Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెహెజ్కేలు 24-27

కుండ-మాంసం

24 నా ప్రభువైన యెహోవా మాట నాకు చేరింది. అది చెరలో తొమ్మిదవ సంవత్సరం, పదవనెల పదవ తేదీన జరిగింది. ఆయన ఇలా అన్నాడు, “నరపుత్రుడా, ఈ రోజు తారీఖు వేసి, ఈ చీటీ వ్రాయి, ‘ఈ రోజు బబులోను రాజు సైన్యం యెరూషలేమును చుట్టుముట్టింది.’ విధేయులు కావటానికి తిరస్కరించే ఇశ్రాయేలు తెగవారికి ఈ కథ చెప్పు. వారికి ఈ విషయాలు చెప్పుము, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు.

“‘పొయ్యిమీద కుండ పెట్టుము.
    కుండ పెట్టి, అందులో నీరు పొయుము.
దానిలో మాంసం ముక్కలు వేయాలి.
    మంచి ముక్కలు వేయాలి. తొడ మాంసం, జబ్బ మాంసం వేయాలి.
మంచి ఎముకలతో కుండ నింపాలి.
    వీటి కొరకు మందలో వున్న మంచి జంతువులను (పశువులను) వాడాలి.
కుండ క్రింద బాగా కట్టెలు పేర్చు.
    మాంసం ముక్కలను వుడకబెట్టు.
    ఎముకలు కూడా వుడికేలా రసాన్ని కాగబెట్టు!

“‘నా ప్రభువైన యెహోవా ఈ విధంగా చెప్పుతున్నాడు,
హంతకులున్న
    ఈ నగరమునకు కీడు మూడింది.
తుప్పుమరకలున్న కుండలా యెరూషలేము ఉంది.
    ఆ మచ్చలు తొలగింప బడవు!
కుండలో నుండి ప్రతి మాంసం ముక్కను బయటకు తీయుము.
    ఆ మాంసాన్ని తినవద్దు! పాడైపోయిన ఆ మాంసం నుండి యాజకులను ఏమీ తీసుకోనివ్వద్దు.
యెరూషలేము ఆ తుప్పుపట్టిన కుండలా ఉంది.
    ఎందువల్లననగా హత్యల రక్తం ఇంకా అక్కడ ఉంది!
రక్తాన్ని ఆమె రాళ్లమీద చిందించింది.
    రక్తాన్ని ఆమె నేలపై పోసి దుమ్ముతో కప్పలేదు.[a]
నేనామె రక్తాన్ని రాతిబండమీద వుంచాను.
    అందువల్ల అది కప్పబడదు.
చూచిన ప్రజలకు కోపం రావాలని, అమాయక ప్రజలను చంపినందుకు
    వారామెను శిక్షించాలని నేనది చేశాను.

“‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు,
నరహంతకులతో నిండిన ఈ నగరానికి కీడు మూడింది!
    నిప్పు రాజెయ్యటానికి నేను కట్టెలు బాగా పేర్చుతాను.
10 కుండ క్రింద కట్టెలు బాగా పేర్చు.
    నిప్పు రాజెయ్యి.
మాంసాన్ని బాగా ఉడకనియ్యి!
    మసాల దినుసులు కలుపుము.
    ఎముకలు కాలిపోనిమ్ము.
11 పిమ్మట బొగ్గుల మీద ఖాళీ కుండను వుండ నిమ్ము.
    దాని మచ్చలు కాలి మెరిసేలా దానిని వేడెక్కనిమ్ము.
దాని మచ్చలు కరిగిపోతాయి.
    తుప్పు (కిలుము) రాలిపోతుంది.

12 “‘యెరూషలేము తన మచ్చలు మాపుకోటానికి
    బాగా శ్రమించవచ్చు.
అయినా దాని “తుప్పు” పోదు!
    కేవలం అగ్ని (శిక్ష) మాత్రమే ఆ తుప్పును పోగొడుతుంది.

13 “‘నీవు నాపట్ల పాపం చేశావు.
    దానితో నీ చర్మం మాలిన్యమయ్యింది.
నిన్ను కడిగి శుభ్రపర్చాలను కున్నాను.
    కాని నీ వంటిమీది మచ్చలు పోకుండెను
నీపట్ల నా తీవ్రమైన కోపం తీరేవరకు
    నిన్ను కడిగే ప్రయత్నం మళ్లీ చేయను!

14 “‘నేనే యెహోవాను. నీకు శిక్ష విధింపబడుతుందని చెప్పాను. ఆది వచ్చేలా నేను చేస్తాను. నేను శిక్షను ఆపను. నిన్ను గురించి నేను విచారించను. నీవు చేసిన చెడు కార్యాలకు నేను నిన్ను శిక్షిస్తాను.’” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

యెహెజ్కేలు భార్య మరణం

15 పిమ్మట యెహోవా సందేశం నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు: 16 “నరపుత్రుడా, నీవు నీ భార్యను మిక్కిలి ప్రేమిస్తున్నావు. కాని ఆమెను నీనుండి నేను తీసుకొనబోతున్నాను. నీ భార్య అకస్మాత్తుగా చనిపోతుంది. అయినా నీవు మాత్రం నీ విచారాన్ని వ్యక్తం చేయకూడదు. నీవు బిగ్గరగా ఏడ్వకూడదు. నీవు కన్నీళ్లు కార్చకూడదు. 17 కాని నీ వెక్కి ఏడ్పు శబ్దాలను బయటకు వినరానీయవద్దు. చనిపోయిన నీ భార్య కొరకు నీవు ఏడ్వవద్దు. నీవు మామూలుగా వేసుకొనే బట్టలనే ధరించాలి. నీ తలపాగా, నీ చెప్పులు ధరించుము. నీ విచారాన్ని వ్యక్తం చేయటానికి నీవు నీ మీసాలను కప్పివుంచవద్దు. సామాన్యంగా వ్యక్తులు మరణించినప్పుడు ప్రజలు తినే ఆహారాన్ని నీవు తినవద్దు.”

18 మరునాటి ఉదయం దేవుడు చెప్పిన విషయాలను నేను ప్రజలకు తెలియజేశాను. ఆ సాయంత్రం నా భార్య చనిపోయింది. ఆ మరునాటి ఉదయం దేవుడు ఆజ్ఞాపించిన విధంగా నేను అన్నీ చేశాను. 19 అప్పుడు ప్రజలు నాతో, “నీవిలా ఎందుకు చేస్తున్నావు? దీని అర్థం ఏమిటి?” అని ప్రశ్నించారు.

20 అందుకు వారితో నేనిలా అన్నాను: “యెహోవా మాట నాకు విన్పించింది. 21 ఇశ్రాయేలు వంశంవారితో మాట్లడమని ఆయన నాకు చెప్పాడు. నా ప్రభువైన యెహోవా ఇలా చెప్పాడు: ‘చూడండి, నేను నా పవిత్ర స్థలాన్ని నాశనం చేస్తాను. మీరా స్థలాన్ని చూచి గర్వపడుతున్నారు. దానిని శ్లాఘిస్తూ పాటలు పాడుతున్నారు. ఆ స్థలాన్ని చూడాలని మీరు ఉబలాట పడుతూ వుంటారు. మీరు నిజంగా ఆ స్థలమంటే ఇష్టపడుతూ వున్నారు. కాని నేనాస్థలాన్ని నాశనం చేస్తాను. మీరు మీ వెనుక వదిలిపెట్టిన మీ పిల్లలంతా యుద్ధంలో చంపబడతారు. 22 నేను చనిపోయిన నా భార్య విషయంలో ఏమి చేశానో, మీరు కూడా అలానే చేస్తారు. మీ దుఃఖాన్ని సూచించటానికి మీరు మీసాలను కప్పుకొనరు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు సామాన్యంగా ప్రజలు తినే ఆహారాన్ని మీరు తినరు. 23 మీరు మీ తలపాగాలు, చెప్పులు ధరిస్తారు. మీరు మీ విచారాన్ని వ్యక్తం చేయరు. మీరు ఏడ్వరు. మీ పాపాల కారణంగా మీరు నశించిపోతారు. మీ దుఃఖాన్ని మీరు ఒకరికొకరు నిశ్శబ్దంగా తెలియజేసుకుంటారు. 24 కావున యెహెజ్కేలు మీకు ఒక ఉదాహరణ. అతడు చేసినవన్నీ అలానే మీరూ చేస్తారు. ఆ శిక్షా కాలం సమీపిస్తున్నది. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.’”

25-26 “నరపుత్రుడా, ప్రజల నుండి ఆ సురక్షిత ప్రాంతాన్ని (యెరూషలేమును) నేను తీసుకుంటాను. ఆ అందమైన స్థలం వారిని సంతోషపెడుతూ ఉంది. వారు దానిని చూడాలని కుతూహల పడుతూ వుంటారు. వారు నిజంగా ఆ స్థలమంటే బాగా ఇష్టపడుతున్నారు. ఆ నగరాన్ని, వారి పిల్లలను నేను వారినుండి తీసుకొంటాను. ఆ సమయంలో చావగా మిగిలిన వారిలో ఒకడు యెరూషలేమును గూర్చిన ఒక చెడువార్తను తీసుకొని వస్తాడు. 27 అప్పుడు నీవతనితో మాట్లాడ గలుగుతావు. ఇక నీవెంత మాత్రమూ మౌనంగా వుండవు. ఈ రకంగా నీవు వారికి ఒక ఉదాహరణగా ఉంటావు. నేను యెహోవానని అప్పుడు వారు తెలుసుకుంటారు.”

అమ్మోనుకు వ్యతిరేకంగా ప్రవచనం

25 యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు: “నరపుత్రుడా, నీవు అమ్మోనీయులనుద్దేశించి వారికి వ్యతిరేకంగా నా తరపున మాట్లాడు. అమ్మోను ప్రజలకు ఇలా చెప్పు: ‘నా ప్రభువైన యెహోవా మాటను ఆలకించండి! నా ప్రభువైన యెహోవా ఈ విషయం చెపుతున్నాడు, నా పవిత్ర స్థలం నాశనం చేయబడినప్పుడు మీరు సంతోషించారు. ఇశ్రాయేలు కాలుష్యం చెందినప్పుడు మీరు దానికి వ్యతిరేకులయ్యారు. యూదా ప్రజలు బందీలుగా పట్టుకు పోబడినప్పుడు మీరు యూదా వంశానికి వ్యతిరేకులయ్యారు. కావున తూర్పు నుండి వచ్చే ప్రజలకు మిమ్మల్ని అప్పగిస్తాను. వారు మీ రాజ్యాన్ని ఆక్రమిస్తారు. మీ దేశంలో వారి సైన్యాలు స్థావరాలు ఏర్పాటు చేస్తాయి. వారు మీ మధ్య నివసిస్తారు. వారు మీ పంటను తింటూ, మీ పాలు త్రాగుతారు.

“‘రబ్బా నగరాన్ని ఒంటెలు మేసే పచ్చిక బయలుగా చేస్తాను. అమ్మోను దేశాన్ని గొర్రెల దొడ్డిగా చేజేస్తాను. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు. యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: యెరూషలేము నాశనమైనప్పుడు మీరు సంతోషపడ్డారు. మీరు మీ చేతులు చరిచి, కాళ్లు దట్టించారు. ఇశ్రాయేలు రాజ్యాన్ని అవమానపరుస్తూ మీరు వేడుక చేసుకున్నారు. కావున నేను మిమ్మల్ని శిక్షిస్తాను. సైనికులు యుద్ధంలో తీసుకొనే విలువైన వస్తువుల్లా[b] మీరు ఉంటారు. ఇతర దేశాలతో మీరు వేరుగా అయిపోతారు. దూర దేశాల్లో మీరు చనిపోతారు. నేను మీ దేశాన్ని నాశనం చేస్తాను! అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.’”

మోయాబు, శేయీరులకు వ్యతిరేకంగా ప్రవచనం

నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు, “మోయాబు, శేయీరు (ఎదోము) ప్రజలు, ‘యూదా వంశం కేవలం ఇతర రాజ్యాల జనుల మాదిరే ఉంది’ అని అంటారు. నేను మోయాబు భుజంలోకి నరుకుతాను. సరిహద్దుల్లో వున్న దాని నగరాలన్నిటినీ, ఆ భూమి గొప్పదనాన్ని తీసుకుంటాను. రాజ్యానికి తలమానికమైన బేత్యేషీమోతు, బయల్మెయోను, కిర్యతాయిములను తీసుకుంటాను. 10 తరువాత ఈ నగరాలను తూర్పు నుండి వచ్చిన ప్రజలకు ఇస్తాను. వారు నీ రాజ్యాన్ని చేజిక్కించుకుంటారు. తూర్పు రాజ్యాల ప్రజలు అమ్మోను ప్రజలను నాశనం చేయనిస్తాను. దానితో అసలు అమ్మోను ప్రజలు ఒక దేశంగా వుండేవారనే సత్యాన్ని ప్రజలు మర్చిపోతారు. 11 అలాగే మోయాబును నేను శిక్షిస్తాను. అప్పుడు వారంతా నేను యెహోవానని తెలుసు కుంటారు.”

ఎదోముకు వ్యతిరేకంగా ప్రవచనం

12 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు, “ఎదోము ప్రజలు యూదా వంశంపై తిరుగుబాటు చేసి, చివరికి దానిని చేజిక్కించుకోవాలని కూడ ప్రయత్నించారు. ఎదోము ప్రజలు నేరస్థులు.” 13 కావున నా ప్రభువైన యెహోవా చెబుతున్నదేమనగా, “నేనే ఎదోమును శిక్షిస్తాను. ఎదోములో వున్న ప్రజలను, జంతువులను నాశనం చేస్తాను. తేమాను నుండి దదాను వరకు గల మొత్తం ఎదోము, దేశాన్ని నేను నాశనం చేస్తాను. ఎదోమీయులు యుద్ధంలో చనిపోతారు. 14 నా ప్రజలైన ఇశ్రాయేలీయులను వినియోగించి ఎదోముకు వ్యతిరేకమవుతాను. ఈ రకంగా ఇశ్రాయేలు కూడా ప్రజలు ఎదోముపై నాకు గల కోపాన్ని చూపిస్తారు. అప్పుడు నేనే వారిని శిక్షించినట్లు ఎదోము ప్రజలు తెలుసుకుంటారు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

ఫిలిష్తీయులకు వ్యతిరేకంగా ప్రవచనం

15 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఫిలిష్తీయులు ప్రయత్నించారు. పగతీర్చుకొనుచున్నారు. వారు అతిక్రూరులు. తమ కోపం తమలోనే ఎక్కువ కాలం వుంచుకొని తమని తాము దహింపజేసుకొన్నారు!” 16 కావున నా ప్రభువైన యెహోవా చెప్పినదేమంటే, “నేను ఫిలిష్తీయులను శిక్షిస్తాను. కెరేతీయులను నేను నాశనం చేస్తాను. సముద్ర తీరాన నివసిస్తున్న ప్రజలను నేను సర్వనాశనం చేస్తాను. 17 నేనా ప్రజలను శిక్షిస్తాను. వారిపై పగ సాధిస్తాను. నా కోపంతో వారికి ఒక గుణపాఠం నేర్పిస్తాను. అప్పుడు నేను యెహోవానని వారు తెలుసుకుంటారు!”

తూరును గూర్చిన సందేశం

26 దేశ బహిష్కరణలో (చెర) పదకొండవ సంవత్సరపు మొదటి నెల మొదటి రోజున యెహోవా వాక్కు నాకు చేరింది. ఆయన ఇలా అన్నాడు: “నరపుత్రుడా, యెరూషలేమును గురించి తూరు చెడ్డ విషయాలు చెప్పింది, ‘ఆహా! ప్రజలను రక్షిస్తున్న నగర ద్వారం నాశనం చేయబడింది! నా కొరకు నగర ద్వారం తెరవబడింది. యెరూషలేము నగరం నాశనం చేయబడింది. అందులో నాకు విలువైన వస్తువులు ఎన్నో లభిస్తాయి!’”

కావున నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు, “తూరూ, నీకు నేను వ్యతిరేకిని! నీపై యుద్ధం చేయటానికి అనేక దేశాల వారిని తీసుకొని వస్తాను. తీరం మీదికి వచ్చిపడే సముద్రపు అలల్లా, వారు నీ మీదికి మాటి మాటికీ వస్తారు.”

దేవుడు ఇలా అంటున్నాడు: “శత్రు సైనికులు తూరు గోడలను నాశనం చేస్తారు. దాని బురుజులను కూలగొడతారు. ఆమె రాజ్యంలో గల భూమి యొక్కపైభాగవు నేలను చెరిపివేస్తాను. తూరును ఒక బండరాయిగా మార్చివేస్తాను. సముద్ర తీరాన కేవలం చేపలు పట్టే వలలు ఆరబెట్టటానికి పనికి వచ్చే స్థలంవలె తూరు అయిపోతుంది. ఇదే నా మాట!” నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “యుద్ధంలో సైనికులు తీసుకొనే విలువైన వస్తువుల వలె తూరు అయిపోతుంది. దాని ముఖ్య భూమిలో గల ఆమె కుమార్తెలు (చిన్న పట్టణాలు) యుద్ధంలో చంపబడతారు. అప్పుడు నేను యెహోవానని వారు తెలుసుకుంటారు.”

నెబుకద్నెజరు తూరును ఎదుర్కొంటాడు

నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “తూరు మీదికి ఉత్తర దిశనుండి ఒక శత్రువును రప్పిస్తాను. బబులోను మహారాజైన నెబుకద్నెజరే ఆ శత్రువు! అతడు చాలా పెద్ద సైన్యంతో వస్తాడు. ఆ సైన్యంలో గుర్రాలు, రథాలు, రౌతులు ఇంకా అనేకమంది ఇతర సైనికులు ఉంటారు! ఆ సైనికులలో చాలా దేశాల వారుంటారు. ముఖ్య భూమిలో నీ కుమార్తెలను (చిన్న పట్టణాలు) నెబుకద్నెజరు చంపివేస్తాడు. నీ నగరాన్ని ఎదుర్కోవటానికి అతడు బురుజులను నిర్మిస్తాడు. నీ నగరం చుట్టూ అతడు మట్టిబాట నిర్మిస్తాడు. గోడల వరకు ఒక మట్టిదారి వేస్తాడు. నీ గోడలు పగులగొట్టటానికి అతడు దూలాలు తెస్తాడు. నీ బురుజులు కూలగొట్టటానికి అతడు వాడిగల పనిముట్లను ఉపయోగిస్తాడు. 10 లెక్కకుమించి వున్న అతని గుర్రాలు రేపే దుమ్ముతో నీవు కప్పబడతావు. బబులోను రాజు నగర ద్వారాల గుండా నగర ప్రవేశం చేసినప్పుడు గుర్రాల చప్పుడుకు, బండ్లు, రథాలు చేసే ధ్వనికి నీ గోడలు క్రిందికి తోయబడుతాయి. అవును, నీ గోడలు పెరికివేయటానికి వారు నీ నగరంలోకి వస్తారు. 11 బబులోను రాజు గుర్రం మీద నీ నగరం గుండా వస్తాడు. అతని గుర్రాల డెక్కలు నీ వీధులన్నిటినీ పిండిగొట్టినట్లు దట్టిస్తాయి. నీ ప్రజలను అతడు కత్తులతో చంపివేస్తాడు. నీ నగరంలోని బలమైన స్తంభాలు నేలకూలుతాయి. 12 నెబుకద్నెజరు మనుష్యులు నీ ధనాన్ని దోచుకుంటారు. నీవు అమ్మ దలచిన వస్తువులను వారు ఎత్తుకుపోతారు. వారు నీ ప్రాకారాలను పడగొడతారు. నీ సుందర భవంతులను వారు నాశనం చేస్తారు. నీ రాళ్లను, కలప ఇండ్లను చెత్త వలె, సముద్రంలో పారవేస్తారు. 13 అలా మీ ఆనంద గీతికల శబ్దాన్ని ఆపివేస్తాను. ప్రజలు మీ వీణావాదనలు మరి వినరు. 14 నిన్నొక బండరాయిలా మార్చివేస్తాను. సముద్రపు ఒడ్డున చేపలు పట్టే వలలు ఆరబెట్టటానికి పనికివచ్చే స్థలంగా మారిపోతావు! నీవు తిరిగి నిర్మింపబడవు. ఎందువల్లననగా యెహోవానైన నేను ఈ విషయం చెపుతున్నాను!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

తూరు కొరకు ఇతర దేశాలు విలపిస్తాయి

15 నా ప్రభువైన యెహోనా ఈ విషయం తూరుకు చెపుతున్నాడు: “మధ్యధరా సముద్ర తీరానగల దేశాలు నీ పతనంవల్ల కలిగిన శబ్దానికి తుళ్లిపడతాయి. నీ ప్రజలు హింసించబడి, చంపబడినప్పుడు అది జరుగుతుంది. 16 సముద్రతీర దేశరాజులంతా తమ సింహాసనాలు దిగి తమ సంతాపాన్ని వెలిబుచ్చుతారు. వారు తమ ప్రత్యేక రాజదుస్తులు తీసివేస్తారు. వారు తమ అందమైన బట్టలు విసర్జిస్తారు. పిమ్మట వారు ‘భయసూచక దుస్తులు’ ధరిస్తారు. వారు నేలమీద కూర్చుని, భయంతో వణుకుతారు. ఎంత త్వరగా నీవు నాశనం చేయబడ్డావో చూచి వారు విస్మయం చెందుతారు. 17 నిన్ను గురించి వారు ఈ విషాద గీతిక పాడుతారు:

“‘ఒహో తూరూ, నీవొక ప్రసిద్ధ నగరానివి.
    నీలో నివసించాలని ప్రజలు సముద్రాలు దాటి వచ్చారు.
నీవు చాలా ప్రఖ్యాతి చెందిన దానివి.
    కాని నీవు లేకుండా పోయావు!
సముద్రంలో నీవు బలమైనదానవు.
    నీలాగే నీలో నివసించిన ప్రజలు కూడా బలిష్ఠులు.
నీ ముఖ్య భూమిలో నివసించే ప్రజలు
    నీవంటే భయపడేలా చేశావు.
18 మరి నీవు పతనమయ్యే రోజున తీర దేశాలు
    భయంతో కంపించిపోతాయి.
తీరం వెంబడి నీవెన్నో వాడలు ఏర్పాటు చేశావు.
    నీవు పోగానే ఆ ప్రజలు భయభ్రాంతులవుతారు!’”

19 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “తూరూ, నిన్ను నాశనం చేస్తాను. నీవొక పురాతన పాడుబడ్డ నగరంలా మారతావు. అక్కడ ఎవ్వరూ నివసించరు. సముద్రం పొంగి నీ మీదికి వచ్చేలా చేస్తాను. ఆ గొప్ప సముద్రం నిన్ను ఆవరిస్తుంది. 20 చనిపోయిన వాళ్లు పోయే పాతాళం లోకి నిన్ను పంపుతాను. ఎన్నడో చనిపోయిన వారిని నీవు కలుసుకొంటావు. పాడుబడిన ఇతర పురాతన నగరాలవలె నిన్ను కూడా క్రింది లోకానికి పంపివేస్తాను. సమాధికి పోయిన ఇతరులతో నీవు కూడా ఉండిపోతావు. అప్పుడు నీలో మరెవ్వరూ నివసించరు. మరెన్నటికీ నీవు నివసించటానికి అనువుకాకుండా పోతావు! 21 నీకు జరిగిన దానిని చూసి ప్రజలు భయపడిపోతారు. నీవు నాశనమవుతావు! ప్రజలు నీకొరకు చూస్తారు; కాని వారు నిన్ను ఇక కనుగొనలేరు!” నా ప్రభువైన యెహోవా చెప్పిన విషయం ఇది.

తూరు—సముద్రాలకు ద్వారం

27 మరొకసారి యెహోవా వాక్కు నాకు చేరింది. ఆయన ఇలా అన్నాడు: “నరపుత్రుడా, తూరును గురించి ఈ విషాద గీతం పాడుము. తూరును గురించిన ఈ విషయాలు తెలియజేయుము:

“‘తూరూ, నీవు సముద్రాలకు ద్వారం వంటిదానవు.
    అనేక దేశాలకు నీవు వ్యాపారివి.
    తీరం వెంబడి నీవనేక దేశాలకు ప్రయాణం చేస్తావు.
నిన్ను గూర్చి నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
తూరూ, నీవు చాలా అందమైన దానివని నీవనుకుంటున్నావు.
    నీవు చక్కని సుందరాంగివని తలపోస్తున్నావు!
మధ్యధరా సముద్రం నీ నగరం చుట్టూ సరిహద్దు.
    నిన్ను నిర్మించిన వారు నిన్ను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు!
    నీ నుండి ప్రయాణమై వెళ్లే ఓడలవలె నీవు ఉన్నావు.
నీ నిర్మాణపు పనివారు శెనీరు (హెర్మోను కొండ) నుండి
    తెచ్చిన తమాల వృక్షపు కర్రతో (ఓడ) బల్లలు తయారుచేశారు.
లెబానోను సరళవృక్షపు కర్రతో
    నీ ఓడ స్తంభాలను చేశారు.
బాషాను నుండి తెచ్చిన సింధూర వృక్షపు కర్రతో
    పడవ తెడ్లు చేశారు.
కిత్తీయుల ద్వీపం (సైప్రస్) నుండి తెచ్చిన దేవదారు వృక్షపు కర్రను వినియోగించి
    అడుగు అంతస్థులో గదిని నిర్మించారు.
    ఈ గదిని దంతపు పనితో అలంకరించారు.
ఈజిప్టు నుండి తెచ్చిన రంగు రంగుల నారబట్టలు నీ తెరచాపలుగా ఉపయోగించారు.
    ఆ తెరచాపయే నీ పతాకం.
నీ గది తెరలు నీలం, ఊదా రంగులను కలిగి ఉన్నాయి.
    అవి ఎలిషా (సైప్రస్)[c] ద్వీపంనుండి వచ్చినవి.
సీదోనూ, అర్వదు నివాసులు నీ కొరకు నీ పడవలు నడిపారు.
    తూరూ, నీ వారిలో తెలివి గలవారు నీ ఓడలకు చుక్కాని పట్టారు.
బిబ్లోసు (గెబలు) పెద్దలు, నేర్పరులైన పనివారు ఓడమీద ఉండి
    చెక్కల మధ్య కీలువేసి ఓడను బాగుచేశారు.
సముద్రం మీదనున్న అన్ని ఓడలు, వాటి నావికులు
    నీతో వర్తక వ్యాపారాలు చేయటానికి నీ వద్దకు వచ్చారు.’

10 “పారసీకులు (పర్షియావారు), లూదు వారు, పూతువారు నీ సైన్యంలో ఉన్నారు. వారు నీ యుద్ధ వీరులు. వారు తమ డాళ్లను, శిరస్త్రాణాలను నీ గోడలకు వేలాడదీశారు. వారు నీ నగరానికి ప్రతిష్ఠను తెచ్చి పెట్టారు. 11 నీ నగరం చుట్టూ అర్వదు మనుష్యులు కాపలాదారులుగా నిలబడియున్నారు. బురుజులలో గామదు మనుష్యులు ఉన్నారు. నీ నగరం చుట్టూ వాళ్లు తమ డాళ్లను వ్రేలాడదీసియున్నారు. వాళ్లు నీ సౌందర్యాన్ని సంపూర్ణముగా చేశారు.

12 “తర్షీషు[d] నీకున్న మంచి ఖాతాదారులలో ఒకటి. నీవు అమ్మే అద్భుతమైన వస్తువులకు వారు వెండి, ఇనుము, తగరం, సీసం ఇచ్చేవారు. 13 గ్రీకేయులు, టర్కీ (తుబాలువారు) మరియు నల్ల సముద్రపు (మెషెకు) ప్రాంత ప్రజలు నీతో వ్యాపారం చేశారు. నీవు అమ్మే సరుకులకు వారు బానిసలను, కంచును ఇచ్చేవారు. 14 తోగర్మా ప్రజలు నీవు అమ్మిన వస్తువులకు గుర్రాలను, యుద్ధాశ్వాలను, కంచర గాడిదలను ఇచ్చేవారు. 15 దదాను ప్రజలు నీతో వ్యాపారం చేశారు. నీవు నీ సరుకులను అనేకచోట్ల అమ్మావు. నీ సరుకులకు మూల్యంగా వారు ఏనుగు దంతాలు, విలువగల కోవిదారు కలపను ఇచ్చేవారు. 16 నీవద్ద అనేక మంచి వస్తువులు ఉన్న కారణంగా ఆరాము నీతో వ్యాపారం చేసింది. నీవు అమ్మే సరుకులకు ఎదోము ప్రజలు పచ్చమణులు, ఊదారంగు బట్టలు, సున్నితమైన అల్లిక పనిచేసిన వస్త్రాలు, నాజూకైన నారబట్టలు, పగడాలు, కెంపులు ఇచ్చేవారు.

17 “యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు నీతో వర్తకం చేశారు. వారు నీవద్ద కొనే సరుకులకు గోధుమ, ఒలీవలు, ముందు వచ్చే అత్తిపళ్లు, తేనె, నూనె, గుగ్గిలం యిచ్చేవారు. 18 దమస్కు నీకు మరో మంచి ఖాతాదారు. నీవద్ద ఉన్న అనేక అద్భుత వస్తువులను వారు కొనుగోలు చేశారు. ప్రతిగా వారు హెల్బోను నుండి తెచ్చిన ద్రాక్షారసాన్ని, తెల్ల ఉన్నిని నీకిచ్చేవారు. 19 నీవమ్మే సరుకులకు దమస్కువారు ఉజాల్ నుండి తెచ్చిన ద్రాక్షారసాన్ని నీకిచ్చేవారు. వాటిని ఇనుము, కసింద మూలిక, చెరకును వారు కొన్న వస్తువులకు మారుగా ఇచ్చేవారు. 20 వ్యాపారం ముమ్మరంగా సాగటానికి దదాను దోహద పడింది. వారు గుర్రపు గంతపై వేసే బట్టను, స్వారీ గుర్రాలను నీకిచ్చి సరుకులు కొనేవారు. 21 అరబీయులు (అరేబియావారు) కేదారు నాయకులు నీకు గొర్రె పిల్లలను, పొట్లేళ్లను, మేకలను ఇచ్చి నీవద్ద ఉన్న సరుకులు కొనేవారు. 22 షేబ దేశపు వర్తకులు, రామా ప్రాంత వర్తకులు నీతో వ్యాపారం చేశారు. నీ వస్తువులకు వారు మిక్కిలి శ్రేష్ఠమైన సుగంధ ద్రవ్యాలు, నానారకాల విలువైన రాళ్లు, బంగారం ఇచ్చేవారు. 23 హారాను, కన్నే, ఏదెను, షేబ, అష్షూరు మరియు కిల్మదు దేశాల ప్రజలు, వర్తకులు నీతో వ్యాపారం చేశారు. 24 నీవద్ద కొన్న సరుకులకు వారు నాణ్యమైన వస్త్రాలు, నీలవర్ణపు, అల్లిక పనిచేసిన దుస్తులు, రంగు రంగుల తివాచీలు, బాగా పురిపెట్టి పేనిన తాళ్ళు, దేవదారు కలపతో చేయబడిన అనేక వస్తువులు ఇచ్చేవారు. ఈ వస్తు సామగ్రులతో వారు నీతో వ్యాపారం చేశారు. 25 నీవు అమ్మిన సరుకులు తర్షీషు ఓడలు మోసుకుపోయేవి.

“తూరూ! నీవు సరుకులతో నిండిన ఓడలాంటి దానివి.
    నీవు సముద్రం మీద అనేకమైన విలువగల సరుకులతో ఉన్నదానివి.
26 నీ పడవలను నడిపిన నావికులు నిన్ను మహా సముద్రాల మధ్యగా తీసుకొని వెళ్తారు.
    కాని బలమైన తూర్పు గాలులు నీ ఓడను నడిసముద్రంలో నాశనం చేస్తాయి.
27 నీ ధనమంతా సముద్రం పాలవుతుంది.
    నీ ఐశ్వర్యం, నీ వర్తకం, నీ సరుకు, నీ నావికులు, చుక్కాని పట్టేవారు,
కీలుపెట్టి పడవలు బాగుచేసే పనివారు, నీ అమ్మకపు దారులు, నీ నగరంలో గల సైనికులు, నీ ఓడ సిబ్బంది
    అంతా సముద్రంలో మునిగిపోతారు!
నీవు నాశనమయ్యే రోజున
    ఇదంతా జరుగుతుంది.

28 “నీ వ్యాపారులను నీవు బహుదూర ప్రాంతాలకు పంపిస్తావు.
    అయితే నీ ఓడ చుక్కాని పట్టేవాని రోదన విన్నప్పుడు ఆ ప్రాంతాలు భయంతో వణకిపోతాయి!
29 నీ ఓడ సిబ్బంది అంతా ఓడ నుండి దుముకుతారు.
    నీ నావికులు, చుక్కాని పట్టేవారు ఓడ నుండి దుమికి ఒడ్డుకు ఈదుతారు.
30 వారు నిన్ను గురించి చాలా బాధపడతారు.
    వారు రోదిస్తారు. వారు తమ తలలపై దుమ్ము పోసుకుంటారు. వారు బూడిదలో పొర్లాడుతారు.
31 నీ కొరకు వారు తమ తలలు గొరిగించుకుంటారు.
    వారు విషాద సూచక దుస్తులు ధరిస్తారు.
వారు నీకొరకు దుఃఖిస్తారు.
    మృతుడైన వ్యక్తి కొరకు ఏడ్చేవానిలా వారు శోకిస్తారు.

32 “వారి భయంకర రోదనలో, ఈ విషాద గీతం వారు ఆలపిస్తూ నీకొరకు విలపిస్తారు,

“‘తూరు వంటిది మరొక్కటి లేదు!
    నడి సముద్రంలో తూరు నాశనమయ్యింది!
33 నీ వ్యాపారులు సముద్రాల మీద పయనించారు.
    నీ మహా సంపదతోను, నీవు అమ్మిన సరుకులతోను నీవనేక మందిని తృప్తిపర్చావు.
    ఈ భూమిపై గల రాజులను నీవు ఐశ్వర్యవంతులుగా చేశావు!
34 కాని నీవు నడిసముద్రంలో,
    అగాధంలో ముక్కలై పోయావు.
నీవు అమ్మే వస్తువులతో పాటు
    నీ మనుష్యులందరూ కూలిపోయారు!
35 తీరవాసులంతా నీ విషయంలో అదిరిపోయారు.
    వారి రాజులు తీవ్రంగా భయపడ్డారు.
వారి రాజులు తీవ్రంగా భయపడ్డారు.
    వారి ముఖాలు చిన్నబోయాయి.
36 ఇతర రాజ్యాల వర్తకులు నిన్ను చూసి చులకనగా మాట్లాడారు.
నీకు జరిగిన సంఘటనలు ప్రజలను భయభ్రాంతులను చేశాయి.
    ఎందువల్లనంటే నీవు సర్వనాశనమయ్యావు.
    నీవిక లేవు.’”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International