Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెషయా 59-63

చెడ్డవాళ్లు వారి జీవితాలు మార్చుకోవాలి

59 చూడు, నిన్ను రక్షించుటకు యెహోవా శక్తి చాలు. సహాయంకోసం నీవు ఆయనను అడిగినప్పుడు ఆయన వినగలడు. కానీ నీ పాపాలు నిన్ను నీ దేవుని నుండి వేరుచేశాయి. యెహోవా నీ పాపాలు చూసి, నీ నుండి తిరిగిపోతాడు. నీ చేతులు మైలగా ఉన్నాయి, అవి రక్తంతోనిండి ఉన్నాయి. నీ వేళ్లు దోషంతో నిండి ఉన్నాయి. నీవు నీ నోటితో అబద్ధాలు చెబుతున్నావు. నీ నాలుక చెడు విషయాలు పలుకుతుంది. ఎవ్వరూ ఇతరులను గూర్చి సత్యం చెప్పరు. ప్రజలు ఒకరి మీద ఒకరు న్యాయస్థానంలో ఫిర్యాదు చేస్తారు, వారి వ్యవహారం గెలుచుకొనేందుకు వారు తప్పుడు వాదాలమీద ఆధారపడతారు. వారు ఒకరిని గూర్చి ఒకరు అబద్ధాలు చెబుతారు. వారు చిక్కులతో నిండిపొయి, కీడును పుట్టిస్తారు. విషసర్పాల గ్రుడ్లవలె, వారు కీడును పొదుగుతారు. ఆ గ్రుడ్లు ఒకటి తింటే నీవు చస్తావు. ఆ గ్రుడ్లలో ఒకదాన్ని నీవు పగులగొడితే, ఒక విషసర్పం బయటకు వస్తుంది. ప్రజలు అబద్ధాలు చెబుతారు.

ఈ అబద్ధాలు సాలెగూళ్లలా ఉంటాయి. వారు అల్లే ఈ గూళ్లు బట్టలకు ఉపయోగపడవు. ఆ గూళ్లతో నిన్ను నీవు కప్పుకోలేవు.

కొంతమంది మనుష్యులు చెడ్డపనులు చేస్తారు, ఇతరులను బాధించుటకు వారి చేతులు ప్రయోగిస్తారు. కీడుకు పరుగులెత్తుటకు ఆ ప్రజలు వారి పాదాలను ఉపయోగిస్తారు. ఏ తప్పూ చేయని వారిని చంపటానికి వారు త్వరపడతారు. వారు చెడు తలంపులు తలుస్తారు. దౌర్జన్యం, దొంగతనం వారి జీవిత విధానం. ఆ ప్రజలకు శాంతి మార్గం తెలియదు. వారి జీవితాల్లో మంచితనం ఏమీలేదు. వారి మార్గాలు నిజాయితీగా లేవు. వారు జీవించినట్టుగా జీవించేవారెవరి జీవితాల్లోనూ ఎన్నటికి శాంతి ఉండదు.

ఇశ్రాయేలీయుల పాపం కష్టాన్ని తెస్తుంది

న్యాయం, మంచితనం అంతా పోయింది.
చీకటి మాత్రమే మనవద్ద ఉంది.
    అందుచేత మనం వెలుగుకోసం కనిపెట్టాలి.
ప్రకాశవంతమైన వెలుగుకోసం మనం నిరీక్షిస్తాం.
    కానీ మనకు ఉన్నదంతా చీకటి మాత్రమే.
10 మనం కళ్లులేని ప్రజల్లా ఉన్నాం.
    మనం గుడ్డివాళ్లలా గోడల మీదికి నడుస్తాం.
అది రాత్రియైనట్టు మనం జారి పడ్తాం.
    పగటి వెలుగులో కూడా మనం చూడలేం.
    మధ్యాహ్న సమయంలో మనం చచ్చినవాళ్లలా పడిపోతాం.
11 మనం అందరం ఎంతో విచారంగా ఉన్నాం.
    పావురాల్లా, ఎలుగుబంట్లలా విచారకరమైన శబ్దాలు మనం చేస్తాం.
మనుష్యులు న్యాయంగా ఉండేకాలం కోసం మనం ఎదురుచూస్తున్నాం.
    కానీ ఇంకా న్యాయం ఏమీ లేదు.
మనం రక్షించబడాలని ఎదురు చూస్తున్నాం,
    కానీ రక్షణ ఇంకా దూరంగానే ఉంది.
12 ఎందుకంటే మనం మన దేవునికి వ్యతిరేకంగా ఎన్నెన్నో తప్పు పనులు చేశాం గనుక.
    మనదే తప్పు అని మన పాలు చూపెడ్తున్నాయి.
ఈ పనులు చేసి మనం దోషులంగా
    ఉన్నామని మనకు తెలుసు.
13 మనం పాపంచేసి,
    యెహోవాకు విరోధంగా తిరిగాం.
మనం యెహోవా నుండి తిరిగిపోయి,
    ఆయన్ని విడిచిపెట్టేశాం.
చెడు విషయాలను మనం ఆలోచించాం.
    దేవునికి వ్యతిరేకమైన వాటినే మనం ఆలోచించాం.
వీటిని గూర్చి మనం ఆలోచించి,
    మన హృదయాల్లో వాటి పథకాలు వేసుకొన్నాం.
14 మన దగ్గర్నుండి న్యాయం తొలగిపోయింది.
    న్యాయం దూరంగా నిలుస్తుంది.
సత్యం వీధుల్లో పడిపోయింది.
    మంచితనం పట్టణంలో ప్రవేశించటానికి అనుమతించబడటం లేదు.
15 సత్యం పోయింది.
    మంచి జరిగించాలనుకొనే మనుష్యులు దోచుకోబడ్డారు.

యెహోవా చూశాడు, కానీ మంచితనం ఏమీ ఆయనకు కనబడలేదు. ఇది
    యెహోవాకు ఇష్టం కాలేదు.
16 యెహోవా చూశాడు.
    నిలిచి, ప్రజలకు సహాయం చేసే వ్యక్తి ఒక్కడూ ఆయనకు కనిపించలేదు.
కనుక యెహోవా తన స్వంత శక్తి, తన స్వంత మంచితనం ప్రయోగించాడు.
    మరియు యెహోవా ప్రజలను రక్షించాడు.
17 యెహోవా యుద్ధానికి సిద్ధమయ్యాడు.
    యెహోవా మంచితనాన్ని ఒక కవచంలా కప్పుకొన్నాడు.
    రక్షణ శిరస్త్రాణం ధరించాడు.
    శిక్షను వస్త్రాలుగా ధరించాడు.
    బలీయమైన ప్రేమ అంగీ ధరించాడు.
18 యెహోవా తన శత్రువుల మీద కోపంగా ఉన్నాడు
    కనుక వారికి తగిన శిక్షను యెహోవా వారికి ఇస్తాడు.
    యెహోవా తన శత్రువులమీద కోపంగా ఉన్నాడు.
కనుక దూరస్థలాలు అన్నింటిలోను ప్రజలను యెహోవా శిక్షిస్తాడు. వారికి తగిన శిక్షను యెహోవా వారికి ఇస్తాడు.
19 అప్పుడు పశ్చిమాన ప్రజలు యెహోవా నామాన్ని గౌరవిస్తారు. తూర్పున ప్రజలు యెహోవా మహిమను గూర్చి భయపడతారు.
వేగంగా ప్రవహించే ఒక నదిలా యెహోవా వెంటనే వస్తాడు.
    యెహోవా ఈ నదిమీద విసరగా వచ్చిన శక్తివంతమైన గాలిలా అది ఉంటుంది.
20 అప్పుడు సీయోనుకు ఒక రక్షకుడు వస్తాడు.
    పాపం చేసినప్పటికి, తిరిగి దేవుని దగ్గరకు వచ్చిన యాకోబు ప్రజల దగ్గరకు ఆయన వస్తాడు.

21 “ఆ ప్రజలతో నేను ఒక ఒడంబడిక చేసుకుంటాను. నీ నోట నేను ఉంచే నా ఆత్మ, నా మాటలు నిన్ను ఎన్నడూ విడిచిపోవు అని నేను ప్రమాణం చేస్తున్నాను. నీ పిల్లలతోను, నీ పిల్లల పిల్లలతోను అవి ఉంటాయి. అవి ఇప్పుడు, ఎల్లప్పుడు నీతో ఉంటాయి” అని యెహోవా చెబుతున్నాడు.

దేవుడు వస్తున్నాడు

60 “నా వెలుగైన యెరూషలేమా లెమ్ము!
    నీ వెలుగు (దేవుడు) వస్తున్నాడు. యెహోవా మహిమ నీ మీద ప్రకాశిస్తుంది.
ఇప్పుడు భూమిని,
    దాని ప్రజలను చీకటి ఆవరించి ఉంది.
కానీ యెహోవా నీ మీద ప్రకాశిస్తాడు.
    నీ చుట్టూరా ఆయన మహిమను ప్రజలు చూస్తారు.
ఆ సమయంలో రాజ్యాలు నీ వెలుగు (దేవుడు) దగ్గరకు వస్తాయి.
    ప్రకాశవంతమైన నీ వెలుగు దగ్గరకు రాజులు వస్తారు.
నీ చుట్టూ చూడు,
    చూడు ప్రజలు చూట్టూ చేరి, నీ దగ్గరకు వస్తున్నారు.
ఆ ప్రజలు దూరం నుండి వస్తున్న నీ కుమారులు.
    మరియు వారితో నీ కుమార్తెలు వస్తున్నారు.

“భవిష్యత్తులో ఇది సంభవిస్తుంది. ఆ సమయంలో నీ ప్రజలను నీవు చూస్తావు.
    ఆనందంతో మీ ముఖాలు ప్రకాశిస్తాయి.
మొదట, మీరు భయపడతారు,
    కానీ తర్వాత మీరు సంబరపడతారు.
సముద్రాల ఆవలి రాజ్యాల ఐశ్వర్యాలన్నీ నీ ముందు ఉంచబడతాయి.
    రాజ్యాల ఐశ్వర్యాలు నీకు సంక్రమిస్తాయి.
మిద్యాను, ఏయిఫాల నుండి ఒంటెల మందలు
    నీ దేశంలో నిండిపోతాయి.
షేబనుండి ఒంటెలు బారులు తీరి వస్తాయి.
    బంగారం, బోళం అవి తెస్తాయి.
ప్రజలు యెహోవాకు స్తుతులు పాడతారు.
కేదారు గొర్రెలు అన్నీ నీకు ఇవ్వబడుతాయి.
    నెబాయోతు పొట్టేళ్లు నీకోసం తీసుకొని రాబ డతాయి.
అవి నా బలిపీఠం మీద స్వీక రించదగిన బలి అర్పణలవుతాయి.
    ఆశ్చర్యకరమైన నా ఆలయాన్ని నేను ఇంకా అందంగా తీర్చిదిద్దుతాను.
ప్రజలను చూడు!
    ఆకాశాన్ని వేగంగా దాటిపోయే మేఘాల్లా వారు త్వరపడుతున్నారు.
    వాటి గూళ్లకు ఎగిరిపోతున్న పావురాల్లా ఉన్నారు వారు
దూర దేశాలు నాకోసం కనిపెడ్తున్నాయి.
    తర్షీషు మహా ఓడలు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి.
దూర దేశాలనుండి నీ పిల్లలను తీసుకొని వచ్చేందుకు ఆ ఓడలు సిద్ధంగా ఉన్నాయి.
    మరియు వారి వెండి బంగారాలను ఆ ఓడలు తీసుకొని వస్తాయి.
    నీ దేవుడు యెహోవాను గౌరవించుటకు ఇది జరుగుతుంది.
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు అద్భుత కార్యాలు చేస్తాడు గనుక ఇది జరుగుతుంది.
10 ఇతర దేశాలనుండి వచ్చిన పిల్లలు నీ గోడలను తిరిగి నిర్మిస్తారు.
    వారి రాజులు నిన్ను సేవిస్తారు.

“నేను కోపగించినప్పుడు, నేను నిన్ను బాధించాను.
    కానీ ఇప్పుడు, నేను నీకు దయచూపించ గోరుతున్నాను.
    కనుక నేను నిన్ను ఆదరిస్తాను.
11 నీ ద్వారాలు ఎల్లప్పుడూ తెరచి ఉంటాయి.
    రాత్రిగాని పగలుగాని అవి మూయబడవు.
రాజులు, రాజ్యాలు వారి ఐశ్వర్యాలను నీకు తీసుకొని వస్తారు.
12 కొన్ని దేశాలు, రాజ్యాలు నిన్ను సేవించవు. కానీ ఆ దేశాలు, రాజ్యాలు పాడైపోయి, నాశనం అవుతాయి.
13 లెబానోనులోని గొప్పవన్నియు నీకు ఇవ్వబడుతాయి.
    దేవదారు, సరళ, గొంజి వృక్షాలను ప్రజలు నీ వద్దకు తీసుకొని వస్తారు.
నా పరిశుద్ధ ఆలయాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు
    నీవు ఈ వృక్షాలను ఉపయోగిస్తావు.
(ఈ స్థలం నా సింహాసనం ఎదుట పాదపీఠంలా ఉంటుంది.
    నేను దానికి చాలా ఘనత ఇస్తాను.)
14 గతంలో ప్రజలు నిన్ను బాధించారు.
    ఆ ప్రజలు నీ ఎదుట సాష్టాంగపడతారు.
గతంలో ప్రజలు నిన్ను ద్వేషించారు.
    ఆ ప్రజలు నీ పాదాల దగ్గర సాగిలపడతారు.
‘యెహోవా పట్టణం’ అని ‘ఇశ్రాయేలు పరిశుద్ధుని సీయోను’ అనీ ఆ ప్రజలు నిన్ను పిలుస్తారు.

15 “నీవు మళ్లీ ఎన్నటికీ ఒంటరిగా విడువబడవు.
    నీవు మరల ఎన్నడు ద్వేషించబడవు. నీవు మరల ఎన్నడూ ఖాళీగా ఉండవు.
నిన్ను నేను శాశ్వతంగా గొప్ప చేస్తాను.
    నీవు ఎప్పటికి, శాశ్వతంగా సంతోషిస్తావు.
16 నీకు అవసరమైన వస్తువులను రాజ్యాలు నీకు ఇస్తాయి.
    అది ఒక బిడ్డ తన తల్లి దగ్గర పాలు తాగినట్టుగా ఉంటుంది.
నీవైతే రాజులనుండి ఐశ్వర్యాలను త్రాగుతావు.
    అప్పుడు, నిన్ను రక్షించు యెహోవాను నేనే అని నీవు తెలుసు కొంటావు.
    యాకోబు యొక్క మహా గొప్పవాడు నిన్ను కాపాడును అని నీవు తెలుసుకొంటావు.

17 “ఇప్పుడు నీకు ఇత్తడి ఉంది.
    నేను నీకు బంగారం తెస్తాను.
ఇప్పుడు నీకు ఇనుము ఉంది,
    నేను నీకు వెండి తెస్తాను.
నీ చెక్కను నేను ఇత్తడిగా మార్చేస్తాను.
    నీ బండలను ఇనుముగా నేను మార్చేస్తాను.
నీ శిక్షను నేను శాంతిగా మార్చేస్తాను.
ఇప్పుడు ప్రజలు నిన్ను బాధిస్తున్నారు.
    కానీ ప్రజలు నీకు మంచి కార్యాలు చేస్తారు.
18 ప్రజలు మరల ఎన్నడూ నీ ఎడల నీచంగా ఉండరు.
నీ దేశంలో నీ దగ్గర్నుండి
    ప్రజలు మరల ఎన్నడూ దొంగిలించరు.
‘రక్షణ’ అని నీ గోడలకు నీవు పేరుపెడతావు.
    ‘స్తుతి’ అని నీ ద్వారాలకు నీవు పేరుపెడతావు.

19 “ఇంకెంత మాత్రం పగలు సూర్యుడు నీకు వెలుగుగా ఉండడు.
    చంద్రకాంతి ఇంకెంత మాత్రం నీకు వెలుగుగా ఉండదు. ఎందుకు?
ఎందుకంటే యెహోవాయే నీకు శాశ్వత వెలుగుగా ఉంటాడు.
    నీ దేవుడే నీ మహిమ.
20 నీ ‘సూర్యుడు’ ఇక ఎన్నటికీ అస్తమించడు.
    నీ ‘చంద్రుడు’ ఇక ఎన్నటికీ చీకటిగా ఉండడు. ఎందుకు?
ఎందుకంటే యెహోవా నీకు శాశ్వత వెలుగుగా ఉంటాడు.
    మరియు నీ దుఃఖకాలం అంతం అవుతుంది.

21 “నీ ప్రజలు అందరూ మంచివారుగా ఉంటారు.
    ఆ ప్రజలు భూమిని శాశ్వతంగా పొందుతారు.
నేనే ఆ ప్రజలను చేశాను.
    నా స్వహస్తాలతో నేనే చేసిన అద్భుతమైన మొక్క వారు.
22 అతి చిన్న కుటుంబం ఒక పెద్ద వంశం అవుతుంది.
    కడసారపు వ్యక్తి ఒక బలమైన రాజ్యం అవుతాడు.
సమయం సరిగ్గా ఉన్నప్పుడు,
    యెహోవానను నేను త్వరగా వస్తాను.
    నేను ఈ సంగతులను జరిగిస్తాను.”

యెహోవా స్వాతంత్య్ర సందేశం

61 యెహోవా సేవకుడు చెబుతున్నాడు, నా ప్రభువు యెహోవా తన ఆత్మను నాలో ఉంచాడు. కొన్ని ప్రత్యేకమైన పనులు చేయటానికి యెహోవా నన్ను ఏర్పరచుకొన్నాడు. పేద ప్రజలకు శుభవార్త ప్రకటించుటకు, దుఃఖంలో ఉన్న మనుష్యులను ఓదార్చుటకు, స్వాతంత్య్రంలేని ప్రజలకు స్వాతంత్య్రం ప్రకటించుటకు, బలహీన ప్రజలకు నూతన బలం ఇచ్చేందుకు, యెహోవా తన దయ చూపించే సమయాన్ని ప్రకటించేందుకు; దుష్టులను మన దేవుడు శిక్షించే సమయాన్ని ప్రకటించేందుకు; దుఃఖంలో ఉన్న వాళ్లను ఆదరించేందుకు; దుఃఖంలో ఉన్న సీయోను వాసులకు గౌరవం చేకూర్చేందుకు (ఇప్పుడు వారికి బూడిద మాత్రమే ఉంది); సీయోను ప్రజలకు ఆనందతైలం ఇచ్చుటకు (ఇప్పుడు వారికి దుఃఖం మాత్రమే ఉంది); సీయోను ప్రజలకు దేవుని స్తుతిగీతాలు ఇచ్చుటకు (ఇప్పుడు వారికి దుఃఖం మాత్రమే ఉంది;) “మంచి వృక్షాలు” అని ఆ ప్రజలకు పేరు పెట్టుటకు; “యెహోవా అద్భుత చెట్టు” అని వారికి పేరు పెట్టుటకు.

పాడు చేయబడిన పాత పట్టణాలు ఆ సమయంలో మరల నిర్మించబడతాయి. ఆ పట్టణాలు మొదట్లో ఉన్నట్టే మరల నూతనంగా చేయబడతాయి. ఎన్నెన్నో సంవత్సరాలుగా పాడు చేయబడిన ఆ పట్టణాలు క్రొత్తవాటిలా చేయబడతాయి.

అప్పుడు మీ శత్రువులు మీ దగ్గరకు వచ్చి, మీ గొర్రెలను గూర్చి జాగ్రత్త వహిస్తారు. మీ శత్రువుల పిల్లలు మీ పొలాల్లోనూ, మీ తోటల్లోనూ పనిచేస్తారు. మీరు “యెహోవా యాజకులు” అని, “మన దేవుని సేవకులు” అని పిలువబడతారు. భూమి మీద ఉన్న రాజ్యాలన్నింటి నుండీ వచ్చిన ఐశ్వర్యాలు మీకు ఉంటాయి. అది మీకు ఉన్నందువల్ల మీరు గర్విస్తారు.

గతంలో ఇతరులు మిమ్మల్ని అవమానించి మిమ్మల్ని చెడ్డ మాటలు అన్నారు. ఏ ఇతర ప్రజల కంటెకూడా మీరు ఎక్కువగా అవమానించబడ్డారు. కనుక ఇతర ప్రజలకంటె రెండంతలు ఎక్కువగా మీరు మీ దేశంలో పొందుతారు. శాశ్వతంగా కొనసాగే సంతోషం మీకు లభిస్తుంది. ఎందుకు ఇలా జరగుతుంది? ఎందుకంటె, నేను యెహోవాను గనుక, న్యాయం అంటే నాకు ఇష్టం గనుక. దొంగతనం, సమస్త చెడుగు నాకు అసహ్యం. కనుక ప్రజలకు తగిన శిక్ష నేను ఇస్తాను. నా ప్రజలతో శాశ్వతంగా నేను ఒక ఒడంబడిక చేసుకొన్నాను. అన్ని రాజ్యాలలో ప్రతి ఒక్కరూ నా ప్రజలను తెలుసుకొంటారు. నా దేశం పిల్లలను ప్రతి ఒక్కరు తెలుసుకొంటారు. యెహోవా వారిని ఆశీర్వదించునని, వారిని చూచే ప్రతి వ్యక్తికి తెలుస్తుంది.

దేవుని సేవకుడు రక్షణను, తీసుకొనివస్తాడు

10 యెహోవా నన్ను ఎంతో ఎంతో సంతోషింపజేస్తాడు.
    నా దేవునియందు నేను సంపూర్ణంగా సంతోషిస్తున్నాను.
రక్షణ వస్త్రాలతో యెహోవా నన్ను కప్పాడు.
    ఆ వస్త్రాలు ఒకడు తన పెండ్లికి ధరించే వస్త్రాల్లా ఉన్నాయి.
దయ అనే పైబట్టతో యెహోవా నన్ను కప్పాడు.
    ఈ పైబట్ట ఒక స్త్రీ తన పెండ్లికి ధరించే అందమైన వస్త్రాల్లా ఉంది.
11 భూమి మొక్కలను మొలిపిస్తుంది.
    ప్రజలు తోటలో విత్తనాలు చల్లుతారు. ఆ తోట ఆ విత్తనాలను ఎదిగింపజేస్తుంది.
అదే విధంగా యెహోవా దయను ఎదిగింప జేస్తాడు. సకల రాజ్యాలలో యెహోవా స్తుతిని ఎదిగింప జేస్తాడు.

క్రొత్త యెరూషలేము మంచితనంతో నిండిన నగరం

62 సీయోను అంటే నాకు ప్రేమ.
    అందుచేత నేను ఆమె పక్షంగా ఇంకా మాట్లాడతాను.
యెరూషలేము అంటే నాకు ప్రేమ.
    అందుచేత నేను మాట్లాడటం చాలించను.
మంచితనం పెద్ద వెలుగుగా ప్రకాశించేంత వరకు నేను మాట్లాడతాను.
    ఒక జ్వాలలా రక్షణ నుండి ప్రకాశించేంత వరకు నేను మాట్లాడతాను.
అప్పుడు సకల రాజ్యాలు నీ మంచితనాన్ని చూస్తాయి.
    రాజులందరూ నీ గౌరవాన్ని చూస్తారు.
అప్పుడు నీకు ఒక క్రొత్త పేరు ఇవ్వబడుతుంది.
    ప్రజలారా, యెహోవా తానే మీకు ఆ క్రొత్త పేరు ఇస్తాడు.
యెహోవా మీ విషయం ఎంతో అతిశయిస్తాడు.
    యెహోవా చేతిలో అందాల కిరీటంలా ఉంటారు మీరు.
“దేవుడు విడిచిపెట్టిన ప్రజలు” అని ఇంకెన్నడూ మీరు పిలువబడరు.
    “దేవుడు నాశనం చేసిన దేశం” అని మీ దేశం ఇంకెన్నటికి పిలువబడదు.
“దేవుడు ప్రేమించే ప్రజలు” అని మీరు పిలువబతుతారు.
    “దేవుని వధువు” అని మీ దేశం పిలువబడుతుంది.
ఎందుకంటె యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు గనుక.
    మరియు మీ దేశం ఆయనకు చెందుతుంది.
ఒక యువకుడు ఒక స్త్రీని ప్రేమించినప్పుడు అతడు ఆమెను పెండ్లి చేసుకొంటాడు. మరియు ఆమె అతనికి భార్య అవుతుంది.
    అదేవిధంగా మీ దేశం మీ పిల్లలకు చెందుతుంది.
ఒకడు తన నూతన భార్యతో ఎంతో సంతోషిస్తాడు.
    అదే విధంగా, మీ దేవుడు మీతో ఎంతో సంతోషిస్తాడు.

కావలి ఉండుటకు యెరూషలేము గోడల మీద కావలివారిని (ప్రవక్తలను) నేను ఉంచుతాను.
    ఈ కావలివారు మౌనంగా ఉండరు.
    రాత్రింబవళ్లు వారు కనిపెట్టి ఉంటారు.

యెహోవాను గూర్చి ఉపదేశించే మీరు ఎన్నటికీ మౌనంగా ఉండకూడదు.
    యెహోవాను ప్రార్థించటం మీరు చాలించకూడదు.
మీరు ఎల్లప్పుడూ యెహోవాను ప్రార్థించాలి. ఆయన యెరూషలేమును మరల ఒక పట్టణంగా చేసేంతవరకు యెహోవాకు ప్రార్థించండి.
    భూమిమీద ప్రజలంతా పొగడే పట్టణంగా ఆయన యెరూషలేమును చేసేంత వరకు యెహోవాకు ప్రార్థించండి.

యెహోవా ఒక వాగ్దానం చేశాడు. యెహోవా తన స్వంత శక్తిని రుజువుగా వినియోగించి ఆ వాగ్దానం చేశాడు.
    ఆ వాగ్దానాన్ని నిలుపుకొనేందుకు యెహోవా తన శక్తిని ప్రయోగిస్తాడు.
యెహోవా చెప్పాడు, “మీ ఆహారాన్ని మరెన్నడూ మీ శత్రువులకు ఇవ్వనని నేను వాగ్దానం చెస్తున్నాను.
    మీరు తయారు చేసే మీ ద్రాక్షరసాన్ని మీ శత్రువులు ఎన్నటికీ తీసుకోరని నేను వాగ్దానం చేస్తున్నాను.
ఆహారం కూర్చుకొనేవాడు దానిని తింటాడు. మరియు ఆ వ్యక్తి యెహోవాను స్తుతిస్తాడు.
    ద్రాక్షపండ్లను కూర్చుకొనేవాడు ఆ ద్రాక్షపండ్ల రసం త్రాగుతాడు. ఈ సంగతులన్నీ నా పవిత్రదేశంలో జరుగుతాయి.”

10 గుమ్మాలద్వారా రండి,
    ప్రజలకు దారి సరళం చేయండి.
మార్గం సిద్ధం చేయండి!
    మార్గంలోని రాళ్లన్నీ తీసివేయండి.
ప్రజలకు గుర్తుగా పతాకం ఎగురవేయండి!

11 వినండి, దూర దేశాల ప్రజలందరితో యెహోవా మాట్లాడుతున్నాడు:
“సీయోను ప్రజలకు చెప్పండి.
    చూడండి, మీ రక్షకుడు వస్తున్నాడు.
    ఆయన మీ బహుమానం మీ కోసం తెస్తున్నాడు.
    ఆయన ఆ బహుమానాన్ని తనతో కూడ తెస్తున్నాడు.”
12 ఆయన ప్రజలు, “పరిశుద్ధ ప్రజలు”
    “విమోచించబడిన యెహోవా ప్రజలు” అని పిలువబడతారు.
“దేవుడు కోరే పట్టణం” “దేవుడు తోడుగా ఉన్న పట్టణం”
    అని యెరూషలేము పిలువబడుతుంది.

యెహోవా తన జనాంగాన్ని శిక్షిస్తాడు

63 ఎదోమునుండి వస్తున్న ఇతడు ఎవరు?
ఎర్రటి వస్త్రాలు ధరించి బొస్రానుండి అతడు వస్తున్నాడు.
    అతడు తన వస్త్రాల్లో శోభిల్లుతున్నాడు.
అతడు మహా శక్తితో అతిశయంగా నడుస్తున్నాడు.
    “మిమ్మల్ని రక్షించే శక్తి నాకు ఉంది. నేను నిజాయితీగా మాట్లాడుచున్నాను”
    అని అతడు చెబుతున్నాడు.

“నీ వస్త్రాలు ఎందుకు అంత మరీ ఎర్రగా ఉన్నాయి?
    ద్రాక్షపండ్ల నుండి ద్రాక్షరసం చేసే వానిలా ఎర్రగా ఉన్నాయెందుకు నీ వస్త్రాలు?”

అతడు జవాబిస్తున్నాడు, “నా మట్టుకు నేను ద్రాక్షగానుగలో నడిచాను.
    నాకు ఎవ్వరూ సహాయం చేయలేదు.
నాకు కోపం వచ్చింది, ద్రాక్షపండ్ల మీద నడిచాను.
    ద్రాక్ష పండ్ల రసం నా బట్టలమీద చిమ్మింది. కనుక ఇప్పుడు నా బట్టలు మైలపడ్డాయి.
ప్రజలను శిక్షించుటకు నేను ఒక సమయం ఏర్పరచుకొన్నాను.
    నా ప్రజలను నేను రక్షించి, కాపాడవలసిన సమయం ఇప్పుడు వచ్చింది.
చుట్టూ కలియజూశాను, కానీ నాకు సహాయం చేసేవాడు ఒక్కడూ నాకు కనబడలేదు.
    నన్ను ఒక్కరూ బలపర్చకపోవటం నాకు ఆశ్చర్యం కలిగించింది.
కనుక నా ప్రజలను రక్షించుటకు నా స్వంత శక్తి నేను ప్రయోగించాను.
    నా కోపమే నాకు బలం ఇచ్చింది.
నేను కోపంగా ఉన్నప్పుడు, నేను ప్రజల మీద నడిచాను.
    నాకు వెర్రికోపం వచ్చినప్పుడు నేను వారిని శిక్షించాను. నేను వారి రక్తం నేలమీద ఒలకబోశాను.”

యెహోవా తన ప్రజల ఎడల దయ చూపిస్తూ ఉన్నాడు

యెహోవా దయగలవాడు అని నేను జ్ఞాపకం చేసుకొంటాను.
    మరియు యెహోవాను స్తుతించటం నేను జ్ఞాపకం చేసుకొంటాను.
ఇశ్రాయేలు వంశానికి యెహోవా అనేకమైన మంచివాటిని ఇచ్చాడు.
యెహోవా మా యెడల చాలా దయచూపించాడు.
    యెహోవా మా యెడల కరుణ చూపించాడు.
“వీరు నా పిల్లలు. ఈ పిల్లలు అబద్ధమాడరు”
    అని యెహోవా చెప్పాడు.
కనుక యెహోవా ఈ ప్రజలను రక్షించాడు.
ప్రజలకు చాలా కష్టాలు వచ్చాయి.
    కానీ యెహోవా వారికి విరోధంగా లేడు.
యెహోవా ప్రజలను ప్రేమించాడు. వారిని గూర్చి ఆయన విచారించాడు.
    కనుక యెహోవా ప్రజలను రక్షించాడు.
వారిని రక్షించేందుకు ఆయన తన ప్రత్యేక దేవదూతను పంపించాడు.
    మరియు యెహోవా ఆ ప్రజలను గూర్చి శ్రద్ధ తీసుకోవటం శాశ్వతంగా కొనసాగిస్తాడు. ఆ ప్రజలను గూర్చి శ్రద్ధ తీసుకోవటం ఎన్నడైనా చాలించాలని యెహోవా కోరలేదు.
10 అయితే ప్రజలు యెహోవాకు విరోధం అయ్యారు.
    ఆయన పరిశుద్ధాత్మను ప్రజలు చాలా దుఃఖపర్చారు.
అందుచేత యెహోవా వారికి శత్రువు అయ్యాడు.
    యెహోవా ఆ ప్రజలకు విరోధంగా పోరాడాడు.

11 కానీ యెహోవా చాలా పూర్వకాలాన జరిగినదాన్ని ఇంకా జ్ఞాపకం ఉంచుకొంటాడు.
    మోషే, అతని ప్రజలూ యెహోవాకు జ్ఞాపకం.
సముద్రంలోనుండి ప్రజలను బయటకు తీసుకొనివచ్చిన వాడు యెహోవాయే.
    యెహోవా తన మందను (ప్రజలను) నడిపించటానికి తన కాపరులను (ప్రవక్తలను) వాడుకొన్నాడు.
అయితే మోషేలో తన ఆత్మను ఉంచిన ఆ యెహోవా ఇప్పుడు ఎక్కడ?
12 యెహోవా తన కుడిచేత మోషేను నడిపించాడు. మోషేను నడిపించుటకుగాను యెహోవా తన అద్భుత శక్తిని ఉపయోగించాడు.
ప్రజలు సముద్రంలోనుండి నడువగలిగేట్టు
    యెహోవా నీళ్లను పాయలు చేశాడు.
ఈ గొప్ప కార్యాలు చేయటం వల్ల
    యెహోవా తన నామాన్ని ప్రఖ్యాతి చేసుకొన్నాడు.
13 లోతైన సముద్రాల మధ్యనుండి తన ప్రజలను యెహోవా నడిపించాడు.
    ప్రజలు పడిపోకుండా నడిచారు.
    అరణ్యంలో గుర్రం నడచినట్టు వారు నడిచారు.
14 ఒక ఆవు ఊరికే పొలంలో నడుస్తూ పడిపోదు.
    అదేవిధంగా ప్రజలు సముద్రంలోనుండి వెళ్తూ పడిపోలేదు.
    ఒక విశ్రాంతి స్థలానికి ప్రజలను యెహోవా ఆత్మ నడిపించాడు.
అంతవరకు ప్రజలు క్షేమంగా ఉన్నారు. యెహోవా, నీవు నీ ప్రజలను నడిపించిన విధం అది.
    ప్రజలను నీవు నడిపించావు, నీ నామాన్ని నీవు ఆశ్చర్యకరమైనదిగా చేసుకొన్నావు.

తన ప్రజలకు సహాయం చేయమని దేవునికొక ప్రార్థన

15 యెహోవా, పరలోకము నుండి చూడుము.
    ఇప్పుడు జరుగుతున్న సంగతులు చూడుము.
పరలోకంలో ఉన్న నీ మహాగొప్ప పవిత్ర నివాసంనుండి క్రిందనున్న మమ్మల్ని చూడుము.
    మా మీద నీ బలమైన ప్రేమ ఏది?
    నీ అంతరంగంలో నుండి బయలువెడలే నీ శక్తివంతమైన కార్యాలు ఏవి?
    నామీద నీ కరుణ ఏది? నామీద నీ దయగల ప్రేమను ఎందుకు దాచిపెడ్తున్నావు?
16 చూడు, నీవు మా తండ్రివి!
    మేము అబ్రాహాము పిల్లలమని అతనికి తెలియదు.
    ఇశ్రాయేలు (యాకోబు) మమ్మల్ని గుర్తించలేడు.
యెహోవా, నీవు మా తండ్రివి.
    మమ్మల్ని ఎల్లప్పుడూ రక్షించినవాడవు నీవే.
17 యెహోవా, నీవు మమ్మల్ని నీ దగ్గర్నుండి ఎందుకు త్రోసివేస్తున్నావు?
    మేము నిన్ను అనుసరించటం మాకు కష్టతరంగా నీవెందుకు చేస్తున్నావు?
యెహోవా, మా దగ్గరకు తిరిగి రమ్ము.
    మేము నీ సేవకులం.
మా దగ్గరకు వచ్చి మాకు సహాయం చేయి.
    మా కుటుంబాలు నీకు చెందినవి.
18 నీ పరిశుద్ధ ప్రజలకు ఇప్పుడు చాలా కష్టాలు వచ్చాయి.
    మా శత్రువులు నీ పరిశుద్ధ ఆలయం మీద నడుస్తున్నారు.
19 కొందరు మనుష్యులు నిన్ను వెంబడించరు.
    ఆ ప్రజలు నీ నామం ధరించరు.
మరియు మేము ఆ ప్రజల్లాగే ఉన్నాము.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International