Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెషయా 49-53

దేవుడు తన ప్రత్యేక సేవకుణ్ణి పిలవడం

49 దూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలారా, మీరంతా నామాట వినండి!
    భూమి మీద నివసిస్తున్న ప్రజలారా, మీరంతా వినండి!
నేను పుట్టక మునుపే యెహోవా నన్ను తన సేవకోసం పిలిచాడు.
    నేను నా తల్లి గర్భంలో ఉండగానే యెహోవా నాకు పేరు పెట్టాడు.
తన పక్షంగా మాట్లాడేందుకు యెహోవా నన్ను వాడుకొంటాడు.
పదునైన ఖడ్గాన్ని ఒక సైనికుడు వాడుకొన్నట్టు ఆయన నన్ను వాడుకొంటాడు.
    అయితే ఆయన నన్ను తన చేతిలో దాచిఉంచి కాపాడుతాడు కూడాను.
వాడిగల బాణంలా యెహోవా నన్ను వాడుకొంటాడు.
    అయితే ఆయన నన్ను తన బాణాల పొదిలో దాచి ఉంచుతాడు కూడాను.

“ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడివి.
    నీతో నేను అద్భుత కార్యాలు చేస్తాను” అని యెహోవా నాతో చెప్పాడు.

నేను చెప్పాను, “వట్టిగానే నేను కష్టపడి పనిచేశాను.
    నేను చాలా అలసిపోయాను. కాని ప్రయోజనకరమైనది ఏమీ నేను చేయలేదు.
నా శక్తి అంతటిని ఉపయోగించాను. కానీ వాస్తవానికి నేను చేసింది ఏమీ లేదు.
కనుక నా విషయం ఏమి చేయాలో యెహోవాయే నిర్ణయించాలి.
    దేవుడే నా బహుమానం నిర్ణయించాలి.
నా తల్లి గర్భంలో యెహోవా నన్ను చేసాడు.
    నేను ఆయన సేవకునిగా ఉండుటకు ఆయన అలా చేసాడు.
    యాకోబును, ఇశ్రాయేలును నేను తిరిగి ఆయన దగ్గరకు నడిపించునట్లు ఆయన నన్ను అలా చేసాడు.
యెహోవా నన్ను సన్మానిస్తాడు.
    నా దేవుని నుండి నేను నా బలం పొందుతాను.”

యెహోవా నాతో చెప్పాడు, “నీవు నాకు చాలా ప్రాముఖ్యమైన సేవకుడివి.
    ఇశ్రాయేలు ప్రజలు ఖైదీలు. వారు తిరిగి నా వద్దకు తీసుకొని రాబడతారు.
అప్పుడు యాకోబు కుటుంబ దళాలు తిరిగి నా వద్దకు వస్తారు.
అయితే నీకు మరో పని ఉంది; అది దీనికంటె ఇంకా ముఖ్యమయింది.
    సమస్త రాజ్యాలకు నిన్ను నేను వెలుగుగా చేస్తాను,
    భూమిమీద మనుష్యులందరినీ రక్షించేందుకు నీవే నా మార్గంగా ఉంటావు.”

యెహోవా, ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు. ఇశ్రాయేలును కాపాడుతాడు. మరియు యెహోవా చెబుతున్నాడు, “నా సేవకుడు దీనుడు.
    అతడు పాలకులను సేవిస్తాడు. ప్రజలు అతన్ని ద్వేషిస్తారు.
    కానీ రాజులు అతన్ని చూచి, అతడ్ని సన్మానించేందుకు నిలబడతారు.
    మహానాయకులు అతని ఎదుట సాగిలపడతారు.”

ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు, యెహోవా కోరినందుచేత ఇది జరుగుతుంది. మరియు యెహోవా నమ్మదగినవాడు. నిన్ను కోరుకొన్నవాడు ఆయనే.

రక్షణ దినం

యెహోవా చెబుతున్నాడు:
“సరైన సమయంలో నేను నీకు దయను చూపిస్తాను.
    ఆ సమయమందు నీ ప్రార్థనలకు జవాబు ఇస్తాను.
రక్షణ దినాన నేను నీకు సహాయం చేస్తాను,
    నేను నిన్ను కాపాడుతాను.
    ప్రజలతో నాకు ఒక ఒడంబడిక ఉంది అనేందుకు మీరు ఒక నిదర్శనం.
ఇప్పుడైతే దేశం నాశనం చేయబడింది,
    అయితే మీరు దేశాన్ని తిరిగి దాని స్వంత దారులకు ఇచ్చివేస్తారు.
‘చెరలోనుండి బయటకు వచ్చేయండి’
    అని ఖైదీలతో మీరు చెబుతారు.
‘చీకటిలోనుండి బయటకు వచ్చేయండి’
    అని చీకటిలో ఉన్న ప్రజలతో మీరు చెబుతారు.
ప్రజలు పయనిస్తూ భోజనం చేస్తారు.
    ఖాళీ కొండలమీద కూడా వారికి భోజనం ఉంటుంది.
10 ప్రజలు ఆకలితో ఉండరు. వారు దాహంతో ఉండరు.
    సూర్యుని వేడి గాల్పులు వారికి హానిచేయవు.
ఎందుకంటే, వారిని ఆదరించే వాడు (దేవుడు) వారిని నడిపిస్తాడు గనుక.
    ప్రజలను నీటి ఊటలు దగ్గరకు ఆయన నడిపిస్తాడు.
11 నా ప్రజలకు నేను బాట వేస్తాను.
    పర్వతాలు సమతలం చేయబడతాయి.
    పల్లపు తోవలు ఎత్తు చేయబడతాయి.

12 “చూడండి! చాలా దూర ప్రదేశాల నుండి ప్రజలు నా దగ్గరకు వస్తున్నారు.
    ఉత్తరం నుండి, పశ్చిమం నుండి ప్రజలు వస్తున్నారు.
    ఈజిప్టులోని అస్వాను నుండి ప్రజలు వస్తున్నారు.”

13 భూమి, ఆకాశములారా సంతోషించండి.
    పర్వతములారా, ఆనందంగా కేకలు వేయండి.
ఎందుకంటే, యెహోవా తన ప్రజలను ఆదరిస్తాడు గనుక.
    తన దీన జనులకు యెహోవా దయచూపిస్తాడు.

14 కానీ ఇప్పుడు సీయోను అంటుంది, “యెహోవా నన్ను విడిచిపెట్టాడు.
    నా యజమాని నన్ను మరిచిపోయాడు” అని.

15 అయితే నేనంటాను,
“ఓ స్త్రీ తన శిశువును మరచిపోగలదా? లేదు.
    తన గర్భంనుండి వచ్చిన శిశువును ఒక స్త్రీ మరువగలదా? లేదు.
ఒక స్త్రీ తన పిల్లలను మరువజాలదు.
    మరి నేను (యెహోవాను) మిమ్ములను మరువజాలను.
16 చూడు, నేను నీ పేరు నా చేతి మీద వ్రాసుకొన్నాను.
    ఎల్లప్పుడు నేను నిన్నుగూర్చి తలుస్తాను.
17 నీ పిల్లలు నీ దగ్గరకు తిరిగివస్తారు.
    ప్రజలు నిన్ను ఓడించారు, కానీ ఆ ప్రజలు నిన్ను ఒంటరిగా విడుస్తారు.”
18 పైకి చూడు! నీ చుట్టూ చూడు!
    నీ పిల్లలు అందరూ సమావేశమై నీ దగ్గరకు వస్తున్నారు.
యెహోవా చెబుతున్నాడు:
“నేను సజీవంగా ఉన్నాను, నేను మీకు ఈ వాగ్దానం చేస్తున్నాను:
    నీ పిల్లలు నీకు కంఠహారంగా ఉంటారు.
    పెండ్లి కుమార్తె ధరించే ఒడ్డాణంలా నీ పిల్లలు ఉంటారు.

19 “ఇప్పుడైతే నీవు ఓడించబడి, నాశనం చేయబడి ఉన్నావు.
    నీ భూమి నిష్ప్రయోజనం.
అయితే కొంతకాలం తర్వాత నీ దేశంలో ఎందరెందరో మనుష్యులు ఉంటారు.
    నిన్ను నాశనం చేసిన ఆ మనుష్యులు చాలా చాలా దూరంగా ఉంటారు.
20 నీవు పోగొట్టుకున్న పిల్లలకోసం నీవు విచారంగా ఉన్నావు. అయితే ఆ పిల్లలు,
    ‘ఈ స్థలం మేము నివసించేందుకు చాలా చిన్నదిగా ఉంది.
    మేము నివసించేందుకు పెద్ద స్థలం ఇవ్వు’ అని నీతో చెబుతారు.
21 అప్పుడు నీలో నీవు అనుకొంటావు,
    ‘ఈ పిల్లలందర్నీ నాకు ఎవరు ఇచ్చారు?
ఇది చాలా బాగుంది. నేను విచారంగా, ఒంటరిగా ఉన్నాను.
    నేను ఓడించబడి, నా ప్రజలకు దూరమయ్యాను.
    అందుచేత ఈ పిల్లలను నాకిచ్చింది ఎవరు?
చూడు, నేను ఒంటరిగా విడువబడ్డాను.
    ఈ పిల్లలంతా ఎక్కడనుండి వచ్చారు?’”

22 నా ప్రభువు యెహోవా చెబుతున్నాడు,
“చూడు, రాజ్యాలకు నేను నా చేయి ఊపుతాను.
    ప్రజలందరూ చూడగలిగేట్టు నేను నా పతాకాన్ని ఎగురవేస్తాను.
అప్పుడు ఆ ప్రజలు నీ పిల్లలను నీ దగ్గరకు తీసుకొని వస్తారు.
    ఆ ప్రజలు నీ పిల్లలను వారి భుజాలమీద ఎత్తుకొంటారు,
    మరియు వారు తమ చేతుల్లో వారిని పట్టు కొంటారు.
23 నీ పిల్లలకు రాజులు ఉపాధ్యాయులుగా ఉంటారు.
    రాజకుమార్తెలు ఆ పిల్లల విషయమై శ్రద్ధ పుచ్చుకొంటారు.
రాజులు, వారి కుమార్తెలు నీ ఎదుట సాష్టాంగపడ్తారు.
    నీ పాదాల క్రింద ధూళిని వారు ముద్దు పెట్టుకొంటారు.
అప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకొంటావు.
    నా యందు విశ్వాసం ఉంచే వాడెవడూ నిరాశచెందడని నీవు తెలుసుకొంటావు.”

24 బలమైన సైనికుడు ఒకడు యుద్ధంలో గనుక ఐశ్వర్యం గెలుచుకొంటే
    ఆ ఐశ్వర్యాన్ని అతని దగ్గర్నుండి నీవు తీసుకోలేవు.
బలమైన సైనికుడు ఒక ఖైదీకి కాపలా ఉంటే
    ఆ ఖైదీ తప్పించుకోలేడు.
25 అయితే యెహోవా చెబుతున్నాడు,
“బలమైన సైనికుని దగ్గర్నుండి ఖైదీలు తప్పించబడతారు.
    ఆ ఖైదీలు తప్పించుకొంటారు. ఇది ఎలా జరుగుతుంది?
నీ యుద్ధాలు నేను పోరాడుతాను
    నీ పిల్లల్ని నేను రక్షిస్తాను.
26 స్వంత శరీరాన్ని తినేట్టుగా, మిమ్నల్ని కష్టపెట్టే వారిని నేను బలవంతం చేస్తాను.
    వారి రక్తమే వారిని మత్తెక్కించే ద్రాక్షరసం అవుతుంది.
అప్పుడు నేను మిమ్మల్ని రక్షించే యెహోవానని ప్రతి ఒక్కరు తెలుసుకొంటారు.
    యాకోబు యొక్క మహా శక్తిమంతుడే మిమ్మల్ని రక్షించే వాడు అని మనుష్యులందరూ తెలుసుకొంటారు.”

పాపం చేసినందువల్ల ఇశ్రాయేలు శిక్షించబడింది

50 యెహోవా చెబుతున్నాడు:
“ఇశ్రాయేలు ప్రజలారా, మీ తల్లి యెరూషలేముకు నేను విడాకులిచ్చానని మీరంటున్నారు.
    అయితే ఆమెను నేను విడనానట్లు నిదర్శన కాయితాలు ఏయి?
నా పిల్లలారా, ఎవరికైనా నేను డబ్బు రుణం ఉన్నానా?
    అప్పు తీర్చటానికి నేను మిమ్నల్ని అమ్ముకొన్నానా?
లేదు. చూడండి, మీరు చేసిన చెడ్డ పనుల మూలంగానే నేను మిమ్మల్ని విడిచి పెట్టేసాను.
    మీ తల్లి (యెరూషలేము) చేసిన చెడ్డ పనుల వల్లనే ఆమెను నేను పంపివేశాను.
నేను ఇంటికి వచ్చాను, ఎవరూ కనబడలేదు.
    నేను పిలిచి, పిలిచి, ఎంత పిలిచినా ఎవరూ పలుక లేదు.
నేను మిమ్మల్ని రక్షించలేనని మీరు తలుస్తున్నారా?
    మీ కష్టాలనుండి మిమ్మును రక్షించే శక్తినాకు ఉంది.
చూడండి, సముద్రాన్ని ఎండి పొమ్మని నేను ఆజ్ఞాపిస్తే అది ఎండిపోతుంది!
    అక్కడ నీళ్లు ఉండవు గనుక చేపలు చస్తాయి, అవి కుళ్లిపోతాయి.
ఆకాశాన్ని నేను చీకటి కమ్మివేసేలా చేయగలను.
    విచార వస్త్రాల్లా ఆకాశం నల్లగా అవుతుంది.”

దేవుని సేవకుడు దేవుని మీద ఆధారపడతాడు

ఉపదేశం చేయగల సామర్థ్యాన్ని నా ప్రభువైన యెహోవా నాకు ఇచ్చాడు. కనుక ఈ విచారగ్రస్థ ప్రజలకు ఇప్పుడు నేను ఉపదేశము చేస్తాను. ప్రతి ఉదయం ఆయన నన్ను మేల్కొలిపి, ఒక విద్యార్థిలా నాకు ఉపదేశిస్తాడు. నేను నేర్చుకొనేందుకు నా ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తాడు. మరియు నేను ఆయన మీద తిరుగబడలేదు. నేను ఆయనను వెంబడించటం మానను. నేను ఆ ప్రజల్ని నన్ను కొట్టనిస్తాను. వాళ్లను నా గడ్డం పీకనిస్తాను. వాళ్లు నన్ను చెడ్డ మాటలు తిట్టి, నా మీద ఉమ్మి వేసినప్పుడు నేను నా ముఖం దాచుకోను. నా ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తాడు. కనుక వారు చెప్పే చెడ్డ మాటలు నాకు హాని కలిగించవు. నేను బలవంతుడనై ఉంటాను. నేను నిరాశ చెందనని నాకు తెలుసు.

యెహోవా నాతో ఉన్నాడు. నేను నిర్దోషినని ఆయనకు తెలుసును. కనుక నేను దోషినని ఎవరూ చూపించలేరు. నాదే తప్పు అని ఎవరైనా రుజువు చేయాలనుకొంటే, ఆ వ్యక్తి నా దగ్గరకు రావాలి. మేము ఒక తీర్పు జరిగిస్తాం. అయితే చూడండి, నా ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తాడు. అందుచేత నేను చెడ్డవాడినని ఎవ్వరూ చూపించలేరు. అలాంటి వాళ్లంతా పనికిమాలిన గుడ్డల్లా అవుతారు. వాటిని చెదలు తినేస్తాయి.

10 యెహోవాను గౌరవించే ప్రజలు ఆయన సేవకుని మాటకూడా వింటారు. ఆ సేవకుడు ఏం జరుగుతుందో తెలియకుండానే సంపూర్ణంగా దేవుణ్ణి నమ్ముకొని జీవిస్తాడు. అతడు వాస్తవంగా యెహోవా నామాన్నే నమ్ముకొంటాడు, మరియు ఆ సేవకుడు తన దేవుని మీద ఆధారపడతాడు.

11 “ప్రజలారా, చూడండి, మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా జీవించాలనుకొంటున్నారు. మీ మంటలను, జ్వాలలను మీరే అంటిస్తున్నారు. అలానే, మీ దారిన మీరు జీవిస్తున్నారు. కానీ మీరు శిక్షించబడతారు. మీరు మీ మంటల్లో, జ్వాలల్లో పడతారు, మీరు కాల్చివేయబడుతారు. అలా జరిగేట్టు నేను చేస్తాను.

ఇశ్రాయేలు అబ్రాహాము వలె ఉండాలి

51 “మీలో కొంతమంది ప్రజలు మంచి జీవితాలు జీవించాలని కష్టపడి ప్రయత్నిస్తారు. సహాయంకోసం మీరు యెహోవా దగ్గరకు వెళ్తారు. నా మాట వినండి. మీ తండ్రి అబ్రాహామును మీరు చూడాలి. మీరు ఏ బండనుండి చెక్కబడ్డారో, ఆ బండ ఆయనే. అబ్రాహాము మీ తండ్రి, మీరు ఆయన్ని చూడాలి. మీకు జన్మనిచ్చిన మాతృమూర్తి శారాను మీరు చూడాలి. అబ్రాహామును నేను పిలిచినప్పుడు అతడు ఒంటరిగా ఉన్నాడు. అప్పుడు నేను అతణ్ణి ఆశీర్వదించాను, అతడు ఒకగొప్ప వంశాన్ని ప్రారంభించాడు. అనేకానేక మంది అతనినుండి ఉద్భవించారు.”

అదే విధంగా సీయోనును[a] యెహోవా ఆశీర్వదిస్తాడు. ఆమెను గూర్చి, ఆమె ప్రజలను గూర్చి యెహోవా విచారించి, ఆమెకోసం ఒక గొప్ప కార్యం చేస్తాడు. అరణ్యాన్ని యెహోవా మార్చేస్తాడు. అరణ్యం ఏదెను వనంలా ఒక వనం అయిపోతుంది. ఆ దేశం ఖాళీగా ఉంది గాని అది యెహోవా తోటలా తయారవుతుంది. అక్కడ ప్రజలు సంతోషంగా ఉంటారు. అక్కడ ప్రజలు వారి ఆనందాన్ని ప్రదర్శిస్తారు. కృతజ్ఞత, విజయాలను గూర్చి వారు పాటలు పాడుతారు.

“నా ప్రజలారా, నా మాట వినండి!
    ప్రజలు ఎలా జీవించాలో అది వారికి చూపించే దీపాల్లాంటివి నా నిర్ణయాలు.
నేను న్యాయవంతుడనని త్వరలోనే నేను చూపిస్తాను. త్వరలోనే నేను నిన్ను రక్షిస్తాను.
    నేను నా శక్తిని ప్రయోగించి, రాజ్యాలన్నింటికి తీర్పు తీరుస్తాను.
దూర ప్రదేశాలన్నీ నాకోసం కనిపెట్టుకొని ఉన్నాయి.
    నా శక్తి వారికి సహాయం చేయాలని అవి కనిపెట్టుకొని ఉన్నాయి.
ఆకాశాలవైపు చూడండి.
    మీ చుట్టూ క్రింద ఉన్న భూమిని చూడండి.
ఆకాశాలు పొగ మేఘాల్లా మాయమైపోతాయి.
    భూమి పనికి మాలిన పాత గుడ్డల్లా అవుతుంది.
భూమి మీద మనుష్యులు మరణిస్తారు.
    అయితే నా రక్షణ శాశ్వతంగా కొనసాగుతుంది.
    నా దయ ఎప్పటికీ అంతంకాదు.
దయను అవగాహన చేసికొనే ప్రజలారా, మీరు నా మాట వినాలి.
    నా ఉపదేశాలను పాటించే ప్రజలారా నేను చెప్పే మాటలు మీరు వినాలి.
దుష్ట ప్రజలు విషయం భయపడకండి.
    వారు మీకు చెప్పే చెడ్డ విషయాలను గూర్చి భయపడకండి.
ఎందుకంటే వారు పాత గుడ్డల్లా ఉంటారు గనుక. చిమ్మెటలు వాటిని తినివేస్తాయి.
    వారు గొర్రెబొచ్చులా ఉంటారు. పురుగులు వాటిని తినివేస్తాయి.
అయితే నా దయ శాశ్వతంగా కొనసాగుతుంది.
    నా రక్షణ శాశ్వతంగా సదా కొనసాగుతుంది.”

దేవుని స్వంత శక్తి తన ప్రజలను రక్షిస్తుంది

యెహోవా హస్తమా (శక్తి) మేలుకో!
    మేలుకో! నీ బలం సిద్ధం చేయి.
చాలాకాలం క్రిందట నీవు చేసినట్టు పూర్వకాలాల్లో నీవు చేసినట్టు నీ బలాన్ని ప్రయోగించు.
    రాహాబును ఓడించిన శక్తి నీవే. మకరాన్ని నీవే ఓడించావు.
10 సముద్రం ఎండిపోయేట్టు నీవే చేశావు. మహా అగాధ జలాలను ఎండిపోయేట్టు నీవు చేశావు.
    సముద్రపు అతి లోతైన స్థలాలను నీవు త్రోవగా చేశావు.
    నీ ప్రజలు ఆ మార్గాన వెళ్లి రక్షించబడ్డారు.
11 యెహోవా తన ప్రజలను రక్షిస్తాడు.
    వారు ఆనందంగా సీయోనుకు తిరిగి వస్తారు.
వారు ఎంతో ఎంతో సంతోషంగా ఉంటారు.
    వారి ఆనందం వారి తలలమీద శాశ్వత కిరీటంలా ఉంటుంది.
ఆనందంతో వారు పాటలు పాడుతూంటారు.
    దుఃఖం అంతా దూరమైపోతుంది.

12 యెహోవా చెబుతున్నాడు, “నిన్ను ఆదరించే వాడను నేనే.
    కనుక ఇతరులను గూర్చి నీవెందుకు భయపడాలి?
    వాళ్లు కేవలం బ్రతికి, చచ్చే మనుష్యులు మాత్రమే. వాళ్లు కేవలం మానవ మాత్రులు. వారు కూడా గడ్డిలాగే చస్తారు.”

13 యెహోవా మిమ్మల్ని చేశాడు.
తన శక్తితో ఆయన భూమిని చేశాడు.
    తన శక్తితో ఆకాశాలను భూమికి పైగా ఆయన విస్తరింపజేసాడు.
కానీ ఆయనను, ఆయన శక్తిని మీరు మరచిపోతారు.
    కనుక మీకు హాని చేసే కోపిష్ఠులైన మనుష్యులను గూర్చి ఎల్లప్పుడు మీరు భయపడుతుంటారు.
ఆ మనుష్యులు మిమ్మును నాశనం చేయాలని పథకం వేసారు.
    కానీ ఇప్పుడు వాళ్లెక్కడ? వాళ్లంతా పోయారు.

14 చెరసాలలోని మనుష్యులు త్వరలోనే విడుదల చేయబడతారు.
    వాళ్లు చెరసాలలోనే మరణించి, కుళ్లిపోరు.
    ఆ మనుష్యులకు సరిపడినంత ఆహారం ఉంటుంది.

15 “నేను యెహోవాను, మీ దేవుడను.
    నేను సముద్రాన్ని కదలిస్తాను, కెరటాలు పుట్టిస్తాను.”
(ఆయన పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా.)

16 “నా సేవకా, నీవు చెప్పాలని నేను కోరే మాటలను నేనే నీకు ఇస్తాను. నా చేతులతో నిన్ను నేను కప్పిఉంచి కాపాడుతాను. క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని చేసేందుకు నిన్ను నేను ఉపయోగించుకొంటాను. ‘మీరు నా ప్రజలు అని ఇశ్రాయేలుతో చెప్పేందుకు నిన్ను నేను వాడుకొంటాను.’”

ఇశ్రాయేలును దేవుడు శిక్షించాడు

17 మేలుకో! మేలుకో!
    యెరూషలేమా, లెమ్ము!
నీ మీద యెహోవా చాలా కోపగించాడు.
    అందువల్ల నీవు శిక్షించబడ్డావు.
నీవు తాగాల్సిన ఒక విషపుపాత్రలా ఉంది ఆ శిక్ష.
    నీవు దానిని తాగావు.

18 యెరూషలేముకు చాలామంది ప్రజలు ఉన్నారు. కానీ వారిలో ఎవ్వరూ ఆమెకు నాయకులు కాలేదు. ఆమె పెంచిన పిల్లలు ఎవ్వరు ఆమెను నడిపించే మార్గదర్శులు కాలేదు. 19 యెరూషలేముకు జంట జంటలుగా కష్టాలు వచ్చాయి, దొంగిలించటం, చొరబడటం, మహా ఆకలిపోరాటం. నీవు శ్రమ అనుభవిస్తున్నప్పుడు నీకు ఎవ్వరూ సహాయం చేయలేదు.

ఎవరూ నీ మీద దయచూపించలేదు. 20 నీ ప్రజలు బలహీనులయ్యారు. వారు నేలమీద పడి, అలానే ఉండిపోయారు. ప్రతి వీధిమలుపులోను వారు పడివున్నారు. వారు వలలో పట్టబడిన జంతువుల్లా ఉన్నారు. వారు ఇంకెంత మాత్రం భరించలేనంతగా, యెహోవా కోపంచేత శిక్షించబడ్డారు. దేవుడు వారికి ఇంకా ఎక్కువ శిక్ష విధిస్తాను అన్నప్పుడు వారు మరీ బలహీనులై పోయారు.

21 అయ్యో, యెరూషలేమూ, నా మాట విను. ఒక త్రాగుబోతువానిలా నీవు బలహీనంగా ఉన్నావు, కానీ నీవు ద్రాక్షరసం తాగినందుచేత కాదు మత్తుగా ఉన్నది. నీవు ఆ “విషపు పాత్ర” మూలంగా బలహీనంగా ఉన్నావు.

22 నీ దేవుడు, యజమానియైన యెహోవా తన ప్రజలకోసం పోరాడుతాడు. ఆయన నీతో ఇలా అంటున్నాడు: “చూడు, ఈ ‘విషపు పాత్రను’ (శిక్షను) నీ వద్దనుండి నేను తొలగించి వేస్తున్నాను. నీ మీద నా కోపాన్ని తీసివేస్తున్నాను. ఇంకెంత మాత్రం నీవు నా కోపం మూలంగా శిక్షించబడవు. 23 నీకు హాని చేసిన వారిని శిక్షించటానికి ఇప్పుడు నేను నా కోపాన్ని వినియోగిస్తాను. ఆ ప్రజలు నిన్ను చంపటానికి ప్రయత్నించారు. ‘మా యెదుట, సాష్టాంగపడు, మేము నీ మీద నడుస్తాం’ అని వారు నీతో చెప్పారు. వాళ్ల ముందు సాష్టాంగ పడేట్టు వారు నిన్ను బలవంతం చేశారు. అప్పుడు ఆ మనుష్యులు నడుచుటకు నీ వీపును ధూళిగా చేశారు. వారు ప్రయాణం చేయుటకు నీవు ఒక తోవలా ఉన్నావు.”

ఇశ్రాయేలు రక్షించబడుతుంది

52 మేలుకో! మేలుకో!
    సీయోనూ మేలుకో. నీవు వస్త్రాలు ధరించు.
నీ బలంతొడుగుకో. పవిత్ర యెరూషలేమా, నిలుచో!
    దేవుణ్ణి వెంబడించేందుకు ఒప్పు కొని ప్రజలు,[b]
    పవిత్రంగా లేని ప్రజలు నీలో మరల ప్రవేశింపరు.
ధూళి దులిపివేయి! అద్భుతమైన నీ వస్త్రాలు ధరించు!
సీయోను కుమారీ, యెరూషలేమా, నీవు ఒక ఖైదీవి.
    కాని ఇప్పుడు నీ మెడ చుట్టూ ఉన్న గొలుసుల నుండి నిన్ను నీవు విడుదల చేసుకో!
యెహోవా చెబుతున్నాడు,
    “నీవు డబ్బుకు అమ్మబడలేదు.
    అందుచేత డబ్బు లేకుండనే నీవు రక్షించబడతావు.”

నా ప్రభువు యెహోవా చెబుతున్నాడు: “నా ప్రజలు నివాసం ఉండేందుకు మొదట ఈజిప్టుకు దిగిపోయారు, ఆ తర్వాత వారు బానిసలయ్యారు. ఆ తర్వాత వారిని అష్షూరు బానిసలను చేసింది. ఇప్పుడు చూడండి ఏమయిందో! మరో రాజ్యాం నా ప్రజలను తీసుకొంది. నా ప్రజలను బానిసలుగా తీసుకొన్న ఆ రాజ్యం ఏది? నా ప్రజలను తీసుకొనేందుకు ఈ రాజ్యం ఏమీ చెల్లించలేదు. ఈ రాజ్యం నా ప్రజలను పాలిస్తూ, వారిని చూచి నవ్వుతుంది. ఆ మనుష్యులు ఎప్పుడూ నన్ను గూర్చి చెడ్డ మాటలే చెబుతుంటారు.”

“నా ప్రజలు నన్ను గూర్చి నేర్చుకొనేందుకు ఇది జరిగింది. నేను ఎవరినో నా ప్రజలు తెలుసుకొంటారు. నా ప్రజలు నా పేరు తెలుసుకొంటారు, ఉన్నవాడను[c] అనే నేను వారితో మాట్లాడుతున్నానని వారు తెలుసుకొంటారు” అని యెహోవా చెబుతున్నాడు.

శుభవార్తతో కొండల మీదుగా ఒక వార్తాహరుడు రావటం ఎంతో అద్భుతంగా ఉంటుంది. “శాంతి ఉంది! మేము రక్షించబడ్డాం! మీ దేవుడే రాజు!” అని ఒక వార్తాహరుడు ప్రకటించగా వినటం అద్భుతం.

పట్టణపు కావలి వాళ్లు[d] కేకలు వేయటం మొదలు పెట్టారు.
    వాళ్లంతా కలిసి ఆనందిస్తున్నారు. ఎందుకు?
ఎందుకంటే, యెహోవా సీయోనుకు[e] తిరిగి రావటం వారిలో ప్రతి ఒక్కరూ చూస్తారు.

యెరూషలేమా, నాశనం చేయబడిన నీ కట్టడాలు మరల సంతోషిస్తాయి.
మీరంతా కలిసి ఆనందిస్తారు.
    ఎందుకంటే, యెరూషలేము మీద యెహోవా దయగలిగి ఉంటాడు. యెహోవా తన ప్రజలను విమోచిస్తాడు.
10 యెహోవా తన పవిత్ర శక్తిని సకల రాజ్యాలకు చూపిస్తాడు.
    మరియు దేవుడు తన ప్రజలను ఎలా రక్షిస్తాడో అది దూర దేశాలన్నీ చూస్తాయి.

11 ప్రజలారా మీరు బబులోను విడిచిపెట్టాలి.
    ఆ స్థలం విడిచిపెట్టండి!
ఆరాధనలో ఉపయెగించే వస్తువులను మోసే మనుష్యులారా
    మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి.
    అపవిత్రమైన దేన్ని ముట్టుకోవద్దు.
12 మీరు బబులోను విడిచిపెడ్తారు.
    కానీ మీరు ఆత్రంగా విడిచిపెట్టేందుకు బలవంతం చేయబడరు.
    పారిపోయేందుకు మీరు బలవంతం చేయబడరు.
మీరు బయటకు నడుస్తారు మరియు యెహోవా మీతో నడుస్తాడు. యెహోవా మీకు ముందు ఉంటాడు.
    ఇశ్రాయేలీయుల దేవుడు మీ వెనుక ఉంటాడు.[f]

దేవుని శ్రమపడు సేవకుడు

13 “నా సేవకుని చూడు. అతనికి విజయం కలుగుతుంది. అతడు చాలా ప్రముఖుడవుతాడు. భవిష్యత్తులో ప్రజలు అతన్ని సన్మానించి, గౌరవిస్తారు. 14 కానీ చాలా మంది మనుష్యులు నా సేవకుని చూచి అదరిపోయారు. అతణ్ణి ఒక మనిషిగా వారు గుర్తించలేనంతగా అతడు బాధించబడ్డాడు. 15 కానీ అంతకంటె ఎక్కువమంది ప్రజలు ఆశ్చర్యపోతారు. రాజులు అతన్ని చూచి ఆశ్చర్యపోయి, నోట మాట రాకుండా ఉండిపోతారు. నా సేవకుని గూర్చిన కథ వారు వినలేదు – జరిగింది వారు చూశారు. ఈ ప్రజలు ఆ కథ వినలేదు గాని వారు గ్రహించారు.”

53 మేము ప్రకటించిన సంగతులను నిజంగా ఎవరు నమ్మారు? యెహోవా హస్తం ఎవరికి బయలు పరచబడింది?

యెహోవా ఎదుట ఆయన ఒక చిన్న మొక్కవలె ఉన్నాడు. ఎండిన భూమిలో ఎదుగుతున్న మొక్కవలె పెరిగాడు. మనము ఆయనలో చూడతగిన రూపముగాని తేజస్సుగాని, ఏమి లేదు. మనం ఆయనని చూడటానికి ఇష్టపడుటకు ఆయనలో ప్రత్యేకత ఏమీ మనకు కనబడదు. ఆయన నీచంగా ఎంచబడ్డాడు, మనుష్యుల చేత విడిచి పెట్టబడ్డాడు, ఆయన ఎంతో బాధ పొందిన మనిషి. రోగం బాగా ఎరిగిన వాడు. కనీసం ఆయన్ని కన్నెత్తి చూసేందుకు మనుష్యులు ముఖాన్ని దాచుకొన్నారు. ఆయన నీచంగా ఎంచబడ్డాడు. కనుక మనం ఆయన్ని లెక్కచేయలేదు.

నిశ్చయంగా ఆయన మన వ్యాధులను భరించాడు. మన బాధలను మోశాడు. అయినా, ఆయన్ని కొట్టిన వానిగాను, హింసించిన వానిగాను, బాధించిన వానిగాను, మనం తలంచాం. కాని మనం చేసిన చెడ్డ పనులకు ఆయన శ్రమపొందాల్సి వచ్చింది. మన దోషం మూలంగానే ఆయన నలుగగొట్టబడ్డాడు. మనకు సమాధాన మిచ్చిన శిక్ష ఆయన మీద పడింది. ఆయన గాయాల మూలంగా మనకు స్వస్థత కలిగింది. కానీ ఆయన ఇలా చేసిన తర్వాత కూడా మనం అందరం గోర్రెలవలె త్రోవతప్పి పోయి తిరిగాం. మనం మనకు ఇష్టమైన దారిలో పోయాం. మన అందరి దోషాన్ని యెహోవా ఆయన మీద వేశాడు.

ఆయన భాధించబడ్డాడు, శిక్షించబడ్డాడు, కానీ ఎన్నడూ ఎదురు చెప్పలేదు. వధించబడుటకు తీసుకొని పొబడే గొర్రెవలె ఆయన మౌనంగా ఉన్నాడు. ఒక గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించేటప్పుడు ఎలా మౌనంగా ఉంటుందో అలా ఆయన మౌనంగా ఉన్నాడు. తనను తాను రక్షించుకోవటానికి ఆయన నోరు తెరవలేదు. ఆయన అబద్ధపు తీర్పుపొంది, బంధించబడి తీసుకొని పోబడ్డాడు. ఆయన తరంలో ఈ విషయాలు ఎవరు మనస్సుకు తీసుకొన్నారు? ఆయన భూమిమీద నివసిస్తున్న వారిలో నుండి తొలగించబడ్డాడు. నా ప్రజల అపరాధాల కోసం ఆయన నలుగ కొట్టబడ్డాడు. ఆయన చనిపోయి ధనికునితో పాతి పెట్టబడ్డాడు. దుష్టులతో పాటు ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన దౌర్జన్యం చేయలేదు. ఆయన ఎన్నడూ మోసం చేయలేదు.

10 అయినా ఆయన్ని నలుగ గొట్టాలని శ్రమకలిగించాలని, యెహోవాకు ఇష్టం. యెహోవా ఆయన ప్రాణాన్ని పాప పరిహర బలిగా అర్పించితే ఆయన బహుకాలం జీవించి తన సంతానాన్ని చూస్తాడు. ఆయనలో యెహోవా చిత్తం సఫలమవుతుంది. 11 ఆయన తన ఆత్మలో ఎన్నో శ్రమల పొందిన తర్వాత వెలుగును చూచి సంతృప్తి చెందుతాడు.

నీతిమంతుడైన నా సేవకుడు తన జ్ఞానం వల్ల అనేకులను నీతిమంతులుగా చేస్తాడు. 12 ఈ కారణం చేత నేను గొప్ప ప్రజలతో ఆయన్ని గొప్పవాడినిగా చేస్తాను. బలముగల ప్రజలందరిలో ఆయనకు అన్నింటిలోనూ భాగం ఉంటుంది. ఎందుకంటే మనుష్యుల కోసం ఆయన తన ప్రాణం ఇచ్చి మరణించాడు. ఆయన నేరస్థులలో ఒకనిగా లెక్కించబడ్డాడు. అనేకుల పాపాల్ని ఆయన మోసి అపరాదుల కోసం విజ్ఞాపన చేసాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International