Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెషయా 5-8

యూదా, దేవుని ద్రాక్షాతోట

ఇప్పుడు నేను నా స్నేహితునికి (దేవుడు) ఒక పాట పాడుతాను. నా స్నేహితునికి తన ద్రాక్షావనం మీద (ఇశ్రాయేలు) ఉన్న ప్రేమను గూర్చిన పాట ఇది.

మంచి సారవంతమైన భూమిలో
    నా స్నేహితునికి ఒక ద్రాక్షతోట ఉంది.
నా స్నేహితుడు పొలం దున్ని, చదును చేశాడు.
    అక్కడ మంచి ద్రాక్ష మొక్కల్ని అతడు నాటాడు.
ఆ పొలం మధ్యలో అతడు ఒక గోపురం కట్టాడు.
    అక్కడ మంచి ద్రాక్షలు పండుతాయని
నా స్నేహితుడు ఎదురు చూశాడు.
    కాని అక్కడ కారు ద్రాక్షలే పండాయి.

కనుక దేవుడు చెప్పాడు: “యెరూషలేములో నివసిస్తున్న ప్రజలారా, ఓ యూదా మనిషి,
    నన్ను గూర్చి, నా ద్రాక్షాతోట గూర్చి ఆలోచించు.
నా ద్రాక్షా తోటకు సహాయపడుటకు ఇంతకంటె ఎక్కువ నేనేం చేయాలి?
    నేను చేయగలిగింది అంతా చేశాను.
మంచి ద్రాక్షలు పండుతాయని నేను ఎదురు చూశాను.
    కానీ కారు ద్రాక్షాలే ఉన్నాయి
    ఎందుకు అలా జరిగింది?

“నా ద్రాక్షాతోటకు నేను ఏమి చేస్తానో ఇప్పుడు నేను మీతో చెబుతాను.
తోటను కాపాడుతోన్న ముళ్ల కంచెను
    నేను లాగివేసి, దాన్ని కాల్చేస్తాను.
దాని రాతి గోడను నేను కూలగొట్టేస్తాను.
    ఆ రాళ్లు కాళ్ల క్రింద తొక్కబడతాయి.
నా ద్రాక్షా తోటను నేను బీడు భూమిగా చేస్తాను.
    దాని మొక్కల్ని ఎవరూ లెక్క చేయరు. ఆ పొలంలో ఎవ్వరూ పని చేయరు.
    కలుపు మొక్కలు, ముళ్లపొదలు అక్కడ పెరుగుతాయి.
ఆ పొలం మీద వర్షించ వద్దని మేఘాలకు నేను ఆజ్ఞాపిస్తాను.”

సర్వశక్తిమంతుడైన యెహోవాకు చెందిన ద్రాక్షాతోట ఇశ్రాయేలు రాజ్యం. యెహోవాకు ప్రియమైన ద్రాక్షావల్లి యూదా మనిషి.[a]

యెహోవా న్యాయం కోసం నిరీక్షించాడు.
    కాని అక్కడ చంపటం మాత్రమే ఉంది.
అంతా లక్షణంగా ఉంటుంది అని యెహోవా నిరీక్షించాడు.
    కానీ అక్కడ బాధించబడిన ప్రజల ఆర్త ధ్వనులే ఉన్నాయి.

మీరు చాలా కిక్కిరిసి నివసిస్తారు. ఇంక దేనికి స్థలంలేనంతగా మీరు ఇళ్లు నిర్మించేస్తారు. కానీ యెహోవా మిమ్మల్ని శిక్షిస్తాడు. మీరు ఒంటరిగా జీవించాల్సి వస్తుంది. దేశం మొత్తంలో మీరు మాత్రమే ఉంటారు. సర్వశక్తిమంతుడైన యెహోవా నాతో ఇలా చెప్పాడు, నేను అది విన్నాను, “ఇప్పుడు చాలా ఇళ్లు ఉన్నాయి. అయితే ఆ ఇళ్లన్నీ నాశనం చేయబడుతాయని నేను ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు అందమైన పెద్ద భవనాలు ఉన్నాయి. కానీ ఆ ఇళ్లు ఖాళీ అయిపోతాయి. 10 ఆ సమయంలో ఒక పదెకరాల ద్రాక్షాతోట కొంచెం మాత్రమే ద్రాక్షారసం ఇస్తుంది. చాలా బస్తాల గింజలతో కొద్దిపాటి ధాన్యం మాత్రం దిగుబడి అవుతుంది.”

11 మీరు ఉదయాన్నే లేచి మద్యం తాగాలని చూస్తుంటారు. ద్రాక్షామద్యంతో మత్తెక్కి రాత్రి చాలాసేపు మెళకువగా ఉంటారు. 12 మీరు ద్రాక్షామద్యంతో, సితారాలు, డప్పులు, పిల్లన గ్రోవులు, ఇతర సంగీత వాయిద్యాలతో మీరు విందులు చేసుకొంటారు. యెహోవా చేసిన కార్యాలు మీరు చూడరు. యెహోవా హస్తాలు ఎన్నెన్నో కార్యాలు చేశాయి. కాని మీరు వాటిని గమనించరు. అందుచేత అది మీకు చాలా కీడు.

13 యెహోవా చెబుతున్నాడు: “నా ప్రజలు బంధించబడి తీసుకొని పోబడతారు. ఎందుకంటే వారు నిజంగా నన్నెరుగరు. ఇశ్రాయేలులో నివసిస్తున్న మనుష్యులు ఇప్పుడు చాలా ప్రముఖలు. వారి సుఖ జీవనాలతో వారు సంతోషంగా ఉన్నారు. అయితే ఆ గొప్ప వాళ్లంతా దప్పిగొంటారు, ఆకలితో ఉంటారు. 14 అప్పుడు వారు చనిపోతారు, పాతాళం మరింత మంది మనుష్యులతో నిండిపోతుంది. ఆ మరణ స్థానం అపరిమితంగా దాని నోరు తెరుస్తుంది. అప్పుడు ఆ మనుష్యులంతా ఆ పాతాళంలోకి వెళ్లిపోతారు.”

15 ఆ మనుష్యులు తగ్గించబడతారు. ఆ గొప్పవాళ్లంతా తలలు వంచి నేలమీదికి చూస్తారు. 16 సర్వశక్తిమంతుడైన యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడు, ఆయన గొప్పవాడని ప్రజలు తెలుసుకొంటారు. పవిత్ర దేవుడు సరైన వాటినే చేస్తాడు, ప్రజలు ఆయనను గౌరవిస్తారు. 17 ఇశ్రాయేలు ప్రజలు వారి దేశం విడిచి వెళ్లిపోయేట్టుగా దేవుడు చేస్తాడు, దేశం శూన్యం అవుతుంది. గొర్రెలు వాటికి ఇష్టం వచ్చిన చోటుకు వెళ్తాయి. ఒకప్పుడు ధనికులదైన భూమిమీద గొర్రె పిల్లలు నడుస్తాయి.

18 ఆ మనుష్యుల్ని చూడండి. మనుష్యులు తాళ్లతో బండ్లను లాగినట్టు, వాళ్లు తమ పాపాల్ని దోషాన్ని వారి వెనుక లాగుతున్నారు. 19 వాళ్లు అంటారు: “దేవుడు చేయాలనుకొనే పనులు ఆయన త్వరగా చేస్తే బాగుండును. అప్పుడు జరిగేది ఏమిటో మాకు తెలుస్తుంది. యెహోవా పథకం త్వరగా జరిగిపోతే బాగుండును. ఆయన పథకం ఏమిటో అప్పుడు మాకు తెలుస్తుంది.”

20 ఆ మనుష్యులు మంచివాటిని చెడ్డవి అంటారు, చెడ్డవాటిని మంచివి అంటారు. వెలుగును చీకటి అని, చీకటిని వెలుగు అని వాళ్లు అనుకొంటారు. వాళ్లు చేదును తీపి, తీపిని చేదు అనుకొంటారు. 21 వాళ్లు చాలా తెలివిగల వాళ్లు అని ఆ మనుష్యులు తలస్తారు. వాళ్లు చాలా జ్ఞానంగలవాళ్లు అని తలస్తారు. 22 ద్రాక్షామద్యం తాగటంలో ఆ మనుష్యులు చాలా ప్రసిద్ది. మద్యము కలపటంలో వారు ప్రముఖులు. 23 మీరు వారికి డబ్బు చెల్లిస్తే, వారు నేరస్థుల్ని క్షమించేస్తారు. కానీ వారు మంచి వాళ్లకు న్యాయం జరుగనివ్వరు. 24 ఆ మనుష్యులకు చెడు సంగతులు సంభవిస్తాయి. గడ్డి, ఆకులు అగ్నితో కాల్చివేయబడినట్టు, వారి సంతతివారు పూర్తిగా నాశనం చేయబడతారు. చచ్చి, ధూళిగా తయారయ్యే వేరులా వారి సంతానంవారు పూర్తిగా నాశనం చేయబడతారు. అగ్ని నాశనం చేసిన ఒక పువ్వులా వారి సంతతివారు నాశనం చేయబడతారు. దాని బూడిద గాలితో కొట్టుకొని పోతుంది. సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుని ఉపదేశాలకు విధేయులయ్యేందుకు వారు నిరాకరించారు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని (దేవుని) సందేశాన్ని ఆ ప్రజలు అసహ్యించుకొన్నారు. 25 అందుచేత యెహోవా తన ప్రజల మీద చాలా కోపగించాడు. యెహోవా తన చేయి పైకెత్తి, వాళ్లను శిక్షిస్తాడు. పర్వతాలు సహా భయపడి పోతాయి. చచ్చిన శవాలు చెత్తలా వీధుల్లో పడి ఉంటాయి. కానీ దేవుడు మాత్రం ఇంకా కోపంగానే ఉంటాడు. ఆ ప్రజలను శిక్షించుటకు ఆయన హస్తం ఇంకా పైకెత్తబడిఉంటుంది.

ఇశ్రాయేలును శిక్షించటానికి దేవుడు సైన్యాలను రప్పిస్తాడు

26 చూడండి! చాలా దూరంలో ఉన్న దేశాలకు దేవుడు ఒక సంకేతం ఇస్తున్నాడు. దేవుడు ఒక పతాకాన్ని ఎగుర వేస్తున్నాడు, మరియు ఆ ప్రజలను పిలిచేందుకు ఆయన ఈల వేస్తున్నాడు.

శత్రువు దూరదేశం నుండి వస్తున్నాడు. త్వరలోనే శత్రువు దేశంలో ప్రవేశిస్తాడు. వారు చాలా వేగంగా కదలుతున్నారు. 27 శత్రువు ఎన్నటికీ అలసిపోడు, పడిపోడు. వారెన్నటికీ నిద్రబోతులుగా నిద్రపోరు. వారి ఆయుధ పట్టాలు ఎల్లప్పుడూ సిద్దమే. వారి చెప్పుల తాళ్లు ఎప్పటికి తెగిపోవు. 28 శత్రువుల బాణాలు చాలా పదునుగా ఉంటాయి. వారి బాణాలన్నీ కొట్టడానికి సిద్ధంగా ఉంటాయి. గుర్రాల డెక్కలు బండలా గట్టిగా ఉంటాయి. వాటి రథాల వెనుక ధూళి మేఘాలుగా లేస్తుంది.

29 శత్రువు గట్టిగా అరిస్తే, అది సింహగర్జనలా ఉంటుంది. అది కొదమ సింహపు గర్జన అంత గట్టిగా ఉంటుంది. శత్రువు తాను పోరాడుతున్న ప్రజలను ఎదురులేకుండా పట్టి లాగుకొని పోతాడు. ప్రజలు కొట్టుమిట్టాడి, తప్పించుకొనేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్లను రక్షించేవాడు ఎవ్వడూ ఉండడు. 30 కనుక “సింహం” గట్టిగా సముద్ర ఘోషలా గర్జిస్తుంది. బంధించబడిన ప్రజలు నేలమీదికే చూస్తుంటారు, అప్పుడు చీకటి మాత్రమే ఉంటుంది. దట్టమైన ఈ మేఘంలో వెలుగంతా చీకటిగానే ఉంటుంది.

దేవుడు యెషయాను ప్రవక్తగా ఉండమని పిలుచుట

ఉజ్జియా రాజు చనిపోయిన సంవత్సరం నా ప్రభువును నేను చూశాను. మహా ఎత్తయిన సింహాసనంమీద ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన అంగీతో దేవాలయం నిండిపోయింది. సెరాపులనే దేవదూతలు ఆయన పైగా నిలబడ్డారు. ఒక్కొక్క సెరాపు దేవదూతకు ఆరు రెక్కలు ఉన్నాయి. ఆ దేవదూతలు వారి ముఖాలు కప్పుకొనేందుకు రెండేసి రెక్కలు, పాదాలు కప్పుకొనేందుకు రెండేసి రెక్కలు మరియు ఎగిరేందుకు రెండేసి రెక్కలు ఉపయోగించారు. దేవదూతలు ఒకరితో ఒకరు, “ప్రభువైన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ఆయన మహిమ భూలోకమంతా నిండిపోయింది” అని ఘనంగా స్తుతిస్తున్నారు. వారి స్వరాలు గడప కమ్ముల్ని కదలించి వేశాయి. అంతలో దేవాలయం ధూమంతో నిండిపోవటం మొదలయింది.

“అయ్యో! నాకు శ్రమ, నేను నాశనమయ్యాను. నేను అశుద్ధమైన పెదవులున్న వాడను, నేను అపరిశుద్ధమైన పెదవులున్న జనుల మధ్య నివసిస్తున్నాను. సైన్యములకధిపతియైన యెహోవాను నేను చూశాను.”

బలిపీఠం మీద అగ్ని ఉంది. సెరాపు దేవదూతల్లో ఒకరు ఆ అగ్నిలో నుండి మండుచున్న ఒక నిప్పుకణాన్ని తీయటానికి ఒక పట్టకారు ఉపయోగించారు. మండుతున్న ఆ నిప్పుకణం చేతపట్టుకొని ఆ దేవదూత నా దగ్గరకు ఎగిరి వచ్చాడు. ఆ సెరాపు దేవదూత ఆ వేడి నిప్పుకణంతో నా నోటిని తాకాడు. అప్పుడు ఆ దూత, “చూడు, ఈ వేడి నిప్పుకణం నీ పెదాలను తాకింది గనుక నీవు చేసిన తప్పులన్నీనీలో నుండి పోయాయి. ఇప్పుడు నీ పాపాలు తుడిచివేయబడ్డాయి.” అని చెప్పాడు.

అప్పుడు నా ప్రభువు స్వరం నేను విన్నాను. “నేను ఎవర్ని పంపగలను? మా కోసం ఎవరు వెళ్తారు?” అన్నాడు యెహోవా.

కనుక నేను “ఇదుగో నేను ఉన్నాను, నన్ను పంపించు” అన్నాను.

అప్పుడు యెహోవా చెప్పాడు, “వెళ్లి, ప్రజలతో ఇది చెప్పు: ‘మీరు దగ్గరగా వచ్చి వింటారు గాని గ్రహించరు! దగ్గరగా వచ్చి చూస్తారు గాని నేర్చుకోరు.’ 10 ప్రజల్ని గందరగోళం చేయి. ప్రజలు విని, చూచే విషయాలు వారు గ్రహించకుండా ఉండేటట్టు చేయి. నీవు ఇలా చేయకపోతే, ప్రజలు వారి చెవులతో వినే విషయాలను నిజంగానే గ్రహించవచ్చు. ప్రజలు వారి మనస్సుల్లో నిజంగానే అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ వారు అలా కనుక చేస్తే, ఆ ప్రజలు మళ్లీ నా దగ్గరకు తిరిగి వచ్చి, స్వస్థత పొందుతారేమో (క్షమాపణ)!”

11 అప్పుడు నేను “ప్రభూ, ఎన్నాళ్లు నేను ఇలా చేయాలి?” అని అడిగాను.

యెహోవా జవాబిచ్చాడు, “పట్టణాలు నాశనం చేయబడి, ప్రజలు వెళ్లిపోయేంత వరకు ఇలా చేయి. ఇళ్లలో మనుష్యులు ఎవ్వరూ నివసించకుండా ఉండే అంతవరకు ఇలా చేయి. దేశం నాశనం చేయబడి, నిర్జనం అయ్యేంతవరకు ఇలా చేయుము.”

12 ప్రజలు దూరంగా వెళ్లిపోయేట్టు యెహోవా చేస్తాడు. దేశంలో విస్తారమైన ప్రదేశాలు నిర్జనంగా ఉంటాయి. 13 అయితే పదోవంతు ప్రజలు దేశంలో ఉండేందుకు అనుమతించబడతారు. ఈ ప్రజలు యెహోవా దగ్గరకు తిరిగి వస్తారు గనుక వీరు నాశనం చేయబడరు. ఈ ప్రజలు సింధూర వృక్షంలాంటి వారు. చెట్టు నరికి వేయబడినప్పుడు, దాని మొద్దు విడువబడుతుంది. ఈ మొద్దు (మిగిలిన ప్రజలు) చాలా ప్రత్యేకమైన విత్తనం.

సిరియాతో చిక్కు

ఆహాజు యోతాము కుమారుడు. యోతాము ఉజ్జియా కుమారుడు. సిరియా రాజు రెజీను రెమల్యా కుమారుడు, పెకహు ఇశ్రాయేలు రాజు. ఆహాజు యూదాకు రాజుగా ఉన్న కాలంలో, రెజీను, పెకహు యెరూషలేము మీద యుద్ధానికి వెళ్లారు. కాని వారు ఆ పట్టణాన్ని ఓడించలేక పోయారు.

దావీదు కుటుంబానికి ఒక సందేశం ఇవ్వబడింది. “అరాము (సిరియా) సైన్యం, ఎఫ్రాయిము (ఇశ్రాయేలు) సైన్యం ఒకటిగా కలిశాయి. రెండు సైన్యాలు కలిసి బసచేస్తున్నాయి” అనేది ఆ సందేశం. అహాజు రాజు ఈ సందేశం విన్నప్పుడు అతడు, ప్రజలు చాలా భయపడిపోయారు. అరణ్యంలో గాలికి కొట్టుకొనే చెట్లలా వారు భయంతో వణకి పోయారు.

అప్పుడు యెషయాతో యెహోవా చెప్పాడు, “నీవూ, నీ కుమారుడూ షెయార్యాషూబు వెళ్లి ఆహాజుతో మాట్లాడండి. పైకోనేటిలోకి నీళ్లు ప్రవహించే చోటికి వెళ్లండి. ఇది చాకలివాని పొలానికి పోయే దారిలో ఉంది.

“ఆహాజుతో చెప్పండి, జాగ్రత్తగా ఉండండి, గాని నెమ్మదిగా ఉండండి. భయపడవద్దు. వాళ్లిద్దరు మనుష్యులు, అంటే రెజీను, రెమల్యా కుమారుడు మిమ్మల్ని భయపెట్టనివ్వకండి. వాళ్లు కాలిపోయిన రెండు కట్టెల్లాంటి వాళ్లు. గతంలో వాళ్లు వేడిగా మండుతూండేవాళ్లు. కాని ఇప్పుడు వాళ్లు వట్టి పొగ మాత్రమే. రెజీను, సిరియా, రెమల్యా కుమారుడు కోపంగా ఉన్నారు. వారు మీకు విరోధంగా పథకాలు వేశారు. మనం వెళ్లి యూదా మీద యుద్ధం చేయాలి. యూదాను మనలో మనం పంచుకొందాం. టాబెయేలు కుమారుణ్ణి యూదాకు క్రొత్త రాజుగా చేద్దాము” అని వారన్నారు.

నా దేవుడైన యెహోవా చెబుతున్నాడు, “వారి పథకం పనిచేయదు. అది సంభవించదు. రెజీను దమస్కుకు పాలకునిగా ఉన్నంతవరకు అది జరుగదు. ఎఫ్రాయిము (ఇశ్రాయేలు) ఇప్పుడు ఒక రాజ్యం. కానీ అరవై ఐదు సంవత్సరాల తర్వాత ఎఫ్రాయిము (ఇశ్రాయేలు) రాజ్యంగా ఉండదు. ఎఫ్రాయిముకు షోమ్రోను రాజధానిగా ఉన్నంత వరకు, రెమల్యా కుమారుడు దాని పాలకునిగా ఉన్నంతవరకు వారి పథకం నెరవేరదు. ఈ సందేశాన్ని నీవు నమ్మకపోతే ప్రజలు నిన్ను నమ్మగూడదు.”

ఇమ్మానుయేలు-దేవుడు మనతో ఉన్నాడు

10 అప్పుడు యెహోవా ఆహాజుతో మాట్లాడటం కొనసాగించాడు. 11 యెహోవా చెప్పాడు: “ఈ సంగతులు సత్యం అని నీ మట్టుకు నీవు రుజువు చేసుకొనేందుకు ఒక సూచన కోసం అడుగు. నీకు కావాల్సిన ఏ సూచన కోసమైనా నీవు అడగవచ్చు. ఆ సూచన పాతాళమంత లోతునుండి రావచ్చు, లేక ఆ సూచన ఆకాశమంత ఎత్తునుండి అయినా రావచ్చును.”

12 కాని ఆహాజు, “రుజువుగా సూచన కావాలి అని నేను అడగను. యెహోవాను నేను పరీక్షించను” అన్నాడు.

13 అప్పుడు యెషయా చెప్పాడు, “దావీదు వంశమా, జాగ్రత్తగా ఆలకించు. మీరు ప్రజల సహనాన్ని పరీక్షిస్తారు. కానీ అది మీకు ముఖ్యంకాదు. కనుక మీరు ఇప్పుడు నా దేవుని సహనాన్ని పరీక్షిస్తున్నారు. 14 కాబట్టి ఆయనే మీకు ఒక సూచన చూపిస్తాడు.

ఇదిగో ఒక కన్య గర్భము ధరించి, ఒక కుమారుడ్ని కని,
    ఆయన్ని ఇమ్మానుయేలు అనే పేరుతో పిలుస్తుంది.
15 అతను పెరుగు, తేనె తినును
    చెడును విసర్జించి మంచిని చేపట్టి తెలివి వచ్చేవరకు అతను ఇలా జీవిస్తాడు.
16 కానీ ఆ బాలుడు మంచి, చెడులను తెలుసుకొనక ముందే
    ఎఫ్రాయిము (ఇశ్రాయేలు), సిరియా నిర్జనం అయిపోతాయి. మీరు ఆ ఇద్దరు రాజులను గూర్చి భయపడుతున్నారు.

17 “కానీ మీరు యెహోవాను గూర్చి భయపడాలి. ఎందుకంటే యెహోవా మీకు కొన్ని కష్టకాలాలను తీసుకొని వస్తాడు. మీ ప్రజలకు, మీ తండ్రివంశ ప్రజలకు ఆ కష్టాలు వస్తాయి. దేవుడేమి చేస్తాడు? మీ మీద యుద్ధం చేయటానికి అష్షూరు రాజును యెహోవా తీసుకొని వస్తాడు.

18 “ఆ సమయంలో యెహోవా ‘జోరీగల్ని’ రప్పిస్తాడు. (ఆ ‘జోరీగలు’ ఇప్పుడు ఈజిప్టు నదుల దగ్గర ఉన్నాయి) మరియు యెహోవా కందిరీగల్ని రప్పిస్తాడు. (కందిరీగలు ఇప్పుడు అష్షూరు దేశంలో ఉన్నాయి.) ఈ శత్రువులు మీ దేశానికి వస్తారు. 19 ఈ శత్రువులు అరణ్యపు బండ సందుల దగ్గర మెట్టల లోయల్లోను, పొదల దగ్గర, నీటి మడుగుల దగ్గర ఉంటాయి. 20 యూదాను శిక్షించటానికి యెహోవా అష్షూరును వాడుకొంటాడు. అష్షూరు కూలికి వినియోగించబడే మంగలి కత్తిలా ఉపయోగించబడుతుంది. అది యూదా తలమీద, కాళ్లమీద, వెంట్రుకలను యెహోవా తానే గీసేస్తున్నట్టుగా ఉంటుంది. అది యూదా గడ్డాన్ని యోహోవా గీసేస్తున్నట్టుగా ఉంటుంది.

21 “ఆ సమయంలో ఒక మనిషి ఒక ఆవును, రెండు గొర్రెలను మాత్రమే ప్రాణంతో ఉంచుకో గలుగుతాడు. 22 ఆ ఒక్క మనిషి తినడానికి సరిపోయే పెరుగు, పాలు మాత్రమే ఉంటాయి. దేశంలో ప్రతి మనిషి పెరుగు, తేనె మాత్రమే తింటాడు. 23 ఈ దేశంలో వెయ్యేసి ద్రాక్షావల్లులు ఉన్న పొలాలు ఇప్పుడు ఉన్నాయి. ఒక్కో ద్రాక్షావల్లి వెయ్యి వెండి నాణాల విలువ చేస్తుంది. కాని ఈ పొలాలు గచ్చపొదలు, బలురక్కసి చెట్లతో నిండిపోతాయి. 24 దేశం అడవిగా తయారై, వేట ప్రదేశంగా మాత్రమే ఉపయోగపడుతుంది. 25 ఒకప్పుడు ఈ కొండల మీద ప్రజలు పనిచేసి, ఆహారం పండించారు. కానీ ఆ సమయంలో మనుష్యులు అక్కడికి వెళ్లరు. దేశమంతా గచ్చపొదలతో, బలురక్కసి చెట్లతో నిండిపోతుంది. గొర్రెలు, పశువులు మాత్రమే ఆ స్థలాలకు వెళ్తాయి.”

అష్షూరు త్వరలో వస్తుంది

యెహోవా నాతో చెప్పాడు, “వ్రాయటానికి ఒక పెద్ద పలక తీసుకో. ఘంటంతో (పెన్నుతో) ఈ మాటలు వ్రాయి: ‘మహేరు, షాలాల్, హాష్ బజ్.’ (అంటే ‘త్వరలోనే దోపిడి, దొంగతనం జరుగుతుంది’ అని అర్థం.)”

సాక్షులుగా నమ్మదగిన కొందరు మనుష్యుల్ని నేను సమావేశపర్చాను. (వీళ్లు ఊరియా, యెబెరెక్యా, జెకర్యా) నేను ఈ విషయాలు వ్రాయటం ఈ మనుష్యులు గమనించారు. తర్వాత నేను ప్రవక్త్రి దగ్గరకు వెళ్లాను. నేను ఆమెతో ఉన్న తర్వాత ఆమె గర్భవతియై, ఒక కుమారుని కన్నది. అప్పుడు యెహోవా నాతో చెప్పాడు, “పిల్లవాడికి మహేరు షాలాల్ హాష్‌బజ్” అని పేరు పెట్టు. ఎందుకంటే ఆ పిల్లవాడు “అమ్మా” “నాన్నా” అనటం నేర్చుకొనక ముందే దమస్కు, షోమ్రోనుల ధనం, ఐశ్వర్యాలు దేవుడు తీసుకొని, వాటిని దేవుడు అష్షూరు రాజుకు ఇచ్చివేస్తాడు.

దేవుడు మళ్లీ నాతో మాట్లాడాడు. నా ప్రభువు చెప్పాడు: “ఈ ప్రజలు నిదానంగా ప్రవహించే షిలోహు[b] జలాలను స్వీకరించేందుకు నిరాకరించారు. రెజీను, రెమల్యా కుమారునితో (పెకహు) వీళ్లు సంతోషపడి పోతున్నారు. అందుచేత చూడు, నా యెహోవా మహా గొప్ప యూఫ్రటీసు నదీ ప్రవాహంలాగా అష్షూరును దాని శక్తి అంతటిని తీసుకొని వస్తున్నాడు. వారు ఒక నది పొంగి పొర్లేలా, ప్రవాహంలా మీ దేశంలోనికి వస్తారు. ఆ నదిలోంచి నీళ్లు పొంగి యూదాలోకి ప్రవహిస్తాయి. యూదా గొంతుల వరకు నీళ్లు పొంగి, యూదాను దాదాపుగా ముంచేస్తాయి.

“ఇమ్మానుయేలూ, నీ దేశం అంతటినీ ముంచివేసేంతగా ఈ వరద విస్తరిస్తుంది.”

సర్వ దేశాల్లారా, యుద్ధానికి సిద్ధపడండి.
    కాని మీరు ఓడిపోతారు.
దూర దేశాలన్నీ ఆలకించండి.
    యుద్ధానికి సిద్ధపడండి.
    కానీ మీరు ఓడిపోతారు
10 యుద్ధానికి మీ వ్యూహాలు పన్నండి.
    కానీ మీ వ్యూహాలు అన్నీ ఓడిపోతాయి.
మీ సైన్యాలకు ఆజ్ఞాపించండి.
    కానీ మీ ఆజ్ఞలు నిష్ప్రయోజనమే. ఎందుకంటే, దేవుడు మాతో ఉన్నాడు[c] గనుక.

యెషయాకు హెచ్చరికలు

11 యెహోవా తన మహా శక్తితో నాతో మాట్లాడాడు. ఈ ఇతర మనుష్యుల్లా ఉండొద్దని యెహోవా నన్ను హెచ్చరించాడు. 12 “ప్రతివారూ ఇతరులు తమకు వ్యతిరేకంగా పథకాలు వేస్తున్నట్టు చెబుతున్నారు. నీవు ఆ విషయాలు నమ్మవద్దు. ఆ ప్రజలు భయపడే వాటికి నీవు భయపడవద్దు. వాటిగూర్చి నీవు భయపడవద్దు” అని యెహోవా నాతో చెప్పాడు.

13 సర్వశక్తిమంతుడైన యెహోవా ఒక్కడికే మీరు భయపడాలి. మీరు గౌరవించాల్సిన వాడు ఆయనే. మీరు భయపడాల్సింది ఆయనకే. 14 మీరు యెహోవాను గౌరవించి, ఆయనను పవిత్రునిగా ఎంచుకొంటే, అప్పుడు ఆయనే మీకు క్షేమస్థానంగా ఉంటాడు. కానీ మీరు ఆయనను గౌరవించరు. కనుక మీరు పడిపోయేట్టు చేసే బండ ఆయనే. ఇశ్రాయేలు యొక్క రెండు కుటుంబాలను తొట్రిల్లేలా చేసే బండ ఆయనే. యెరూషలేము ప్రజలందరినీ పట్టుకొనే బోను యెహోవాయే. 15 (అనేకమంది మనుష్యులు ఈ బండ తగిలి పడిపోతారు. వాళ్లు పడిపోయి, విరిగిపోతారు. వారు బోనులో పట్టుబడతారు.)

16 యెషయా చెప్పాడు, “ఒక ఒడంబడిక చేసి, దాన్ని ముద్రించండి. నా ఉపదేశాలను భవిష్యత్తు కోసం భద్రపర్చండి. నన్ను అనుసరించే వాళ్లు చూస్తూ ఉండగా దీనిని చేయండి.”

17 ఆ ఒడంబడిక ఇదేః యెహోవా మాకు సహాయం చేసేవరకు నేను వేచి ఉంటాను.
యాకోబు (ఇశ్రాయేలు) వంశం విషయం యెహోవా సిగ్గు పడుతున్నాడు. ఆయన వాళ్లను చూచేందుకు నిరాకరిస్తున్నాడు.
కానీ నేను యెహోవా కోసం నిరీక్షిస్తాను.
ఆయనే మమ్మల్ని రక్షిస్తాడు.

18 “ఇశ్రాయేలు ప్రజలకు నేనూ, నా పిల్లలే సూచనగా రుజువుగా ఉన్నాము. సీయోను కొండమీద నివాసం చేసే సర్వశక్తిమంతుడైన యెహోవా మమ్మల్ని పంపించాడు.”

19 కొంతమంది, “జ్యోతిష్కుల దగ్గరకు, మాంత్రికుల దగ్గరకు వెళ్లి, ఏమి చేయాలో తెలుసుకోండి” అంటున్నారు. (ఈ జ్యోతిష్కులు, మాంత్రికులు పిట్టల్లా కిచకిచలాడి తమకి చాలా తెలివిగల తలపులు ఉన్నట్టు మనుష్యులు తలచాలని గుసగుసలాడుతారు.) అయితే వాళ్లు వాళ్ల దేవుణ్ణి సహాయం అడుక్కోవాలి అని నేను చెబుతున్నాను. ఆ జ్యోతిష్కులు, మాంత్రికులు వారు ఏమి చేయాలి అనేది చచ్చిపోయిన వాళ్లను అడుగుతారు. బ్రతికి ఉన్న వాళ్లు చచ్చిన వాళ్లను ఏదైనా ఎందుకు అడగాలి? 20 మీరు ఉపదేశాలను, ఒడంబడికను అనుసరించాలి. ఈ ఆదేశాలు మీరు అనుసరించకపోతే, మీరు తప్పు ఆదేశాలను పాటించవచ్చు. (తప్పు ఆదేశాలు అంటే జ్యోతిష్కులు, మాంత్రికులు దగ్గర్నుండి వచ్చేవి. అవి ఎందుకూ పనికి రాని ఆదేశాలు. ఆ ఆదేశాలను పాటించటం వల్ల మీకేమీ లాభం ఉండదు.) 21 ఆ తప్పు ఆదేశాలను మీరు పాటిస్తే దేశంలో కష్టాలు, ఆకలి ఉంటాయి. ప్రజలు ఆకలితో ఉంటారు. అప్పుడు వాళ్లకు కోపం వచ్చి రాజును, అతని దేవుళ్లను తిడతారు. అప్పుడు వాళ్లు సహాయం కోసం దేవునివైపు చూస్తారు. 22 వారు వారి దేశంలో చుట్టూరా చూస్తే, కష్టం కృంగదీసే చీకటి దేశంనుండి బలవంతంగా వెళ్లగొట్టబడిన ప్రజల దుఃఖపు చీకటి మాత్రమే వారికి కనబడుతుంది. మరియు ఆ చీకట్లో పట్టుబడిన మనుష్యులు తమను తాము విడిపించుకోలేరు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International