Chronological
దేవుడు మరియు విగ్రహాలు
10 ఇశ్రాయేలు వంశీయులారా యెహోవా చెప్పే మాట వినుము! 2 యెహోవా ఇలా చెప్పుచున్నాడు:
“అన్యదేశ ప్రజలవలె నీవు జీవించవద్దు!
ఆకాశంలో వచ్చే ప్రత్యేక సంకేతాలకు[a] నీవు భయపడవద్దు!
అన్యదేశాలవారు ఆకాశంలో తాము చూచే కొన్ని సంకేతాలకు భయపడతారు.
కాని మీరు మాత్రం అలాంటి వాటికి భయపడరాదు.
3 ఇతర దేశ ప్రజల ఆచారాలు లెక్క చేయవలసినవికావు.
వారి విగ్రహాలు అడవిలో దొరికే కర్రముక్కల కంటే వేరేమీ కాదు.
వారి విగ్రహాలను ఒక పనివాడు తన ఉలితో చెక్కి మలుస్తాడు.
4 వెండి బంగారాలతో వారి విగ్రహాలను అందంగా తీర్చిదిద్దుతారు.
వాటిని పడిపోకుండా సుత్తులతో
మేకులు కొట్టి నిలబెడతారు.
5 బీర తోటలోని దిష్టి బొమ్మల్లా వారి విగ్రహాలుంటాయి.
వారి విగ్రహాలు మాట్లాడవు.
వారి విగ్రహాలు నడవలేవు.
ఆ విగ్రహాలను మనుష్యులు మోయాలి!
కావున ఆ విగ్రహాలకు భయపడకు.
అవి నిన్ను ఏమీ చేయలేవు.
పైగా అవి నీకసలు ఏ రకమైన సహాయమూ చేయలేవు!”
6 యెహోవా, నీవంటి దైవం మరొకరు లేరు!
నీవు గొప్పవాడవు!
నీ నామము గొప్పది మరియు శక్తి గలది.
7 ఓ దేవా, ప్రతివాడూ నిన్ను గౌరవించాలి. సర్వదేశాలకూ నీవు రాజువు.
వారందరి గౌరవానికి నీవు అర్హుడవు.
ప్రపంచ దేశాలలో చాలామంది జ్ఞానులున్నారు.
కాని వారిలో ఏ ఒక్కడు నీకు సాటిరాడు.
8 అన్యదేశవాసులు మందబుద్ధులు, మూర్ఖులు.
వారి బోధనలన్నీ పనికిరాని చెక్క బొమ్మల పేరుతో వచ్చినవి.
9 వారు తర్షీషు నగరంనుండి వెండిని,
ఉపాజు నగరం నుండి బంగారాన్ని తెచ్చి విగ్రహాలను చేస్తారు.
విగ్రహాలు వడ్రంగులచే, లోహపు పని వారిచే చేయబడతాయి.
ఈ విగ్రహాలను నీలి రంగు, ఊదారంగు బట్టలతో అలంకరిస్తారు.
“జ్ఞానులు” ఆ “దేవుళ్ల” ని చేస్తారు.
10 కాని యెహోవా నిజమైన దేవుడు.
ఆయన మాత్రమే నిజంగా జీవిస్తున్న దేవుడు!
శాశ్వతంగా పాలించే రాజు ఆయనే.
దేవునికి కోపం వచ్చినప్పుడు భూమి కంపిస్తుంది.
ప్రపంచ రాజ్యాల ప్రజలు ఆయన కోపాన్ని భరించలేరు.
11-12 “ఈ వర్తమానం ఆ ప్రజలకు తెలియజేయుము,
‘ఆ బూటకపు దేవతలు భూమిని, ఆకాశాన్ని సృష్టించలేదు. ఆ చిల్లర దేవుళ్లు నాశనం చేయబడతారు.
వారు భూమి నుండి, ఆకాశము నుండి మాయమవుతారు.’”[b]
తన శక్తితో భూమిని సృష్టించినది నిత్యుడగు దేవుడే.
దేవుడు తన జ్ఞాన సంపదచే ఈ ప్రపంచాన్ని సృష్టించినాడు.
తన అవగాహనతో దేవుడు
ఆకాశాన్ని భూమిపైన వ్యాపింపజేశాడు.
13 భయంకరమైన శబ్ధంగల పిడుగులను దేవుడే కలుగజేస్తాడు.
ఆకాశంనుండి ధారాపాతంగా వర్షం పడేలా కూడా దేవుడే చేస్తాడు.
భూమి నలుమూలల నుండీ ఆకాశంలోకి మేఘాలు లేచేలా ఆయన చేస్తాడు.
ఆయన ఉరుములు మెరుపులతో వానపడేలా చేస్తాడు.
ఆయన తన గిడ్డంగుల నుండి గాలి వీచేలా చేస్తాడు.
14 ప్రజలు మందబుద్ధి గలవారయ్యారు!
లోహపు పనివారు వారు చేసిన విగ్రహాల చేత మూర్ఖులయ్యారు.
వారి బొమ్మలు అబద్ధాలకు ప్రతీకలు.
అవి జడపదార్థములు[c]
15 ఆ విగ్రహాలు ఎందుకూ కొరగానివి.
అవి హాస్యాస్పదమైనవి.
తీర్పు తీర్చే కాలంలో
ఆ విగ్రహాలు నాశనం చేయబడతాయి.
16 కాని యాకోబు యొక్క దేవుడు[d] ఆ విగ్రహాలవంటి వాడు కాదు.
ఆయన సర్వసృష్టికి కారకుడు.
ఇశ్రాయేలు తన ప్రజగా వర్థిల్లటానికి ఆయన దానిని ఎంపిక చేసినాడు.
ఆయన పేరు “యెహోవా సర్వశక్తిమంతుడు.”
నాశనం వస్తూవుంది
17 మీకున్నదంతా సర్దుకొని వెళ్లటానికి సిద్దమవ్వండి.
యూదా ప్రజలారా మీరు నగరంలో చిక్కుకున్నారు.
శత్రువులు నగరాన్ని చుట్టు ముట్టారు.
18 యెహోవా ఇలా చెప్పాడు,
“ఈ సారి యూదా ప్రజలను ఈ దేశంనుండి వెళ్ల గొడతాను.
వారికి బాధను, శ్రమను కలుగజేస్తాను.
వారికి ఒక గుణ పాఠం నేర్పటానికి నేనిదంతా చేస్తాను.”[e]
19 అయ్యో నేను (యిర్మీయా) బాగా గాయపడ్డాను
నా గాయం మానరానిది.
“ఇది నా రోగం, నేను దానిచే బాధ పడవలసినదే”
అని నేను తలపోశాను.
20 నా గుడారం పాడైపోయింది.
దాని తాళ్లన్నీ తెగిపోయాయి.
నా పిల్లలు నన్ను వదిలేశారు.
వారు వెళ్లిపోయారు.
నా గుడారం మరల నిర్మించటానికి సహాయం చేయుటకు ఒక్కడు కూడా మిగలలేదు.
నాకు ఆశ్రయం కల్పించటానికి ఒక్కడూ మిగలలేదు.
21 గొర్రెల కాపరులు (నాయకులు) మందమతులయ్యారు!
వారు యెహోవాను కనుగొనే ప్రయత్నం చేయరు,
వారు జ్ఞాన శూన్యులు.
అందువల్లనే వారి మందలు (ప్రజలు) చెల్లాచెదురై తప్పిపోయాయి.
22 ఒక పెద్ద శబ్దం వస్తోంది, వినుము!
ఆ పెద్ద శబ్దం ఉత్తర దిశనుండి వస్తూవుంది.
అది యూదా నగరాలను నాశనం చేస్తుంది.
యూదా ఒక వట్టి ఎడారిలా మారుతుంది.
అది గుంట నక్కలకు స్థావరమవుతుంది.
23 యెహోవా, వారి స్వంత జీవితాలను వారి స్వాధీనంలో ఉంచుకోరని నాకు తెలుసు.
ప్రజలు వారి భవిష్యత్తును గూర్చి పథకాలను వేసుకోలేరు.
జీవించుటకు సరైన మార్గం వారికి తెలియదు.
ఏది సన్మార్గమో ప్రజలకు నిజంగా తెలియదు.
24 యెహోవా, మమ్మల్ని సరిదిద్దుము!
నీవు మమ్ము నశింపజేయవచ్చు
కాని మాపట్ల నిష్పక్షపాతంగా వుండుము!
కోపంలో మమ్మల్ని శిక్షించవద్దు!
25 నీకు కోపంవస్తే,
అన్యదేశాలను శిక్షించుము.
వారు నిన్నెరుగరు; గౌరవించరు.
ఆ ప్రజలు నిన్ను పూజించరు.
ఆ రాజ్యాలు యాకోబు వంశాన్ని నాశనం చేశాయి.
వారు ఇశ్రాయేలును పూర్తిగా నాశనం చేశారు.
వారు ఇశ్రాయేలు యొక్క స్వంత దేశాన్ని నాశనం చేశారు.
ఒడంబడిక ఉల్లంఘన
11 ఈ వర్తమానం యిర్మీయాకు వచ్చింది. ఈ వర్తమానం యెహోవా వద్దనుండి వచ్చినదిః 2 “యిర్మీయా, ఈ ఒడంబడికలోని మాటలను వినుము. యూదా ప్రజలకు వీటి విషయం తెలియజేయుము. యెరూషలేము నగర వాసులకు కూడా ఈ విషయాలు తెలియజేయుము. 3 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పినది ఇది: ‘ఈ ఒడంబడికను అనుసరించని ప్రతి వానికి కీడు వాటిల్లుతుంది.’ 4 నేను మీ పూర్వీకులతో చేసుకొన్న ఒడంబడిక విషయం మాట్లాడుతున్నాను. వారిని ఈజిప్టునుండి నేను తీసుకొని వచ్చినప్పుడు నేనా ఒడంబడికను వారితో చేసుకొన్నాను. ఈజిప్టు అనేక కష్టాలున్న స్థలము అది ఇనుము కూడా కరిగి పోయేటంత వేడిగల పొయ్యిలాఉంది. నాకు విధేయులై, నేనాజ్ఞాపించినదంతా చేయండని ఆ ప్రజలకు చెప్పాను. మీరిది చేస్తే, మీరు నా ప్రజలవుతారు. పైగా నేను మీ దేవుడనవుతాను.
5 “నేను మీ పూర్వీకులకు చేసిన వాగ్దానం నెరవేర్చటానికి నేనిది చేశాను. వారికి నేనొక సారవంతమైన భూమిని ప్రసాదిస్తానని వాగ్దానం చేశాను. పాలు, తేనెలు ప్రవహించే భూమిని ఇస్తానని అన్నాను. ఈనాడు మీరు ఆ రాజ్యంలో నివసిస్తున్నారు.”
నేను (యిర్మీయా) “ఆ ప్రకారమే జరగాలి ప్రభువా” అని అన్నాను.
6 నాతో యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, ఈ సమాచారం యూదా పట్టణాలలోను, యెరూషలేము వీధులలోను ప్రకటించుము: ఈ ఒడంబడిక నియమాలు వినండి. ఆ ఒడంబడికలోని న్యాయసూత్రాలను పాటించండి. 7 ఈజిప్టునుండి విడుదల చేసి మీ పితరులను నేను తీసుకొని వచ్చినప్పుడు వారికి ఒక హెచ్చరిక చేశాను. ఈ రోజువరకూ వారికి పదే పదే హెచ్చరికలు చేస్తూనే వచ్చాను. నాకు విధేయులై వుండమని వారికి చెప్పాను. 8 కాని మీ పూర్వీకులు నా మాట వినలేదు. వారు మొండివైఖరి దాల్చారు. వారి దుష్ట హృదయాలు ఎలా చెపితే అలా ప్రవర్తించారు. ఒడంబడిక ప్రకారం వారు దానిని అనుసరించకపోతే వారికి కీడు వాటిల్లుతుంది. అందువల్లనే వారికి కష్టాలు సంభవించేలా నేను చేశాను! ఒడంబడికకు కట్టుబడి ఉండమని వారికి నేను ఆజ్ఞ ఇచ్చాను. కాని వారు పాటించలేదు.”
9 నాతో యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా! యూదా ప్రజలు, యెరూషలేము వాసులు రహస్య పథకాలు వేశారని నాకు తెలుసు. 10 ఆ ప్రజలు వారి పితరులు చేసిన పాపములన్నీ చేస్తున్నారు! వారి పూర్వీకులు నా వర్తమానం వినటానికి నిరాకరించారు. వారు అన్యదేవతలను అనుసరించి, ఆరాధించారు. ఇశ్రాయేలు వంశం వారు, యూదా వంశం వారు వారి పూర్వీకులతో నేను చేసిన ఒడంబడికను ఉల్లంఘించినారు.”
11 కావున యెహోవా ఇలా చెప్పినాడు, “త్వరలో యూదా వారికి భయంకర విపత్తు సంభవించేలా చేస్తాను. వారు దానినుండి తప్పించుకోలేరు! వారు దుఃఖపడతారు. వారు నా సహాయంకొరకు రోదిస్తారు. అయినా నేను వారి రోదన వినను. 12 అప్పుడు యూదా వారు, యెరూషలేము వాసులు తమ విగ్రహాలవద్దకు వెళ్లి సహాయం అర్థిస్తారు. వారు విగ్రహాలకు సాంబ్రాణి పొగ వేస్తారు. కాని ఆ విపత్కాలం వచ్చినప్పుడు ఆ విగ్రహాలు యూదా ప్రజలను ఆదుకోలేవు.
13 “యూదా ప్రజలారా, మీకు చాలా విగ్రహాలున్నాయి. యూదా రాజ్యంలో ఎన్ని పట్టణాలున్నాయో అన్ని విగ్రహాలు మీలో వున్నాయి. ఆ ఏహ్యమైన బయలు దేవతను ఆరాధించటానికి మీరు చాలా బలిపీఠములను నిర్మించారు. యోరూషలేములో ఎన్ని వీధులున్నాయో అన్ని బలిపీఠాలున్నాయి.
14 “యిర్మీయా, నీవు మాత్రం యూదా ప్రజల కొరకు ప్రార్థన చేయవద్దు. వారి కొరకు అర్థించవద్దు. వారి కొరకు నీవు చేసే ప్రార్థన నేను వినను. ఆ ప్రజలకు బాధలు మొదలవుతాయి. అప్పుడు సహాయం కొరకు నన్ను పిలుస్తారు. కాని నేను వినను.
15 “నా ప్రియురాలు (యూదా) నా ఇంట్లో (ఆలయం) ఎందుకు ఉన్నది?
అక్కడ ఉండే హక్కు ఆమెకు లేదు. ఆమె చాలా చెడుపనులు చేసింది.
యూదా! నీవర్పించే ప్రత్యేక ప్రమాణాలు, బలులు నీవు నాశనంగాకుండా ఆపగలవని నీవనుకుంటున్నావా?
నాకు బలులు అర్పించటం ద్వారా నీవు శిక్షనుండి తప్పించుకోగలవని తలుస్తున్నావా?”
16 యెహోవా నీకొక పేరు ఇచ్చాడు.
“కంటికింపైన పచ్చని ఒలీవ చెట్టు” అని నిన్ను పిలిచాడు
కాని ఆ చెట్టును బలమైన గాలిచే విసరబడే అగ్నితో యెహోవా కాల్చివేస్తాడు.
దాని కొమ్మలన్నీ బూడిదై పోతాయి.[f]
17 సర్వశక్తిమంతుడైన యెహోవా మిమ్ములను నాటి స్థిరపర్చినా
కాని ఆయనే మీకు విపత్తు వస్తుందని ప్రకటించాడు.
ఎందువల్లనంటే, ఇశ్రాయేలు వంశం వారు,
యూదా వంశం వారు చెడు కార్యాలు చేశారు.
మీరు బూటకపు దేవత బయలుకు బయట సమర్పించి
యెహహోవాకు కోపం తెప్పించారు.
యిర్మీయాపై కుట్ర
18 అనాతోతు ప్రజలు[g] నాపై కుట్ర పన్నుతున్నారని యెహోవా నాకు తెలియపరిచాడు. వారు చేసే పనులు యెహోవా నాకు చూపాడు. అందుచే వారు నాకు వ్యతిరేకంగా ఉన్నారని నాకు తెలిసింది. 19 వారు నాకు వ్యతిరేకంగా ఉన్నారని యెహోవా తెలియపర్చక ముందు, నేనొక అమాయకపు గొర్రె పిల్లవలె నరకబడటానికి సిద్ధంగా వున్నాను. వారు నాకు వ్యతిరేకంగా ఉన్నారని నేను అర్థం చేసికోలేదు. నన్ను గురించి వారిలా అంటున్నారు: “మనం చెట్టును, దాని పండును నాశనం చేద్దాం! మనం వానిని చంపివేద్దాం! అప్పుడు ప్రజలు అతన్ని మర్చిపోతారు.” 20 యెహోవా, నీవు సత్య వర్తనుడవైన న్యాయాధి పతివి. ప్రజల మనస్సులను, హృదయాలను పరీక్షించే విధానం నీకు బాగా తెలుసు. నేను నా వాదనలను నీకు వినిపిస్తాను. వారికి తగిన శిక్ష నీవే యిమ్ము.
21 అనాతోతు మనుష్యులు యిర్మీయాను చంపుటకు పథకం పన్నుచుండిరి. వారు యిర్మీయాతో ఇలా అన్నారు: “నీవు యెహోవా పేరుతో ప్రకటనలు చేయవద్దు. లేనిచో నిన్ను మేము చంపివేస్తాం.” అనాతోతు మనుష్యుల విషయంలో యెహోవా ఒక నిర్ణయానికి వచ్చాడు. 22 సర్వశక్షిమంతుడైన యెహోవా ఇలా చెప్పాడు, “నేను త్వరలో అనాతోతు ప్రజలను శిక్షిస్తాను. వారి యువకులు యుద్ధంలో మరణిస్తారు. వారి కుమారులు, కమార్తెలు ఆకలితో మాడి చనిపోతారు. 23 అనాతోతులో ఒక్కడు కూడా వదిలిపెట్టబడడు. ఎవ్వడూ బ్రతకడు. వారిని నేను శిక్షిస్తాను. వారికి కీడు దాపురించేలా నేను చేస్తాను.”
యిర్మీయా దేవునికి ఫిర్యాదు చేయుట
12 యెహోవా, నేను నీతో వాదించినట్లయితే,
నీవే ఎల్లప్పుడూ సరైనవాడవుగా ఉంటావు!
కానీ న్యాయంగా కనబడని కొన్ని విషయాల గురించి నేను నిన్ను అడగాలనుకొంటున్నాను.
దుర్మార్గులు ఎందుకు విజయవంతులవుతున్నారు?
నమ్మదగని ప్రజలు ఎలా సులభమైన జీవితం గడుపుతున్నారు?
2 ఈ దుర్మార్గులను నీవిక్కడ ఉంచినావు. మొక్కలు బాగా వేరూనినట్లు వారు బాగా స్థిరపడి,
అభివృద్ధిచెంది కాయలు కాసారు.
నీవు వారికి చాలా ప్రియమైన వాడివని వారు నోటితో చెబుతారు.
కాని వారి హృదయాలలో నీవు లేవు. వారు నీకు చాలా దూరంగా ఉన్నారు.
3 ఓ ప్రభువా, నా హృదయం నీకు తెలుసు.
నన్ను నీవు చూస్తూనే ఉన్నావు. నా మనస్సును పరీక్షిస్తూనే ఉన్నావు.
గొర్రెలను నరకటానికి లాగినట్టు, ఆ దుర్మార్గపు మనుష్యులను లాగివేయి.
సంహారపు రోజునకు వారిని ఎంపిక చేయి.
4 ఎన్నాళ్లు ఈ భూమి వర్షపాతం లేక ఎండిపోయి ఉండాలి?
ఎన్నాళ్లీ నేలపై గడ్డి ఎండి, చచ్చిపోయి ఉండాలి?
దేశంలో పశువులు, పక్షులు అన్నీ చనిపోయాయి.
ఈ దుష్ట జనుల చెడుపనులే ఈ పరిస్థితికి కారణం.
పైగా, “మాకు ఏమి జరుగుతుందో చూడటానికి యిర్మీయా ఎక్కువ కాలం బ్రతకడు”
అని ఆ దుర్మార్గులే అంటున్నారు.
యిర్మీయాకు దేవుని సమాధానం
5 “యిర్మీయా, మానవులతో పరుగు పందెమునకే నీవు అలసిపోతే,
మరి గుర్రాలతో నీవు ఎలా పరుగు పెట్టగలవు?
సురక్షిత దేశంలోనే నీవు అలసిపోతే,
యొర్దాను నదీ తీరాన పెరిగే ముండ్ల పొదలలోకి వస్తే నీవు ఏమి చేస్తావు?
6 ఈ మనుష్యులు నీ స్వంత సోదరులు.
నీ కుటుంబ సభ్యులే నీకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతున్నారు.
నీ ఇంటివారే నిన్ను జూచి అరుస్తున్నారు.
వారు నీతో స్నేహితులవలె మాట్లాడినా
నీవు వారిని నమ్మవద్దు.
యెహోవా యూదాను తిరస్కరించుట
7 “నేను (యెహోవాను) నా ఇంటిని (యూదాను) వదిలివేశాను.
నా స్వంత ఆస్తిని[h] నేను వదిలివేశాను.
నేను ప్రేమించే దానిని (యూదా) ఆమె శత్రువులకే అప్పగించాను.
8 నా ఆస్తే నాకు ఒక భయంకర సింహంలా తయారయ్యింది.
అది నన్ను చూచి గర్జిస్తూవుంది.
అందుచే దాన్ని నేను అసహ్యించు కుంటున్నాను.
9 నా ఆస్తి రాబందులచే ఆవరింపబడిన
చనిపోయే జంతువులా వుంది.
ఆ పక్షులు దాని చుట్టూ ఎగురుతాయి.
వన్య (అడవి) మృగములారా, రండి.
రండి, తినటానికి ఆహారం తీసుకోండి.
10 చాలామంది గొర్రెల కాపరులు (నాయకులు) నా ద్రాక్షా తోటను నాశనం చేసారు.
ఆ కాపరులు నా తోటలోని మొక్కలపై నడిచారు.
వారు నా అందాల తోటను వట్టి ఎడారిగా మార్చి వేశారు.
11 వారు నా భూమిని ఎడారిలా చేశారు.
అది ఎండి చచ్చిపోయింది. అక్కడ ఎవ్వరూ నివసించరు.
దేశం యావత్తూ వట్టి ఎడారి అయ్యింది.
అక్కడ ఆ భూమిని గూర్చి శ్రద్ధ వహించే వారు ఎవ్వరూ లేరు.
12 సైనికులు ఎడారిలోని నీళ్లగుంటలను దోచుకొనుటకు వచ్చారు.
యెహోవా ఆ సైన్యాలను ఆ రాజ్యాన్ని శిక్షించటానికి వినియోగించుకున్నాడు.
రాజ్యంలో ఒక మూలనుండి మరోమూల వరకు గల ప్రజలంతా శిక్షింపబడ్డారు.
ఏ ఒక్కరికీ రక్షణ లేదు.
13 ప్రజలు గోధుమ పైరు నాటుతారు.
కాని వారు కోసేది ముండ్లను మాత్రమే.
వారు బాగా అలసిపోయేటంతగా శ్రమిస్తారు.
కాని వారి శ్రమకు ఫలం శూన్యం.
వారి పంట విషయంలో వారు సిగ్గు చెందుతారు.
యెహోవా కోపకారణంగా ఇదంతా జరిగింది.”
ఇశ్రాయేలు పొరుగు వారికి దేవుని వాగ్దానం
14 యెహోవా ఇలా చెప్పాడు, “ఇశ్రాయేలు చుట్టు పట్లవుండే ప్రజలకు నేనేమి చేస్తానో నీకు చెపుతాను. ఆ జనులు చాలా దుర్మార్గులు. నేను ఇశ్రాయేలీయుల కిచ్చిన రాజ్యాన్ని వారు ధ్వంసం చేశారు. ఆ దుష్ట జనులను నేను పెల్లగించి, వారి రాజ్యంనుండి బయటికి త్రోసివేస్తాను. వారితో పాటు యూదా వారిని కూడా పెల్లగించుతాను. 15 నేను వారిని తమ రాజ్యం నుండి భ్రష్టులను చేశాక, వారి విషయంలో నేను బాధపడతాను. తరువాత ప్రతి కుటుంబాన్నీ దాని స్వస్థలానికి, స్వంత ఆస్తికి తీసుకొని వస్తాను. 16 కాకపోతే ఆ ప్రజలు తగిన గుణపాఠం నేర్చుకోవాలని నాకోరిక. గతంలో వారు నా ప్రజలకు బయలు దేవత పేరు మీద వాగ్దానాలు చేయటం నేర్పినారు. ఇప్పుడు ఆ ప్రజలు తగిన గుణపాఠం నేర్చుకోవాలని నా ప్రయత్నం. వారు నా పేరు ఉపయోగించుట నేర్చుకోవాలి. ‘నిత్యుడైన దేవుని సాక్షిగా …’ అని వారు చెప్పుట నేర్చుకోవాలి. అప్పుడు నేను వారిని నా ప్రజల మధ్య నిత్యము నివసించేలా చేస్తాను. 17 కాని ఏ దేశమైనా మాట వినకపోతే, అప్పుడు నేను వారిని సర్వ నాశనం చేస్తాను. చచ్చిన మొక్కలవలె వారిని లాగి పారవేస్తాను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.
నడికట్టు సంకేతం
13 యెహోవా నాతో ఇలా అన్నాడు, “యిర్మీయా, నీవు వెళ్లి నారతో చేసిన ఒక నడికట్టు బట్టకొని[i] తీసుకురా. దానిని నీవు ధరించుము. కాని దానిని తడవనీయవద్దు.”
2 కావున యెహోవా చెప్పిన విధంగా నేనొక నడికట్టు వస్త్రం కొని ధరించాను. 3 అప్పుడు రెండవసారి యెహోవా వాక్కు నాకు వినబడింది. 4 ఆ వాక్కు ఇలా వుంది: “యిర్మీయా, నీవు కొని ధరించిన నడికట్టు వస్త్రం తీసుకొని ఫరాతుకు[j] వెళ్లుము. అక్కడ ఒకబండ బీటలో ఆ నడికట్టు వస్త్రాన్ని దాచి పెట్టు.”
5 అందుచేత నేను ఫరాతు (యూఫ్రటీసు) కు వెళ్లి ఒక బండ బీటలో నడికట్టు వస్త్రాన్ని (చల్లడము) అక్కడ యెహోవా చెప్పిన రీతిలో దాచాను. 6 చాలా రోజుల తరువాత యెహోవా నాతో, “యిర్మీయా, ఇప్పుడు ఫరాతుకు వెళ్లుము. బండ బీటలో నిన్ను దాయమని చెప్పిన నడికట్టు వస్త్రాన్ని తీసుకొని రమ్ము” అని చెప్పాడు.
7 అప్పుడు నేను ఫరాతుకు వెళ్లి నడికట్టు వస్త్రాన్ని తవ్వి తీశాను. నేను దాచిన బండ బొరియలోనుండి దానిని వెలికి తీశాను. కాని నేను దానిని ధరించ లేక పోయాను. కారణమేమంటే అది జీర్ణించిపోయింది. అది ఎందుకూ పనికిరానిదయ్యింది.
8 అప్పుడు యెహోవా వర్తమానం నాకు చేరింది. 9 యెహోవా ఇలా చెప్పినాడు: “నడికట్టు బట్ట జీర్ణించి, ఎందుకూ పనికిరానిదయి పోయింది. అదే విధంగా, యూదాలోను, యెరూషలేములోనుగల గర్విష్టులనందరినీ నాశనం చేస్తాను. 10 యూదాలోని గర్విష్టులను, దుష్టులను నాశనం చేస్తాను. వారు నా వాక్కు వినటానికి నిరాకరిస్తున్నారు. మొండి వైఖరి దాల్చి, వారు చేయదలచుకున్న పనులే వారు చేస్తారు. వారు అన్యదేవుళ్లను అనుసరించి, ఆరాధిస్తారు. అటువంటి యూదా వారంతా ఈ నార నడికట్టు బట్టలా అయిపోతారు. వారు సర్వనాశనమవుతారు. వారెందుకూ పనికిరారు. 11 నడికట్టు వస్త్రాన్ని మనుష్యులు తమ నడుము చుట్టూ గట్టిగా కట్టుకుంటారు. అదే మాదిరి ఇశ్రాయేలు సంతతి వారిని, యూదా వంశంవారిని నాచుట్టూ కప్పుకొన్నాను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది “నేనలా ఎందుకు చేసినానంటే వారంతా నా ప్రజలు కావాలని. నా ప్రజలు నాకు ఖ్యాతిని, మహిమను, గౌరవాన్ని తెస్తారనుకున్నాను. కాని నా ప్రజలు నా మాటనే వినలేదు.”
యూదాకు హెచ్చరికలు
12 “యిర్మీయా, యూదా ప్రజలకు ఇశ్రాయేలీయుల దేవుడు ఇలా చెపుతున్నాడని తెలియజేయుము: ‘ప్రతి ద్రాక్షరసపు తిత్తియు[k] ద్రాక్షారసముతో నింపాలి.’ అది విన్న ఆ జనులు నవ్వి, ‘అవును. ప్రతి ద్రాక్షారసపు తిత్తీ ద్రాక్షారసంతోనే నింపాలని మాకు తెలుసు’ అని నీతో అంటారు. 13 అప్పుడు నీవిలా చెప్పాలి, ‘యెహోవా ఇలా అంటున్నాడు: ఈ రాజ్యంలో నివసించే ప్రతివానిని త్రాగిన వానిలా నిస్సహాయుని చేస్తాను. దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజులను గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంకా నేను యాజకుల గురించి, ప్రవక్తల గురించి యెరూషలేము వారందరిని గురించి నేను మాట్లాడుతున్నాను. 14 యూదా ప్రజలందరినీ తూలిపోయి ఒకరిమీద ఒకరు పడేలా చేస్తాను. తండ్రులు, కొడుకులు ఒకరిమీద ఒకరు పడిపోతారు.’ ఈ వర్తమానం యెహోవా వద్దనుండి వచ్చినది ‘నేను వారిని గురించి విచారించటంగాని, జాలిపడటంగాని జరుగదు. యూదా ప్రజలను నాశనం చేయుటలో అనుతాపాన్ని (కనికరం) నన్ను అడ్డగించనివ్వను.’”
15 శ్రద్ధగా ఆలకించండి.
యెహోవా మీతో మాట్లాడియున్నాడు.
మీరు గర్విష్టులు కావద్దు.
16 మీ యెహోవా దేవుని గౌరవించండి.
ఆయనను స్తుతించండి. లేనిచో ఆయన మీకు అంధకారాన్ని సృష్టిస్తాడు.
మీరు చీకటి కొండల్లో పడిపోక ముందుగానే మీరాయనకు స్తోత్రం చేయండి.
యూదా ప్రజలారా మీరు వెలుగుకై ఎదురు చూస్తూన్నారు.
కాని యెహోవా ఆ వెలుగును కటిక చీకటిగా మార్చుతాడు.
యెహోవా వెలుగును మహా అంధకారంగా మార్చగలడు.
17 యూదా ప్రజలారా, మీరు యెహోవా వాక్కు వినకపోతే
నేను దాగుకొని విలపిస్తాను.
మీ గర్వం నన్ను విలపించేలా చేస్తోంది.
నేను బిగ్గరగా విలపిస్తాను.
నా కన్నీరు వరదలై పారుతుంది.
ఎందువల్లనంటే, యెహోవా మంద[l] బందీయైపోయింది.
18 ఈ విషయం రాజుకు, ఆయన భార్యకు తెలియ జెప్పండి:
“మీ సింహాసనాల నుండి మీరు దిగిరండి.
మీ అందాల కిరీటాలు మీ తలలనుండి క్రిందికి పడిపోయాయి.”
19 నెగెవు[m] ఎడారిలో మీ నగరాలు మూసివేయ బడ్డాయి.
వాటిని ఎవ్వరూ తెరువలేరు.
యూదా ప్రజలంతా చెరపట్టబడ్డారు.
వారంతా బందీలుగా కొనిపోబడ్డారు.
20 యెరూషలేమా, పైకి చూడు!
ఉత్తర దిశనుండి వచ్చే శత్రువును చూడు.
నీ మంద ఎక్కడ? ఆ అందమైన మందను దేవుడు నీకిచ్చాడు.
ఆ మంద రక్షణ బాధ్యత నీదై వుంది.
21 ఆ మంద ఏమైనదని దేవుడు నిన్నడిగితే నీవేమి చెపుతావు?
నీవు దేవుని గురించి ప్రజలకు బోధించవలసివుంది.
నీ నాయకులు ప్రజలను నడిపించవలసి ఉంది.
కాని వారి పని వారు చేయలేదు!
కావున నీవు మిక్కిలి బాధను, కష్టాలను అనుభవిస్తావు.
నీ బాధ స్త్రీ యొక్క ప్రనవవేదనలాంటిది.
22 “నాకెందుకీ చెడు దాపురించింది?”
అని నీకు నీవే ప్రశ్నించుకో.
నీవు చేసిన అనేక పాపాల ఫలమే నీకు వచ్చిన కష్టాలు.
నీ పాపాల కారణంగా నీ అంగీ చిరిగిపోయింది.
నీ పాదరక్షలు తీసుకొని పోబడ్డాయి.
నిన్ను చిక్కులు పెట్టటానికే వారలా చేశారు.
23 నల్లని వ్యక్తి తన శరీరపు రంగును మార్చలేడు.
చిరుతపులి తన మచ్చలను మార్చుకోలేదు.
అలాగే, ఓ యెరూషలేమా, నీవు మారి మంచి పనులు చేయలేవు.
నీవు ఎల్లప్పుడూ చెడు చేయటానికే అలవాటు పడ్డావు.
24 “మీరు మీ ఇండ్లు వదిలిపోయేలా వత్తిడి తెస్తాను.
మీరు పారిపోయేటప్పుడు చెల్లా చెదరై అన్ని వైపులకూ పారిపోతారు.
ఎడారి గాలికి కొట్టుకు పోయే పొట్టులాంటి వారు మీరు.
25 ఈ విషయాలన్నీ నీకు సంభవిస్తాయి.
నా ప్రణాళికల్లో నీ పాత్ర ఇదే.”
ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.
“ఇది ఎందుకు సంభవిస్తుందంటే
నీవు నన్ను మర్చిపోయావు.
నీవు బూటకపు దేవుళ్లను నమ్మావు.
26 యెరూషలేమా, నీ అంగీని అంచుబట్టి నీ ముఖంమీదికి లాగుతాను.
ప్రతివాడూ నిన్ను చూస్తాడు. నీవు అవమానం పాలవుతావు.
27 నీవు చేసిన భయంకరమైన పనులను నేను చూశాను.[n]
నీవు విజృంభించి ప్రియులతో వ్యభిచరించటం చూశాను.
వేశ్యలా ప్రవర్తించాలనే నీ పథకం నాకు తెలుసు.
నీవు కొండలమీద, మైదానాల మీద పాపాలు చేయుట నేను చూశాను.
యెరూషలేమా, ఇది నీకు చాలా చెడ్డదిగా ఉంటుంది.
అసహ్యమైన ఈ పాపాలు నీ వెన్నాళ్లు సాగిస్తావోనని నేను ఆశ్చర్యపోతున్నాను.”
© 1997 Bible League International