Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యిర్మీయా 4-6

ఇదే యెహోవా వాక్కు.
“ఇశ్రాయేలూ, నీవు రావాలనుకుంటే,
    తిరిగి నా వద్దకు రమ్ము
నీ విగ్రహాలను విసరివేయి!
    నానుండి దూరంగా పోవద్దు!
నీవు ఆ విధంగా చేస్తే,
    నీవు ప్రమాణం చేయటానికి ఈ మాటలు చెప్పగలవు
‘నిత్యుడైన యెహోవా తోడు’
    అని నీవనగలవు
నీవీ మాటలు సత్యమైన,
    న్యాయమైన, నీతిమార్గాన పలుకగలవు.
నీవీ పనులు చేస్తే, యెహోవా రాజ్యాలను దీవిస్తాడు.
    యెహోవా చేసిన పనులను వారు పొగడుతారు.”

యూదా ప్రజలకు, యెరూషలేము నగరవాసులకు యెహోవా ఇలా చెపుతున్నాడు:

“మీ భూములు దున్నబడలేదు.
    వాటిని దున్నండి!
    ముండ్లపొదలలో విత్తనాలు చల్లవద్దు.
యెహోవా యొక్క ప్రజలుగా మీరు తయారుకండి.
    మీ హృదయాలను మార్చుకోండి[a]
యూదా ప్రజలారా, యెరూషలేము వాసులారా, మీలో పరివర్తన రాకపోతే
    నాకు చాలా కోపం వస్తుంది.
నా కోపం అగ్నిలా ప్రజ్వరిల్లుతుంది.
    నా కోపం మిమ్మల్ని దహించి వేస్తుంది.
ఆ అగ్ని జ్వాలల్ని ఎవ్వరూ ఆర్పలేరు! అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది?
    మీరు చేసిన పాపకార్యాలవల్లనే ఇదంతా జరుగుతుంది.”

ఉత్తర దిశ నుండి విపత్తు

“ఈ వర్తమానాన్ని యూదా ప్రజలకు ప్రకటించుము:

“యెరూషలేములో ప్రతి పౌరునికి తెలియజేయుము,
    ‘దేశమంతా బూర వూది’
బాహాటంగా ఇలా చెప్పుము,
    ‘మీరంతా కలిసి రండి!
    రక్షణకై మనమంతా బలమైన నగరాలకు తప్పించుకుపోదాం!’
సీయోను వైపుకు సంకేత ధ్వజాన్ని ఎగురవేయుము.
    మీ ప్రాణరక్షణకై పారిపొండి! ఆలస్యం చేయవద్దు!
ఇది మీరు త్వరగా చేయండి. ఎందువల్లననగా ఉత్తర దిశనుండి[b] నేను విపత్తును తీసుకొని వస్తున్నాను.
    నేను అతి భయంకరమైన వినాశనాన్ని తీసుకొని వస్తున్నాను.”
తన గుహనుండి ఒక “సింహం” బయటికి వచ్చింది.
    రాజ్యాలను నాశనం చేసేవాడు కదలి వస్తున్నాడు.
నీ రాజ్యాన్ని సర్వ నాశనం చేయటానికి అతడు ఇల్లు వదిలి వస్తున్నాడు.
నీ పట్టణాలు ధ్వంసమవుతాయి.
    వాటిలో నివసించటానికి ఒక్కడూ మిగలడు.
కావున నారబట్టలు[c] ధరించండి. మిక్కిలిగా విలపించండి!
    ఎందువల్లనంటే యెహోవా మీపట్ల చాలా కోపంగా ఉన్నాడు.
ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.
    “ఇది జరిగే సమయంలో రాజు, ఇతర నాయకులు తమ ధైర్యాన్ని కోల్పోతారు.
యాజకులు బెదరిపోతారు!
    ప్రవక్తలు భయపడి, విస్మయం పొందుతారు!”

10 అప్పుడు యిర్మీయానైన నేను ఇలా చెప్పాను, “నా ప్రభువగు యెహోవా, నీవు నిజంగా యూదా, యెరూషలేము ప్రజలను మోసపుచ్చావు. ‘మీకు శాంతి కలుగుతుంది’ అని వారికి చెప్పియున్నావు. కాని ఇప్పుడు వారి గొంతుకలమీద కత్తి ఉంది!”

11 ఆ సమయంలో యూదా,
    యోరూషలేము ప్రజలకు ఒక వర్తమానం ఇవ్వబడుతుంది:
“వట్టి కొండలపై నుండి వేడిగాలి వీస్తుంది.
    అది ఎడారి నుండి నీ ప్రజల మీదికి వీస్తుంది.
అది రైతులు నూర్చిన ధాన్యం పోతపోయటానికి
    పనికి వచ్చే పైరుగాలిలాంటిది కాదు.
12 ఇది దీనికంటె బలమైన గాలి;
    పైగా అది నావద్ద నుండి వీస్తుంది.
ఇప్పుడు, యూదా ప్రజలపై నా న్యాయనిర్ణయం ప్రకటిస్తాను.”
13 చూడు, శత్రువు మేఘంలా లేచి వస్తాడు!
    అతని రధాలు సుడిగాలిలా కన్పిస్తాయి!
    అతని గుర్రాలు గ్రద్దలకంటె వేగం కలవి!
అది మనకు హానికరం!
    మనం సర్వ నాశనమయ్యాము!

14 యెరూషలేము ప్రజలారా, మీ హృదయాలనుంచి చెడును కడిగి వేయండి.
మీరు పరిశుద్ధ హృదయాలు కలిగి ఉండండి; తద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోండి.
    దుష్ట ఆలోచనలు చేయటం మానివేయండి.
15 వినండి! దానునుండి[d] వచ్చిన
    వార్తాహరుడు మాట్లాడుతున్నాడు.
కొండల ప్రాంతమైన ఎఫ్రాయిము[e] నుండి
    ఇతడు దుర్వార్త తెస్తున్నాడు.
16 “దానిని ఈ దేశమంతా ప్రకటించండి.
    ఆ వార్తను యెరూషలేము నగరవాసులకు తెలియజేయండి.
బహుదూరపు దేశంనుండి శత్రువు వస్తున్నాడు.
యూదా నగరాలపై శత్రువులు
    యుద్ధ ధ్వని చేస్తున్నారు.
17 చేను చుట్టూ పంటను కాపాడే మనుష్యులున్నట్లు
    యెరూషలేమును శత్రువులు చుట్టుముడతారు
యూదా, నీవు నాకు ఎదురు తిరిగావు!
    అందువల్లనే శత్రువు నిన్నెదిరించి వస్తున్నాడు!”
ఇది యెహోవా వాక్కు.

18 “నీవు నివసించిన తీరు, నీవు చేసిన దుష్కార్యాలే
    ఈ విపత్తును తీసికొని వచ్చాయి.
నీ దుష్టజీవితమే నీ గుండెల్ని చీల్చే బాధను తెచ్చింది.”

యిర్మీయా రోదన

19 అయ్యయ్యో, నా దుఃఖం, ఆవేదనతో నేను మూలుగుచున్నాను.
    నేను బాధతో క్రుంగి పోతున్నాను.
అయ్యో, నేను భయ భ్రాంతుడనయ్యాను.
    నాలో నా గుండె దద్దరిల్లుతూ ఉంది.
నేను ప్రశాంతంగా ఉండలేను. ఎందువల్లనంటే నేను బూర ధ్వని విన్నాను.
    అది యుద్ధ నాదం. సైన్యాన్ని అది పిలుస్తోంది!
20 ఒకదాని తరువాత ఒకటి ఆపదల పరంపర!
    దేశం యావత్తూ సర్వనాశనమయ్యింది.
అనుకోని విధంగా నా డేరాలన్నీ నాశనం చేయబడ్డాయి!
    నా పరదాలు (తెరలు) చించబడ్డాయి!
21 యెహోవా, నేనెంత కాలం యుద్ధ ధ్వజాలను చూడాలి?
    ఎంతకాలం యుద్ధ నాదం నేను వినాలి?

22 దేవుడు ఇలా అన్నాడు: “నా ప్రజలు మూర్ఖులు.
    వారు నన్నెరుగరు.
వారు మంద బుద్ధిగల పిల్లలవలె ఉన్నారు.
    వారికి అవగాహనే లేదు.
కాని వారు చెడు చేయటంలో నేర్పరులు.
    మంచిపని ఎలా చేయాలో వారికి తెలియనే తెలియదు.”

ముంచుకు వచ్చే ముప్పు

23 నేను భూమివైపు చూశాను.
    భూమి ఖాళీగా ఉంది;
    దానిపై ఏమీ లేదు.
నేను అకాశంవైపు చూశాను.
    వెలుగు పోయింది.[f]
24 నేను పర్వతాల వైపు చూశాను,
    అవి కదిలిపోతున్నాయి.
    కొండలన్నీ కంపించి పోతున్నాయి.
25 నేను చూడగా, అక్కడ మనుష్యులు లేరు.
    ఆకాశంలో పక్షులు లేకుండా పోయాయి.
26 నేను చూడగా సుక్షేత్రమైన రాజ్యం ఎడారిలా కన్పించింది.
    ఆ రాజ్యంలో నగరాలన్నీ సర్వనాశనమయ్యాయి. ప్రభువే ఇదంతా కలుగజేశాడు. అధికమైన యెహోవా కోపమే దీనిని కలుగచేసింది.

27 యెహోవా ఇలా అన్నాడు:
“దేశం యావత్తూ నాశనమవుతుంది.
    (కానీ దేశాన్ని పూర్తిగా నాశనం చేయను)
28 అందువల్ల దేశంలో మిగిలినవారు చనిపోయిన వారి కొరకు విలపిస్తారు.
    ఆకాశం చీకటవుతుంది.
నా మాటకు తిరుగులేదు.
    నేనొక నిర్ణయాని కొచ్చాను; మరల నేను మనస్సు మార్చుకోను.”

29 గుర్రపు రౌతుల రవాళింపులు, విలుకాండ్ర శబ్దాలను
    యూదా ప్రజలు విని పారిపోతారు!
కొందరు గుహలలో దాగుకొంటారు.
    కొంత మంది పొదలలో తలదాచుకుంటారు.
    మరి కొందరు కొండల మీదికి ఎక్కుతారు.
యూదా నగరాలన్నీ నిర్మానుష్యమవుతాయి.
    అక్కడ ఎవ్వరూ నివసించరు.

30 యూదా, నీవు నాశనం చేయబడ్డావు.
    నీవేమి చేస్తున్నావు?
నీ అందమైన ఎర్రని దుస్తులు ఎందుకు ధరించావు?
నిన్ను బంగారు ఆభరణాలతో ఎందుకు అలంకరించుకొన్నావు?
నీ కంటికి అలంకరణ ఎందుకు చేసుకున్నావు?
    నీ అలంకరణ వ్యర్థం.
నీ ప్రేమికులు నిన్నసహ్యించుకుంటారు.
    వారు నిన్ను చంపాలని చూస్తున్నారు.
31 ప్రసవ వేదనలో స్త్రీ అరచినట్లుగా నేనొక రోదన విన్నాను.
    అది ప్రథమ కన్పులో స్త్రీ పడిన వేదనవంటిది.
    అది సీయోను కుమార్తె[g] రోదన.
ఆమె చేతులెత్తి ప్రార్థిస్తూ,
    “అయ్యో, నేను మూర్ఛపోతున్నాను!
    హంతకులు నన్ను చుట్టుముట్టారు!” అని అంటున్నది.

యూదా వారి దుష్టత్వం

“యెరూషలేము నగర వీధులలో తిరుగుతూ చుట్టుప్రక్కల పరిశీలిస్తూ ఈ విషయాలపై ఆలోచించు. నగర కూడలి స్థలాలలో వెదకి ఏ ఒక్కడైనా మంచి వ్యక్తి కనిపిస్తాడేమో చూడు. నీతిగా వ్యవహరించే ఏ ఒక్కడు గాని, సత్యాన్వేషిగాని ఉన్నాడేమో చూడు. ఏ ఒక్క మంచి వ్యక్తిని చూడ గలిగినా, నేను యెరూషలేమును క్షమిస్తాను! ప్రజలు ప్రమాణాలు చేస్తూ ‘నిత్యుడైన యెహోవాతోడు’ అంటారు. కాని అది పేరుకు మాత్రం. వారు చెప్పింది చేయరు.”

యెహోవా, నీవు ప్రజలలో నమ్మకస్థులకై
    చూస్తున్నావని నాకు తెలుసు.
యూదా వారిని నీవు కొట్టావు.
    అయినా వారికి నొప్పి కలుగలేదు.
వారిని నాశనం చేశావు,
    అయినా వారొక గుణపాఠం నేర్చుకోటానికి తిరస్కరించారు.
వారు మొండి వైఖరి దాల్చారు.
    వారి దుష్కార్యాలకు వారు చింతించ నిరాకరించారు.

కాని నేను (యిర్మీయా) ఇలా అనుకున్నాను:
“కేవలం పేద మరియు సామాన్య వర్గాల వారే అలా మూర్ఖులై ఉండాలి.
    వారే యెహోవా మార్గాన్ని అనుసరించటం నేర్చుకోలేదు.
    పేదలు వారి దేవుని బోధనలు తెలుసుకోలేదు.
కావున యూదా ప్రజల నాయకుల వద్దకు నేను వెళతాను.
    నేను వారితో మాట్లాడతాను.
నాయకులు తప్పక యెహోవా మార్గాన్ని మరియు ఉపదేశాలను అర్థం చేసుకుంటారు.
    వారి దేవుని న్యాయమార్గం వారికి తెలుస్తుందనే నమ్మిక నాకు ఉంది!”
కాని నాయకులంతా యెహోవా సేవను
    నిరాకరించే నిమిత్తం ఏకమైనారు.[h]
వారు దేవునికి వ్యతిరేకులైనారు.
అందువల్ల అరణ్యంలోనుండి ఒక సింహం వారిని ఎదిరిస్తుంది.
    ఎడారిలో నుండి ఒక తోడేలు వచ్చి వారిని చంపుతుంది.
వారి నగరాల దాపున ఒక చిరుతపులి పొంచి ఉంది.
    నగరంలో నుంచి ఎవడు బయటికి వచ్చినా చిరుతపులి చీల్చి చెండాడుతుంది.
యూదా ప్రజలు మరల మరల చేసిన పాపాల ఫలితంగా ఇదంతా జరుగుతుంది.
    అనేక పర్యాయములు వారు యెహోవాకు దూరమైనారు.

దేవుడిలా అన్నాడు: “యూదా, నేను నిన్నెందుకు క్షమించాలో ఒక కారణం చూపించు.
    నీ పిల్లలు నన్ను త్యజించారు.
    దేవుళ్లే కానటువంటి వ్యర్థమైన విగ్రహాలకు వారు ప్రమాణాలు చేశారు.
నీ సంతానానికి కావలసిన ప్రతుది నేను యిచ్చి వున్నాను.
    అయినా వారింకా నా పట్ల విశ్వాసఘాతకులై ఉన్నారు!
    వారెక్కువ కాలం వ్యభిచార గృహాలలోనే గడిపారు
వారు తినటానికి సమృద్ధిగా ఉండి, సంభోగించటానికి సిద్ధంగా ఉన్న గుర్రాలవలె ఉన్నారు.
    పొరుగువాని భార్య కోసం మదించి సకిలిస్తున్న గుర్రంలా వున్నారు.
ఈ పనులన్నీ చేసినందుకు యూదా ప్రజలను నేను శిక్షించవద్దా?”
ఇదే యెహోవా వాక్కు.
“అవును! ఇటువంటి దేశాన్ని నేను శిక్షించాలిగదా.
    వారికి తగిన శిక్ష విధించాలి.

10 “యూదావారి ద్రాక్షతోటల వరుసలగుండా వెళ్లు.
    ద్రాక్షలతలన్నీ నరికివేయుము. (కాని వాటి మొద్దులను నరికి నాశనం చేయవద్దు).
    వాటి కొమ్మలన్నీ నరికివేయి. ఎందువల్లనంటే, ఈ తీగెలు యెహోవాకు చెందినవికావు.[i]
11 ఇశ్రాయేలు వంశీయులు, యూదా వంశీయులు
    ప్రతి విషయంలోనూ నాకు విశ్వాసఘాతుకులుగా ఉన్నారు.”
ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చింది.

12 “యెహోవా విషయంలో ఆ ప్రజలు అబద్ధమాడారు.
వారిలా అన్నారు: ‘యెహోవా మమ్మల్ని ఏమీ చేయడు.
    మాకు ఏ రకమైన కీడూ రాదు.
    మమ్మల్ని ఏ శత్రు సైన్యం ఎదిరించగా మేము చూడము.
    మేము ఆకలికి మాడిపోము.’
13 తప్పుడు ప్రవక్తలు కేవలం వట్టి మాటలు పలుకుతారు,
    దేవుని వాక్కు వారియందు లేదు.
    వారికి కీడు మూడుతుంది.”

14 సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు తెలియజేసాడు:
“నేను వారిని శిక్షించనని ఆ ప్రజలు అన్నారు.
కావున యిర్మీయా, నేను నీకు చెప్పిన మాటలు అగ్నిలా ఉంటాయి.
    ఆ ప్రజలు కొయ్యలాంటివారు.
అగ్ని ఆ కట్టెనంతా దహించివేస్తుంది.”
15 ఓ ఇశ్రాయేలు వంశీయులారా, యెహోవా ఇలా చెప్పినాడు:
“మీ మీదికి బహు దూరంలో ఉన్న ఒక దేశాన్ని తీసుకొని వస్తున్నాను.
అది ఒక ప్రాచీన రాజ్యం
    అది ఒక శక్తివంతమైన రాజ్యం.
మీకు అర్థంకాని భాషను వారు మాట్లాడతారు.
    వారు చెప్పేది మీకు అర్థం కాదు.
16 వారి అమ్ముల పొదులు తెరచిన సమాధుల్లా వున్నాయి.
    వారంతా యోధాన యోధులు.
17 మీరు పండించిన పంటనంతా ఆ సైనికులు తినివేస్తారు.
    మీ ఆహారాన్నంతా వారు తినివేస్తారు.
    మీ కుమారులను, కుమార్తెలను వారు నాశనం చేస్తారు.
వారు మీ గొర్రెల మందలను, పశువుల మందలను తింటారు.
    మీ ద్రాక్షాపంటను, అంజూరపు చెట్లను వారు తింటారు.
కత్తులతో వారు మీ బలమైన నగరాలను నాశనం చేస్తారు.
    మీరు నమ్మి తల దాచుకున్న బలమైన నగరాలను వారు నాశనం చేస్తారు!”

18 యెహోవా ఇలా చెబుతున్నాడు:
“కాని ఆ భయంకరమైన రోజులు వచ్చినప్పుడు,
    ఓ యూదా, నేను నిన్ను పూర్తిగా నాశనం కానివ్వను.
19 యూదా ప్రజలు నిన్ను,
    ‘యిర్మీయా, మా దేవుడైన యెహోవా మాకెందుకీ ఆపద తెచ్చిపెట్టాడు?’ అని అడుగుతారు.
అప్పుడు నీవు,
‘ఓ యూదా ప్రజలారా, మీరు యెహోవాను విస్మరించారు.
    మీ స్వంత దేశంలోనే పరదేశాల వారి విగ్రహాలను పూజించారు.
మీరలా ప్రవర్తించారు గనుక
    ఇప్పుడు మీరు పరాయి రాజులను మీకు చెందని రాజ్యంలో సేవించవలసి ఉంది!’ అని సమాధానం చెప్పు.”

20 యెహోవా ఇలా అన్నాడు: “యాకోబు వంశస్తులకు ఈ వర్తమానం అందజేయుము.
    యూదా రాజ్యానికి ఈ సమాచారం తెలియజేయుము.
21 బుద్ధిహీనులైన మూర్ఖుపు జనులారా ఈ వర్తమానం వినండి:
    మీకు కళ్లు ఉండికూడా చూడరు!
    మీకు చెవులు ఉండి కూడా వినరు!
22 నేనంటే మీరు నిజంగా భయపడటం లేదు.”
ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది
“మీరు నాముందు భయంతో కంపించాలి.
    సముద్రానికి తీరాన్ని ఏర్పరచిన వాడను నేనే.
    తద్వారా సముద్రజలాలు తమ పరిధిలో శాశ్వతంగా ఉండేలా చేశాను.
    అలల తాకిడికి సముద్రతీరం దెబ్బతినదు.
    అలలు ఘోషిస్తూ తీరాన్ని చేరుతాయి, కాని అవి దానిని దాటిపోవు.
23 కాని యూదా ప్రజలు మొండి వైఖరి వహించారు.
    వారు నాకు వ్యతిరేకంగా తిరగటానికి అనేక మార్గాలు అన్వేషిస్తున్నారు.
    నాకు విముఖులై, నానుండి వారు దూరంగా పోయారు.
24 మనం మన దేవుడైన యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండాలని,
    ‘ఆయన మనకు శీతాకాల, వసంతకాల వర్షాలు సకాలంలో ఇస్తున్నాడనీ,
    ఆయన సకాలంలో, సక్రమంగా మనం పంటనూర్పిడి చేసుకొనేలా చేస్తున్నాడనీ’
    యూదా ప్రజలు ఎన్నడూ అనుకోలేదు.
25 యూదా ప్రజలారా, మీరు చెడు చేశారు. అందువల్ల వర్షాలు లేవు; నూర్పిళ్లు లేవు.
    నీవు యెహోవా ఇచ్చే అనేక మంచి విషయాలను మీరు అనుభవించకుండా మీ పాపాలు అడ్డు పడుతున్నాయి.
26 నా ప్రజల మధ్య దుష్ట వ్యక్తులున్నారు.
    ఆ దుష్టులు పక్షులను పట్టటానికి వలలు పన్నే కిరాతకుల్లా[j] ఉన్నారు.
వారు తమ బోనులు సిద్ధంచేసి పొంచి వుంటారు.
    కాని వాళ్లు పక్షులకు బదులు మనుష్యులను పట్టుకుంటారు.
27 పంజరం నిండా పక్షులున్నట్లుగా,
    ఈ దుష్టుల ఇండ్ల నిండా అబద్దాలే!
వారి అబద్ధాలు వారిని ధనికులుగా, శక్తివంతులుగా చేశాయి.
28     వారు చేసిన దుష్కార్యాల ద్వారా వారు బాగా ఎదిగి, కొవ్వెక్కినారు.
వారు చేసే అకృత్యాలకు అంతం లేదు.
    వారు అనాధ శిశువుల తరఫున వాదించరు.
    వారు అనాధలను అదుకోరు.
    వారు పేదవారికి న్యాయం జరిగేలా చూడరు.
29 వారు ఈ కృత్యాలన్నీ చేస్తున్నందుకు యూదా ప్రజలను నేను శిక్షించవద్దా?”
ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది.
“ఈ రకమైన దేశాన్ని నేను శిక్షించాలని నీకు తెలుసు.
    వారికి తగిన శిక్ష నేను విధించాలి.”

30 యెహోవా ఇలా అన్నాడు,
    “యూదా రాజ్యంలో ఆశ్చర్యం కలిగించే ఒక భయానక సంఘటన జరిగింది. అదేమంటే,
31 ప్రవక్తలు అబద్ధం చెప్పటం;
యాజకులు దేన్ని చేయుటకై ఎంచుకోబడ్డారో దానిని చేయరు[k]
    నా ప్రజలు దానినే ఆదరించారు.
కానీ, ఓ ప్రజలారా చివరలో మీరు శిక్షకు
    గురియైన నాడు మీరేమి చేస్తారు?”

శత్రువులు యెరూషలేమును ముట్టడించుట

బెన్యామీనీయులారా, మీరు సురక్షిత ప్రాంతానికి పారిపోండి!
    యెరూషలేము నగరం నుండి పారిపోండి!
తెకోవ నగరంలో యుద్ధ సంకేతంగా బూరవూదండి.
    బేత్‌హక్కెరెము నగరంలో హెచ్చరిక ధ్వజాన్ని ఎగురవేయండి!
ఉత్తర దిశ[l] నుండి ఆపద తొంగిచూస్తూ వున్నది కనుక మీరీ పనులు చేయండి.
మహా భయంకరమైన విపత్తు మీకు రాబోతూ ఉంది!
సీయోను కుమారీ, నీవెంతో అందమైన దానివి, సుకుమారివి.[m]
కాపరులు తమ గొర్రెల మందలను తోలుకొని
    యెరూషలేముకు వస్తారు.
వారు నగరం చుట్టూ తమ గుడారాలు నిర్మించుకుంటారు.
    ప్రతి గొర్రెల కాపరీ తన మంద విషయమై తగిన జాగ్రత్త తీసుకుంటాడు.

వారిలా అంటారు: “యెరూషలేము నగరాన్ని ముట్టడించటానికి తగిన సన్నాహాలు చేయండి.
    లేవండి! మధ్యాహ్నం నగరంపై దండెత్తుదాం!
ఇప్పటికే ఆలస్యమైంది.
    సాయంకాలపు నీడలు సాగుతున్నాయి.
కావున లేవండి! మనం నగరాన్ని రాత్రిపూట ముట్టడిద్దాం.
    యెరూషలేము యొక్క రక్షణ దుర్గాలను కూల్చివేద్దాం!”

సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు:
    “యెరూషలేము చుట్టూ ఉన్న వృక్షాలను పడగొట్టండి.
    ఆ కర్రలతో, మట్టితో నగర గోడకు దిబ్బలు నిర్మించి గోడ ఎక్కటానికి వీలు కల్పించండి.
ఈ నగరం శిక్షించబడాలి.
    ఈ నగరంలో అక్రమం తప్ప మరేమీ లేదు.
బావి తన నీటిని తాజాగా ఉంచుతుంది.
    అలాగే, యోరూషలేము తన దుర్మార్గాన్ని నిత్య నూతనంగా ఉంచుతుంది.
ఈ నగరంలో దౌర్జన్యం, విధ్వంసం గూర్చి ఎప్పుడూ వింటున్నాను.
    యెరూషలేములో అస్వస్థత, గాయాలు నిత్యం నేను చూస్తూనే ఉన్నాను.
యెరూషలేమూ, ఈ హెచ్చరికను ఆలకించు.
    మీరు వినకపోతే, మీనుండి నేను వెనుదిరిగి పోతాను.
మీ దేశాన్ని ఒక పనికిరాని ఎడారిగా మార్చివేస్తాను.
    అక్కడ ఎవ్వరూ నివసించలేరు!”

సర్వశక్తిమంతుడగు యెహోవా ఇలా చెప్పినాడు:
“ఈ రాజ్యంలో మిగిలిన
    వారినందరినీ ప్రోగు చేయుము[n]
నీవు ద్రాక్షతోటలో చివరికు ఏరుకొనే
    ద్రాక్షా కాయల్లా కూడదీయుము.
ద్రాక్షకాయలను ఏరు వాని రీతిగా
    నీవు ప్రతి తీగను వెదకుము.”
10 నేనెవరితో మాట్లాడగలను?
    ఎవరిని హెచ్చరించగలను?
    నా మాట ఎవరు వింటారు?
ఇశ్రాయేలు ప్రజలు నా హెచ్చరికలు వినపడకుండా
    తమ చెవులు మూసుకున్నారు.
యెహోవా ఉపదేశములు వారికిష్టము లేదు.
    కావున నా హెచ్చరికలు వారు వినలేరు.
యెహోవా యొక్క బోధనలను ప్రజలు సహించరు.
    యెహోవా మాటలను వినుటకు వారు ఇష్టపడరు.
11 కాని యెహోవా కోపం నాలో (యిర్మీయా) నిండి ఉంది!
    దానిని నేను లోపల ఇముడ్చుకోలేక పోతున్నాను!
అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “నా కోపాన్ని వీధులలో ఆడుకొనే పిల్లల మీదను,
    గుమిగూడియున్న యువకుల మీదను కుమ్మరించు.
భార్యాభర్తలిరువురూ బందీలుగా పట్టుబడుదురు. వృద్ధులు, శతవృద్ధులు బందీలవుతారు.
12 వారి ఇండ్లు ఇతరులకు ఇవ్వబడతాయి.
    వారి పొలాలు, వారి భార్యలు ఇతరులకివ్వబడతారు.
నా చెయ్యెత్తి యూదా రాజ్య ప్రజలను శిక్షిస్తాను.”
ఈ వాక్కు యెహోవా నుండివచ్చినది.

13 “ఇశ్రాయేలు ప్రజలంతా ఇంకా, ఇంకా ధనం కావాలని కోరుతారు.
    క్రింది వర్గాలనుండి పై తరగతి వ్యక్తుల వరకు అందరూ ధనాపేక్ష కలిగి ఉంటారు!
    ప్రవక్తలు, యాజకులు అంతా కపట జీవనం సాగిస్తారు.
14 ప్రవక్తలు, యాజకులు నా ప్రజల గాయాలను మాన్పజూస్తారు.
    అవేవో స్వల్ఫ గాయాలుగా. భావిస్తారు.
‘ఏమీ పరవాలేదు, ఏమీ పరవాలేదు’ అని అంటారు.
    కాని, నిజానికి ప్రమాదం చాలా ఉంది.
15 ప్రవక్తలు, యాజకులు వారు చేయు చెడుకార్యాలకు సిగ్గుపడాలి!
    కాని వారికి సిగ్గనేది లేదు.
వారి పాపానికి తగిన కలవరపాటు వారెరుగరు.
    అందువల్ల ఇతరులందరితో పాటు వారుకూడా శిక్షించబడతారు.
    నేను వారిని శిక్షించేటప్పుడు వారు నేల కరచేలా క్ర్రిందికి తోయబడతారు.”
ఇది యెహోవా వాక్కు.

16 యెహోవా ఈ విషయాలు చెప్పినాడు:
“నాలుగు మార్గాల కూడలి స్థలంలో నిలబడిచూడుము.
    పాతబాట ఏదో అడిగి తోలిసికో.
    ఏది మంచి మార్గమో అడిగి తెలుసుకో. అప్పుడు ఆ మార్గంపై పయనించుము.
అప్పుడు మీరు మీకొరకు విశ్రాంతిని కనుగొంటారు.
కాని మీరేమన్నారో తెలుసా? ‘మేము మంచి మార్గంపై పయనించ’ మన్నారు.
17 నేను మీపై కాపలా కాయుటకు, కాపలాదారులను ఎన్నుకొన్నాను.
    నేను వారితో చెప్పాను. ‘యుద్ధ బూర ధ్వని వినండి’ అని.
    కాని వారన్నారు: ‘మేము వినము.’
18 కావున, సర్వదేశవాసులారా వినండి!
    ఆయా దేశాల ప్రజలారా, ధ్యానముంచండి[o] నేను యూదా ప్రజలకు చేయబోయే విషయాలను వినండి!
19 భూలోకవాసులారా, ఇది వినండి:
    యూదా ప్రజలకు నేను ఘోర విపత్తు తెస్తున్నాను.
    ఎందుకంటే? ఆ ప్రజలు పన్నిన చెడు పనులన్నిటి కారణంగానే.
వారు నా వర్తమానాలను లెక్కచేయనందుకు ఫలితంగా ఇది జరుగుతుంది.
    నా న్యాయ మార్గాన్ని అనుసరించటానికి వారు నిరాకరించారు.”

20 యెహోవా ఇలా అన్నాడు:
“మీరు షేబ[p] దేశంనుండి నాకొరకు ధూపానికై సాంబ్రాణి ఎందుకు తెస్తున్నారు?
    దూరదేశాలనుండి సువాసనగల చెరుకును నాకు నైవేద్యంగా ఎందుకు తెస్తున్నారు?
మీ దహనబలులు నన్ను సంతోషపర్చవు!
    మీ బలులు నన్ను సంతృప్తి పర్చజాలవు”

21 అందువల్ల యెహోవా ఇలా చెప్పినాడు:
“యూదా ప్రజలకు నేను సమస్యలు సృష్టిస్తాను.
    ప్రజల ఎదుట అడ్డుబండలు నేను వేస్తాను. రాళ్లవలె అవి వుంటాయి.
తండ్రులు, కొడుకులు వాటిపై తూలిపోతారు.
    స్నేహితులు, పొరుగువారు చనిపోతారు.”

22 యెహోవా ఇలా అన్నాడు:
“ఉత్తర ప్రాంతం నుండి ఒక సైన్యం వచ్చి పడుతూవుంది.
    భూమి పైగల ఒక పెద్ద దేశం దూరంనుండి వస్తూవున్నది.
23 సైనికులు విల్లంబులు, ఈటెలు పట్టుకొనివస్తారు.
    వారు బహు క్రూరులు. వారికి దయా, దాక్షిణ్యం ఉండవు.
వారు మిక్కిలి శక్తిమంతులు!
    వారు గుర్రాలనెక్కి స్వారీ చేస్తూ వచ్చేటప్పుడు ఘోషించే మహా సముద్రంలా శబ్దం వస్తుంది.
ఆ సైన్యం సర్వ సన్నద్ధమై యుద్ధానికి వస్తుంది.
    ఓ సీయోను కుమారీ, ఆ సైన్యం నిన్నెదిరించటానికి వస్తూ ఉంది.”
24 ఆ సైన్యాన్ని గూర్చిన వర్తమానం మనం విన్నాము.
    భయకంపితులమై నిస్సహాయులంగా ఉన్నాము.
కష్టాల ఉచ్చులో పడినట్లు ఉన్నాము.
    స్త్రీ ప్రసవవేదన అనుభవించినట్లు మేము బాధలో ఉన్నాము.
25 మీరు పొలాల్లోకి వెళ్లవద్దు!
    మీరు బాట వెంబడి వెళ్లవద్దు.
ఎందువల్లనంటే శత్రువువద్ద కత్తులున్నాయి.
    పైగా ఎటు చూచినా ప్రమాదమేవుంది.
26 ఓ నా ప్రజలారా, మీరు గోనెపట్టలు ధరించండి.
    బూడిదలో పొర్లండి[q]
చనిపోయినవారి కొరకు బాగా దుఃఖించండి!
    మీకున్న ఒక్కగానొక్క కుమారుడు మరణించినట్లు విచారించండి.
ఇవన్నీ మీరు చేయండి;
    కారణమేమంటే శత్రువు శరవేగంతో మనపైకి వస్తాడు!

27 “యిర్మీయా, నేను (యెహోవా)
    నిన్నొక లోహపరీక్షకునిగా నియమించినాను.
నీవు నా ప్రజల నడవడిని పరీక్షించు,
    వారిని గమనిస్తూ ఉండుము.
28 నా ప్రజలే నాకు వ్యతిరేకులయ్యారు;
    వారు చాలా మొండివారు.
    వారు ఇతరుల గురించి చెడు విషయాలు చెప్తారు.
వారు తుప్పుతో కప్పబడియున్న కంచు,
    ఇనుము లాంటివారు. వారంతా దుష్టులు.
29 నీవొక వెండిని శుద్ధిచేసే పనివానిలా ఉన్నావు.
కొలిమి తిత్తిలో బాగా గాలి వూదబడింది. అగ్ని ప్రజ్వరిల్లింది.
    కాని మంటలోనుండి కేవలం సీసం మాత్రమే వచ్చింది![r]
శుద్ద వెండిని చేయాలనుకోవటం వృధా ప్రయాస.
    వృధా కాలయాపన.
అదే విధంగా నా ప్రజలలో దుర్నడత పోలేదు.
30 ‘తిరస్కరించబడిన వెండి’ వంటివారని నా ప్రజలు పిలవబడతారు.
యెహోవా వారిని ఆమోదించలేదు
    గనుక వారికాపేరు పెట్టబడింది.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International