Chronological
అబధ్ధ ప్రవక్తలకు విరోధంగా హెచ్చరికలు
13 మరొకసారి యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఈ విధంగా చెప్పాడు: 2 “నరపుత్రుడా, నీవు నా తరపున ఇశ్రాయేలు ప్రవక్తలతో మాట్లాడాలి. ఆ ప్రవక్తలు వాస్తవానికి నా తరపున మాట్లాడటం లేదు. ఆ ప్రవక్తలు తాము చెప్పదలచుకొన్న విషయాలే చెప్పుచున్నారు. కావున నీవు వారితో మాట్లాడవలెను. వారికి ఈ విషయాలు చెప్పు: ‘యెహోవా నుండి వచ్చిన వర్తమానం వినండి! 3 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెబుతున్నాడు. దుష్ట ప్రవక్తలగు మీకు కీడు మూడుతుంది. మీరు మీ ఆత్మల్నే అనుసరిస్తున్నారు. మీరు స్వప్న దర్శనాలలో చూసిన వాస్తవాలను ప్రజలకు చెప్పుటలేదు.
4 “‘ఓ ఇశ్రాయేలూ! నీ ప్రవక్తలు, పాడుబడిన ఇండ్లల్లో పరుగెత్తే గుంట నక్కలా వుంటారు. 5 బీటలు వారిన నగర గోడల వద్ద నీవు సైనికులను కాపలా వుంచలేదు. ఇశ్రాయేలు వంశాన్ని కాపాడటానికి నీవు గోడలను నిర్మించలేదు. కావున యెహోవాకు మిమ్మల్ని శిక్షించే రోజు వచ్చినప్పుడు, నీవు యుద్ధంలో పరాజయం పొందుతావు!
6 “‘దొంగ ప్రవక్తలు తమకు దర్శనాలు కలిగాయని అన్నారు. కొన్ని తంత్రాలు చేసి వారు చెప్పిన విషయాలు జరుగుతాయని అన్నారు. కాని వారు అబద్ధమాడారు. వారిని యెహోవాయే పంపినట్లు వారు చెప్పారు. అదికూడా అబద్ధమే. వారి అబద్ధాలు నిజమవ్వాలని వారింకా ఎదురు చూస్తూనే వున్నారు.
7 “‘దొంగ ప్రవక్తలారా, మీరు చూసిన దర్శనాలు నిజం కావు. మీరు తంత్రాలు జరిపి, అనేక విషయాలు జరుగుతాయని చెప్పారు. కాని మీరు చెప్పింది అబద్ధం! యెహోవా ఆ విషయాలు చెప్పాడని మీరు ప్రకటించారు. కాని నేను మీతో మాట్లాడలేదు.’”
8 కాపున ఇప్పుడు నా ప్రభువైన యెహోవా నిజంగా మాట్లాడతాడు! ఆయన చెప్పినదేమంటే, “మీరు అబద్ధమాడారు. సత్యదూరమైన దర్శనాలను మీరు చూశారు. కావున ఇప్పుడు నేను (దేవుడు) మీకు వ్యతిరేకినయ్యాను!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 9 యెహోవా ఇంకా ఇలా చెప్పాడు, “అబద్ధపు దర్శనాలను చూచి, అబద్ధాలు చెప్పిన ప్రవక్తలను నేను శిక్షిస్తాను. వారిని నా ప్రజల మధ్యనుండి తొలగిస్తాను. వారి వేర్లు ఇశ్రాయేలు వంశావళిలో ఉండవు. వారు మరెన్నటికీ ఇశ్రాయేలు రాజ్యానికి తిరిగిరారు. అప్పుడు మీ ప్రభువగు యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు!
10 “ఆ బూటకపు ప్రవక్తలు పదే పదే నా ప్రజలకు అబద్ధాలు చెప్పారు. శాంతి విలసిల్లుతుందని ఆ ప్రవక్తలు చెప్పారు. కాని శాంతి లేదు. గోడలు కట్టుదిట్టం చేసి, ప్రజలు యుద్ధానికి సిద్ధపడవలసి ఉంది. అయితే వారు పగిలిన గోడలమీద పలుచని పూత మాత్రం పూస్తున్నారు. పగుళ్లకు బంకమట్టి వ్రాస్తున్నారు. 11 నేను వారి మీదికి తీవ్రమైన వడగండ్ల వాన (శత్రు సైన్యం) పంపుతానని నీవు వారికి చెప్పు. పెనుగాలి వీస్తుంది. తుఫాను వస్తుంది. అప్పుడు ఆ గోడ కూలిపోతుంది. 12 గోడ కూలినప్పుడు ప్రజలు ప్రవక్తలను, ‘మీరు గోడలకు పూసిన బంకమట్టి ఏమయ్యింది?’” అని అడుగుతారు. 13 నా ప్రభువైన యెహోవా ఇలా చెబుతున్నాడు, “నేను కోపంగా వున్నాను. మీ మీదికి నేనొక తుఫాను పంపుతాను. నేను కోపగించివున్నాను. మీ మీదికి జడివాన పంపుతాను. నేను కోపంగావున్నాను. ఆకాశాన్నుండి వడగండ్లు పడేలా చేసి మిమ్మల్ని సర్వనాశనం చేస్తాను! 14 గోడమీద మీరు పలుచనైన బంకమట్టి పులిమారు. కాని నేను మొత్తం గోడనే నాశనం చేస్తాను. దానిని కూలగొడతాను. ఆ గోడ మీ మీద పడుతుంది. అప్పుడు నేనే యెహోవానని మీరు గుర్తిస్తారు. 15 గోడమీద, ఆ గోడకు పూత పూసిన వారిమీద నా కోపం చూపటం పూర్తిచేస్తాను. అప్పుడు, ‘గోడా లేదు, గోడకు పూతపూసే పని వాళ్ళూ లేరు’ అని నేనంటాను.
16 “ఈ విషయాలన్నీ ఇశ్రాయేలులో వున్న దొంగ ప్రవక్తలకు సంభవిస్తాయి. ఆ ప్రవక్తలు యెరూషలేము ప్రజలతో మాట్లాడుతూ, శాంతి నెలకొంటుందని అంటారు. కాని శాంతి లేదు.” ఈ విషయాలన్నీ నా ప్రభువైన యెహోవా చెప్పాడు.
17 దేవుడు ఈ విధంగా చెప్పాడు: “నరపుత్రుడా, ఇశ్రాయేలులో స్త్రీ ప్రవక్తల విషయం చూడు. ఈ ఆడ ప్రవక్తలు నా తరపున మాట్లాడరు. వారు చెప్పదలచుకొన్నవే వారు చెప్పుతారు. కావున నీవు నా పక్షాన వారికి వ్యతిరేకంగా మాట్లాడాలి. వారికి నీవు ఈ విషయాలు చెప్పాలి. 18 నా ప్రభువైన యెహోవా ఈ రకంగా చెపుతున్నాడు, ఓ స్త్రీలారా, మీకు కీడు జరుగుతుంది. ప్రజలు వారి చేతులమీద ధరించటానికి మీరు గుడ్డలతో కంకణాలు కుడతారు. ప్రజలకు కావలసిన రకరకాల తలముసుగులు ప్రత్యేకంగా తయారు చేస్తారు. అవన్నీ ప్రజల జీవితాలను కట్టుబాట్లలో వుంచే మహిమగల వస్తువులని మీరు చెబుతున్నారు. మీ బ్రతుకుదెరువు కోసం ప్రజలను మీ వలలలో వేసుకొంటున్నారు! 19 నేను ముఖ్యుడను కానని ప్రజలు నమ్మేలా వారిని మీరు మభ్యపెడుతున్నారు. గుప్పెడు గింజల కోసం, పట్టెడు అన్నం కోసం మీరీ పనులన్నీ చేస్తూ ప్రజలను నాకు వ్యతిరేకులుగా చేస్తున్నారు. నా ప్రజలకు మీరు అబద్ధాలు చెబుతున్నారు. ప్రజలు కూడా అబద్ధాలు వినటానికే ఇష్టపడుతున్నారు. బ్రతక వలసిన ప్రజలను మీరు చంపుతున్నారు. చావవలసిన మనుష్యులను మీరు జీవించేలా చేస్తున్నారు. 20 కావున ప్రభువైన యెహోవా ఈలాగు చెబుతున్నాడు, మీరు బట్టతో కంకణాలు కట్టి ప్రజలను చిక్కించుకుంటున్నారు. కాని నేనా ప్రజలను విడుదల చేస్తాను. ఆ కంకణాలు మీ చేతుల నుండి లాగి పారవేస్తాను. అప్పుడు ప్రజలు మీ నుండి విముక్తి పోందుతారు. పంజరంలో నుండి ఎగిరిపోయే పక్షుల్లా వారు వుంటారు! 21 నేను వారి ముసుగులను చించివేస్తాను. మీ దుష్టశక్తి నుండి నా ప్రజలను కాపాడతాను. మీ బోను నుండి ఆ ప్రజలు తప్పించుకుంటారు. నేనే యెహోవానని అప్పుడు మీరు తెలుసుకుంటారు.
22 “‘ప్రవక్తలైన మీరు అసత్యాలు చెబుతున్నారు. మీ అబద్ధాలు మంచి వ్యక్తులకు బాధ కలుగజేస్తాయి. మంచి ప్రజలను బాధించటం నాకు ఇష్టంలేని పని, దుష్ట జనాన్ని మీరు బలపర్చి, వారిని ప్రోత్సహిస్తారు. వారి నడవడికను మార్చుకోమని మీరు వారికి చెప్పరు. మీరు వారి ప్రాణాలను రక్షించటానికి ప్రయత్నించరు, 23 కావున ఇక మీదట మీరు పనికిరాని దర్శనాలను చూడరు. మీరిక ఎంతమాత్రం గారడీలు చేయరు. మీ శక్తుల నుండి నా ప్రజలను నేను రక్షిస్తాను. అప్పుడు మీరు నన్ను యెహోవా అని తెలుసుకొంటారు.’”
విగ్రహారాధనకు విరోధంగా హెచ్చరికలు
14 ఇశ్రాయేలు పెద్దలలో కొంతమంది నా వద్దకు వచ్చారు. వారు నాతో మాట్లాడాలని నావద్ద కూర్చున్నారు. 2 ఆ సమయంలో యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఈ విధంగా చెప్పాడు. 3 “నరపుత్రుడా, ఈ మనుష్యులు నీతో మాట్లాడాలని వచ్చారు. వారు నా సలహా కోరమని నిన్ను అడగటానికి వచ్చారు. కాని ఈ మనుష్యులు ఇంకా హేయమైన విగ్రహాలను కలిగివున్నారు. వారు పాపం చేయటానికి కారణమైన వస్తువులను వారింకా విడనాడలేదు. ఆ విగ్రహాలను వారింకా పూజిస్తూనే వున్నారు. అందువల్ల వారు నా సలహా కొరకు రావలసిన అవసరం ఏముంది? వారి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాలా? అవసరం లేదు! 4 అయినా నేను వారికి ఒక సమాధానం ఇస్తాను. ఆది నేను వారిని శిక్షించటం! ఈ విషయాలు నీవు వారికి చెప్పాలి, ‘నా ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ఇశ్రాయేలుకు చెందిన వాడెవడైనా ఒక ప్రవక్త వద్దకు వచ్చి నా సలహా కోరితే, ఆ ప్రవక్త వానికి సమాధానం చెప్పడు. నాకై నేనే ఆ వ్యక్తి ప్రశ్నకు సమాధానమిస్తాను. ఆ వ్యక్తి తన హేయమైన విగ్రహాలను కలిగివున్నా, తన పాపాలకు కారణమైన వస్తువులను దాచివుంచినా, అతడా విగ్రహారాధన చేసినా, నేనతనికి సమాధానమిస్తాను. వానివద్ద అపవిత్ర విగ్రహాలున్నా నేనతనితో మాట్లాడతాను. 5 ఎందుకనగా నేను వారి హృదయాలను తాకకోరుచున్నాను. వారి నీచమైన విగ్రహాల కొరకు వారు నన్ను విడిచిపెట్టినా, నేను వారిని ప్రేమిస్తున్నట్లు చూపదలిచాను.’
6 “కావున ఇశ్రాయేలు వంశం వారికి ఈ విషయాలు చెప్పు. వారితో ఇలా అనాలి, ‘నా ప్రభువైన యెహోవా ఏమి చెబుతున్నాడనగా: నా వద్దకు తిరిగి రండి. మీ అపవిత్ర విగ్రహాలను వదిలివేయండి. ఆ బూటకపు దేవుళ్ళ నుండి దూరంకండి. 7 ఏ ఇశ్రాయేలీయుడు గాని, ఇశ్రాయేలులో నివసించే పరదేశీయుడుగాని నా వద్దకు సలహా కోరివస్తే, వానికి నేను సమాధానమిస్తాను. అతను అపవిత్ర విగ్రహాలను కలిగియున్నా, తను పాపాలు చేయటానికి కారకమైన వస్తువులను అతను దాచుకున్నా, అతను విగ్రహాలను ఆరాధించినా, అతనికి నేను సమాధానమిస్తాను. నేను వారికిచ్చే సమాధాన మిది: 8 నేనా వ్యక్తికి వ్యతిరేకినవుతాను. నేను వానిని నాశనం చేస్తాను. ఇతర ప్రజలకు అతడొక ఉదాహరణగా మిగులుతాడు. ప్రజలతనిని చూసి నవ్వుతారు. నా ప్రజల మధ్యనుండి అతనిని తొలగిస్తాను. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకొంటారు! 9 ఏ ప్రవక్తయేగాని మూర్ఖంగా తన స్వంత సమాధానమిస్తే, అతడెంత మూర్ఖుడో నేనతనికి నిరూపిస్తాను! అతనికి వ్యతిరేకంగా నా శక్తిని వినియోగిస్తాను. అతనని నాశనం చేసి, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల నుండి అతనిని తొలగిస్తాను. 10 కావున, సలహా కొరకు వచ్చిన వ్యక్తి, సమాధాన మిచ్చిన ప్రవక్త, ఇద్దరూ ఒకే శిక్షకు గురియవుతారు. 11 ఎందుకంటే, దానివల్ల ఆ ప్రవక్తలు నా ప్రజలను నాకు దూరం చేయకుండా ఆగిపోతారు. తద్వారా, నా ప్రజలు వారి పాపాలలో అపవిత్రము కాకుండా ఆగిపోతారు. అప్పుడు వారు నా ప్రత్యేక ప్రజలవుతారు. నేను వారి దేవుడనవుతాను.’” ఈ విషయాలన్నీ ప్రభువైన యెహోవా చెప్పాడు.
యెరూషలేము శిక్షించబడుతుంది
12 పిమ్మట యెహోవా వాక్కు నాకు తిరిగి వినిపించింది. ఆయన ఇలా చెప్పాడు, 13 “నరపుత్రుడా, నన్ను వదిలిపెట్టిన, నా పట్ల పాపంచేసిన ఏ దేశాన్నయినా నేను శిక్షిస్తాను. వారికి ఆహార సరఫరాలను నిలిపి వేస్తాను. వారికి కరువు కాలం రప్పించి, ఆ దేశ జనాభాని పశుసంపదను తొలగిస్తాను. 14 ఆ దేశంలో నోవహు, దానియేలు, యోబు నివసిస్తున్నప్పటికీ దానిని నేను శిక్షిస్తాను. ఆ మనుష్యులు వారి మంచితనం చేత వారి ప్రాణాలను కాపాడుకొనగలరు. కాని మొత్తం దేశాన్ని వారు రక్షించలేరు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
15 దేవుడు ఇంకా ఇలా తెలియజెప్పాడు: “లేదా, నేను ఆ రాజ్యానికి క్రూర మృగాలను పంపవచ్చు. ఆ జంతువులు ప్రజలందరినీ చంపివేయవచ్చు. ఈ క్రూర మృగాల కారణంగా ఆ దేశం గుండా ఎవ్వరూ ప్రయాణం చేయరు. 16 ఒకవేళ ఆ దేశంలో నోవహు, దానియేలు, యోబు[a] నివసిస్తూవుంటే ఆ ముగ్గురు మంచి వ్యక్తులనూ నేను రక్షిస్తాను. ఆ ముగ్గురు మనుష్యులూ తమ ప్రాణాలను కాపాడుకోగలరు. నా జీవ ప్రమాణంగా వారు ఇతరుల ప్రాణాలను గాని, కనీసం వారి కుమారులను, కుమార్తెలను గాని రక్షించలేరని నిశ్చయంగా చెబుతున్నాను! ఆ చెడ్డదేశం నాశనం చేయబడుతుంది!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
17 దేవుడు ఈ విధంగా చెప్పాడు: “లేదా, నేను శత్రుసైన్యాన్ని ఆ దేశం మీదికి పంపవచ్చు. ఆ సైనికులు ఆ రాజ్యాన్ని నాశనం చేస్తారు. దేశంలో వున్న మనుష్యులను, జంతువులను తొలగించి వేస్తాను. 18 నోవహు, దానియేలు, యోబు అక్కడ వుంటే, ఆ ముగ్గురు మంచి వ్యక్తులను నేను రక్షిస్తాను. ఆ ముగ్గురు మునుష్యులూ వారి ప్రాణాలను కాపాడుకోగలుగుతారు. కాని, నా జీవ ప్రమాణంగా ఇతర ప్రజల ప్రాణాలను గాని, తమ స్వంత కుమారుల, కుమార్తెల ప్రాణాలను గాని కాపాడలేరని చెబుతున్నాను. ఆ చెడ్డదేశం నాశనం చేయబడుతుంది!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
19 దేవుడు ఇంకా ఇలా చెప్పాడు: “లేదా, ఆ దేశం మీద ఒక వ్యాధి ప్రబలేలా నేను చేయవచ్చు. ఆ ప్రజల మీద నా కోపం కుమ్మరిస్తాను. ఆ రాజ్యంనుండి ప్రజలందరినీ, పశువులన్నిటినీ నేను తొలగించి వేస్తాను. 20 ఒకవేళ నొవహు, దానియేలు, యోబు అక్కడ నివసిస్తే, ఆ ముగ్గురు మనుష్యులను నేను రక్షిస్తాను. ఎందువల్లనంటే వారు మంచి వ్యక్తులు. ఆ ముగ్గురూ తమ ప్రాణాలను కాపాడుకోగలరు. కాని, నా ఆత్మ సాక్షిగా వారు ఇతర ప్రజలను గాని, వారి స్వంత కొడుకులను, కుమార్తెలను గాని రక్షించలేరు!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
21 మళ్లీ నా ప్రభువైన యెహోవా ఈ విధంగా చెప్పాడు: “కావున యెరూషలేము పరిస్థితి ఎంత దారుణంగా వుంటుందో ఆలోచించు. ఆ నాలుగు రకాల శిక్షలనూ ఆ నగరం మీదికి పంపుతాను! ఆ నగరం మీదికి శత్రుసైన్యాలను. క్షామాన్ని, రోగాలను, క్రూర మృగాలను పంపుతాను. ఆ రాజ్యం నుండి ప్రజలను, పశువులను అందరినీ తొలగిస్తాను! 22 కొంతమంది ప్రజలు ఆ దేశంనుండి తప్పించు కుంటారు. వారు తమ కుమారులను, కుమార్తెలను తీసుకొని నీ సహాయం కొరకు వస్తారు. నిజంగా వారెంత చెడ్డవారో నీవప్పుడు తెలుసుకొంటావు. నేను యెరూషలేము మీదకి రప్పించే కష్టాలను గూర్చి నీవప్పుడు యోచించి అవి వారికి తగినవేనని నీవనుకుంటావు. 23 నీవు వారి జీవన విధానాన్ని, వారు చేసే చెడుకార్యాలను చూస్తావు. నేనా ప్రజలను శిక్షించటానికి తగిన కారణమున్నట్లు నీవు అప్పుడు తెలుసుకుంటావు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
ద్రాక్షావల్లి యెరూషలేము దహించబడుతుంది
15 మరల దేవుని వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు: 2 “ఓ నరపుత్రుడా, అడవిలో నరికి తెచ్చిన చిన్న కొమ్మల కన్నా ద్రాక్షాతీగ పుల్లలు ఏమైనా మిన్న అయినవా? కాదు! 3 ద్రాక్షా తోటల[b] నుంచి తెచ్చిన పుల్లలను ఏ పనికైనా నీవు వినియోగించగలవా? లేదు! ఆ కట్టెను పాత్రలు తగిలించే కొక్కెములకైనా నీవు వినియోగించగలవా? లేదు! 4 ప్రజలా పుల్లలను కేవలం నిప్పులో వేస్తారు. కొన్ని పుల్లలు రెండు చివరలా మండుతూ మధ్య భాగం పొగకమ్మి నల్లబడతాయి. అంతేగాని పుల్లలు పూర్తిగా తగులబడవు. ఆ సగం కాలిన పుల్లతో నీవేమైనా చేయగలవా? 5 ఆ పుల్ల కాలక ముందు దానితో నీవు ఏమీ చేయలేకపోతే, నిజానికి అది కాలిన తరువాత దానితో నీవు ఏమి చేయగలవు! 6 కావున ద్రాక్షా తోటలో తెచ్చిన పుల్లలూ కేవలం అడవిలో తెచ్చిన పుల్లల మాదిరే వుంటాయి. ప్రజలా పుల్లలను నిప్పులో వేస్తారు. నిప్పు వాటిని కాల్పివేస్తుంది. అదేరకంగా, యెరూషలేములో నివసిస్తున్న ప్రజలను నేను అగ్నిలో పడవేస్తాను!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. 7 “ఆ ప్రజలను నేను శిక్షిస్తాను. కాని వారిలో కొంతమంది పూర్తిగా కాలని పుల్లల వంటివారు. వారు శిక్షింపబడతారు. అంతేగాని వారు సర్వనాశనం చేయబడరు. నేను ఈ ప్రజలను శిక్షించటం నీవు చూస్తావు. ఆ శిక్షించింది యెహోవాయే అని కూడా నీవు తెలుసుకుంటావు! 8 ప్రజలు బూటకపు దేవుళ్లను ఆరాధించే నిమిత్తం నన్ను వదిలిపెట్టిన కారణంగా, నేను ఆ రాజ్యాన్ని నాశనం చేస్తాను.” నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
© 1997 Bible League International