Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెషయా 37-39

హిజ్కియా దేవుణ్ణి సహయం చేయమని అడుగుట

37 సైన్యాధికారి సందేశం హిజ్కియా విన్నాడు. ఆ సందేశం అతడు విన్నప్పుడు, హిజ్కియా తన బట్టలు చింపేసుకొన్నాడు. అప్పుడు హిజ్కియా సంతాప సూచకమైన ప్రత్యేక వస్త్రాలు ధరించి యెహోవా మందిరానికి వెళ్లాడు.

రాజభవన అధికారిని (ఎల్యాకీము), రాజ్య కార్యదర్శిని (షెబ్నా), యాజకుల్లో పెద్దలను, ఆమోజు కుమారుడు యెషయా దగ్గరకు హిజ్కియా పంపించాడు. ఈ ముగ్గురు మనుష్యులూ సంతాప వస్త్రాలు ధరించారు. ఈ మనుష్యులు యెషయాతో చెప్పారు: “ఈ రోజు దుఃఖం, విచారం వ్యక్తం చేసే ప్రత్యేక సంతాపదినంగా ఉండాలని హిజ్కియా రాజు ఆదేశించాడు. ఇది చాలా విచారకరమైన రోజుగా ఉంటుంది. ఆ రోజు శిశువు జన్మించాల్సినప్పటికీ, తల్లిలో నుండి బయటకు వచ్చే శక్తి లేక అది బయటకు రాని రోజులా అది ఉంటుంది. ఒక వేళ, మీ దేవుడు యెహోవా, ఆ సైన్యాధికారి చెప్పిన సంగతులు వింటాడేమో జీవంగల దేవుణ్ణి గూర్చి చాలా చెడ్డ మాటలు మాట్లాడేందుకు అష్షూరు రాజు సైన్యాధికారిని పంపించాడు. మరియు మీ దేవుడు యెహోవా ఆ చెడు సంగతులు విన్నాడు. మిగిలి ఉన్న కొద్దిమంది ఇశ్రాయేలు ప్రజల కోసం దయచేసి ప్రార్థించండి.”

హిజ్కియా సేవకులు యెషయా దగ్గరకు వెళ్లారు. యెషయా వాళ్లతో చెప్పాడు: “మీ యజమానియైన హిజ్కియాకు ఈ విషయాలు చెప్పండి: యెహోవా చెప్పునదేమనగా, ‘సైన్యాధిపతి నుండి విన్న మాటలకు మీరు భయపడవద్దు. అష్షూరు రాజు దగ్గర నుండి వచ్చిన ఆ “కుర్రవాళ్లు” నన్ను గూర్చి చెప్పిన చెడు విషయాలు నమ్మవద్దు. చూడండి, అష్షూరుకు విరోధంగా నేను ఒక ఆత్మను పంపిస్తాను. అష్షూరు రాజు యొక్క దేశానికి ఒక ప్రమాదం గూర్చి హెచ్చరిక చేస్తూ అతనికి సమాచారం అందుతుంది. కనుక అతడు తిరిగి తన దేశం వెళ్లిపోతాడు. ఆ సమయంలో అతని స్వంత దేశంలోనే నేను అతణ్ణి ఒక ఖడ్గంతో చంపేస్తాను.’”

అష్షూరు సైన్యం యెరూషలేమును విడచుట

8-9 అష్షూరు రాజుకు సమాచారం అందింది. “ఇథియోపియా రాజు తిర్హాకా నీతో యుద్ధం చేయటానికి వస్తున్నాడు” అని ఆ సమాచారం తెలియజేసింది. కనుక అష్షూరు రాజు లాకీషు పట్టణం విడిచి లిబ్నాకు వెళ్లాడు. సైన్యాధికారి ఇది విని, అష్షూరు రాజు యుద్ధం చేస్తున్న లిబ్నా పట్టణం వెళ్లాడు.

అప్పుడు సైన్యాధికారి హిజ్కియా దగ్గరకు సందేశకులను పంపించాడు. సైన్యాధికారి చెప్పాడు. 10 “యూదా రాజు హిజ్కియాతో మీరు ఈ సంగతులు చెప్పండి:

‘నీవు నమ్ముకొన్న దేవుని ద్వారా వెర్రివాడవు కావద్దు. “అష్షూరు రాజు చేత యెరూషలేమును దేవుడు ఓడిపోనివ్వడు!” అని చెప్పవద్దు. 11 వినండి, అష్షూరు రాజులను గూర్చి మీరు విన్నారు. ప్రతి దేశంలోని ప్రజలను వారు ఓడించారు. మరియు అష్షూరు రాజు నిన్నుకూడ ఓడించి, చంపుతాడు. 12 ఆ ప్రజల దేవుళ్లు వాళ్లను రక్షించారా? లేదు. నా తండ్రులు (పూర్వీకులు) వారిని నాశనం చేశారు. గోజాను, హారాను, రెజెపు పట్టణాలను, తెలశ్శారులో నివసిస్తున్న ఏదేను ప్రజలను నా ప్రజలు ఓడించారు. 13 హమాతు, అర్పాదు రాజులు ఎక్కడ? సెపర్వయీము రాజు ఎక్కడ? హేన, ఇవ్వా రాజులు ఎక్కడ? వారి పని అయిపోయింది. వాళ్లంతా నాశనం చేయబడ్డారు.’”

హిజ్కియా దేవునికి ప్రార్థించుట

14 హిజ్కియా ఆ మనుష్యుల దగ్గర నుండి ఆ ఉత్తరం అందుకొని, దానిని చదివాడు. అప్పుడు హిజ్కియా యెహోవా మందిరానికి వెళ్లాడు. హిజ్కియా ఉత్తరం తెరిచి, దానిని యెహోవా ముందర దానిని పరిచాడు. 15 హిజ్కియా యెహోవాను ప్రార్థించటం మొదలు పెట్టాడు. హిజ్కియా చెప్పాడు: 16 సర్వశక్తిమంతుడైన యెహోవా, ఇశ్రాయేలీయుల దేవా, కెరూబు దూతల మధ్య నీవు రాజుగా ఆసీనుడవయ్యావు. భూలోక రాజ్యాలన్నింటినీ పాలించే దేవుడవు నీవు ఒక్కడవే, భూమ్యాకాశాలను నీవే చేశావు. 17 నా ప్రార్థన ఆలకించు! నీ నేత్రాలు తెరచి, సన్హెరీబు పంపిన ఈ వార్త చూడు. సన్హెరీబు నాకు ఈ సందేశం పంపించాడు జీవముగల దేవుడవైన నిన్ను గూర్చి చెడు విషయాలను ఈ సందేశం చెబుతోంది. 18 యెహోవా, అష్షూరు రాజులు నిజంగానే అన్ని దేశాలనూ, వాటి స్థలాలనూ నాశనం చేశారు. 19 ఆ దేశాల దేవుళ్లను అష్షూరు రాజులు కాల్చివేశారు. అయితే అవి నిజమైన దేవుళ్లు కారు. అవి కేవలం మనుష్యులు చేసిన విగ్రహాలే. అవి కేవలం రాయి, చెక్క మాత్రమే. అందుకే వాటిని వారు నాశనం చేయగలిగారు. 20 కానీ నీవు యెహోవా, మా దేవుడివి. కనుక అష్షూరు రాజు బలంనుండి దయతో మమ్మల్ని రక్షించు. అప్పుడు నీవే యెహోవా అని, నీవు మాత్రమే దేవుడవు అని మిగిలిన రాజ్యాలన్నీ తెలుసుకొంటాయి.

హిజ్కియాకు దేవుని జవాబు

21 అప్పుడు ఆమోజు కుమారుడు యెషయా హిజ్కియాకు ఒక సందేశం పంపించాడు. యెషయా చెప్పాడు, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు నీవు ప్రార్థన చేశావు, ‘సన్హెరీబు దగ్గర్నుండి వచ్చిన సందేశాన్ని గూర్చి నీవు ప్రార్థించావు.’

22 “యెహోవా నీ ప్రార్థన విన్నాడు, నన్ను నీ దగ్గరకు రమ్మన్నాడు. ఇదే యెహోవా నుండి వచ్చిన సందేశం:

‘ఓ సీయోను పెండ్లి కుమార్తె (యెరూషలేము) ప్రజలు నీ దగ్గర దొంగిలించారు
    ప్రజలు నిన్ను ఎగతాళి చేశారు.
యెరూషలేము కుమారీ ప్రజలు నిన్ను గూర్చి
    చెడు విషయాలు తలచారు.
23 ఓ అష్షూరు రాజా, నన్ను గూర్చి నీవు చెడు విషయాలు చెప్పావు.
    నీవు నాకు విరోధంగా మాట్లాడావు. నేను ఎవరినో నీకు తెలుసా?
నీ కళ్లు పైకెత్తి ఆకాశం వైపు చూడు.
    ఇశ్రాయేలీయుల పరిశుద్ధుణ్ణి గూర్చి నీవు చెడు విషయాలు చెప్పినట్టు నీవు చూస్తావు.
24 యెషయా ఇంకా ఇలా చెప్పాడు, నా ప్రభువు యెహోవాను గూర్చి చెడు సంగతులు చెప్పడానికి నీవు నీ సేవకులను వాడుకొన్నావు.
    నీవు ఇలా అన్నావు:
“నేను చాలా శక్తిమంతుణ్ణి. నాకు ఎన్నెన్నో రథాలు ఉన్నాయి.
లెబానోను మహాపర్వతాల మీదుగా దాటించి నా రథాలను నేను తీసుకొని వచ్చాను.
లెబానోను మహా వృక్షాలను (సైన్యాలను)
    అన్నింటినీ నేను నరికివేశాను.
25 ఈజిప్టులోని ప్రతి నదికీ నేను వెళ్లాను. ఆ నదులన్నింటి నీళ్లతో నేను నా చేతులు నింపుకొన్నాను. నేను ఆ నీళ్లు తాగాను.
నా స్వంత శక్తితో, ఈజిప్టులోని
    నదులన్నింటినీ (శక్తిని) నేను నాశనం చేశాను.”

26 “‘అని నీవు చెప్పావు. అయితే నేను చెప్పినది నీవు వినలేదా?
    అష్షూరు రాజా, దేవుడనైన నేనే ఆ సంగతులను చేశానని నిశ్చయంగా నీవు ఎప్పుడో విన్నావు.
చాలాకాలం క్రిందట నేను అష్షూరును చేశాను. ఇప్పుడు నిన్ను ఇక్కడికి నేనే తీసుకొని వచ్చాను.
    మిగిలిన ఇతర పట్టణాలను నిన్ను నాశనం చేయనిచ్చాను.
నా పనిలో నేనే నిన్ను వాడుకొని,
    ఆ పట్టణాలను రాళ్ల కుప్పలుగా చేశాను.
27 ఆ పట్టణాల్లో జీవించిన మనుష్యులు బలహీనులు.
    ప్రజలు భయపడేవాళ్లు, సిగ్గుపడేవాళ్లు.
ఆ మనుష్యులు పొలంలో
    గడ్డిలాంటి వాళ్లు.
వారు ఇండ్ల కప్పుల మీద మొలకెత్తే గడ్డిలాంటి వారు.
    ఆ గడ్డి ఎదుగక ముందే వేడి ఎడారి గాలికి కాలిపోతుంది.
28 నీ సైన్యం, నీ యుద్ధాలు అన్నింటిని గూర్చి నాకు తెలుసు.
    నీవు ఎప్పుడు విశ్రాంతి తీసుకొన్నావో నాకు తెలుసు.
    నీవు ఎప్పుడు యుద్ధానికి వెళ్లావో నాకు తెలుసు.
    యుద్ధంనుండి నీవు ఇంటికి ఎప్పుడు తిరిగి వచ్చావో నాకు తెలుసు.
    నీవు నా మీద కోపంగా ఉన్నావని నాకు తెలుసు.
29 నీవు నా మీద కోపంగా ఉన్నవు,
    నన్ను గూర్చి చెడ్డగా మాట్లాడావు. నీవు చెప్పిన విషయాలు నేను విన్నాను.
కనుక నిన్ను నేను శిక్షిస్తాను. నీ ముక్కుకు నేను గాలం వేస్తాను;
    నీ నోటికి నేను కళ్లెం వేస్తాను.
అప్పుడు నీవు నా దేశాన్ని విడిచి, నీవు వచ్చిన దారినే పోయేట్టు
    నేను నిన్ను వెళ్లగొడతాను.’”

హిజ్కియాకు యెహోవా సందేశం

30 అప్పుడు యెహోవా హిజ్కియాతో చెప్పాడు: “హిజ్కియా, ఈ మాటలు సత్యమని నీకు చూపించటానికి నీకు నేను ఒక గురుతు ఇస్తాను. ఈ సంవత్సరం తినేందుకు మీరు ధాన్యపు గింజలు నాటారు. కనుక పోయిన సంవత్సరపు పంటనుండి విచ్చలవిడిగా పండిన ధాన్యాన్ని ఈ సంవత్సరం మీరు తింటారు. కానీ మూడు సంవత్సరాలకు మీరు నాటుకొన్న ధాన్యం మీరు తింటారు. ఆ పంటలను మీరు కోస్తారు. తినేందుకు మీకు సమృద్ధిగా ఉంటుంది. మీరు ద్రాక్ష వల్లులు నాటి, వాటి ఫలాలు తింటారు.

31 “యూదా వంశంలో కొంతమంది ప్రజలు రక్షించబడతారు. ఆ కొద్దిమంది మనుష్యులు చాలా పెద్దరాజ్యంగా తయారవుతారు. ఆ ప్రజలు భూమిలో లోతుగా వేర్లు తన్ని, బలంగా ఎదిగే మొక్కల్లా ఉంటారు. అప్పుడు ప్రజలకు నేలమీద విస్తారమైన ఫలం (పిల్లలు) ఉంటుంది. 32 ఎందుకంటే, యెరూషలేము నుండి కొద్ది మంది మనుష్యులు బ్రతికివస్తారు. సీయోను కొండనుండి బ్రతికిన వారు వస్తారు.” సర్వశక్తిమంతుడైన యెహోవా బలీయమైన ప్రేమ దీనిని చేస్తుంది.

33 కనుక అష్షూరు రాజు గురించి యెహోవా చెబుతున్నాడు,

“నీవు ఈ పట్టణంలో ప్రవేశించవు.
    నీవు ఈ పట్టణం మీద ఒక బాణంకూడ వేయవు.
నీ డాళ్లతో నీవు ఈ పట్టణం మీద యుద్ధానికి కదలిరాలేవు.
    పట్టణం గోడలకు నీవు ఒక్క దిబ్బను కూడ కట్టలేవు.
34 నీవు వచ్చిన దారినే నీ దేశానికి తిరిగి వెళ్లిపోతావు.
    నీవు ఈ పట్టణం లో ప్రవేశించవు.
    ఈ సందేశం యెహోవా దగ్గర్నుండి వచ్చింది.
35 ఈ పట్టణాన్ని నేను కాపాడి, రక్షిస్తాను.
    నా కోసమూ, నా సేవకుడు దావీదు కోసమూ నేను దీనిని చేస్తాను.”

అష్షూరు సైన్యం నాశనమయింది

36 కనుక యెహోవా దూత వెళ్లి, అష్షూరి వారి బసలో ఒక లక్ష ఎనభై అయిదు వేలమంది మనుష్యులను చంపేశాడు. మర్నాడు ఉదయం మనుష్యులు లేచి చూడగా, వారి చుట్టూ చచ్చిన శవాలే వారికి కనబడ్డాయి. 37 కనుక అష్షూరు రాజు నీనెవెకు తిరిగి వెళ్లి అక్కడే ఉండిపోయాడు.

38 ఒక రోజు సన్హెరీబు అతని దేవుడు నిస్రోను గుడిలో పూజిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అతని ఇద్దరు కుమారులు, అద్రమ్మెలెకు, షెరెజెరు కత్తితో అతనిని చంపేశారు. తర్వాత ఆ కుమారులు అరారాతుకు పారిపోయారు. అందుచేత సన్హెరీబు కుమారుడు ఎసర్హద్దోను అష్షూరుకు క్రొత్త రాజు అయ్యాడు.

హిజ్కియా జబ్బు

38 ఆ కాలంలో హిజ్కియాకు జబ్బు చేసింది. అతనికి దాదాపు మరణ పరిస్థితి ఏర్పడింది. ఆమోజు కుమారుడు యెషయా ప్రవక్త అతన్ని చూడటానికి వెళ్లాడు. “నేను ఈ సంగతులు నీతో చెప్పాలని యెహోవా నాకు చెప్పాడు. ‘త్వరలోనే నీవు మరణిస్తావు. కనుక నీవు చనిపోయినప్పుడు నీ కుటుంబం వారు ఏం చేయాలో నీవు వారితో చెప్పాలి. నీవు మళ్లీ బాగుపడవు’ అని యెషయా రాజుతో చెప్పాడు.”

హిజ్కియా దేవాలయపు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అతడు చెప్పాడు, “యెహోవా, నేను నీ యెదుట ఎల్లప్పుడూ నమ్మకమైన పవిత్ర హృదయంతో జీవించానని దయచేసి జ్ఞాపకం చేసికొనుము. నీవు మంచివి అనే పనులే నేను చేశాను.” తర్వాత హిజ్కియా గట్టిగా ఏడ్వటం మొదలు బెట్టాడు.

యెహోవా దగ్గర్నుండి యెషయా ఈ సందేశాన్ని స్వీకరించాడు; “హిజ్కియా దగ్గరకు వెళ్లి అతనితో చెప్పు, నీ పూర్వీకుడైన దావీదు దేవుడు, యెహోవా చెప్పే సంగతులు ఇవి, ‘నీ ప్రార్థనలు నేను విన్నాను, నీ దుఃఖపు కన్నీళ్లు నేను చూశాను. నేను నీ ఆయుష్షు పదిహేను సంవత్సరాలు ఎక్కువ చేస్తాను. అష్షూరు రాజు నుండి నిన్ను నేను కాపాడుతాను. నిన్ను, ఈ పట్టణాన్ని నేను రక్షిస్తాను.’”

యెహోవా చెప్పిన వాటిని చేస్తాడని నీకు చూపించేందుకు యిదే సంకేతం. “చూడు, ఆహాజు మెట్ల మీద ఉన్న ఎండ గడియారము నీడను పది అడుగులు వెనుకకు వెళ్లేటట్టు నేను చేస్తున్నాను. దిగిపోయిన సూర్యుని నీడ పది అడుగులు వెనుకకు వెళ్తుంది.”

హిజ్కియా పాట

హిజ్కియా రోగమునుండి స్వస్థత పొందినప్పుడు వ్రాసిన గీతం:

10 నేను వృద్ధుడనయ్యేంత వరకు బ్రతుకుతానని నాలో నేను అనుకొన్నాను.
    కానీ నేను పాతాళ ద్వారాలగుండా వెళ్లాల్సిన సమయం అది. ఇప్పుడు నేను నా సమయమంతా అక్కడే గడపాలి.
11 కనుక నేను చెప్పాను: “సజీవుల దేశంలో ప్రభువైన యెహోవాను నేను మరల చూడను.
    భూమిమీద మనుష్యులు జీవించుట నేను మరల చూడను.
12 నా ఇల్లు, నా గొర్రెల కాపరి గుడారం లాగివేయబడి నానుండి తీసివేయబడుతుంది.
    మగ్గమునుండి ఒకడు బట్టను చుట్టి కత్తిరించినట్టు నా పని అయిపోయింది.
    ఒక్క రోజులో ఉదయంనుండి రాత్రి వరకు నీవు నన్ను ఇంతవరకు తీసుకొనివచ్చావు.
13 రాత్రి అంతా నేను సింహంలా గట్టిగా అరిచాను.
    అయితే సింహం ఎముకలు నమిలినట్టు నా ఆశలు అణగ ద్రొక్కబడ్డాయి.
ఒక్క రోజులో ఉదయంనుండి రాత్రి వరకు నీవు నన్ను ఇంతవరకు తీసుకొని వచ్చావు.
14 నేను గువ్వలా మూల్గాను.
    నేను పక్షిలా ఏడ్చాను.
నా కళ్లు క్షీణించాయి
    కానీ నేను ఆకాశం తట్టు చూస్తూనే ఉన్నాను.
నా ప్రభువా, నాకు కష్టాలు ఉన్నాయి.
    నాకు సహాయం చేస్తానని వాగ్దానం చేయుము.”
15 నేనేం చెప్పగలను?
    జరిగేదేమిటో నా ప్రభువు నాకు చెప్పాడు.
    నా యజమాని దానిని జరిగిస్తాడు.
నా ఆత్మలో నాకు ఈ కష్టాలు కలిగాయి.
    కనుక ఇప్పుడు నేను జీవితాంతం దీనుడనుగా ఉంటాను.
16 నా ప్రభూ, నా ఆత్మ మరల జీవించేట్టుగా ఈ కష్ట సమయాన్ని ఉపయోగించు
    నా ఆత్మ బలపడి, ఆరోగ్యంగా ఉండేందుకు సహాయం చేయుము.
    నేను బాగుపడేందుకు సహాయం చేయి.
    మరల జీవించేందుకు నాకు సహాయం చేయుము.

17 చూడండి, నా కష్టాలు తొలగి పోయాయి.
    ఇప్పుడు నాకు శాంతి ఉంది.
నీవు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు.
    నీవు నన్ను సమాధిలో మురిగి పోనివ్వలేదు.
నీవు నా పాపాలన్నీ క్షమించావు.
    నీవు నా పాపాలను దూరంగా పారవేశావు.
18 చచ్చినవాళ్లు నీకు స్తుతులు పాడరు.
    పాతాళంలోని ప్రజలు నిన్ను స్తుతించరు.
చచ్చినవాళ్లు సహాయం కోసం నిన్ను నమ్ముకోరు. వారు భూగర్భంలోనికి వెళ్తారు, మరల ఎన్నటికీ మాట్లాడరు.
19 నేడు నాలాగే బ్రతికి ఉన్న మనుష్యులే
    నిన్ను స్తుతించేవారు.
    నీవు నమ్మదగిన వాడవని ఒక తండ్రి తన పిల్లలతో చెప్పాలి.
20 కనుక నేను అంటాను: “యెహోవా నన్ను రక్షించాడు
    కనుక మా జీవిత కాలమంతా మేము యెహోవా ఆలయంలో పాటలు పాడి, వాయిద్యాలు వాయిస్తాం.”

21 అప్పుడు యెషయా, “నీవు అంజూరపు పండ్లను దంచి, నీ పుండ్ల మీద వేయాలి, అప్పుడు, నీవు స్వస్థపడతావు” అని హిజ్కియాతో చెప్పాడు.

22 కానీ హిజ్కియా, “నేను బాగవుతానని రుజువు చేసేందుకు యెహోవా దగ్గర్నుండి వచ్చే గురుతు ఏమిటి? నేను యెహోవా మందిరానికి వెళ్ల గలుగుతానని రుజువుచేసే సంకేతం ఏమిటి?” అని యెషయాను అడిగాడు.

బబులోను నుంచి సందేశహరులు

39 ఆ కాలంలో బలదాను కుమారుడు మెరోదక్బలదాను బబులోనుకు రాజు. మెరోదక్ ఉత్తరాలు, కానుకలు హిజ్కియాకు పంపించాడు. హిజ్కియా జబ్బుపడి బాగయ్యాడని విన్నందువల్ల మెరోదక్ కానుకలు పంపించాడు. ఈ కానుకలు హిజ్కియాకు చాలా సంతోషం కలిగించాయి. అందుచేత హిజ్కియా, మెరోదక్ మనుష్యులను తన రాజ్యంలోని ప్రత్యేక వస్తువులను చూడనిచ్చాడు. తన సకల ఐశ్వర్యాలు, వెండి, బంగారం, ఖరీదైన తైలాలు, పరిమళాలు ఆ మనుష్యులకు హిజ్కియా చూపించాడు. యుద్ధంలో ఉపయోగించే కత్తులు, డాళ్లు హిజ్కియా చూపించాడు. హిజ్కియా దాచి ఉంచినవన్నీ వారికి చూపించాడు. తన ఇంట్లో, రాజ్యంలో ఉన్నవి అన్నీ హిజ్కియా వారికి చూపించాడు.

ప్రవక్త యెషయా, హిజ్కియా దగ్గరకు వెళ్లి, “ఈ మనుష్యులు ఏమన్నారు? వాళ్లు ఎక్కడ్నుంచి వచ్చారు?” అని అతన్ని అడిగాడు.

“ఈ మనుష్యులు చాలా దూరదేశం నుండి నా దగ్గరకు వచ్చారు. ఈ మనుష్యులు బబులోను నుండి వచ్చారు.” అని హిజ్కియా చెప్పాడు.

కనుక యెషయా, “నీ రాజ్యంలో వాళ్లు ఏమి చూశారు?” అని అతణ్ణి అడిగాడు.

“నా రాజభవనంలో సమస్తమూ వాళ్లు చూశారు. నా ఐశ్వర్యాలన్నీ నేను వారికి చూపించాను” అని చెప్పాడు హిజ్కియా.

హిజ్కియాతో యెషయా ఇలా చెప్పాడు: “సర్వ శక్తిమంతుడైన యెహోవా మాటలు ఆలకించు. భవిష్యత్తులో, నీకు ఉన్నదంతా బబులోనుకు తీసుకొని పోబడుతుంది. ధనం అంతా తీసుకొని పోబడుతుంది. ఏమీ విడువబడదు. సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పాడు ఇది. బబులోను రాజు నీ కుమారులను నీనుండి పుట్టే కుమారులను తీసుకొని పోతాడు. నీ కుమారులు బబులోను రాజభవనంలో అధికారులు అవుతారు.”

హిజ్కియా, “యెహోవానుండి వచ్చిన ఈ మాటలు వినుటకు నాకు ఇంపుగా ఉన్నాయి” అని యెషయాతో చెప్పాడు. (“నేను రాజుగా ఉన్నంత వరకు కష్టం ఏమీ ఉండదు, శాంతి ఉంటుంది” అనుకొన్నందువల్ల హిజ్కియా ఇలా చెప్పాడు.)

కీర్తనలు. 76

సంగీత నాయకునికి: వాయిద్యాలతో. ఆసాపు స్తుతి కీర్తన.

76 యూదాలో ప్రజలు దేవుని ఎరుగుదురు.
    దేవుని నామం నిజంగా గొప్పదని ఇశ్రాయేలుకు తెలుసు.
దేవుని ఆలయం షాలేములో[a] ఉంది.
    దేవుని గృహం సీయోను కొండ మీద ఉంది.
అక్కడ విల్లులను, బాణాలను కేడెములను,
    కత్తులను ఇతర యుద్ధ ఆయుధాలను దేవుడు విరుగగొట్టాడు.

దేవా, నీవు నీ శత్రువులను ఓడించిన ఆ కొండల నుండి
    తిరిగి వస్తూండగా నీవు ఎంతో మహిమతో ఉన్నావు.
ఆ సైనికులు చాలా బలం కలవారని తలంచారు. కాని యిప్పుడు వారు చచ్చి పొలాల్లో పడి ఉన్నారు.
    వారికి ఉన్నదంతా వారి శరీరాల నుండి దోచుకోబడింది.
    బలవంతులైన ఆ సైనికులలో ఒక్కరు కూడా వారిని కాపాడుకోలేకపోయారు.
యాకోబు దేవుడు ఆ సైనికులను గద్దించాడు.
    రథాలు, గుర్రాలుగల ఆ సైన్యం చచ్చిపడింది.
దేవా, నీవు భీకరుడవు.
    నీవు కోపంగా ఉన్నప్పుడు ఏ మనిషీ నీకు విరోధంగా నిలువలేడు.
8-9 యెహోవా న్యాయమూర్తిగా నిలిచి తన నిర్ణయాన్ని ప్రకటించాడు.
    దేశంలోని దీన ప్రజలను దేవుడు రక్షించాడు.
పరలోకం నుండి ఆయన తీర్మానం ఇచ్చాడు.
    భూమి అంతా భయంతో నిశ్శబ్దం ఆయ్యింది.
10 దేవా, నీవు దుర్మార్గులను శిక్షించినప్పుడు ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
    నీవు నీ కోపం చూపిస్తావు. బ్రతికి ఉన్నవారు మరింత బలంగలవారు అవుతారు.

11 ప్రజలారా! మీ దేవుడైన యెహోవాకు మీరు వాగ్దానాలు చేశారు.
    ఇప్పుడు మీరు వాగ్దానం చేసినదాన్ని ఆయనకు ఇవ్వండి.
అన్ని చోట్లనుండీ ప్రజలు
    తాము భయపడే దేవునికి కానుకలు తెస్తారు.
12 దేవుడు మహా నాయకులను ఓడిస్తాడు.
    భూలోక రాజులందరూ ఆయనకు భయపడుతారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International