Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెహెజ్కేలు 28-31

తూరు తనను తాను దేవునిగా భావించుకోవటం

28 యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా చెప్పాడు: “నరపుత్రుడా, తూరు పాలకునికి ఇలా చెప్పుము, ‘నా ప్రభువైన యెహోవా నీకు చెప్పునదేమనగా:

“‘నీవు గర్విష్ఠివి!
    “నేనే దేవుడను!
సముద్ర మధ్యంలో దైవ స్థానంలో కూర్చున్నాను”
    అని నీవంటున్నావు.

“‘కాని నీవు మానవ మాత్రుడవు. దేవుడవు, మాత్రం కాదు.
    నీవు దేవుడవని నీకై నీవే అనుకుంటున్నావు.
నీవు దానియేలు[a] కంటె తెలివిగలవాడవని తల పోస్తున్నావు!
    రహస్యాలన్నిటినీ తెలుసుకొనగలవని నీవనుకుంటున్నావు.!
నీ తెలివితేటల ద్వారా, నీ వ్యాపారం ద్వారా నీవు ధనధాన్యాలు విస్తారంగా సేకరించావు.
    నీ ధనాగారాలలో వెండి బంగారాలు నిలువజేశావు.
గొప్పదైన నీ జ్ఞానంచేత, వ్యాపారం ద్యారా నీ సంపదను పెంచావు.
    ఇప్పుడా ఐశ్వర్యాన్ని చూచు కొని నీవు గర్వపడుతున్నావు.

“‘అందువల్ల నా ప్రభువైన యెహోవా చెపుతున్న దేమంటే,
నీవొక దేవుడిలా ఉన్నావని తలంచావు.
అన్య జనులను నేను నీ మీదికి రప్పిస్తాను.
    వారు దేశాలన్నిటిలో అతి భయంకరులు!
వారు తమ కత్తులను దూస్తారు.
    నీ తెలివితేటలు సముపార్జించి పెట్టిన అందమైన వస్తువుల మీద వాటిని ఉపయోగిస్తారు.
    వారు నీ కీర్తిని నాశనం చేస్తారు.
వారు నిన్ను సమాధిలోకి దించుతారు.
    నడి సముద్రంలో చనిపోయిన నావికునిలా నీవుంటావు.
నిన్నొక వ్యక్తి చంపివేస్తాడు.
    అప్పుడు “నేను దేవుణ్ణి” అని నీవు చెప్పుకోగలవా?
ఆ సమయంలో అతడు నిన్ను తన అధీనంలో ఉంచుతాడు.
    దానితో నీవొక మానవ మాత్రుడవనీ, దేవుడవు కావనీ నీవు తెలుసుకుంటావు!
10 క్రొత్తవాళ్లు నిన్ను విదేశీయునిగా చూసి చంపివేస్తారు.
    నేను ఇచ్చిన ఆజ్ఞ కారణంగా ఆ పనులు జరుగుతాయి!’”
నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

11 యెహోవా వాక్కు నాకు చేరింది. ఆయన ఇలా అన్నాడు: 12 “నరపుత్రుడా, తూరు రాజును గురించి ఈ విషాద గీతం ఆలపించు. అతనికి ఈ విధంగా చెప్పుము, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:

“‘నీవు ఆదర్శ పురుషుడవు.
    నీకు జ్ఞానసంపద మెండు. నీ అందం పరిపూర్ణమైనది.
13 దేవుని ఉద్యానవనమైన ఏదెనులో నీవున్నావు.
నీవద్ద ప్రతి విలువైన రత్నం ఉంది.
    కెంపులు, గోమేధికము, ఇతర రత్నాలు;
    గరుడ పచ్చలు, సులిమానురాయి, పచ్చరాయి;
    నీల మణులు, వైడూర్యము, మరకత పచ్చలు.
వీటిలో ప్రతిరాయీ బంగారంలో పొదగబడింది.
    నీవు సృష్టింపబడిన రోజుననే దేవుడు నిన్ను బలవంతుడిగా చేశాడు.
14 నీవు ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన కెరూబులలొ[b] ఒకడవై యున్నావు.
    నీ రెక్కలు నా సింహాసనం మీదికి చాపబడ్డాయి.
దేవుని పవిత్ర పర్వతం మీద నిన్ను ఉంచాను.
    అగ్నిలా మెరిసే ఆభరణాల గుండా నీవు నడిచావు.
15 నేను నిన్ను సృష్టించినప్పుడు నీవు మంచివాడివి, యోగ్యుడిగా ఉన్నావు.
    కాని ఆ తరువాత నీవు దుష్టుడవయ్యావు.
16 నీ వ్యాపారం నీకు చాలా ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టింది.
    ధనంతో పాటు నీలో మదం (గర్వం) పెరిగింది. దానితో నీవు పాపం చేశావు.
అందువల్ల నిన్నొక అపరిశుభ్రమైన వస్తువుగా నేను పరిగణించాను.
    దేవుని పవిత్ర పర్వతం నుండి నిన్ను తోసివేశాను.
నీవు ప్రత్యేక కెరూబులలో ఒకడవు.
    నీ రెక్కలు నా సింహాసనం పైకి చాప బడ్డాయి.
కాని అగ్నిలా మెరిసే ఆభరణాలను
    వదిలిపెట్టి పోయేలా నిన్ను ఒత్తిడి చేశాను.
17 నీ అందాన్ని చూచుకొని నీవు గర్వపడ్డావు.
    నీ గొప్పతనం యొక్క గర్వం నీ జ్ఞానాన్ని పాడు చేసింది.
అందువల్ల నిన్ను క్రిందికి పడదోశాను.
    ఇప్పుడు ఇతర రాజులు నీవంక తేరిపార జూస్తున్నారు.
18 నీవు చాలా పాపాలు చేశావు.
నీవు చాలా కుటిలమైన వర్తకుడవు.
    ఈ రకంగా పవిత్ర స్థలాలను నీవు అపవిత్ర పర్చావు.
కావున నీలో నేను అగ్ని పుట్టించాను.
    అది నిన్ను దహించి వేసింది!
నీవు నేలమీద బూడిదవయ్యావు.
    ఇప్పుడు ప్రతి ఒక్కడు నీ అవమానాన్ని చూడ గలడు.
19 ఇతర దేశాల ప్రజలు నీకు సంభవించిన దాన్ని
    చూచి ఆశ్చర్యపోయారు.
నీకు వచ్చిన ఆపద ప్రతి ఒక్కరిని భయపెడుతుంది.
    నీవు సర్వనాశనమయ్యావు.’”

సీదోనుకు వ్యతిరేకంగా వర్తమానం

20 యెహోవా మాట నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: 21 “నరపుత్రుడా, సీదోను పట్టణం వైపు చూడు. నా తరపున ఆ ప్రదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుము. 22 ఈ రకంగా చెప్పాలి, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:

“‘సీదోనూ, నేను నీకు వ్యతిరేకిని!
    నీ ప్రజలు నన్ను గౌరవించటం నేర్చుకుంటారు!
నేను సీదోనును శిక్షిస్తాను.
    ప్రజలు నేనే యెహోవానని అప్పుడు తెలుసుకుంటారు.
నేను పవిత్రుడనని వారు నేర్చుకుని
    నన్ను ఆ విధంగా చూసుకుంటారు.
23 రోగాలను, మరణాన్ని నేను సీదోనుకు పంపిస్తాను.
    ఖడ్గం (శత్రు సైన్యం) నగరం వెలుపల చాలా మందిని చంపుతుంది.
వారప్పుడు నేనే యెహోవానని తెలుసుకుంటారు!’”

ఇతర రాజ్యాలు ఇశ్రాయేలును పరిహసించటం మానుట

24 “‘గతంలో ఇశ్రాయేలు చుట్టూ ఉన్న దేశాలు దానిని అసహ్యించుకున్నాయి. కాని ఆయా దేశాలకు కీడు జరుగుతుంది. ఇశ్రాయేలు వంశాన్ని బాధించే ముండ్లు గాని, వదలక అంటుకునే ముండ్ల పొదలు గాని ఇక ఎంత మాత్రం ఉండవు. అప్పుడు నేనే ప్రభువైన యెహోవానని వారు తెలుసుకుంటారు.’”

25 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు: “నేను ఇశ్రాయేలు ప్రజలను ఇతర దేశాలకు చెదరగొట్టాను. కాని, ఇశ్రాయేలు వంశాన్ని నేను మళ్లీ ఒక్క చోటికి చేర్చుతాను. అప్పుడా రాజ్యాలన్నీ నేను పవిత్రుడనని తెలుసుకుంటాయి. అవి నన్ను ఆ విధంగా గౌరవిస్తాయి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు తమ రాజ్యంలో నివసిస్తారు. ఆ రాజ్యాన్ని నేను నా సేవకుడైన యాకోబుకు ఇచ్చాను. 26 వారు ఆ రాజ్యంలో క్షేమంగా ఉంటారు. వారు ఇండ్లు కట్టుకొని, ద్రాక్షాతోటలు పెంచుకుంటారు. నేను వారి చుట్టూ ఉండి, వారిని అసహ్యించుకున్న దేశాల వారిని శిక్షిస్తాను. తరువాత ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా జీవిస్తారు. అప్పుడు నేనే వారి దేవుడనైన యెహోవానని వారు తెలుసుకొంటారు.”

ఈజిప్టుకు వ్యతిరేకంగా వర్తమానం

29 దేశం నుండి వెళ్లగొట్టబడిన పదవ సంవత్సరం, పదవనెల (జనవరి) పన్నెండవరోజున నా ప్రభువైన యెహోవా మాట నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు: “నరపుత్రుడా, ఈజిప్టు రాజైన ఫరోవైపు చూడు. నా తరపున నీవు అతనికి (ఈజిప్టుకు) వ్యతిరేకంగా మాట్లాడుము. నీవు ఈ విధముగా మాట్లాడుము, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:

“‘ఈజిప్టు రాజువైన ఫరో, నేను నీకు విరోధిని.
    నీవు నైలునదీ తీరాన పడివున్న ఒక పెద్ద క్రూర జంతువువి.
“ఈ నది నాది! ఈ నదిని నేను ఏర్పాటు చేశాను!”
    అని నీవు చెప్పుకొనుచున్నావు.

4-5 “‘కాని నేను నీ దవడలకు గాలం వేస్తాను.
    నైలునదిలోని చేపలు నీ చర్మపు పొలుసులను అంటుకుంటాయి.
పిమ్మట నిన్ను, నీ చేపలను నదిలోనుంచి లాగి నేలమీదికి ఈడ్చుతాను.
    నీవు నేలమీద పడతావు.
నిన్నెవ్వరూ లేవనెత్తటం గాని,
    పాతిపెట్టడం గాని, చేయరు.
నేను నిన్ను అడవి జంతువులకు, పక్షులకు వదిలివేస్తాను.
    నీవు వాటికి ఆహారమవుతావు.
ఈజిప్టు నివసిస్తున్న ప్రజలంతా నేనే
    యెహోవానని అప్పుడు తెలుసుకుంటారు!

“‘నేనీ పనులు ఎందుకు చేయాలి?
ఇశ్రాయేలు ప్రజలు తమ సహాయం కొరకు ఈజిప్టు మీద ఆధారపడ్డారు.
    కాని ఈజిప్టు రెల్లు గడ్డిలా బలహీనమైనది.
ఇశ్రాయేలు ప్రజలు తమ సహాయం కొరకు ఈజిప్టు మీద ఆధారపడ్డారు.
    కాని ఈజిప్టువారి చేతులకు, భుజాలకు తూట్లు పొడిచింది.
వారు సహాయం కొరకు నీ మీద ఆధారపడ్డారు.
    కాని నీవు వారి నడుము విరుగగొట్టి, మెలిపెట్టావు.’”

కావున నా ప్రభువైన యెహోవా, ఈ విషయాలు చెపుతున్నాడు:
“నేను నీ మీదికి కత్తిని రప్పిస్తున్నాను.
    నేను నీ ప్రజలందరినీ, పశువులనూ నాశనం చేస్తాను.
ఈజిప్టు నిర్మానుష్యమై నాశనమవుతుంది.
    అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.”

దేవుడు ఇలా చెప్పాడు: “నేనెందుకీ పనులు చేయాలి? ‘ఈ నది నాది. ఈ నదిని నేను ఏర్పాటు చేశాను’ అని నీవు చెప్పుకున్నందువల్ల! నేను ఆ పనులు చేయదలిచాను. 10 కావున నేను (దేవుడు) నీకు వ్యతిరేకిని. అనేకంగా ఉన్న నైలు నదీ శాఖలకు నేను విరోధిని. నేను ఈజిప్టును పూర్తిగా నాశనం చేస్తాను. మిగ్దోలునుండి ఆశ్వన్ (సెవేనే) వరకు, మరియు ఇథియోపియ (కూషు) సరిహద్దు వరకు గల నగరాలన్నీ నిర్మానుష్యమై పోతాయి. 11 మనుష్యుడే గాని, జంతువే గాని ఈజిప్టు దేశం గుండా వెళ్లరు. 12 పాడుబడ్డ దేశాల మధ్యలో ఈజిప్టు దేశాన్ని పాడుబడ్డ నగరాల మధ్యలో దాని నగరాన్ని పాడుగా చేస్తాను. అది నలభై సంవత్సరాలు పాడుగా ఉంటుంది. ఈజిప్టు వారిని జనాల మధ్యలోనికి తోలివేసి చెదరగొడతాను. చెదరగొట్టిన దేశాల్లో నేను వారిని పరాయి వారినిగా చేస్తాను.”

13 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఈజిప్టు ప్రజలను నేను అనేక దేశాలకు చెదరి పోయేలా చేస్తాను. కాని నలభై సంవత్సరాల అనంతరం ఆ ప్రజలను నేను మళ్లీ సమీకరిస్తాను. 14 ఈజిప్టు బందీలను నేను వెనుకకు తీసుకొని వస్తాను. ఈజిప్టువారిని వారి జన్మస్థలమైన పత్రోసుకు తిరిగి తీసుకొని వస్తాను. అయితే వారి రాజ్యానికి మాత్రం ప్రాముఖ్యం ఉండదు. 15 అది పాముఖ్యం లేని రాజ్యంగా తయారవుతుంది. అది మరెన్నడూ సాటి రాజ్యాల కంటె మిన్నగా పెరగజాలదు. అది ఇతర రాజ్యాల మీద ఆధిపత్యం చేయలేనంత చిన్నగా దానిని నేను తగ్గించి వేస్తాను. 16 ఇశ్రాయేలు వంశం వారు తమ సహాయం కొరకు ఈజిప్టు మీద మరెన్నడు ఆధార పడరు. ఇశ్రాయేలీయులు తమ పాపాన్ని గుర్తు తెచ్చుకుంటారు. తమ సహాయం కొరకు దేవుని అర్థించకుండా ఈజిప్టును ఆశ్రయించిన తమ పాపాన్ని వారు గుర్తు తెచ్చుకుంటారు. నేనే ప్రభువైన యెహోవానని వారు గుర్తిస్తారు.”

బబులోను ఈజిప్టును వశపర్చుకొంటుంది

17 దేశంనుండి వెళ్ల గొట్టబడిన ఇరవై ఏడవ సంవత్సరం, మొదటి నెల (ఏప్రిల్) మొదటి రోజున దేవుని వాక్కు నాకు వినబడింది. ఆయన ఇలా చెప్పాడు, 18 “నరపుత్రుడా, బబులోను రాజైన నెబుకద్నెజరు తూరుపై యుద్ధంలో తన సైన్యాలు తీవ్రంగా పోరాడేలాగు చేశాడు. వాళ్లు ప్రతి సైనికుని తల గొరిగారు. బరువైన పనులు ప్రతి సైనికుని తలమీద రుద్దబడినవి. ప్రతి సైనికుని భుజం కొట్టుకుపోయి పుండయ్యింది. తూరును ఓడించటానికి నెబుకద్నెజరు, అతని సైన్యం చాలా శ్రమ పడవలసి వచ్చింది. కాని ఆ శ్రమకు తగిన ప్రతిఫలం వారికి దక్కలేదు.” 19 అందువల్ల నా ప్రభువైన యెహోవా ఈ విధంగా చెపుతున్నాడు: “నేను ఈజిప్టు రాజ్యాన్ని బబులోను రాజైన నెబుకద్నెజరుకు అప్పగిస్తాను. నెబుకద్నెజరు ఈజిప్టు ప్రజలను పట్టుకు పోతాడు. ఈజిప్టు నుంచి విలువైన వస్తువుల నెన్నింటినో నెబుకద్నెజరు తీసుకొనిపోతాడు. అదే నెబుకద్నెజరు సైన్యానికి పారితోషికం. 20 నెబుకద్నెజరు చేసిన కష్టానికి అతనికి నేను ఈజిప్టు రాజ్యాన్ని ప్రతిఫలంగా ఇస్తున్నాను. వారు నా కొరకు పనిచేశారు గనుక నేనిది వారికి చేస్తున్నాను!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు!

21 “ఆ రోజన ఇశ్రాయేలు వంశాన్ని నేను బలపర్చుతాను. పైగా నీ ప్రజలు ఈజిప్టువారిని చూచి నవ్వుతారు. అప్పుడు నేను యెహోవానని వారు తెలుసుకుంటారు.”

బబులోను సైన్యం ఈజిప్టును ఎదుర్కొంటుంది

30 మరొకసారి యెహోవా మాట నాకు చేరింది. ఆయన ఇలా అన్నాడు: “నరపుత్రుడా, నా తరపున మాట్లాడుతూ ఈ విధంగా చెప్పుము, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:

“‘నీవు దుఃఖపడి,
    “భయంకరమైన రోజు దరిచేరుతున్నది” అని ప్రకటించుము.
ఆ రోజు దగ్గరలో ఉంది!
    అవును. యెహోవా తీర్పు తీర్చే రోజు దగ్గర పడుతున్నది.
అది మేఘాల రోజు.
    అది రాజ్యాలపై తీర్పు ఇచ్చే సమయం!
ఈజిప్టు మీదకి ఒక కత్తి వస్తుంది!
    ఈజిప్టు పతనమయ్యే సమయాన ఇథియోపియ (కూషు) ప్రజలు భయంతో చెదరిపొతారు.
ఈజిప్టు ప్రజలను బబులోను సైన్యం బందీలుగా పట్టుకుపోతుంది.
    ఈజిప్టు పునాదులు కదిలిపోతాయి!

“‘ఆ అనేక మంది ప్రజలు ఈజిప్టుతో శాంతి ఒప్పందాలు చేసుకున్నారు. కాని ఇథియోపియ (కూషు), పూతు, లూదు, అరేబియా (మిశ్రమ ప్రజలు), లిబ్యా (కూబు), ఇశ్రాయేలు (నా నిబంధన దేశము) ప్రజలు-అందరూ నాశనం చేయబడతారు!

“‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
“అవును. ఈజిప్టును బలపర్చిన వారంతా పడిపోతారు!
    దాని బలగర్వం తగ్గి పోతుంది.
మిగ్దోలు నుండి ఆశ్వన్ (సెవేనే) వరకు గల
    ఈజిప్టు ప్రజలంతా చంపబడతారు.”
    నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు!
నాశనం చేయబడిన దేశాలలో ఈజిప్టు కూడా కలిసిపోతుంది.
    శూన్యంగా మిగిలిన రాజ్యాలలో ఈజిప్టు ఒకటి అవుతుంది.
ఈజిప్టులో అగ్ని రగిలిస్తాను.
    దానితో దాని సహాయకులు నాశనమై పోతారు.
అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.

“‘ఆ సమయాన నేను దూతలను పంపుతాను. వారు ఓడలలో పయనించి ఇథియోపియ (కూషు)కు దుర్వార్త తీసుకొని వెళతారు. ఇథియోపియ ఇప్పుడు క్షేమంగా ఉన్నాననుకుంటూ ఉంది. కాని ఈజిప్టు శిక్షించ బడినప్పుడు ఇథియోపియ ప్రజలు భయంతో కంపించిపోతారు. ఆ సమయం వస్తూ ఉంది!’”

10 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
“బబులోను రాజైన నెబుకద్నెజరును
    నేను వినియోగించి ఈజిప్టు ప్రజలను నాశనం చేస్తాను.
11 నెబుకద్నెజరు, అతని మనుష్యులు
    జాతులన్నిటిలోనూ అతి భయంకరులు.
    ఈజిప్టును నాశనం చేయటానికి వారిని తీసుకొనివస్తాను.
ఈజిప్టు మీద వారు తమ కత్తులు దూస్తారు.
    వారు దేశాన్ని శవాలతో నింపివేస్తారు.
12 నైలునది ఎండిపోయేలా నేను చేస్తాను.
    అలా ఎండిన భూభూగాన్ని దుష్ట జనులకు అమ్మి వేస్తాను.
ఆ భూమిని నిర్మానుష్యం చేయటానికి నేను అన్యజనులను వినియోగిస్తాను.
    యెహోవానైన నేను ఈ విషయాలు చెపుతున్నాను!”

ఈజిప్టు విగ్రహాలు నాశనం చేయబడుతాయి

13 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
“ఈజిప్టులో ఉన్న విగ్రహాలను కూడా నేను నాశనం చేస్తాను.
    మెంఫిస్ (నొపు)లో ఉన్న విగ్రహాలన్నిటినీ తొలగిస్తాను.
ఈజిప్టులో ఇక ఎంత మాత్రం నాయకుడెవడు ఉండడు.
    ఈజిప్టు రాజ్యంలో భయాన్ని పుట్టిస్తాను.
14 పత్రోసును శూన్య రాజ్యంగా మార్చివేస్తాను.
    సోయనులో అగ్ని రగుల్చుతాను.
    ‘నో’ నగరాన్ని శిక్షిస్తాను.
15 ఈజిప్టుకు కోటవలె అండగా నిల్చిన సీను మీద నా కోపాన్ని కుమ్మరిస్తాను!
    ‘నో’ నగర వాసులను నేను నాశనం చేస్తాను.
16 ఈజిప్టులో నేను అగ్ని ముట్టిస్తాను.
    సీను అనబడే ప్రాంతం భయానికి గురియవుతుంది.
‘నో’ నగరంలోకి సైనికులు విరుచుకుపడ్తారు.
    శత్రువులు దాన్ని పగటిపూట ఎదుర్కొంటారు.
17 ఓను, పిబేసెతు పట్టణాల యువకులు యుద్ధంలో చనిపోతారు.
    స్త్రీలు బందీలుగా పట్టుకుపోబడతారు.
18 ఈజిప్టు ఆధిపత్యాన్ని (కాడిని) తహపనేసులో నేను విరిచినప్పుడు అక్కడ అంధకారం ఏర్పడుతుంది.
    ఈజిప్టు యొక్క బలగర్వం అంతమవుతుంది!
ఈజిప్టును ఒక మేఘం ఆవరిస్తుంది.
    ఆమె కుమార్తెలు చెరపట్టబడి తీసుకుపోబడతారు.
19 ఆ విధంగా నేను ఈజిప్టును శిక్షిస్తాను.
    అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు!”

ఈజిప్టు శాశ్వతంగా బలహీనమవుతుంది

20 చెరకి కొనిపోబడిన పదకొండవ సంవత్సరం మొదటి నెల (ఏప్రిల్) ఏడవ రోజున యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: 21 “నరపుత్రుడా, ఈజిప్టు రాజైన ఫరో చేతిని (శక్తిని) నేను విరిచివేశాను. ఆ చేతికి ఎవ్వరూ కట్టు కట్టలేరు. అది నయం కాదు. ఆ చేయి మళ్లీ కత్తి పట్టే బలాన్ని పుంజుకోలేదు.”

22 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “నేను ఈజిప్టు రాజైన ఫరోకు విరోధిని. అతని మంచి చేతిని, గతంలో విరిగిన అవిటి చేతిని, రెండింటినీ నేను విరుగగొడతాను. అతని చేతి నుండి కత్తి జారి క్రిందపడేలా చేస్తాను. 23 ఈజిప్టువారిని వివిధ దేశాలకు చెదరగొడతాను. 24 బబులోను రాజు చేతులను నేను బలపర్చుతాను. నా కత్తిని అతని చేతిలో ఉంచుతాను. కాని ఫరో చేతులను నేను విరుగ గొడతాను. అప్పుడు ఫరో మరణించుతాడు. వేదన పడేలా బాధపడతాడు. 25 ఆ విధంగా బబులోను రాజు చేతులను బలపర్చి, ఫరో రాజు చేతులను నేను బలహీన పర్చుతాను. నేనే యెహోవానని వారప్పుడు తెలుసుకుంటారు.

“నేను నా కత్తిని బబులోను రాజు చేతిలో ఉంచుతాను. అతడా కత్తిని ఈజిప్టు రాజ్యం మీదికి విసురుతాడు. 26 నేను ఈజిప్టువారిని వివిధ దేశాలకు తరిమివేస్తాను. అప్పడు నేను యెహోవానని వారు తెలుసుకొంటారు.”

దేవదారు వృక్షంవంటి అష్షూరు

31 చెరకి కొనిపోబడిన పదకొండవ సంవత్సరం మూడవ నెల మొదటి రోజున యెహోవా మాట నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: “నరపుత్రుడా, ఈజిప్టు రాజైన ఫరోకు మరియు అతని ప్రజలకు ఈ విషయాలు తెలియజేయుము,

“‘గొప్పతనంలో
    నీవు ఎవరిలా ఉన్నావు?
మిక్కిలి ఉన్నతంగా పెరిగి తన అందమైన కొమ్మలతో దట్టమైన నీడనిస్తూ
    లెబానోనులో పెరిగిన కేదారు వృక్షం అష్షూరు రాజ్యమే.
    దాని తల మేఘాల్లో ఉంది!
మంచి నీటివనరు చెట్టును బాగా పెరిగేలా చేసింది.
    లోతైన నది అది ఎత్తుగా పెరగటానికి దోహదమిచ్చింది.
చెట్టు నాటబడిన ప్రాంతంలో నదులు ప్రవహించాయి.
    దాని కాలువలే అక్కడి పొలాల్లో ఉన్న చెట్లకు నీటిని అందజేశాయి
ఆ వృక్షం అలా మిగిలిన చెట్లన్నిటిలో పొడవుగా పెరిగింది.
    దానికి ఎన్నో కొమ్మలు పెరిగాయి.
నీరు పుష్కలంగా ఉంది.
    అందువల్ల దాని కొమ్మలు విస్తరించాయి.
కావున పక్షులన్నీ దాని
    కొమ్మల్లో గూళ్లు కట్టుకున్నాయి.
ఆ ప్రాంతంలో జంతువులన్నీ దాని
    చల్లని నీడలో తమ పిల్లల్ని పెట్టాయి.
గొప్ప రాజ్యాలన్నీ
    ఆ చెట్టు నీడలో నివసించాయి!
ఆ విధంగా ఆ చెట్టు తన గొప్పతనంలోను,
    తన పొడవైన కొమ్మలతోను,
    ఎంతో ఆందంగా కన్పించింది.
    ఎందువల్ల ననగా దానివేళ్ళు నీరు బాగా అందేవరకు నాటుకున్నాయి!
దేవుని ఉద్యానవనంలో ఉన్న కేదారు వృక్షాలు
    కూడా ఈ చెట్టంత పెద్దగా లేవు.
దీనికి ఉన్నన్ని కొమ్మలు సరళ వృక్షాలకు కూడా లేవు.
    అక్షోట (మేడి) చెట్లకు అసలిటువంటి కొమ్మలే లేవు.
దేవుని ఉద్యానవనంలో
    ఇంత అందమైన చెట్టేలేదు.
అనేకమైన కొమ్మలతో
    ఈ చెట్టును నేను అందమైనదిగా చేశాను.
ఏదెనులో దేవుని ఉద్యానవనంలో ఉన్న చెట్లన్నీ
    దీనిపట్ల అసూయ చెందాయి!’”

10 కావున నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, “ఈ చెట్టు విస్తరించి పొడవుగా పెరిగింది. దాని తలని మబ్బుల్లో పెట్టుకుంది. దాని ఎత్తు చూసుకొని అది గర్వపడింది. 11 అందువల్ల ఒక పరాక్రమశాలియగు రాజు ఆ చెట్టును ఉంచుకొనేలా చేస్తాను. అది చేసిన చెడ్డ పనులకు ఆ పాలకుడు దానిని శిక్షిస్తాడు. అతని చెడు తనంవల్ల నేను ఆ చెట్టును నాతోటనుండి తీసుకొంటిని. 12 దేశాలన్నిటిలో క్రొత్తవాళ్లు, చాలా క్రూరులయిన వాళ్లు దానిని నరికి పడవేశారు. ఆ చెట్టు కొమ్మలు కొండల మీదను, లోయలలోను చెల్లా చెదరుగా పడవేశారు. ఆ దేశం గుండా ప్రవహించే నదులలో విరిగిన కొమ్మలు కొట్టుకు పోయాయి. ఆ చెట్టు క్రింద నీడ ఇక ఏ మాత్రం లేకపోవటంతో వివిధ దేశాల ప్రజలంతా దానిని వదిలిపెట్టారు. 13 ఇప్పుడు పక్షులు పడిపోయిన ఆ చెట్టు మీదే నివసిస్తాయి. దాని పడిపోయిన కొమ్మలమీద ఆడవి జంతువులన్నీ నడుస్తాయి.

14 “ఆ నీటి ప్రక్కనున్న ఏ చెట్టూ ఇక మీదట గర్వపడదు. అవి ఆకాశాన్నంటుకోవాలని తాపత్రయ పడవు. ఆ నీరును పీల్చే బలమైన చెట్లలో ఏ ఒక్కటీ పొడవుగా ఉన్నానని గొప్పలు చెప్పుకోదు. ఎందువల్లనంటే అవన్నీ చనిపోవటం ఖాయం. అవన్నీ పాతాళ లోకంలోకి పోతాయి. అవి (వారు) మృతి చెందిన వారితో పాతాళంలో కలవటం తధ్యం.”

15 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, “ఆ చెట్టు పాతాళానికి వెళ్లిన రోజున ప్రజలంతా సంతాపం పొందేలా చేశాను. అగాధమైన సముద్రంలో దాన్ని కప్పివేశాను. దాని నదులన్నిటినీ నిలుపు జేశాను. నీరంతా ప్రవహించటం ఆగిపోయింది. లెబానోను దాని కొరకు దుఃఖించేలా చేశాను. ఆ మహావృక్షం కొరకు ఆ ప్రాంతంలో ఉన్న చెట్లన్నీ విచారంతో క్రుంగిపోయాయి. 16 ఆ చెట్టు పడిపోయేలా నేను చేశాను. అది పతనమయినప్పుడు వచ్చిన శబ్దంతో దేశాలు భయంతో వణికిపోయాయి. ఆ వృక్షం మృతుల స్థానానికి వెళ్లేలా చేశాను. అది మృతులతో కలిసి ఉండటానికి పాతాళానికి చేరింది. గతంలో ఏదెనులో ఉన్న అన్ని చెట్లు, లెబానోనులో ఉన్న శ్రేష్ఠమైన చెట్లు ఆ నీటిని పీల్చాయి. ఆ చెట్లు పాతాళ లోకంలో ఓదార్చబడ్డాయి. 17 అవును. మృతుల స్థానానికి మహా వృక్షంతో పాటు మిగిలిన చెట్లు కూడ పోయాయి. యుద్ధంలో హతులైన ప్రజలను అవి కలిశాయి. ఆ మహా వృక్షం మిగిలిన చెట్లను బలపర్చింది. దేశాల మధ్య ఆ మహా వృక్షం యొక్క నీడలో ఆ చెట్లు నివసించాయి.

18 “కావున ఈజిప్టూ, ఏదెనులో నిన్ను ఏ చెట్టుతో పోల్చను? ఆ చెట్లన్నీ పెద్దవీ, బలిష్ఠమయినవీ. ఏదెనులోని చెట్లతో పాటు నీవు అధోలోకానికి పోతావు. విదేశీయులతోను[c] యుద్ధంలో మరణించిన వారితోను కలిసి నీవు మృత్యుస్థానంలో పడివుంటావు.

“ఫరోకు మరియు అతని ప్రజలందరికీ ఇది సంభవిస్తుంది!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International