Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యిర్మీయా 23-25

23 “యూదా కాపరులకు (నాయకులకు) చాలా చెడ్డదిగా ఉంటుంది. వారు నా గొర్రెలను (ఇశ్రాయేలీయులను) చెదరు గొట్టుతున్నారు. నా పచ్చిక బయలు నుండి గొర్రెలను పొమ్మని నలుదిశలా తోలి వేస్తున్నారు.” ఇది యెహోవా నుంచి వచ్చిన వాక్కు.

ఆ కాపరులు (నాయకులు) నా ప్రజలకు బాధ్యులు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆ కాపరులకు ఈ విషయాలు చెపుతున్నాడు: “ఓ కాపరులారా (నాయకులు), మీరు నా గొర్రెల మందను నలుదిశలా పారిపోయేలా చేశారు. వారు పోవటానికి మీరు ఒత్తిడి తెచ్చారు. మీరు వారిని గురించి శ్రద్ధ వహించలేదు. కాని నేను మీతో వ్యవహరిస్తాను. మీరు చేసిన చెడుకార్యాలకు నేను మిమ్మల్ని శిక్షిస్తాను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది. “నేను నా గొర్రెల మందను (ప్రజలను) ఇతర దేశాలకు పంపాను. పోయిన నా మందలను (ప్రజలను) నేను చేరదీస్తాను. వాటిని పచ్చిక బయలుకు (దేశానికి) మరల చేర్చుతాను. నా మందలు (ప్రజలు) వాటి పచ్చిక బీటికి (దేశానికి) తిరిగి చేరుకోగానే వాటికి సంతానోత్పత్తి జరిగి, అభివృద్ధి చెందుతాయి. నా గొర్రెల మందపై నేను క్రొత్త కాపరులను (నాయకులను) నియమిస్తాను. ఆ కాపరులు నా మంద విషయమై శ్రద్ధ వహిస్తారు. నా మంద బెదరిపోయేలా గాని, జడిసి పోయేలా గాని చేయబడదు. నా మందలో ఒక్క గొర్రె కూడా తప్పిపోదు.” ఇదే యెహోవా వాక్కు.

నీతియుక్తమైన “అంకురం” (క్రొత్త రాజు)

“నేనొక నీతి యుక్తమైన అంకురాన్ని[a] మొలిపింప జేసే సమయం వస్తూవుంది,”
ఇదే యెహోవా వాక్కు.
    అతడు మంచి తెలివి తేటలతో పరిపాలించగల రాజు.
    దేశానికి ఏది యోగ్యమైనదో, ఏది మంచిదో అతడది చేస్తాడు.
శుద్ధమైన మంచి బీజోత్పత్తి సమయమందు యూదా ప్రజలు రక్షింపబడతారు.
    ఇశ్రాయేలు సురక్షితంగా నివసిస్తుంది.
“యెహోవా మనకు న్యాయం”[b]
    అని అతనికి పేరుగా ఉంటుంది.

కావున సమయం ఆసన్నమవుతూ ఉంది ఇదే యెహోవా వాక్కు, “అప్పుడు ప్రజలు ఎంత మాత్రం యెహోవా పేరుమీద పాతవిధంగా ప్రమాణం చేయరు. ‘నిత్యుడగు యెహోవా తోడు’ అనేది ‘ఈజిప్టు దేశం నుండి ఇశ్రాయేలును విడిపించి తీసికొని వచ్చిన యెహోవా తోడు’ అనేవి పాత ప్రమాణాలు. కాని ఇశ్రాయేలు ప్రజలు క్రొత్త విధంగా ప్రమాణం చేస్తారు. ‘నిత్యుడగు యెహోవా తోడు. యెహోవా తన ప్రజలను ఉత్తర రాజ్యం నుండి విముక్తి చేసి తీసుకొని వచ్చాడు. ఆయన వారిని పంపిన రాజ్యాలన్నిటి నుండి ప్రజలను తిరిగి తీసికొని వచ్చాడు’ అని ప్రజలు చెప్పుకుంటారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారి స్వదేశంలో నివసిస్తారు.”

దొంగ ప్రవక్తలకు వ్యతిరేకంగా తీర్పు

ప్రవక్తలకు పవిత్రమైన మాటలు:
నేను విచారంగా ఉన్నాను. నా హృదయం పగిలింది.
    నా ఎముకలు వణుకుతున్నాయి.
నేను (యిర్మీయా) ఒక తాగుబోతు వ్యక్తిలా ఉన్నాను.
    యెహోవాను బట్టి, ఆయన పవిత్ర వాక్కును బట్టి నేనిలా వున్నాను.
10 యూదా రాజ్యం వ్యభిచరించే వారితో నిండిపోయింది.
    వారనేక విధాలుగా అవిశ్వాసులై ఉన్నారు.
యెహోవా రాజ్యాన్ని శపించాడు.
    అందుచే అది బీడై పోయింది.
పచ్చిక బయళ్లలో మొక్కలు ఎండి చచ్చిపోతున్నాయి.
    పొలాలన్నీ ఎడారుల్లా మారినాయి.
ప్రవక్తలంతా దుష్టులయ్యారు.
    ప్రవక్తలు వారి శక్తియుక్తుల్ని తప్పుడు విధంగా వినియోగిస్తున్నారు.
11 “ప్రవక్తలు, యాజకులు కూడా దుష్టులయ్యారు.
    వారు నా ఆలయంలోనే దుష్టకార్యాలు చేయటం నేను చూశాను.”
ఇదే యెహోవా వాక్కు.

12 “కావున నా సందేశం ఇక మీదట వారికివ్వను.
    వారి జీవితం బలవంతంగా అంధకారంలో నడిచినట్లుంటుంది.
ప్రవక్తలకు, యాజకులకు మార్గం అతి నునుపై జారిపడేలా ఉంటుంది.
    గాఢాంధకారంలో ప్రవక్తలు, యాజకులు జారిపడతారు.
వారి మీదికి విపత్తును తీసుకొని వస్తాను.
    ఆ సమయంలో ఆ ప్రవక్తలను, యాజకులను శిక్షిస్తాను.”
ఇదే యెహోవా వాక్కు.

13 “సమరయ[c] ప్రవక్తలు చెడు చేయటం నేను చూశాను.
బూటకపు దేవత బయలు పేరిట వారు భవిష్య విషయాలు చెప్పటం నేను చూశాను.
    ఆ ప్రవక్తలు ఇశ్రాయేలు ప్రజలను యెహోవాకు దూరం చేశారు.
14 యూదా ప్రవక్తలు యెరూషలేములో ఘోరమైన
    పనులు చేయటం నేను చూశాను.
ఈ ప్రవక్తలు వ్యభిచార దోషానికి పాల్పడ్డారు.
    వారు అబద్ధాలను వింటారు.
వారు తప్పుడు బోధలను అనుసరించారు.
    వారు దుర్మార్గులను, చెడు కార్యాలు చేయటానికి ప్రోత్సహించారు.
అందువల్ల ప్రజలు పాపం చేయటం మానలేదు.
    వారు సొదొమ నగరం వలె ఉన్నారు.
యెరూషలేము ప్రజలు నా దృష్టిలో
    గొమొర్రా నగరం వలె ఉన్నారు!”
15 అందువల్ల సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ ప్రవక్తల విషయంలో ఇలా చెపుతున్నాడు.
“ఆ ప్రవక్తలను నేను శిక్షిస్తాను.
    ఆ శిక్ష విషముతిన్నట్లు, చేదు నీరు తాగినట్లు ఉంటుంది.
ఆ ప్రవక్తలు ఆధ్యాత్మిక పరమైన
    ఒక రుగ్మతను ప్రబలింప చేశారు.
ఆ రోగం దేశ వ్యాప్తంగా చెలరేగింది, కావున ఆ ప్రవక్తలను నేను శిక్షిస్తాను.
    ఆ రోగం యెరూషలేములోని ప్రవక్తల నుండే సంక్రమించింది.”

16 సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు:
    “ఆ ప్రవక్తలు మీకు చెప్పే విషయాలను మీరు లక్ష్యపెట్టవద్దు.
    వారు మిమ్మల్ని మోసపుచ్చాలని ప్రయత్నిస్తున్నారు.
ఆ ప్రవక్తలు దర్శనాలను గురించి మాట్లాడతారు.
    కాని వారా దర్శనాలను నానుండి పొందలేదు.
వారి దర్శనాలన్నీ వారి కల్పనాలే.
17 కొంత మంది ప్రజలు యెహోవా యొక్క నిజమైన సందేశాలను సైతం అసహ్యించుకుంటారు.
    అందువల్ల ప్రవక్తలు ఆ ప్రజలకు రకరకాల విషయాలు చెపుతారు.
    ‘మీకు శాంతి సమకూరుతుంది’ అని వారంటారు.
కొంత మంది ప్రజలు బహు మొండివారు.
    వారు చేయదలచుకున్నదేదో అదే చేస్తారు.
కావున వారికి ఆ ప్రవక్తలు,
    ‘మీకు ఏ కీడూ రాదు!’ అని చెపుతారు.
18 కాని ఈ ప్రవక్తలలో ఏ ఒక్కడూ పరలోక సభలో[d] నిలవలేదు.
    వారిలో ఏ ఒక్కడూ యెహోవాను గాని, యెహోవా వాక్కును గాని దర్శించలేదు.
    వారిలో ఏ ఒక్కడూ యెహోవా సందేశం పట్ల శ్రద్ధ వహించలేదు.
19 ఇప్పుడు యెహోవా నుండి శిక్ష తుఫానులావస్తుంది!
యెహోవా కోపం ఉగ్రమైన గాలి వానలా ఉంటుంది!
    ఆ దుష్టుల తలలు చితికి పోయేలా అది వారి మీదికి విరుచుకు పడుతుంది.
20 యెహోవా చేయదలచుకున్నదంతా చేసేవరకు
    ఆయన కోపం చల్లారదు.
అంత్యదినాల్లో దీనిని మీరు
    సరిగా అర్థం చేసుకుంటారు.
21 ఆ ప్రవక్తలను నేను పంపియుండలేదు.
    కాని వారికి వారే తమ వర్తమానాలను చాటటానికి పరుగున పోయారు.
నేను వారితో మాట్లాడలేదు.
    కాని వారు నా పేరుతో ప్రవచించారు.
22 వారు నా సర్వ సభలో నిలిచి ఉండినట్లయితే
    వారు నా సందేశాలను యూదా ప్రజలకు చెప్పి ఉండేవారు.
ప్రజలు చెడు మార్గాలు తొక్కకుండా ఆపేవారు.
    వారు దుష్ట కార్యాలు చేయకుండా ఆపేవారు.”

23 “ఇక్కడ ఈ స్థలములో నేను దేవుడను.
    నేను దూర ప్రాంతంలో కూడా దేవుడను.
ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం
    నేను దూరంలో లేను!
24 ఒక వ్యక్తి నాకు కనపడకుండా రహస్య స్థావరంలో దాగటానికి ప్రయత్నించవచ్చు.
కాని వానిని చూడటం నాకు తేలిక ఎందువల్లనంటే
    నేను స్వర్గంలోను, భూమి మీద సర్వత్రా వ్యాపించి వున్నాను!”

25 “నా పేరు మీద అబద్ధాలు బోధించే ప్రవక్తలున్నారు. ‘నాకు స్వప్న దర్శనమయింది. నాకు స్వప్న దర్శనమయింది,’ అని వారంటారు. వారు అలా చెప్పటం నేను విన్నాను. 26 ఎంత కాలం ఇది కొన సాగుతుంది? ఆ ప్రవక్తలు అబద్ధాలనే ఆలోచిస్తారు. వారు ఆలోచించిన అబద్ధాలనే ప్రజలకు భోదిస్తారు. 27 యూదా ప్రజలు నా పేరు మర్చి పోయేలా చేయటానికి ఆ ప్రవక్తలు ప్రయత్నిస్తున్నారు. వారొకరి కొకరు ఈ దొంగ కలల గురించి చెప్పుకొనటం ద్వారా ఇది సాధించాలని చూస్తున్నారు. తమ పూర్వీకులు నన్ను మర్చిపోయిన రీతిగా, ఇప్పుడు నా ప్రజలు నన్ను మర్చిపోయేలా చేయాలని వారు ప్రయత్నిస్తున్నారు. వారి పూర్వీకులు నన్ను మర్చిపోయి, బూటకపు దేవత బయలును ఆరాధించారు. 28 ఎండుగడ్డి, గోధుమలు ఒక్కటి గావు! అదే రీతిగా, ఆ ప్రవక్తల కలలు నా సందేశాలు కానేరవు. ఎవరైనా తన కలలను గూర్చి చెప్పుకోదలిస్తే చెప్పవివ్వండి. కాని నా వర్తమానం విన్నవాడు మాత్రం దానిని యదార్థంగా చెప్పాలి. 29 నా సందేశం అగ్నిలావుంటుంది” ఇదే యెహోవా వాక్కు “అది ఒక బండను పగులకొట్టే సమ్మెటలా ఉంటుంది.

30 “కావున ఆ దొంగ ప్రవక్తలకు నేను వ్యతిరేకిని.” ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం “ఈ ప్రవక్తలు ఒకరి నుండి ఒకరు నా మాటలు దొంగిలించటానికి ప్రయత్నిస్తూ ఉంటారు.[e] 31 నేను ఈ దొంగ ప్రవక్తలకు వ్యతిరేకిని.” ఇదే యెహోవా వాక్కు. “వారు కల్పించిన మాటలనే వారు ఉపయోగిస్తూ, అది నా సందేశమన్నట్లు నటిస్తారు. 32 అసత్య దర్శనాలను బోధించే ఈ ప్రవక్తలకు నేను వ్యతిరేకిని.” ఇదే యెహోవా వాక్కు. “వారి అబద్ధాల ద్వారా అసత్య ప్రచారాల ద్వారా వారు నా ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. ప్రజలకు బోధించే నిమిత్తం ఆ ప్రవక్తలను నేను పంపియుండలేదు! నా తరఫున ఏమి చేయటానికీ నేను వారికి ఆజ్ఞ ఇవ్వలేదు! యూదా ప్రజలకు వారేరకంగా సహాయపడలేరు.” ఇదే యెహోవా వాక్కు.

యెహోవా నుండి విషాద వార్త

33 “యూదా ప్రజలు గాని, ఒక ప్రవక్త గాని, లేక ఒక యాజకుడు గాని నిన్ను పిలిచి, ‘యిర్మీయా, యెహోవా ఏమి ప్రకటిస్తున్నాడు?’ అని అడుగవచ్చు. అప్పుడు వారికి సమాధానంగా, ‘యెహోవాకు మీరే భారంగా[f] ఉన్నారు! ఈ పెద్ద భారాన్ని క్రిందికి విసరి వేస్తాను.’ ఇదే యెహోవా వాక్కు, అని నీవు చెప్పు.

34 “ఒక ప్రవక్తే గాని, యాజకుడే గాని, లేక ప్రజలలో ఎవ్వరే గాని, ‘ఇది యెహోవా నుండి వచ్చిన ప్రకటన ….’ అని చెప్పితే, అది అబద్ధం. అటువంటి వ్యక్తిని, వాని కుటుంబాన్నంతటినీ నేను శిక్షిస్తాను. 35 మీరొకరికొకరు ఇలా చెప్పుకోండి, ‘యెహోవా ఏమి సమాధానమిచ్చాడు?’ లేక ‘యెహోవా ఏమి చెప్పాడు?’ 36 అంతేగాని మరెన్నడు, ‘యెహోవా ప్రకటన (పెద్ద భారం)’ అనే పదాన్ని తిరిగి మరలా వాడరు. ఎందువల్లనంటే యెహోవా సందేశం ఎన్నడూ, ఎవరికీ భారం కాకూడదు. కాని మీరు మన దేవుని మాటలు మార్చివేశారు! ఆయన నిత్యుడైన సర్వశక్తిమంతుడగు యెహోవా!

37 “మీరు దేవుని సందేశం తెలుసుకొనదలిస్తే ఒక ప్రవక్తను, ‘యెహోవా నీకేమి సమాధానం చెప్పాడు’ అని గాని; ‘యెహోవా ఏమి చెప్పినాడు?’ అని గాని అడగండి. 38 కాని, ‘యెహోవా ప్రకటన (పెద్ద భారం) ఏమిటి?’ అని అడగవద్దు. మీరామాటలు వాడితే, ‘అప్పుడు యెహోవా మీకు ఈ మాటలు చెప్పుతాడు: “మీరు నా సందేశాన్ని యెహోవా ప్రకటన” (పెద్ద భారం) అని చెప్పకుండా ఉండవలసింది. ఆ మాటలు వాడవద్దని నేను మీకు చెప్పియున్నాను. 39 కాని నా సందేశాన్ని పెద్ద భారమని పిలిచారు. కావున మిమ్మల్ని పెద్ద భారంలా ఎత్తి నా నుండి విసరి పారవేస్తాను. యెరూషలేము నగరాన్ని మీ పూర్వీకులకు నేను ఇచ్చియున్నాను. కాని మిమ్మల్ని, మీ నగరాన్నీ నా నుండి దూరంగా పార వేస్తాను. 40 పైగా మీకు శాశ్వతంగా తలవంపులు కలిగేలా చేస్తాను. మీ సిగ్గును మీరెన్నడూ మరువలేరు.’”

మంచి మరియు చెడ్డ అంజూరపు పండ్లు

24 యెహోవా నాకు ఈ వస్తువులను చూపించాడు: యెహోవా మందిరం ముందు ఉంచబడిన రెండు బుట్టల అంజూరపు పండ్లను చూశాను. (నాకు ఈ దర్శనం బబులోను రాజైన నెబుకద్నెజరు యెకోన్యాను[g] బందీగా తీసుకొని పోయిన తరువాత కలిగింది. యెకోన్యా రాజైన యెహోయాకీము కుమారుడు. యెకోన్యా, అతని ముఖ్యమైన అధికారులు యెరూషలేము నుండి తీసుకొనిపోబడినారు. వారు బబులోనుకు బందీలుగా కొనిపోబడినారు. నెబుకద్నెజరు యూదా రాజ్యంలోని చాలా మంది వడ్రంగులను, లోహపు పనివారలను కూడ తీసుకొనిపోయాడు.) ఒక బుట్ట నిండా మంచి అంజూరపు పండ్లున్నాయి. అవి వాటి కాలం కంటే ముందు పండిన పండ్లవలె ఉన్నాయి. కాని రెండవ బుట్టలో కుళ్లిపోయిన అంజూరపు పండ్లున్నాయి. అవి తినటానికి పనికి రాకుండా కుళ్లి పోయాయి.

“యిర్మీయా, నీవు ఏమి చూస్తున్నావు? అని యెహోవా నన్ను అడిగాడు.

“నేను అంజూరపు పండ్లను చూస్తున్నాను. అవి చాలా మంచి పండ్లు. చెడి పోయిన పండ్లు కుళ్లి పోయాయి. అవి తినటానికి పనికి రాకుండా కుళ్లిపోయాయి,” అని నేను సమాధానమిచ్చాను.

పిమ్మట యెహోవా వర్తమానం నాకు చేరింది. ఇశ్రాయేలు దేవుడైవ యెహోవా ఇలా చెప్పాడు: “యూదా ప్రజలు తమ దేశాన్నుండి బయటకు కొనిపోబడ్డారు. వారి శత్రువు వారిని బబులోనుకు తీసుకొనిపోయాడు. ఆ ప్రజలు ఈ మంచి అంజూరపండ్లలా ఉన్నారు. ఆ ప్రజల పట్ల నేను కనికరం చూపుతాను. నేను వారిని రక్షిస్తాను. నేను వారిని తిరిగి యూదా రాజ్యానికి తీసుకొని వస్తాను. నేను వారిని చీల్చి పారవేయను. వారిని పైకి తీసుకొని వస్తాను! వారిని పెరికి వేయను. వారు అభివృద్ది చెందటానికి వారిని స్థిరంగా నాటుతాను. వారు నన్ను తెలుసుకొనగోరేలా చేస్తాను. నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు. వారు నా ప్రజలు; నేను వారి దేవుడను. బబులోనులో వున్న ఆ బందీలంతా పూర్ణహృదయ పరివర్తనతో నా వైపు తిరుగుతారు గనుక నేనిదంతా చేస్తున్నాను.

“కాని యూదా రాజైన సిద్కియా మాత్రం తినటానికి పనికిరాకుండా కుళ్లిపోయిన అంజూరపు పండ్లవలె అవుతాడు. సిద్కియా, అతని ఉన్నతాధికారులు, యెరూషలేములో యింకా మిగిలి వున్న ప్రజలు, మరియు ఈజిప్టులో నివసిస్తున్న యూదా ప్రజలు కుళ్లిన ఈ అంజూరపు పండ్లవలె ఉంటారు. నేను వారిని శిక్షిస్తాను. ఆ శిక్ష భూమిమీద ప్రజలందరికీ భయంతో కూడిన విస్మయాన్ని కల్గిస్తుంది! యూదా వారిని చూచి తక్కిన ప్రజలు హేళన చేస్తారు. వారిని గూర్చి హాస్యోక్తులు పలుకుతారు. నేను వారిని చిందర వందర చేసి పడవేసిన అన్ని ప్రదేశాలలో ప్రజలు వారిని శపిస్తారు. 10 వారి మీదికి కత్తిని, కరువును, రోగాలను పంపుతాను. వారంతా చనిపోయే వరకు వారిని ఎదుర్కొంటూ వుంటాను. వారికి, వారి పితరులకు నేనిచ్చిన భూమిమీద వారిక ఎంత మాత్రము ఉండరు.”

యిర్మీయా బోధనల సంగ్రహం

25 యూదా ప్రజలందరి గురించి యిర్మీయాకు చేరిన సందేశం ఇది. యెహోయాకీము యూదాకు రాజై పాలిస్తున్న నాల్గవ సంవత్సరంలో[h] ఈ సందేశం వచ్చింది. యోషీయా కుమారుడు యెహోయాకీము. ఇతని పాలనలో నాల్గవ సంవత్సరం అయ్యే సరికి నెబుకద్నెజరు బబులోనుకు రాజు కావటం, పరిపాలన ఒక సంవత్సరం కొనసాగించటం జరిగింది. ప్రవక్తయైన యిర్మీయా యూదా ప్రజలందరికి, యెరూషలేము వాసులందరికి ఈ సందేశం ఇచ్చాడు:

యెహోవా నుండి వచ్చిన సందేశాలను గత ఇరవై మూడు సంవత్సరాలలో నేను మీకు పదే పదే ఇచ్చియున్నాను. అమోను కుమారుడైన యోషీయా యూదా రాజ్యాన్ని పదమూడవ సంవత్సరంలో పాలిస్తూ ఉన్నప్పటినుండి నేను ప్రవక్తగా కొనసాగుతున్నాను. ఆనాటి నుండి ఈ నాటి వరకు నేను మీకు యెహోవా సందేశాలను అందజేస్తూ వస్తున్నాను. కాని మీరు వినిపించుకోలేదు. యెహోవా తన సేవకులైన ప్రవక్తలను మరల, మరల మీ వద్దకు పంపాడు. కాని వారు చెప్పేది మీరు వినలేదు. మీరసలు వారిని లక్ష్య పెట్టలేదు.

ఆ ప్రవక్తలు, “మీ జీవిత విధానం మార్చుకోండి. ఆ చెడు కార్యాలు చేయటం మానండి. మీలోమార్పు వస్తే, ఏనాడో దేవుడు మీరు నివసించుటకు మీ పితరులకు ఇచ్చిన రాజ్యానికి మీరు తిరిగి రాగలరు. మీరు శాశ్వాతంగా నివసించటానికి ఈ రాజ్యాన్ని ఆయన మీకిచ్చాడు. అన్య దేవతలను అనుసరించకండి. వాటిని సేవించవద్దు. ఆరాధించవద్దు. మానవ హస్తాలతో చేసిన విగ్రహాలను పూజించకండి. అదే మీపట్ల నాకు కోపం కల్గిస్తూ వుంది. ఇది చేయటం వల్ల మీకు మీరే హాని కలుగజేసుకుంటున్నారు!”[i]

“కాని మీరు నా మాట వినలేదు” ఇది యెహోవా వాక్కు “ఎవడో ఒక వ్యక్తి చేసిన విగ్రహాలను మీరు పూజించారు. అది నన్ను ఆగ్రహపర్చింది. అదే మిమ్ము బాధ పెట్టింది.”

కావున సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెప్పుతున్నాడు: “మీరు నా వర్తమానాలను వినలేదు. అందుచేత నేను శీఘ్రమే ఉత్తరదేశం నుండి ప్రజలందరి కొరకు ఒకనిని పంపుతాను.” ఇదే యెహోవా వాక్కు. “బబులోను రాజైన నెబుకద్నెజరును వెంటనే పిలిపిస్తాను. అతడు నా సేవకుడు. ఆ జనాన్ని యూదా రాజ్యం మీదికి, దాని ప్రజలపైకి రప్పిస్తాను. అంతేగాదు. వారిని మీ చుట్టూ వున్న దేశాల మీదికి కూడ రప్పిస్తాను. ఆయా దేశాలన్నిటినీ నేను నాశనం చేస్తాను. వాటిని శాశ్వతమైన ఎడారిగా మార్చి వేస్తాను. ప్రజలు ఆయా దేశాలను చూచి అవి ఎలా నాశనమయినాయో అని విస్మయం పొందుతారు. 10 ఆ ప్రాంతంలో ఆనందోత్సాహాలను అంతం చేస్తాను. వివాహ వేడుకలు ఏ మాత్రం ఉండవు. తిరుగలి రాళ్ల శబ్దాలను, దీపాల వెలుగును మాయం చేస్తాను. 11 ఆ ప్రాంతమంతా ఒక పనికిరాని ఎడారిలా మారి పోతుంది. ఆ ప్రజలంతా బబులోను రాజుక్రింద డెబ్బయి ఏండ్ల పాటు బానిసలవుతారు.

12 “కాని డెబ్బయి సంవత్సరాల అనంతరం నేను బబులోను రాజును శిక్షిస్తాను. బబులోను రాజ్యాన్ని కూడా శిక్షకు గురి చేస్తాను.” ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం “కల్దీయుల దేశాన్ని కూడా వారు పాపాల నిమిత్తంగా శిక్షిస్తాను. ఆ ప్రాంతాన్ని శాశ్వతంగా ఎడారిలా మార్చివేస్తాను. 13 బబులోనుకు చాలా కష్టనష్టాలు కలుగుతాయిని చెప్పియున్నాను. అవన్నీ జరిగి తీరుతాయి. యిర్మీయా ఆ పరాయి రాజ్యాల గురించి ప్రవచించియున్నాడు. ఆ హెచ్చరికలన్నీ ఈ గ్రంథంలో వ్రాయబడినాయి. 14 అవును. బబులోను ప్రజలు చాలా దేశాలలో ఎక్కువమంది గొప్ప రాజులకు సేవలు చేయాల్సి ఉంటుంది. వారు చేసే పనులన్నిటికీ అర్హమైన శిక్ష వారికి నేను విధిస్తాను.”

ప్రపంచ రాజ్యాలపై తీర్పు

15 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ విషయాలు నాకు చెప్పాడు: “యిర్మీయా, ఈ ద్రాక్షా రసపు గిన్నెను నా చేతి నుండి తీసుకో. ఇది నా కోపరసం. నిన్ను నేను వివిధ దేశాలకు పంపుతున్నాను. ఆయా దేశాల వారిని ఈ గిన్నె నుండి తాగేలా చేయుము. 16 వారీ ద్రాక్షారసాన్ని తాగుతారు. పిదప వారు వాంతి చేసుకొని, పిచ్చివారిలా ప్రవర్తిస్తారు. నేను త్వరలో వారి పైకి పంపబోయే కత్తి దృష్ట్యా వారలా చేస్తారు.”

17 కావున యెహోవా చేతి నుండి నేను ఆ గిన్నె అందుకొని యెహోవా పంపిన ప్రజలందరి యొద్దకు వెళ్లాను. 18 యెరూషలేము వాసులకు, యూదా వారికి ఈ ద్రాక్షారసం పోశాను. యూదా రాజులను, నాయకులను ఈ గిన్నె నుండి తాగేలా చేశాను. వారిని ఎడారిలా మార్చివేయాలని. నేనీ విధంగా ఎందుకు చేశానంటే ఆ ప్రదేశం సర్వనాశనం కావాలని, అది చూచి ప్రజలు కలవర పడిరి. దానిని శపించితిని. చివరికి అలానే జరిగింది. యూదా ఇప్పుడు అలానే తయారయింది.

19 ఈజిప్టు రాజైన ఫరోను కూడా ఈ గిన్నె నుండి తాగేలా చేశాను. అతని అధికారులను, అతని ముఖ్య నాయకులను, మరియు అతని ప్రజలందరినీ యెహోవా కోపపు గిన్నె నుండి తాగేలా చేశాను.

20 అరబి దేశీయులు, మరియు ఊజు దేశపు రాజులందరు ఈ గిన్నె నుండి తాగేలా నేను చేశాను.

ఫిలిష్తీయుల రాజులను కూడా ఈ గిన్నెతో తాగేలా చేశాను. వీరు అష్కెలోను, గాజా, ఎక్రోను నగరాల రాజులు, మరియు అష్డోదులో మిగిలిన రాజ్యానికి అధిపతులు.

21 పిమ్మట ఎదోము, మోయాబు, మరియు అమ్మోను ప్రజలు ఈ గిన్నెతో తాగేలా చేశాను.

22 తూరు రాజులు సీదోను రాజులు కూడ ఈ గిన్నెతో తాగేలా చేశాను.

దూరదేశాపు రాజులందరి చేత ఆ గిన్నెతో తాగించాను. 23 దదాను ప్రజలు, తేమానీయులు, బూజీయులందరూ ఈ గిన్నెతో తాగేలా చేశాను. కణతల వద్ద తమ వెంట్రుకలు గొరిగించుకొనే వారందరినీ ఈ గిన్నెతో తాగేలా చేశాను. 24 అరబి రాజులంతా ఈ గిన్నె నుండి తాగేలా చేశాను. ఈ రాజులు ఎడారిలో నివసిస్తారు. 25 జిమ్రీ రాజులు, ఏలాము రాజులు, మరియు మాదీయుల రాజులు ఈ గిన్నె నుండి తాగేలా చేశాను. 26 దగ్గరలో ఉన్న, దూరాన ఉన్న ఉత్తర దేశపు రాజులందరు ఈ గిన్నె నుండి తాగేలా చేశాను. ఒకరి తరువాత ఒకరు వారంతా తాగేలా చేశాను. యెహోవా కోపపు గిన్నె నుండి భూమిమీద గల రాజ్యాల వారంతా తాగేలా చేశాను. కాని బబులోను రాజు మాత్రం ఇతర రాజ్యాల వారంతా తాగిన పిమ్మట ఆ గిన్నె నుండి ఆఖరికి తాగుతాడు.

27 “యిర్మీయా! ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తి మంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడని ఆయా రాజ్యాల వారికి తెలియజేయుము: ‘నా కోపపు గిన్నె నుండి తాగండి. మైకం వచ్చేలా తాగి వాంతి చేసుకోండి! క్రింద పడి మరల లేవకుండా ఉండండి. ఎందువల్లనంటే మిమ్మల్ని చంపటానికి కత్తిని మీమీదికి పంపుతున్నాను!’

28 “ఆ ప్రజలు నీ చేతి నుండి గిన్నెను తీసికోవటానికి నిరాకరిస్తారు. వారు దాని నుండి త్రాగటానికి ఒప్పుకోరు. అయినా నీవు వారిని పిలిచి ఇలా చెప్పాలి: ‘సర్వశక్తిమంతుడైన దేవుడీ సంగతులు తెలియజేస్తున్నాడు. మీరు నిజానికి ఈ గిన్నె నుండి తాగాలి! 29 నా పేరుతో పిలవబడే యోరూషలేము నగరానికి ముప్పు తేవటం మొదలు పెట్టాను. బహుశః మీరు శిక్షింపబడక పోవచ్చునని మీరనుకుంటూ ఉండవచ్చు. అయితే మీరు పొరబడుతున్నారు. మీరు శిక్షింపబడతారు. భూమి మీదనున్న ప్రజలందరినీ ఎదుర్కోవటానికి నేను కత్తిని పంపుతున్నాను.’” ఇదే యెహోవా వాక్కు.

30 “యిర్మీయా, ఈ వర్తమానం వారికి అందజేయి:
‘ఉన్నతమైన, పవిత్రమైన తన ఆలయం నుండి
    యెహోవా ఎలుగెత్తి చాటుతున్నాడు.
యెహోవా తన పచ్చిక బీడు (ప్రజలు)కు వ్యతిరేకంగా చాటుతున్నాడు.
    ఆయన ద్రాక్షారసం తీసే వారిలా బిగ్గరగా కేకలేస్తున్నాడు.
31 ఆ శబ్దం మోత భూమిపై ప్రజలందరికి చేరుతుంది.
    అసలీ శబ్దం ఎందుకు?
యెహోవా అన్ని దేశాల ప్రజలనూ శిక్షిస్తున్నాడు.
    యెహోవా ప్రజలకు వ్యతిరేకంగా తన వాదన తెలియజెప్పాడు
ఆయన ప్రజలపై తీర్పు ఇచ్చాడు.
    ఆయన కత్తితో దుష్ట సంహారం చేస్తున్నాడు.’”
ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం.

32 సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పినదేమంటే:
“ఒక దేశాన్నుండి మరొక దేశానికి
    విపత్తులు త్వరలో వ్యాపిస్తున్నాయి.
అవి పెనుతుఫానులా భూమిపై
    సుదూర తీరాల వరకు వ్యాపిస్తాయి!”

33 ఆ ప్రజల శవాలు దేశం ఒక అంచు నుండి మరో అంచువరకు పడి ఉంటాయి. చనిపోయిన వారి కొరకు విలపించే వారొక్కరూ ఉండరు. ఆ శవాలను ఎవ్వరూ సేకరించి సమాధి చేయరు పశువుల పేడవలె అవి నేలపై పడి ఉంటాయి.

34 కాపరులారా (నాయకులారా), మీరు మందను (ప్రజలను) కాయవలసి ఉంది.
కాని ఓ గొప్ప నాయకులారా, రోదించటం మొదలు పెట్టండి.
    గొర్రెల కాపరులారా, నేలమీద పడి బాధతో పొర్లండి
ఎందువల్లనంటే మీరు సంహరించబడే సమయం సమీపిస్తూ ఉంది.
    మిమ్ములను కొట్టి చెల్లా చెదరు చేస్తాను. పగిలిన కుండ పెంకుల్లా మీరు చిందర వందరై పోతారు!
35 గొర్రెల కాపరులు (నాయకులు) దాగటానికి తావే దొరకదు!
    ఆ నాయకులు తప్పించుకోలేరు!
36 కాపరులు (నాయకులు) అరవటం నేను వింటున్నాను.
    మంద (ప్రజలు) కాపరులు రోదించటం నేను వింటున్నాను!
    యెహోవా వారి పచ్చిక బయళ్లను (దేశం) నాశనం చేస్తున్నాడు!
37 ఆ ప్రశాంతమైన పచ్చిక బయళ్లు (భవనాలు) నాశనం చేయబడి వట్టి ఎడారిలా అవుతాయి.
    యెహోవా మిక్కిలి కోపంగా వున్న కారణంగా ఇది జరిగింది.
38 తన గుహనుండి బయటికి వస్తున్న ఒక భయంకరమైన సింహంలా యెహోవా ఉన్నాడు.
    యెహోవా కోపంగా ఉన్నాడు!
యెహోవా కోపం ఆ ప్రజలకు హాని కల్గించింది!
    వారి రాజ్యం వట్టి ఎడారిలా అయిపోయింది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International