Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెషయా 31-34

ఇశ్రాయేలు దేవుని శక్తిమీద ఆధార పడాలి

31 సహాయం కోసం ఈజిప్టుకు దిగి వెళ్తున్న ఆ ప్రజలను చూడండి. ప్రజలు గుర్రాల కోసం అడుగుతున్నారు. గుర్రాలు వారిని రక్షిస్తాయని వారనుకొంటున్నారు. ఈజిప్టు రథాలు, గుర్రాలపై సైనికులు వారిని కాపాడుతారని ఆ ప్రజలు నిరీక్షిస్తున్నారు. ఆ సైన్యం చాలా పెద్దది. కనుక వారు క్షేమంగా ఉన్నాం అని ప్రజలు అనుకొంటున్నారు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని (దేవుడు) ప్రజలు విశ్వసించటం లేదు. ప్రజలు సహాయం కోసం యెహోవాను అడుగుట లేదు. అయితే జ్ఞానం గలవాడు యెహోవాయే. మరియు వారికి కష్టం రప్పించేవాడూ యెహోవాయే. యెహోవా ఆదేశాన్ని ప్రజలు మార్చజాలరు. యెహోవా లేచి దుష్టుల (యూదా) మీద పోరాడుతాడు. వారికి సహాయం చేయాలని ప్రయత్నించే వారి (ఈజిప్టు) మీద యెహోవా పోరాడుతాడు.

ఈజిప్టు ప్రజలు కేవలం మానవమాత్రులే, దేవుడు కారు. ఈజిప్టు గుర్రాలు కేవలం జంతువులే, ఆత్మలు కావు. యెహోవా తన హస్తం చాపగా, సహాయకుడు (ఈజిప్టు) ఓడించబడతాడు. సహాయం కోరిన ప్రజలు (యూదా) పతనం అవుతారు. ఆ మనుష్యులంతా ఒక్కుమ్మడిగా నాశనం చేయబడతారు.

“ఒక సింహంగాని, సింహపు పిల్లగాని తినటానికి ఒక జంతువును పట్టుకొంటే, ఆ సింహం, చచ్చిన జంతువు మీద నిలబడి గర్జిస్తుంది. ఆ సమయంలో ఆ గొప్ప సింహాన్ని ఏదీ భయపెట్టలేదు. మనుష్యులు వచ్చి, సింహం మీద కేకలు వేస్తే, సింహం భయపడదు. మనుష్యులు పెద్ద ధ్వని చేయవచ్చు కానీ సింహం మాత్రం పారిపోదు” అని యెహోవా నాతో చెప్పాడు.

అదే విధంగా సర్వశక్తిమంతుడైన యెహోవా సీయోను కొండమీద దిగివస్తాడు. ఆ కొండ మీద యెహోవా పోరాడతాడు. పక్షులు వాటి గూళ్ల చుట్టూ ఎగిరినట్టు, సర్వశక్తిమంతుడైన యెహోవా యెరూషలేమును కాపాడుతాడు. యెహోవా దానిని రక్షిస్తాడు. యెహోవా “దానిపై దాటి”, యెరూషలేమును రక్షిస్తాడు.

ఇశ్రాయేలీయులారా, మీరు దేవుని మీద తిరుగుబాటు చేశారు. మీరు తిరిగి దేవుని దగ్గరకు రావాలి. మీరు తయారు చేసిన వెండి, బంగారు విగ్రహాలను ప్రజలు పూజించటం అప్పుడు మాని వేస్తారు. మీరు ఆ విగ్రహాలను తయారు చేసినప్పుడు మీరు నిజంగా పాపం చేసారు.

నిజమే, అష్షూరు ఖడ్గం చేత ఓడించబడుతుంది, కానీ ఆ ఖడ్గం మానవ ఖడ్గం కాదు. అష్షూరు ఓడించబడుతుంది. కానీ ఆ నాశనం మనిషి ఖడ్గం ద్వారా జరగదు. అష్షూరు దేవుని ఖడ్గం నుండి పారిపోతుంది. కానీ యువకులు పట్టుబడి, బానిసలవుతారు. వారి భద్రతా స్థలం నాశనం చేయబడుతుంది. వారి నాయకులు ఓడించబడి, వారి పతాకాన్ని విడిచిపెడ్తారు.

ఆ విషయాలన్నీ యెహోవా చెప్పాడు. యెహోవా అగ్ని (బలిపీఠం) సీయోను మీద ఉంది. యెహోవా కొలిమి (బలిపీఠం) యెరూషలేములో ఉంది.

నాయకులు మంచివారిగాను, నీతిమంతులుగాను ఉండాలి

32 నేను చెప్పే విషయాలు విను. ఒక రాజు మంచిని పెంచే విధంగా పాలించాలి. నాయకులు ప్రజలను నడిపించేటప్పుడు వారు న్యాయమైన తీర్మానాలు చేయాలి. ఇలా జరిగితే, అప్పుడు గాలివాన నుండి దాగుకొనే చోటులా ఉంటాడు ఆ రాజు. అది ఎండిన భూమిలో నీటి కాలువలు ప్రవహించినట్టుగా ఉంటుంది. వేడి ప్రదేశంలో ఒక పెద్ద బండ చాటున చల్లని నీడలా ఉంటుంది అది. ప్రజలు సహాయం కోసం రాజువైపు తిరుగుతారు, వారు ఆయన చెప్పే మాటలు నిజంగా వింటారు. ఇప్పుడు గందరగోళంలో పడిన మనుష్యులు గ్రహించగలుగుతారు. ఇప్పుడు తేటగా మాట్లాడలేని మనుష్యులు, అప్పుడు తేటగా, వేగంగా మాట్లాడగలుగుతారు. వెర్రివాళ్లు గొప్పవాళ్లని పిలువబడరు. రహస్య పథకాలు వేసే వారిని ప్రజలు గౌరవించరు.

తెలివి తక్కువ వాడు తెలివి తక్కువ సంగతులు చెబుతాడు, అతడు చెడ్డపనులు చేయాలని తన మనసులో ఆలోచిస్తాడు. తెలివి తక్కువ వాడు తప్పు పనులు చేయాలనుకొంటాడు. తెలివి తక్కువ వాడు యెహోవాను గూర్చి చెడ్డ మాటలు చెబుతాడు. తెలివి తక్కువ వాడు ఆకలితో ఉన్న వాళ్లను అన్నం తిననీయడు. తెలివి తక్కువ వాడు దప్పిగొన్న వారిని నీళ్లు తాగనివ్వడు. ఆ తెలివి తక్కువ వాడు చెడును సాధనంగా వాడుకొంటాడు. పేద ప్రజల దగ్గర్నుండి సమస్తం దోచుకొనేందుకు అతడు పథకం వేస్తాడు. ఆ తెలివి తక్కువ వాడు పేద ప్రజలను గూర్చి అబద్ధాలు చెబుతాడు. వాని అబద్ధాలు పేదవారికి న్యాయం జరుగకుండా చేస్తాయి.

అయితే మంచి నాయకుడు మంచి పనులు చేయాలని ఆలోచిస్తాడు. ఆ మంచి పనులే అతణ్ణి మంచి నాయకుడ్ని చేస్తాయి.

కఠిన సమయాలు వస్తున్నాయి

స్త్రీలు కొందరు ఇప్పుడు నెమ్మదిగా ఉన్నారు. మీరు క్షేమం అనుకొంటున్నారు. కానీ మీరు లేచి, నేను చెప్పే మాటలు వినాలి. 10 స్త్రీలారా మీరు ఇప్పుడు క్షేమంగా ఉన్నాం అనుకొంటున్నారు. కానీ ఒక సంవత్సరం తర్వాత మీకు కష్టం వస్తుంది. ఎందుకంటే వచ్చే సంవత్సరం మీరు కూర్చుకొనేందుకు ద్రాక్షపండ్లు ఉండవు గనుక మీరు ద్రాక్షపండ్లు ఏరుకోరు.

11 స్త్రీలారా మీరు ఇప్పుడు నెమ్మదిగా ఉన్నారు. కానీ మీరు భయపడాలి. స్త్రీలారా, ఇప్పుడు మీరు క్షేమంగా ఉన్నాం అనుకొంటున్నారు. కానీ మీరు దిగులుపడాలి. మీ అందమైన వస్త్రాలు తీసివేసి, విచార వస్త్రాలు ధరించండి. ఆ బట్టలు మీ నడుములకు చుట్టుకోండి. 12 దుఃఖంతో నిండిన మీ రొమ్ములను ఆ దుఃఖవస్త్రాలతో కప్పుకొనండి. మీ పొలాలు ఖాళీగా ఉన్నాయి గనుక ఏడ్వండి. మీ ద్రాక్ష తోటలు ఒకప్పుడు ద్రాక్ష పండ్లు ఇచ్చాయి కానీ ఇప్పుడు అవి ఖాళీ. 13 నా ప్రజల భూమి కోసం ఏడ్వండి, ముళ్లకంపలు, గచ్చ పొదలు మాత్రమే అక్కడ పెరుగుతాయి గనుక ఏడ్వండి. పట్టణం కోసం, ఒకప్పుడు ఆనందంతో నిండిన అన్ని గృహాల కోసం ఏడ్వండి.

14 ప్రజలు రాజధాని నగరం విడిచి పెట్టేస్తారు. రాజ భవనం, గోపురాలు ఖాళీగా విడిచిపెట్టబడతాయి. ప్రజలు ఇండ్లలో నివసించరు. వారు గుహలలో నివసిస్తారు. అడవి గాడిదలు, గొర్రెలు పట్టణంలో నివసిస్తాయి. పశువులు అక్కడ గడ్డి మేయటానికి వెళ్తాయి.

15-16 దేవుడు పైనుండి తన ఆత్మను మనకు ఇచ్చేంతవరకు ఇది కొనసాగుతుంది. ఇప్పుడు దేశంలో మంచి లేదు. అది ఒక అరణ్యంలా ఉంది. కానీ భవిష్యత్తులో ఆ అరణ్యం కర్మెలు దేశంలా ఉంటుంది, అక్కడ న్యాయమైన తీర్పు వుంటుంది. మరియు కర్మెలు పచ్చని అడవిలా ఉంటుంది. అక్కడ మంచితనం ఉంటుంది. 17 ఆ మంచితనం శాంతి, భద్రతలు తెచ్చిపెడ్తుంది. 18 అందమైన శాంతి వనంలో నా ప్రజలు నివసిస్తారు. క్షేమకరమైన గుడారాల్లో నా ప్రజలు నివసిస్తారు. నెమ్మదైన, శాంతస్థలాల్లో వారు నివసిస్తారు.

19 కానీ ఈ సంగతులు జరుగక ముందు అరణ్యం కూలిపోవాలి. ఆ పట్టణం ఓడించబడాలి. 20 మీలో కొంతమంది ప్రతి కాలువ దగ్గరా విత్తనాలు విత్తుతారు. మీ పశువులను, గాడిదలను మీరు స్వేచ్చగా తిరుగ నిస్తారు, తిననిస్తారు. మీరు చాలా సంతోషంగా ఉంటారు.

దేవుడు తన శక్తిని చూపిస్తాడు

33 మీరు యుద్ధం చేసి ప్రజల దగ్గర్నుండి దొంగిలిస్తారు, ఆ ప్రజలు మాత్రం మీ దగ్గర ఎన్నడూ ఏమీ దొంగిలించలేదు. మీరు ప్రజల మీద దాడిచేస్తారు. ఆ ప్రజలు మిమ్మల్ని ఎన్నడూ ఎదిరించ లేదు. కనుక మీరు దొంగిలించటం మాని వేసినప్పుడు ఇతరులు మీ దగ్గర దొంగిలించటం మొదలు పెడ్తారు. మీరు ప్రజల మీద పడటం మానివేసినప్పుడు, ఆ ప్రజలు మీ మీద పడటం మొదలు పెడ్తారు. అప్పుడు మీరంటారు.

దేవుడు తన ప్రజలకు సహాయం చేస్తాడు
    “యెహోవా మామీద దయ చూపు నీ సహాయం కోసం మేము కనిపెట్టాం
యెహోవా, ప్రతి ఉదయం మాకు బలం దయచేయి.
    మేం కష్టంలో ఉన్నప్పుడు మమ్మల్ని రక్షించు.
నీ శక్తిగల స్వరం ప్రజలను భయపెడ్తుంది కనుక వారు నీ దగ్గర్నుండి పారిపోతారు.
    నీ మహాత్మ్యం రాజ్యాలనే పారిపోయేట్టు చేస్తుంది.”

మీరు యుద్ధంలో వస్తువులు దొంగిలించారు. ఆ వస్తువులు మీ దగ్గర్నుండి తీసుకోబడతాయి. చాలా, చాలామంది వచ్చి మీ ధనాన్ని దోచుకొంటారు. అది మిడతలు వచ్చి మీ పంటలన్నింటినీ తినివేసే సందర్భంలాగా వుంటుంది.

యెహోవా ఎంతో గొప్పవాడు. ఆయన మహాఉన్నత స్థలంలో ఉంటాడు. సీయోనును న్యాయంతో, మంచితనంతో యెహోవా నింపుతాడు.

యెరూషలేమూ, నీవు దేవుని జ్ఞానంతో, తెలివితో ఐశ్వర్యవంతంగా ఉన్నావు. నీవు రక్షణతో ఐశ్వర్యవంతంగా ఉన్నావు. నీవు యెహోవాను గౌరవిస్తావు. అది నిన్ను ఐశ్వర్యవంతురాలిగా చేస్తుంది. కనుక నీవు కొనసాగుతావు అని నీవు తెలుసుకోవచ్చు.

కానీ, విను! బయట దేవదూతలు ఏడుస్తున్నారు. శాంతి సందేశం తీసుకొనివచ్చే ఆ దూతలు చాలా గట్టిగా ఏడుస్తున్నారు. రోడ్లు నాశనం అయ్యాయి. వీధుల్లో ఎవ్వరూ నడవటం లేదు. ప్రజలు వారు చేసుకున్న ఒడంబడికలను ఉల్లంఘించారు. సాక్షుల రుజువులను అంగీకరించటానికి ప్రజలు నిరాకరిస్తున్నారు. ఎవ్వరూ ఇతరులను గౌరవించటంలేదు. దేశం వ్యాధిగ్రస్తమై, చస్తూ ఉంది. లెబానోను చస్తూ ఉంది, షారోను లోయ ఎండిపోయి, ఖాళీగా ఉంది. బాషాను, కర్మెలులో ఒకప్పుడు అందమైన మొక్కలు పెరిగాయి కానీ ఆ మొక్కలు ఎదగటం మానేశాయి.

10 యెహోవా చెబుతున్నాడు, “ఇప్పుడు నేను లేచి నా మహిమను చూపిస్తాను. నేను ఇప్పుడు ప్రజలకు ప్రముఖుడనవుతాను. 11 ప్రజలారా మీరు పనికి మాలిన పనులు చేశారు. ఆ పనులు గడ్డిలా, గడ్డిపోచలా ఉన్నాయి. అవి దేనికీ పనికిరావు. మీ ఆత్మ అగ్నిలా ఉండి మిమ్మల్ని కాల్చేస్తుంది. 12 మనుష్యుల ఎముకలు సున్నంలా అయ్యేంత వరకు వారు కాల్చబడుతారు. ప్రజలు ముళ్లకంపల్లా, ఎండిపోయిన పొదల్లా త్వరగా కాలిపోతారు.

13 “దూరదేశాల్లో ఉన్న ప్రజలారా నేను చేసిన కార్యాలను గూర్చి వినండి. నాకు దగ్గర్లో వున్న ప్రజలారా, మీరు నా శక్తిని గూర్చి తెలుసుకోండి.”

14 సీయోనులో పాపులు భయపడుతున్నారు. చెడ్డ పనులు చేసేవారు భయంతో వణకుతున్నారు. “మనల్ని నాశనం చేసే ఈ అగ్నిలో నుండి మనలో ఎవరైనా బ్రతకగలమా? శాశ్వతంగా మండుతూ ఉండే ఈ అగ్ని దగ్గర ఎవరు బ్రతకగలరు?” అని వారంటున్నారు.

15 మంచివాళ్లు, నిజాయితీపరులు డబ్బుకోసం ఇతరులను బాధించని వాళ్లు ఆ అగ్నిగుండా బతుకుతారు. ఆ ప్రజలు లంచాలు నిరాకరిస్తారు. ఇతరులను హత్య చేసే పథకాలను గూర్చి వినటానికి గూడ వారు నిరాకరిస్తారు. చెడ్డ పనులు చేసేందుకు వేసిన పథకాలను చూచేందుకు గూడా వారు నిరాకరిస్తారు. 16 ఆ ప్రజలు ఉన్నతమైన స్థలాల్లో క్షేమంగా జీవిస్తారు. ఎత్తయిన బండల కోటలలో వారు భద్రంగా కాపాడబడతారు. ఆ ప్రజలకు ఆహారం, నీళ్లు ఎల్లప్పుడూ ఉంటాయి.

17 రాజును (దేవుణ్ణి) ఆయన సంపూర్ణ సౌందర్యంలో మీరు చూస్తారు. ఆ మహా దేశాన్ని మీరు చూస్తారు. 18-19 గతంలో మీకు కలిగిన కష్టాలను గూర్చి మీరు ఆలోచిస్తారు. “ఆ ఇతర దేశాల మనుష్యులు ఎక్కడ? మనకు అర్థం కాని భాషలు వాళ్లు మాట్లాడారు. ఇతర దేశాల అధికారులు, పన్ను వసూలు చేసే వాళ్లు అంతా ఏమయ్యారు? మన రక్షణ గోపురాలను లెక్కించిన ఆ గూఢచారులు ఎక్కడ? వాళ్లంతా పోయారు!” అని మీరు అనుకొంటారు.

దేవుడు యెరూషలేమును కాపాడుతాడు

20 మన మతపరమైన పండుగల పట్టణం సీయోనును చూడు. ఆ అందమైన విశ్రాంతి స్థలం యెరూషలేమును చూడు. ఎన్నటికీ కదలని ఒక గుడారంలా ఉంది యెరూషలేము. దానిని తన స్థానంలో ఉంచే మేకులు ఎన్నటికి పెరికి వేయబడవు. దాని తాళ్లు ఎన్నటికీ తెగిపోవు. 21-23 ఎందుకంటే, శక్తిగల యెహోవా అక్కడ ఉన్నాడు గనుక. ఆ దేశం ఏరులు, పెద్ద నదులు ఉన్న దేశం. కాని ఆ నదుల్లో శత్రు పడవలుగాని లేక బలమైన ఓడలుగాని ఏమీ ఉండవు. ఆ పడవల్లో పనిచేసే మనుష్యులారా, మీరు మీ త్రాళ్ల పని విడిచి పెట్టవచ్చును. ఓడ కొయ్యను చాలినంత గట్టిగా చేయలేరు. మీరు మీ తెర చాపలను తెరువలేరు. ఎందుకంటే, యెహోవాయే మన న్యాయమూర్తి మన చట్టాలను యెహోవా చేస్తాడు. యెహోవా మన రాజు. ఆయన మనలను రక్షిస్తాడు. అందుచేత యెహోవా మనకు విస్తారమైన ఐశ్వర్యం ఇస్తాడు. కుంటివాళ్లు సహా యుద్ధంలో గొప్ప ఐశ్వర్యాలు సంపాదిస్తారు. 24 అక్కడ జీవించే ఏ మనిషీ “నాకు జబ్బు” అని చెప్పడు. అక్కడ నివసించే ప్రజలు పాపాలు క్షమించబడిన ప్రజలు.

దేవుడు తన శత్రువులను శిక్షిస్తాడు

34 సకల రాజ్యములారా, దగ్గరగా వచ్చి, వినండి. ప్రజలారా, మీరంతా దగ్గరగా ఉండి వినండి. భూమి, భూమిమీద ఉన్న ప్రజలు అందరూ ఈ సంగతులు వినాలి. సకల రాజ్యాల మీదా, వాటి సైన్యాల మీదా యెహోవా కోపంగా ఉన్నాడు. యెహోవా వాళ్లందర్ని నాశనం చేస్తాడు వాళ్లందరు చంపబడేట్టు యెహోవా చేస్తాడు. వారి శరీరాలు బయట పారవేయబడతాయి. ఆ శవాలనుండి కంపువస్తుంది. వారి రక్తం కొండల నుండి ప్రవహిస్తుంది. ఆకాశాలు కాగితం చుట్టలా చుట్టబడతాయి. నక్షత్రాలు చచ్చి, ద్రాక్ష లేక అంజూర చెట్ల ఆకులు రాలినట్లు రాలిపోతాయి. ఆకాశంలోని నక్షత్రాలన్నీ కరిగి పోతాయి. “ఆకాశంలో నా ఖడ్గం రక్తసిక్తమైనప్పుడు ఇది జరుగుతుంది” అని యెహోవా చెబుతున్నాడు.

చూడండి! యెహోవా ఖడ్గం ఎదోముగుండా దూసుకొనిపోతుంది. ఆ ప్రజలు దోషులని యెహోవా తీర్పు చెప్పాడు, గనుక వారు చావాల్సిందే. ఎందుకంటే, బొస్రాలో, ఎదోములో చంపబడే సమయం ఒకటి ఉండాలని యెహోవా నిర్ణయించాడు. కనుక పొట్టేళ్లు, పశువులు, బలమైన కోడెదూడలు చంపబడతాయి. దేశం వాటి రక్తంతో నిండిపోతుంది. దుమ్ము వాటి కొవ్వుతో నిండిపోతుంది.

శిక్షా సమయం ఒకటి యెహోవా ఏర్పాటు చేశాడు గనుక ఆ సంగతులు జరుగుతాయి. ప్రజలు సీయోనుకు చేసిన కీడులకు వారు బదులు చెల్లించటానికి యెహోవా ఒక సంవత్సరాన్ని ఎంచుకొన్నాడు. ఎదోము నదులు వేడి తారులా ఉంటాయి. ఎదోము నేల మండుతున్న గంధకంలా ఉంటుంది. 10 అగ్ని రాత్రింబవళ్లు మండుతూ ఉంటుంది. అగ్నిని ఎవ్వరూ ఆర్పివేయలేరు. ఎదోమునుండి పొగ శాశ్వతంగా లేస్తుంది. ఆ దేశం శాశ్వతంగా ఎప్పటికీ నాశనం చేయబడుతుంది. ఆ దేశంగుండా మళ్లీ ఎవ్వరూ ఎన్నడూ ప్రయాణం చేయరు. 11 పక్షులు, చిన్న జంతువులు ఆ దేశాన్ని స్వంతంగా వాడుకొంటాయి. గుడ్లగూబలు, కాకులు అక్కడ నివసిస్తాయి. ఆ దేశం “శూన్య ఎడారి” అని పిలువబడుతుంది. 12 స్వతంత్రులు, నాయకులు అంతా పోతారు. వారు పాలించేందుకు అక్కడ ఏమీ మిగిలి ఉండదు.

13 అక్కడి అందమైన గృహాలన్నింటిలో ముళ్ల కంపలు, పిచ్చిపొదలు పెరుగుతాయి. అడవి కుక్కలు, గుడ్లగూబలు ఆ ఇండ్లలో నివసిస్తాయి. అడవి జంతువులు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొంటాయి. అక్కడ పెరిగే గడ్డి దుబ్బుల్లో పెద్ద పక్షులు నివసిస్తాయి. 14 అడవి పిల్లులు నక్కలతో కలిసి అక్కడ నివసిస్తాయి. అడవి మేకలు వాటి స్నేహితులను పిలుచుకొంటాయి. రాత్రులు తిరిగే జంతువులు అక్కడ విశ్రాంతి స్థలం చూచుకొంటాయి. 15 పాములు అక్కడ పుట్టలు పెడ్తాయి. పాములు అక్కడ గుడ్లు పెడ్తాయి. గుడ్లు పగులుతాయి పాము పిల్లలు ఆ చీకటి స్థలాల్లో పాకుతాయి. చచ్చిన శవాలను తినే పక్షులు, ఆడవాళ్లు వారి స్నేహితురాళ్లను కలుసుకొన్నట్టుగా అక్కడ కలుసుకొంటాయి.

16 యెహోవా గ్రంథాన్ని చూడండి. అక్కడ ఏమి వ్రాసి ఉందో చదవండి. ఏమీ తప్పిపోలేదు. ఆ జంతువులు కలిసి ఉంటాయని ఆ గ్రంథములో వ్రాయబడిఉంది. వాటిని ఒక్క చోట చేరుస్తానని దేవుడు చెప్పాడు. కనుక దేవుని ఆత్మ వాటిని ఒక్క చోట చేర్చటం జరుగుతుంది. 17 వాటి విషయంలో చేయాల్సిన దాన్ని దేవుడు నిర్ణయం చేశాడు. అప్పుడు దేవుడు వాటికి ఒక చోటు నిర్ణయించాడు. దేవుడు ఒక గితగీసి, వాటి స్థలం వాటికి చూపించాడు. అందుచేత ఆ దేశం ఆ జంతువులకు శాశ్వతంగా స్వంతం. సంవత్సరం వెంబడి సంవత్సరం అవి అక్కడే నివసిస్తాయి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International