Chronological
నయమాను సమస్య
5 సిరియా రాజు యొక్క సైన్యాధిపతి నయమాను. రాజుకు అతడు అతి ముఖ్యుడు. ఎందుకనగా, యెహోవా అతనిని ఉపయోగించుకొని సిరియా విజయం సాధించేలా చేశాడు. నయమాను మహాశక్తిమంతుడు, గొప్పవాడు. కాని కుష్ఠువ్యాధి వలన అతను బాధ పడుతూ ఉన్నాడు.
2 ఇశ్రాయేలులో యుద్ధం చేయడానికై సిరియను సైన్యం అనేక బృందాల సైనికులను పంపింది. ఇశ్రాయేలీయులను వారి బానిసలుగా గ్రహించారు. ఒక సారి వారు ఇశ్రాయేలునుంచి ఒక అమ్మాయిని తీసుకువచ్చారు. ఆ అమ్మాయి నయమాను భార్యకు సేవకురాలుగా ఉంది. 3 ఆ అమ్మాయి నయమాను భార్యతో ఇలా చెప్పింది: “నా యజమాని (నయమాను) ప్రవక్తయైన ఎలీషాను కలుసుకోవాలని నా కోరిక. ఎలీషా షోమ్రోను నివాసి. ఆ ప్రవక్త నయమాను కుష్ఠువ్యాధిని బాగుచేయగలడు.”
4 నయమాను తన యజమాని (సిరియారాజు) వద్దకు వెళ్లాడు. సిరియా రాజుకు ఆ అమ్మాయి చెప్పిన విషయలు నయమాను తెలిపాడు.
5 అప్పుడు సిరియా రాజు, “అయితే ఇప్పుడే వెళ్లు. నేను ఇశ్రాయేలు రాజుకు ఒక లేఖ పంపుతాను” అన్నాడు.
అందువల్ల నయమాను ఇశ్రాయేలుకు వెళ్లాడు. నయమాను కొన్ని కానుకలు తీసుకు వెళ్లాడు. ఏడువందల పౌనుల వెండి, అరు వేల బంగారం ముక్కలు మరియు పది దుస్తులు నయమాను తీసుకువెళ్ళాడు. 6 సిరియా రాజు ఇశ్రాయేలు రాజుకి ఇచ్చిన లేఖ కూడా తీసుకు వెళ్లాడు. ఆ లేఖలో ఇలా వుంది: “… నేను ఇప్పుడు నా సేవకుడైన నయమానుని నీ వద్దకు పంపుతున్నాను. అతని కుష్ఠువ్యాధిని నివారించుము.”
7 ఇశ్రాయేలు రాజు ఆ ఉత్తరం చదవగానే, తాను తలక్రిందులై నానని విచారంగా ఉన్నానని తెలిపేందుకు తన దుస్తులు చింపివేశాడు. ఇశ్రాయేలు రాజు, “నేను దేవుడినా? కాదు. జీవ మరణాల మీద నాకు శక్తిలేదు. అందువల్ల సిరియా రాజు కుష్ఠువ్యాధితో బాధపడే ఒకనిని స్వస్థపరుచుటకు నా వద్దకు ఎందుకు పంపినట్లు? దానిని గురించి ఆలోచించుము. అది ఒక మాయోపాయమని తెలియుచున్నది. సిరియా రాజు యద్ధానికి సన్నద్ధుడవుతున్నాడు” అని చెప్పాడు.
8 ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు తెలిసినపుడు ఈ క్రింది సందేశాన్ని రాజు పంపాడు: “నీవు నీ దుస్తులు ఎందుకు చింపివేసుకొన్నావు? నయమానుని నా వద్దకు పంపు. అప్పుడతను ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నట్లు తెలుసుకుంటాడు.”
9 ఈ కారణంగా నయమాను తన గుర్రాలతోను రథాలతోను ఎలీషా ఇంటికి వచ్చాడు. తలుపుకి వెలుపల నుంచున్నాడు. 10 ఎలీషా ఒక దూతను నయమాను వద్దకు పంపాడు. ఆదూత, “వెళ్లి, ఏడు మారులు యోర్దాను నదిలో స్నానం చేయుము. అప్పుడు నీ చర్మం నయమవుతుంది. నీవు శుద్ధుడవు అవుతావు, శుభ్రపడతావు” అన్నాడు.
11 నయమాను కోపపడి, వెళ్లిపోయాడు. అతను, “ఎలీషా కనీసం వెలుపలికి వచ్చి నా యెదుట నిలబడి తన దేవుడైన యెహోవాని పిలుస్తాడనుకున్నాను. నా ముందర చేయి ఆడించి మరి నా కుష్ఠువ్యాధి బాగుచేస్తాడని ఆశించాను. 12 దమస్కు నదులైన అబానా, ఫర్పరులు ఇశ్రాయేలులోని అన్ని జలాల కంటె మంచివి. నేనెందుకు దమస్కులోని ఆ నదులలో స్నానం చేసి శుద్ధుణ్ని కాకూడదు!” అని అనుకొని నయమాను మహోగ్రుడయి కోపంతో వెళ్లిపోయాడు.
13 కాని నయమాను సేవకులు అతనిని సమీపించి అతనితో మాట్లాడారు. వారు ఈ విధంగా అన్నారు: “తండ్రీ, ప్రవక్త మిమ్మల్ని ఒక కష్టమైన పని చెయ్యమని చెబితే, ఆ విధంగా చేయవా? అలాగే, నీతో సులభమైన పని చెప్పినా, అది కూడా పాటించాలి. అతను చెప్పిందేమనగా, కడుగుకొనుము, నీవు శుద్ధడవయ్యెదవు.”
14 అందువల్ల దైవజనుడు ఎలీషా చెప్పినట్లుగా నయమాను ఆచరించాడు. నయమాను యోర్దాను నది లోపలికి వెళ్లి ఏడు సార్లు మునిగాడు. వెంటనే నయమాను శుద్ధుడయ్యాడు. నయమాను చర్మం పసిపిల్లవాని చర్మంవలె మృదువుగా వుంది.
15 నయమాను మరియు అతని బృందంవారు దైవజనుడు (ఎలీషా) వద్దకు వచ్చారు. ఎలీషా ఎదుట అతను నిలబడి, “ఇదుగో, ఇశ్రాయేలులో తప్ప యీ ప్రపంచంలో మరెచ్చట కూడా దేవుడు లేడని ఇప్పుడు తెలుసుకున్నాను. ఇప్పుడు నా కానుకను స్వికరింపుము” అని పలికాడు.
16 కాని ఎలీషా, “నేను యెహోవాను సేవిస్తున్నాను. యెహోవా జీవముతోడు, నేను ఎట్టి కానుకను స్వీకరింపనని వాగ్దానం చేస్తున్నాను” అన్నాడు.
నయమాను కష్టతరంగా అతనిని సముదాయించుటకు ప్రయత్నించాడు. కాని ఎలీషా తిరస్కరించాడు. 17 అప్పుడు నయమాను, “ఈ కానుకను కనుక నీవు స్వీకరించపోతే, కనీసం ఇదైనా నా కోసం చేయుము. నారెండు కంచర గాడిదలు మీది గంపలను ఇశ్రాయేలు దేశపు మన్నులో నింపుటకు అనుమతింపుము. ఎందుకనగా, ఇతర దేవతలకు నేను ఎన్నటికీ ఎటువంటి బలులు సమర్పించను, యెహోవాకి మాత్రమే సమర్పిస్తాను. 18 ఇది చేయడం వల్ల నన్ను యెహోవా క్షమించునట్లు యెహోవాని ప్రార్థిస్తున్నాను. భవిష్యత్తులో, నా యజమాని (సిరియా రాజు) రిమ్మోను ఆలయంలోకి వెళ్లి అసత్య దేవతలను పూజిస్తాడు. రిమ్మోను ఆరాధన జరుగునప్పుడు నా సహాయము కొరకు రాజు నా మీద ఆధారపడి వుంటాడు. అందువల్ల నేను రిమ్మోను ఆలయంలో మోకరిల్లుతాను. అలా జరిగినప్పుడు నన్ను క్షమింపుమని యెహోవాని వేడుకొనుచున్నాను” అని పలికాడు.
19 “నెమ్మదికలిగి వెళ్లుము” అని ఎలీషా నయమానుకు చెప్పాడు.
అందువల్ల నయమాను ఎలీషాని విడిచి కొంతదూరం వెళ్లాడు. 20 కాని దైవజనుడు అయిన ఎలీషా సేవకుడు గేహజీ, “నా యజమాని (ఎలీషా) సిరియనుడయిన నయమానుని వెళ్లనిచ్చాడు. కాని అతడు తెచ్చిన కానుకను స్వీకరించలేదు. యెహోవా జీవము తోడుగా వెనుకనే నేను పరిగెత్తుకుపోయి, అతని వద్దనుంచి ఏదైనా తీసుకువస్తాను” అని అనుకున్నాడు. 21 అందువల్ల గేహజీ నయమాను వద్దకు పరుగెత్తుకు వెళ్లాడు.
తన వెనుక ఎవరో పరిగెత్తుకుని వస్తున్నట్లు నయమాను గ్రహించి. అతను తన రథం దిగి గేహజీని కలుసుకుని, “అంతా సవ్యంగా వుందిగదా” అని నయమాను అడిగాడు.
22 “అవును. అంతా సవ్యంగానే వుంది. నా యజమాని (ఎలీషా) నన్ను పంపాడు. ఇద్దరు యువకులు నావద్దకు వచ్చారనీ, కొండ దేశమైన ఎఫ్రాయిము నుంచి ప్రవక్తల బృందానికి వారు చెందిన వారనీ, వారికి డెభైఐదు పౌన్లు వెండి మరియు రెండురకాల దుస్తులు ఇమ్మని ఆయన చెప్పాడు” అని గేహజీ చెప్పాడు.
23 “అయ్యా, నూట ఏభై పౌన్లు తీసుకోండి” అని నయమాను చెప్పాడు. గేహజీ ఆ వెండిని తీసుకునేందుకు నయమాను అతనిని ఒప్పించాడు. నయమాను నూట ఏభై పౌన్లు వెండిని రెండు సంచులలో వేసి, రెండు రకాల దుస్తులు కూడా తీసుకున్నాడు. తర్వాత ఆ వస్తువుల్ని నయమాను తన సేవకులిద్దిరకి ఇచ్చాడు. గేహజీ కొరకు వారు ఆ వస్తువులను మోసుకు వెళ్లారు. 24 గేహజీ కొండ వద్దకు రాగానే, ఆ వస్తువులను అతని సేవకుల వద్దనుంచి తీసుకుని, ఆ సేవకులను పంపివేశాడు. వారు వెళ్లిపోయారు. తర్వాత గేహజీ ఆ వస్తువులను ఇంట్లో దాచాడు.
25 గేహజీ తన యజమాని అయిన ఎలీషా యెదుట నిలబడ్డాడు. గేహజీతో ఎలీషా, “గేహజీ, నీవు ఎక్కడికి వెళ్లావు?” అని అడిగాడు.
“నేనెక్కడికీ వెళ్లలేదు” అని గేహజీ చెప్పాడు.
26 “ఇది నిజం కాదు నిన్ను కలుసుకునేందుకు నయమాను తన రథంనుంచి క్రిందికి దిగినప్పుడు నా హృదయం నీతో వున్నది. పైకం, వస్త్రాలు, ఒలివలు, ద్రాక్షలు, గొర్రెలు, ఆవులు లేక స్త్రీ పురుష సేవకులు మొదలైనవి తీసుకునేందుకు ఇది సమయం కాదు. 27 ఇప్పుడు నీకు, నీ వంశానికి నయమాను వ్యాధి సంక్రమిస్తుంది. ఎల్లప్పుడూ నీకు కుష్ఠువ్యాధి వుంటుంది” అని ఎలీషా గేహజీతో చెప్పాడు.
ఎలీషాని విడిచి గేహజీ వెళ్లగానే, గేహజీ శరీరం మంచువలె తెల్లగా కనిపించింది. గేహజీకి కుష్ఠువ్యాధి కలిగింది.
ఎలీషా మరియు గొడ్డలి
6 ప్రవక్తల బృందం ఎలీషాతో ఇలా చెప్పింది: “మేమా ప్రదేశంలో నివసిస్తున్నాము. కాని మాకది చాలా చిన్నదిగా వుంది. 2 యోర్దాను నదివద్దకు వెళ్లి, అడవిలో చెట్లు నరుకుదాము. మనలో ప్రతి ఒక్కరికి ఒక దూలము లభిస్తుంది. అక్కడ నివాసయ్యోగ్యమైన ఇల్లు నిర్మించుకుందాము.”
“బాగుంది, అలాగే కానివ్వండి” అని ఎలీషా బదులు చెప్పాడు.
3 “మాతో మీరు రండి” అని ఒకడనెను. ఎలీషా “బాగుంది, నేను కూడా మీతో వస్తాను” అని చెప్పాడు.
4 అందువల్ల ఎలీషా ప్రవక్తల బృందంతో పాటు వెళ్లాడు. వారు యోర్దాను నది వద్దకు చేరుకుని కొన్ని చెట్లు నరకసాగారు. 5 కాని ఒక వ్యక్తి ఒక చెట్టు నరికేటప్పుడు, చేతినుండి గొడ్డలి జారిపోయి నీళ్లలో పడింది. అప్పుడతను, “యజమానీ, నేను ఆ గొడ్డలి చేబదులుగా తెచ్చాను” అని అరిచాడు.
6 దైవజనుడైన ఎలీషా, “అది ఎక్కడ పడింది” అని అడిగాడు.
గొడ్డలి పడిన చోటును అతను ఎలీషాకు చూపాడు. అప్పుడు ఎలీషా ఒక కొమ్మ నరికి, కర్రను నదిలోకి విసిరివేశాడు. ఆ కొమ్మ ఇనుప గొడ్డలి నీళ్లలో తేలునట్లు చేసింది. 7 “గొడ్డలి పైకి తీసుకో” అని ఎలీషా చెప్పాడు. అప్పుడా వ్యక్తి గొడ్డలిని తీసుకున్నాడు.
సిరియా ఇశ్రాయేలును పట్టుకొనుటకు ప్రయత్నించుట
8 సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయాలని తన సైనికోద్యోగులతో ఆయన సమాలోచన చేస్తున్నాడు. “ఈ చోట దాక్కుని ఇశ్రాయేలు వారు వచ్చినప్పుడు వారిని ఎదుర్కోనండి” అని అతను చెప్పాడు.
9 కాని దైవజనుడు అయిన ఎలీషా ఇశ్రాయేలు రాజుకి ఒక సందేశం పంపాడు. ఎలీషా ఇట్లన్నాడు: “జాగ్రత్తగా వుండండి. ఆ స్థలంగుండా పోవద్దు! సిరియా సైనికులు అక్కడ దాగుకొని వున్నారు”
10 ఇశ్రాయేలు రాజు తన మనుష్యులకు సందేశం పంపుతూ దైవజనుడు (ఎలీషా) తనకు హెచ్చరిక చేశాడని తెలియపరిచాడు. ఇశ్రాయేలు రాజు పలువురిని కాపాడగలిగాడు.
11 ఇందువల్ల సిరియా రాజు తలక్రిందులయ్యాడు. తన సైనికోద్యోగుల్ని సమావేశ పరచి వారితో, “ఇశ్రాయేలు రాజుకోసం గూఢచారి పని చేస్తున్నదెవరో చెప్పండి” అని అడిగాడు.
12 సిరియా రాజు అధికారులలో ఒకడు, “ప్రభూ, రాజా, మాలో ఎవ్వరమూ గూఢాచారులము కాము. ఇశ్రాయేలు ప్రవక్త అయిన ఎలీషా ఇశ్రాయేలు రాజుకు అనేక రహస్య విషయాలు చెప్పగలడు. మీరు నిద్రించే గృహంలో మీరు మాట్లాడే మాటలు కూడా చెప్పగలడు” అన్నాడు.
13 అప్పుడు సిరియా రాజు, “ఎలీషాని కనుగొనండి. అతనిని పట్టుకునేందుకు నేను మనుష్యులను పంపుతాను” అన్నాడు.
“ఎలీషా దోతానులో ఉన్నాడు” అని రాజ సేవకులు చెప్పారు.
14 అప్పుడు సిరియా రాజు గుర్రాలు, రథాలు, ఒక పెద్ద సైన్యం దోతానుకు పంపాడు. వారు రాత్రి వేళ చేరి నగరాన్ని చుట్టుముట్టారు. 15 ఆ ఉదయం ఎలీషా సేవకుడు తర్వగా మేల్కోన్నాడు. అతను వెలుపలికి పోయి నగరం చుట్టూ ఒక పెద్ద సైన్యం రథాలు, గుర్రాలు ఉండటం చూశాడు.
ఎలీషా సేవకుడు, “నా యజమానీ! మనమేమి చేయగలము” అని ఎలీషాని చూసి అడిగాడు.
16 “భయపడకు, సిరియా కోసం యుద్ధం చేసే సైన్యం కంటె మనకోసం చేసే సైన్యం చాలా పెద్దది” అని ఎలీషా చెప్పాడు.
17 అప్పుడు ఎలీషా ప్రార్థించి ఇలా చెప్పాడు: “యెహోవా, నా సేవకుని కళ్లు తెరిపింపుము. అప్పుడతను చూడగలడు.”
యెహోవా ఆ యువకుని కళ్లు తెరిపించాడు. మరియు సేవకుడు కొండ చుట్టూ అగ్నిరథాలు గుర్రాలు వుండటం చుశాడు. అవి ఎలీషా చుట్టూ ఉన్నాయి.
18 ఈ అగ్నిరథాలు గుర్రాలు ఎలీషాకోసం క్రిందికి దిగి వచ్చాయి. ఎలీషా యెహోవాను ప్రార్థించాడు. “ఈ మనష్యులను అంధులను చేయవలసిందిగా నిన్ను ప్రార్థించుచున్నాను” అన్నాడు.
ఎలీషా ప్రార్థించిన ప్రాకారం యెహోవా చేశాడు. సిరియా సైనికులు అంధులగునట్లు యెహోవా చేశాడు. 19 సిరియా సైనికులను వుద్దేశించి ఎలీషా, “ఇది సరి అయిన మార్గం కాదు. ఇది సరి అయిన నగరం కాదు. నన్ను అనుసరించండి. మీరు ఎవరికోసం వెతుకుతున్నారో నేను అతని వద్దకు మిమ్మలను తీసుకుని వెళతాను” అన్నాడు. తర్వాత ఎలీషా సిరియా సైన్యాన్ని షోమ్రోనుకు నడిపించాడు.
20 వారు షోమ్రోనుకు చేరుకోగానే, “యెహోవా, వీరి కళ్లు తెరిపించుము. అప్పుడు వారు చూడగలుగుతారు” అని ఎలీషా ప్రార్థించాడు.
అప్పుడు యెహోవా వారి కళ్లు తెరిపించాడు. 21 తామప్పుడు షోమ్రోను నగరంలో వునన్నట్లుగా సైనికులు చూశారు. ఇశ్రాయేలు రాజు సిరియా సైన్యాన్ని చూశాడు. ఎలీషాతో ఇశ్రాయేలు రాజు, “తండ్రీ, వారిని నేను చంపనా,” అని అడిగాడు.
22 “నీ ఖడ్గముతో, విల్లమ్ములతో నీవు యుద్ధంలో పట్టుకున్న ఈ మనుష్యులను నీవు చంపగోరుచున్నావా? సిరియా సైనికులకు రొట్టెలు మంచినీళ్లు ఇమ్ము. వారిని తిని త్రాగనిమ్ము. తర్వాత వారు వారి దేశానికి యజమాని వద్దకు వెళ్తారు” అని ఎలీషా చెప్పాడు.
23 ఇశ్రాయేలు రాజు సిరియా సైన్యానికై చాలా ఆహారం తయారు చేయించాడు. ఆ సైనికులు తిన్నారు, త్రాగారు. తర్వాత ఇశ్రాయేలు రాజు సిరియా సైనికులను వారి దేశానికి పంపించాడు. సిరియా సైనికులు వారి యజమాని వద్దకు వెళ్లారు. సిరియా వారు దాడి చేయడానికై సైనికులెవరినీ ఇశ్రాయేలుకి పంపలేదు.
భయంకరమైన కరవు కాలం షోమ్రోనులో ఏర్పడుట
24 ఇది జరిగిన తర్వాత, సిరియా రాజుయిన బెన్హదదు తన సర్వసైన్యాన్ని సమీకరించి షోమ్రోను నగరాన్ని చుట్టుముట్టి దాడి చేయడానికి వెళ్లాడు. 25 నగరంలోకి ప్రజలు ఆహారం తీసుకురాకుండా సైనికులు చేశారు. అందువల్ల షోమ్రోనులో భయంకరమైన కరువు ఏర్పడింది. అది యెంత కష్టకాలమంటే, ఒక గాడిద తల ఎనభై వెండి రూపాయిలకు మరియు పావురపు పావు రెట్ట ఐదు వెండి రూపాయిలకు అమ్మబడింది.
26 ఇశ్రాయేలు రాజు నగరాన్ని ఆవరించిన ప్రాకారము మీద నడుస్తున్నాడు. ఒక స్త్రీ అతనిని ఉద్దేశించి కేక పెట్టింది. “నా ప్రభువా, యజమాని! దయచేసి నాకు సహాయం చెయ్యండి” అని.
27 ఇశ్రాయేలు రాజు, “యెహోవా కనుక సహాయం చేయకపోతే, నేను ఎలా సహాయం చేయగలను? నీకు ఇవ్వదగింది నావద్ద ఏమియులేదు, కళ్లంలో ధాన్యం లేదు. ద్రాక్షరసపు శాలలో ద్రాక్షరసం లేదు.” 28 తర్వాత, “నీకు వచ్చిన కష్టమేమి?” అని ఇశ్రాయేలు రాజు అడిగాడు.
ఆ స్త్రీ ఇలా బదులు చెప్పింది. “నీవు నీ కుమారుని మాకిచ్చివేయండి. అతనిని చంపి నేడు ఆహారం భుజిస్తాము. ఆ తర్వాత మేము మా కుమారుని రేపు భుజిస్తాము” అని ఈమె చెప్పింది. 29 కాబట్టి మా కుమారుణ్ణి ఉడికించి తినేశాము. ఆ మరుసటి రోజు నేను ఆ స్త్రీని ఇలా అడిగాను: “నీవు నీ కుమారుని ఇమ్ము. మేము అతనిని చంపి నేడు భుజిస్తాము. కాని ఆమె తన కుమారుని దాచివేసింది.”
30 ఆ స్త్రీ పలుకులు వినగానే, రాజు తాను తలక్రిందులైనానని దుఃఖాన్ని తెలపడానికి తన వస్త్రాలు చింపుకున్నాడు. ఆ గోడమీదుగా రాజు వెళ్తున్నప్పుడు రాజు గోనె పట్ట ధరించాడనీ, అది అతడు తల క్రిందులయిన, వ్యసనమయిన స్థితిని తెలుపుతున్నదని ప్రజలు గ్రహించారు.
31 రాజు, “ఈరోజు ఆఖరికి షాపాతు కుమారుడైన ఎలీషా తల కనుక అతని దేహం మీద ఉంటే, నన్ను దేవుడు శిక్షించునుగాక!” అని చెప్పాడు.
32 ఎలీషా వద్దకు రాజు ఒక దూతను పంపించాడు. ఎలీషా తన ఇంట్లో కూర్చుని ఉన్నాడు. మరియు పెద్దలు (నాయకులు) అతనితోపాటు ఉన్నారు. ఆ దూత అక్కడికి చేరుకోవడానికి ముందుగా, పెద్దల్ని ఉద్దేశించి అతను ఇలా అన్నాడు: “చూడండి, ఆ హంతకుని కుమారుడు (ఇశ్రాయేలు రాజు) నా తల నరికి వేసేందుకు మనుష్యులను పంపిస్తున్నాడు. ఆ దూత చేరగానే, తలుపు మూసివేయండి తలుపు పట్టుకుని, అతనిని లోపలికి రానివ్వకండి. నేనతని యజమాని అడుగులు అతని వెనుక వస్తున్నట్టు ఆ సవ్వడి మనకు వినిపించునుగదా.”
33 ఎలీషా ఆ పెద్దలతో (నాయకులతో) మాట్లాడుతూండగా, దూత అక్కడికి వచ్చాడు. ఆ సందేశమిది: “యెహోవా నుండి ఈ కష్టం వచ్చింది. ఇంకా యెహోవా కోసం నేనెందుకు వేచివుండాలి.”
7 దేవుని సందేశం వినండి. యెహోవా చెప్పుచున్నాడు. “రేపు ఈపాటికి ఆహారం సమృద్ధిగా ఉంటుంది. అది మరల చౌకగా దొరకుతుంది. సమారియ నగర ద్వారం వద్ద ఒక రూపాయికి ఒక బుట్ట సన్నని మేలు రకం పిండి, ఇంకొక రూపాయికి రెండు బుట్టల (సేరుల) యవలు అమ్మబడును.”
2 తర్వాత రాజుకు దగ్గరగా వున్న అధికారి దేవుని వ్యక్తి ఎలీషాకి సమాధానమిచ్చాడు. “పకలోకపు కిటికీలు యెహోవా తెరిచినా, ఇది జరగదు”[a] అని ఆ అధికారి చెప్పాడు.
“నీవు నీ కళ్ళతో అది చూడగలవు. కాని ఆ ఆహారం కొంచమైనా నీవు తినలేవు” అని ఎలీషా చెప్పాడు.
సిరియనుల శిబిరం ఖాళీగా వుండటాన్ని కుష్ఠరోగులు చూచుట
3 నగర ద్వారం వద్ద నలుగురు కుష్ఠరోగులుండిరి. వారు ఒకరితో ఒకరు ఇట్లు చెప్పుకున్నారు: “కూర్చుని మరణించాడానికి నిరీక్షిస్తున్నామా? 4 షోమ్రోనులో ఆహారంలేదు. మనము నగరంలోకి వెళితే, మనమక్కడ చనిపోతాము. ఇక్కడ ఉంటే, చనిపోతాము. కనుక మనము సిరియనుల గుడారానికి వెళదాము. వాళ్లు కనుక మనలను అక్కడ ఉండనిస్తే, అప్పుడు మనం బ్రతుకుదాము. వాళ్లు మనలను చంపితే మనము మరణిద్దాము.”
5 అందువల్ల ఆ సాయంకాలం ఆ నలుగురు కుష్ఠరోగులు సిరియనుల గుడారానికి వెళ్లారు. వారు గుడారం అంచుదాకా వెళ్లారు. అక్కడ మనుష్యులెవ్వరూ లేరు. 6 సిరియనుల గుడారం వారు రథాలు, గుర్రాలు, సైన్యం వస్తున్న సవ్వడిని సిరియనుల సైన్యం వినేలా యెహోవా ఏర్పాటు చేశాడు. అందువల్ల సిరియనుల సైనికులు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకొన్నారు: “ఇశ్రాయేలు రాజు హిత్తీయుల, ఈజీప్టీయుల రాజులను మనకు ప్రతికూలంగా జీతమిచ్చి వాడుకున్నాడు.”
7 ఆ సాయంకాలమే సిరియావారు అన్నీ అక్కడే విడిచిపెట్టి పారిపోయారు. వారు తమ గుడారాలు విడిచిపెట్టారు. గుర్రాలు, గాడిదలు మొదలైనవి కూడా విడిచి పెట్టి ప్రాణాలకోసం పారిపోయారు.
విరోధి శిబిరములో కుష్ఠరోగులు
8 శిబిరం ప్రారంభమైన చోటికి ఈ కుష్ఠరోగులు వచ్చారు. వారు ఒక గుడారంలోకి వెళ్లారు. వారు తిన్నారు; త్రాగారు. తర్వాత ఆ కుష్ఠరోగులు వెండి బంగారం వస్త్రాలు మొదలైన వాటిని తీసుకున్నారు. వెండి బంగారాలు వస్త్రాలను వారు దాచివేశారు. తర్వాత వెనక్కి వచ్చి మరొక గుడారంలో ప్రవేశించారు. ఈ గుడారం నుంచి వస్తువులను బయటికి చేరవేశారు. ఈ వస్తువులను కూడా వారు దాచివేశారు. 9 తర్వాత ఈ కుష్ఠరోగులు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకున్నారు: “మనము తప్పు చేస్తున్నాము. నేడు మనకు మంచి వార్త కలదు. కాని మనము మౌనంగా ఉన్నాము. మళ్లీ సూర్యుడు వచ్చేంతవరకు మనము వేచివుంటే, మనము శిక్షింపబడతాము. ఇప్పుడే మనము వెళ్లిపోదాము. రాజు గారి భవనంలో వున్న మనష్యులకు చెపుదాము.”
మంచి వార్తను కుష్ఠరోగులు చెప్పుట
10 ఆ తరువాత కుష్ఠరోగులు వచ్చి, నగర ద్వారపాలకులతో చెప్పారు: “మేము సిరియావారి శిబిరాలకు వెళ్లాము. కాని మేము ఎవ్వరి గొంతు వినలేదు. అక్కడ ఎవ్వరూ లేరు. గుర్రాలు గాడిదలు ఇంకా కట్టివేయబడివున్నాయి. గుడారాలు అలాగేవున్నాయి. కాని మనుష్యులందరూ వెళ్లిపోయారు.”
11 తర్వాత నగర ద్వారపాలకులు కేకలు వేసి రాజ భవనంలోని వారికి చెప్పారు. 12 అది రాత్రిగడియ. అప్పుడు రాజు పడక నుండి లేచాడు. తన అధికారులతో రాజు, “సిరియా సైనికులు మనకేమి చేస్తున్నారో మీకు చెప్తాను. మనము ఆకలిగా వున్నామని వారికి తెలుసు. పొలాలలో దాగుకొనడానికి వారు విడిదిని విడిచిపెట్టి వెళ్లారు. నగరం వెలుపలికి ఇశ్రాయేలువారు రాగానే, వారిని సజీవంగా మనము పట్టుకోవచ్చు, తర్వాత మనం నగరం ప్రవేశిద్దాము అని వారనుకొంటున్నారు” అని చెప్పాడు.
13 రాజు ఉద్యోగులలో ఒకడు, “నగరంలో ఇంకా మిగిలిన ఐదు గుర్రాలను కొంతమంది పురుషులు తీసుకొని పోనివ్వండి. నగరంలో ఇంకా మిగిలిన ఇశ్రాయేలువారివలె ఆ గుర్రాలు ఎలాగైనా మరణించేవే. ఏమి జరిగిందో తెలుసుకోడానికి ఈవ్యక్తులను మనము పంపిద్దాము” అని చెప్పాడు.
14 అందువల్ల గుర్రాలు కట్టిన రెండు రథాలను ఆ మనుష్యులు తీసుకున్నారు. ఆ మనుష్యులను సిరియను సైన్యము వెనుక పంపాడు. “వెళ్లి ఏమి జరిగిందో చూడండి” అని రాజు చెప్పాడు.
15 యోర్దాను నదిదాకా ఆ మనుష్యులు సిరియను సైన్యము వెనుకగా వెళ్లారు. ఆ మార్గమంతటా వస్త్రాలు, ఆయుధాలు వున్నాయి. సిరియావారు పారిపోయినప్పుడు ఆ వస్తువులను వదిలి వేశారు. ఆ దూతలు వెనుకకు వెళ్లి షోమ్రోను చేరుకొని రాజుకు చెప్పారు.
16 తర్వాత ఆ ఇశ్రాయేలీయులు సిరియను శిబిరానికి పరిగెత్తుకుని వెళ్లి, అక్కడినుండి విలువగల వస్తువులు తీసుకున్నారు. ప్రతి ఒక్కనికి వస్తువులు సమృద్ధిగా వున్నాయి. అందువల్ల యెహోవా చెప్పినట్లుగానే అది జరిగింది. ఒక్క రూపాయికి మేలిరకం పిండి ఒక బుట్ట మరియు ఒక్క రూపాయికి రెండు బుట్టల యవలు అమ్మబడెను.
17 రాజు తన సన్నిహితుడయిన ఉద్యోగిని ద్వార సంరక్షణకు ఎంపిక చేసెను. కాని ప్రజలు విరోధి శిబిరము నుండి వస్తువులను పొందడానికి పరుగెత్తి, వారు ఆ ఉద్యోగిని క్రిందికి తోసి అతని మీదుగా నడిచారు. రాజు దేవుని వ్యక్తి అయిన ఎలీషా ఇంటికి వచ్చినప్పుడు, అతను చెప్పినట్లుగానే ఆ ఉద్యోగి మరణించాడు. 18 ఎలీషా కూడ ఇలా సూచించాడు: “ఒక్క రూపాయికి మేలిరకం పిండి ఒక బుట్ట మరియు ఒక్కరూపాయికి రెండు బుట్టల యవలు అమ్మబడెను. సమారియ నగర ద్వారముల వద్ద గల అంగడి వీధివద్ద ప్రతివారు కొనగలరు.” 19 కాని ఆ ఉద్యోగి దేవుని వ్యక్తికి చెప్పిన సమాధాన మేమిటంటే, “యెహోవా పరలోకపు కిటికీలు తెరచినా, ఇలా జరగదు” అని. ఎలీషా ఆ ఉద్యోగితో ఇలా చెప్పివుండెను. “నీవు నీ కళ్లతోనే చూడగలవు, కాని నీవు ఆ ఆహారమేమీ భుజింపవు.” 20 ఆ విధంగానే, ఆ ఉద్యోగికి జరిగింది. ప్రజలు ద్వారం దగ్గర అతనిని క్రిందికి తోసి, అతని మీదుగా నడిచారు. అతను మరణించాడు.
రాజు మరియు షూనేము స్త్రీ
8 ఎవరి కొడుకునైతే సజీవునిగా ఎలీషా చేసెనో, ఆ స్త్రీతో ఎలీషా మాటలాడెను. ఎలీషా చెప్పాడు. “నీవు నీ కుటుంబము మరొక దేశానికి వెళ్లాలి. ఎందుకనగా, ఇక్కడ కరువుకాలం ఏర్పడుతుందని యెహోవా నిశ్చయించినాడు. ఈ విధమైన కరువు ఈ దేశంలో ఏడు సంవత్సరముల పాటు ఉంటుంది.”
2 అందువల్ల ఆ స్త్రీ దేవుని మనిషి చెప్పినట్లుగా చేసింది. తన కుటుంబంతో ఆమె ఫిలిష్తీయుల దేశంలో ఏడేండ్లు ఉండటానికి వెళ్లింది. 3 ఆ ఏడు సంవత్సరములు పూర్తి అయిన తర్వాత ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశంనుంచి తిరిగి వచ్చింది.
ఆ స్త్రీ రాజుతో మాట్లడడానికి వెళ్లింది. తన ఇల్లు, తన పొలము తనకు చేరునట్లుగా కోరుటకే ఆమె వెళ్లింది.
4 దేవుని వ్యక్తికి (ఎలీషా) సేవకుడైన గేహజీతో రాజు మాట్లాడుతూ ఉన్నాడు. రాజు ఈ విధంగా అడిగాడు: “దయచేసి ఎలీషా చేసిన గొప్ప కార్యాలను తెలుపు.”
5 మృతజీవి ఒకనిని సజీవునిగా ఎలీషా చేసెనన్న విషయాన్ని గేహజీ రాజుకి చెప్పుచున్నాడు. ఆ సమయాన తన కొడుకుని ఎలీషా బ్రతికింపజేసిన ఆ స్త్రీ రాజువద్దకు పోయింది. తన పొలమూ, తన యిల్లూ తాను పొందుటకు సహాయం చేయమని రాజుని అడగటానికి ఆమె వెళ్లింది. గేహాజీ, “నా ప్రభువా, రాజా, ఈమెయే ఆ స్త్రీ. ఇతడే ఎలీషా బ్రతికించిన ఆ కుమారుడు” అని చెప్పాడు.
6 ఏమి కావలెనో చెప్పమని రాజు ఆమెని అడిగాడు. ఆ స్త్రీ రాజుతో చెప్పింది.
తర్వాత ఆ స్త్రీ కి సహాయము చేయడానికై రాజు ఒక అధికారిని ఎన్నుకున్నాడు. “ఆమెకున్నదంతా ఆమెకు వచ్చేలా చేయండి. ఆమె దేశం విడిచిపెట్టిన నాటినుంచీ నేటిదాకా కోతలవల్ల ఆమెకు రావలసినదంతా ఇప్పించండి” అని చెప్పాడు.
బెన్హదదు హజాయేలును ఎలీషా వద్దకు పంపుట
7 ఎలీషా దమస్కుకు వెళ్లాడు. సిరియా రాజయిన బెన్హదదు జబ్బుతో వున్నాడు. “దేవుని వ్యక్తి ఇచ్చటికి వచ్చాడు.” అని ఒకడు బెన్హదదుకు చెప్పాడు.
8 అప్పుడు బెన్హదదు హజాయేలుతో ఇట్లన్నాడు: “ఒక కానుక తీసుకొని దేవుని వ్యక్తిని కలుసుకొనుము. నేను నా జబ్బునుండి కోలుకొందునో లేదో అతడు యెహోవాని అడగమని అతనితో చెప్పుము.”
9 అందువల్ల హజాయేలు ఎలీషాని కలుసు కొనడానికి వెళ్లాడు. తనతో పాటు హజాయేలు కానుకలు తెచ్చాడు. దమస్కు నుండి అతడు అన్ని రకాల మంచి వస్తువులు తెచ్చాడు. వాటిని మోయడానికి 40 ఒంటెలు కావలసి వచ్చింది. హజాయేలు ఎలీషా వద్దకు పోయాడు. “నీ అనుచరుడైన[b] సిరియా రాజు నన్ను నీ వద్దకు పంపించాడు. అతను జబ్బునుండి కోలుకొనునో లేదో అడగమని, నన్ను పంపెను,” అని హజాయేలు చెప్పాడు.
10 అప్పుడు ఎలీషా, “నీవు బాగుపడెదవని బెన్హదదుతో చెప్పు. కాని నీవు చనిపోదువని నిజముగా యెహోవా నాతో చెప్పాడు.” అన్నాడు.
హజాయేలుకి సంబంధించి ఎలీషా ఒక ప్రవచనము చెప్పుట
11 ఎలీషా పైకి క్రిందికి చూడసాగాడు. హజాయేలు ఇబ్బందిలో పడేంతవరకూ అతను చూసెను. దైవజనుడు ఏడవసాగెను. 12 “అయ్యా, మీరెందుకు ఏడుస్తున్నారు?”
అని హజయేలు అడిగాడు. “ఇశ్రాయేలు వారికి మీరేమి చెడుపనులు చేయగలరో తెలిసి నేను ఏడుస్తున్నాను. మీరు వారి బలమైన నగరాలను దగ్ధం చేస్తారు. ఖడ్గాలతో మీరు ఆ యువకులను చంపుతారు. వారి పసిపిల్లలను కూడా మీరు హతమారుస్తారు. మీరు వారి గర్భవతులను చీల్చి వేస్తారు” అని ఎలీషా సమాధానం చెప్పాడు.
13 హజయేలు “నేను శక్తిమంతుడను కానని చెప్పాడు. ఈ గొప్ప విషయాలు నేను చేయలేను.”
“నీవు సిరియా రాజువి కాగలవని యెహోవా చూపాడు.” అని ఎలీషా సమాధాన మిచ్చాడు.
14 ఆ తర్వాత హజయేలు ఎలీషాని విడిచి తన రాజు వద్దకు వెళ్లాడు. “ఎలీషా నీతో ఏమి చెప్పాడు?” అని బెన్హదదు హజయేలును అడిగాడు.
“నీవు జీవించెదవు అని ఎలీషా చెప్పాడు” అని హజయేలు చెప్పాడు.
హజాయేలు బెన్హదదును హత్య చేయుట
15 కాని ఆ మరునాడే హజాయేలు ఒక ముతక వస్త్రం తీసుకుని దాన్ని నీటిలో తడిపాడు. తర్వాత బెన్హదదు ముఖాన్ని కప్పివేసి, వుక్కిరి బిక్కిరి చేయడంతో అతడు మరణించాడు. హజాయేలు కొత్తగా రాజు అయ్యాడు.
యెహోరాము తన పాలన ప్రారంభించుట
16 ఇశ్రాయేలుకు రాజైన అహాబు కొడుకు యెహోరాము పరిపాలనలోని, అయిదవ సంవత్సరమున, యూదా రాజైన యెహోషాపాతు కొడుకు యెహోరాము యూదాకు రాజయ్యాడు. 17 యెహోరాము పరిపాలించు నాటికి అతను ముఫ్పై రెండు యేండ్ల వాడు. యెరూషలేములో అతను ఎనిమిదేళ్లు పరిపాలించాడు. 18 కాని పూర్వపు ఇశ్రాయేలు రాజుల చెడు మార్గాలను ఇతడు అనుసరించాడు. అహాబు కుటుంబీకులు చేసినట్లుగా యెహోవా దృష్ఠికి తప్పు అని ఎంచబడిన చెడుకార్యాలు చేశాడు. 19 కాని తన సేవకుడైన దావీదుకు వాగ్దానం చేయడంవల్ల యెహోవా యూదాను నాశనం చేయలేదు. అతని వంశానికి చెందిన వారు ఎవరో ఒకరు ఎప్పుడూ రాజుగా వుంటారని దావీదుకు యెహోవా వాగ్దానం చేశాడు.
20 యెహోరాము కాలంలో యూదా పరిపాలన నుండి ఎదోమీయులు విడిపోయి తమకు ఒక రాజుని ఎన్నుకున్నారు.
21 అప్పుడు యెహోరాము అతని రథములన్నిటినీ తీసుకుని జాయీరుకు వెళ్లెను. రాత్రివేళ ఎదోము సైన్యము వారిని చుట్టుముట్టింది. యెహోరాము అతని అధికారులు వారిని ఎదుర్కొని, తప్పించు కున్నారు. యెహోరాము సైనికులందురు పారిపోయి తమ దేశం చేరుకున్నారు. 22 ఈ కారణంచేత ఎదోము వారు యూదా పరిపాలనకు ఎదురు తిరిగారు. అదే సమయమున లిబ్నా కూడా యూదా పరిపాలనకు ఎదురు తిరిగింది.
23 యెహోరాము చేసిన ఇతర పనులన్నియు “యూదా రాజుల వృత్తాంతము” అనే గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి.
24 తరువాత యెహోరాము మరణించాడు. దావీదు నగరంలో తన పూర్వికులతో పాటు అతను సమాధి చేయబడ్డాడు. యెహోరాము కుమారుడైన అహజ్యా కొత్తగా రాజయ్యాడు.
అహజ్యా తన పరిపాలన ప్రారంభించుట
25 అహాబు కుమారుడైన యెహోరాము ఇశ్రాయేలుకు రాజయిన పన్నెండవ సంవత్సరమున, యెహోరాము కుమారుడైన అహజ్యా యూదా రాజ్యానికి రాజయ్యాడు. 26 అహజ్యా పరిపాలన ప్రారంభించినప్పుడు అతని వయస్సు ఇరవైరెండు సంవత్సరములు. అతను యెరూషలేములో ఒక సంవత్సరం పరిపాలించాడు. అతని తల్లి పేరు అతల్యా. ఆమె ఇశ్రాయేలు రాజయిన ఒమ్రీ కుమార్తె. 27 యెహోవా తప్పని చెప్పిన పనులనే అహజ్యా చేశాడు. అహాబు వంశీయులవలె అహజ్యా అనేక చెడుకార్యాలు చేశాడు. అతని భార్య అహాబు వంశానికి చెందినదగుటచే, అహజ్యా ఈ విధంగా చేశాడు.
హజాయేలుతో జరిగిన యుద్ధంలో యెహోరాము గాయపడుట
28 యెహోరాము అహాబు వంశానికి చెందినవాడు. సిరియా రాజయిన హజయేలుతో రామోత్గిలాదు అనేచోట యుద్ధం చేసేందుకు అహజ్యా యెహోరాముతో కలిసి వెళ్లాడు. సిరియన్లు యెహోరాముని గాయపరచిరి. 29 ఆ గాయముల నుండి బాగు పడుటకు గాను యెహోరాము రాజు ఇశ్రాయేలుకి తిరిగి వెళ్లిపోయాడు. యెహోరాము యెజ్రెయేలు అనే ప్రదేశానికి పోయాడు. యెహోరాము కుమారుడైన అహజ్యా యూదా యొక్క రాజు. అహజ్యా యెహోరాముని చూడటానికి యెజ్రెయేలు వెళ్లాడు.
© 1997 Bible League International