Chronological
ఇశ్రాయేలు దేవునినుండి తొలగిపోవుట
20 ఒక రోజు ఇశ్రాయేలు పెద్దలు యెహోవా సలహా తీసుకొనగోరి నా వద్దకు వచ్చారు. ఇది ప్రవాసంలో ఏడవ సంవత్సరం ఐదవ నెల (జులై), పదవ రోజున జరిగింది. పెద్దలు (నాయకులు) నా ముందు కూర్చున్నారు.
2 అప్పుడు యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా చెప్పాడు: 3 “నరపుత్రుడా, ఇశ్రాయేలు పెద్దలతో మాట్లాడు. వారితో ఇలా చెప్పు, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుచున్నాడు, మీరంతా నా సలహా తీసుకోదలచి వచ్చారా? అలా వచ్చివుంటే, దానిని మీకు నేను యివ్వను. ఈ విషయాలు నా ప్రభువైన యెహోవా చెప్పియున్నాడు.’ 4 నీవు వారికి తీర్పు తీర్చుతావా? నరపుత్రుడా, నీవు వారికి న్యాయ నిర్ణయం చేస్తావా? వారి తండ్రులు చేసిన భయంకర నేరాలను గూర్చి నీవు వారికి తెలియజెప్పాలి. 5 వారికి నీవిలా చెప్పాలి, నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెబుతున్నాడు, నేను ఇశ్రాయేలును ఎంపిక చేసుకొన్నప్పుడు, యాకోబు వంశం కొరకు నా చేయెత్తి ఈజిప్టు వారికి ఒక వాగ్దానం చేశాను. అక్కడ నన్ను నేను ప్రత్యక్షపరచుకొన్నాను. నా చేయెత్తి ఇలా చేప్పాను: ‘నేను మీ దేవుడనైన యెహోవాను.’ 6 ఆ రోజున మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చి, నేను మీకు ఇవ్వబోతున్న దేశంలోకి నడిపిస్తానని వాగ్దానం చేశాను. ఆది చాలా మంచి వస్తువులున్న దేశం.[a] దేశాలన్నిటిలోకి అది సుందరమైనది!
7 “‘రోత పుట్టించే విగ్రహాలన్నిటినీ పారవేయమని నేను ఇశ్రాయేలు వంశం వారికి చెప్పాను. ఈజిప్టు నుండి తేబడిన హేయమైన విగ్రహాలతో వారు కూడ హేయమైనవారుగా తయారు కావద్దని నేను చెప్పియున్నాను. నేను మీ దేవుడనైన యెహోవాను 8 కాని వారు నాపై తిరుగుబాటు చేసి, నేను చెప్పేది వినలేదు. ఈజిప్టువారి అపవిత్రమైన విగ్రహాలను పారవేయలేదు. వారి అపవిత్ర విగ్రహాలను ఈజిప్టులో వదిలివేయలేదు. కావున నేను (దేవుడు) ఉగ్రమైన నా కోపాన్ని చూపించటానికి ఈజిప్టులోనే వారిని నాశనం చేయదల్చాను. 9 అయినా నేను వారిని సంహరించలేదు. ఈజిప్టు నుండి నా ప్రజలను బయటకు తీసుకొని వస్తానని గతంలోనే వారు నివసిస్తున్న చోటి ప్రజలకు తెలియజేశాను. నా మంచి పేరును నేను పాడుచేయదల్చుకోలేదు. అందువల్ల ఆ అన్యప్రజల ముందు ఇశ్రాయేలును నాశనం చేయలేదు. 10 ఇశ్రాయేలు వంశాన్ని నేను ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చాను. వారిని ఎడారిలోకి నడిపించాను. 11 అక్కడ నేను వారికి నా కట్టడలను తెలియజేశాను. నా నియమ నిబంధనలన్నీ వారికి తెలియజెప్పాను. నా కట్టడలను పాటించిన వ్యక్తి జీవిస్తాడు. 12 ప్రత్యేక విశ్రాంతి రోజులన్నిటి గురించి కూడా నేను వారికి చెప్పాను. నాకు, వారికి మధ్య ఆ సెలవు రోజులు ఒక ప్రత్యేక సంకేతం. అవి నేను యెహోవానని, వారిని నా ప్రత్యేక ప్రజలుగా చేసుకున్నానని తెలియజేస్తాయి.
13 “‘అయినా ఇశ్రాయేలు వంశం ఎడారిలో నా మీద తిరుగుబాటు చేసింది. వారు నా న్యాయాన్ని పాటించలేదు. వారు నా కట్టడలను అనుసరించటానికి నిరాకరించారు. పైగా అవి ఎంతో మంచి నియమాలు. ఏ వ్యక్తి అయినా ఆ నియమాలను పాటిస్తే, అతడు జీవిస్తాడు. నేను నియమించిన ప్రత్యేక విశ్రాంతి రోజులను వారు సామాన్య రోజులుగా పరిగణించారు. అనేకసార్లు వారా విశ్రాంతి రోజులలో పనిచేశారు. నా ఉగ్రమైన కోపాన్ని వారు చవిచూడటానికి నేను వారిని ఎడారిలో నాశనం చేయ సంకల్పించాను. 14 అయినా నేను వారిని సంహరించలేదు. నేను ఇశ్రాయేలును, ఈజిప్టు నుండి వెలికి తీసుకొని రావటం ఇతర దేశాలు చూశాయి. నాకున్న మంచి పేరును నేను పాడుచేసుకోదల్చలేదు. అందువల్ల అన్యప్రజల ముందు నేను ఇశ్రాయేలును సంహరించలేదు. 15 ఎడారిలోని ఆ ప్రజలకు నేను మరొక వాగ్దానం చేశాను. వారికి నేనివ్వబోయే దేశంలోకి వారిని నేను తీసుకొని వెళ్లనని గట్టిగా చెప్పాను. ఆది పాలు, తేనె ప్రవహించే సుభిక్షమైన దేశం. అది దేశాలన్నిటిలోకీ సుందరమైన దేశం!
16 “‘ఇశ్రాయేలు ప్రజలు నా కట్టడలను పాటించ నిరాకరించారు. వారు నా విధులను అనుసరించలేదు. నేను నిర్ణయించిన విశ్రాంతి రోజులను అతి సామాన్యమైనవిగా వారు పరిగణించారు. వారి హృదయాలు ఆ అపవిత్ర విగ్రహాలమీద లగ్నమై వుండుటచేత వారీ పనులన్నీ చేశారు. 17 కాని వారి స్థితిపట్ల నేను విచారం వ్యక్తం చేశాను. వారిని నేను సంహరించలేదు. ఎడారిలో వారిని నేను సర్వనాశనం చేయలేదు. 18 నేను వారి పిల్లలతో ఎడారిలో మాట్లాడాను. నేను వారితో, “మీరు మీ తల్లిదండ్రులవలె ప్రవర్తించవద్దు. అపవిత్ర విగ్రహాల జోలికిపోయి మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు. వాటి ధర్మాన్ని మీరు అనుసరించవద్దు. వాటి ఆజ్ఞలను మీరు పాటించవద్దు. 19 నేనే యెహోవాను. నేను మీ దేవుణ్ణి. నా ధర్మాన్ని అనుసరించండి. ఆజ్ఞాపాలన గావించండి. నేను చెప్పే పనులు చేయండి. 20 నేను నిర్దేశించిన విశ్రాంతి రోజులు మీకు అతి ముఖ్యమైనవని చూపించండి. అవి నాకును, మీకును మధ్య ఒక ప్రత్యేక సంకేతమని గుర్తు పెట్టుకోండి. నేనే యెహోవాను. నేను మీ దేవుడనని ఆ సెలవు రోజులు మీకు సూచిస్తాయి.”
21 “‘కాని ఆ పిల్లలు నాకు వ్యతిరేకులయ్యారు. వారు నా కట్టడలను పాటించలేదు. వారు నా ఆజ్ఞలను లెక్క చేయలేదు. నేను వారికి చెప్పిన పనులు చేయలేదు. అవన్నీ మంచి న్యాయ సూత్రాలు. ఎవ్వరు వాటిని అనుసరించినా, ఆ వ్యక్తి జీవిస్తాడు. నేను నిర్దేశించిన ప్రత్యేక విశ్రాంతి రోజులను ప్రాముఖ్యంలేని వాటినిగా వారు పరిగణించారు. అందువల్ల నేను ఎడారిలో నా ఉగ్రమైన కోపం చూపటానికి వారిని సర్వనాశనం చేద్దామనుకున్నాను. 22 కాని నాకు నేనే ఆగిపోయాను. నేను ఇశ్రాయేలును ఈజిప్టు నుండి బయటకు తీసుకొని రావటం ఇతర రాజ్యాలు చూశాయి. నాకున్న మంచి పేరును నేను పాడు చేసుకోదల్చలేదు. అందువల్ల నేను ఇశ్రాయేలును అన్య జనుల ముందు సంహరించలేదు. 23 అందువల్ల ఎడారిలో వారికి నేను ఇంకొక మాట చెప్పాను. వారిని ఇతర రాజ్యాలలోకి చెదరగొడతాననీ, వారిని అనేక దేశాలకు పంపించి వేస్తాననీ చెప్పాను.
24 “‘ఇశ్రాయేలు ప్రజలు నా ఆజ్ఞలను శిరసావహించలేదు. వారు నా కట్టడలను అనుసరించటానికి నిరాకరించవారు. వారు నేనిచ్చిన ప్రత్యేక విశ్రాంతి రోజులను ముఖ్యమైనవిగా పరిగణించలేదు. వారి తండ్రుల అపవిత్ర విగ్రహాలను వారు పూజించారు. 25 అందువల్ల వారికి నేను చెడ్డ నీతిని ప్రసాదించాను. వారు బతకటానికి ఆధారం కాని ఆజ్ఞలను నేను వారికి ఇచ్చాను. 26 వారి కానుకలతో వారిని వారే మలిన పర్చుకొనేలా వారిని వదిలివేశాను. వారు తమ మొదటి సంతానాన్ని సహితం బలి ఇవ్వటం మొదలు పెట్టారు. ఈ రకంగా ఆ ప్రజలను నేను నాశనం చేస్తాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకొంటారు.’ 27 కావున, ఓ నరపుత్రుడా, ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వంశంతో మాట్లాడు. వారికిలా చేప్పు, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు నాకు వ్యతిరేకంగా చెడుమాటలు పలికారు. నాపై కుట్రపన్నారు. 28 అయినా నేను వారికి ఇస్తానని వాగ్దానం చేసిన రాజ్యానికి వారిని తీసుకొని వచ్చాను. వారు కొండలను, పచ్చని చెట్లను అన్నిటినీ చూసి పూజలు చేయటానికి ఆ ప్రదేశాలకు వెళ్లేవారు. వారు బలులను, కోప కానుకలను[b] ఆ ప్రదేశాలన్నిటికీ తీసుకొని వెళ్లారు. సువాసన వేసే వారి బలులన్నీ వారు అర్పించారు. ఆ స్థలాలలో పానార్పణాలు కూడా వారు అర్పించారు. 29 వారా ఉన్నత స్థలాలకు ఎందుకు వెళ్తున్నారని నేను వారిని అడిగాను. ఆ ఆరాధనా స్థలాలన్నీ ఈనాటికీ ఉన్నత స్థలాలు[c] అనే పిలవబడుతున్నాయి.’”
30 దేవుడు ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలు ఆ చెడు కార్యాలన్నీ చేశారు. అందువల్ల ఇశ్రాయేలు వంశంవారితో మాట్లాడు. వారికి ఈ రకంగా చెప్పుము, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు. మీ పూర్వీకులు చేసిన పనులనే చేస్తూ మిమ్మును మీరు మలిన పర్చుకుంటున్నారు. మీరు వేశ్య[d] వలె ప్రవర్తిస్తున్నారు. మీ పూర్వీకులు ఆరాధించిన భయంకర దేవుళ్ళను ఆరాధించటానికి మీరు నన్ను వదిలివేశారు. 31 మీరు కూడా అవే రకమైన కానుకలు సమర్పిస్తున్నారు. మీ బూటకపు దేవతలకు కానుకగా మీ పిల్లలను అగ్నిలో పడవేస్తున్నారు. ఈనాడు ఆ రోత విగ్రహాలను ఆశ్రయించి మిమ్మల్ని మీరు మరింత మలిన పర్చుకుంటున్నారు! నేను మిమ్మల్ని నా వద్దకు రానిచ్చి, నా సలహా తీసుకోనివ్వాలని మీరు నిజంగా అనుకుంటున్నారా? నేను ప్రభువును; యెహోవాను. నా జీవ ప్రమాణంగా మీ ప్రశ్నలకు సమాధానమివ్వను. మీకు సలహా ఇవ్వను! 32 ఇతర రాజ్యాల మాదిరిగా ఉండాలని కోరుకుంటున్నట్లు మీరు అంటూ ఉంటారు. కానీ మీ అభిప్రాయాలు, ఆశలూ ఎప్పటికీ నెరవేరవు. ఇతర జనాంగముల ప్రజల మాదిరిగా మీరు నివసిస్తున్నారు. కొయ్యముక్కలను, రాతి ముక్కలను (విగ్రహాలు) మీరు కొలుస్తారు!’”
33 నా ప్రభువైన యెహోవా ఇలా చెప్పుతున్నాడు, “నా జీవ ప్రమాణంగా, రాజునై మిమ్మల్ని పరిపాలిస్తానని వాగ్దానం చేస్తున్నాను. కాని నా శక్తివంతమైన హస్తాన్ని ఎత్తి మిమ్మల్ని శిక్షిస్తాను. మీపట్ల నా కోపాన్ని చూపిస్తాను! 34 మిమ్మల్నందరినీ ఈ అన్యదేశాల నుండి వెలికి తెస్తాను. ఈ రాజ్యాలకు నేను మిమ్మల్ని చెదర గొట్టాను. కాని మిమ్మల్నందరినీ కూడదీసి, ఈ రాజ్యాల నుండి తిరిగి తీసుకొని వస్తాను. అయినా నా బలమైన హస్తాన్ని ఎత్తి మిమ్మల్ని శిక్షిస్తాను. మీమీద నాకు గల కోపాన్ని వెల్లడిస్తాను! 35 నేను గతంలో చేసినట్లు మిమ్మల్ని ఒక ఎడారికి నడిపిస్తాను. కాని ఇది అన్యదేశీయులు నివసించే ఒక స్థలం. అక్కడ నేను ముఖాముఖిగా మీతో వ్యాజ్యెమాడుతాను. 36 గతంలో ఈజిప్టు వద్దగల ఎడారిలో నేను మీ పూర్వికులకు తీర్పు తీర్చినట్లు, ఇప్పుడిక్కడ మీకు న్యాయ నిర్ణయం చేస్తాను.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
37 “మీరు నేరస్థులని తీర్పు ఇచ్చి, ఒడంబడిక[e] ప్రకారం మిమ్మల్ని శిక్షిస్తాను. 38 నాపై తిరుగుబాటు చేసి, నాపట్ల పాపం చేసిన ప్రజలందరినీ నేను తొలగిస్తాను. మీ స్వదేశాన్నుండి వారందరినీ తొలగిస్తాను. వారు మరెన్నడూ ఇశ్రాయేలు రాజ్యానికి తిరిగిరారు. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొంటారు.”
39 ఓ ఇశ్రాయేలు వంశములారా, నా ప్రభువైన యెహోవా ఇప్పుడు ఈ విషయాలు చెప్పుతున్నాడు, “ఏ వ్యక్తి అయినా తన రోత విగ్రహాలను పూజింపగోరితే, అతనిని వెళ్లి వాటిని పూజించనీయండి. కాని, తరువాత నానుండి ఏదైనా సలహా మీకు వస్తుందని మాత్రం మీరు అనుకోవద్దు! మీరు నా పేరు ఇక ఏ మాత్రం పాడుచేయలేరు! ముఖ్యంగా మీరు మీ నీచ విగ్రహాలకు కానుకలను సమర్పించినా అది జరగదు.”
40 నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “ప్రజలు నన్ను సేవించటానికి ఇశ్రాయేలులో ఎత్తైన పర్వతంగా పేరొందిన నా పవిత్ర పర్వతం వద్దకు రావాలి! ఇశ్రాయేలు వంశంవారంతా తమ స్వంత భూమి మీదికి వస్తారు. వారు తమ దేశంలో ఉంటారు. మీరు నా సలహా కోరి రావలసిన స్థలం అదే. మీరు ఆ స్థలానికి నాకు అర్పణలు ఇవ్వటానికి రావాలి. ఆ స్థలంలో మీ పంటలో తొలి భాగాన్ని నా కొరకు తేవాలి. ఆ స్థలంలో మీ పవిత్ర కానుకలు నాకు సమర్పించాలి. 41 అప్పుడు మీరు సమర్పించే బలుల సువాసనలతో నేను సంతృప్తి చెందుతాను. ఇదంతా నేను మిమ్మల్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు జరుగుతుంది. నేను మిమ్మల్ని అనేక దేశాలకు చెదరగొట్టాను. అయినా నేను మిమ్మల్నందరినీ కూడగట్టి, మళ్లీ నా ప్రత్యేక ప్రజగా స్వీకరిస్తాను. పైగా ఆయా దేశాలన్నీ ఇదంతా చూస్తాయి. 42 అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొంటారు. నేను మిమ్మల్ని ఇశ్రాయేలు రాజ్యానికి తీసుకొని వచ్చినప్పుడు ఇది మీరు తెలుసుకొంటారు. అది నేను మీ పూర్వీకులకు ఇస్తానని వాగ్దానం చేసిన రాజ్యం. 43 ఆ రాజ్యంలో మిమ్మల్ని మలినపర్చిన వస్తువులను, మీరు చేసిన చెడుకార్యాలను మీరు గుర్తుకు తెచ్చుకుని సిగ్గుపడతారు. 44 ఇశ్రాయేలు వంశములారా, మీరు ఎన్నో అకృత్యాలు చేశారు. ఆ చెడుకార్యాలకు ఫలితంగా మీరు నాశనం చేయబడాలి. కాని నాకున్న మంచి పేరు కాపాడుకోవటానికి, మీకు నిజంగా అర్హమైన శిక్ష విధించవలసి వుండి కూడా నేను విధించను. నేనే యెహోవానని పిమ్మట మీరు తెలుసుకొంటారు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
45 మళ్లీ యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఈ విధంగా చెప్పాడు: 46 “నరపుత్రుడా, యూదా రాజ్యం దక్షిణాన వున్న నెగెవు వైపు చూడు. నెగెవు అరణ్యానికి[f] వ్యతిరేకంగా మాట్లాడు. 47 నెగెవు అరణ్యానికి ఇలా చెప్పు, ‘యెహోవా వాక్కు విను. నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. చూడు, నీ అరణ్యంలో అగ్ని రగల్చటానికి నేను సిద్దంగా ఉన్నాను. ప్రతి పచ్చని చెట్టునూ, ప్రతి ఎండిన చెట్టునూ అగ్ని దహించి వేస్తుంది. అలా కాల్చివేసే ఆ నిప్పు ఆర్పబడదు. దక్షణం నుండి ఉత్తరం వరకు గల ప్రదేశమంతా కాల్చివేయ బడుతుంది. 48 అప్పుడు ప్రజలంతా యెహోవానైన నేనే ఈ అగ్నిని ప్రజ్వలింపచేసినట్లు తెలుసుకుంటారు. ఆ నిప్పు ఆర్పివేయబడదు.’”
49 పిమ్మట నేను (యెహెజ్కేలు) ఇలా అన్నాను: “ఓ నా ప్రభువైన యెహోవా! నేనా విషయాలు ప్రజలకు చెప్తే నేనేవో కాకమ్మ కథలు వారికి చెబుతున్నానని అనుకుంటారు. అది నిజంగా సంభవిస్తుందని వారను కోరు!”
ఖడ్గము బబులోను
21 అందువల్ల యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఈ విధంగా చెప్పాడు: 2 “నరపుత్రుడా, యెరూషలేము వైపు చూసి, వారి పవిత్ర స్థలాలకు వ్యతిరేకంగా మాట్లాడు. నా తరపున ఇశ్రాయేలు రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడు. 3 ఇశ్రాయేలు రాజ్యానికిలా తెలియజేయి, ‘యెహోవా ఈ విషయాలు చెప్పాడు, నేను నీకు వ్యతిరేకంగా వున్నాను! ఒరలోనుండి నా కత్తిని దూస్తాను. నీనుండి ప్రజలందరినీ తొలగిస్తాను. వారిలో మంచివారు, చెడ్డవారు అంతా ఉంటారు! 4 నీ మంచి మనుష్యులనూ, చెడ్డవారినీ నేను నాశనం చేస్తాను. ఒరనుండి నా కత్తిని దూస్తాను. దక్షిణాన్నుండి ఉత్తరం వరకు గల ప్రజలందరిపై దానిని ప్రయోగిస్తాను. 5 అప్పుడు ప్రజలంతా నేనే యెహోవానని తెలుసుకొంటారు. పైగా నా కత్తిని ఒరనుండి దూశానని కూడా వారు తెలుసుకొంటారు. తన పని పూర్తి చేసే వరకు నా కత్తి మళ్లీ ఒరలోకి తిరిగి వెళ్లదు.’”
6 దేవుడు నాతో ఇలా అన్నాడు: “నరపుత్రుడా, గుండె పగిలే దుఃఖంలో వున్న వ్యక్తిలా నీవు ప్రజల ముందే నిట్టూర్పులు విడువు. 7 వారప్పుడు నిన్ను, ‘నీ వెందుకు నిట్టూరుస్తున్నావు?’ అని అడుగుతారు. దానికి నీవు ఇలా సమాదానం చెప్పాలి, ‘రాబోయే విషాద వార్తను తలచుకొని భయంతో ప్రతి హృదయం వికలమైపోతుంది. చేతులు బలహీనమవుతాయి. ప్రతి ప్రాణం నీరసించి పోతుంది. మోకాళ్ళు నీళ్లవలె మారిపోతాయి.’ చూడండి; ఆ చెడ్డవార్త రాబోతూ ఉంది. ఈ విషయాలన్నీ జరుగుతాయి!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
ఖడ్గం సిద్ధంగా ఉంది
8 యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: 9 “నరపుత్రుడా, నా తరపున ప్రజలతో మాట్లాడు. ఈ విషయాలు తెలియజెప్పు, ‘నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెబుతున్నాడు:
“‘చూడండి, ఒక కత్తి,
పదునుగల కత్తి మెరుగుదిద్దిన కత్తి.
10 చంపటానికి పదును పెట్టబడిన కత్తి.
మెరుపులా మెరవటానికి అది మెరుగుదిద్దబడింది.
నా కుమారా, నిన్ను శిక్షించటానికి నేను వాడే కర్రకు నీవు దూరంగా పారిపోయావు.
ఆ కట్టెపుల్లతో శిక్షింపబడటానికి నీవు నిరాకరించావు.
11 అందువల్ల కత్తి మెరుగు పెట్టబడింది.
ఇప్పుడది వాడబడుతుంది.
కత్తి పదును పెట్టబడి, మెరుగుదిద్దబడింది.
అదిప్పుడు చంపేవాని చేతికి ఇవ్వబడుతుంది.
12 “‘నరపుత్రుడా, కేకలు పెట్టి రోదించు! ఎందుకంటే ఆ కత్తి నా ప్రజల మీదికి, ఇశ్రాయేలు పాలకుల మీదికి తేబడింది! ఆ పాలకులు యుద్ధాన్ని కోరారు. అందువల్ల కత్తి ఎదురైనప్పుడు వారు నా ప్రజలతో పాటు వుంటారు! కావున నీ తొడ చరుచుకొని, నీ దుఃఖాన్ని వెలిబుచ్చే పెద్ద శబ్దాలు చేయుము! 13 ఎందు వల్లనంటే, ఇది కేవలం పరీక్ష కాగాదు! నీవు కట్టెతో శిక్షింపబడటానికి నిరాకరించావు. కనుక నిన్ను శిక్షించటానికి మరి నేనేమి ఉపయోగించాలి? అవును. కత్తినే!’” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
14 దేవుడు ఇంకా ఇలా అన్నాడు: “నరపుత్రుడా, నీవు చప్పట్లు చరిచి, నా తరపున ప్రజలతో మాట్లాడు.
“కత్తిని రెండుసార్లు క్రిందికి రానీ, అవును, మూడుసార్లు!
ఈ కత్తి ప్రజలను హతమార్చటానికే.
మహా మారణానికి వినియోగించబడేది ఈ ఖడ్గమే!
ఈ కత్తి వాళ్లను ఖండిస్తుంది.
15 భయంతో వారి హృదయాలు కరుగుతాయి.
చాలామంది పడిపోతారు.
వారి నగర ద్వారం వద్దనే చంపబడతారు.
అవును. ప్రజలను చంపటానికి ఆ ఖడ్గాన్ని నేనే ఎంపిక చేశాను!
ఆ ఖడ్గం మెరుపుతీగలా ప్రకాశిస్తుంది.
16 ఓ ఖడ్గమా, పదునుగా నుండుము,
కుడి ప్రక్క నరుకు.
ఎడమ ప్రక్క నరుకు.
నీ అంచు ఎటు వెళ్లగోరితే అటు వెళ్లు!
17 “అప్పుడు నేను కూడా చప్పట్లు చరుస్తాను.
పిమ్మట నా కోపాన్ని చూపడం ఆపుతాను.
యెహోవానైన నేను మాట్లాడాను!”
యెరూషలేము శిక్షించబడుతుంది
18 యెహోవా మాట నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు: 19 “నరపుత్రుడా, బబులోను రాజు ఖడ్గం ఇశ్రాయేలుపై రావటానికి వినియోగపడే రెండు మార్గాలను గీయుము. రెండు మార్గాలూ ఒకే ప్రదేశం బబులోను నుండి మొదలవ్వాలి. నగరానికి వచ్చే ఒక మార్గం మొదట్లో ఒక గుర్తు పెట్టు. 20 ఖడ్గం ఏ దారిని వినియోగిస్తుందో తెలుపటానికి ఆ గుర్తు పెట్టాలి. ఒక మార్గం అమ్మెనీయుల నగరమైన రబ్బాకు వెళ్తుంది. మరొక మార్గం యూదాలోని రక్షిత నగరమైన యెరూషలేముకు వెళ్తుంది! 21 ఇది బబులోను రాజు ఆ ప్రాంతాన్ని తాను ఎలా ఎదుర్కోవాలన్నదానిని తెలుపుతుంది. బబులోను రాజు ఆ మార్గం రెండుగా విడిపోయే చోటికి వచ్చాడు. బబులోను రాజు తన భవిష్యత్తు కార్యక్రమం తెలుసుకొనటానికి మంత్ర, తంత్ర సంకేతాలను ఉపయోగించాడు. అతడు కొన్ని బాణాలు తీసుకొన్నాడు. తన కులదేవతలను కొన్ని ప్రశ్నలడిగాడు. పిమ్మట అతడు చంపిన ఒక జంతువు కార్జంవెపు చూశాడు.
22 “అక్కడ అతను కొన్ని సంకేతాలు చూశాడు. అవి అతనిని తన కుడిప్రక్కనున్న యెరూషలేముకు పోయే మార్గంలో వెళ్లమని సూచించాయి! అతడు నగర ద్వారాలు పగులగొట్టే దూలాల యంత్రాలను తేవటానికి సిద్ధం కమ్మనే సంకేతం ఇవ్వాలనుకున్నాడు. అతడు ఆజ్ఞ ఇవ్వగానే అతని సైనికులు మారణకాండకు పూనుకుంటారు. యుద్ధ నినాదాలు చేయమని, నగరపు గోడకు మురికి వీధిని నిర్మించమని, మరియు కొయ్య బురుజులు నగరాన్ని ఎదుర్కోవడానికి నిర్మించమని సంకేతాలు యిస్తాడు. 23 ఆ తంత్ర సంకేతాలు ఇశ్రాయేలు ప్రజలకు అర్థంకావు. వారు చేసిన వాగ్దానాలు వారికున్నాయి. అవి వారికి ముఖ్యం. కాని యెహోవా వారి పాపాలను జ్ఞాపకం పెట్టుకుంటాడు. దానితో ఇశ్రాయేలీయులు పట్టుబడతారు.”
24 నా ప్రభువైన యెహోవా ఈ విషయం చెప్పాడు: “మీరు అనేక చెడు కార్యాలు చేశారు. మీ పాపాలు చాలా స్పష్టంగా కన్పిస్తున్నాయి. మీరు నేరస్థులని గుర్తుపెట్టుకొనేలా మీరు నన్ను ఒత్తిడి చేశారు. కావున శత్రువు మిమ్మల్ని తన గుప్పెట్లో పెట్టుకుంటాడు. 25 ఓ ఇశ్రాయేలు దుష్ట నాయకుడా, నీవు చంపబడతావు. నీకు శిక్ష కాలం సమీపించింది! నీ అంతం ఇక్కడే!”
26 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు, “నీ తలపాగా తీసివేయి! నీ కిరీటం తీసివేయి! మార్పుకు సమయం ఆసన్నమయ్యింది. ముఖ్య నాయకులు తగ్గింపబడతారు. సామాన్య మానవులు ప్రముఖ వ్యక్తులౌతారు. 27 ఆ నగరాన్ని నేను సర్వనాశనం చేస్తాను! కాని యోగ్యుడైన వ్యక్తి క్రొత్త రాజు అయ్యేవరకు ఇది సంభవించదు. అప్పుడు ఈ నగరాన్ని అతడు (బబులోను రాజు) కైవసం చేసుకొనేలా చేస్తాను.”
అమ్మోరీయులు శిక్షించబడ్డారు
28 దేవుడు ఇలా చెప్పాడు: “నరపుత్రుడా, నా తరపున ప్రజలతో మాట్లాడు. ఈ విషయాలు చెప్పు: ‘అమ్మోను ప్రజలకు, వారి సిగ్గుచేటు దేవతకు నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
“‘చూడండి, ఒక ఖడ్గం!
ఆ ఖడ్గం దాని ఒరనుండి బయటకు వచ్చింది.
కత్తి మెరుగు దిద్దబడింది!
కత్తి సంహారానికి సిద్ధంగా ఉంది.
అది మెరుపు తీగలా ప్రకాశించటానికి మెరుగు దిద్దబడింది!
29 “‘మీ దర్శనాలు పనికిరావు.
మీ మంత్ర తంత్రాలు సహాయపడవు.
అదంతా ఒక అబద్ధాల మూట.
దుష్టుల మెడల మీద ఇప్పుడు కత్తి ఉంది.
వారు త్వరలో శవాలై పోతారు.
వారికి సమయం దాపురించింది.
వారి చెడుతనం ముగిసే సమయం వచ్చింది.
బబులోనుకు వ్యతిరేకంగా ప్రవచనం
30 “‘ఇప్పుడు కత్తిని దాని ఒరలో పెట్టవచ్చు. నీవు సృష్టింపబడిన ప్రదేశంలో, నీవు జన్మమెత్తిన రాజ్యంలో నీకు నేను న్యాయనిర్ణయం చేస్తాను. 31 నీ మీద నా కోపాన్ని క్రుమ్మరిస్తాను. వేడి గాడ్పువలె నా కోపం నిన్ను కాల్చివేస్తుంది. నిన్ను దుష్టులయిన మగవారికి అప్పగిస్తాను. వారు ప్రజల్ని హత మార్చటంలో ఆరితేరిన వారు. 32 నీవు అగ్నికి ఆజ్యంలా తయారవుతావు. నీ రక్తం భూమిలోకి లోతుగా ప్రవహిస్తుంది. ప్రజలు నిన్ను మరెన్నడూ జ్ఞాపకం పెట్టుకోరు. యెహోవానైన నేనే ఇది చెప్పాను.’”
© 1997 Bible League International