Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెహెజ్కేలు 44-45

వెలుపలి ద్వారం

44 పిమ్మట ఆ మనుష్యుడు నన్ను ఆలయానికి తూర్పున ఉన్న వెలుపలి ద్వారం వద్దకి తిరిగి తీసుకొని వచ్చాడు. వెలుపలి ద్వారం మూసి ఉంది. యెహోవా నాతో ఇలా చెప్పాడు: “ఈ ద్వారం మూయబడి ఉంటుంది. ఇది తెరవబడదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా దీనిద్వారా ప్రవేశించాడు గనుక మరెవ్వరూ ఈ ద్వారంగుండా ప్రవేశం చేయరు. అందువల్ల ఇది మూయబడి ఉండాలి. యెహోవాతో సమాధాన బలి అర్పణ తినేటప్పుడు ప్రజాపాలకుడు ఈ ద్వారం వద్ద కూర్చుంటాడు. ద్వారం వద్ద గల మండప మార్గం ద్వారా అతడు వచ్చి వెళతాడు.”

ఆలయ పవిత్రత

తరువాత ఆ మనుష్యుడు ఉత్తర ద్వారం ద్వారా నన్ను ఆలయం ముందుకు తీసుకొని వచ్చాడు. యెహోవా మహిమ ఆలయాన్ని నింపివేస్తున్నట్లు నేను చూశాను. నేను సాష్టాంగపడి నమస్కరించాను. యెహోవా ఇలా అన్నాడు: “నరపుత్రుడా, జాగ్రత్తగా చూడు! నీ కండ్లను, చెవులను ఉపయోగించు. ఈ వస్తువులను చూడు. నేను యెహోవా ఆలయం యొక్క నియమ నిబంధనలను గురించి చెప్పే ప్రతి విషయాన్ని నీవు శ్రద్ధగా విను. ఆలయ ప్రవేశద్వారాల వైపు, ఆలయం నుండి బయటికి పోయే ద్వారములన్నిటి వైపూ పరిశీలనగా చూడు. తరువాత నాపట్ల తిరుగుబాటుదారులైన ఇశ్రాయేలు ప్రజలందరికీ ఈ వర్తమానాన్ని అందించు. వారికిలా చెప్పు: ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, ఇశ్రాయేలు వంశీయులారా, మీరు నాపట్ల చేసిన భయంకరమైన పనులు కోకొల్లలు! ఇక చాలు. నా ఆలయం లోకి మీరు అన్యదేశీయులను తీసుకొని వచ్చారు. వారు నిజంగా సున్నతి సంస్కారం లేనివారు. వారు తమను తాము పూర్తిగా నాకు సమర్పించుకోలేదు. ఈ రకంగా మీరు నా ఆలయాన్ని అపవిత్రం చేశారు. మన ఒడంబడికను మీరు భంగపర్చారు. మీరు చెడుకార్యాలు చేశారు. తరువాత మీరు నాకు రొట్టె, కొవ్వు, రక్తం సమర్పించారు. కాని ఇదంతా కేవలం నా ఆలయాన్ని అపవిత్రపర్చింది. మీరు నా వవిత్ర వస్తువుల విషయంలో జాగ్రత్త తీసుకోలేదు. పైగా అన్యదేశీయులు నా పవిత్ర స్థలాన్ని గురించి బాధ్యత వహించేలా చేశారు!’”

నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “నిజంగా సున్నతి సంస్కారం పొందని విదేశీయుడెవ్వడూ నా ఆలయంలోకి రాకూడదు. అట్టివాడు శాశ్వతంగా ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసిస్తున్న వాడైనా నా ఆలయ ప్రవేశానికి అర్హుడు కాడు. అతడు నా ఆలయ ప్రవేశం చేసే దానికి ముందు సున్నతి సంస్కారం పొంది తనను తాను నాకు పూర్తిగా సమర్పించుకోవాలి. 10 గతంలో ఇశ్రాయేలీయులు నాపై తిరుగుబాటు చేసినప్పుడు లేవీయులు నన్ను వదిలివేశారు. తమ విగ్రహాలను ఆరాధించటానికి ఇశ్రాయేలీయులు నన్ను వదిలిపెట్టారు. లేవీయులు చేసిన పాపానికి వారు శిక్షింపబడతారు. 11 నా పవిత్ర స్థలంలో సేవ చేయటానికి లేవీయులు ఎంపిక చేయబడ్డారు. ఆలయ ద్వారాలకు వారు కాపలా ఉన్నారు. వారు ఆలయంలో సేవ చేశారు. ప్రజల తరఫున బలులు దహన బలులు ఇవ్వటానికి వారు జంతువులను వధించారు. ప్రజలకు సహాయం చేయటానికి, వాళ్ళకు సేవ చేయటానికి వారు ఎంపిక చేయబడ్డారు. 12 కాని ప్రజలు నాపట్ల పాపం చేయటానికే లేవీయులు వారికి సహాయపడ్డారు! ప్రజల విగ్రహారాధనలో లేవీయులు వారికి సహాయపడ్డారు! కనుక నేను వారికి వ్యతిరేకంగా ఇలా ప్రతిజ్ఞ చేస్తున్నాను, ‘వారు తమ పాపానికి శిక్షింపబడతారు.’” నా ప్రభువైన యెహోవా ఇది చెప్పాడు.

13 “కావున యాజకులవలె లేవీయులు నాకు అర్పణలు తీసుకొనిరారు. నా పవిత్ర వస్తువుల వద్దకు గాని, అతి పవిత్రమైనవిగా తలచబడేవాటి దరిదాపులకు గాని వారు రారు. వారు చేసిన నీచమైన పనులకు అవమానాన్ని వారు భరించాలి. 14 అయితే వారిని నా ఆలయం గురించి శ్రద్ధ తీసుకోనిస్తాను. వారు ఆలయంలో పనిచేస్తూ, అక్కడ తప్పక జరగవలసిన కార్యాలన్నీ నెరవేర్చుతారు.

15 “యాజకులందరూ లేవీ వంశపువారే. కాని ఇశ్రాయేలు ప్రజలు నాపై తిరుగుబాటు చేసినప్పుడు సాదోకు సంతతి యాజకులు మాత్రమే నా పవిత్ర స్థలాన్ని గురించి జాగ్రత్త తీసుకున్నారు. కావున సాదోకు సంతతి వారే నాకు అర్పణలు తెస్తారు. వారు బలి యిచ్చే జంతువుల కొవ్వును, రక్తాన్ని నాకు అర్పించేందుకు వారు నా ముందు నిలబడతారు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు! 16 “వారు నా పవిత్ర స్థలంలో ప్రవేశిస్తారు. నేను వారి కిచ్చిన వస్తువుల పట్ల జాగ్రత్త తీసుకుంటారు. 17 వారు లోపలి ఆవరణ ద్వారాలలో ప్రవేశించినప్పుడు వారు నారబట్టలు ధరిస్తారు. లోపలి ఆవరణ గుమ్మాల వద్ద, ఆలయంలోను సేవ చేసేటప్పుడు వారు ఉన్ని బట్టలు ధరించరు. 18 వారు నార పాగాలను తమ తలలపై ధరిస్తారు. నడుముకు చుట్టుకొనేటందుకు కూడ వారు నారబట్టలే ఉపయోగిస్తారు. వారికి చెమట పుట్టించే బట్టలేవీ వారు ధరించరు. 19 బయటి ఆవరణలో ప్రజల వద్దకు వారు వెళ్లేముందు, నాకు సేవ చేసేటప్పుడు ధరించే వస్త్రాలను వారు విడుస్తారు. వారు వేరే బట్టలు వేసుకొంటారు. ఈ విధంగా వారు పవిత్ర వస్త్రాలను ప్రజలు ముట్టకుండ చూస్తారు.

20 “ఈ యాజకులు తమ తలలు గొరిగించరు. కాని జుట్టు బారుగా పెరగకుండా మాత్రం జాగ్రత్త పడతారు. (తలలు గొరిగించడం విచారానికి దుఃఖానికి సూచన. యాజకులు కేవలం యెహోవా సేవలోనే ఆనందిస్తారు.) యాజకులు తమ తల వెంట్రుకలను తగు మాత్రమే కత్తిరిస్తారు. 21 లోపలి ఆవరణలోనికి వెళ్లేటప్పుడు యాజకులెవ్వరూ ద్రాక్షారసం తాగరాదు. 22 యాజకులు విధవరాండ్రను, విడాకులిచ్చిన స్త్రీలను వివాహమాడరాదు. వారు కేవలం ఇశ్రాయేలు వంశంలో నుండి కన్యలను మాత్రమే వివాహమాడాలి. లేదా చనిపోయిన భర్త యాజకుడైతే, ఆ విధవస్త్రీని వారు పెండ్లి చేసుకోవచ్చు.

23 “పవిత్ర వస్తువులకు, పవిత్ర వస్తువులు కాని వాటికి మధ్య వ్యత్యాసాన్ని గురించి కూడా నా ప్రజలకు యాజకులు తెలియజేస్తారు. శుభ్రమైన పదార్థాలు ఏవో, అపరిశుభ్రమైనవి ఏవో నా ప్రజలు తెలుసుకొనేటందుకు వారు సహాయపడతారు. 24 న్యాయస్థానంలో యాజకులు న్యాయాధీశులుగా వ్యవహరిస్తారు. ప్రజలకు తీర్పు తీర్చేటప్పుడు వారు నా కట్టడలను అనుసరిస్తారు. నా ప్రత్యేక విందుల (సమావేశాల) సమయంలో వారు నా నియమ నిబంధనలను పాటిస్తారు. వారు నేను ఏర్పాటు చేసిన ప్రత్యేక విశ్రాంతి రోజులను గౌరవించి, వాటిని పవిత్రంగా ఉంచుతారు. 25 వారు శవాలను తాకి వారిని వారు అపవిత్ర పర్చుకోరు. కాని ఆ చనిపోయిన వ్యక్తి గనుక తండ్రి గాని, తల్లి గాని, కుమారుడు, కుమార్తె, సోదరుడు గాని లేక వివాహితకాని సోదరిగాని అయితే వారు శవాలను ముట్టి తమను తాము అపవిత్రం చేసుకొంటారు. 26 ఇది యాజకుని అపరిశుద్ధుణ్ణి చేస్తుంది. యాజకుడు పరిశుద్ధుడయిన తరువాత అతడు ఏడు రోజులు ఆగాలి. 27 అప్పుడతడు తిరిగి పవిత్ర స్థలానికి వెళ్లవచ్చు. పవిత్ర స్థలంలో సేవ నిమిత్తం అతడు లోపలి ఆవరణలోకి వెళ్లే రోజున తన నిమిత్తం ఒక పాప పరిహారపు బలిని ఇచ్చుకోవాలి.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

28 “లేవీయులకు సంబంధించిన భూమి విషయమేదంటే, వారి ఆస్తిని నేనే. ఇశ్రాయేలులో లేవీయులకు మీరేమీ ఆస్తిని (భూమిని) ఇవ్వవద్దు. ఇశ్రాయేలులో నేనే వారి భాగం. 29 ధాన్యార్పణలు, పాప పరిహారార్థ బలిమాంసం, అపరాధ పరిహారార్థ బలి సమర్పణ వారికి ఆహారంగా ఇవ్వబడతాయి. ఇశ్రాయేలులో ప్రజలు యెహోవాకు సమర్పించేదంతా వారికి చెందుతుంది. 30 కోత కాలంలో ప్రతి పంటలోను మొదటి భాగం యాజకులకు కేటాయించాలి. కలిపిన రొట్టెల పిండి ముద్దలో మొదటి భాగం యాజకులకు ఇవ్వాలి. ఇది మీ కుటుంబాలకు మంచి ఆశీస్సులనిస్తుంది. 31 సహజంగా చనిపోయిన పక్షినిగాని, జంతువునుగాని, లేదా ఏదైనా అడవి జంతువుచే చీల్చబడిన దానినిగాని యాజకులు తినరాదు.

పవిత్ర కార్యాలకు భూమి విభజన

45 “మీరు చీట్లువేసి భూమిని ఇశ్రాయేలు వంశపు వారి మధ్య విభజించాలి. ఆ సమయంలో ఒక భూమి భాగాన్ని మీరు విడిగా ఉంచాలి. అది యెహోవా యొక్క పవిత్ర భాగం. ఆ భూమి పొడవు ఇరవైఐదువేల మూరలు వెడల్పు ఇరవై వేల మూరలు. ఈ భూమి అంతా పవిత్రమైనది. రెండువేల ఐదు వందల మూరల చదరపు అడుగుల పొడవున్న చతురస్రాకార స్థలాన్ని గుడికి కేటాయించ బడాలి. గుడి చుట్టూ ఐదువందల మూరలు గల ఖాళీస్థలం ఉండాలి. పవిత్ర స్థలంలో ఇరవై ఐదువేల మూరలు పొడవు; పదివేల మూరల వెడల్పు గల స్థలాన్ని కొలవాలి. ఈ ప్రదేశంలోనే గుడి ఉండాలి. గుడి ప్రదేశం అతి పవిత్ర స్థలంగా ఉండాలి.

“ఆ భూమిలో పవిత్ర భాగం యాజకుల వినియోగార్థమై, ఆలయ సేవకుల నిమిత్తం వాళ్ళు ఎక్కడ యెహోవా దగ్గరకు సేవ చేయటానికి వస్తారో వాళ్ళ కోసం ఉంటుంది. యాజకుల ఇండ్ల నిమిత్తం, ఆలయానికి స్థానంగా అది వినియోగ పడుతుంది. ఐదు లక్షల ఇరవై ఐదువేల మూరల పొడవు, పదివేల మూరల వెడల్పుతో మరొక భూభాగం ఆలయంలో సేవ చేసే లేవీయులకు ప్రత్యేకించబడుతుంది. ఈ భూభాగం లేవీయుల నివాస ప్రాంతంగా కూడా ఉపయోగపడుతుంది.

“మీరు నగరానికి ఐదువేల మూరల వెడల్పు, రెండులక్షల ఏభైవేల మూరల పొడవుగల భూభాగాన్నిస్తారు. ఇది పవిత్ర స్థలం పొడవునా ఉంటుంది. ఇది ఇశ్రాయేలు వంశానికంతటికీ చెంది ఉంటుంది. పాలనాధికారికి పవిత్ర స్థలానికి రెండు ప్రక్కల ఉన్న భూమి, నగరానికి చెందిన భూమిగా ఉంటుంది. ఒక తెగకు (గోత్రం) చెందిన స్థలం ఎంత వెడల్పు ఉంటుందో దీని వెడల్పు కూడ అంతే ఉంటుంది. ఇది పడమటి సరిహద్దు నుండి తూర్పు సరిహద్దు వరకు వ్యాపించి ఉంటుంది. ఈ స్ధలం ఇశ్రాయేలులో పాలనాధికారి యొక్క ఆస్తి. అందువల్ల ఈ అధిపతి నా ప్రజల జీవితాలను ఏ మాత్రం కష్టాలపాలు చేయనవసరం లేదు. కానివారు ఈ స్థలాన్ని ఇశ్రాయేలీయులకు వంశాలవారీగా ఇస్తారు.”

నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు, “ఇశ్రాయేలు పాలకులారా, ఇక చాలు! ప్రజల పట్ల క్రూరంగా ప్రవర్తించటం, వారి సొమ్ము కొల్ల గొట్టటం మానండి! న్యాయవర్తనులై మంచి పనులు చేయండి! నా ప్రజలను వారి ఇండ్ల నుండి వెడల గొట్టటం మానండి!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

10 “మీరు ప్రజలను మోసగించటం మానండి. మీరు ఖచ్చితమైన తూనికలు, కొలతలు వినియోగించండి! 11 ‘ఏఫా’[a] (పందుములో పదవ పాలు) మరియు ‘బత్‌’ (తూము) ఒకే పరిమాణంలో ఉండాలి. రెండూ ‘ఓమెరు’ లో పదవ వంతుకు సరిసమానంగా ఉండాలి. ఆ కొలతలు ‘ఓమెరు’ (పందుము) ను పరిమాణంగా చేసుకొని ఉండాలి. 12 ‘షెకెలు’ (తులం) ఇరవై ‘గెరా’లకు (చిన్నములు) సరి సమానంగా ఉండాలి. ఒక ‘మీనా’ అరవై షెకెలు (తులా)లకు సమానంగా ఉండాలి. అనగా అది ఇరవై తులాలు, ఇరవై ఐదు తులాలు, పదిహేను తులాల కలయికకు సమానం.

13 “మీరు ఇచ్చే ప్రత్యేక (ప్రతిష్ఠిత) అర్పణ ఈలాగున ఉండాలి.

గోధుమలలో తూములో ఆరో భాగం,

యవలగింజలలో తూములో ఆరో భాగం వంతున అర్పించాలి.

14 తైల పదార్థాలు చెల్లించేటప్పుడు ప్రతి నూట ఎనభై పడుల[b] ఒలీవ నూనెలో ఒక

ముప్పాతిక పడుల వంతు నూనెను చెల్లించాలి. ఇది ఒక నిబంధన.

15 ఇశ్రాయేలులో నీటి వనరుగల ప్రాంతాలలో ఉన్న మందలలో

ప్రతి రెండు వందల గొర్రెలకు ఒక మంచి గొర్రె చొప్పున అర్పించాలి.

“ఆ ప్రత్యేక అర్పణలు ధాన్యార్పణల కొరకు, దహన బలులకు, సమాధాన (శాంతి) బలులకు ఇవ్వ బడతాయి. ఈ అర్పణలన్నీ ప్రజలను పరిశుద్ధులను చేయటానికి ఉద్దేశించబడ్డాయి.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

16 “ఈ అర్పణ ప్రతి పౌరుడు ఇశ్రాయేలు పాలకునికి చెల్లిస్తాడు. 17 కావున పాలకుడు ప్రత్యేక పవిత్ర దినాలకు కావలసిన వస్తువులను తప్పక ఇవ్వాలి. విందు రోజులకు, అమావాస్యలకు, సబ్బాతు రోజులకు ఇశ్రాయేలు వంశం జరిపే ప్రత్యేక విందుల సమయాలకు దహన బలులు. ధాన్యార్పణలు, సానార్పణలు పాలకుడైన వాడు సమకూర్చాలి. ఇశ్రాయేలు వంశాన్ని పవిత్రపర్చే కార్యక్రమంలో ఇచ్చే పాపపరిహార బలులు, ధాన్యపు నైవేద్యాలు, దహన బలులు, సమాధాన బలులు పాలకుడు ఇవ్వాలి.”

18 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “మొదటి నెల మొదటి రోజున ఏ దోషమూ లేని ఒక కోడెదూడను తీసుకోవాలి. ఆలయాన్ని పరిశుద్ధం చేయటానికి మీరు ఆ కోడెదూడను ఉపయోగించాలి. 19 పాప పరిహారార్థమైన బలిరక్తాన్ని కొంత యాజకుడు తీసుకొని ఆలయ గుమ్మాల మీద, బలిపీఠం అంచు నాలుగు మూలల మీద మరియు లోపలి ఆవరణ గుమ్మం కమ్మెలమీద చల్లుతాడు. 20 ఇదే పని ఆ నెలలో ఏడవ రోజున ఎవరైనా పొరపాటునగాని, తెలియక గాని చేసిన పాప పరిహారం నిమిత్తం మీరు చేస్తారు. అలా మీరు ఆలయాన్ని పరిశుద్ధ పర్చాలి.

పస్కా పండుగ అర్పణలు

21 “మొదటి నెల పద్నాలుగవ రోజున మీరు పస్కా పండుగ జరుపుకోవాలి. పులియని రొట్టెల పండుగ ఇదే సమయంలో మొదలవుతుంది. ఆ పండుగ ఏడు రోజులపాటు జరుగుతుంది. 22 ఆ సమయంలో పాలకుడు తన కొరకునూ, ఇశ్రాయేలు ప్రజల కొరకునూ ఒక కోడెదూడను బలి ఇస్తాడు. అది పాపపరిహారార్థ బలి. 23 పండుగ జరిగే ఏడు రోజులు పాలకుడు ఏ దోషములేని ఏడు కోడెదూడలను, ఏడు పొట్టేళ్లను బలి ఇస్తాడు. అవి యెహోవాకు దహన బలులుగా సమర్పింపబడతాయి. పండుగ ఏడు రోజులూ రోజుకు ఒక కోడెదూడ చొప్పున పాలకుడు బలి ఇస్తాడు. ప్రతి రోజూ పాప పరిహారార్థమై అతడు ఒక మేకపోతును అర్పిస్తాడు. 24 ప్రతి కోడెదూడతో పాటు ఒక ఏఫా (సుమారు తొమ్మిది మానికెలు) యవలను ధాన్యపు నైవేద్యంగాను, ఒక ఏఫా యవలను ప్రతి పొట్టేలుతోను అధిపతి చెల్లిస్తాడు. ఇంకా పాలకుడు ప్రతి తొమ్మిది మానికెల ధాన్యంతో పాటు మూడు పడుల (ఒక గాలను) నూనెను సమర్పించాలి. 25 పాలకుడు పర్ణశాలల పండుగ జరిపే ఏడు రోజులలోనూ ఇదే విధంగా తప్పక చేయాలి. ఈ పండుగ ఏడవ నెలలో పదిహేనవ రోజున మొదలవుతుంది. ఇవన్నీ పాపపరిహారార్థ అర్పణలు, దహన బలులు, ధాన్యార్పణలు, నూనె అర్పణలుగా పరిగణింపబడుతాయి.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International