Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 దినవృత్తాంతములు 27

యూదా రాజుగా యోతాము

27 యోతాము రాజయ్యేనాటికి ఇరువదియైదు సంవత్సరాలవాడు. యెరూషలేములో అతడు పదహారు సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి పేరు యెరూషా. యెరూషా సాదోకు కుమార్తె. యెహోవా కోరిన విధంగా యోతాము కార్యకలాపాలు నిర్వర్తించాడు. తన తండ్రి ఉజ్జియా మాదిరిగానే అతడు దేవునికి విధేయుడై వున్నాడు. కాని తన తండ్రి చేసిన విధంగా ధూపం వేయటానికి యోతాము ఆలయం ప్రవేశించలేదు. అయినా ప్రజలు మాత్రం తమ దుష్ట నడతను మానలేదు. ఆలయపు పైద్వారాన్ని యోతాము తిరిగి నిర్మించాడు. ఓపెలు అనే స్థలంలో గోడమీద ఎక్కువ నిర్మాణాన్ని చేపట్టాడు. యూదాలో కొండల ప్రాంతంలో యోతాము పట్టణాలను నిర్మించాడు. యోతాము అరణ్యాలలో కోటలను, బురుజులను కట్టించాడు. యోతాము అమ్మోనీయుల రాజుతోను, అతని సైన్యంతోను పోరాడి వారిని ఓడించాడు. కావున మూడేళ్లపాటు ప్రతి సంవత్సరం అమ్మోనీయులు రెండు వందల మణుగుల[a] వెండి, పదివేల ఏదుముల[b] గోధుమలు, పదివేల ఏదుముల యవలు కప్పంగా చెల్లించారు.

తన దేవుడైన యెహోవా పట్ల సత్యవర్తనుడై విధేయుడైనందున యోతాము చాలా శక్తివంతమైన రాజు అయ్యాడు. యోతాము చేసిన ఇతర కార్యాలు, అతడు నిర్వహించిన యుద్ధాలగురించి ఇశ్రాయేలు, యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి. యోతాము రాజయ్యేనాటికి ఇరువదియైదు సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో పదహారు సంవత్సరాలు పరిపాలించాడు. తరువాత యోతాము చనిపోగా, అతనిని తన పూర్వీకులతో సమాధి చేశారు. ప్రజలతనిని దావీదు నగరంలో[c] సమాధి చేశారు. యోతాము స్థానంలో ఆహాజు రాజయ్యాడు. యోతాము కుమారుడే ఆహాజు.

యెషయా 9-12

ఒక క్రొత్త రోజు వస్తుంది

గతంలో జెబూలూను దేశం, నఫ్తాలి దేశం ముఖ్యంకాదు అనుకొన్నారు. కానీ ఉత్తరార్థంలో దేవుడు ఆ దేశాన్ని గొప్ప చేస్తాడు. సముద్రం దగ్గర దేశం, యొర్దాను నది అవతల దేశం, యూదులు కానివారు నివసించే గలిలయ. ఇప్పుడు ఆ ప్రజలు చీకట్లో జీవిస్తున్నారు. కానీ వారు గొప్ప వెలుగు చూస్తారు. మరణంలాంటి చీకటిచోట ఆ ప్రజలు జీవిస్తున్నారు. కానీ “గొప్ప వెలుగు” వారిమీద ప్రకాశిస్తుంది.

దేవా, నీవే రాజ్యాన్ని పెద్ద చేస్తావు. ప్రజల్ని నీవు సంతోషపరుస్తావు. ఆ ప్రజలు వారి సంతోషాన్ని నీకు తెలియజేస్తారు. అది కోతకాలపు సంతోషంలా ఉంటుంది. ప్రజలు యుద్ధంలో గెలిచిన సామగ్రిని పంచుకొన్నప్పుడు కలిగిన సంతోషంలా ఉంటుంది. ఎందుకంటే, భారాన్ని నీవు తొలగించేస్తావు కనుక. ప్రజల వీపుల మీద నుండి భారమైన కాడిని నీవు తొలగించేస్తావు గనుక. నీ ప్రజలను శిక్షించేందుకు శత్రువు వినియోగించే కొరడాను నీవు తొలగించేస్తావు. అది నీవు మిద్యాను ఓడించిన సమయంలా ఉంటుంది.

యుద్ధంలో కదం తొక్కిన ప్రతి కాలిజోడు నాశనం చేయబడుతుంది. రక్తపు మరకలైన యుద్ధ వస్త్రం ప్రతీది నాశనం చేయబడుతుంది. అవన్నీ అగ్నిలో పడద్రోయబడతాయి. మనకు ఒక బాలుడు పుట్టియున్నాడు. మనకు ఒక కుమారుడు ఇవ్వబడియున్నాడు. ఆయన భుజం మీద ప్రభుత్వమున్నది. “ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త, శక్తిగల దేవుడు, నిత్యం జీవించే తండ్రి, సమాధాన రాజు” అనేది ఆయన పేరు. ఆయన రాజ్యంలో శాంతి, శక్తి ఉంటాయి. దావీదు వంశపు ఈ రాజుకు అది కొనసాగుతుంది. ఈ రాజు మంచితనం, న్యాయపు తీర్పు ప్రయోగించి, రాజ్యాన్ని శాశ్వతంగా ఎప్పటికీ పాలిస్తాడు. సర్వశక్తిమంతుడైన యెహోవాకు తన ప్రజల మీద బలీయమైన ప్రేమ ఉంది. ఈ బలీయమైన ప్రేమ ఆయనను ఈ పనులు చేసేటట్టుగా చేస్తుంది.

దేవుడు ఇశ్రాయేలును శిక్షిస్తాడు

యాకోబు (ఇశ్రాయేలు) ప్రజలకు విరోధంగా నా ప్రభువు ఒక ఆదేశం ఇచ్చాడు. ఇశ్రాయేలీయులకు విరోధంగా ఇవ్వబడిన ఆదేశానికి విధేయత చూపబడుతుంది. అప్పుడు ఎఫ్రాయింము (ఇశ్రాయేలు)లో ప్రతి వ్యక్తి, చివరికి సమరయ నాయకులు కూడా దేవుడు తమని శిక్షించాడని తెలుసుకొంటారు.

ఇప్పుడు ఆ ప్రజలు చాలా గర్వంగా, అతిశయంగా ఉన్నారు. 10 “ఈ ఇటుకలు పడిపోవచ్చు గాని మేము మళ్లీ నిర్మిస్తాం. ఇంకా గట్టి రాయితో మేము నిర్మిస్తాం. ఈ చిన్న చెట్లు నరికి వేయబడవచ్చును. కానీ మేము అక్కడ క్రొత్త చెట్లు వేస్తాము. ఆ క్రొత్త చెట్లు ఇంకా పెద్దగా, గట్టిగా ఉంటాయి.” అని ఆ ప్రజలు అంటారు.

11 అందుచేత ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసేందుకు యెహోవా మనుష్యుల్ని చూస్తాడు. వారి మీదికి రెజీను శత్రువులను యెహోవా తీసుకొని వస్తాడు. 12 తూర్పు నుండి సిరియన్లను, పడమటినుండి ఫిలిష్తీయులను యెహోవా తీసుకొని వస్తాడు. ఆ శత్రువులు తమ సైన్యాలతో ఇశ్రాయేలును ఓడిస్తారు. కానీ యెహోవా మాత్రం ఇంకా ఇశ్రాయేలు మీద కోపంగానే ఉంటాడు. యెహోవా ఆ ప్రజలను శిక్షించటానికి ఇంకా సిద్ధంగానే ఉంటాడు.

13 దేవుడు ప్రజలను శిక్షిస్తాడు గాని వాళ్లు మాత్రం పాపం చేయటం మానరు. వాళ్లు ఆయన దగ్గరకు మళ్లుకోరు. సర్వశక్తిమంతుడైన యెహోవాను వారు అనుసరించరు. 14 అందుచేత యెహోవా ఇశ్రాయేలీయుల తల, తోక కత్తిరించి వేస్తాడు. కాండాన్ని కొమ్మను కూడ ఒక్క రోజునే యెహోవా నరికి వేస్తాడు. 15 (తల అంటే పెద్దలు ప్రముఖ నాయకులు తోక అంటె అబద్ధాలు చెప్పే ప్రవక్తలు.)

16 ప్రజలను నడిపించే మనుష్యులు వారిని తప్పు త్రోవన నడిపిస్తున్నారు. కనుక వారిని అనుసరించే ప్రజలు నాశనం చేయబడతారు. 17 మనుష్యులు అంతా చెడ్డవాళ్లే. అందుచేత యువకుల విషయం యెహోవాకు సంతోషం లేదు. వారి విధవలకు, అనాధలకు యెహోవా దయ చూపించడు. ఎందుకంటే, ప్రజలంతా చెడ్డవాళ్లే గనుక. దేవునికి విరోధమైన వాటిని మనుష్యులు చేస్తారు. మనుష్యులు అబద్ధాలు చెబుతారు.

అందుచేత దేవుడు మనుష్యులమీద కోపంగానే ఉంటాడు. దేవుడు మనుష్యుల్ని శిక్షిస్తూనే ఉంటాడు.

18 చెడు అనేది చిన్న నిప్పులాంటిది. ఆ నిప్పుమొదట పొదలను, ముళ్లకంపల్ని తగలెడుతుంది: తర్వాత అరణ్యంలో ఉండే పెద్ద పొదలను ఆ నిప్పు తగలెడుతుంది. చివరికి అది పెద్ద అగ్నిగా మారుతుంది. అంతా పొగలో కలిసిపోతుంది.

19 సర్వశక్తిమంతుడైన యెహోవా కోపంగా ఉన్నాడు, కనుక దేశం కాల్చి వేయబడుతుంది. మనుష్యులంతా ఆ అగ్నిలో కాల్చి వేయబడతారు. ఎవ్వడూ తన సోదరుణ్ణి రక్షించే వ్రయత్నం చేయడు. 20 ప్రజలు కుడిపక్క ఏదో కొంత చేజిక్కించుకున్నా ఆకలిగానే ఉంటారు. ఎడమ పక్కన వాళ్లు ఏదో తింటారు, అయినా వాళ్లకు కడుపు నిండదు. అప్పుడు ప్రతివాడూ తిరిగి, తన స్వంత శరీరాన్నే తింటాడు. 21 (అంటే ఎఫ్రాయిముకు వ్యతిరేకంగా మనష్షే యుద్ధం చేస్తాడు. మనష్షేకు వ్యతిరేకంగా ఎఫ్రాయిము యుద్ధం చేస్తాడు. తర్వాత వాళ్లిద్దరు యూదా మీద తిరగబడతారు అని అర్థం.)

యెహోవా ఇశ్రాయేలు మీద ఇంకా కోపంగానే ఉన్నాడు. యెహోవా ఇంకా తన ప్రజల్ని శిక్షించటానికి సిద్ధంగానే ఉన్నాడు.

10 చెడు చట్టం వ్రాసే చట్టాల నిర్మాతలను చూడండి. ప్రజలకు జీవితాన్ని దుర్బరం చేసే చట్టాలు ఆ నిర్మాతలు రాస్తారు. ఆ చట్ట నిర్మాతలు పేద ప్రజలకు న్యాయం చేకూర్చలేదు. పేద ప్రజల హక్కులను వారు తీసి వేస్తారు. వారు విధవల వద్ద, అనాధల వద్ద ప్రజలను దొంగిలించనిస్తారు.

చట్ట నిర్మాతలారా, మీరు చేసిన పనులను మీరు వివరించాల్సి ఉంటుంది. ఆ సమయంలో మీరేమి చేస్తారు? దూరదేశంనుండి మీ నాశనం వస్తుంది. సహాయం కోసం మీరు ఎక్కడికి పరుగెత్తుకు వెళ్తారు? మీ ధనం, మీ ఐశ్వర్యాలు మీకేం సాయం చేయవు. ఒక ఖైదీలా మీరు శిరస్సు వంచాలి. చచ్చిన వాడిలా మీరు పడిపోతారు. కాని దానివల్ల మీకు సహాయం జరగదు. దేవుడు ఇంకా కోపంగానే ఉంటాడు. దేవుడు ఇంకా మిమ్మల్ని శిక్షించటానికి సిద్ధంగానే ఉంటాడు.

అష్షూరు గర్వాన్ని దేవుడు శిక్షిస్తాడు

దేవుడు అంటాడు: “అష్షూరును నేను ఒక కర్రలా వాడుకొంటాను. కోపంతో నేను ఇశ్రాయేలును శిక్షించడానికి అష్షూరును వాడుకొంటాను.” చెడుకార్యాలు చేసే వారిమీద యుద్ధం చేయటానికి నేను అష్షూరును పంపిస్తాను. వాళ్ల మీద నేను కోపంగా ఉన్నాను. వారిమీద యుద్ధం చేయమని అష్షూరుకు నేను ఆజ్ఞాపిస్తాను. వారిని అష్షూరు ఓడించి, వారి ఐశ్వర్యాలను కొల్లగొట్టుకొంటారు. ఇశ్రాయేలీయులు, వీధుల్లో అష్షూరు వారి పాదాల క్రింద తొక్కబడే ధూళిలా ఉంటారు.

“అయితే అష్షూరును నేను వాడుకొంటాను అనే విషయం వారికి తెలియదు. అష్షూరు నాకు ఒక సాధనం అని అతనికి తెలియదు. ఇతరులను నాశనం చేయటమే అష్షూరుకు కావాలి. అష్షూరు అనేక రాజ్యాలను నాశనం చేయాలని మాత్రమే పథకం వేస్తుంది. అష్షూరు తనకు తాను ఇలా చెప్పుకొంటాడు, ‘నా నాయకులంతా రాజుల్లాంటి వాళ్లు. కల్కో పట్టణం కర్కెమీషు పట్టణంలా ఉంటుంది. అర్పాదు పట్టణం హమాతు పట్టణంలా ఉంటుంది. షోమ్రోను పట్టణం దమస్కు పట్టణంలా ఉంటుంది. 10 అనేక విగ్రహాలున్న ఆ రాజ్యాలను నేను ఓడించేశాను, ఇప్పుడు అవి నా అధికారంలో ఉన్నాయి. వాళ్లు పూజించే విగ్రహాలు యెరూషలేము, సమరయలో ఉన్న విగ్రహాలకంటె గొప్పవి. 11 షోమ్రోనును, దాని విగ్రహాలను నేను ఓడించాను. యెరూషలేమును, దాని ప్రజలు తయారుచేసిన విగ్రహాలను కూడ నేను ఓడిస్తాను.’”

12 యెరూషలేముకు, సీయోను కొండకు నా ప్రభువు చేయదలచిన వాటిని చేయటం ముగిస్తాడు. అప్పుడు యెహోవా అష్షూరును శిక్షిస్తాడు. అష్షూరు రాజు చాలా గర్విష్ఠి. అతడు గర్వం చేత చాలా చెడ్డ పనులు చేశాడు. అందుచేత దేవుడు అతణ్ణి శిక్షిస్తాడు.

13 అష్షూరు రాజు అంటున్నాడు: “నేను చాలా తెలివిగలవాడ్ని. నా స్వంత జ్ఞానం, శక్తి మూలంగా నేను ఎన్నోగొప్ప కార్యాలు చేశాను. అనేక రాజ్యాల్ని నేను ఓడించాను. వారి ఐశ్వర్యం నేను దోచుకొన్నాను. వారి ప్రజలను నేను బానిసలుగా చేసుకొన్నాను. నేను చాలా శక్తిగలవాణ్ణి. 14 ఒకడు పక్షి గూటిలోనుండి గుడ్లు తీసినట్టుగా, నేను నా స్వంత చేతుల్తో ఈ ప్రజలందరి సంపదలు తీసుకొన్నాను. ఒక పక్షి తన గూడును, గుడ్లను తరచు విడిచిపెడ్తుంటుంది. ఆ గూటిని కాపాడేందుకు ఏమీ లేదు. కిచకిచలాడ్తూ, తన రెక్కలతో, ముక్కుతో కొట్లాడేందుకు అక్కడ ఏ పక్షి లేదు. అందుచేత మనుష్యులు ఆ గుడ్లు తీసుకొంటారు. ఆదే విధంగా భూలోకంలోని మనుష్యులందరినీ నేను తీసుకొనకుండా నన్ను ఆపగలిగిన వాడు ఎవడూ లేడు.”

15 గొడ్డలి, దానిని ప్రయోగించే వానికంటె గొప్పదేంకాదు. రంపం, దానితో కోసే వానికంటె గొప్పదేంకాదు. కాని అష్షూరు తాను దేవునికంటే ముఖ్యం అనుకొంటుంది. ఎవరినైనా శిక్షించేందకు ఒకడు బెత్తం తీసుకొని ప్రయోగిస్తే, అతనికంటె ఆ బెత్తం ఎక్కువ శక్తి గలది, ముఖ్యమయింది అన్నట్టు ఉంటుంది. 16 అష్షూరు చాల గొప్పవాడ్ని అని అనుకొంటాడు. కానీ సర్వశక్తిమంతుడైన యెహోవా అష్షూరు మీదికి గొప్ప రోగం పంపిస్తాడు. ఒక రోగి బరువు కోల్పోయినట్టు అష్షూరు తన ఐశ్వర్యాన్ని, శక్తిని పోగొట్టుకొంటాడు. అప్పుడు అష్షూరు మహిమ నాశనం అవుతుంది. సర్వం పోయేవరకు మండుతూ ఉండే అగ్నిలా అది ఉంటుంది. 17 ఇశ్రాయేలు వెలుగు (దేవుడు) అగ్నిలా ఉంటాడు. ఆ పరిశుద్ధుడు ఒక జ్వాలలా ఉంటాడు. మొట్టమొదట పొదలను, ముళ్లకంపలను కాల్చేసే అగ్నిలా ఆయన ఉంటాడు. 18 ఆ తర్వాత అగ్ని మహా వృక్షాలను, ద్రాక్షాతోటలను కాల్చివేస్తుంది. చివరికి సర్వం, ప్రజలతో సహా నాశనం చేయబడుతుంది. దేవుడు అష్షూరును నాశనం చేసినప్పుడు అలా ఉంటుంది. అష్షూరు కుళ్లిపోతున్న మొద్దులా ఉంటుంది. 19 అరణ్యంలో కొన్ని చెట్లు మాత్రం నిలిచి ఉండవచ్చు. కానీ అవి ఒక పిల్లవాడు కూడ లెక్కబెట్ట గలిగినన్ని ఉంటాయి.

20 ఆ సమయంలో ఇశ్రాయేలులో ఇంకా బ్రతికి ఉన్నవారు, యాకోబు వంశ ప్రజలు, వారిని కొట్టేవాని మీద ఆధారపడరు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడైన యెహోవా మీద నిజంగా ఆధారపడటం వారు నేర్చుకొంటారు. 21 యాకోబు వంశంలో మిగిలిన ప్రజలు శక్తివంతుడైన దేవున్ని మరల వెంబడిస్తారు.

22 మీ ప్రజలు చాలామంది ఉన్నారు. వారు సముద్రపు ఇసుకలా ఉన్నారు. కానీ ఆ ప్రజల్లో కొద్ది మంది మాత్రమే యెహోవా దగ్గరకు తిరిగి వచ్చేందుకు మిగిలి ఉంటారు. ఆ ప్రజలు దేవుని దగ్గరకు తిరిగి వస్తారు. కాని ముందు మీ దేశం నాశనం చేయబడుతుంది. దేశాన్ని నాశనం చేస్తానని దేవుడు ప్రకటించాడు. ఆ తర్వాత దేశానికి మంచి కలుగుతుంది. అది నిండుగా ప్రవహిస్తున్న నదిలా ఉంటుంది. 23 నా ప్రభువు, సర్వశక్తిమంతుడైన యెహోవా నిశ్చయంగా ఈ దేశాన్ని నాశనం చేస్తాడు.

24 నా ప్రభువు, సర్వశక్తిమంతుడైన యెహోవా చెబుతున్నాడు: “సీయోనులో నివసిస్తున్న నా ప్రజలారా, అష్షూరు గూర్చి భయపడకండి. గతంలో ఈజిప్టు మిమ్మల్ని కొట్టినట్టు అతడు మిమ్మల్ని కొడతాడు. మిమ్మల్ని కొట్టడానికి అష్షూరు బెత్తం ఉపయోగించినట్టు అది ఉంటుంది. 25 అయితే కొంచెం కాలం కాగానే నా కోపం నిలిచిపోతుంది. అష్షూరు మిమ్మల్ని తగినంతగా శిక్షించిందని నేను తృప్తి పడతాను.”

26 అప్పుడు సర్వశక్తిమంతుడైన యెహోవా కొరడాతో అష్షూరును కొడతాడు. గతంలో యెహోవా ఓరేబు బండ దగ్గర మిద్యానును ఓడించాడు. యెహోవా అష్షూరు మీద దాడి చేసినప్పుడు కూడా అలాగే ఉంటుంది. గతంలో యెహోవా ఈజిప్టును శిక్షించాడు. ఆయన సముద్రం మీద కర్ర ఎత్తి, తన ప్రజలను ఈజిప్టునుండి బయటకు నడిపించాడు. యెహోవా తన ప్రజలను అష్షూరు నుండి రక్షించినప్పుడు కూడ అలాగే ఉంటుంది.

27 మీరు మీ భుజాల మీద కాడిపైన మోయాల్సిన బరువుల్లాంటి కష్టాలు అష్షూరు మీకు కలిగిస్తాడు. కాని ఆ కాడి మీ మెడమీద నుండి తొలగించబడుతుంది. మీ (దేవుడు) బలం చేత ఆ కాడి విరుగగొట్టబడుతుంది.

అష్షూరు సైన్యం ఇశ్రాయేలును ముట్టడిస్తుంది

28 “శిథిలాల” (ఆయాతు) దగ్గర సైన్యం చొరబడుతుంది. సైన్యం “కళ్లం” (మిగ్రోను) మీద నడచిపోతుంది. సైన్యం తన ఆహారాన్ని “గిడ్డంగిలో” దాచుకొంటుంది. 29 సైన్యం రేవు దగ్గర (మాబారా) నది దాటుతుంది. గెబలో సైన్యం నిద్రపోతుంది. రామా భయపడుతుంది. సౌలు గిబ్యాలో ప్రజలు పారిపోతారు.

30 బాత్ గల్లీము గట్టిగా కేకలు వేయి! లాయిషా, ఆలకించు! అనాతోతూ, నాకు జవాబు చెప్పు, 31 మద్మేనా ప్రజలు పారిపోతున్నారు. గిబాని ప్రజలు దాక్కుంటున్నారు. 32 ఈ రోజే సైన్యం నోబు దగ్గర నిలుస్తుంది. యెరూషలేము పర్వతంలో సీయోను కొండకు విరోధంగా యుద్ధం చేయటానికి సైన్యం సిద్ధం అవుతుంది.

33 చూడండి! మన ప్రభువు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఆ మహా వృక్షాన్ని (అష్షూరు) నరికి వేస్తాడు. యెహోవా తన మహా శక్తతో దీన్ని చేస్తాడు. గొప్ప వాళ్లు, ప్రముఖులు నరికివేయబడి, ముఖ్యత లేని వారవుతారు. 34 యెహోవా తన గొడ్డలితో అరణ్యం నరికివేస్తాడు. లెబానోనులో మహా వృక్షాలు (ప్రముఖ వ్యక్తులు) పడిపోతాయి.

సమాధాన ప్రభువు వస్తున్నాడు

11 యెష్షయి మొద్దునుండి (వంశం నుండి) ఒక చిగురు (శిశువు) పుడుతుంది. యెష్షయి వేరులనుండి అంకురం ఎదుగుతుంది. ఆ శిశువులో యెహోవా ఆత్మ ఉంటుంది. జ్ఞానం, అవగాహన, నడిపింపు, శక్తిని ఆత్మ ఇస్తుంది. ఈ శిశువు యెహోవాను తెలుసుకొని, ఘనపర్చటానికి ఆత్మ సహాయం ఉంటుంది. ఈ శిశువు యెహోవాను ఘనపరుస్తాడు. అందువల్ల శిశువు సంతోషంగా ఉంటాడు.

ఈ శిశువు కనబడే వాటిని బట్టి తీర్పు తీర్చడు. అతడు వినేవిషయాలను బట్టి తీర్పు తీర్చడు. 4-5 బీదలకు అతడు న్యాయంగా, నిజాయితీగా తీర్పుచెబుతాడు. దేశంలో పేద ప్రజలకు జరగాల్సిన విషయాల్లో నిర్ణయాలు చేయాల్సినప్పుడు అతడు న్యాయంగా ఉంటాడు. ప్రజలు కొట్టబడాలని అతడు నిర్ణయిస్తే, అప్పుడు అతడు ఆదేశం ఇస్తాడు, ఆ ప్రజలు కొట్టబడతారు. ఎవరైనా చావాలని అతడు నిర్ణయం చేస్తే, అప్పుడు అతడు ఆదేశం ఇస్తాడు. ఆ దుష్టులు చంపబడతారు. మంచితనం, న్యాయం ఈ శిశువుకు బలం ప్రసాదిస్తాయి. అవి అతడు తన నడుముకు కట్టుకొనే పట్టాలా ఉంటాయి.

ఆ సమయంలో తోడేళ్లు గొర్రెపిల్లలతో కలిసి శాంతిగా జీవిస్తాయి. పెద్ద పులులు మేక పిల్లలతో కలిసి శాంతంగా పండుకొంటాయి. దూడలు, సింహాలు, ఎద్దులు కలిసి శాంతిగా జీవిస్తాయి. ఒక చిన్న పిల్లాడు వాటిని తోల్తాడు. ఆవులు, ఎలుగుబంట్లు కలిసి శాంతిగా జీవిస్తాయి. వాటి పిల్లలన్నీ కలసి పండుకొంటాయి, ఒక దానిని ఒకటి బాధించవు. సింహాలు, ఆవుల్లా గడ్డి మేస్తాయి. చివరికి సర్పాలు కూడా మనుష్యులకు హాని చేయవు. ఒక చిన్నబిడ్డ నాగుపాముపుట్ట దగ్గర ఆడుకొంటుంది. విషసర్పం పుట్టలో ఒకచిన్న పాప చేయి పెట్టగలుగుతుంది.

అంతా శాంతిగా ఉంటుందనీ, ఎవరూ ఒకరిని ఒకరు బాధించుకోరనీ ఈ విషయాలు తెలియ జేస్తున్నాయి. నా పరిశుద్ధ పర్వతం మీద ప్రజలు దేనినీ నాశనం చేయాలని ఆశించరు. ఎందుకంటే, ప్రజలు వాస్తవంగా యెహోవాను తెలుసుకొని ఉంటారు గనుక. సముద్రంనీళ్లతో నిండిపోయినట్టు, వారు దైవజ్ఞానంతో నిండిపోయి ఉంటారు.

10 ఆ సమయంలో యెష్షయి కుటుంబంలో ఒక ప్రత్యేక వ్యక్తి ఉంటాడు. ఈ వ్యక్తి ఒక పతాకంలా ఉంటాడు. రాజ్యాలన్నీ తన చుట్టూ సమావేశం కావాలని ఈ “పతాకం” చూపిస్తుంది. తాము చేయాల్సిన వాటిని గూర్చి రాజ్యాలు అతణ్ణి అడుగుతాయి. అతడు ఉండే స్థలం మహిమతో నిండిపోతుంది.

11 ఆ సమయంలో నా ప్రభువు (దేవుడు) మరల తన చేయిచాచి, మిగిలిన తన ప్రజలను తీసుకొంటాడు. దేవుడు ఇలా చేయటం రెండోసారి. (అష్షూరు, ఉత్తర ఈజిప్టు, దక్షిణ ఈజిప్టు, ఇథియోపియ, ఏలాము, బబులోను, హమాతు ప్రపంచంలోని దూర దేశాలన్నింటిలో మిగిలి ఉన్న దేవుని ప్రజలు వీరు.) 12 దేవుడు ఈ “పతాకాన్ని” మనుష్యులందరికీ ఒక సంకేతంగా నిలబెడతాడు. ఇశ్రాయేలు, యూదా ప్రజలు బలవంతంగా వారి దేశంనుండి వెళ్ల గొట్టబడ్డారు. ఆ ప్రజలు భూమిమీద దూర దేశాలన్నింటికీ చెదర గొట్టబడ్డారు. అయితే దేవుడు వాళ్లందరినీ మళ్లీ ఒక చోట సమావేశపరుస్తాడు.

13 ఆ సమయంలో ఎఫ్రాయిము (ఇశ్రాయేలు) యూదాపై అసూయపడదు. యూదాకు శత్రువులు ఎవ్వరూ మిగిలి ఉండరు. మరియు యూదా, ఎఫ్రాయిముకు కష్టం కలిగించదు. 14 అయితే ఎఫ్రాయిము, యూదా కలిసి ఫిలిష్తీయుల మీద దాడిచేస్తారు. ఈ రెండు రాజ్యాలు భూమి మీద ఒక చిన్న జంతువును పట్టుకొనేందుకు, క్రిందగా ఎగిరే రెండు పక్షుల్లా ఉంటారు. వారిద్దరూ కలిసి తూర్పు ప్రజల ఐశ్వర్యాలు దోచుకొంటారు. ఎదోము, మోయాబు, అమ్మోను ప్రజలను ఎఫ్రాయిము, యూదా తమ ఆధీనంలో ఉంచుకొంటారు.

15 యెహోవా కోపగించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. అదే విధంగా యూఫ్రటీసు నదిమీద యెహోవా తన చేయి ఊపుతాడు. ఆయన నదిని కొడ్తాడు. ఆ నది ఏడు చిన్న నదులుగా విభజించబడుతుంది. ఆ చిన్న నదులు లోతుగా ఉండవు. ప్రజలు చెప్పులతోనే ఆ నదులు దాటగలుగుతారు. 16 దేవుని శేషజనం అష్షూరును విడిచి వెళ్లటానికి వారికి దారి ఉంటుంది. అది, ఇశ్రాయేలీయులను దేవుడు ఈజిప్టు నుండి బయటకు నడిపించినప్పటిలా ఉంటుంది.

దేవునికి ఒక స్తుతిపాట

12 ఆ సమయంలో మీరంటారు:
“యెహోవా, నిన్ను నేను స్తుతిస్తున్నాను.
నీకు నామీద కోపం వచ్చింది.
    కానీ ఇప్పుడు నామీద కోపగించకుము.
నీ ప్రేమ నాకు చూపించు.”
దేవుడు నన్ను రక్షిస్తున్నాడు.
    ఆయన్నే నేను నమ్ముకొంటాను. నాకేం భయంలేదు. ఆయన నన్ను రక్షిస్తాడు.
యెహోవా, యెహోవాయే నా బలం.[a]
    ఆయన నన్ను రక్షిస్తున్నాడు. నేను ఆయనకు స్తోత్రగీతాలు పాడుతాను.
రక్షణ ఊటల్లోనుండి మీ నీళ్లు తెచ్చుకోండి.
    అప్పుడు మీరు సంతోషిస్తారు.
“యెహోవాకు స్తోత్రాలు!
ఆయన నామం ఆరాధించండి!
    ఆయన చేసిన కార్యాలను గూర్చి ప్రజలందరితో చెప్పండి”
    అని అప్పుడు మీరు అంటారు.
యెహోవాను గూర్చిన స్తోత్రగీతాలు పాడండి.
    ఎందుకంటే, ఆయన గొప్ప కార్యాలు చేశాడు గనుక.
దేవుని గూర్చిన ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా ప్రకటించండి.
    పజలందర్నీ ఈ విషయాలు తెలుసుకోనివ్వండి.
సీయోను ప్రజలారా, ఈ సంగతులను గూర్చి కేకలు వేయండి.
    ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు శక్తివంతంగా మీతో ఉన్నాడు.
    అందుచేత, సంతోషంగా ఉండండి!

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International