Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెషయా 64-66

64 నీవు ఆకాశాలను చీల్చుకొని
    భూమి మీదికి దిగివస్తే అప్పుడు సమస్తం మారిపోతుంది.
    పర్వతాలు నీ ఎదుట కరగిపోతాయి.
మండుతున్న పొదల్లా, పర్వతాలు అగ్ని జ్వాలల్లో కాలిపోతాయి.
    నిప్పుమీది నీళ్లలా పర్వతాలు కాగిపోతాయి.
అప్పుడు నీ శత్రువులు నిన్ను గూర్చి తెలుసుకొంటారు.
    అప్పుడు రాజ్యాలన్ని నిన్ను చూడగా భయంతో వణుకుతాయి.
(కానీ నీ ఈ సంగతులు జరిగించాలని మేము నిజంగా కోరటంలేదు.
    పర్వతాలు నీ ఎదుట కరగిపోతాయి.)
నీ ప్రజలు నిజంగా ఎన్నడూ నీ మాట వినలేదు.
    నీవు చెప్పిన విషయాలను నీ ప్రజలు నిజంగా ఎన్నడూ వినలేదు.
నీవంటి దేవుణ్ణి ఏ మనిషీ ఎన్నడూ చూడలేదు. నీవు తప్ప ఇంక ఏ దేవుడూ లేడు.
    ప్రజలు సహనంతో నీకొరకు కనిపెట్టివుంటే అప్పుడు నీవు వారికోసం గొప్ప కార్యాలు చేస్తావు.

మేలు చేయటంలో ఆనందించే మనుష్యులతో నీవు ఉన్నావు.
    నీ జీవన విధానాలను ఆ మనుష్యులు జ్ఞాపకం చేసుకొంటారు.
కానీ చూడు, గతంలో మేము నీకు విరోధంగా పాపం చేశాము
    అందుచేత నీవు మా మీద కోపగించావు.
మేమందరం పాపంతో మైలపడ్డాం.
    మా “నీతి” అంతా పాత మైల గుడ్డల్లాంటిదే.
మేమందరం ఎండిపోయిన ఆకుల్లా ఉన్నాము.
    మా పాపాలు మమ్మల్ని గాలిలా కొట్టుకుపోయాయి.
మేము నిన్ను ఆరాధించటం లేదు, నీ నామం మేము విశ్వసించలేదు.
నిన్ను వెంబడించాలనే సంబరం మాలో ఎవ్వరికీ లేదు.
    అందుచేత నీవు మా వద్దనుండి తిరిగిపోయావు.
మేము పాపంతో నిండిపోయాం
    గనుక నీ ఎదుట మేము నిస్సహాయులం.
కానీ, యెహోవా, నీవు మా తండ్రివి.
    మేము మట్టిలాంటి వాళ్లం. నీవు కుమ్మరివి.
    నీ చేతులే మమ్మల్ని అందర్ని చేశాయి.
యెహోవా, మా మీద ఇంకా కోపంతోనే ఉండకు.
    మా పాపాలను శాశ్వతంగా జ్ఞాపకం చేసుకోవద్దు.
దయచేసి మమ్మల్ని చూడు,
    మేము నీ ప్రజలము.
10 నీ పవిత్ర పట్టణాలు శూన్యంగా ఉన్నాయి. ఆ పట్టణాలు ఇప్పుడు అరణ్యాలవలె ఉన్నాయి.
    సీయోను ఒక అరణ్యం.
    యెరూషలేము నాశనం చేయబడింది.
11 మా పవిత్ర ఆలయం అగ్నిచేత కాల్చి వేయబడింది.
    ఆ ఆలయం మాకు ఎంతో గొప్పది.
మా తండ్రులు అక్కడ నిన్ను ఆరాధించారు.
    మాకు ఉండిన మంచి వస్తువులన్నీ ఇప్పుడు నాశనం చేయబడ్డాయి.
12 నీవు నీ ప్రేమను ఎన్నటికీ మాకు చూపకుండా ఉంచుతాయా ఈ వస్తువులు?
    నీవు ఏమీ పలుకకుండనే కొనసాగుతావా?
    శాశ్వతంగా నీవు మమ్మల్ని శిక్షిస్తావా?

ప్రజలందరూ దేవుని గూర్చి నేర్చుకొంటారు

65 యెహోవా చెబుతున్నాడు: “సలహాకోసం నా వద్దకు రాని ప్రజలకు నేను సహాయం చేశాను. నన్ను కనుగొన్నవారు నాకోసం వెదకిన వారు కారు. నా పేరు పెట్టబడని ఒక ప్రజతో నేను మాట్లాడాను. ‘నేనిక్కడ ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను’ అని నేను చెప్పాను.

“నాకు విరోధంగా తిరిగిపోయిన వారిని చేర్చుకొనేందుకు నేను సిద్ధంగా నిలబడ్డాను. ఆ ప్రజలు నా దగ్గరకు వస్తారని నేను కనిపెట్టాను. కానీ వారు చెడుమార్గంలోనే జీవించటం కొనసాగించారు. వారి హృదయాలు కోరినవన్నీ వారు చేశారు. ఆ మనుష్యులు నాకు ఎల్లప్పుడూ కోపం పుట్టిస్తూ, నా యెదుట ఉన్నారు. ఆ ప్రజలు వారి ఉద్యానవనాల్లో బలులు అర్పిస్తారు. ధూపం వేస్తారు. ఆ మనుష్యులు సమాధుల్లో కూర్చొంటారు. చనిపోయిన వారి దగ్గర్నుండి సందేశాలకోసం వారు కనిపెడ్తారు. వారు శవాలమధ్య కూడా నివసిస్తారు. వారు పంది మాంసం తింటారు. వారి కత్తులు, గరిటెలు కుళ్లిపోయిన మాంసంతో మైలపడ్డాయి. కానీ ఆ ప్రజలే, ‘దగ్గరకు రాకు, నేను నిన్ను శుద్ధి చేసేంతవరకు నన్ను ముట్టకు’ అని ఇతరులతో చెబుతారు. ఆ ప్రజలు నా కంటికి పొగలా ఉన్నారు. మరియు వారి అగ్ని ఎంతసేపూ మండుతూనే ఉంటుంది.”

ఇశ్రాయేలు శిక్షింపబడాలి

“చూడు, నీవు చెల్లించాల్సిన లెక్క చీటి ఒకటి ఇక్కడ ఉంది. నీ పాపాల మూలంగా నీవు దోషివి అని ఈ లెక్క చీటి చూపిస్తుంది. ఈ లెక్క చీటి చెల్లించే వరకు నేను ఊరుకోను, నేను మిమ్మల్ని శిక్షించటం ద్వారా లెక్క చీటి చెల్లిస్తాను. మీ పాపాలు, మీ తండ్రుల పాపాలు అన్నీ ఒకటే. యెహోవా ఇలా చెప్పాడు, ‘మీ తండ్రులు పర్వతాల్లో ధూపం వేసినప్పుడు ఈ పాపాలు చేశారు. ఆ కొండల మీద వారు నన్ను అవమానించారు. మరియు నేను మొదట వాళ్లను శిక్షించాను. వారు పొందాల్సిన శిక్ష నేను వారికి ఇచ్చాను.’”

యెహోవా చెబుతున్నాడు: “ద్రాక్షపండ్లలో క్రొత్తరసం ఉన్నప్పుడు, ప్రజలు ఆ ద్రాక్షరసాన్ని పిండుతారు. కాని ద్రాక్ష పండ్లను మాత్రం వారు పూర్తిగా నాశనం చేయరు. ఆ ద్రాక్షపండ్లు ఇంకా ఉపయోగపడ్తాయి. కనుక వారు యిలా చేస్తారు. నా సేవకులకు కూడ నేను అలాగే చేస్తాను. నేను వారిని పూర్తిగా నాశనం చేయను. యాకోబు (ఇశ్రాయేలు) ప్రజలు కొందరిని నేను ఉంచుతాను. యూదా ప్రజలు కొందరికి నా పర్వతం లభిస్తుంది. నా సేవకులు అక్కడ నివసిస్తారు. అక్కడ నివసించాల్సిన మనుష్యులను నేను ఏర్పరచుకొంటాను. 10 అప్పుడు షారోను లోయ[a] గొర్రెలకు పొలం అవుతుంది. ఆకోరు లోయ[b] పశువులు విశ్రాంతి తీసుకొనే చోటు అవుతుంది. ఈ సంగతులన్నీ నా ప్రజలకోసం, నాకోసం వెదకే ప్రజలకోసమే.

11 “అయితే యెహోవాను విడిచిపెట్టిన ప్రజలారా, మీరు శిక్షించబడతారు. నా పవిత్ర పర్వతం[c] గూర్చి మరచిపోయిన ప్రజలు మీరు. మీరు అదృష్టాన్ని ఆరాధించే ప్రజలు. మీరు కర్మ అనే తప్పుడు దేవతమీద ఆధారపడే మనుష్యులు. 12 కానీ మీ భవిష్యత్తును నేను నిర్ణయిస్తాను. మరియు నా ఖడ్గం ప్రయోగించి నేను మిమ్మల్ని శిక్షిస్తాను. మిమ్మల్ని శిక్షించే ఆయన ఎదుట మీరంతా దీనులుగా ఉంటారు. నేను మిమ్మల్ని పిలిచాను, మీరు నాకు జవాబు ఇవ్వటానికి నిరాకరించారు. నేను మీతో మాట్లాడాను కానీ మీరు వినిపించుకోలేదు. కీడు అని నేను చెప్పిన వాటినే మీరు చేశారు. నాకు ఇష్టం లేని వాటినే చేయాలని మీరు తీర్మానించుకొన్నారు.”

13 కనుక యెహోవా నా ప్రభువు ఈ మాటలు చెప్పాడు:
“నా సేవకులు భోజనం చేస్తారు
    కానీ దుర్మార్గులైన మీరు ఆకలితో ఉంటారు.
నా సేవకులు పానం చేస్తారు.
    కానీ దుష్ఠులైన మీరు దాహంతో ఉంటారు.
నా సేవకులు సంతోషంగా వుంటారు.
    కానీ దుష్టులైన మీరు సిగ్గునొందుతారు.
14 నా సేవకుల హృదయాల్లో మంచితనం ఉంటుంది.
    కనుక వారు సంతోషంగా ఉంటారు.
కానీ దుష్ఠులైన మీ హృదయాల్లో బాధ ఉంటుంది గనుక మీరు ఏడుస్తారు.
    మీ ఆత్మలు భగ్నమైపోతాయి గనుక మీరు చాలా దుఃఖిస్తారు.
15 మీ పేర్లు నా సేవకులకు చెడ్డ మాటల్లా ఉంటాయి.”
నా ప్రభువు, యెహోవా మిమ్మల్ని చంపేస్తాడు.
    మరియు ఆయన తన సేవకులను క్రొత్త పేర్లతో పిలుస్తాడు.
16 ఇప్పుడు ప్రజలు ఆశీర్వదించమని భూమిని వేడుకొంటున్నారు.
    కానీ భవిష్యత్తులో వారు ఆశీర్వాదాలకోసం నమ్మకమైన దేవుణ్ణి అడుగుతారు.
ఇప్పుడు ప్రజలు ప్రమాణాలు చేసినప్పుడు వారు భూశక్తిని నమ్ముకొంటున్నారు.
    కానీ భవిష్యత్తులో వారు నమ్మకమైన దేవుణ్ణి నమ్ముకొంటారు.
ఎందుకంటే గతంలోని కష్టాలు మరువబడుతాయి గనుక.
    ఆ కష్టాలను నాప్రజలు ఇంక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోరు.

ఒక క్రొత్త సమయం వస్తుంది

17 “చూడు, నేను ఒక క్రొత్త ఆకాశాన్ని ఒక క్రొత్త భూమిని చేస్తాను.
గత విషయాలను ప్రజలు జ్ఞాపకం చేసుకోరు.
    ఆ విషయాలు ఏవీ నా ప్రజల జ్ఞాపకాల్లో ఉండవు.
18 నా ప్రజలు విచారంగా ఉండరు. లేదు, వారు సంతోషంగా ఉండి, శాశ్వతంగా దేవుని స్తుతిస్తారు.
    నేను చేసే సంగతుల మూలంగా వారు సంతోషంగా ఉంటారు.
సంపూర్ణ ఆనందంతో నిండిన ఒక యెరూషలేమును నేను చేస్తాను.
    మరియు వారిని సంతోషించే ప్రజగా నేను చేస్తాను.

19 “అప్పుడు యెరూషలేము గూర్చి నేను సంతోషిస్తాను.
    నా ప్రజలను గూర్చి నేను సంతోషిస్తాను.
ఆ పట్టణంలో మరల ఎన్నడూ
    ఏడుపు, దుఃఖం ఉండవు.
20 జన్మించి, కొన్నాళ్లు మాత్రమే జీవించే శిశువు అంటూ ఎవ్వరు ఆ పట్టణంలో ఉండరు.
    కొన్నాళ్లకే ఆయుష్షు తీరిపోయే వ్యక్తులు ఎవ్వరూ ఆ పట్టణంలో ఉండరు.
జన్మించే ప్రతి శిశువు దీర్ఘకాలం జీవిస్తుంది.
    వృద్ధులు ప్రతి ఒక్కరూ చాలాకాలం జీవిస్తూనే ఉంటారు.
వంద సంవత్సరాలు జీవించిన వ్యక్తి యువకుడు అని పిలువబడతాడు.
    (అయితే పాపం చేసినవాడు వంద సంవత్సరాలు బ్రతికినా అన్నీ కష్టాలే.)

21 “ఆ పట్టణంలో ఒక వ్యక్తి ఇల్లు కడితే ఆ వ్యక్తి అక్కడ నివసిస్తాడు.
    ఒక వ్యక్తి గనుక ద్రాక్షతోట నాటితే ఆ వ్యక్తి ఆ తోటలోని ద్రాక్ష పండ్లు తింటాడు.
22 ఒకడు ఇల్లు కట్టగా మరొకడు ఆ ఇంటిలో
    నివసించటం అనేది జరుగదు.
ఒకడు ఒక తోటను నాటగా మరొకడు
    ఆ తోట ఫలాలు తినటం అనేది జరుగదు.
వృక్షాలు బ్రతికినంత కాలం నా ప్రజలు బ్రతుకుతారు.
    నేను ఏర్పరచుకొనే ప్రజలు, వారు తయారుచేసే వాటిని అనుభవిస్తారు.
23 ప్రతిఫలం ఏమి లేకుండా ప్రజలు మరల ఎన్నడూ పనిచేయరు.
    చిన్నతనంలోనే మరణించే పిల్లల్ని ప్రజలు మరల ఎన్నడు కనరు.
నా ప్రజలంతా యెహోవాచేత ఆశీర్వదించబడతారు. నా ప్రజలు, వారి పిల్లలు ఆశీర్వదించబడుతారు.
24 వారికి అవసరమైనవి, వారు అడగకముందే నేను తెలుసుకొంటాను.
    సహాయంకోసం వారు నన్ను అడుగుట ముగించక ముందే నేను వారికి సహాయం చేస్తాను.
25 తోడేళ్లు, గొర్రెపిల్లలు కలిసి మేతమేస్తాయి.
    సింహాలు పశువులతో కలిసి మేస్తాయి.
నా పవిత్ర పర్వతం మీద నేలపై పాము ఎవరినీ భయపెట్టదు, బాధించదు.”
ఇవన్నీ యెహోవా చెప్పాడు.

జనములన్నింటికీ దేవుడు తీర్పు తీరుస్తాడు

66 యెహోవా చెబుతోంది ఇదే,
“ఆకాశాలు నా సింహాసనం.
    భూమి నా పాదపీఠం.
అందుచేత నాకు ఒక గృహం నిర్మంచగలం అని మీరనుకొంటున్నారా?
    లేదు, నిర్మించ లేరు.
నా అంతట నేనే అన్నింటినీ చేశాను.
    అన్నింటిని నేను చేసాను కనుక అవి అన్నీ ఇక్కడ ఉన్నాయి.” యెహోవా ఈ సంగతులు చెప్పాడు.
“నేను ఏ ప్రజల్ని లక్ష్యపెడతాను, నాతో చెప్పండి? పేదప్రజల్ని నేను లక్ష్యపెడతాను.
    వీరు చాల దుఃఖంలో ఉన్న ప్రజలు. నా మాటలకు విధేయులయ్యే వారిని నేను లక్ష్యపెడతాను
కొంతమంది నాకు బలులు ఇచ్చేందుకు ఎడ్లను వధిస్తారు.
    కానీ వారు ప్రజల్నికూడా కొడతారు.
ఆ మనుష్యులు నాకు బలులు ఇచ్చేందుకని గొర్రెలను వధిస్తారు.
    అయితే వారు కుక్కల మెడలు కూడ విరుగగొడ్తారు.
మరియు పందుల[d] రక్తం వారు నాకు అర్పిస్తారు.
    ఆ మనుష్యులు ధూపం వేయటం జ్ఞాపకం ఉంచుకొంటారు. కాని పనికిమాలిన వారి విగ్రహాలను కూడా వారు ప్రేమిస్తారు.
ఆ మనుష్యులు నా మార్గాలను గాక వారి స్వంత మార్గాలనే ఎంచుకొంటారు.
    భయంకరమైన వారి విగ్రహాలనే వారు పూర్తిగా ప్రేమిస్తారు.
కనుక వారి స్వంత రహస్యాలనే నేను ఉపయోగించాలని నేను నిర్ణయించుకొన్నాను.
    అంటే, దేనికైతే వారు ఎక్కువగా భయపడతారో వాటినే ప్రయోగించి వారిని శిక్షించాలని నా ఉద్దేశం.
నేను ఆ ప్రజలను పిలిచాను
    కాని వారు వినిపించుకోలేదు.
నేను వారితో మాట్లాడాను
    కానీ వారు నా మాట వినలేదు కనుక నేనుకూడా వారికి అదే విధంగా చేస్తాను.
నేను కీడు అని చెప్పిన వాటినే ఆ ప్రజలు చేశారు.
    నాకు ఇష్టంలేని వాటినే వారు జరిగించేందుకు ఎంచుకొన్నారు.”

యెహోవా ఆజ్ఞలకు విధేయులయ్యే ప్రజలారా,
    మీరు యెహోవా చెప్పేవాటిని వినాలి.
“మీ సోదరులు మిమ్మల్ని ద్వేషించారు.
    మీరు నన్ను వెంబడించినందువల్ల వారు మీకు విరోధంగా తిరిగారు.
యెహోవా ఘనపరచబడినప్పుడు మేము తిరిగి మీ దగ్గరకు వస్తాము.
    అప్పుడు మేము మీతోకూడ సంతోషిస్తాం, అని మీ సోదరులు చెప్పారు.
    ఆ మనుష్యులు శిక్షించబడతారు.”

శిక్ష మరియు ఒక క్రొత్త జనం

వినండి! పట్టణం నుండి, దేవాలయం నుండి పెద్ద శబ్దం వస్తుంది. యెహోవా తన శత్రువులను శిక్షిస్తున్న శబ్దం అది. వారికి రావాల్సిన శిక్షనే యెహోవా వారికి ఇస్తున్నాడు.

7-8 “ఒక స్త్రీ నొప్పులు లేకుండా ప్రసవించదు. ఒక స్త్రీ నొప్పులు అనుభవించకుండనే తన శిశువును చూడటం అనేది ఎన్నడూ సంభవించలేదు. అదే విధంగా, ఒకే రోజున ఒక క్రొత్త ప్రపంచం ప్రారంభం అగుట ఎవ్వరూ ఎన్నడూ చూడలేదు. ఒకే రోజున ఒక క్రొత్త రాజ్యం ప్రారంభం అయినట్లు ఎవ్వరూ ఎన్నడూ వినలేదు. ప్రసవ వేదనలాంటి నొప్పులు దేశం మొదట అనుభవించాలి. ప్రసవ వేదనల తర్వాత దేశం తన పిల్లలకు – ఒక క్రొత్త దేశానికి—జన్మనిస్తుంది. అదే విధంగా ఏదో క్రొత్తది జన్మించాల్సిన అవసరం లేకుండా నేను బాధ కలిగించను.”

యెహోవా ఇది చెబుతున్నాడు: “నేను నీకు పురిటినొప్పులు రానిచ్చినట్లయితే, అప్పుడు నీ క్రొత్త దేశం నీకు రాకుండా నేను ఆపుజేయను.” మీ దేవుడే ఇది చెప్పాడు.

10 యెరూషలేమా, సంతోషించు! యెరూషలేమును ప్రేమించే మీరందరూ సంతోషించండి.
    విచారకరమైన విషయాలు యెరూషలేముకు సంభవించాయి. కనుక మీరు కొంతమంది మనుష్యులు విచారించారు. కానీ, అలాంటి మీరు ఇప్పుడు ఎంతో ఎంతో సంతోషించాలి.
11 ఎందుకంటే ఆమె స్థనాలనుండి పాలు వచ్చినట్లుగా మీకు కరుణ లభిస్తుంది. ఆ “పాలు” నిజంగా మిమ్మల్ని తృప్తిపరుస్తాయి.
    ప్రజలారా, మీరు పాలు త్రాగుతారు.
    మరియు మీరు యెరూషలేము మహిమను నిజంగా అనుభవిస్తారు.

12 యెహోవా చెబుతున్నాడు:
“చూడండి, నేను మీకు శాంతినిస్తాను. ఒక మహానది ప్రవాహంలా ఈ శాంతి మీ దగ్గరకు ప్రవహించి వస్తుంది.
    భూమి మీద రాజ్యాలన్నింటిలోని ఐశ్వర్యాలు అన్నీ మీ వద్దకు ప్రవహిస్తూ వస్తాయి. ఒక వరద ప్రవాహంలా ఈ ఐశ్వర్యాలు ప్రవహిస్తాయి.
మీరు చిన్న పిల్లల్లా ఉంటారు. మీరు ‘పాలు’ త్రాగుతారు.
    మీరు ఎత్తబడి నా కౌగిటిలో ఉంటారు.
    మీరు నా మోకాళ్లమీద ఊపబడతారు.
13 యెరూషలేములో మీరు ఓదార్చబడతారు.
    ఒక తల్లి తన బిడ్డను ఓదార్చేలా నేను మిమ్మల్ని ఓదార్చుతాను.”

14 మీరు నిజంగా అనుభవించేవాటిని మీరు చూస్తారు.
    మీరు స్వతంత్రులై, గడ్డి పెరుగునట్లు పెరుగుతారు.
యెహోవా సేవకులు ఆయన శక్తిని చూస్తారు.
    కానీ యెహోవా శత్రువులు ఆయన కోపాన్ని చూస్తారు.
15 చూడండి, యెహోవా అగ్నితో వస్తున్నాడు.
    యెహోవా సైన్యాలు ధూళిమేఘాలతో వస్తున్నాయి. ఆ ప్రజలను యెహోవా తన కోపంతో శిక్షిస్తాడు.
యెహోవా కోపంగా ఉన్నప్పుడు,
    ఆ ప్రజలను శిక్షించుటకు ఆయన అగ్ని జ్వాలలను ప్రయోగిస్తాడు.
16 యెహోవా ప్రజలకు తీర్పు తీరుస్తాడు.
    తర్వాత యెహోవా తన ఖడ్గంతోను, అగ్నితోను ఆ ప్రజలను నాశనం చేస్తాడు.
    యెహోవా అనేకమంది ప్రజలను నాశనం చేస్తాడు.

17 ఆ ప్రజలు వారి ప్రత్యేక తోటలో[e] ఆరాధించుకొనేందుకు, వారిని పవిత్రం చేసుకోవాలని చెప్పి, వారిని వారు కడుగుకొంటారు. ఈ ప్రజలు వారి తోటల్లోనికి ఒకరిని ఒకరు వెంబడిస్తారు. ఆ తర్వాత వారి విగ్రహాలను వారు పూజిస్తారు. కానీ, యెహోవా ఆ ప్రజలందరిని నాశనం చేస్తాడు. “పందులు, ఎలుకల మాంసం, ఇతర మైల వస్తువులు ఆ ప్రజలు తింటారు. అయితే ఆ ప్రజలంతా ఏకంగా నాశనం చేయబడతారు.” (సాక్షాత్తూ యెహోవా ఈ సంగతులు చెప్పాడు.)

18 “ఆ మనుష్యులకు దుష్టతలంపులు ఉన్నాయి, దుష్టకార్యాలు చేస్తారు. అందుచేత వారిని శిక్షించేందుకు నేను వస్తున్నాను. రాజ్యాలన్నింటిని, ప్రజలందరినీ నేను సమావేశం చేస్తాను. ప్రజలంతా కలిసి వచ్చి నా శక్తిని చూస్తారు. 19 కొంతమంది మనుష్యులకు నేను ఒక గుర్తువేస్తాను-వారిని నేను రక్షిస్తాను. రక్షించబడిన ఆ ప్రజల్లో కొందరిని తర్షీషు, లిబియా, లూదు, (విలుకాండ్ర దేశం), తూబాలు, గ్రీసు, దూరదేశాలు అన్నింటికీ నేను పంపిస్తాను. ఆ ప్రజలు నా ఉపదేశాలు ఎన్నడూ వినలేదు. ఆ ప్రజలు నా మహిమను ఎన్నడూ చూడలేదు. అందుచేత రక్షించబడిన ప్రజలు నా మహిమను గూర్చి దేశాలకు చెబుతారు. 20 మరియు వారు అన్ని దేశాలనుండి మీ సోదరులను, సోదరీలను తీసుకొని వస్తారు. నా పవిత్ర పర్వతం యెరూషలేముకు మీ సోదరీలను వారు తీసుకొని వస్తారు. గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, రథాలు బండ్లమీద మీ సోదరులు, సోదరీలు వస్తారు. ఇశ్రాయేలీయులు పవిత్ర పళ్లెములలో యెహోవా మందిరానికి తీసుకొనివచ్చే కానుకలవలె మీ సోదరులు, సోదరీలు ఉంటారు. 21 ఈ మనుష్యుల్లో నుండి కూడ కొందరిని యాజకులుగా, లేవీలుగా ఉండేందుకు నేను ఏర్పరచుకొంటాను.” (యెహోవా ఈ సంగతులు చెప్పాడు.)

క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి

22 “నేను ఒక నూతన ప్రపంచాన్ని చేస్తాను. మరియు నూతన ఆకాశం, నూతన భూమి శాశ్వతంగా నిలుస్తాయి. అదే విధంగా మీ పేర్లు, మీ పిల్లలు శాశ్వతంగా నాతో కూడ ఉంటారు. 23 ప్రతి ఆరాధన రోజు, ప్రజలంతా నన్ను ఆరాధించేందుకు వస్తారు. ప్రతి సబ్బాతు నాడూ, ప్రతి నెల మొదటిరోజున వారు వస్తారు.

24 “ఈ ప్రజలు నా పవిత్ర పట్టణంలో ఉంటారు. మరియు పట్టణం బయటకు వెళ్తే నాకు విరోధంగా పాపం చేసిన మనుష్యుల శవాలను వారు చూస్తారు. ఆ శవాలు పురుగులు పట్టి ఉంటాయి. ఆ పురుగులు ఎన్నటికి చావవు. అగ్ని జ్వాలలు ఆ శవాలను కాల్చివేస్తాయి మరియు ఆ జ్వాలలు ఎన్నటికీ ఆరిపోవు.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International