని ఒక ఏడాది వయస్సుగల గొర్రె పిల్లను ఇవ్వాలి. అది యెహోవాకు ప్రతి రోజూ దహనబలిగా ఇవ్వబడుతుంది. దానిని అనుదినం ఉదయం సమర్పించాలి. 14 ప్రతిరోజూ ఉదయం గొర్రె పిల్లతో పాటు ధాన్యార్పణ కూడ ఇవ్వాలి. ఇందు నిమిత్తం తూమెడు గోధుమ పిండిలో (ఏఫా) ఆరవ వంతు, ఆ సన్నపు పిండిని కలపటానికి ఒక పడి (గాలనులో మూడివ వంతు) నూనెను ఇవ్వాలి. ఇది యెహోవాకు అనుదిన ధాన్యార్పణ. ఇది శాశ్వతంగా పాటింపబడుతుంది. 15 ఆ విధంగా వారు గొర్రె పిల్లను, ధాన్యార్పణను, నూనెను ప్రతి ఉదయం ఎప్పటికీ దహన బలిగా ఇవ్వాలి.”
పాలకుడు భూమిని స్వతంత్రించుకొను నియమాలు
16 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “రాజ్యాధిపతి తన కుమారులలో ఎవరికైనా తన భూమిలో కొంత భాగం కానుకగా ఇస్తే అది అతని కుమారులకు చెందుతుంది. అది వారి ఆస్తి. 17 ఒకవేళ పాలకుడు తన భూమిలో కొంత భాగాన్ని ఒక బానిసకు బహుమానం ఇస్తే, అది వాడు స్వేచ్చపొందే సంవత్సరం[a] వరకే వానికి చెందుతుంది. పిమ్మట ఆ బహుమానం రాజుకు తిరిగి వస్తుంది. కేవలం రాజు కుమారులు మాత్రమే అతను బహుమానం చేసిన భూమిని ఉంచుకుంటారు. 18 మరియు పాలకుడు ప్రజల భూమిని తన వశం చేసుకోడు. వారు భూమిని వదిలిపొమ్మని ఒత్తడి కూడ చేయడు. అతడు తన స్వంత భూమిలో కొంత భాగాన్ని మాత్రమే తన కుమారులకు ఇవ్వాలి. ఆ విధంగా నా ప్రజలు తమ భూమిని పోగొట్టుకునేలాగ రాజుచేత బలవంత పెట్టబడరు.”
ప్రత్యేక వంటగదులు
19 ఆ మనుష్యుడు నన్ను ద్వారం ప్రక్కనున్న మార్గం గుండా నడిపించాడు. ఉత్తర దిశన ఉన్న యాజకుల పవిత్ర గదుల వద్దకు నన్ను నడిపించాడు. అక్కడ బాగా పడమటికి ఉన్న ఒక స్థలాన్ని చూశాను. 20 ఆ మనుష్యుడు నాతో ఇలా అన్నాడు: “ఇక్కడే యాజకులు దోష బలి సమర్పణను, పాపపరిహారార్థ బలి సమర్పణను పెడతారు. ఇక్కడే యాజకులు ధాన్యార్పణలను (రొట్టె) కాల్చుతారు. ఈ విధంగా చేయటం వలన వారీ అర్పణ పదార్థాలను బయటి ఆవరణలోనికి తెచ్చే అవసరముండదు. కావున వారీ పవిత్ర పదార్థాలను సామాన్య ప్రజలు ఉండే చోటుకి తీసుకొనిరారు.”
21 తరువాత ఆ మనుష్యుడు నన్ను బయటి ఆవరణలోనికి తీసుకొని వచ్చాడు. అతడు నన్ను ఆవరణ నాలుగు మూలలకు నడిపించాడు. ఆవరణలో ప్రతి మూలా మరో చిన్న ఆవరణ ఉంది. 22 ఆవరణ యొక్క నాలుగు మూలలలోనూ చిన్న ఆవరణలు ఉన్నాయి. ప్రతి చిన్న ఆవరణ నలభై మూరలు పొడుగు ముప్పై మూరలు వెడల్పు కలిగి వుండెను. నాలుగు మూలలూ ఒకే కొలతలో ఉన్నాయి. 23 లోపల నాలుగు చిన్న ఆవరణాల్లోనూ ప్రతి ఒక్కదాని చుట్టూ ఒక ఇటుక గోడ ఉంది. నాలుగు చిన్న ఆవరణల్లోను గోడలకు అటకలు నిర్మింపబడ్డాయి. ఇటుక గోడల్లో వంటకు పొయ్యిలు కట్టబడ్డాయి. 24 “ఆలయంలో సేవ చేసే వారు ఈ పాకశాలల్లోనే ప్రజల కొరకు బలి మాంసాన్ని ఉడక బెడతారు” అని ఆ మనుష్యుడు నాకు చెప్పాడు.
ఆలయంనుంచి పారే నీరు
47 ఆ మనుష్యుడు నన్ను మళ్లీ ఆలయ ద్వారంవద్దకు నడిపించాడు. ఆలయ తూర్పు గుమ్మం క్రిందనుంచి నీరు బయటకు రావటం చూశాను. (ఆలయ ముఖద్వారం తూర్పునకే ఉంది) బలిపీఠానికి దక్షిణంగా ఉన్న ఆలయ దక్షిణపు భాగం చివరి నుండి నీరు ప్రవహిస్తూ ఉంది. 2 ఆ మనుష్యుడు నన్ను ఉత్తర ద్వారం గుండా బయటికి తీసుకొని వచ్చి ఆ తరువాత తూర్పున ఉన్న వెలుపలి ద్వారం బయట చుట్టూ తిప్పాడు. ఆలయ దక్షిణ భాగాంలో నీరు బయటికి వస్తూఉంది.
3 ఆ మనుష్యుడు ఒక కొలత బద్ద పట్టుకొని నూరు మూరలు కొలిచాడు. అక్కడ నీళ్లను దాటమని అతడు నాకు చెప్పాడు. నీళ్లు చీలమండలవరకు వచ్చాయి. 4 అతడు మరో ఐదు వందల ఎనభై ఆరు గజాల రెండడుగుల దూరం కొలిచాడు. మళ్లీ ఆ ప్రదేశంలో నీళ్లలో నడవమని అతడు నాకు చెప్పాడు. అక్కడ నీరు నా మోకాళ్ల వరకు వచ్చింది. మరో వెయ్యి మూరలు కొలిచాడు. అక్కడ నీళ్లలోనుండి నడవమని అతడు నాకు చెప్పాడు. అక్కడ నీరు నా మొలలోతు వచ్చింది. 5 ఆ మనిషి మరో వెయ్యి మూరలు కొలిచాడు. కాని అక్కడ నీరు దాటలేనంత లోతుగా ఉంది. అది ఒక నది అయింది. నీరు ఈదటానికి అనువైన లోతున ఉంది. అది దాట శక్యముగానంత లోతైన నది అయ్యింది. 6 “నరపుత్రుడా, నీవు చూచిన విషయాలను శ్రద్ధగా పరిశీలించావా?” అని ఆ మనుష్యుడు నన్నడిగాడు.
పిమ్మట నది ప్రక్కగా ఆ మనుష్యుడు నన్ను తిరిగి వెనుకకు తీసుకొని వచ్చాడు. 7 నేను నది ప్రక్కగా తిరిగి వస్తూ వుండగా నీటికి రెండు ప్రక్కలా రకరకాల చెట్లు చూశాను. 8 ఆ మనుష్యుడు నాతో ఇలా అన్నాడు: “ఈ నీరు తూర్పుగా అరబా లోయలోకి ప్రవహిస్తూ ఉంది. ఈ నీరు మృత సముద్రంలోకి ప్రవహించటంతో, దానిలోని నీరు మంచినీరై శుభ్ర పడుతూ ఉంది.[b] 9 ఈ నీటిలో చేపలు విస్తారంగా వుంటాయి. ఈ నది ప్రవహించే ప్రాంతంలో అన్ని రకాల జంతువులు నివసిస్తాయి. 10 ఏన్గెదీ పట్టణం నుండి ఏనెగ్లాయీము పట్టణం వరకు బెస్తవాళ్లు నది ఒడ్డున నిలబడి ఉండటం నీవు చూడగలవు. వారు తమ వలలు విసరి రకరకాల చేపలు పట్టటం నీవు చూడవచ్చు. మధ్యధరా సముద్రంలో ఎన్ని రకాల చేపలు వుంటాయో మృత సముద్రంలో అన్ని రకాల చేపలు ఉంటాయి. 11 కాని అక్కడి పర్రలు, మరియు కొద్దిగానున్న తడి ప్రదేశాలు మంచి భూమిగా మారవు. అవి ఉప్పు తయారు చేయటానికి వదిలివేయబడతాయి. 12 అన్ని రకాల పండ్ల జాతి మొక్కలు నదికి ఇరు ప్రక్కల పెరుగుతాయి. వాటి ఆకులు ఎన్నడూ ఎండవు. ఆ చెట్లు పండ్లు ఇవ్వకుండా ఎప్పుడూ ఉండవు. ప్రతినెలా అవి పండ్లు ఇస్తూనే ఉంటాయి. చెట్లకు కావలసిన నీరు ఆలయం నుండి వస్తూ ఉంటుంది గనుక ఇలా జరుగుతుంది. చెట్ల నుండి లభించే పండ్లు ఆహారం నిమిత్తమూ, ఆకులు ఔషధాలకూ వినియోగపడతాయి.”
ఇశ్రాయేలు వంశీయుల మధ్య భూమి విభజన
13 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఇశ్రాయేలులోని పన్నెండు వంశ తెగలకు దేశాన్ని పంచే సరిహద్దులు ఇవి: యోసేపుకు రెండు భాగాలు. 14 మీరు దేశాన్ని సమానంగా పంచుకోవాలి. ఈ దేశాన్ని ఇస్తానని మీ పూర్వీకులకు నేను ప్రమాణం చేశాను. కావున ఇది మీకు నేను ఇస్తున్నాను.
15 “దేశ సరిహద్దులు ఇవి: ఉత్తరాన మధ్యధరా సముద్రం నుండి మొదలై హెత్లోను మార్గం ద్వారా హమాతు మార్గం వద్ద మలుపు తిరిగి తరువాత జెదాదుకు 16 బేరోతాయునకు, హాజేరు హమాతుకు పొలి మేరన గల సిబ్రయీము మరియు హవ్రానుకు పొలి మేరనగల దమస్కు హత్తికోను వరకు. 17 అలా సముద్రం నుండి హసరేనాను వెళ్లి ఉత్తర పొలిమేరలోని దమస్కు మరియు హమాతు వరకూ వ్యాపించింది. ఇది ఉత్తర సరిహద్దు.
18 “తూర్పు సరిహద్దు హసరేనాను నుండి మొదలై హవ్రాను, దమస్కుల మధ్యగా యొర్దాను నది ప్రక్కగా గిలాదు, ఇశ్రాయేలు భూభాగాల మధ్యగా తూర్పు సముద్ర తీరం వెంబడి తామారు వరకు వ్యాపించింది. ఇది తూర్పు సరిహద్దు.
19 “దక్షిణ సరిహద్దు తామారు నుండి మెరీబా కాదేషు ఊటల వరకు ఉంది. అది అక్కడ నుండి ఈజిప్టు వాగు ప్రక్కగా మధ్యధరా సముద్రం వరకు వ్యాపించింది. ఇది దక్షిణ సరిహద్దు.
20 “పశ్చిమాన లేబో-హమాతు వరకు మధ్యధరా సముద్ర తీరమంతా సరిహద్దుగా ఉంటుంది. ఇది మీ పడమటి సరిహద్దు.
21 “మీరీ దేశాన్ని ఇశ్రాయేలు తెగలకు విభజించాలి. 22 దీనిని మీరు ఆస్తిలా మీ మధ్య, మీ మధ్య నివసించే పరదేశీయులకు, మీలో ఉంటూ పిల్లలు కన్న వారికి మధ్య పంచియివ్వాలి. ఈ పరదేశీయులు దేశపౌరులే. వారు సహజంగా ఇక్కడ పుట్టి పెరిగిన ఇశ్రాయేలీయుల మాదిరే ఉంటారు. ఇశ్రాయేలు తెగలకు చెందిన భూమినుండి మీరు వారకి కొంత భూమిని విభజిస్తారు. 23 ఆ పౌరుడు ఏ తెగలో నివసిస్తూవుంటాడో అది అతనికి కొంత భూమిని ఇవ్వాలి.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు!
48 1-7 “ఉత్తర సరిహద్దు మధ్యధరా సముద్రం నుండి తూర్పుకు సాగి హెత్లోనుకు, హమాతు కనుమ వరకు వెళ్లి, అక్కడ నుండి హసరేనాను వరకు ఉంది. ఇది దమస్కు (డెమాస్కస్)కు, హమాతుకు సరిహద్దు మీద ఉంది. ఆయా వంశాలకు లభించే భూమి తూర్పునుండి పడమటివరకు వెళుతుంది. ఉత్తరాన్నుండి దక్షిణానికి ఈ ప్రదేశంలో గల తెగలు (గోత్రాలు) ఏవనగా: దాను, ఆషేరు, నఫ్తాలి, మనష్షే, ఏఫ్రాయిము, రూబేను మరియు యూదా.
ప్రత్యేక భూభాగం
8 “మిగిలిన భూభాగం ప్రత్యేక వినియోగాలకు కేటాయించ బడింది. మిగిలిన భాగం యూదా యొక్క భాగానికి దక్షిణాన ఉంది. ఈ ప్రదేశం ఉత్తరాన ఇరవై ఐదువేల మూరల పొడఉంది. మరియు పడమట పది వేల మూరల వెడల్పు, తూర్పున పదివేల మూరల వెడల్పు, దక్షిణాన ఇరవై ఐదువేల మూరల వెడల్పు ఉంటుంది. ఆలయం ఈ విభాగం మధ్యలోవుంటుంది. 9 ఈ భూమిని మీరు దేవునికి అంకితం చేస్తారు. దాని పొడవు ఎనిమిది మైళ్ల ఐదువందల ఇరవై ఎనిమిది గజాలు; దాని వెడల్పు ఆరు మైళ్ల పదివందల ఏబది ఆరు గజాలు. 10 ఈ ప్రత్యేక భూ విభాగం యాజకులు, లేవీయుల మధ్య పంచబడుతుంది.
“ఈ ప్రదేశంలో యాజకులకు ఒక వంతు వస్తుంది. ఈ భూమి ఉత్తర దిశన ఎనిమిది మైళ్ల ఐదు వందల ఇరవై ఎనిమిది గజాల పొడవు ఉంది. పశ్చిమ దిశన మూడు మైళ్ల ఐదువందల ఇరవై ఎనిమిది గజాల వెడల్పు ఉంది; తూర్పున మూడు మైళ్ల ఐదువందల ఇరవై ఎనిమిది గజాలు; దక్షిణ దిశన ఎనిమిది మైళ్ల ఐదువందల ఇరవై ఎనిమిది గజాల పొడఉంది. యెహోవా ఆలయం ఈ ప్రదేశపు మధ్య భాగంలో ఉంటుంది. 11 ఈ భూమి సాదోకు సంతతివారికి ఇవ్వ బడుతుంది. ఈ మనుష్యులు నా పవిత్ర యాజకులుగా ఉండటానికి ఎంపిక చేయబడ్డారు. ఎందువల్లనంటే ఇతర ఇశ్రాయేలీయులు నన్ను వదిలిపెట్టినప్పుడు కూడా వీరు నన్ను భక్తి శ్రద్ధలతో కొలిచారు. లేవీయులు చేసినట్లు సాదోకు సంతతి నన్ను విడిచిపెట్టలేదు. 12 అందుచే ఈ పవిత్ర భూమిలో ఈ ప్రత్యేక విభాగం ఈ యాజకుల కొరకు ప్రత్యేకించబడింది. ఇది లేవీయుల భూమికి ప్రక్కనే ఉంటుంది.
13 “యాజకుల భూమి ప్రక్కన లేవీయులకు భూమిలో భాగం వుంటుంది. దాని పొడవు ఇరవై ఐదువేల మూరలు వెడల్పు పదివేల మూరలు గలది. వాళ్లు ఈ భూమి యొక్క పూర్తి పొడవు వెడల్పుల వరకూ తీసుకొంటారు-అనగా పొడవు ఇరవై ఐదువేల మూరలు, వెడల్పు ఇరవైవేల మూరలు. 14 లేవీయులు ఈ భూమిలో ఏ భాగంతోనూ వ్యాపారం చేయకూడదు. వారీ భూమిలో ఏ భాగాన్నీ అమ్మలేరు. దేశంలో ఈ భాగాన్ని వారు విడగొట్టకూడదు. ఎందువల్లనంటే ఈ భామి యెహోవాకు చెందినది. ఇది చాలా ప్రత్యేకమైనది. ఇది దేశంలో మిక్కిలి మంచి భాగం.
నగర ఆస్తిలో వాటాలు
15 “యాజకులకు, లేవీయులకు ఇచ్చిన భూమిని ఆనుకొని ఐదువేల మూరల వెడల్పు, ఇరవై ఐదువేల మూరల పొడవు గల ఒక స్థలం ఉంటుంది. ఈ స్థలం నగరానికి, పశువులు తిరిగి మేయటానికి, ఇండ్లు కట్టటానికి ఉపయోగపడుతుంది. సామాన్య ప్రజలు ఈ స్థలాన్ని వినియోగించుకుంటారు. నగరం దీని మధ్యలో వుంటుంది. 16 నగర కొలతలు ఇలా ఉన్నాయి, ఉత్తరాన నాలుగువేల ఐదువందల మూరలు, దక్షిణాన నాలుగువేల ఐదువందల మూరలు, తూర్పున నాలుగువేల ఐదువందల మూరలు, పడమట నాలుగువేల ఐదువందల మూరలు. 17 నగరానికి పచ్చిక బీడులు వుంటాయి. ఈ పచ్చిక బీడులు ఉత్తరాన రెండువందల ఏభై మూరలు, దక్షిణాన రెండువందల ఏభై మూరలు. తూర్పున రెండువందల ఏభై మూరలు, పడమట రెండువందల ఏభై మూరలు కలిగి వుంటాయి. 18 పవిత్ర ప్రదేశం పొడవు ప్రక్కగా వదిలిన స్థలం తూర్పున పదివేల మూరలు, పడమట పదివేల మూరలు. ఈ స్థలం పవిత్ర ప్రదేశం ప్రక్కన పొడవునా ఉంటుంది. నగర కార్మికులకు ఈ స్థలంలో ఆహార ధాన్యాలు పండుతాయి. 19 నగరంలో పనిచేసే కార్మికులు ఈ భూమిని సాగుచేస్తారు. ఇశ్రాయేలు తెగలన్నిటిలో నుండి ఈ పనివారు వస్తారు.
20 “ఈ ప్రత్యేక భూభాగం నలుదిశలా చదరంగా వుంటుంది. దాని పొడవు వెడల్పులు ఒక్కొక్కటి ఇరవై ఐదువేల మూరలు చొప్పున ఉన్నాయి. దాని ప్రత్యేక అవసరాల కొరకే ఈ భూమిని ఉంచాలి. ఒక భాగం యాజకులకు. ఒక భాగం లేవీయులకు. ఒక భాగం నగరానికి చెంది ఉండవలెను.
21-22 “ఆ ప్రత్యేక భూమిలో ఒక భాగం దేశపాలకునికి చెందుతుంది. ఆ ప్రత్యేక భూమి నలుదిశలా చదరంగా ఉంది. దాని పొడవు, వెడల్పులు ఒక్కొక్కటి ఇరవై ఐదువేల మూరల చొప్పున ఉన్నాయి. ఈ ప్రత్యేక భూమిలో ఒక భాగం యాజకులకు, ఒక భాగం లేవీయులకు, మరొక భాగం ఆలయానికి చెందుతాయి. ఆలయం ఈ స్థలంలో మధ్యగా వుంటుంది. మిగిలిన భాగం దేశపాలకునికి చెందుతుంది. బెన్యామీనీయుల సరిహద్దుకు, యూదా వారి సరిహద్దుకు మధ్యగావున్న ప్రాంతం రాజ్యాధిపతికి చెంది ఉంటుంది.
23-27 “ఈ ప్రత్యేక భూమికి దక్షిణంగా వున్న భూమి యొర్దాను నదికి తూర్పున నివసించే తెగల (గోత్రాలు) వారికి చెందుతుంది. తూర్పు సరిహద్దు నుండి మధ్యధరా సముద్రం వరకు ఉన్న భూమిలో ప్రతీ గోత్రం వారికి ఒక భాగం వస్తుంది. ఉత్తరాన్నుండి దక్షిణం వరకు ఈ గోత్రాల వారెవరనగా: బెన్యామీను, షిమ్యోను, ఇశ్శాఖారు, జెబూలూను మరియు గాదు.
28 “గాదు వారి భూమి దక్షిణ సరిహద్దు తామారు నుండి కాదేషులోగల మెరీబా నీటి వనరు వరకూ అక్కడ నుండి ఈజిప్టు వాగు వెంబడి మధ్యధరా సముద్రం వరకు వ్యాపించి ఉంది. 29 ఈ భూమినే మీరు ఇశ్రాయేలు వంశాల మధ్య విభజించుకోవాలి. ప్రతి తెగ వారికి వచ్చేది అదే.” నా ప్రభువైన యెహోవాయే ఈ విషయాలు చెప్పాడు!
నగర ద్వారాలు
30 “ఇవి నగర ద్వారాలు. ఈ ద్వారాలు ఇశ్రాయేలు గోత్రాల పేర్ల మీద పిలవబడతాయి.
“నగర ఉత్తర భాగం ఒక మైలు ఎనిమిది వందల ఎనభై గజాల పొడవుంది. 31 అక్కడ మూడు ద్వారాలు వుంటాయి: అవి రూబేను ద్వారం, యూదా ద్వారం, మరియు లేవీ ద్వారం.
32 “నగర తూర్పు భాగం నాలుగువేల ఐదువందల మూరల పొడవు. అక్కడ మూడు ద్వారాలు ఉన్నాయి: ఆవి యోసేపు ద్వారం, బెన్యామీను ద్వారం మరియు దాను ద్వారం.
33 “నగర దక్షిణ భాగం నాలుగువేల ఐదు వందల మూరల పొడవుంది. అక్కడ మూడు ద్వారాలు ఉన్నాయి: అవి షిమ్యోను ద్వారం, ఇశ్శాఖారు ద్వారం మరియు జెబూలూను ద్వారం.
34 “నగర పశ్చిమ భాగం నాలుగు వేల ఐదువేల మూరల పొడవుంది. అక్కడ మూడు ద్వారాలున్నాయి: అవి గాదు ద్వారం, ఆషేరు ద్వారం మరియు నఫ్తాలి ద్వారం.
35 “నగరం చుట్టుకొలత ఆరుమైళ్లు. ఇప్పటి నుండి ఈ నగరం యెహోవా ఇక్కడ ఉన్నాడు అని పిలువబడుతుంది.”
© 1997 Bible League International