Chronological
1 ఆమోజు కుమారుడు యెషయా దర్శనం ఇది. యూదాకు, యెరూషలేముకు సంభవించే సంగతులను దేవుడు యెషయాకు చూపించాడు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా యూదాకు రాజులుగా ఉన్న కాలవ్యవధిలో ఈ సంగతులను యెషయా చూశాడు.
తన ప్రజల విరుద్ధంగా దేవుని వాదం
2 ఆకాశమా, భూమీ, యెహోవా మాట వినండి! యెహోవా ఇలా చెబుతున్నాడు.
“నా పిల్లల్ని నేను పెంచాను. నా పిల్లలు పెరగటానికి నేను సహాయం చేసాను.
కానీ నా పిల్లలు నా మీద తిరగబడ్డారు.
3 ఎద్దుకు తన కామందు తెలుసు.
గాడిదకు దాని సొంతదారుడు మేత పెట్టే చోటు తెలుసు.
కానీ ఇశ్రాయేలు ప్రజలకు నేను తెలియదు.
నా ప్రజలు గ్రహించరు.”
4 ఇశ్రాయేలు ప్రజలు దోషులు. ఈ దోషం ప్రజలు మోయాల్సిన భారమైన బరువులా ఉంది. ఆ ప్రజలు చెడు కుటుంబాలకు చెందిన దుర్మార్గపు పిల్లల్లా ఉన్నారు. వారు యెహోవాను విడిచిపెట్టేశారు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుణ్ణి (దేవుణ్ణి) ఆ ప్రజలు అవమానించారు. వాళ్లు దేవుణ్ణి విడిచిపెట్టి, పరాయి వాళ్లలా ఉన్నారు.
5 దేవుడు చెబుతున్నాడు: “ప్రజలారా నేనెందుకు మిమ్మల్ని శిక్షిస్తూనే ఉండాలి? నేను మిమ్మల్ని శిక్షించాను. కాని మీరు మారలేదు. మీరు నా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రతి తల, ప్రతిగుండె వ్యాధితో ఉన్నాయి. 6 మీ అరికాలు మొదలుకొని మీ నడినెత్తి వరకు శరీరమంతా గాయాలు, దెబ్బలు, పచ్చిపుండ్లు ఉన్నాయి. మీ పుండ్లను గూర్చి మీరు శ్రద్ధ తీసుకోలేదు. మీ పుండ్లు శుభ్రం చేయబడలేదు. వాటికి కట్లు కట్టలేదు.
7 “మీ దేశం పాడైపోయింది. మీ పట్టణాలు అగ్నితో కాల్చివేయబడ్డాయి. మీ దేశాన్ని మీ శత్రువులు స్వాధీనం చేసుకొన్నారు. సైన్యం నాశనం చేసిన దేశంలా మీ భూమి పాడు చేయబడింది.”
యెరూషలేముకు హెచ్చరిక
8 ఇప్పుడు సీయోను కుమార్తె (యెరూషలేము) ద్రాక్ష తోటలో విడువబడిన ఖాళీ గుడారంలా ఉంది. దోస పాదుల్లో విసర్జించబడిన పాత గుడిసెలాగ ఉంది. అది శత్రువులచేత ఓడించబడిన పట్టణంలా ఉంది. 9 ఇది నిజమే, కానీ సర్వశక్తిమంతుడైన యెహోవా కొద్ది మంది ప్రజలను బ్రతకనిచ్చాడు. సొదొమ, గొమొర్రా పట్టణాల్లా మనం సర్వనాశనం చేయబడలేదు.
10 సొదొమ నాయకులారా, యెహోవా సందేశం వినండి. గొమొర్రా ప్రజలారా, దేవుని ఉపదేశాలు వినండి. 11 దేవుడు అంటున్నాడు: “ఇంకా ఎందుకు మీరు నాకు బలులు అర్పిస్తూనే ఉన్నారు? మీ మేకల బలులు, దూడల కొవ్వు, గొర్రెలు, మేకలు నాకు వెక్కసం అయ్యాయి. 12 మీరు నన్ను కలుసుకొనేందుకు వచ్చినప్పుడు, నా ఆవరణం అంతా తిరుగుతారు. మిమ్మల్ని ఇలా చేయమన్నది ఎవరు?
13 “నా కోసం పనికిమాలిన బలులు ఇక మీదట తీసుకొని రావద్దు. మీరు నాకు అర్పించే ధూపం నాకు అసహ్యం మీ అమావాస్య, సబ్బాతు, పవిత్ర రోజుల పండుగలను నేను సహించను. మీ పరిశుద్ధ సమావేశాలలో మీరు చేసేది నాకు అసహ్యం. 14 మీ నెలసరి సమావేశాలు, సభలు నాకు బొత్తిగా అసహ్యం. ఈ సమావేశాలు నాకు చాలా బరువులా తయారయ్యాయి. ఆ బరువులు మోయటం నాకు విసుగు.
15 “మీరు నన్ను ప్రార్థించాలని మీ చేతులు పైకి ఎత్తుతారు కానీ నేను మిమ్మల్ని చూడటానికి కూడా ఒప్పుకోను. మీరు మరిన్ని ప్రార్థనలు చేస్తారు కాని నేను మీ ప్రార్థనలు వినేందుకు ఒప్పుకోను. ఎందుకంటే మీ చేతులు రక్తమయము.
16 “మిమ్మల్ని మీరు కడుక్కోండి. మిమ్మల్ని మీరు పరిశుభ్రం చేసుకోండి. మీరు చేస్తున్న చెడు పనులు చాలించండి. ఆ చెడు పనులు చూడటం నాకు ఇష్టం లేదు. తప్పు చేయటం మానివేయండి. 17 మంచి పనులు చేయటం నేర్చుకోండి. ఇతరుల విషయంలో న్యాయంగా ఉండండి. ఇతరులను బాధించే వారిని శిక్షించండి. తల్లిదండ్రులు లేని పిల్లలకు సహాయం చేయండి. భర్తలు చనిపోయిన స్త్రీలకు సహాయం చేయండి.”
18 యెహోవా చెబుతున్నాడు, “రండి, ఈ విషయాలు మనం పరిష్కరించుకొందాము. మీ పాపాలు కెంపులాగా ఎర్రగా ఉన్నా సరే వాటిని కడగవచ్చు, మీరు మంచులా తెల్లగా అవుతారు. మీ పాపాలు చాలా ఎర్రగా ఉన్నా సరే మీరు మాత్రం ఉన్నిలాగ తెల్లగా మారవచ్చును.
19 “నేను చెప్పే మాటలు మీరు వింటే అప్పుడు ఈ దేశపు మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. 20 కానీ మీరు వినేందుకు నిరాకరిస్తే, మీరు నాకు వ్యతిరేకమే. మీ శత్రువులు మిమ్మల్ని నాశనం చేసేస్తారు.”
యెహోవా తానే ఈ విషయాలు చెప్పాడు.
యెరూషలేము దేవునికి నమ్మకంగా లేదు
21 దేవుడు చెబుతున్నాడు: “యెరూషలేమును చూడండి. అది నన్ను నమ్మి వెంబడించిన పట్టణం. అది ఓ వేశ్య అయ్యేట్టుగా చేసింది ఏమిటి? ఇప్పుడు అది నన్ను వెంబడించటం లేదు. యెరూషలేము న్యాయంతో నిండి ఉండాలి. యెరూషలేము నివాసులు యెహోవా కోరిన విధంగా జీవించాలి, కానీ ఇప్పుడు నరహంతకులు అక్కడ నివసిస్తున్నారు.
22 “మంచితనం వెండిలాంటిది. కానీ మీ వెండి పనికిమాలినదిగా తయారయింది. మీ ద్రాక్షారసం నీళ్లతో కలపబడి నిస్సారమయింది. 23 మీ అధికారులు తిరుగుబాటు దారులు, దొంగల స్నేహితులు. మీ అధికారులు అందరూ లంచాలు అడుగుతారు, తప్పుడు పనులు చేయటం కోసం డబ్బు స్వీకరిస్తారు. మీ అధికారులంతా ప్రజలను మోసం చేసేందుకు డబ్బు పుచ్చుకొంటారు. మీ అధికారులు అనాథ పిల్లలకు సహాయం చేసేందుకు ప్రయత్నం చేయరు. భర్తలు చనిపోయిన స్త్రీల అవసరాలను గూర్చి మీ అధికారులు వినిపించుకోరు.”
24 ఈ విషయాలన్నింటి మూలంగా, ఆ యజమాని, సర్వశక్తిమంతుడైన యెహోవా, ఇశ్రాయేలీయుల మహాబలశాలి ఇలా చెబుతున్నాడు, “నా శత్రువులారా, నేను మిమ్మల్ని శిక్షిస్తాను. ఇంకెంత మాత్రం మీరు నాకు కష్టం కలిగించరు. 25 వెండిని శుద్ధిచేయటానికి మనుష్యులు క్షారం వాడుతారు. అదే విధంగా మీ తప్పులన్నిటినీ నేను శుద్ధి చేసేస్తాను. మీలోంచి పనికిమాలిన వాటన్నింటినీ నేను తీసివేస్తాను. 26 ఆరంభంలో మీకు ఉన్నమాదిరి న్యాయమూర్తుల్ని నేను మళ్లీ తీసుకొని వస్తాను. మీ సలహాదారులు చాలాకాలం క్రిందట మీకు ఉన్న సలహాదారుల్లా ఉంటారు. అప్పుడు మీరు ‘మంచి, నమ్మకమైన పట్టణం’” అని పిలువబడతారు.
27 దేవుడు మంచివాడు, ఆయన సరైన వాటినే చేస్తాడు. కనుక ఆయన సీయోనును, తన దగ్గరకు తిరిగి వచ్చే ప్రజలను రక్షిస్తాడు. 28 అయితే నేరుస్థులు, పాపులు అందరూ నాశనం చేయబడతారు. (వారు యెహోవాను వెంబడించని ప్రజలు.)
29 మీరు పూజించటానికి ఏర్పరచుకొనే మస్తకివృక్షాలు, ప్రత్యేక వనాలు చూచి భవిష్యత్తులో ప్రజలు సిగ్గుపడతారు. 30 మీరు ఆకులు ఎండిపోతున్న మస్తకి వృక్షాల్లా ఉంటారు. కనుక ఇలా జరుగుతుంది. నీళ్లులేక ఎండిపోతున్న తోటలా మీరుంటారు. 31 శక్తిమంతులైన ప్రజలు ఎండిపోయిన చిన్న చెక్క ముక్కల్లా ఉంటారు. ఆ ప్రజలు చేసే పనులు నిప్పు రాజబెట్టే నిప్పురవ్వల్లా ఉంటాయి. శక్తిమంతులైన ప్రజలూ, వారు చేసే పనులూ కాలిపోవటం మొదలవుతుంది. ఆ అగ్నిని ఎవరూ ఆర్పివేయలేరు.
యూదా, యెరూషలేముకు దేవుని సందేశం
2 యెరూషలేము, యూదాలను గూర్చి ఆమోజు కూమారుడు యెషయా ఈ సందేశం చూశాడు.
2 యెహోవా ఆలయం ఒక కొండమీద ఉంది.
చివరి రోజుల్లో ఆ కొండ, పర్వతాలన్నింటిలో ఎత్తయినదిగా చేయబడుతుంది.
ఆ పర్వతం కొండల శిఖరాలన్నింటికంటె ఎత్తు చేయబడుతుంది.
అన్ని రాజ్యాల ప్రజలూ అక్కడికి వెళ్తారు.
3 అనేకమంది ప్రజలు అక్కడికి వెళ్తారు.
“మనం యెహోవా పర్వతానికి వెళ్దాం. యాకోబు దేవుని మందిరానికి మనం వెళ్లాలి.
అప్పుడు యెహోవా తన జీవన విధానం మనకు ఉపదేశిస్తాడు.
మనం ఆయనను వెంబడిస్తాం” అని వాళ్లు చెబుతారు.
దేవుని ఉపదేశాలు, యెహోవా సందేశం యెరూషలేములో, సీయోను కొండమీద ప్రారంభమై,
ప్రపంచం అంతటికీ వ్యాపిస్తుంది.
4 అప్పుడు అన్ని రాజ్యాల ప్రజలకూ యెహోవా న్యాయాధిపతిగా ఉంటాడు.
అనేకుల వాదాలను దేవుడు అంతం చేస్తాడు.
ఆ మనుష్యులు తమ పోరాటానికి తమ ఆయుధాలు ఉపయోగించటం మానివేస్తారు.
వారు తమ ఖడ్గాలతో నాగటి నక్కులు చేస్తారు.
వారు, తమ ఈటెలను మొక్కలు కత్తిరించే పరికరాలుగా ప్రయోగిస్తారు.
ప్రజలు ప్రజలతో పోరాటం మానివేస్తారు.
ప్రజలు యుద్ధానికి మళ్లీ ఎన్నడూ శిక్షిణ పొందరు.
5 యాకోబు వంశస్తులారా, మీరు యెహోవాను వెంబడించాలి.
6 మీరు మీ ప్రజలను విడిచిపెట్టేశారు కనుక నేను మీతో దీనిని చెబుతున్నాను. తూర్పు దేశాల తప్పుడు అభిప్రాయాలతో మీ ప్రజలు నిండిపోయారు. ఫిలిష్తీయుల్లాగే మీ ప్రజలు జ్యోతిష్యం చెప్పటానికి ప్రయత్నించారు. ఆ వింత అభిప్రాయాలను మీ ప్రజలు పూర్తిగా స్వీకరించారు. 7 ఇతర స్థలాలకు చెందిన వెండి బంగారాలతో మీ దేశం నిండిపోయింది. అక్కడ చాలా చాలా ఐశ్వర్యాలున్నాయి. మీ దేశం గుర్రాలతో నిండిపోయింది. అక్కడ ఎన్నెన్నో రథాలు ఉన్నాయి. 8 ప్రజలు పూజించే విగ్రహాలతో మీ దేశం నిండిపోయింది. ప్రజలే చేసిన ఆ విగ్రహాలను ప్రజలు పూజిస్తారు. 9 ప్రజలు మరింతగా చెడిపోయారు. ప్రజలు మరీ హీనస్థితికి దిగజారి పోయారు. దేవా, నిజంగా నీవు వాళ్లను క్షమించవు గదూ?
10 వెళ్లి ధూళిలో, బండల చాటున దాక్కొనండి. యెహోవాను గూర్చి మీరు భయపడాలి. ఆయన మహా ప్రభావం నుండి మీరు దాక్కోవాలి.
11 గర్విష్ఠులు గర్వంగా ఉండటం మానివేస్తారు. ఆ గర్విష్ఠులు అవమానంతో నేలమీద సాగిలపడ్తారు. ఆ సమయంలో యెహోవా మాత్రమే ఇంకా ఉన్నతుడుగా నిలుస్తాడు.
12 యెహోవా ఒక ప్రత్యేక దినాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రోజు అహంకారులను, అతిశయం గలవారిని యెహోవా శిక్షిస్తాడు. అప్పుడు ఆ గర్విష్ఠులు ఎన్నికలేనివారుగా చేయబడతారు. 13 గర్విష్ఠులైన ఆ మనుష్యులు లెబానోను కేదారు వృక్షాల్లా ఉంటారు. వారు బాషాను మహా మస్తకి వృక్షాల్లా ఉంటారు. కానీ ఆ మనుష్యులను దేవుడు శిక్షిస్తాడు. 14 గర్విష్ఠులైన ఆ ప్రజలు ఎత్తయిన పర్వతాల్లా, కొండల్లా ఉన్నారు. 15 ఆ గర్విష్ఠులు ఎత్తయిన గోపురాల్లా చాలా బలమైన గోడల్లా ఉన్నారు. కానీ ఆ ప్రజలను దేవుడు శిక్షిస్తాడు. 16 ఆ గర్విష్ఠులు తర్షీషు గొప్ప ఓడల్లా ఉన్నారు. (ఈ ఓడలు చాలా విలువైన వస్తువులతో నిండి ఉంటాయి.) కానీ ఆ గర్విష్ఠులను దేవుడు శిక్షిస్తాడు.
17 ఆ సమయంలో ప్రజలు గర్వంగా ఉండటం మానివేస్తారు. ఇప్పుడు గర్వంగా ఉన్న మనుష్యులు నేలమీద సాగిలపడతారు. మరియు ఆ సమయంలో యెహోవా మాత్రమే ఉన్నతంగా నిలుస్తాడు. 18 విగ్రహాలు (అబద్ధపు దేవతలు) అన్నీ తొలగి పోతాయి. 19 బండల చాటున, నేల బీటల్లో మనుష్యులు దాక్కొంటారు. యెహోవాను గూర్చి ఆయన మహా ప్రభావం గూర్చి ప్రజలు భయపడ్తారు. ఇదంతా భూమిని గజగజ వణకించుటకు యెహోవా నిలబడినప్పుడు జరుగుతుంది.
20 ఆ సమయంలో ప్రజలు వారి వెండి, బంగారు విగ్రహాలను పారవేస్తారు. (ప్రజలు పూజించుటకు మనుష్యులే ఆ విగ్రహాలను తయారు చేశారు.) ప్రజలు ఆ విగ్రహాలను నేలమీది కన్నాలలో ఉండే ఎలుకలకు, గబ్బిలాలకు వేస్తారు. 21 అప్పుడు ప్రజలు బండ సందులలో దాక్కొంటారు. యెహోవాను గూర్చి, ఆయన మహా శక్తిని గూర్చి భయపడి వారు అలా చేస్తారు. భూమిని గజగజ వణికించుటకు యెహోవా నిలబడినప్పుడు ఇది జరుగుతుంది.
22 మిమ్మల్ని రక్షించుట కోసం ఇతరులను నమ్ముకోవటం మీరు మానివేయాలి. వాళ్లూ మనుష్యులే, మనుష్యులు మరణిస్తారు. అందుచేత వాళ్లు కూడా దేవునిలా బలం గల వాళ్లు అని మీరు తలంచవద్దు.
3 నేను మీకు చెబుతున్న ఈ విషయాలు గ్రహించండి. యెరూషలేము, యూదాలు ఆధారపడే వాటన్నింటిని, ప్రభువు, సర్వశక్తిమంతుడైన యెహోవా తొలగించి వేస్తాడు. భోజనం, నీళ్లు మొత్తం దేవుడు తీసివేస్తాడు. 2 వీరులందరిని, శూర సైనికులందరిని దేవుడు తొలగించి వేస్తాడు. న్యాయమూర్తులను, మాంత్రికులను, పెద్దలను అందరిని దేవుడు తొలగించి వేస్తాడు. 3 సైనిక అధికారులను, ప్రభుత్వ అధికారులను దేవుడు తొలగించివేస్తాడు. నైపుణ్యంగల సలహాదార్లను, మంత్రాలు వేస్తూ, జ్యోతిష్యం చెప్పటానికి ప్రయత్నించే తెలివిగల వాళ్లందరిని దేవుడు తొలగించి వేస్తాడు.
4 దేవుడు చెబుతున్నాడు: “యువకులు మీకు నాయకులయ్యేట్టు నేను చేస్తాను. 5 ప్రతి ఒక్కరు ఒకరికి ఒకరు విరోధం అవుతారు. చిన్నవాళ్లు పెద్దవాళ్లను గౌరవించరు. సామాన్యులు ప్రముఖులను లెక్కచేయరు.”
6 ఆ సమయంలో ఒకడు తన స్వంత కుటుంబంలోంచి తన సోదరుణ్ణి ఒకణ్ణి పట్టుకొచ్చి, “నీకు రాజ వస్త్రము ఉంది గనుక నీవే మాకు నాయకుడివి. ఈ శిథిలాలు అన్నింటి మీద నీవే నాయకుడివి” అని అతనితో చెబుతాడు.
7 అయితే ఆ సోదరుడు లేచి, “నేను నీకు సహాయం చేయలేను. సరిపడినంత ఆహారంగాని బట్టలుగాని నా ఇంట్లో లేవు. నన్ను మీ నాయకుడిని చేయవద్దు” అని చెబుతాడు.
8 యెరూషలేము తొట్రిల్లి, తప్పు చేసింది గనుక ఇలా జరుగుతుంది. యూదా పతనమై, యెహోవాను వెంబడించటం మానివేసింది. వారు చెప్పేవి, చేసేవి యెహోవాకు విరుద్ధం. యెహోవా మహిమ నేత్రాలు వీటన్నింటిని తేటగా చూస్తాయి.
9 మనుష్యులు తప్పు చేసిన దోషులని వారి ముఖాలు చెబుతున్నాయి. పైగా వారు వారి పాపము గూర్చి అతిశయిస్తున్నారు. వారు సొదొమ పట్టణ ప్రజల్లా ఉన్నారు. వారి పాపాన్ని ఎవరు చూసినా లెక్క చేయరు. అది వారికి ఎంతో కీడు. వాళ్లకు వాళ్లే చాలా కష్టం తెచ్చుకొన్నారు.
10 మంచి వారికి మంచి సంగతులు జరుగుతాయని మంచి వారితో చెప్పుము. వారు చేసే మంచి పనులకు వారికి బహుమానం లభిస్తుంది. 11 కానీ చెడ్డ వాళ్లకు అది చాలా చెడుగా ఉంటుంది. వారికి చాలా కష్టం వస్తుంది. వారు చేసిన చెడు పనులన్నింటి కోసం వారు శిక్షించబడతారు. 12 చిన్న పిల్లలు నా ప్రజలను ఓడించేస్తారు. స్త్రీలు నా ప్రజల మీద ఏలుబడి చేస్తారు.
నా ప్రజలారా మీ మార్గ దర్శకులు మిమ్మల్ని తప్పు దారిలో నడిపిస్తున్నారు. సరియైన దారినుండి వారు మిమ్మల్ని తప్పించేస్తున్నారు.
తన ప్రజల గురించి దేవుని నిర్ణయం
13 ప్రజలకు తీర్పు తీర్చేందుకు యెహోవా నిలుస్తాడు. 14 పెద్దలు, నాయకులు చేసిన పనుల మూలంగా యెహోవా వారికి తీర్పు తీరుస్తాడు.
యెహోవా చెబుతున్నాడు, “మీరు ద్రాక్ష తోటలను తగులబెట్టేశారు (యూదా) పేద ప్రజల దగ్గర్నుండి మీరు తీసుకొన్న వస్తువులు ఇంకా మీ ఇండ్లలో ఉన్నాయి. 15 నా ప్రజలను బాధించుటకు మీకు హక్కు ఎక్కడిది? పేద ప్రజల ముఖాలను కృంగదీయుటకు మీకు హక్కు ఎక్కడిది?” నా ప్రభువు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
16 యెహోవా అంటున్నాడు: “సీయోను స్త్రీలు చాలా గర్విష్ఠులయ్యారు. వారు ఇతరుల కంటె మంచి వాళ్లము అన్నట్టు తలలు పైకెత్తి నడుస్తున్నారు. ఆ స్త్రీలు ఓర చూపులు చూస్తారు. కాళ్ల గజ్జెలు మోగిస్తూ వయ్యారంగా కులుకుతూ నడుస్తారు.”
17 సీయోనులో ఆ స్త్రీల తలలమీద నా ప్రభువు పుండ్లు పుట్టిస్తాడు. ఆ స్త్రీలు వారి తలలు విరబోసుకొనేట్టుగా యెహోవా చేస్తాడు. 18 ఆ సమయంలో, వారు గర్వించే వస్తువులన్నింటినీ యెహోవా తొలగించి వేస్తాడు, అందమైన కాలి గజ్జలు, సూర్యహారాలు, చంద్రహారాలు, 19 చెవులదుద్దులు, కడియాలు, మేలి ముసుగులు, 20 రుమాళ్లు, పట్టా గొలుసులు, నడుముకు ధరించే వడ్డాణాలు, పరిమళాల బరిణెలు, హారాల మీద అలంకారాలు, 21 ముద్ర ఉంగరాలు, ముక్కు కమ్ములు, 22 శ్రేష్ఠమైన వస్త్రాలు, ఉత్తరీయాలు, దుప్పట్లు సంచులు, 23 అద్దాలు, మేలిమి వస్త్రాలు, తలపాగాలు, శాలువాలు.
24 ఇప్పుడు ఆ స్త్రీలకు సువాసనల పరిమళాలు ఉన్నాయి కానీ ఆ సమయంలో వారి పరిమళాలు కుళ్లుగాను మురుగుడుగాను అవుతాయి. ఇప్పుడు వాళ్లు వడ్డాణాలు పెట్టుకొంటున్నారు. కానీ ఆ సమయంలో వారు కట్టుకొనేందుకు తాళ్లు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు వారి తల వెంట్రుకలు అలంకారంగా అల్లబడుతున్నాయి. కానీ ఆ సమయంలో వారి తలలు గుండ్లు గీయబడతాయి. వారికి శిరోజాలు ఉండవు. ఇప్పుడు వారికి విందు వస్త్రాలు ఉన్నాయి. కాని అప్పుడు విచారం వ్యక్తం చేసే వస్త్రాలే వారికి ఉంటాయి. ఇప్పుడు వారి ముఖాల మీద సౌందర్య చిహ్నాలు ఉన్నాయి. కానీ అప్పుడు వారి ముఖాల మీద వాతలు ఉంటాయి.
25 ఆ సమయంలో మీ పురుషులు ఖడ్గాలతో చంపబడతారు. మీ వీరులు యుద్ధంలో చస్తారు. 26 పట్టణ ద్వారాల దగ్గర సమావేశ స్థలాల్లో ఏడ్పు, దుఃఖం ఉంటుంది. దొంగలు, బందిపోటులు సర్వం దోచుకొన్న స్త్రీలాగ యెరూషలేము శూన్యంగా కూర్చుని ఉంటుంది. ఆమె నేల మీద కూర్చుని ఏడుస్తుంది.
4 ఆ కాలంలో ఏడుగురు స్త్రీలు ఒక్క మగవాణ్ణి పట్టుకొని, “మా స్వంత భోజనం మేము తింటాము, మా స్వంత బట్టలు మేము కట్టుకొంటాము, నీ పేరు మాత్రం మాకు పెట్టి, మా అవమానం తొలగించుము” అని చెబుతారు.
2 ఆ సమయంలో యెహోవా మొక్క (యూదా) చాలా అందంగా, గొప్పగా ఉంటుంది. అప్పటికి ఇంకా ఇశ్రాయేలులో జీవించి ఉండే ప్రజలు ఆ దేశంలో పండే వాటిని చూచి ఎంతో గర్విస్తారు. 3 ఆ సమయంలో ఇంకా సీయోనులో, యెరూషలేములో జీవిస్తున్న ప్రజలు పరిశుద్ధ (ప్రత్యేక) ప్రజలు అని పిలువ బడతారు. ఒక ప్రత్యేక జాబితాలో పేర్లు ఉన్న ప్రజలందరికీ ఇలా జరుగుతుంది. బ్రతికేందుకు అనుమతించబడిన ప్రజల జాబితా అది.
4 సీయోను స్త్రీల కల్మషాన్ని యెహోవా కడిగి వేస్తాడు. యెరూషలేములోని రక్తమంతా యెహోవా కడిగివేస్తాడు. దేవుడు న్యాయ ఆత్మను ప్రయోగించి, న్యాయంగా తీర్పు తీరుస్తాడు. మరియు ఆయన దహించే ఆత్మను ప్రయోగించి, సమస్తాన్నీ శుద్ధి చేస్తాడు. 5 ఆయన తన ప్రజలతో ఉన్నట్టు ఆ సమయంలో దేవుడు రుజువు చేస్తాడు. పగలు పొగల మేఘాన్ని, దేవుడు చేస్తాడు. రాత్రి ప్రకాశించే అగ్ని జ్వాలను దేవుడు చేస్తాడు. ఇవి ప్రతి ఇంటిమీద, ఆకాశంలోను, సీయోను కొండమీద, ప్రజల ప్రతి సమావేశం మీద నిలిచి ఉంటాయి. ప్రతి వ్యక్తి మీద కాపుదల ఉంటుంది. 6 ఆ కాపుదల ఒక భద్రతా స్థలం. ఆ కాపుదల సూర్యుని వేడినుండి ప్రజలను కాపాడుతుంది. అన్ని రకాల వర్షాలు వరదల నుండి దాగుకొనేందుకు ఆ కాపుదల క్షేమ స్థానంగా ఉంటుంది.
© 1997 Bible League International