Chronological
యూదా రాజుగా ఆహాజు
28 ఆహాజు రాజయ్యేనాటికి ఇరవై యేండ్లవాడు. అతడు యెరూషలేములో పదహారు సంవత్సరాలు పాలించాడు. తన పూర్వీకుడైన దావీదువలె ఆహాజు మంచి మార్గంలో నడవలేదు. యెహోవా ఆశించిన విధంగా సత్కార్యాలు చేయలేదు. 2 ఇశ్రాయేలు రాజులు అనుసరించిన చెడుమార్గాన్నే ఆహాజు కూడ అనుసరించాడు. బయలు దేవతలను ఆరాధించటానికి అతడు విగ్రహాలను పోతపోయించాడు. 3 బెన్హీన్నోము లోయలో[a] ఆహాజు ధూపం వేశాడు. అతడు తన స్వంత కుమారులనే అగ్నిలో కాల్చి దేవతలకు బలియిచ్చాడు. ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు ఒడిగట్టే భయంకర పాపాలకే అతడు కూడా పాల్పడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ రాజ్యంలో ప్రవేశించినప్పుడు యెహోవా బయటకు తరిమివేసిన నీచవ్యక్తులే ఈ ప్రజలు. 4 గుట్టలమీద, కొండలమీద, ప్రతి పచ్చని చెట్టు కిందా ఆహాజు బలులు అర్పించి, ధూపం వేశాడు.
5-6 ఆహాజు పాపం చేయటంతో అతని దేవుడైన యెహోవా అతనిని అరాము (సిరియా) రాజు చేతిలో ఓడిపోయేలా చేశాడు. అరాము రాజు, అతని సైన్యం ఆహాజును ఓడించి, అనేకమంది యూదా వారిని బందీలుగా పట్టుకున్నారు. అరాము రాజు ఆ బందీలను దమస్కు (డెమాస్కస్) నగరానికి పట్టుకుపోయాడు. ఇశ్రాయేలు రాజైన పెకహు కూడా ఆహాజును ఓడించేలా యెహోవా చేశాడు. పెకహు తండ్రి పేరు రెమల్యా. పెకహు అతని సైన్యం కలిసి ఒక్కరోజులో యూదాకు చెందిన ఒక లక్షా ఇరవై వేలమంది ధైర్యంగల సైనికులను చంపివేశారు. వారి పూర్వీకులు విధేయులైవున్న వారి దేవుడైన యెహోవాకు వారు అవిధేయులైనందువల్ల పెకహు యూదా ప్రజలను ఓడించ గలిగాడు. 7 ఎఫ్రాయిముకు చెందిన జిఖ్రి ధైర్యంగల సైనికుడు. రాజైన ఆహాజు కుమారుడు మయశేయాను, రాజగృహ నిర్వహణాధికారి అజ్రీకామును, మరియు ఎల్కానాను జిఖ్రి చంపివేశాడు. రాజు తరపున అధికారం చెలాయించే వారిలో రాజు తరువాతివాడు ఎల్కానా.
8 ఇశ్రాయేలు సైన్యం యూదాలో నివసిస్తున్న తమ బంధువులైన రెండు లక్షల మందిని బందీచేశారు. వారు యూదా నుంచి స్త్రీలను, పిల్లలను, అనేక విలువైన వస్తువులను పట్టుకుపోయారు. ఇశ్రాయేలీయులు ఆ బందీలను, వస్తువులను సమరయకు (షోమ్రోను) తీసుకొనిపోయారు. 9 కాని యెహోవా ప్రవక్తలలో ఒకడు అక్కడ వున్నాడు. ఈ ప్రవక్త పేరు ఓదేదు. సమరయకు తిరిగి వచ్చిన ఇశ్రాయేలు సైన్యాన్ని ఓదేదు కలిశాడు. ఇశ్రాయేలు సైన్యంతో ఓదేదు యిలా అన్నాడు: “మీ పూర్వీకులు ఆరాధించిన దేవుడైన యెహోవా యూదా ప్రజలపట్ల కోపంగా వున్న కారణంగా వారిని మీరు ఓడించగలిగేలా చేశాడు. మీరు యూదా ప్రజలను నీచమైన విధంగా చంపి, శిక్షించారు. ఇప్పుడు యెహోవా మీపట్ల కోపంగా వున్నాడు. 10 మీరు యూదా, యెరూషలేము ప్రజలను బానిసలుగా చేయాలని తలస్తున్నారు. మీరు మీ దేవుడైన యెహోవాపట్ల కూడా పాపం చేశారు. 11 ఇప్పుడు నేను చెప్పేది వినండి. మీరు చెరపట్టిన మీ సోదరులను వెనుకకు పంపివేయండి. యెహోవా యొక్క భయంకరమైన కోపం మీమీది వుంది గనుక మీరీపని చేయండి.”
12 ఎఫ్రాయిములో కొంతమంది పెద్దలు ఇశ్రాయేలు సైనికులు యుద్ధం నుండి తిరిగి రావటం చూశారు. ఆ పెద్దలు ఇశ్రాయేలు సైనికులను కలిసి వారిని హెచ్చరించారు. ఆ పెద్దలు యెహానాను కుమారుడు అజర్యా, మెషిల్లేమోతు కుమారుడు బెరెక్యా, షల్లూము కుమారుడు యెహిజ్కియా, మరియు హద్లాయి కుమారుడు అమాశా. 13 వారు ఇశ్రాయేలు సైనికులతో యిలా చెప్పారు: “యూదా నుండి బందీలను ఇక్కడికి తీసుకొని రావద్దు. మీరాపని చేస్తే అది యెహోవా పట్ల మన పాపాన్ని, దోషాన్ని మరింత ఎక్కువ చేస్తుంది. దానితో ఇశ్రాయేలుపట్ల యెహోవా కోపం పట్టరానిదవుతుంది.”
14 అందువల్ల బందీలను, విలువైన వస్తులను సైనికులు ఆ పెద్దలకు, ఇశ్రాయేలు ప్రజలకు అప్పజెప్పారు. 15 ఇంతకుముందు పేర్కొన్న పెద్దలు (అజర్యా, బెరెక్యా, యెహిజ్కియా, మరియు అమాశా) నిలబడి బందీలకు సహాయపడ్డారు. ఇశ్రాయేలు సైనికులు తీసుకొన్న వారి దుస్తులను పెద్దలు తిరిగి తీసుకొని, దిగంబరంగా ఉన్న బందీలకు యిచ్చారు. పెద్దలు వారికి పాదరక్షలు కూడా యిచ్చారు. యూదా నుండి వచ్చిన బందీలకు అన్నపానాదులు కూడా పెద్దలు యిచ్చారు. సేద తీరటానికి వారికి నూనెతో కూడ వారు మర్దనా చేశారు. పిమ్మట ఆ ఎఫ్రాయిము పెద్దలు నీరసంగా వున్న బందీలను గాడిదలపై ఎక్కించి యెరికో పట్టణంలో తమ ఇండ్లకు తీసుకొని వెళ్లారు. యెరికోకు ఖర్జూర చెట్ల పట్టణమని పేరు. పిమ్మట ఆ నలుగురు పెద్దలు సమరయకు తిరిగి వెళ్లారు.
16-17 అదే సమయంలో ఎదోమీయులు మళ్లీ వచ్చి యూదా ప్రజలను ఓడించారు. ఎదోమీయులు ప్రజలను బందీలుగా పట్టుకుపోయారు. అందువల్ల రాజైన ఆహాజు అష్షూరు రాజు సహాయాన్ని అర్థించాడు. 18 కొండప్రాంతంలోను, దక్షిణ యూదా ప్రాంతంలోనుగల పట్టణాలపై ఫిలిష్తీయులు దాడులు జరిపారు. బేత్షెమెషు, అయ్యాలోను, గెదెరోతు, శోకో, తిమ్నా మరియు గిమ్జో పట్టణాలను ఫిలిష్తీయులు పట్టుకున్నారు. వారా పట్టణాలకు సమీపంలో వున్న గ్రామాలను కూడా ఆక్రమించుకున్నారు. పిమ్మట ఫిలిష్తీయులు వాటిలో నివసించసాగారు. 19 యూదా రాజైన ఆహాజు యూదా ప్రజలను పాపకార్యాలకు ప్రోత్సహించిన కారణంగా యెహోవా వారికి కష్టాలు కల్పించాడు. యెహోవా పట్ల అతడు అసలు విశ్వాసం లేకుండా ప్రవర్తించాడు. 20 అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు వచ్చి ఆహాజుకు సహాయం చేయటానికి బదులు అతనికి కష్టనష్టాలు కల్గించాడు. 21 ఆహాజు ఆలయం నుండి, రాజగృహం నుండి, యువరాజు ఆలయం నుండి విలువైన వస్తువులు కొన్ని తీశాడు. ఆహాజు వాటిని అష్షూరు రాజుకు యిచ్చాడు. అయినా ఆ పని అతనికి సహాయపడలేదు.
22 ఆహాజు తన కష్టాలతో సతమతమవుతూ మరిన్ని పాపాలు చేసి యెహోవా పట్ల మరీ విశ్వాసంలేని వాడయ్యాడు. 23 దమస్కు ప్రజలు ఆరాధించే దేవతలకు అతడు బలులు అర్పించాడు. దమస్కు ప్రజలు ఆహాజును ఓడించారు. అందువల్ల అతడిలా అనుకున్నాడు: “అరాము (సిరియా) ప్రజలు పూజించే దేవుళ్లు వారికి సహాయపడి వుండవచ్చు. కావున నేను కూడా ఆ దేవుళ్లకు బలులు అర్పిస్తే బహుశః వారు నాకు కూడా సహాయం చేయవచ్చు.” అందువల్ల ఆహాజు ఆ దేవుళ్లను ఆరాధించాడు. ఈ రకంగా అతడు పాపం చేసి, ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపం చేయటానికి కారకుడయ్యాడు.
24 ఆహాజు ఆలయంలో వున్న వస్తువులను సేకరించి వాటిని ముక్కలు ముక్కలు చేశాడు. పిమ్మట అతడు ఆలయాన్ని మూసేశాడు. అతడు బలిపీఠాలు తయారు చేయించి, వాటిని యెరూషలేములో ప్రతివీధి చివర నెలకొల్పాడు. 25 యూదాలో ప్రతి పట్టణంలోనూ ఆహాజు ధూపాలు వేసి అన్యదేవతలను ఆరాధించటానికి ఉన్నత స్థలాలను ఏర్పాటు చేశాడు. ఇవన్నీ చేసి ఆహాజు తన పూర్వీకులు ఆరాధించిన ప్రభువైన యెహోవాకు ఎక్కడలేని కోపాన్నీ కల్గించాడు.
26 మొదటి నుండి చివరి వరకు ఆహాజు చేసిన పనులన్నీ యూదా, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో వ్రాయబడ్డాయి. 27 ఆహాజు చనిపోగా, అతడు అతని పూర్వీకులతోపాటు సమాధి చేయబడ్డాడు. ప్రజలు ఆహాజును యెరూషలేము నగరంలో సమాధి చేశారు. కాని ఆహాజును ఇశ్రాయేలు రాజులను సమాధిచేసే చోట మాత్రం వారు సమాధి చేయలేదు. ఆహాజు స్థానంలో అతని కుమారుడు హిజ్కియా కొత్త రాజయ్యాడు.
యూదాలో అహాజు రాజు అగుట
16 యోతాము కుమారుడైన అహాజు యూదాకు రాజయ్యాడు. రెమల్యా కుమారుడైన పెకహు ఇశ్రాయేలుకు రాజుగా వున్న 17వ సంవత్సరమున అది జరిగింది. 2 అహాజు రాజయ్యేనాటికి, అతను 20 యేండ్లవాడు. యోరూషలేములో అహాజు 16 సంవత్సరాలు పరిపాలించాడు. యెహోవా చేయుమని చెప్పిన పనులు అహాజు చేయలేదు. తన పూర్వికుడైన దావీదు దేవునికి విధేయుడు. కానీ తన పూర్వీకులవలె అహాజు యెహోవాకి విధేయత చూపలేదు. 3 అహాజు ఇశ్రాయేలు రాజులవలె నివసించాడు. అతను తన కుమారుని కూడా అగ్నిలో బలిగా అర్పించాడు. ఇశ్రాయేలు వారు వచ్చినప్పుడు యెహోవా విడిచి వెళ్లుటకు కారణమైన ఆ జనాంగములు చేసిన భయంకర పాపాలను అతను అనుసరించాడు. 4 అహాజు బలులు అర్పిస్తూ ఉన్నత స్థలాలలో ధూపం వేసాడు; కొండల మీద ప్రతి పచ్చని చెట్టు క్రిందను వెలిగించాడు.
5 సిరియా రాజయిన రెజీను రెమల్యా కుమారుడు మరియు ఇశ్రాయేలు రాజయిన పెకహు యెరూషలేముకు ప్రతికూలంగా యుద్ధం చేయడానికి వచ్చారు. రెజీను పెకహు కలిసి అహాజుని చుట్టుముట్టారు; కాని ఓడించలేకపోయారు. 6 ఆ సమయంలో సిరియా రాజయిన రెజీను సిరియా కోసం ఏలతును తిరిగి పొందాడు. ఏలతులో నివసించే యూదా వారినందరిని రెజీను తీసుకుపోయాడు. ఏలతులో స్థిరపడిన సిరియనులు నేటికీ అక్కడే నివసిస్తున్నారు.
7 అష్షూరు రాజయిన తిగ్లత్పిలేసెరు వద్దకు అహాజు దూతలను పంపాడు. సందేశం ఏమనగా: “నేను మీ సేవకుడను. నేను మీకు కుమారునివంటి వాడను. సిరియా రాజు, ఇశ్రాయేలు రాజుల నుండి నన్ను మీరు కాపాడవలెను. వారు నాతో యుద్ధం చేయడానికి వచ్చారు.” 8 యెహోవా ఆలయంలోను, రాజభవన నిధులలోను వున్న వెండి బంగారాలను అహాజు తీసుకొని పోయాడు. తర్వాత అహాజు అష్షూరు రాజుకి కానుక పంపాడు. 9 అష్షూరు రాజు అహాజు మాట ఆలకించాడు. అష్షూరు రాజు దమస్కుకు ప్రతికూలంగా యుద్ధానికి పోయాడు. రాజు ఆ నగరాన్ని వశం చేసుకున్నాడు; ప్రజలను బందీలుగా చేసి దమస్కు నుండి కీరుకి తీసుకునిపోయాడు. అతను రెజీనును కూడా చంపివేశాడు.
10 అహాజు రాజు అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరును కలుసుకునేందుకు దమస్కు వెళ్లాడు. దమస్కులో అహాజు బలిపీఠం చూశాడు. అహాజు రాజు దీని నమూనాని పద్దతిని ఊరియా యాజకునికి పంపాడు. 11 తర్వాత యాజకుడయిన ఊరియా దమస్కు నుండి అహాజు రాజు పంపిన నమూనాననుసరించి ఒక బలిపీఠం నిర్మించాడు. దమస్కు నుండి అహాజు రాజు రాకకు పూర్వమే ఊరియా యాజకుడు అదే రకమైన బలిపీఠం నిర్మించాడు.
12 దమస్కు నుండి రాజు రాగానే, అతను బలిపీఠం చూశాడు. ఆ బలిపీఠం వద్ద రాజు బలులు అర్పించాడు. 13 బలిపీఠం మీద అహాజు దహన బలులు ధాన్యార్పణలు అర్పించాడు. అతను పానీయ అర్పణలు, సమాధాన బలులు ఈ బలిపీఠం మీద అర్పించాడు.
14 అహాజు ఆలయం ముందు భాగం నుండి యెహోవా సమక్షంలోవున్న కంచు బలిపీఠం తీసుకున్నాడు. ఈ కంచు బలిపీఠం అహాజు బలిపీఠానికి యెహోవా ఆలయానికి మధ్య వున్నది. తన సొంత బలిపీఠానికి ఉత్తర దిశగా కంచు బలిపీఠం ఉంచాడు. 15 అహాజు ఊరియా యాజకునికి ఆజ్ఞ విధించాడు: “ఉదయపు దహనబలులను, సాయంకాలపు ధాన్యార్పణలను, ఈ దేశంలోని ప్రజల పానీయ అర్పణలకు ఈ పెద్ద బలిపీఠం ఉపయోగించాలి. వండబడిన బలులు దహన బలులు మరి ఇతర బలుల నుండి తీసిన రక్తాన్ని పెద్ద బలిపీఠం మీద చల్లాలి. కాని అవసరము వచ్చినప్పుడల్లా నేను కంచు బలిపీఠం ఉపయోగిస్తాను.” 16 అహాజు రాజు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఊరియా యాజకుడు జరిగించాడు.
17 యాజకులు తమ చేతులు కడుగుకొనేందుకు బళ్ల నిండుగా ఇత్తడి గంగాళాలు, లోతు పళ్లాలు వున్నవి. అహాజు రాజు ఆ గంగాళాలు, లోతు పళ్లెములు తొలగించి బండ్లని ముక్కలు చేశాడు. కంచు స్తంభాల మీద నున్న పెద్ద తొట్టిని తీసివేశాడు. ఆ పెద్ద తొట్టిని చదును చేయబడిన రాయిపై వుంచాడు. 18 ఆలయంలోని ప్రతి భాగంలో సబ్బాతు సమావేశాల కోసం పనివారు మూయబడిన ఒక ప్రదేశం తయారు చేశారు. అహాజు రాజు తన కోసం కప్పియున్న మండపము మరియు వెలుపలి ప్రవేశాన్ని తీసివేశాడు. వాటన్నిటినీ యెహోవా ఆలయంనుంచి అహాజు తీసివేశాడు. అష్షూరు రాజుకోసం అహాజు అవి చేశాడు.
19 అహాజు చేసిన ఆ కార్యాలన్నీ “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. 20 అహాజు మరణించగా అతను దావీదు నగరంలో అతని పూర్వికులతో పాటు సమాధి చేయబడ్డాడు. అహాజు కుమారుడు హిజ్కియా, అతని తర్వాత క్రొత్తగా రాజయ్యాడు.
హోషేయా ఇశ్రాయేలు మీద తన పాలన ప్రారంభించుట
17 ఏలా కుమారుడైన హోషేయా ఇశ్రాయేలులో షోమ్రోను నుంచి పరిపాలించసాగాడు. అహాజు యూదా రాజుగా ఉన్న 12వ సంవత్సరమున ఇది జరిగింది. హోషేయా తొమ్మిదేళ్లు పరిపాలించాడు. 2 యెహోవా తప్పనిచెప్పిన పనులు హోషేయా చేశాడు. కాని హోషేయా తనకు పూర్వికులైన ఇశ్రాయేలు రాజులవలె చెడ్డవాడు కాదు.
3 షల్మనేసెరు అష్షూరుకు రాజు. అతను హోషేయాకి ప్రతికూలంగా యుద్ధానికి వెళ్లాడు. షల్మనేసెరు హోషేయాని ఓడించాడు. మరియు హోషేయా అతని సేవకుడయ్యాడు. అందువల్ల హోషేయా షల్మనేసెరుకు పన్ను చెల్లించాడు.
4 తర్వాత, హోషేయా ఈజిప్టు రాజు సహాయం కోరుతూ దూతలను పంపాడు. ఆ రాజు పేరు సో. ఆ సంవత్సరం హోషేయా తాను ప్రతియేడు చేసేవిధంగా అష్షూరు రాజుకి కప్పం కట్టలేదు. అష్షూరు రాజు తనకు విరుద్ధంగా హోషేయా పథక రచన చేసినట్లు తెలుసుకున్నాడు. అందువల్ల అష్షూరు రాజు హోషేయాని ఖైదుచేసి చెరసాలలో వేశాడు.
5 అష్షూరు రాజు ఇశ్రాయేలులో చాలా స్థలాలపై దాడి చేశాడు. తర్వాత షోమ్రోనుకు అతను వచ్చాడు. అతను షోమ్రోనుకి ప్రతికూలంగా మూడు సంవత్సరాలు యుద్ధం చేశాడు. 6 అష్షూరు రాజు ఇశ్రాయేలు రాజుగా హోషేయా వున్న తొమ్మిదో సంవత్సరమున షోమ్రోనును తీసుకున్నాడు. అష్షూరు రాజు చాలా మంది ఇశ్రాయేలు వారిని బంధించి, వారిని బంధీలుగా అష్షూరుకు తీసుకుని వెళ్లాడు. వారినతడు గోజాను వద్ద హాబోరు నదికి ప్రక్కగా హలాహు అనే చోటను, మాదీయుల ఇతర నగరాలలోను నివసింపజేశాడు.
7 ఇశ్రాయేలు వారు తమ యెహోవా దేవునికి విరుద్ధంగా పాపం చేశారు కనుక, ఈ విషయాలు జరిగాయి. ఆ యెహోవాయే ఈజిప్టు నుండి ఇశ్రాయేలు వారిని బయటకు తీసుకువచ్చాడు. మరియు ఈజిప్టు రాజైన ఫరో శక్తి నుండి యెహోవాయే రక్షించాడు. కాని ఇశ్రాయేలు వారు ఇతర దేవుళ్లను పూజించసాగారు. ఈజిప్టు రాజైన ఫరో అధికారం నుండి యెహోవా వారిని సంరక్షించాడు. 8 ఇతర జనాంగములు చేసినట్లుగానే, వారు చేయసాగారు. ఇశ్రాయేలీయులు వచ్చినప్పుడు ఆ జనాంగములను వారిని తమ ప్రదేశము వదిలి వెళ్లాలని యెహోవా చేత నిర్బంధించబడ్డారు. ఇశ్రాయేలు వారు కూడా దేవునివల్ల గాక రాజులచే పరిపాలించబడాలని ఎంచుకున్నారు. 9 ఇశ్రాయేలు వారు తమ యెహోవా దేవునికి విరుద్ధమైన సంగుతులను రహస్యంగా చేశారు. వారు చేసినవి సరి అయినవి కావు!
తమ నగరాలన్నిటిలోను ఇశ్రాయేలువారు చిన్న పట్టణం నుంచి పెద్ద నగరం దాకా ఉన్నత స్థలాలు నిర్మించారు. 10 ఇశ్రాయేలువారు స్మారక శిలలు వేశారు. ప్రతి కొండమీదను పచ్చని చెట్ల క్రిందను అషెరా స్తంభాలు ఏర్పాటు చేశారు. 11 అన్ని ఆరాధనా స్థలాలలోను ఇశ్రాయేలువారు ధూపం వేసేవారు. యెహోవా జనాంగములను తమ కళ్ల ఎదుటే బలవంతంగా విడిచిపెట్టి వెళ్లమని చెప్పిన విధంగా, వారీ పనులు చేసేవారు. ఇశ్రాయేలువారు చేసినచెడుపనులు యెహోవాకి ఆగ్రహం కలిగించాయి. 12 వారు విగ్రహలను కొలిచారు. “మీరీ పని చేయకూడదు” అని యెహోవా ఇశ్రాయేలువారికి చెప్పాడు.
13 ఇశ్రాయేలుని యూదాని హెచ్చరిక చేసేందుకు యెహోవా ప్రతి ప్రవక్తను, దీర్ఘదర్శిని ఉపయోగించాడు. “మీరు చేసే చెడు పనులకు అయిష్టత చూపండి. నా ఆజ్ఞలను చట్టాలను పాటించండి. మీ పూర్వికులకు నేనిచ్చిన ధర్మశాస్త్రమును మీరు అనుసరించండి. ఈ ధర్మశాస్త్రాన్ని నా సేవకులైన ప్రవక్తల ద్వారా మీకు అందించాను” అని యెహోవా చెప్పాడు.
14 కాని ప్రజలు ఆ మాటలు వినలేదు. తమ పూర్వికులవలె వారు మొండిగా వుండిరి. వారి పూర్వీకులు తమ యెహోవా దేవుని విశ్వసించలేదు. 15 ప్రజలు యెహోవా చట్టాలను అంగీకరించలేదు. తమ పూర్వికులతో యెహోవా చేసిన ఒడంబడికను అంగీకరింలేదు. వారు యెహోవా చేసిన హెచ్చరికలను పాటించలేదు. ఎందుకు విలువలేని విగ్రహములను వారు కొలిచారు, మరియు వారు ఎందుకు విలువలేనివారయ్యారు. తమ చుట్టూ వున్న జనాంగములవలె వారు ఆ ప్రజల చెడు జీవిత పద్దతిని అనుసరించారు. మరియు యెహోవా ఇశ్రాయేలు ప్రజలను, హెచ్చరించి, ఆ చెడు పనులు చేయవద్దని చెప్పాడు.
16 తమ యెహోవా దేవుని ఆజ్ఞలను ప్రజలు పాటించడం మానివేశారు. వారు రెండు బంగారు దూడల విగ్రహాలు చేశారు. అషెరా స్తంభాలు వారు ఏర్పాటు చేశారు. వారు ఆకాశంలోని అన్ని నక్షత్రాలను పూజించారు; బయలు దేవతలను కొలిచారు. 17 వారు తమ కొడుకుల్ని, కూతుళ్లని అగ్నిలో వేసి బలి ఇచ్చారు. భవిష్యత్తును తెలుసుకునేందుకు వారు చేతబడితనమును, ఇంద్రజాలమును ఉపయోగించారు. దుష్కార్యమని యెహోవా చెప్పినదానిని ప్రజలు చేశారు. యెహోవాని ఆగ్రహపరచేందుకు వారు అలా చేశారు. 18 అందువల్ల యెహోవా ఇశ్రాయేలుపట్ల చాలా కోపపడ్డాడు; తన దృష్టినుంచివారిని తప్పించాడు. యూదా గోత్రం తప్ప మరి ఇతర ఇశ్రాయేలువారు లేరు.
యూదా ప్రజలు కూడా దోషులే
19 యూదా ప్రజలు కూడా తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను పాటించలేదు. యూదా ప్రజలు ఇశ్రాయేలు ప్రజలవలె నివసించారు.
20 యెహోవా ఇశ్రాయేలు ప్రజలందరిని త్రోసిపుచ్చాడు. అతడు వారికి ఎన్నో ఇబ్బందులు కలుగ జేశాడు. ఇతరులు తమను నాశనం చేసేటట్లు చేసుకున్నారు. చిట్టచివరికి, ఆయన తన దృష్టినుండి వారిని త్రోసిపుచ్చాడు. 21 యెహోవా దావీదు వంశం నుంచి ఇశ్రాయేలుని విడగొట్టాడు. మరియు ఇశ్రాయేలువారు నెబాతు కుమారుడైన యరొబామును తమ రాజుగా చేసుకున్నారు. యరొబాము యెహోవాను అనుసరించని వారుగా వారిని గుర్తించాడు. ఇశ్రాయేలువారు మహా పాపం చేసేలా యరొబాము చేశాడు. అందువల్ల 22 ఇశ్రాయేలువారు యరొబాము చేసిన పాపాలన్నీ చేశారు. 23 యెహోవా తన దృష్టినుండి ఇశ్రాయేలుని దూరముగా తీసుకుపోయే వరకు, వారు ఆ పాపాలు చేయడం మానలేదు. మరియు ఇలా జరుగునని యెహోవా చెప్పాడు! ఆయన ప్రజలకు ఇలా జరుగుతుందని చెప్పమని ప్రవక్తలను పంపించాడు. అందువల్ల ఇశ్రాయేలువారిని తమ దేశంనుండి అష్షూరుకు తీసుకువెళ్లడం జరిగింది. అక్కడ వారు నేటిదాకా వున్నారు.
విదేశీయులు ఇశ్రాయేలులో స్థిరపడుట
24 అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని షోమ్రోను నుండి వెలుపలికి తీసుకు వచ్చాడు. తర్వాత అష్షూరు రాజు బబులోను, కూతా, అవ్యా, హమాతు, సెపర్వయీముల నుండి మనుష్యులను తీసుకువచ్చాడు. అతను వారినందరిని షోమ్రోనులో ఉంచాడు. ఆ ప్రజలు షోమ్రోనును గ్రహించి ఆ చుట్టు ప్రక్కల నగరాలలో నివసింపసాగారు. 25 ఈ ప్రజలు షోమ్రోనులో ఉండసాగిన తర్వాత, యెహోవాని వారు గౌరవించలేదు. అందువల్ల ప్రభువు వారిమీదికి సింహాలను పంపించాడు. ఈ సింహాలు కొందరిని చంపివేశాయి. 26 కొందరు అష్షూరు రాజుతో, “నీవు తీసుకువచ్చి షోమ్రోను నగరాలలో నిలిపిన ప్రజలకు ఆ దేశపు దేవుని న్యాయసూత్రాలు తెలియవు. అందువల్ల దేవుడు సింహాలను పంపి వారిని ఎదుర్కొన్నాడు. ఆ ప్రజలకు ఆ ప్రదేశపు దేవుని చట్టాలు తెలియవు కనుక వారిని సింహాలు చంపివేశాయి” అని చెప్పారు.
27 అందువల్ల అష్షూరు రాజు ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు షోమ్రోను నుండి కొందరు యాజకులను తీసుకున్నారు. నేను బంధించిన యాజకులలో ఒకరిని తిరిగి షోమ్రోనుకు పంపించండి. ఆ యాజకుడ్ని వెళ్లి అక్కడే వుండనివ్వండి. తర్వాత ఆ యాజకుడు ఆ దేశపు దేవుని న్యాయసూత్రాలను వారికి బోధించగలడు.”
28 అందువల్ల అష్షూరుకు తీసుకుపోయిన ఒక యాజకుడు బేతేలులో నివసించాడానికి వచ్చాడు. ఈ యాజకుడు యెహోవాని ఎలా గౌరవించాలో వాళ్లకి బోధించాడు.
29 కాని ఆ మనుష్యులందరు తమతమ దేవుళ్ల విగ్రహలను చేసి షోమ్రోనుల ఉన్నత స్థానాలలో ఆలయాలలో ఆ విగ్రహలను ఉంచారు. 30 బబులోను మనుష్యులు అబద్ధపు దేవుడైన సుక్కోల్బెనోతును కల్పించుకున్నారు. కూతా మనుష్యులు అబద్ధపు దేవుడైన నెర్గలుని కల్పించుకున్నారు. 31 అవ్వాకు చెందినవారు అసత్య దేవుడైన నిబ్హజు తర్తాకులను కల్పించుకున్నారు. హమాతు ప్రజలు అబద్ధపు దేవుడైన అషీమాని కల్పించుకున్నారు. మరియు సెపర్వీయుల నుండి వచ్చిన ప్రజలు తమ అసత్యపు దేవుళ్లయిన అద్రమ్మెలెకు, అనెమ్మెలెకుల గౌరవార్థం తమ సంతానాన్ని అగ్నికి ఆహుతి చేశారు.
32 కాని ఆ ప్రజలు యెహోవాని కూడా పూజించారు. ప్రజలనుండి ఉన్నత స్థానాలకు వారు యాజకులను ఎంపిక చేశారు. ఆ ఆరాధనా స్థలాలలో ఈ యాజకులు ఆలయాలలో ప్రజలకోసం బలులు అర్పించారు. 33 వారు యెహోవాని గౌరవించారు; కాని వారు తమ సొంత దేవుళ్లను కూడా సేవించారు. ఆ ప్రజలు తాము తీసుకొని రాబడిన దేశాలలో జరిగించినట్లుగానే తమ దేవుళ్లను పూజించారు.
34 నేటికీ ఆ ప్రజలు పూర్వం వున్నట్లుగానే నివసిస్తున్నారు. వారు యెహోవాని గౌరవించరు. వారు ఇశ్రాయేలువారి నిబంధనలను, ఆజ్ఞలను పాటించరు. వారు యాకోబు పిల్లలకు (ఇశ్రాయేలు) విధించిన ఆజ్ఞలనుగాని నిబంధనలను గాని పాటించ లేదు. 35 యెహోవా ఇశ్రాయేలువారితో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. యెహోవా, “మీరు ఇతర దేవతలను అనుసరించకూడదు. మీరు వారిని పూజించకూడదు; ఆరాధించకూడదు; వారికి బలుల కూడా సమర్పించకూడదు. 36 కాని యెహోవాని అనుసరించాలి. ఈజిప్టు నుంచి మిమ్ము తీసుకువచ్చిన యెహోవాయే దేవుడు. యెహోవా తన గొప్ప శక్తిని మిమ్ము రక్షించడానికి వినియోగించాడు. మీరు యెహోవాని ఆరాధిస్తూ మరియు గౌరవించి ఆయనకు బలులు సమర్పించాలి. 37 ఆయన మీ కోసం వ్రాసిన నిబంధనలు, న్యాయ సూత్రాలు, బోధనలు, ఆజ్ఞలు మొదలైన వాటిని మీరు పాటించాలి. ఎప్పుడూ మీరీ విషయాలు పాటించాలి. మీరు ఇతర దేవతలను గౌరవించరాదు. 38 మీతో నేను చేసిన ఒడంబడిక మీరు మరచిపోకూడదు. 39 మీరు మీ దేవుడైన యెహోవానే గౌరవించాలి. తర్వాత ఆయన మిమ్మును మీ విరోధులనుండి సంరక్షిస్తాడు.” అని ఆజ్ఞాపించాడు.
40 కాని ఇశ్రాయేలువారు వినలేదు. పూర్వం చేసినట్లుగానే వారు అవే పనులు చేయసాగారు. 41 అందువల్ల ఇప్పుడు ఇతర జనాంగంవారు యెహోవాను గౌరవిస్తారు. అలాగే తమ సొంత విగ్రహాలను కూడా పూజిస్తారు. తమ పూర్వికులు చేసినట్లుగానే, వారి పిల్లలు మనుములు, మనుమరాండ్రు అవే పనులు చేస్తున్నారు. ఈ నాటికీ వారు అవే పనులు చేస్తున్నారు.
© 1997 Bible League International