Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెహెజ్కేలు 1-4

పరిచయం

1-3 నేనొక యాజకుణ్ణి. నా పేరు యెహెజ్కేలు. బూజీ కుమారుణ్ణి. దేశభ్రష్టుడనై చెరలో ఉన్నాను.[a] బబులోనులో నేను కెబారు కాలువ ప్రక్కన ఉండగా ఆకాశం తెరువబడింది. అప్పుడు నాకు దైవసంబంధమైన దర్శనాలు కలిగాయి. అది ముఫ్పైయవ సంవత్సరంలో[b] నాల్గవ నెల (జూన్) ఐదవ రోజున జరిగింది. రాజైన యెహోయాకీను ప్రవాసంలో చెరపట్టబడ్డాక ఐదవ సంవత్సరం, ఆ నెలలో ఐదవ రోజున యెహోవా వాక్కు యెహెజ్కేలుకు వినవచ్చింది. ఆ స్థలంలో యెహోవా ప్రభావం అతని మీదికి వచ్చింది.

దేవుని వాహనం—యెహోవా సింహాసనం

ఉత్తరాన్నుండి గాలి దుమారం లేచి వస్తున్నట్లు నేను (యెహెజ్కేలు) చూశాను. అది ఒక పెను మేఘం. దాని నుండి అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంది. దానిచుట్టూ వెలుగు దేదీప్యమానంగా ఉంది. అగ్నిలో కణకణలాడే లోహంలా అది మెరుస్తూ ఉంది. దాని లోపల నాలుగు జంతువులు[c] ఉన్నాయి. వాటి రూపం మానవ రూపంలా ఉంది. కాని ప్రతీ జంతువుకు నాలుగు ముఖాలు, నాలుగు రెక్కలు ఉన్నాయి. వాటి కాళ్లు నిట్ట నిలువుగా ఉన్నాయి. వాటి పాదాలు ఆవు పాదాల్లా ఉన్నాయి. అవి మెరుగుదిద్దిన ఇత్తడిలా మెరుస్తూ ఉన్నాయి. వాటి రెక్కల క్రింద మనుష్యుల చేతులు వంటివి ఉన్నాయి. అక్కడ మొత్తం నాలుగు జంతువులున్నాయి. వాటిలో ప్రతి ఒక్క జంతువుకూ నాలుగు ముఖాలు, నాలుగు రెక్కలు ఉన్నాయి. ఇప్పుడు వాటి ముఖాల గురించి వివరిస్తాను. వాటి రెక్కలు ఒకదానితో ఒకటి తాకుతున్నాయి. అవి కదిలినప్పుడు ఆ జంతువులు ప్రక్కకి తిరుగలేదు. అవి చూస్తూవున్న దిశలోనే అవి కదిలి వెళ్ళాయి.

10 ప్రతి జంతువుకు నాలుగు ముఖాలున్నాయి. ప్రతి ఒక్కటి ముందువైపు మనుష్య ముఖం కలిగిఉంది. కుడివైపు సింహపు ముఖం ఉంది. ఎడమ ప్రక్క ఎద్దు ముఖం ఉంది. వెనుకవైపు గ్రద్ద ముఖం ఉంది. 11 తమ రెక్కలతో ఆ జంతువులు తమ శరీరాలను కప్పుకున్నాయి. రెండు రెక్కలు విప్పుకొని ప్రక్కదాని రెక్కలను తాకుతున్నాయి. మరి, రెండు రెక్కలు శరీరాన్ని కప్పుకొవటానికి వినియోగించు కుంటున్నాయి. 12 ప్రతి జంతువు చూస్తూవున్న దిశలోనే అవి కదిలి వెళ్లాయి. గాలి[d] ఎటువీస్తే అవి అటు కదిలివెళ్లాయి. కానీ, అవి కదలినప్పుడు వాటి ముఖాలు ప్రక్కకి తిరగలేదు.

13 ఆ జంతువులు ఆ విధంగా కనిపించాయి. జంతువుల మధ్యలోవున్న లోపలి ప్రాంతంలో కాలుతున్న బొగ్గు నిప్పుల్లా కనబడిన ఏదో ఒకటి ఉంది. ఈ అగ్ని ఆ జంతువుల చుట్టూ కదలుతున్న చిన్న కాగడాల్లా ఉంది. ఆ అగ్ని ప్రకాశవంతగా వెలిగి దానినుండి మెరుపు మెరిసింది. 14 మెరుపు వంటి వేగంతో ఆ జీవులు వెనుకకు, ముందుకు కదులుతున్నాయి!

15-16 నేనా జంతువుల వైపు చూడగా నాలుగు చక్రాలు కన్పించాయి. ఆ చక్రాలన్నీ ఒకే విధంగా కనిపించాయి. ఒక్కొక్క ముఖానికి ఒక చక్రం చొప్పున ఉన్నాయి. ఆ చక్రాలు భూమిని తాకాయి. చక్రాలు స్వచ్ఛమైన పసుపువన్నె గోమేధికంతో చేయబడినట్లు కానవచ్చాయి. ఒక చక్రంలో మరో చక్రం ఉన్నట్లు కన్పించింది. 17 ఆ చక్రాలు ఏ దిశలోనైనా కదలగలవు. కాని అవి కదలినప్పుడు జంతువులు మాత్రం తిరుగలేదు.

18 ఆ చక్రాల అంచులు ఎత్తుగా, భయంకరంగా ఉన్నాయి. ఆ నాలుగు చక్రాల అన్ని అంచుల చుట్టూ కళ్లు ఉన్నాయి.

19 ఆ జంతువులతోపాటు చక్రాలు ఎప్పుడూ కదులుతూనే ఉండేవి. జంతువులు ఆకాశంలోకి లేచినప్పుడు వాటితోపాటు చక్రాలు కూడా లేచేవి. 20 గాలి (ఆత్మ) వాటిని ఎటు పోవాలని కోరితే అవి అటు వెళ్లాయి. అప్పుడు చక్రాలు కూడా వాటితో వెళ్లాయి. ఎందువల్లనంటే ఆ జంతువుల యొక్క గాలి శక్తి చక్రాలలోనే ఉంది. 21 అందువల్ల జీవులు కదిలితే చక్రాలు కూడా కదిలేవి. జీవులు ఆగితే చక్రాలు కూడా ఆగేవి. చక్రాలు గాలిలోకి వెళితే, జీవులు కూడా వాటితో పాటు వెళ్లాయి. ఎందువల్లనంటే గాలి (ఆత్మ శక్తి) చక్రాలలోనే ఉంది.

22 ఆ జీవులపై ఒక ఆశ్చర్యకరమైన వస్తువు కన్పించింది. అది ఒక పెద్ద పాత్ర బోర్లించినట్లుగా ఉంది. అది మంచులా స్వచ్చంగా ఉంది. అది జీవుల తలలచుట్టూ గాలిలో తేలియాడుతూ ఉంది. 23 ఈ పాత్రక్రింద ప్రతి జంతువుయొక్క రెక్కలు ప్రక్కనున్న జంతువును తాకేటట్లు ఉన్నాయి. రెండు రెక్కలు ఒక వైపున మరో రెండు రెక్కలు మరో వైపున శరీరాన్ని కప్పుతూ వ్యాపించాయి.

24 పిమ్మట నేను ఆ రెక్కల చప్పుడు విన్నాను. జంతువులు కదలినప్పుడల్లా, ఆ రెక్కలు గొప్ప శబ్దం చేసేవి. మహా నీటి ప్రవాహం ఘోషించినట్లు వాటి రెక్కల చప్పుడు వినిపించింది. సర్వశక్తిమంతుడైన దేవుని గంభీర శబ్దంలాగ ఆ శబ్దం వినిపించింది. ఒక సైన్యంగాని, ఒక ప్రజా సమూహంగాని చేసే రణగొణధ్వనుల్లా అవి వినవచ్చాయి. ఆ జంతువులు కదలటం మానినప్పుడు అవి వాటి రెక్కలను తమ ప్రక్కలకు దించివేసేవి.

25 జంతువులు కదలటం మానివేసి, రెక్కలను దించివేశాయి. పిమ్మట మరొక పెద్ద శబ్దం వచ్చింది. అది వాటి తలలపైవున్న ఆకాశమండలం లాంటి పాత్ర మీదుగా వచ్చింది. 26 ఆ పాత్రలాంటి వస్తువుపై మరొకటి కన్పించింది. అది ఒక సింహాసనంలా ఉంది. అది నీలమణిలా మెరుస్తూ ఉంది. ఆ సింహాసనంపై మనిషివంటి ఒక స్వరూపం కూర్చున్నట్లు కన్పించింది! 27 నడుము నుండి పైవరకు అతనిని పరికించి చూశాను. కాలుతున్న లోహంలా అతడు కన్పించాడు. అతని చుట్టూ అగ్ని ప్రజ్వరిల్లుతున్నట్లు కానవచ్చింది! అతని నడుము నుండి క్రిందికి చూడగా, అంతా అగ్నిలా కన్పించింది. అది అతని చుట్టూ ప్రకాశిస్తూ ఉంది. 28 ఆయన చుట్టూ ప్రకాశించే వెలుగు ఇంద్రధనుస్సులా ఉంది. అది యెహోవా మహిమలా ఉంది. అది చూచి నేను సాష్టాంగపడ్డాను. నా శిరస్సు నేలకు ఆనించాను. అప్పుడు నాతో మాట్లాడే ఒక కంఠస్వరం విన్నాను.

యెహోవా యెహెజ్కేలుతో మాట్లాడటం

ఆ స్వరం, “నరపుత్రుడా, లెమ్ము; నేను నీతో మాట్లాడదలిచాను” అని అన్నది.

ఇంతలో ఒకగాలి వచ్చి నన్ను నా పాదాలమీద నిలబెట్టింది. ఆ వ్యక్తి (దేవుడు) చెప్పేది నేను విన్నాను. ఆయన ఇలా చెప్పాడు, “ఓ నరపుత్రుడా, ఇశ్రాయేలు వంశం వారితో మాట్లాడటానికి నిన్ను నేను పంపుతున్నాను. ఆ ప్రజలు అనేక సార్లు నాకు వ్యతిరేకులయ్యారు. వారి పూర్వీకులు కూడా నాపై తిరుగుబాటు చేశారు. వారు నా పట్ల అనేకసార్లు పాపం చేశారు. ఈనాటికీ వారు నాపట్ల పాపం చేస్తూనే వున్నారు. ఆ ప్రజలతో మాట్లాడటానికి నేను నిన్ను పంపుతున్నాను. కాని వారు చాలా మొండివారయ్యారు. వారు తలబిరుసు కలిగినవారు. అయినా, నీవు వారితో తప్పక మాట్లాడాలి. ‘మన ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు’ అని నీవు అనాలి. కాని ఆ ప్రజలు నీ మాట వినరు. వారు నా పట్ల పాపం చేయటం మానరు. ఎందువల్లనంటే వారు మిక్కిలిగా తిరుగబడే స్వభావం గలవారు. వారు ఎల్లప్పుడూ నాపై తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు! కాని నీవావిషయాలు చేప్పాలి. దానితో వారిమధ్య ఒక ప్రవక్త నివసిస్తున్నాడని వారు తెలుసుకుంటారు.

“ఓ నరపుత్రుడా, ఆ ప్రజలకు నీవు భయపడవద్దు, వారు చెప్పేవాటికి నీవు భయపడకు, వారు నీకు వ్యతిరేకులై, నీకు హాని చేయటం ఖాయం. వారు ముండ్లవంటి వారు. తేళ్లమధ్య నివసిస్తున్నట్లు నీకు అనిపిస్తుంది. కాని వారు చెప్పేవాటికి నీవు భయపడవద్దు. వారు తిరుగుబాటుదారులు. అయినా వారికి నీవు భయపడవద్దు. నేను చేప్పే విషయాలు నీవు వారికి తప్పక తెలియజేయాలి. వారు నీ మాట వినరని నాకు తెలుసు. పైగా నా పట్ల పాపం చేయటం వారు మానరు. ఎందువల్లనంటే వారు తిరుగబడే స్వభావం గలవారు.

“ఓ నరపుత్రుడా, నేను నీకు చెప్పే విషయాలు శ్రద్ధగా విను. ఆ తిరుగుబాటుదారుల్లా నీవు నాకు వ్యతిరేకం కావద్దు. నీ నోరు తెరచి, నా మాటలు స్వీకరించు. తిరిగి వాటిని ప్రజలకు తెలియజెప్పు. ఈ మాటలను నీవు జీర్ణించుకో.”

తరువాత నేను (యెహెజ్కేలు) ఒక చేయి నా మీదికి రావటం చూశాను. ఆ చేతిలో వ్రాయబడిన గ్రంథపు చుట్ట ఉంది. 10 చుట్టబడిన ఆ కాగితాన్ని విడదీసి చూడగా దానిమీద రెండు వైపులా వ్రాసివుంది. అందులో రకరకాల విషాద గీతికలు, విషాద గాథలు, హెచ్చరికలు ఉన్నాయి.

దేవుడు నాతో ఇలా చెప్పాడు: “ఓ నరపుత్రుడా, నీవు చూస్తున్న దానిని తిను. ఈ గ్రంథపు చుట్టను తిని, ఇశ్రాయేలు వంశం వారికి దీనిలోనున్న విషయాలన్నిటినీ తెలియజెప్పు.”

ఆ తరువాత నేను నా నోరు తెరువగా, అతడు గ్రంథపు చుట్టను నాకు తినిపించెను. పిమ్మట దేవుడు ఇలా అన్నాడు: “నరపుత్రుడా, ఈ కాగితం చుట్టను నీకిస్తున్నాను. దానిని మ్రింగివేయి! ఆ గ్రంథపు చుట్ట నీ శరీరాన్ని నింపివేయనీ.”

నేను దానిని తినేశాను. అది తేనెలా మధురంగా ఉంది.

అప్పుడు దేవుడు నాతో ఇలా అన్నాడు, “నరపుత్రుడా, ఇశ్రాయేలు వంశంవారి వద్దకు వెళ్లు. వారికి నా మాటలన్నీ తెలియజేయుము. భాష తెలియని పరదేశీయుల వద్దకు నిన్ను నేను పంపటంలేదు. ఏ ఇతర భాషను నీవు నేర్చుకునే పనిలేదు. నేను నిన్ను ఇశ్రాయేలు వంశం వారివద్దకు పంపుతున్నాను! నీవు అర్థం చేసుకోలేని పలుభాషలు మాట్లాడే అనేక ఇతర దేశాల ప్రజల వద్దకు నేను నిన్ను పంపటం లేదు. నీవు గనుక వారి వద్దకు వెళ్లి మాట్లాడితే వారు వింటారు. కాని నీవాకఠిన భాషలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. లేదు! నేను నిన్ను ఇశ్రాయేలు వంశం వద్దకు పంపుతున్నారు. వారున్నారే వారు తల బిరుసు కలిగి ఉన్నారు. వారు చాలా మొండివారు! ఇశ్రాయేలీయులు నీవు చెప్పేది వినటానికి నిరాకరిస్తారు. వారు నా మాట వినదల్చుకోలేదు! కాని వారు ఎంత మొండివారో, నిన్ను కూడా అంత మొండివానిగా నేను చేస్తాను. నీ తల కూడా వారి తలలా కఠినంగా ఉంటుంది! చెకుముకిరాయి కంటె వజ్రం కఠినమైనది. అదే రకంగా, నీ తల వారి తలకంటె గట్టిగా తయారవుతుంది. నీవు మిక్కిలి మొండిగా ఉంటావు. అందువల్ల వారంటే నీవు భయపడవు. ఎల్లప్పుడూ నా మీద తిరుగుబాటు చేసే ఆ ప్రజలంటే నీవు భయపడవు.”

10 ఇంకా దేవుడు ఇలా చెప్పాడు, “నరపుత్రుడా, నేను నీకు చెప్పే ప్రతీ మాటను వినాలి. విని, వాటిని జ్ఞాపకం పెట్టుకోవాలి. 11 పిమ్మట దేశాన్నుండి వెళ్ల గొట్ట బడిన నీ ప్రజలందరి వద్దకు వెళ్లు. వారి వద్దకు వెళ్లి, ‘మన ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు’ అని పలుకు. వారు వినరు. వారు పాపం చేయటం మానరు. అయినా నీవు ఈ విషయాలు చెప్పాలి.”

12 పిమ్మట గాలి (ఆత్మ) నన్ను పైకి లేపింది. అప్పుడు వెనుక నుండి నేనొక స్వరం విన్నాను. అది ఉరుములా చాలా బిగ్గరగా ఉంది. ఆ స్వరం, “యెహోవా మహిమ ధన్యమైనది!” అని పలికింది. 13 ఆ తరువాత జంతువుల రెక్కలు కదలసాగాయి. రెక్కలు ఒక దానితో ఒకటి తాకగా అవి చాలా గట్టిగా శబ్దం చేశాయి. వాటి ముందునున్న చక్రాలు కూడ పెద్ద శబ్దం చేశాయి. ఆ శబ్దం ఉరుము ఉరిమినట్లుగా ఉంది. 14 గాలి (ఆత్మ) నన్ను పైకెత్తి దూరంగా తీసుకొని వెళ్లింది. నేను ఆ స్థలాన్ని వదిలిపెట్టాను. నేను నా ఆత్మలో దుఃఖించి తల క్రిందులయ్యాను! యెహోవా ప్రభావం నాలో శక్తివంతంగా పనిచేస్తూ ఉంది! 15 టెల్ అవీవ్‌కు[e] బలవంతంగా తీసుకొనిపోబడి, అక్కడ ప్రవాసంలోవున్న ఇశ్రాయేలీయుల వద్దకు వెళ్లాను. ఆ ప్రజలు కెబారు కాలువ వద్ద నివసించారు. ఆ ప్రజలను నేను పరామర్శించాను. అక్కడ నేను వాళ్ల మధ్యలో ఏడు రోజులు భయంతోనూ, మౌనంతోనూ కూర్చుంటిని.

ఇశ్రాయేలు కావలివాడు

16 ఏడు రోజుల తరువాత యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా చెప్పాడు: 17 “ఓ నరపుత్రుడా, ఇశ్రాయేలుకు నిన్ను కావలివానిగా చేస్తున్నాను. వారికి జరుగబోయే కీడును గూర్చి నేను నీకు తెలియజేస్తాను. కనుక ఆ పరిణామాలను గూర్చి నీవు వారికి హెచ్చరిక చేయాలి. 18 ‘ఈ దుష్ట వ్యక్తి చనిపోతాడు.’ అని నేను చెప్పితే, నీవతనిని హెచ్చరించాలి.! అతని జీవన విధానం మార్చుకొని, పాపం చేయటం మానమని చెప్పాలి. నీవతనిని హెచ్చరించకపోతే, ఆ వ్యక్తి చనిపోతాడు. అతడు పాపం చేశాడు గనుక అతడు చనిపోతాడు. కాని అతని చావుకు నిన్ను కూడా బాధ్యుణ్ణి చేస్తాను! ఎందుకంటే, నీవతని వద్దకు వెళ్లి అతనిని హెచ్చరిస్తే అతని ప్రాణం రక్షింపబడేది.

19 “ఒకవేళ నీవా వ్యక్తి వద్దకు వెళ్లి అతని జీవిత విధానాన్ని మార్చుకోమనీ, చెడు కార్యాలు చేయటం మానమనీ చెప్పావనుకో. ఆ వ్యక్తి నీమాట వినక పోవచ్చు. అప్పుడతడు చనిపోతాడు. అతడు పాపి గనుక చనిపోతాడు. అయినా నీవతనిని హెచ్చరించావు. అందువల్ల నిన్ను నీవు రక్షించుకున్నవాడివవుతావు.

20 “లేదా, ఒక మంచి వ్యక్తి మధ్యలో మంచి పనులు చేయడం మానివేసి చెడుపనులు చేస్తాడు. అప్పుడు నేను అతని ముందు ఏదైనా తగిలి పడటానికి (పాపంలో పడటానికి) ఉంచవచ్చు. అతడు చెడుకార్యాలు చేయటం మొదలు పెడతాడు. దానితో అతడు చనిపోతాడు. తన పాపాల కారణంగా అతడు చనిపోతాడు. దానికి తోడు నీవతనిని హెచ్చరించలేదు. అందువల్ల అతని చావుకు నిన్ను బాధ్యుణ్ణి చేస్తాను. చివరికి అతడు చేసిన మంచి పనులేవీ ప్రజలు గుర్తు పెట్టుకోరు.

21 “నీవొక మంచి మనిషిని పాపం చేయవద్దని హెచ్చరిస్తావనుకో; అతడు పాపం చేయటం మానితే అతడు రక్షించబడతాడు. ఎందువల్లనంటే నీవతనికి హెచ్చరిక చేయటం, అతడు నీ మాటను వినటం జరిగాయి గనుక. ఈ విధంగా నీవు నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు.”

22 పిమ్మట యెహోవా హస్తం ఆ స్థలంలో నా మీదికి వచ్చింది. “లెమ్ము; లోయలోకి వెళ్లు. అక్కడ నేను నీతో మాట్లాడతాను” అని దేవుడు నాకు చెప్పాడు.

23 నేను లేచి లోయలోకి వెళ్లాను. యెహోవా మహిమ అక్కడ ఉంది. గతంలో నేను కెబారు కాలువవద్ద చూసినట్లే అది ఉంది. నేను శిరస్సు నేలకు ఆన్చి సాష్టాంగ నమస్కారం చేశాను. 24 కాని, ఇంతలో ఒక గాలి (ఆత్మ) వచ్చి నన్ను నా పాదాలపైకి లేపింది. ఆయన నాతో ఇలా అన్నాడు, “నీవు ఇంటికి వెళ్లి లోపల కూర్చుని గడియపెట్టుకో. 25 ఓ నరపుత్రుడా, ప్రజలు నీ వద్దకు వచ్చి, నిన్ను తాళ్లతో బంధిస్తారు. వారు నిన్ను ప్రజల మధ్యకు వెళ్లనీయరు. 26 నేను నీ నాలుకను నీ అంగిలి గుంటలో అతుక్కుపోయేలా చేస్తాను. దానితో నీవు మాట్లాడలేవు. అందువల్ల వారు తప్పు చేస్తున్నట్లు వారికి చెప్పే మనుష్యుడెవ్వడూ ఉండడు. ఎందువల్లనంటే ఆ జనులు నా మీద ఎల్లప్పుడూ తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. 27 కాని నేను నీతో మాట్లాడతాను. పిమ్మట నీవు మళ్లీ మాట్లాడటానికి అనుమతిస్తాను. అయితే నీవు మాత్రం ‘మన ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు’ అని వారికి చెప్పాలి. ఏ వ్యక్తి అయినా వినగోరితే మంచిదే. ఎవ్వరూ వినటానికి ఇష్టపడకపోయినా మంచిదే. ఆ ప్రజలు ఎల్లప్పుడూ నాకు వ్యతిరేకులవుతూ ఉన్నారు.

యెరూషలేము దాడిని గూర్చి హెచ్చరికలు

“నరపుత్రుడా, ఒక ఇటుక తీసుకొని దానిమీద ఒక బొమ్మ గియ్యి. యెరూషలేము నగరపు బొమ్మ వేయుము. నీవా నగరాన్ని ముట్టుడించే సైన్యంలాగా చిత్రీకరించు. నగరాన్ని తేలికగా పట్టుకొనేటందుకు అనువుగా దానిచుట్టూ ఒక మట్టిగోడ నిర్మించు. నగరపు గోడవరకు ఒక మట్టి రహదారి వేయుము. సమ్మెటల్ని (ముఖ్య నాయకుల్ని) తెప్పించి, నగరం చుట్టూ సైనిక స్థావరాలను ఏర్పాటు చేయండి. పిమ్మట ఒక ఇనుప పెనము తీసుకొని దానిని నీకు, నగరానికి మధ్య ఉంచు. అది నిన్ను, నగరాన్ని వేరుచేసే ఇనుప గోడలా ఉంటుంది. ఈ రకంగా నీవా నగరానికి వ్యతిరేకంగా వున్నట్లు నీవు చూపిస్తావు. నీవా నగరాన్ని చుట్టుముట్టి దానిపై దాడి చేస్తున్నట్లు వుంటుంది. ఎందువల్లనంటే ఇశ్రాయేలు వంశానికి ఇది ఒక ఉదాహరణగా వుంటుంది. (దేవుడనైన) నేను యెరూషలేమును నాశనం చేస్తానని అది నిరూపిస్తుంది.

“తరువాత నీవు ఎడమ ప్రక్కకి పడుకో, ఇశ్రాయేలీయుల పాపాలన్నీ నీవు భరిస్తున్నట్లు నిరూపించే విధంగా నీవాపని చేయాలి. నీవు ఎడమ ప్రక్కన ఎన్నాళ్లు పడుకొని ఉంటే అన్నాళ్లు నీవా పాపాలను మోస్తావు. నీవు వారి పాపాన్ని మూడు వందల తొంభై రోజులు[f] భరించాలి. ఈ ప్రకారం ఇశ్రాయేలు ఎంతకాలం శిక్షింపబడుతుందో నేను తెలియజేస్తున్నాను. ఒక్కరోజు ఒక్క సంవత్సరానికి సమానం.

“ఆ తరువాత నీవు కుడి ప్రక్కకి తిరిగి నలభై రోజులు పడుకోవాలి. ఈసారి నీవు యూదావారి పాపాలను నలభై రోజులపాటు భరిస్తావు. ఒక రోజు ఒక సంవత్సరానికి సమానం. యూదా ఎంతకాలం శిక్షింపబడాలో నేను నీకు ఈ విధంగా తెలియజేస్తున్నాను.”

దేవుడు మళ్లీ మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు, “ఇప్పుడు నీవు నీ చొక్కా చేతిని పైకి మడిచి, ఆ ఇటుక మీదికి నా చేతినెత్తు. యెరూషలేము నగరంపై దాడి చేస్తున్నట్లు నీవు ప్రవర్తించు. నీవు నా తరఫు దూతగా మాట్లాడుతున్నట్లు చూపటానికి ఈ విధంగా చేయుము. ఇప్పుడు చూడు, నిన్నిప్పుడు తాళ్లతో కట్టుతున్నాను. నగరంపై నీ దాడి పూర్తయ్యేవరకు నీవు అటు, ఇటు కదలలేవు.”

దేవుడు ఇంకా ఇలా చెప్పాడు: “రొట్టె చేయటానికి నీవు కొంత ధాన్యాన్ని తీసుకొనిరా. కొన్ని గోధుమలు, బార్లీ బియ్యము (యవలు), చిక్కుడు గింజలు, పప్పులు, జొన్నలు, సజ్జలు తీసుకో. వీటన్నిటినీ కలిపి రోటిలో వేసి దంచి పిండి చేయుము. ఈ పిండిని ఉపయోగించి రొట్టె చేయుము. నీవు ప్రక్కకు తిరిగి పడుకొనే మూడువందల తొంభై రోజులూ ఈ రొట్టెనే తినాలి. 10 రొట్టెను చేయటానికి ఈ పిండిని రోజుకు ఒక గిన్నెడు (సుమారు ఇరవై తులాలు) మాత్రమే ఉపయోగించటానికి నీకు అనుమతి ఇవ్వబడింది. అవసరమైనప్పుడల్లా రోజంతా ఆ రొట్టెనే నీవు తినాలి. 11 ప్రతి రోజూ మూడు గిన్నెల నీరే నీవు తాగాలి. రోజంతా తగిన సమయానికి దానిని తాగాలి. 12 ప్రతిరోజూ నీ రొట్టెను నీవే చేసుకోవాలి. నీవు మనుష్యుల మలం తెచ్చి, ఎండబెట్టి, దానిని కాల్చాలి. మండే ఆ మనుష్యుల మలం మీద నీవు ఆ రొట్టెను కాల్చాలి. ప్రజల ఎదుట ఈ రొట్టెనే నీవు కాల్చితినాలి.” 13 మళ్లీ యెహోవా ఇలా చెప్పాడు: “ఈ పని చేయటం ద్వారా ఇశ్రాయేలు వంశీయులు పరాయి దేశాలలో అపరిశుభ్రమైన రొట్టెలు[g] తింటారని నీవు సూచిస్తావు. వారు ఇశ్రాయేలు వదిలి అన్యదేశాలకు పోయేలా నేను వారిని ఒత్తిడి చేశాను!”

14 అప్పుడు నేనిలా (యెహెజ్కేలు) అన్నాను, “అయ్యో, నా ప్రభువైన యెహోవా, నేనెన్నడూ అపరిశుద్ధ ఆహారాన్ని తినలేదు. వ్యాధిచే చచ్చిన జంతు మాంసంగాని, అడవి జంతువుచే చంపబడిన పశువుల మాంసాన్ని గాని నేను ఎన్నడూ తినియుండలేదు. నా చిన్ననాటి నుండి ఈ నాటి వరకు నేను ఎన్నడూ అపరిశుద్ధ ఆహారం ముట్టి ఎరుగను. ఆ దుష్ట మాంసమేదీ నానోట బడలేదు.”

15 అందుకు దేవుడీలా అన్నాడు: “సరే! నీ రొట్టెను కాల్చటానికి ఎండిన ఆవుపేడ ఉపయోగించేటందుకు నీకు అనుమతి ఇస్తున్నాను. ఎండిన మనిషి మలం నీవు వినియోగించనవసరం లేదు.”

16 దేవుడు ఇంకా ఇలా అన్నాడు, “నరపుత్రుడా, యెరూషలేముకు ఆహార పదార్థాల సరఫరాను నిలిపి వేస్తున్నాను. అందువల్ల ప్రజలు తగుమాత్రం రొట్టె తినవలసి వస్తుంది. వారి ఆహార పదార్థాల సరఫరా విషయమై వారు మిక్కిలి చింతిస్తారు. వారికి తాగే నీరు కూడా పరిమితమవుతుంది. ఆ నీటిని తాగినప్పుడు వారు మిక్కిలి భీతిల్లుతారు. 17 ఎందువల్లనంటే ప్రజలకు తినటానికి తిండి, తాగటానికి నీరు తగినంత ఉండదు. ప్రజలు ఒకరిని చూచి ఒకరు భయ కంపితులవుతారు. వారివారి పాపాల కారణంగా వారు చిక్కి శల్యాలైపోతారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International