Chronological
ఉపోద్ఘాతం
1 ఇది ఆమోసు వర్తమానం. ఆమోసు తెకోవ నగరానికి చెందిన ఒక పశువుల కాపరి. ఉజ్జియా యూదాకు రాజుగాను, యెహోయాషు కుమారుడు యరొబాము ఇశ్రాయేలుకు రాజుగాను ఉన్న కాలంలో ఆమోసు ఇశ్రాయేలునుగూర్చి దర్శనాలు చూశాడు. ఇది భూకంపం రావటానికి రెండు సంవత్సరాల ముందటి విషయం.
సిరియాకు శిక్ష
2 ఆమోసు ఇలా అన్నాడు:
“యెహోవా సీయోనులో సింహంలా గర్జిస్తాడు.
ఆయన గంభీర స్వరం యెరూషలేమునుండి గర్జిస్తుంది.
గొర్రెల కాపరుల పచ్చిక బయళ్లు ఎండిపోతాయి.
కర్మెలు పర్వతం[a] సహితం ఎండిపోతుంది.”
3 యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “దమస్కు[b] ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందుకంటే, వారు గిలాదును[c] ధాన్యం రాలగొట్టే ఇనుప కడ్డీలతో నలుగగొట్టారు. 4 కావున హజాయేలు[d] ఇంటిలో (సిరియా) నేను అగ్నిని పుట్టిస్తాను. ఆ అగ్ని బెన్హదదు[e] ఉన్నత బురుజులను నాశనం చేస్తుంది.
5 “దమస్కు ద్వారాలమీద ఉన్న బలమైన కడ్డీలను విరుగగొడతాను. ఆవెను లోయలో సింహాసనంపై కూర్చున్నవానిని నేను నాశనం చేస్తాను. బెతేదేనులో రాజదండం పట్టిన రాజును నేను నాశనం చేస్తాను. సిరియా ప్రజలు ఓడింపబడతారు. ప్రజలు వారిని కీరు దేశానికి తీసుకుపోతారు అని యెహోవా చెపుతున్నాడు.”
ఫిలిష్తీయులకు శిక్ష
6 యెహోవా ఇది చెపుతున్నాడు: “గాజా[f] ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందువల్లనంటే వారు ఒక దేశ ప్రజలందరినీ చెరబట్టి, వారినిఎదోముకు[g] బానిసలుగా పంపారు. 7 కావున గాజా ప్రాకారం మీదికి నేను అగ్నిని పంపుతాను. గాజాలోని ఉన్నత బురుజులను అగ్ని దహించివేస్తుంది. 8 మరియు నేను అష్టోదులో[h] సింహాసనంపై కూర్చున్నవానిని నాశనం చేస్తాను. అష్కెలోనులో[i] రాజదండం ధరించిన రాజును నేను నాశనం చేస్తాను. నేను ఎక్రోను[j] ప్రజలను నాశనం చేస్తాను. ఇంకా బతికివున్న ఫిలిష్తీయులు అప్పుడు మరణిస్తారు అని దేవుడైన యెహోవా చెపుతున్నాడు.”
ఫెనీషియా (ఫెనీకే)కు శిక్ష
9 యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “తూరు[k] ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందువల్లనంటే వారు ఒక దేశ ప్రజలనందరినీ చెరబట్టి, వారిని బానిసలుగా ఎదోముకు పంపారు. తమ సోదరులతో (ఇశ్రాయేలుతో) చేసుకొన్న ఒడంబడికను వారు గుర్తు పెట్టుకోలేదు. 10 అందువల్ల తూరు గోడల మీద నేను అగ్నిని రగుల్చుతాను. తూరులో ఎత్తయిన బురుజులను ఆ అగ్ని నాశనం చేస్తుంది.”
ఎదోమీయులకు శిక్ష
11 యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఎదోము ప్రజలు చేసిన అనేక నేరాలకు వారిని నేను నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందువల్లనంటే ఎదోము కత్తి పట్టి, తన సోదరుని (ఇశ్రాయేలును) వెంటాడాడు. ఎదోము దయ చూపలేదు. ఎదోము కోపం శాశ్వతంగా కొనసాగింది. అతడు ఒక క్రూర జంతువులా ఇశ్రాయేలును చీల్చి చెండాడాడు. 12 కావున తేమానులో[l] నేను అగ్నిని రగుల్చుతాను. ఆ అగ్ని బొస్రాలో[m] ఉన్నతమైన బురుజులను నాశనం చేస్తుంది.”
అమ్మోనీయులకు శిక్ష
13 యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “అమ్మోను ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందువల్లనంటే వారు గిలాదులో గర్భిణీ స్త్రీలను చంపారు. ఆ ప్రాంతాన్ని కలుపుకొని తమ రాజ్యాన్ని విస్తరింపజేయటానికి అమ్మోను ప్రజలు ఈ పని చేశారు. 14 కావున రబ్బా[n] గోడమీద నేను అగ్ని రగుల్చుతాను. అది రబ్బాలోని ఉన్నతమైన బురుజులను నాశనం చేస్తుంది. వారి దేశంలోకి సుడిగాలి వచ్చినట్లు వారికి కష్టాలు వస్తాయి. 15 అప్పుడు వారి రాజులు, నాయకులు పట్టుబడతారు. వారంతా కలిసి చెరపట్టబడతారు అని యెహోవా చెపుతున్నాడు.”
మోయాబుకు శిక్ష
2 యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “మోయాబు ప్రజలు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందుకంటే, ఎదోము రాజు యొక్క ఎముకలు సున్నమయ్యేలా మోయాబువారు కాల్చివేశారు. 2 కావున మోయాబులో నేను అగ్నిని రగుల్చుతాను. ఆ అగ్ని కెరీయోతు[o] ఉన్నత బురుజులను నాశనం చేస్తుంది. భయంకరమైన అరుపులు, బూర నాదాలు వినబడతాయి. మోయాబు చనిపోతాడు. 3 అలా నేను మోయాబు రాజులను నిర్మూలిస్తాను. మరియు మోయాబు నాయకులందరినీ నేను చంపివేస్తాను అని యెహోవా చెపుతున్నాడు.”
యూదాకు శిక్ష
4 యెహోవా ఇలా చెపుతున్నాడు: “యూదావారు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందుకంటే, వారు యెహోవా ఆజ్ఞలను పాటించ నిరాకరించారు. వారాయన ఆజ్ఞలను స్వీకరించలేదు. వారి పూర్వీకులు అబద్ధాలను నమ్మారు. ఆ అబద్ధాలే యూదా ప్రజలను దేవుని అనుసరించకుండా చేశాయి. 5 కావున యూదాలో అగ్నిని పుట్టిస్తాను. ఆ అగ్ని యెరూషలేములోగల ఉన్నత బురుజులను నాశనం చేస్తుంది.”
ఇశ్రాయేలుకు శిక్ష
6 యెహోవా ఇది చెపుతున్నాడు: “ఇశ్రాయేలువారు చేసిన అనేక నేరాలకు నేను వారిని నిశ్చయంగా శిక్షిస్తాను. ఎందుకంటే, స్వల్పమైన వెండికొరకు వారు మంచివారిని, అమాయకులైన ప్రజలను అమ్మివేశారు. వారు ఒక జత చెప్పుల విలువకు పేదవారిని అమ్మివేశారు. 7 పేద ప్రజలను మట్టికరిచేలా కిందికి తోసి, వారిపై తాము నడిచారు. బాధపడేవారి గోడును వారు ఆలకించరు. తండ్రులు, కొడుకులు ఒకే స్త్రీతో సంభోగిస్తారు. వారు నా పవిత్ర నామాన్ని పాడుచేసారు. 8 పేద ప్రజలవద్ద వారు బట్టలు తీసుకొని, బలిపీఠాలముందు ఆరాధన జరిపేటప్పుడు వాటిమీద కూర్చుంటారు. వారు పేదవారికి డబ్బు అప్పుగా ఇచ్చి, వారి దుస్తులను తాకట్టు పెట్టుకున్నారు. ప్రజలు అపరాధ రుసుము చెల్లించేలా వారు చేస్తారు. ఆ డబ్బును వారు తమ దేవుని ఆలయంలో తాగటానికి ద్రాక్షామద్యం కొనడానికి వినియోగిస్తారు.
9 “కాని, అమోరీయులను[p] వారి ముందర నాశనం చేసింది నేనే. అమోరీయులు దేవదారు వృక్షమంత ఎత్తయినవారు. వారు సిందూర వృక్షమంత బలంగలవారు. కాని, పైన వాటి పండ్లను, కింద వాటి వేళ్లను నేను నాశనం చేశాను.
10 “ఈజిప్టు దేశంనుండి మిమ్మల్ని తీసుకొని వచ్చింది నేనే. అమోరీయుల దేశాన్ని మీరు ఆక్రమించటంలో నేను మీకు సహాయం చేశాను. దీనికై నలబై సంవత్సరాలు మిమ్మల్ని ఎడారిలో నడిపించాను. 11 మీ కుమారులలో కొంతమందిని నేను ప్రవక్తలుగా చేశాను. మీ యువకులలో కొంతమందిని నాజీరులుగా నియమించాను. ఇశ్రాయేలు ప్రజలారా! ఇది నిజం అని యెహోవా చెపుతున్నాడు. 12 కాని, నాజీరులు[q] ద్రాక్షామద్యం తాగేలా మీరు చేశారు. దేవుని మాటలు ప్రకటించవద్దని మీరు ప్రవక్తలకు చెప్పారు. 13 మీరు నాకు పెద్ద భారమయ్యారు. అధికమైన గడ్డివేసిన బండిలా నేను చాలా కిందికి వంగిపోయాను. 14 ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎంత వేగంగా పరుగెత్తగలవాడైనా తప్పించుకోలేడు. బలవంతులు బలంగా లేరు. సైనికులు తమను తాము రక్షించుకోలేరు. 15 విల్లంబులు, బాణాలు చేతబట్టిన వారు బ్రతకరు. వేగంగా పరుగిడగలవారు తప్పించుకోలేరు. గుర్రాలు ఎక్కినవారు ప్రాణాలతో తప్పించుకోలేరు. 16 ఆ సమయంలో మిక్కిలి బలవంతులైన సైనికులు సహితం పారిపోతారు. వారు బట్టలు వేసుకొనటానికికూడా సమయం తీసుకోరు అని దేవుడైన యెహోవా చెపుతున్నాడు.”
ఇశ్రాయేలుకు హెచ్చరిక
3 ఇశ్రాయేలు ప్రజలారా, ఈ వర్తమానం వినండి! ఇశ్రాయేలూ, నిన్ను గురించి యెహోవా ఈ విషయాలు చెప్పాడు. ఈజిప్టునుండి ఆయన తీసుకొని వచ్చిన ఇశ్రాయేలు వంశాల వారందరిని గూర్చినదే ఈ వర్తమానం. 2 “భూమిమీద అనేక వంశాలున్నాయి. కాని మిమ్మల్ని మాత్రమే నేను ఎంపికచేసి ప్రత్యేకంగా ఎరిగియున్నాను. అయితే, మీరు నాపై తిరుగుబాటు చేశారు. కావున మీ పాపాలన్నిటికీ నేను మిమ్మల్ని శిక్షిస్తాను.”
ఇశ్రాయేలు శిక్షకు కారణం
3 అంగీకారం లేకుండా
ఇద్దరు వ్యక్తులు కలిసి నడవలేరు.
4 అడవిలో ఉన్న సింహం ఒక జంతువును
పట్టుకున్న తరువాతనే గర్జిస్తుంది.
తన గుహలో వున్న ఒక యువ కిశోరం గర్జిస్తూ ఉందంటే,
అది ఏదో ఒక దానిని పట్టుకున్నదని అర్థం.
5 బోనులో ఆహారం లేకపోతే ఒక పక్షి ఆ బోనులోకి ఎగిరిరాదు.
బోను మూసుకుపోతే, అది అందులో చిక్కుతుంది.
6 హెచ్చరిక చేసే బూరనాదం వినబడితే
ప్రజలు భయంతో వణుకుతారు.
ఒక నగరానికి ఏదైనా ముప్పు వాటిల్లిందంటే,
దానిని యెహోవాయే కలుగ జేసినట్లు.
7 నా ప్రభువైన యెహోవా ఏదైనా చేయటానికి నిర్ణయించవచ్చు. కాని ఆయన ఏదైనా చేసేముందు ఆయన తన పథకాలను తన, సేవకులైన ప్రవక్తలకు తెలియజేస్తాడు. 8 ఒక సింహం గర్జిస్తే ప్రజలు భయపడతారు. యెహోవా మాట్లాడితే, ప్రవక్తలు దానిని ప్రవచిస్తారు.
9-10 అష్డోదు, ఈజిప్టులలో ఉన్న ఎత్తయిన బురుజులు ఎక్కి ఈ వర్తమానం ప్రకటించండి: “మీరు సమరయ (షోమ్రోను) పర్వతాల మీదికి రండి. అక్కడ మీరు ఒక పెద్ద గందరగోళ పరిస్థితిని చూస్తారు. ఎందుకంటే, సవ్యమైన జీవితం ఎలా గడపాలో ఆ ప్రజలకు తెలియదు. సాటి ప్రజలపట్ల వారు క్రూరంగా వ్యవహరించారు. అన్యజనులనుండి వారు వస్తువులను తీసుకొని వాటిని ఎత్తయిన బురుజులలో దాచివేశారు. యుద్ధంలో తీసుకున్న వస్తువులతో వారి ఖజానాలు నిండివున్నాయి.”
11 కావున యెహోవా చెపుతున్నదేమంటే: “దేశంమీదికి ఒక శత్రువు వస్తాడు. ఆ శత్రువు మీ బలాన్ని హరిస్తాడు. మీ ఎత్తయిన బురుజులలో దాచిన వస్తువులన్నీ అతడు తీసుకుంటాడు.”
12 యెహోవా ఇది చెపుతున్నాడు:
“ఒక సింహం ఒక గొర్రెపిల్ల మీద పడవచ్చు.
ఆ గొర్రెపిల్లలో కొంత భాగాన్నే కాపరి రక్షించగలడు.
సింహం నోటినుండి అతడు రెండు కాళ్లను గాని,
చెవిలో కొంత భాగాన్నిగాని బయటకు లాగవచ్చు.
అదే మాదిరి, ఇశ్రాయేలు ప్రజలలో ఎక్కువ మంది రక్షింపబడరు.
సమరయ (షోమ్రోను)లో నివసిస్తున్న ప్రజలు మంచంలో కేవలం ఒక మూలనుగాని,
లేక తమ పాన్పులో ఒక గుడ్డముక్కనుగాని రక్షించుకుంటారు.”
13 నా ప్రభువును, దేవుడును, సర్వశక్తిమంతుడును అయిన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “యాకోబు వంశాన్ని (ఇశ్రాయేలు) ఈ విషయాలను గూర్చి హెచ్చరించు. 14 ఇశ్రాయేలు పాపం చేసింది. వారి పాపాలకు నేను వారిని శిక్షిస్తాను. బేతేలులోవున్న బలిపీఠాలనుకూడా నేను నాశనం చేస్తాను. బలిపీఠపు కొమ్ములు నరికివేయబడతాయి. అవి కింద పడతాయి. 15 శీతాకాలపు విడిదిని, వేసవి విడిదిని కలిపి నేను నాశనం చేస్తాను. దంతపు ఇండ్లు నాశనం చేయబడతాయి. అనేక ఇండ్లు నాశనం చేయబడతాయి” అని యెహోవా చెపుతున్నాడు.
విలాసవంతులైన స్త్రీలు
4 సమరయ (షోమ్రోను) కొండమీదగల బాషాను ఆవుల్లారా[r] నేను చెప్పేది వినండి. మీరు పేద ప్రజలను గాయపరుస్తారు. ఆ పేద ప్రజానీకాన్ని మీరు అణగదొక్కుతారు. “మేము తాగటానికి ఏదైనా తీసికొని రండి!” అని మీరు మీ భర్తలకు చెపుతారు.
2 నా ప్రభువైన యెహోవా ఒక వాగ్దానం చేసాడు. మీకు కష్టాలు వస్తాయని ఆయన తన పవిత్రత సాక్షిగా చెప్పాడు. శత్రు ప్రజలు మీకు కొంకెలు తగిలించి లాగుతారు. మీ పిల్లను లాక్కుపోవటానికి చేపలు పట్టే గాలాలను ఉపయోగిస్తారు. 3 మీ నగరం నాశనం చేయబడుతుంది. మీ స్త్రీలలో ప్రతి ఒక్కరూ గోడ కంతలగుండా నగరంనుండి బయటకు పోతారు. చనిపోయిన మీ పిల్లలను గుట్టమీదికి విసరివేస్తారు.
యెహోవా ఇది చెపుతున్నాడు: 4 “బేతేలుకు వెళ్లి పాపం చేయండి! గిల్గాలుకు వెళ్లి మరింత పాపం చేయండి. మీ బలులను ఉదయ వేళల్లో ఇవ్వండి. మీ పంటలో పదవవంతు మూడు రోజులకొకసారి తీసికొని రండి. 5 పులియబెట్టిన పదార్థాన్ని స్తోత్రార్పణగా ఇవ్వండి. స్వేచ్ఛార్పణల విషయం అందరికీ చెప్పండి. ఇశ్రాయేలూ, నీవు ఈ పనులు చేయటానికి ఇష్టపడతావు. కావున నీవు వెళ్ళి వాటిని చేయి. యెహోవా చెప్పేది ఇదే.
6 “నిన్ను నా వద్దకు వచ్చేలా చేయటానికి నేను చాలా పనులు చేశాను. నేను, మీరు తినటానికి ఏమీ ఆహారం ఇవ్వలేదు. మీ నగరాలలో దేనిలోనూ ఆహారం ఇవ్వలేదు. అయినా నీవు నా వద్దకు తిరిగి రాలేదు. యెహోవా చెప్పేది ఇదే.
7 “నేను వర్షాన్ని కూడా నిలుపు చేశాను. పైగా అది పంట కోతకు మూడు నెలల ముందు సమయం. అందువల్ల పంటలు పండలేదు. పిమ్మట ఒక నగరంలో వర్షం కురిపించి, మరో నగరంలో వర్షం లేకుండా చేశాను. దేశంలో ఒక భాగంలో వర్షం పడింది. కాని దేశంలో మరొక ప్రాంతం వర్షాలు లేక పూర్తిగా ఎండిపోయింది. 8 కావున రెండు మూడు నగరాల ప్రజలు తడబడుతూ నీళ్లకోసం మరొక నగరానికి వెళ్లారు. కాని అక్కడ ప్రతి ఒక్కరికీ సరిపోయేటంత నీరు లేదు. అయినా మీరు సహాయం కొరకు నా వద్దకు రాలేదు. యెహోవా చెప్పేది ఇదే.
9 “ఎండ వేడిమివల్ల, తెగుళ్లవల్ల మీ పంటలు పాడైపోయేలా చేశాను. మీ ఉద్యానవనాలను, ద్రాక్షా తోటలను నేను నాశనం చేశాను. మీ అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను మిడుతలు తినివేశాయి. కాని మీరు మాత్రం సహాయం కొరకు నా వద్దకు రాలేదు. యెహోవా చెప్పేది ఇదే.
10 “ఈజిప్టు విషయంలో చేసినట్లు నేను మీ మీదికి రోగాలను పంపించాను. మీ యువకులను నేను కత్తులతో సంహరించాను. మీ గుర్రాలను నేను తీసుకున్నాను. మీ స్థావరం కుళ్లిన శవాలతో దుర్గంధ పూరితమయ్యేలా చేశాను. కాని, మీరు సహాయం కొరకు నావద్దకు తిరిగి రాలేదు.” యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
11 “సొదొమ, గొమొర్రా నగరాలను నేను నాశనం చేసినట్లు నేను నిన్ను నాశనం చేశాను. ఆ నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పొయ్యిలో నుండి లాగబడి కాలిన కట్టెలా మీరున్నారు. కాని, మీరు సహాయంకొరకు నా వద్దకు రాలేదు” అని యెహోవా చెపుతున్నాడు.
12 “కావున ఇశ్రాయేలూ, మీకు నేనీ విషయాలు కలుగజేస్తాను. ఇది మీకు నేను చేస్తాను. ఇశ్రాయేలూ, మీ దేవుని కలుసుకోటానికి సిద్ధమవ్వు.”
13 నేనెవరిని? పర్వతాలను ఏర్పాటు చేసింది నేనే.
మీ మనస్సులను[s] సృష్టించింది నేనే.
ఎలా మాట్లాడాలో ప్రజలకు నేర్పింది నేనే.
సంధ్యవేళను చీకటిగా మార్చేదీ నేనే. భూమిపైగల పర్వతాలపై నేను నడుస్తాను.
ఇట్టి నేను ఎవరిని?
సర్వశక్తిమంతుడగు దేవుడను. నా పేరు యెహోవా.
ఇశ్రాయేలు కొరకు విషాద గీతిక
5 ఇశ్రాయేలు ప్రజలారా, ఈ పాట వినండి. ఈ విలాపగీతం మిమ్మల్ని గురించినదే.
2 ఇశ్రాయేలు కన్యక పతనమయింది.
ఆమె ఇక లేవలేదు.
మట్టిలోపడి ఆమె ఒంటరిగా వదిలి వేయబడింది.
ఆమెను లేవనెత్తే వ్యక్తే లేడు.
3 ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
“వెయ్యిమంది సైనికులతో నగరం వదిలివెళ్ళే
అధికారులు కేవలం వందమంది మనుష్యులతో తిరిగి వస్తారు
వందమంది సైనికులతో నగరం వదలి వెళ్లే
అధికారులు కేవలం పదిమంది మనుష్యులతో తిరిగి వస్తారు.”
తిరిగి రమ్మని ఇశ్రాయేలును యెహోవా ప్రోత్సహించుట.
4 ఇశ్రాయేలీయులతో యెహోవా ఇలా చెపుతున్నాడు:
“నన్ను వెదుక్కుంటూ వచ్చి జీవించండి.
5 కాని బేతేలులో వెదకవద్దు.
గిల్గాలుకు వెళ్లవద్దు.
సరిహద్దును దాటి బెయేర్షెబాకు వెళ్లకండి.
గిల్గాలు ప్రజలు బందీలుగా తీసుకుపోబడతారు.
బేతేలు నాశనం చేయబడుతుంది.
6 యెహోవా దరిచేరి జీవించండి.
మీరు యెహోవా వద్దకు వెళ్లకపోతే యోసేపు (పది వంశాలవారు) ఇంటిమీద నిప్పు పడుతుంది.
ఆ అగ్ని యోసేపు ఇంటిని దగ్ధం చేస్తుంది. బేతేలులో చెలరేగిన ఆ అగ్నిని ఎవ్వరూ ఆపలేరు.
7-9 మీరు యెహోవా కొరకు చూడండి.
సప్త ఋషీ నక్షత్రాలను, మృగశీర్ష నక్షత్రాన్ని సృష్టించింది ఆయనే.
చీకటిని ఉదయ కాంతిగా ఆయన మార్చుతాడు.
పగటిని చీకటిగా ఆయన మార్చుతాడు.
ఆయన సముద్ర జలాలను బయట నేలమీద కుమ్మరిస్తాడు.
ఆయన పేరు యెహోవా!
ఒక బలమైన నగరాన్ని ఆయన సురక్షితంగా ఉంచుతాడు.
మరో బలమైన నగరం నాశనమయ్యేలా ఆయన చేస్తాడు.”
ఇశ్రాయేలీయులు చేసిన చెడుపనులు
ప్రజలారా! ఇది మీకు తగని పని. మీరు మంచిని విషంగా మార్చుతారు.
న్యాయాన్ని హత్యచేసి నేలకు కూలేలా చేస్తారు.
10 ప్రవక్తలు బహిరంగ ప్రదేశాలకు వెళ్ళి, ప్రజలు చేసే చెడ్డపనులకు వ్యతిరేకంగా మాట్లాడతారు. అందుచేత ప్రజలా ప్రవక్తలను అసహ్యించుకుంటారు.
ప్రవక్తలు మంచివైన సామాన్య సత్యాలను బోధిస్తారు. అందుచే ప్రజలు ఆ ప్రవక్తలను అసహ్యించుకుంటారు.
11 మీరు ప్రజలనుండి అన్యాయంగా పన్నులు వసూలు చేస్తారు.
మీరు పేదవారినుండి గోధుమ మోపులను తీసుకుంటారు.
ఈ ధనంతో మీరు చెక్కిన రాళ్లతో అందమైన ఇండ్లు కట్టుకుంటారు.
కాని మీరు ఆ ఇండ్లలో నివసించరు.
మీరు అందమైన ద్రాక్షాతోటలను నాటుతారు.
కాని మీరు వాటినుండి ద్రాక్షారసం తాగరు.
12 ఎందుకంటే మీరు చేసిన అనేక పాపాలగురించి నాకు తెలుసు.
మీరు నిజంగా కొన్ని ఘోరమైన పాపాలు చేశారు.
మంచిపనులు చేసే ప్రజలను మీరు బాధించారు.
చెడు చేయటానికి మీరు డబ్బు తీసుకుంటారు.
బహిరంగ ప్రదేశాలలో పేదవారిని మీరు నెట్టివేస్తారు.
13 ఆ సమయంలో తెలివిగల బోధకులు ఊరుకుంటారు.
ఎందుకంటే అది చెడు కాలం గనుక.
14 దేవుడు మీతోనే ఉన్నట్లు మీరు చెపుతారు.
అందుచే మీరు మంచిపనులు చేయాలేగాని చెడు చేయరాదు.
అప్పుడు మీరు బతుకుతారు.
సర్వశక్తుడగు యెహోవా నిజంగా మీతోవుంటాడు.
15 చెడును ద్వేషించు. మంచిని ప్రేమించు.
న్యాయస్థానాలలో న్యాయాన్ని పునరుద్ధరించండి.
అప్పుడు యోసేపు వంశంలో మిగిలినవారిమీద దేవుడు,
సర్వశక్తిమంతుడు అయిన యెహోవా కనికరం కలిగి ఉండవచ్చు.
మిక్కిలి దుఃఖకాలం రాబోవుట
16 అందువలన ప్రభువును, సర్వశక్తిమంతుడును అయిన దేవుడు ఈ విషయం చెపుతున్నాడు:
“బహిరంగ ప్రదేశాలన్నిటిలోనూ ప్రజలు విలపిస్తారు.
ప్రజలు వీధులలో రోదిస్తారు.
ఏడ్చేటందుకు ప్రజలు కిరాయి మనుష్యులను నియమిస్తారు.
17 ద్రాక్షాతోటలన్నిటిలో ప్రజలు విలపిస్తారు.
ఎందుకనగా నేను అటుగా వెళ్లి మిమ్మల్ని శిక్షిస్తాను.” అని
యెహోవా చెపుతున్నాడు.
18 మీలో కొంతమంది
యెహోవాయొక్క ప్రత్యేక తీర్పు రోజును చూడగోరుతారు.
అ రోజును మీరెందుకు చూడగోరుతున్నారు?
యెహోవా యొక్క ఆ ప్రత్యేక దినము మీకు చీకటిని తెస్తుందేగాని, వెలుగును కాదు!
19 ఒక సింహపు బారినుండి తప్పించుకుపోయే వ్యక్తిపై
ఎలుగుబంటి మీదపడినట్లు మీరుంటారు!
ఇంటిలోకి వెళ్లి, గోడమీద చేయి వేయగా
పాము కరచినవాని మాదిరి మీరుంటారు!
20 కావున యెహోవాయొక్క ప్రత్యేక దినము
చీకటిని తెస్తుంది గాని, వెలుగును కాదు. అది దుఃఖ సమయంగాని, సంతోష సమయం కాదు!
ఆ రోజు మీకు వెలుగు ఏమాత్రమూ లేని కారు చీకటిగా ఉంటుంది.
ఇశ్రాయేలీయుల ఆరాధనను యెహోవా తిరస్కరించటం
21 “మీ పవిత్ర దినాలను నేను ద్వేషిస్తాను!
నేను వాటిని అంగీకరించను!
మీ ప్రార్థనా సమావేశాలపట్ల నేను సంతోషంగా ఉండను!
22 మీరు నాకు దహనబలులు అర్పించినా, ధాన్యార్పణలు పెట్టినా,
నేను వాటిని స్వీకరించను!
మీరు సమాధాన బలులుగా అర్పించే బలిసిన జంతువులవైపు
నేను కనీసం చూడనైనా చూడను.
23 మీరు బిగ్గరగా పాడే పాటలను ఇక్కడనుండి తొలగించండి.
మీ స్వరమండలమునుండి వచ్చే సంగీతాన్ని నేను వినను.
24 మీ దేశమంతటా న్యాయం నీళ్లలా ప్రవహించేలా మీరు చేయాలి.
మంచితనాన్ని ఎన్నడూ ఎండని నీటి వాగువలె ప్రవహించేలా చేయండి.
25 ఇశ్రాయేలూ, నలుబది సంవత్సరాలపాటు
నీవు ఎడారిలో నాకు బలులు, అర్పణలు సమర్పించావు.
26 కాని మీరు మీ రాజుయొక్క సక్కూతు విగ్రహాలను, కైవాను[t] విగ్రహాలను కూడ తీసికొని వెళ్లారు.
పైగా మీకై మీరు ఆ నక్షత్రాన్ని మీ దేవునిగా చేసుకున్నారు.
27 కావున దమస్కు (డెమాస్కస్) పట్టణం అవతలకి మిమ్మల్ని బందీలుగా పట్టుకుపోయేలా చేస్తాను.”
దేవుడును, సర్వశక్తిమంతుడును
అయిన యెహోవా ఆ విషయాలు చెపుతున్నాడు.
© 1997 Bible League International