Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 రాజులు 20-21

హిజ్కియా మరణకరమైన వ్యాధితో బాధపడుట

20 ఆ సమయమున, హిజ్కియా వ్యాధిగ్రస్తుడయ్యాడు. దాదాపు మరణం పొందునంతగా వ్యాధిగ్రస్తుడైనాడు. ఆమోజు కుమారుడు “యెషయా ప్రవక్త హిజ్కియా వద్దకు వెళ్లి, ‘నీ ఇంటిని సరిదిద్దుకో. ఎందుకంటే నీవు మరణిస్తావు. నీవు బ్రతకవు’ అని యెహోవా చెప్పుచున్నాడని చెప్పెను.”

హిజ్కియా తన ముఖము గోడ వైపుకు త్రిప్పుకుని యెహోవాను ప్రార్థించాడు. “యెహోవా, నిన్ను నేను హృదయస్ఫూర్తిగా సేవించానని జ్ఞాపకము చేసుకో. నీవు మంచివని చెప్పిన పనులు నేను చేశాను” అని ప్రార్థించాడు. ఆ తర్వాత హిజ్కియా బిగ్గరగా విలపించాడు.

యెషయా తన మధ్యగది విడిచి వెళ్లడానికి ముందు యెహోవా మాట అతనికి వినవచ్చింది. నా మనుష్యులకు నాయకుడైన హిజ్కియా వద్దకు వెళ్లి అతనితో చెప్పు. మీ పూర్వికులైన దావీదు యొక్క యెహోవా దేవుడనైన నేను, “నీ ప్రార్థన ఆలకించాను. నీ కన్నీళ్లు చూశాను. అందువల్ల నీ రోగమును నయము చేస్తాను. మూడవ రోజున, నీవు యెహోవా యొక్క ఆలయము వద్దకు వెళ్లుము. నేను నీ జీవితానికి పదునైదుయేండ్లు కలుపుతాను. నేను నిన్ను కాపాడతాను. అష్షూరు రాజు శక్తి నుండి నేను నీ నగరాన్ని కాపాడతాను. నేనిది నా కోసము చేస్తున్నాను. ఎందుకంటే నేను నా సేవకుడైన దావీదుకి వాగ్దానం చేశాను కనుక” అని పలికెను.

తర్వాత యెషయా, “అంజూరపు పట్టీ చేసి, దానిని పుండుపై వుంచుము” అన్నాడు.

అందువల్ల వారు అంజూరపు పట్టీ చేసి, దానిని హిజ్కియా పుండుపై వుంచారు. తర్వాత హిజ్కియా స్వస్థపడెను.

హిజ్కియా యెషయాతో, “యెహోవా నాకు నయం చేసే సంకేతము ఏమిటి? మూడో రోజున యెహోవా ఆలయానికి నేను వెళ్లడానికి సంకేత మేమిటి?” అని అడిగాడు.

“నీ కేది కావాలి? నీడ పది అడుగులు ముందుకి పోవలెనా లేక పది అడుగులు వెనుకకు పోవలెనా? ఇదే నీకు యెహోవా నుంచి వచ్చే సంకేతము. యెహోవా తాను చేస్తానని చెప్పినది చేసేందుకు సంకేతము” అని యెషయా చెప్పాడు.

10 హిజ్కియా, “నీడ పది అడుగులు క్రిందికి వెళ్లడం, నీడకు చాలా సులభమైనది లేదు. నీడని పది అడుగులు వెనుకకు మరల్చుము” అని బదులు చెప్పాడు.

11 తర్వాత యెహోవాని యెషయా ప్రార్థించాడు. మరియు యెహోవా నీడను పదిమెట్లు వెనుకకు మరలునట్లు చేసెను. అది పూర్వము వున్నట్లుగా, మెట్ల మీద వెనుకకు పోయింది.

బబులోను నుంచి వచ్చిన వార్తాహరులు

12 ఆ సమయమున, బలదాను కొడుకైన మెరోదక్బలదాను బబులోనుకు రాజుగా వున్నాడు. అతను హిజ్కియాకి ఒక కానుక, ఉత్తరాలు పంపాడు. మెరోదక్బలదాను ఇలా చేయడానికి కారణం, హిజ్కియా వ్యాధిగ్రస్తుడైవున్నాడని విన్నందువల్లనే. 13 హిజ్కియా బబులోను నుంచి వచ్చిన మనుష్యుల్ని ఆహ్వానించాడు. వారికి తన ఇంటగల అన్ని విలువగల వస్తువులు చూపించాడు. అతడు తన నిధులలో వున్న వెండి బంగారాలు, మసాలా వస్తువులు, ఖరీదైన పరిమళ తైలము, ఆయుధాలు, మొదలైన వాటిని చూపించాడు. తన మొత్తము రాజభవనములో హిజ్కియాకు కలిగిన దానంతటిలో వారికి చూపనిది ఏదీ లేదు.

14 తర్వాత ప్రవక్త అయిన యెషయా హిజ్కియా రాజు వద్దకు వచ్చి అతనిని, “ఈ మనుష్యులేమని చెప్పారు? ఎక్కడినుంచి వచ్చారు?” అని అడిగాడు.

“వారు చాలా దూరదేశమైన బబులోను నుంచి వచ్చారు” అని హిజ్కియా చెప్పాడు.

15 “వారు నీ ఇంటిలో ఏమి చూశారు?” అని యెషయా అడిగినాడు.

“వారు మా ఇంట అన్నీ చూశారు. నా నిధులలో వారు చూడనిది ఏదీలేదు.” అని హిజ్కియా సమాధానమిచ్చాడు.

16 అప్పుడు యెషయా హిజ్కియాతో ఇట్లన్నాడు: “యెహోవా నుంచి వచ్చిన ఈ సందేశము విను. 17 మీ ఇంటగల వస్తువులన్నీ, నేటిదాకా మీపూర్వికులు సమకూర్చిన వస్తువులు బబులోనుకు తీసుకొని పోబడతాయి. ఏమియు మిగలదని యెహోవా చెబుతున్నాడు. 18 బబులోను వారు నీ కుమారులను తీసుకుపోతారు. మరియు నీ కుమారులు బబులోను రాజు అంతఃపురములో నపుంసకులు అవుతారు.”

19 అప్పుడు యెషయాతో, “యెహోవా నుంచి వచ్చిన ఈ సందేశము మంచిది” అని హిజ్కియా చెప్పాడు. హిజ్కియా ఇది కూడా చెప్పాడు: “నా జీవితకాలములో నిజమైన శాంతి నెలకొన్నచో, అది చాలా మంచిది.”

20 హిజ్కియా చేసిన అన్ని సత్కార్యములు, నగరంలోకి నీళ్లు రావడానికి గాను అతను జలాశయము, సొరంగ కాలువను నిర్మించినది, కాలువలు వేయించినది కూడా “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడివున్నాయి. హిజ్కియా మరణించగా, 21 అతని పూర్వికులతో పాటుగా, అతనిని సమాధి చేశారు. మరియు హిజ్కియా కుమారుడు మనష్షే అతని తర్వాత క్రొత్తగా రాజ్యయ్యాడు.

యూదాలో మనష్షే దుష్ట పరిపాలన ప్రారంభించుట

21 మనష్షే పరిపాలన చేయడం మొదలుపెట్టిన నాటికి అతను పన్నెండేళ్లవాడు. అతను 55 సంవత్సరాలు యెరూషలేంలో పరిపాలించాడు. అతని తల్లి పేరు హెఫ్సిబా.

యెహోవా తప్పని చెప్పిన పనులు మనష్షే చేశాడు. ఇతర జాతుల వారు చేసినట్లుగా మనష్షే భయంకరమైన పనులు చేశాడు. (ఇశ్రాయేలు వారు రాగా, ఆయా జాతులవారు దేశాన్ని విడిచి వెళ్లునట్లుగా యెహోవా చేశాడు). తన తండ్రి హిజ్కియా ధ్వంసం చేయించిన ఉన్నత స్థలాలను మనష్షే మరల నిర్మించాడు. బయలు దేవతకు మరల మనష్షే బలిపీఠాలు నిర్మించాడు. ఇశ్రాయేలు రాజు అహాబువలె, అషెరా స్తంభము ఏర్పాటు చేశాడు. మనష్షే ఆకాశంలోని నక్షత్రాలను కొలిచాడు. యెహోవా ఆలయంలో మనష్షే అబద్ధపు దేవుళ్లను గౌరవించేందుకు బలిపీఠాలు నిర్మించాడు. “యెరూషలేములో నాపేరు స్థాపిస్తాను.” అని యెహోవా చెప్పిన స్థలం ఇది. యెహోవా ఆలయము యొక్క రెండు ఆవరణాలలో ఆకాశంలోని నక్షత్రాలకు మనష్షే బలిపీఠాలు నిర్మించాడు. మనష్షే తన కుమారుని బలిపీఠము మీద దహన బలిగా ఇచ్చాడు. భవిష్యత్తుని తెలుసుకునేందుకు మనష్షే వేర్వేరు మార్గాలు అవలంబించాడు. అతను కర్ణ పిశాచి గలవారిని సోదె చెప్పేవారిని దర్శించాడు.

యెహోవా తప్పని చెప్పిన పనులు మరింత ఎక్కువగా మనష్షే చేశాడు. అందువల్ల యెహోవాకు కోపము వచ్చింది. మనష్షే అషేరాదేవి విగ్రహం ఒకటి మలిచాడు. దానిని అతను ఆలయంలో ఉంచాడు. ఈ ఆలయం గురించి దావీదుకు, అతని కుమారుడు సొలోమోనుకు యెహోవా ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలులోని నగరములన్నిటి నుండి నేను యెరూషలేమును ఎంపిక చేశాను. నేను నా పేరును యెరూషలేము ఆలయములో ఎన్నటికీ వుంచుతాను. తమ దేశం విడిచి వెళ్లేటట్లుగా నేను ఇశ్రాయేలు ప్రజలను చేయను. అది వారి పూర్వికులకు తెలియబడింది. నేను వారికి ఆజ్ఞాపించినట్లుగా వారు మెలిగినచో, నా సేవకుడైన మోషేవారికి ఇచ్చిన బోధనలను పాటించినచో నేను వారిని తమ దేశంలోనే వుండేటట్లు చేస్తాను.” కాని ప్రజలు యెహోవాకు విధేయులు కాలేదు. ఇశ్రాయేలు రావడానికి పూర్వం కనానులోని అన్ని జనాంగముల వారు చేసిన దుష్టకార్యాముల కంటె ఎక్కువగా మనష్షే చేశాడు. మరియు యెహోవా ఆ జనాంగములను నాశనము చేశాడు; ఇశ్రాయేలు ప్రజలు తమ దేశాన్ని ఆక్రమించుటకు వచ్చినప్పుడు ఇది జరిగింది.

10 తన సేవకులైన ప్రవక్తులను ఈ విషయాలు చెప్పమని యెహోవా నియమించాడు. 11 “యూదా రాజైన మనష్షే తనకు పూర్వమున్న ఆ ప్రాంతములో నివసించిన అమోరీయుల కంటె ఎక్కువగా నీచమైన దుష్కార్యాలు చేసాడు. తన విగ్రహాల కారణంగా, యూదాని కూడా పాపం చేయడానికి మనష్షే కారకుడయ్యాడు. 12 అందువల్ల ఇశ్రాయేలు దేవుడు చెప్పుచున్నాడు; ‘చూడండి. విన్న వ్యక్తి కూడా ఆశ్చర్యము చెందేటట్లుగా, నేను యెరూషలేము, యూదాలకు విరుద్ధంగా చాలా కష్టము కలిగిస్తాను. 13 నేను షోమ్రోనులలో కొలత సూత్రాన్ని సాగదీస్తాను. మరియు యెరూషలేము మీదా అహాబు వంశముయొక్క మట్టపు గుండును సాగదీస్తాను. ఒక వ్యక్తి పాత్రను కడుగవచ్చు; తర్వాత దానిని బోర్లించవచ్చు. నేను, ఆ విధంగా యెరూషలేముకు చేస్తాను. 14 అక్కడ ఇంకా నావారు కొద్ది మంది వుండవచ్చు. కాని నేను వారిని విడిచిపెడ్తాను. నేను వారిని వారి శత్రువుల పరము చేస్తాను. వారి శత్రువులు వారిని బందీలుగా చేస్తారు. వారు యుద్ధాలలో సైనికులు అపహరించుకు వెళ్లే అమూల్య వస్తువుల వంటివారు. 15 ఎందుకని? నేను తప్పని చెప్పిన పనులు వారు చేశారు కనుక. తమ పూర్వికులు ఈజిప్టు నుంచి వెలుపలికి వచ్చిననాటినుంచీ వారు నన్ను కోపానికి గురిచేసారు. 16 మరియు మనష్షే పలువురు అమాయకులను చంపివేశాడు. అతను యెరూషలేమును ఒక కొననుంచి మరొక కొనదాకా రక్తముతో నింపి వేశాడు. ఈ పాపాలన్నీ అదనంగా యూదావారు పాపము చేయడానికి దోహదపడ్డాయి. యెహోవా తప్పు అని చెప్పినవాటిని యూదా చేయునట్లుగా మనష్షే చేశాడు.’”

17 మనష్షే చేసిన అన్ని పనులు పాప కార్యములతో సహా “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడివున్నాయి. 18 మనష్షే మరణించగా, అతని పూర్వికులతో పాటుగా, అతను తన యింటి తోటలో సమాధి చేయబడ్డాడు. ఆ తోటకు, “ఉజ్జా ఉద్యానవనం” అని పేరు పెట్టబడింది. మనష్షే కుమారుడు ఆమోను, అతని తర్వాత క్రొత్తగా రాజయ్యాడు.

ఆమోను చిన్న పాలన

19 ఆమోను పరిపాలనకు వచ్చేనాటికి 22 యేండ్ల వయస్సుగలవాడు. అతను యెరూషలేములో రెండు సంవత్సరములు పాలించాడు. అతని తల్లి పేరు మెషుల్లెతు ఆమె యొట్బకి చెందిన హారూసు కుమార్తె.

20 యెహోవా తప్పు అని చెప్పిన పనులు ఆమోను చేశాడు. 21 తన తండ్రియైన మనష్షేవలె, ఆమోను కూడా జీవించాడు. తండ్రి పూజించిన ఆ విగ్రహాలనే ఆమోను పూజించి అనుసరించాడు. 22 తన పూర్వికుల దేవుని ఆమోను విడిచిపెట్టాడు. యెహోవా ఆశించిన మార్గాలను విడనాడి అతను జీవించాడు.

23 ఆమోను సేవకులు అతనికి వ్యతిరేకంగా పన్నాగాలు పన్ని అతనిని అతని ఇంటిలోనే చంపివేశారు. 24 సామన్య ప్రజలు, ఏఏ అధికారులు ఆమోనుకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నారో ఆ అధికారులను చంపివేశారు. అప్పుడు ప్రజలు ఆమోను కుమారుడైన యోషీయాను క్రొత్త రాజుగా నియమించారు.

25 ఆమోను చేసిన ఇతర పనులు “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడ్డవి. 26 ఉజ్జా తోటలో ఆమోను సమాధి చేయబడ్డాడు. ఆమోను కుమారుడైన యోషీయా క్రొత్తగా రాజయ్యాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International