Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెషయా 35-36

దేవుడు తన ప్రజలను ఓదారుస్తాడు

35 ఎండిన అరణ్యం సంతోషిస్తుంది. అరణ్యం ఉల్లసించి, కస్తూరి పుష్పంలా పూస్తుంది. అరణ్యం వికసించే పూలతో నిండిపోయి దాని సంతోషాన్ని వ్యక్తం చేయటం మొదలు పెడ్తుంది. అరణ్యం ఆనందంతో నాట్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది. లెబానోను అరణ్యంలా, కర్మెలు పర్వతంలా, షారోనులోయలా అరణ్యం సౌందర్యంగా ఉంటుంది. ప్రజలంతా యెహోవా మహిమ[a] చూస్తారు గనుక ఇలా జరుగుతుంది. ప్రజలు మన యెహోవా మాహాత్మ్యం చూస్తారు.

బలహీనమైన చేతుల్ని మళ్లీ బలపర్చండి. బలహీనమైన మోకాళ్లను బలపర్చండి. ప్రజలు భయంతో, కలవరపడుతున్నారు. “బలంగా ఉండండి, భయపడవద్దు” అని ఆ మనుష్యులతో చెప్పండి. చూడండి, మీ దేవుడు వచ్చి, మీ శత్రువులను శిక్షిస్తాడు. ఆయన వచ్చి మీ బహుమానం మీకు ఇస్తాడు. యెహోవా మిమ్మల్ని రక్షిస్తాడు. అప్పుడు గుడ్డివాళ్లు మళ్లీ చూస్తారు. వారి నేత్రాలు తెరువబడతాయి. అప్పుడు చెవిటివాళ్లు వినగలుగుతారు. వారి చెవులు తెరువబడుతాయి. కుంటివాళ్లు లేడిలా గంతులు వేస్తారు. ఇప్పుడు మాట్లాడలేని మూగవాళ్లు, వారి కంఠం ఎత్తి ఆనంద గీతాలు పాడుతారు. అరణ్యంలో జల ఊటలు పారటం మొదలైనప్పుడు ఇది జరుగుతుంది. ఎండిన భూమిలో నీటి ఊటలు ప్రవహిస్తాయి. ఇప్పుడు నీళ్లలా కనిపించే ఎండమావుల్ని ప్రజలు చూస్తున్నారు. కానీ ఆ సమయంలో నిజంగానే నీళ్ల కొలనులు ఉంటాయి. ఎండిన భూమిలో బావులు ఉంటాయి. భూమిలో నుండి నీళ్లు ఉబుకుతాయి. ఒకప్పుడు అడవిమృగాలు ఏలిన చోట ఎత్తయిన నీటి మొక్కలు పెరుగుతాయి.

ఆ సమయంలో అక్కడ ఒక రాజమార్గం ఉంటుంది. ఈ రాజమార్గం “పవిత్ర రాజమార్గం” అని పిలువబడుతుంది. ఆ రాజమార్గంలో చెడ్డవాళ్లను నడవనీయరు. తెలివి తక్కువ వాళ్లెవరూ ఆ మార్గానికి వెళ్లరు. మంచివాళ్లు మాత్రమే ఆ మార్గంలో వెళ్తారు. ఆ మార్గంలో అపాయాలు ఏమీ ఉండవు. ప్రజలకు హానిచేసేందుకు ఆ మార్గంలో సింహాలు ఉండవు. ప్రమాదకరమైన జంతువులు ఏమీ ఆ మార్గంలో ఉండవు. ఆ మార్గం దేవుడు రక్షించే ప్రజలకోసమే ఉంటుంది.

10 దేవుడు తన ప్రజలను స్వతంత్రులను చేస్తాడు. ఆ ప్రజలు ఆయన దగ్గరకు తిరిగి వస్తారు. ప్రజలు సీయోను లోనికి వచ్చినప్పుడు సంతోషిస్తారు. ఆ ప్రజలు ఎప్పటికీ సంతోషంగా ఉంటారు. వారి సంతోషం వారి తలల మీద ఒక కిరీటంలా ఉంటుంది. వారి సంతోషం, ఆనందం వారిని సంపూర్ణంగా నింపేస్తాయి. విచారం, దుఃఖం దూరదూరాలకు పారిపోతాయి.

అష్షూరీయులు యూదాను ముట్టడించుట

36 యూదాకు హిజ్కియా రాజు. అష్షూరుకు సన్హెరీబు రాజు. హిజ్కియా రాజైన పదునాలుగవ సంవత్సరంలో సన్హెరీబు యూదా పట్టణాల మీద యుద్ధం చేశాడు. మరియు సన్హెరీబు ఆ పట్టణాలను ఓడించేశాడు. యెరూషలేము మీద యుద్ధం చేయటానికి సన్హెరీబు తన సైన్యాధిపని పంపించాడు. ఆ సైన్యాధిపతి లాకీషును విడిచి, యెరూషలేములోని హిజ్కియా దగ్గరకు వెళ్లాడు. ఆ సైన్యాధిపతి బలమైన తన సైన్యాన్ని తనతో కూడా నడిపించాడు. ఆ సైన్యాధిపతి, అతని సైన్యం చాకలివాని పొలం దగ్గర ఉన్న దారికి వెళ్లారు. మెట్ట మీది కొలను నుండి వచ్చే జంట కాల్వల దగ్గర ఈ మార్గం ఉంది.

ఆ సైన్యాధిపతితో మాట్లాడుటకు ముగ్గురు మనుష్యులు యెరూషలేము నుండి బయటకు వెళ్లారు. వీరు హిల్కీయా కుమారుడు ఎల్యాకీము, ఆసాపు కుమారుడు యోవాహు, షెబ్నా, ఎల్యాకీము రాజభవన సంరక్షకుడు. యెహోవా అధికార పత్రాలు భద్రపరచేవాడు; షెబ్నా రాజ్యపు కార్యదర్శి.

సైన్యాధిపతి వారితో చెప్పాడు, “మీరు రాజైన హిజ్కియాతో ఈ సంగతులు చెప్పండి:

“మహారాజు, అష్షూరు రాజు చెబుతున్నాడు, మీ సహాయం కోసం మీరు దేనిని నమ్ముకొంటున్నారు? మీరు గనుక మీ బలాన్నీ, తెలివిగల మీ యుద్ధ తంత్రాలనూ నమ్ముకొంటే అవన్నీ నిష్ప్రయోజనమే అని నేను చెబుతున్నాను. అవి వట్టి మాటలు తప్ప ఇంకేమీ లేదు. కనుక మీరు నాకు విరోధంగా ఎందుకు యుద్ధం చేస్తారు? ఇప్పుడు నేను మళ్లీ అడుగుతున్నాను, మీ సహాయం కోసం మీరు ఎవరిని నమ్ముకొంటున్నారు? మీ సహాయం కోసం మీరు ఈజిప్టు మీద ఆధారపడ్తున్నారా? ఈజిప్టు విరిగిపోయిన కర్రలా ఉంది. ఆధారంగా మీరు దానిమీద ఆనుకొంటే, అది మీకు బాధ మాత్రమే కలిగిస్తుంది, మీ చేతికి గాయం చేస్తుంది. ఈజిప్టు రాజు ఫరో సహాయంకోసం అతని మీద ఆధారపడే వాళ్లెవ్వరూ అతణ్ణి నమ్మలేరు.

“అయితే మీరు అనవచ్చు, ‘మా సహాయం కోసం మేం మా దేవుడు యెహోవాను విశ్వసిస్తున్నాం’ అని. అయితే యెహోవా బలిపీఠాలను, ఆరాధించే ఉన్నత స్థలాలను హిజ్కియా నాశనం చేసేశాడు అని నేనంటున్నాను. ఇది నిజం, అవునా? యూదాకు, యెరూషలేముకు హిజ్కియా ఈ సంగతులు చెప్పటం సత్యం, ‘ఇక్కడ యెరూషలేములో ఒకే బలిపీఠం దగ్గర మీరు ఆరాధిస్తారు.’

“అయినా మీరు ఇంకా యుద్ధం చేయాలనే అనుకొంటే, నా ప్రభువు, అష్షూరు రాజు మీతో ఈ ఒడంబడిక చేస్తాడు! యుద్ధ రంగంలో స్వారీ చేయగల రెండువేల మంది మీకు ఉంటే, నేను మీకు అన్ని గుర్రాలు ఇస్తాను. అలాగైనా సరే, నా యజమాని బానిసల్లో ఒక్కడిని, చివరికి ఒక చిన్న అధికారిని కూడా మీరు ఓడించలేరు. అందుచేత ఈజిప్టు సైనికుల మీద రథాల మీద ఎందుకు మీరు ఆధారపడతారు?

10 “మరియు నేను వచ్చి ఈ దేశంలో యుద్ధం చేసినప్పుడు యెహోవా నాతో ఉన్నాడని కూడ జ్ఞాపకం ఉంచుకోండి. నేను పట్ణణాలను నాశనం చేసినప్పుడు యెహోవా నాతో ఉన్నాడు. ‘లేచి నిలబడే ఈ దేశానికి వెళ్లి, దీన్ని నాశనం చేయి’” అని యెహోవా నాతో చెప్పాడు.

11 ఎల్యాకీము, షెబ్నా, యోవాహు, “దయచేసి సిరియా భాషలో మాతో మాట్లాడు. మా యూదా భాషలో మాతో మాట్లాడవద్దు. నీవు యూదా భాషలో మాట్లాడితే, నగరం గోడమీద మనుష్యులు అర్థం చేసుకొంటారు” అని ఆ సైన్యాధిపతితో చెప్పారు.

12 కానీ సైన్యాధిపతి, “మీకూ, మీ యజమానుడు హిజ్కియాకూ మాత్రమే చెప్పమని మా యజమాని నన్ను పంపించలేదు. ఆ గోడల మీద కూర్చొన్న మనుష్యులతో కూడ చెప్పమని నా యజమాని నన్ను పంపించాడు. ఆ మనుష్యులకు ఆహారంగాని భోజనం గాని ఉండదు. వాళ్లు కూడా మీలాగే, వారి మల మూత్రాలనే తిని, త్రాగుతారు” అని చెప్పాడు.

13 అప్పుడు సైన్యాధికారి లేచి, పెద్ద స్వరంతో మాట్లాడాడు. అతడు యూదా భాషలో మాట్లాడాడు. 14 సైన్యాధికారి చెప్పాడు, “మహారాజు అష్షూరు రాజు మాటలు వినండి:

“హిజ్కియా మిమ్మల్ని మోసం చేయనివ్వకండి. అతడు మిమ్మల్ని రక్షించలేడు. 15 ‘యెహోవా మీద విశ్వాసం ఉంచండి, యోహోవా మనలను రక్షిస్తాడు. అష్షూరు రాజు మన పట్టణం గెలవకుండా యెహోవా చేస్తాడు’ అని హిజ్కియా చెప్పినప్పుడు అతని మాటలు నమ్మవద్దు.

16 “హిజ్కియా చెప్పే ఆ మాటలు వినవద్దు. అష్షూరు రాజు మాట వినండి. అష్షూరు రాజు చెబుతున్నాడు, ‘మనం ఒక ఒడంబడిక చేసుకొందాం. ప్రజలారా, మీరు పట్టణం వదలి పెట్టి నా దగ్గరకు రండి. అప్పుడు ప్రతి ఒక్కరు స్వతంత్రులుగా ఇంటికి వెళ్లవచ్చును. ప్రతి ఒక్కరు తన స్వంత ద్రాక్షవల్లినుండి ద్రాక్షపండ్లు తినేందుకు స్వేచ్ఛ ఉంటుంది. ప్రతి వ్యక్తీ తన స్వంత అంజూరపు చెట్టు ఫలాలు తినే స్వేచ్ఛ ఉంటుంది. ప్రతి వ్యక్తీ తన స్వంత బావి నుండి నీళ్లు తాగే స్వేచ్ఛ ఉంటుంది. 17 నేను వచ్చి, మీ స్వంత దేశంలాంటి దేశానికి మిమ్మల్ని ఒక్కొక్కరిని తీసుకొని వెళ్లేంత వరకు మీరు ఇలా చేయవచ్చు. ఆ క్రొత్త దేశంలో మీకు మంచి ధాన్యం, క్రొత్త ద్రాక్షరసం ఉంటాయి. ఆ దేశంలో భోజనం, ద్రాక్షవనాలు ఉంటాయి.’

18 “హిజ్కియా మిమ్మల్ని వెర్రి వాళ్లనుగా చేయనియ్యకండి. ‘యెహోవా మనలను రక్షిస్తాడు.’ అని అతడు అంటాడు. అయితే యితర రాజ్యాల్లోని యితర దేవుళ్లు ఎవరైనా సరే వారిని అష్షూరు బలంనుండి రక్షించారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. లేదు. 19 ఆ ప్రజల్లో ప్రతి ఒక్కరినీ మేము ఓడించాం. హమాతు, అర్పదు దేవుళ్లు ఏమయ్యారు? వారు ఓడించబడ్డారు. సెపర్యయీం దేవతలు ఎక్కడ? వారు ఓడించబడ్డారు. సమరయ దేవుళ్లు ఆ ప్రజలను నా బలంనుండి రక్షించారా? లేదు. 20 ఆ రాజ్యాలన్నింటిలో నా బలం నుండి తన ప్రజలను రక్షించగలిగిన ఒక్క దేవుని పేరు నాకు చెప్పండి. నేను వాళ్లందర్నీ ఓడించేశాను. అందుచేత నా బలంనుండి యెహోవా యెరూషలేమును రక్షించజాలడు.”

21 యెరూషలేములోని ప్రజలు చాలా మౌనంగా ఉన్నారు. ఆ సైన్యాధికారికి వారు జవాబు చెప్పలేదు. (హిజ్కియా ప్రజలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. “ఆ సైన్యాధికారికి జవాబు చెప్పవద్దు” అని హిజ్కియా ఆజ్ఞాపించాడు.)

22 అప్పుడు రాజభవన అధికారి (హిజ్కియా కుమారుడు ఎల్యాకీము) రాజ్య కార్యదర్శి (షెబ్నా) అధికార పత్రాలు భద్రపరిచే అధికారి (ఆసాపు కుమారుడు యోవాహు) వారి బట్టలు చింపివేశారు. (వారు చాలా విచారించినట్టు ఇది సంకేతం) ఆ ముగ్గురు మనుష్యులూ హిజ్కియా దగ్గరకు వెళ్లి, సైన్యాధికారి తమతో చెప్పిన సంగతులన్నీ అతనితో చెప్పారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International