Chronological
19 యూదా రాజైన యెహోషాపాతు యెరూషలేములోని తన యింటికి క్షేమంగా తిరిగి వచ్చాడు. 2 దీర్ఘదర్శియగు యెహూ ఎదురేగి యెహోషాపాతును కలిశాడు. యెహూ తండ్రి పేరు హనానీ. యెహోషాపాతుతో యెహూ ఈ విధంగా చెప్పాడు: “నీవు దుష్టులకు ఎందుకు సహాయపడ్డావు? యెహోవాను అసహ్యించుకునే వారిని నీ వెందుకు ప్రేమిస్తున్నావు? అందువల్లనే యెహోవా నీపట్ల కోపంగా వున్నాడు. 3 కాని నీ జీవితంలో నీవు కొన్ని మంచి పనులు చేశావు. నీవు అషేరా దేవతా స్తంభాలను ఈ దేశం నుండి తొలగించావు. దేవుని అనుసరించాలని నీ హృదయంలో నిశ్చయించుకున్నావు.”
యెహోషాపాతు న్యాయాధిపతులను నియమించటం
4 యెహోషాపాతు యెరూషలేములో నివసించాడు. మళ్లీ అతడు ప్రజలను కలియటానికి బెయేర్షెబా పట్టణం నుండి కొండల ప్రాంతమైన ఎఫ్రాయిము వరకు సంచారం చేశాడు. యెహోషాపాతు ప్రజలమధ్య తిరిగి మళ్లీ వారిని తమ పూర్వీకులు ఆరాధించిన యెహోవా వైపుకు తిప్పాడు. 5 యెహోషాపాతు యూదాలో న్యాయాధిపతులను నియమించాడు. యూదాలో కోటలుగల పట్టణాలన్నిటిలో అతడు న్యాయాధిపతులను నియమించాడు. 6 యెహోషాపాతు ఆ న్యాయాధిపతులతో యిలా చెప్పాడు: “మీరు చేసే పనిలో మీరు మిక్కిలి మెళకువతో మెలగండి. ఎందువల్లనంటే మీరు తీర్పు తీర్చేది ప్రజల తరుపున కాదు. యెహోవా తరుపున మీరొక నిర్ణయం తీసుకొనేటప్పుడు యెహోవా మీతో వుంటాడు. 7 కావున మీలో ప్రతి ఒక్కడూ యెహోవాకు భయ పడాలి. మీ పనిలో మీరు జాగ్రత్త వహించండి. ఎందువల్లనంటే మన దేవుడైన యెహోవా పక్షపాతం లేనివాడు. న్యాయశీలి. యెహోవా ఎన్నడూ కొందరిని మరికొందరికంటె ముఖ్యులుగా చూడక సమంగా చూస్తాడు. తన తీర్పును మార్చటానికి యెహోవా ధనం ఆశించడు.”
8 యెరూషలేములో కొంతమంది లేవీయులను, యాజకులను, మరికొందరు ఇశ్రాయేలు పెద్దలను న్యాయాధిపతులుగా యెహోషాపాతు ఎంపిక చేశాడు. యెరూషలేములో వున్న ప్రజల సమస్యలను పరిష్కరించటానికి వారు యెహోవా ధర్మశాస్త్రాన్ని ఉపయోగిస్తారు. 9 యెహోషాపాతు యిలా కొన్ని ఆజ్ఞలను యిచ్చాడు. యెహోషాపాతు యిలా చెప్పాడు: “మీ నిండు హృదయంతో మీరు విశ్వాసపాత్రంగా సేవ చేయాలి. మీరు యెహోవాకు భయపడాలి. 10 హత్యావిషయాలు, చట్టపరమైన, ఆజ్ఞాపరమైన నియమ నిబంధనలకు సంబంధించిన నేరాలు అనేకం మీ దృష్టికి తేబడతాయి. నగరాలలో నివసించే మీ సోదరుల వద్ద నుండి ఈ విషయాలు మీ తీర్పుకు వస్తాయి. మీ వద్దకు వచ్చిన నేరస్తులను, వాదాలాడే వారిని అందరినీ యెహోవాపట్ల పాపం చేయవద్దని మీరు హెచ్చరించాలి. మీరు నమ్మకంగా పనిచేయని ఎడల మీ మీదికి, మీ సోదరుల మీదికి యెహోవా కోపాన్ని రప్పించిన వారవుతారు. నేను చెప్పినట్లు చేయండి. అప్పుడు తప్పు చేశామనే భావన మీకు వుండదు.
11 “అమర్యా ప్రముఖ యాజకుడు. యెహోవాకు సంబంధించిన అన్ని విషయాలలో అతడు మీమీద ఆధిపత్యం వహిస్తాడు. రాజుకు సంబంధించిన విషయాలలో మీకు మార్గదర్శకుడుగా జెబద్యావున్నాడు. జెబద్యా తండ్రి పేరు ఇష్మాయేలు. యూదా వంశంలో జెబద్యా ఒక పెద్ద. ఇంకను లేవీయులు మీకు లేఖకులుగా పని చేస్తారు. మీరు ప్రతి పనీ ధైర్యంగా చేయండి. న్యాయమార్గాన నడిచే ప్రజలకు యెహోవా అండగా వుండుగాక!”
యెహోషాపాతు యుద్దం ఎదిరించటం
20 తరువాత మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులలో కొందరు కలిసి యెహోషాపాతుతో యుద్ధం ప్రారంభించటానికి వచ్చారు. 2 కొందరు మనుష్యులు యెహోషాపాతు వద్దకు వచ్చి యిలా అన్నారు: “ఎదోము నుంచి ఒక పెద్ద సైన్యం నీమీదికి వస్తూ వుంది. ఆ సైన్యం మృత సముద్రానికి అవతలి పక్క నుండి వస్తూ వుంది. వారు ఇప్పటికే హససోను తామారు అనబడే ఏన్గెదీలో ఉన్నారు.” 3 యెహోషాపాతు భయపడ్డాడు. తాను ఏమి చేయాలో యెహోవాను అడిగి తెలిసికోవాలని యెహోషాపాతు నిశ్చయించాడు. యూదాలో ప్రతి ఒక్కడూ ఉపవాసం చేయలని ఒక నిర్ణీత సమయాన్ని ప్రకటించాడు. 4 యూదా ప్రజలు యెహోవా సహాయం కోరటానికి ఒక చోట సమావేశమయ్యారు. వారు యూదా పట్టణాలన్నిటి నుండీ యెహోవా సహాయం కోరటానికి వచ్చారు. 5 యెహోషాపాతు ఆలయ నూతన ప్రాంగణం ముందు వున్నాడు. యూదా, యెరూషలేము ప్రజల సమావేశంలో అతడు నిలబడ్డాడు. 6 అతడు ఈ విధంగా ప్రార్థించాడు:
“మా పూర్వీకుల దేవుడవైన ఓ ప్రభూ, నీవే పరలోక అధిపతివి. ప్రపంచ రాజ్యాలన్నిటినీ ఏలేవాడవు నీవే! నీకు అధికారం, బలం వున్నాయి! నిన్నెదిరించి ఎవ్వడూ నిలువలేడు! 7 నీవు మా దేవుడివి! ఈ దేశంలో నివసించే ప్రజలను బయటకు పొమ్మని ఒత్తిడి చేశావు. ఈ పని నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల ముంగిట చేశావు. ఈ రాజ్యాన్ని అబ్రాహాము సంతతివారికి శాశ్వతంగా యిచ్చావు. అబ్రహాము నీ స్నేహితుడు. 8 అబ్రహాము సంతతివారు ఈ రాజ్యంలో నివసించి, నీ పేరు మీద ఒక ఆలయాన్ని కట్టించారు. 9 వారు, ‘యుద్ధాలు, శిక్ష, వ్యాధులు, కరువు కాటకాలు మొదలైన ఈతి బాధలు మాకు సంభవించినప్పుడు, ఈ మందిరం ముందు, నీ సన్నిధిని నిలబడతాము. ఈ మందిరం నీ పేరు మీద వుంది. మాకు ఆపద వచ్చినప్పుడు నీకు మొర పెట్టుకొంటాము. అప్పుడు నీవు మా మొరాలకించి మమ్ము రక్షిస్తావు’ అని అన్నారు.
10 “కాని ఇప్పుడు అమ్మోను, మోయాబు, మరియు శేయీరు పర్వత ప్రాంత మనుష్యులు ఇక్కడ వున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు నుండి బయటికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులను వారి రాజ్యంలోనికి నీవు వెళ్లనీయలేదు[a] అందువల్ల ఇశ్రాయేలు ప్రజలు వారి జోలికి పోకుండా తిరిగి వచ్చి, వారిని నాశనం చేయలేదు. 11 కాని మేము వారిని నాశనం చేయకుండా వదిలిపెట్టినందుకు వారు మాకు ఏ రకమైన ప్రతిఫలం ఇస్తున్నారో చూడు. నీ దేశం నుండి మమ్మల్ని తరిమి వేయటానికి వారు వచ్చారు. ఈ దేశాన్ని నీవు మాకు యిచ్చి యున్నావు. 12 మా దేవా, ఆ మనుష్యులను శిక్షించుము! మామీదికి దండెత్తి వస్తున్న ఈ మహా సైన్యాన్ని ఎదిరించే శక్తి మాకు లేదు! మేము ఏమి చేయాలో మాకు తోచటంలేదు! అందువల్ల నీ సహాయం కొరకు ఎదురు చూస్తూన్నాం.”[b]
13 యూదా ప్రజలంతా తమ పసిబిడ్డలు, భార్యలు, పిల్లలతో యెహోవా ముందు నిలబడ్డారు. 14 అప్పుడు యెహోవా ఆత్మ యహజీయేలు మీదికి వచ్చింది. యహజీయేలు తండ్రి పేరు జెకర్యా. జెకర్యా తండ్రి పేరు బెనాయా. బెనాయా తండ్రి పేరు యెహీయేలు. యెహీయేలు తండ్రి పేరు మత్తన్యా. యహజీయేలు ఒక లేవీయుడు. ఆసాపు సంతతిలోనివాడు. సమావేశం మధ్యలో 15 యహజీయేలు నిలబడి యిలా అన్నాడు: “రాజైన యెహోషాపాతూ, యూదా, యెరూషలేములలో నివసిస్తున్న ప్రజలారా వినండి! యెహోవా మీకు ఈ విధంగా తెలియజెప్పుతున్నాడు: ‘ఈ మహా సైన్యాన్ని చూచి మీరు భయపడవద్దు. చింతించవద్దు. ఎందువల్లననగా ఇప్పుడు యుద్ధం మీది కాదు. ఇది దేవుని యుద్ధం. 16 రేపు మీరు అక్కడకి వెళ్లి ఆ సైన్యంతో యుద్ధం చేయండి. వారు జీజు కనుమ ద్వారా వస్తారు. యెరూవేలు ఎడారికి అవతలి పక్కనున్న లోయ చివర మీరు వారిని చూస్తారు. 17 ఈ యుద్ధంలో మీరు పోరాడవలసిన అవసరం లేదు. మీరీ స్థానాలలో దృఢంగా నిలబడండి. యెహోవా మిమ్ముల్ని రక్షించటం మీరు చూస్తారు. యూదా, యెరూషలేము ప్రజలారా భయపడకండి! చింతించవద్దు! యెహోవా మీ పక్షాన వున్నాడు. కావున రేపు వారి మీదికి వెళ్లండి.’”
18 యెహోషాపాతు తన శిరస్సు నేల తాకేలా సాష్టాంగపడ్డాడు. యూదా ప్రజలు, యెరూషలేములో వుంటున్న వారు యెహోవా ముందు సాష్టాంగపడ్డారు. వారంతా యెహోవాను ఆరాధించారు. 19 లేవీయులలో కహాతీయుల కుటుంబాలవారు, కోరహీయులు నిలబడి ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవాకు స్తోత్రం చేశారు. వారు గొంతెత్తి స్తోత్రం చేశారు.
20 తెల్లవారుఝామునే యెహోషాపాతు సైన్యం తెకోవ ఎడారికి వెళ్లింది. వారు బయలుదేరి వెళ్లేటప్పుడు యెహోషాపాతు నిలబడి యిలా అన్నాడు: “యూదా ప్రజలారా, యెరూషలేము వాసులారా, నేను చెప్పేది వినండి. మీ దేవుడైన యెహోవాలో విశ్వాసముంచండి. అప్పుడు మీరు దృఢంగా నిలువ గలుగుతారు. యెహోవా ప్రవక్తలలో విశ్వాసముంచండి. మీరు విజయం సాధిస్తారు!”
21 యెహోషాపాతు ప్రజల సలహాను ఆలకించాడు. అతడు గాయకులను నియమించాడు. యెహోవా పరిశుద్ధుడు, అద్భుతమైన వాడు గనుక ఆయనను స్తుతించటానికి ఆ గాయకులు ఎంపిక చేయబడ్డారు. వారు సైన్యానికి ముందు నడుస్తూ యెహోవాకు స్తుతి గీతాలు పాడారు.
“యెహోవాకు భజన చేయండి;
ఆయన ప్రేమ తరగనిది!”
అంటూ వారు సంకీర్తన చేశారు. 22 ఆ మనుష్యులు పాడుతూ, దేవుని స్తుతిస్తూ వెళ్తూండగా, అమ్మోను, మోయాబు ప్రజల మీదికి, శేయీరు పర్వత ప్రాంతం వారిమీదికి మాటు వేసిన మనుష్యులను యెహోవా పంపాడు. వారంతా యూదా రాజ్యం మీదికి దండెత్తి వస్తున్నారు. వాళ్లు బాగా దెబ్బలు తిన్నారు. 23 అమ్మోనీయులు, మోయాబీయులు కలిసి శేయీరు పర్వత ప్రాంతం వారితో యుద్ధానికి దిగారు. అమ్మోనీయులు, మోయాబీయులు కలిసి శేయీరు పర్వతప్రాంతం వారిని చంపి నాశనం చేశారు. శేయీరు మనుష్యులను చంపిన తరువాత, వారు మళ్లీ ఒకరి నొకరు చంపుకున్నారు.
24 యూదా సైనికులు ఎడారిలోని కాపలా బురుజు వద్దకు వచ్చారు. వారు శత్రుసైన్యం వైపు పరిశీలించి చూశారు. కాని వారు భూమిమీద పడివున్న శవాలను మాత్రమే చూడగలిగారు, ఒక్కడు కూడా బ్రతికిలేడు. 25 శవాలపైగల విలువైన వస్తువులను తీసుకోవటానికి యెహోషాపాతు, అతని సైన్యం, వచ్చారు. వారు జంతువులను, డబ్బును, బట్టలను, ఇతర విలువైన వస్తువులను చూశారు. యెహోషాపాతు, అతని సైనికులు ఆ వస్తువులన్నిటినీ తీసుకున్నారు. ఆ వస్తువులన్నీ యెహోషాపాతు, అతని మనుష్యులు మోసుకుపోలేనన్ని వున్నాయి. శవాలనుండి తీసుకొన్న వస్తువులను మోసుకుపోవటానికి వారికి మూడు రోజులు పట్టింది. అక్కడ వస్తువులు అంత ఎక్కువగా పడివున్నాయి. 26 నాల్గవ రోజున యెహోషాపాతు, అతని సైన్యం బెరాకా[c] లోయలో సమావేశమైనారు. ఆ స్థలంలో వారు యెహోవాకి ప్రార్థనలు చేశారు. అందువల్ల ఆ స్థలానికి ఈనాటికీ “బెరాకాలోయ” అని పేరు.
27 తరువాత యూదా నుండి, యెరూషలేము నుండి వచ్చిన సైనికులను యెహోషాపాతు యెరూషలేముకు తీసుకొనిపోయాడు. వారి శత్రువులను ఓడించి, యెహోవా వారిని చాలా సంతోషపర్చాడు. 28 వారు మేళతాళాలతో యెరూషలేముకు తిరిగి వచ్చి ఆలయానికి వెళ్లారు.
29 ఇశ్రాయేలు శత్రువులతో యెహోవా యుద్ధం చేశాడని విని వివిధ దేశాల రాజులందరూ యెహోవా అంటే భయపడ్డారు. 30 అందువల్ల యెహోషాపాతు రాజ్యంలో శాంతి నెలకొన్నది. యెహోషాపాతు యొక్క దేవుడు అతనికి శాంతియుత వాతావరణాన్ని కల్పించాడు.
యెహోషాపాతు పాలన సారాంశం
31 యెహోషాపాతు యూదా రాజ్యాన్ని పాలించాడు. యెహోషాపాతు పాలన మొదలయ్యే సరికి ముప్పై ఐదేండ్లవాడు. అతడు యెరూషలేములో ఇరవైయైదు సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి పేరు అజూబా. అజూబా తల్లిపేరు షిల్హీ. 32 తన తండ్రి ఆసా నడిచిన రీతిగా యెహోషాపాతు ఉత్తమ జీవితాన్ని గడిపాడు. యెహోషాపాతు ఆసా మార్గాన్ని అనుసరించటానికి వెనుకాడలేదు. యెహోవా దృష్టికి మంచి పనులన్నీ యెహోషాపాతు చేశాడు. 33 కాని బూటకపు దేవతల పూజలకు వినియోగించిన గుట్టలను (ఉన్నత స్థలాలను) అతడు తీసివేయలేదు. ప్రజలు కూడా తమ పూర్వీకులు ఆరాధించిన దేవుని అనుసరించటానికి తమ హృదయాలను తిప్పలేదు.
34 యెహోషాపాతు ఆదినుండి అంతంవరకు చేసిన పనులన్నీ యెహో వ్రాసిన గ్రంథాలలో పొందుపర్చబడ్డాయి. యెహో తండ్రి పేరు హనానీ. ఈ విషయాలు ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.
35 చివరి రోజుల్లో యూదా రాజైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో ఒక ఒడంబడిక కుదుర్చుకున్నాడు. అహజ్యా మిక్కిలి చెడుకార్యాలు చేశాడు. 36 తర్షీషు[d] పట్టణానికి పయనించే ఓడలను చేయించటానికి యెహోషాపాతు అహజ్యాతో కలిశాడు. వారు ఓడలను ఎసోన్గెబెరులో నిర్మించారు. 37 అప్పుడు ఎలీయెజెరు అనే ప్రవక్త యెహోషాపాతుకు వ్యతిరేకంగా ప్రవచించాడు. ఎలీయెజెరు తండ్రి పేరు దోదావాహు. ఎలీయెజెరు మారేషా పట్టణానికి చెందినవాడు. అతడు ఈ రకంగా చెప్పాడు: “యెహోషాపాతూ, నీవు అహజ్యాతో కలిశావు. అందువల్ల యెహోవా నీ పనులను సర్వనాశనం చేస్తాడు.” అలానే అతని ఓడలు పగిలిపోయాయి. అందువల్ల యెహోషాపాతు, అహజ్యాలు తర్షీషుకు ఓడలను పంపలేకపోయారు.
21 యెహోషాపాతు చనిపోగా, అతనిని అతని పూర్వీకుల సరసన సమాధిఛేశారు. అతడు దావీదు నగరంలో సమాధి చేయబడ్డాడు. యెహోషాపాతు స్థానంలో అతని కుమారుడు యెహోరాము కొత్త రాజయ్యాడు. 2 యెహోరాము సోదరులు అజర్యా, యెహీయేలు, జెకర్యా, అజర్యా, మిఖాయేలు, మరియు షెపట్య అనువారు. వీరంతా యెహోషాపాతు కుమారులు. యెహోషాపాతు యూదా రాజ్యానికి రాజు. 3 యెహోషాపాతు తన కుమారులకు వెండి బంగారు వస్తువులు, తదితర విలువైన కానుకలు యిచ్చాడు అతడు యూదాలో బలమైన కోటలు నిర్మించి యిచ్చాడు. కాని యెహోషాపాతు రాజ్యాన్ని యెహోరాముకు యిచ్చాడు. ఎందువల్లనంటే అతడు పెద్ద కుమారుడు.
యూదా రాజుగా యెహోరాము
4 యెహోరాము తన తండ్రి రాజ్యాన్ని చేపట్టి తనను తాను పటిష్ట పర్చుకొని స్థిరపడ్డాడు. తరువాత కత్తిని వినియోగించి తన సోదరులనందరినీ చంపి వేశాడు. అతడు మరికొందరు ఇశ్రాయేలు పెద్దలను కూడా నరికివేశాడు. 5 యెహోరాము ఏల నారంభించే నాటికి ముప్పై రెండు సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో ఎనిమిది సంవత్సరాలు పాలించాడు. 6 అతడు ఇశ్రాయేలు రాజులు నివసించిన రీతిలో జీవితం కొనసాగించాడు. అహాబు కుటుంబం మాదిరిగానే అతడు కూడ నివసించాడు. ఎందువల్ల నంటే అహాబు కుమార్తెనే యెహోరాము వివాహమాడాడు. యెహోరాము యెహోవా దృష్టికి చెడ్డవైన పనులన్నీ చేశాడు. 7 కాని యెహోవా దావీదుతో చేసుకొన్న ఒడంబడిక ప్రకారం ఆయన దావీదు కుటుంబాన్ని నాశనం చేయలేదు. దావీదు కొరకు, ఆయన సంతతివారి కొరకు యెహోవా శాశ్వతంగా ఒక జ్యోతిని వెలిగించుతానని మాట యిచ్చివున్నాడు.[e]
8 యెహోరాము కాలంలోనే యూదా ఆధిపత్యం నుండి ఎదోము విడిపోయి, స్వతంత్ర రాజ్యమయ్యింది. ఎదోమీయులు వారి స్వంత రాజును ప్రకటించుకున్నారు. 9 అందువల్ల యెహోవారాము తన సైన్యాధిపతులతోను, రథాలతోను ఎదోము మీదికి వెళ్లాడు. ఎదోమీయుల సైన్యం యెహోరామును, అతని రథాధిపతులను చుట్టుముట్టింది. కాని యెహోరాము తీవ్రంగా యుద్ధం చేసి చీకటి పడ్డాక బయట పడ్డాడు. 10 అప్పటి నుండి ఈ నాటి వరకు ఎదోము రాజ్యం యూదాపై తిరుగబడుతూనే వుంది. లిబ్నా పట్టణవాసులు కూడా యెహోరాముకు వ్యతిరేకులైనారు. యెహోరాము యెహోవాను విడనాడినందుకు ఫలితంగా ఇదంతా జరిగింది. యెహోవా యెహోరాము పూర్వీకులు ఆరాధించిన దేవుడు. 11 యెహోరాము యూదా కొండలమీద, గుట్టలమీద క్షుద్ర దేవతల పూజలకై స్థలాలను నిర్మించాడు. దేవుడు ఆశించిన దానిని చేయకుండా యెరూషలేము ప్రజలకు యెహోరాము అడ్డుపడ్డాడు. అతడు యూదా ప్రజలను యెహోవాకు దూరం చేశాడు.
12 ప్రవక్తయైన ఏలీయా ద్వారా యెహోరాముకు ఒక వర్తమానం వచ్చింది. ఆ వర్తమానం యిలా వుంది:
“దేవుడైన యెహోవా తెలియజేయునదేమనగా: ఆయన మీ పూర్వీకుడైన దావీదు ఆరాధించిన దైవం. యెహోవా చెప్పుచున్నాడు: ‘యెహోరామూ, నీ తండ్రి యెహోషాపాతు నడిచిన మార్గాన్ని నీవు విడనాడినావు. యూదా రాజైన ఆసా నడిచిన మార్గాన్ని కూడ నీవు విడనాడినావు. 13 అంతేకాదు నీవు ఇశ్రాయేలు రాజులు నడచిన పెడమార్గాన్ని అనుసరించావు. దేవుడు ఆశించిన రీతిగా నడవకుండా నీవు యూదా, యెరూషలేము ప్రజలను ఆపావు. అదే నేరాన్ని అహాబు, అతని కుటుంబంవారు చేశారు. వారు దేవుని పట్ల విశ్వాస ఘాతకులైనారు. నీవు నీ సోదరులను హత్యచేశావు. నీకంటె నీ సోదరులు మంచివారు. 14 కావున త్వరలో యెహోవా నీ ప్రజలను కఠినంగా శిక్షిస్తాడు. యెహోవా నీ పిల్లలను భార్యలను శిక్షించి, నీ ఆస్తిని పాడుచేస్తాడు. 15 నీకు పేగుల్లో భయంకరమైన జబ్బు చేస్తుంది. రోజు రోజుకూ నీ జబ్బు ముదురుతుంది. ఆ భయంకరమైన వ్యాధివల్ల నీ ప్రేగులు బయటికి వచ్చేస్తాయి.’”
16 యెహోవా ఫిలిష్తీయులను, ఇథియోపియులకు (కూషీయులు) దగ్గరలో నివసిస్తున్న అరబీయులను యెహోరాము మీదికి పోయేలా ప్రేరేపించాడు. 17 ఆ ప్రజలు యూదా రాజ్యం మీదికి దండెత్తారు. వారు రాజగృహంలోని ధనాన్నంతా కొల్లగొట్టారు. వారు యెహోరాము కుమారులను, భార్యలను తీసుకొనిపోయారు. యెహోరాము చిన్న కుమారుడు మాత్రం వదిలిపెట్టబడ్డాడు. యెహోరాము చిన్న కుమారుని పేరు యెహోయాహాజు.[f]
18 ఈ సంఘటనలు జరిగిన తరువాత యెహోవా యెహోరాముకు పేగుల్లో నయంకాని వ్యాధిని కలుగజేశాడు. 19 జబ్బు ముదిరి రెండు సంవత్సరాల తరువాత యెహోరాము పేగులు బయటికి వచ్చాయి. భరించలేని బాధతో అతడు చనిపోయాడు. తన తండ్రికి చేసినట్లు ప్రజలు యెహోరాముకు గౌరవసూచకంగా పెద్దమంట వేయలేదు. 20 యెహోరాము రాజయ్యే నాటికి ముప్పై రెండు సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో ఎనిమిది సంవత్సరాలు పాలించాడు. యెహోరాము చనిపోయినప్పుడు ఒక్కడు కూడ విచారించలేదు. యెహోరామును ప్రజలు దావీదు నగరంలో సమాధి చేశారుగాని, రాజులను వుంచే చోట అతనిని సమాధి చేయలేదు.
అహజ్యా యూదా రాజవటం
22 యెహోరాము స్థానంలో యెరూషలేము ప్రజలు అహజ్యాను[g] కొత్త రాజుగా చేసారు. అహజ్యా యెహోరాము యొక్క చిన్న కుమారుడు. అరబీయులతో యెహోరాము మీదికి వచ్చిన ప్రజలు యెహోరాము కుమారులందరినీ చంపివేశారుగాని, చిన్నవానిని మాత్రం వదిలారు. అందువల్ల అహజ్యా యూదాలో పరిపాలించగలిగాడు. 2 అహజ్యా పరిపాలన ఆరంభించే నాటికి ఇరువది రెండేండ్లవాడు.[h] యెరూషలేములో అహజ్యా ఒక్క సంవత్సరం పాలించాడు. అతని తల్లి పేరు అతల్యా. అతల్యా తండ్రి పేరు ఒమ్రీ. 3 అహాబు కుటుంబం నివసించిన తీరునే అహజ్యా నివసించాడు. అతడలా నివసించటానికి కారణం అతని తల్లి అతనిని దుష్టకార్యాలకు ప్రేరేపించటమే. 4 యెహోవా దృష్టిలో అహజ్యా పాపకార్యాలు చేశాడు. అహాబు కుటుంబం కూడా అదే చేసింది. అహజ్యా తండ్రి చనిపోయినపిమ్మట అతనికి అహాబు కుటుంబం వారు సలహాదారులయ్యారు. వారు అహజ్యాకు తప్పుడు సలహాలిచ్చారు. ఆ తప్పుడు సలహాలే అతని చావుకు దారితీశాయి. 5 అహాబు కుటుంబం అతని కిచ్చిన సలహనే అహజ్యా పాటించాడు. ఇశ్రాయేలు రాజైన యెహోరాముతో కలిసి అహజ్యా అరాము (సిరియా) రాజైన హజాయేలుపై యుద్ధానికి రామోత్గిలాదు పట్టణానికి వెళ్లాడు. యెహోరాము తండ్రి ఇశ్రాయేలు రాజైన అహాబు. కాని అరామీయులు (సిరియనులు) యుద్ధంలో యెహోరామును గాయపర్చారు. 6 యెహోరాము తన గాయాలను నయం చేసికోటానికి యెజ్రెయేలుకు తిరిగి వెళ్లాడు. అరాము రాజైన హజాయేలుతో రామోతు వద్ద పోరాడుతుండగా అతడు గాయపడ్డాడు. పిమ్మట యెహోరామును చూడటానికి అహజ్యా (యెహోయహాజు) యెజ్రెయేలు పట్టణానికి వెళ్లాడు. అహజ్యా తండ్రి పేరు యూదా రాజైన యెహోరాము. యెహోరాము తండ్రి పేరు అహాబు. యెహోరాము గాయపడటంతో అతడు యెజ్రెయేలు పట్టణానికి వెళ్లాడు.
7 యెహోరామును చూడటానికి అహజ్యా వెళ్లినప్పుడు దేవుడు అతనికి మరణం కలుగజేశాడు. అహజ్యా వెళ్లి యెహోరాముతో కలిసి యెహూను చూడటానికి వెళ్లాడు. యెహూ తండ్రి పేరు నింషీ. అహాబు వంశాన్ని నాశనం చేయటానికి దేవుడు యెహూను నియమించాడు. 8 అహాబు వంశాన్ని యెహూ నాశనం చేస్తూవున్నాడు. అప్పుడతడు యూదా పెద్దలను, అహజ్యా సేవలో వున్న అతని బంధువులను చూశాడు. యూదా పెద్దలను, అహజ్యా బంధువులను యెహూ చంపివేశాడు. 9 పిమ్మట అహజ్యా కొరకు యెహూ వెదికాడు. అతడు సమరయ (షోమ్రోను) పట్టణంలో దాగుకొనే ప్రయత్నం చేస్తూండగా యెహూ మనుష్యులు అతనిని పట్టుకున్నారు. వారు అహజ్యాను యెహూ వద్దకు తీసుకొని వచ్చారు. వారు అహజ్యాను చంపి, సమాధి చేశారు. “అహజ్యా యెహోషాపాతు వారసుడు. యెహోషాపాతు యెహోవాను నిండు హృదయంతో అనుసరించాడు” అని వారు అన్నారు. యూదా రాజ్యాన్ని సమైక్యంగా వుంచే శక్తి అహజ్యా కుటుంబానికి లేదు.
రాణి అతల్యా
10 అహజ్యా తల్లి పేరు అతల్యా. తన కుమారుడు చంపబడ్డాడని తెలుసుకోగానే ఆమె యూదాలో రాజ వంశస్తుల నందరినీ చంపివేసింది. 11 కాని యెహోషెబతు[i] అనే స్త్రీ అహజ్యా కుమారుడైన యోవాషును దాచివేసింది. యోవాషును, అతని దాదిని యెహోషెబతు లోపలి పడకగదిలో దాచింది. యెహోషెబతు రాజైన యెహోరాము కుమార్తె. ఆమె యెహోయాదా భర్యా. యెహోయాదా ఒక యాజకుడు. పైగా యెహోషెబతు అహజ్యాకు సోదరి. యెహోషెబతు దాచిన కారణంగా, యోవాషును అతల్యా చంపలేకపోయింది. 12 ఆలయంలో ఆరు సంవత్సరాల పాటు యోవాషు యాజకుల వద్ద దాచబడ్డాడు. ఆ సమయంలో అతల్యా పరిపాలన కొనసాగింది.
యాజకుడైన యెహోయాదా, రాజైన యోవాషు
23 ఆరు సంవత్సరాల అనంతరం యెహోయాదా తనశక్తిని, ధైర్యాన్ని చూపించాడు. అతడు సైనికాధిపతులతో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. ఆ అధిపతులు ఎవరంటే యెరోహాము కుమారుడు అజర్యా; యెహోహానాను కుమారుడైన ఇష్మాయేలు; ఓబేదు కుమారుడైన అజర్యా; అదాయా కుమారుడైన మయశేయా; మరియు జిఖ్రీ కుమారుడైన ఎలీషాపాతు. 2 వారు యూదా రాజ్యమంతా తిరిగి, యూదా పట్టణాలలో వున్న లేవీయులను కూడ గట్టారు. వారు ఇశ్రాయేలులో కుటుంబ పెద్దలనుకూడ కలుపుకున్నారు. పిమ్మట వారు యెరూషలేముకు వెళ్లారు. 3 వీరంతా ఆలయంలో సమావేశమై రాజుతో ఒక ఒడంబడిక కుదుర్చుకున్నారు.
ఆ ప్రజలనుద్దేశించి యెహోయాదా యిలా అన్నాడు: “రాజకుమారుడు పరిపాలిస్తాడు. దావీదు సంతతి వారి విషయంలో యెహోవా ఇదే వాగ్దానం చేశాడు. 4 ఇప్పుడు మీరు చేయవలసినదేమనగా: విశ్రాంతి దినాన విధులకు వెళ్లే యాజకులు, లేవీయులలో మూడవ వంతు వారు ద్వారాల వద్ద కాపలా వుండాలి. 5 మీలో ఒక వంతు రాజు ఇంటి వద్ద వుండాలి. ఇంకొక వంతు ప్రధాన ద్వారం (పునాది ద్వారం) వద్ద నిఘావేయాలి. మిగిలిన వారంతా ఆలయ ఆవరణలలో వుండాలి. 6 యెహోవా ఆలయంలో ఎవ్వరినీ ప్రవేశించనీయకండి. యాజకుడు, లేవీయులు పరిశుద్ధులు గనుక వారు మాత్రమే సేవ చేయటానికి లోనికి అనుమతింపబడాలి. వీరు మినహా, మిగిలిన వారంతా యెహోవా నిర్దేశించిన తమ తమ పనులను యధావిధిగా ఆచరించాలి. 7 లేవీయులు రాజు వద్ద నిలవాలి. ప్రతి ఒక్కడూ తన కత్తిని తప్పక ధరించి వుండాలి. ఎవ్వడేగాని ఆలయంలో ప్రవేశించటానికి ప్రయత్నిస్తే వానిని చంపి వేయండి. రాజు ఎక్కడికి వెళితే అక్కడికి మీరు కూడ అతనితో వెళ్లాలి.”
8 యాజకుడైన యెహోయాదా ఆజ్ఞాపించినదంతా లేవీయులు, యూదా ప్రజలు అంగీకరించారు. యాజకుల వర్గాలలో ఎవ్వరినీ యాజకుడైన యెహోయాదా ఉపేక్షించి ఊరు కోలేదు. విశ్రాంతి దినాన బయటకు వెళ్లిన వారితో కలిసి ప్రతి సైన్యాధిపతి, అతని మనుష్యులు లోనికి వచ్చారు. 9 యాజకుడైన యెహోయాదా రాజైన దావీదుకు చెందిన ఈటెలను, చిన్న పెద్ద డాళ్లను అధికారులకు ఇచ్చాడు. ఆ ఆయుధాలన్నీ ఆలయంలో వుంచబడ్డాయి. 10 పిమ్మట యెహోయాదా ఎవరెక్కడ నిలబడాలో ఆ మనుష్యులకు చెప్పాడు. ప్రతి ఒక్కడూ తన ఆయుధాన్ని ధరించివున్నాడు. వారంతా ఆలయానికి కుడినుండి ఎడమ ప్రక్కకు బారులుదీరి నిలబడ్డారు. వారు బలిపీఠానికి, ఆలయానికి రాజుకు దగ్గరగా నిలబడ్డారు. 11 వారు రాజకుమారుణ్ణి బయటకు తీసికొని వచ్చి, వాని తలపై కిరీటం పెట్టారు. ఒక ధర్మశాస్త్ర గ్రంథ ప్రతిని అతనికిచ్చారు.[j] తరువాత వారు యోవాషును రాజుగా ప్రకటించారు. యెహోయాదా, అతని కుమారులు కలిసి యోవాషును అభిషిక్తుని చేశారు. వారు “రాజు చిరంజీవియగు గాక!” అని అన్నారు.
12 ప్రజలు ఆలయానికి పరుగెత్తే శబ్దం, రాజును ప్రశంసించే ధ్వనులు అతల్యా విన్నది. ఆమె ఆలయంలో వున్న ప్రజల వద్దకు వచ్చింది. 13 ఆమె రాజును పరికించి చూసింది. ముందు ద్వారం వద్ద రాజస్తంభం దగ్గర రాజు నిలబడి ఉన్నాడు. అధికారులు, బూరలు వూదే వారు రాజుదగ్గర వున్నారు. దేశప్రజలు చాలా సంతోషంగా వున్నారు. వారు బూరలు వూదుతూ వున్నారు. సంగీత వాద్య విశేషాలపై గాయకులు పాడుతున్నారు. ప్రజలందరి చేత దేవునికి స్తుతిగీతాలు గాయకులు తమతోపాటు పాడించారు. ఇదంతా చూచి కలత చెందిన అతల్యా తన బట్టలు చింపుకొని “రాజ ద్రోహం! రాజద్రోహం!” అని అరిచింది.
14 యాజకుడైన యెహోయాదా సైన్యాధిపతులను బయటకు రప్పించాడు. “అతల్యాను బయటవున్న సైన్యం వద్దకు తీసుకొని వెళ్లండి. ఆమెను ఎవరైనా అనుసరిస్తే వారిని మీ కత్తులతో నరికి వేయండి” అని వారికి చెప్పాడు. “కాని, అతల్యాను ఆలయంలో మాత్రం చంపవద్దు” అని యాజకుడు సైనికులను హెచ్చరించాడు. 15 తర్వాత అతల్యా రాజ భవనపు అశ్వద్వారం వద్దకు వచ్చినప్పుడు వారామెను పట్టుకున్నారు. ఆమెను ఆ భవనం వద్దనే వారు చంపివేశారు.
16 అప్పుడు యెహోయాదా ప్రజలతోను, రాజుతోను ఒక ఒడంబడిక చేసుకున్నాడు. వారంతా యెహోవా భక్తులై ఆయనను అనుసరించటానికి ఒప్పుకున్నారు. 17 ఆ జనమంతా బయలు విగ్రహం ఆలయంలోకి వెళ్లి దానిని నిలువునా పగులగొట్టారు. బయలు ఆలయంలో వున్న బలిపీఠాలను, ఇతర విగ్రహాలను కూడ వారు నాశనం చేశారు. బయలు పీఠాల ముగింటనే బయలు దేవత యాజకుడైన మత్తానును చంపివేశారు.
18 పిమ్మట యెహోయాదా యెహోవా ఆలయ బాధ్యతలు స్వీకరించే యాజకులను ఎంపిక చేశాడు. ఆ యాజకులు లేవీయులు. ఆలయ యాజమాన్యం పనిని దావీదు వారికి అప్పజెప్పాడు. మోషే ధర్మశాస్త్రానుసారం ఆ యాజకులు యెహోవాకు దహనబలులు సమర్పిస్తారు. దావీదు ఆజ్ఞాపించిన రీతిగా వారు ఆనందోత్సాహాలతో బలులు అర్పించారు. 19 ఏరకంగానైనా సరే అపరిశుభ్రంగా ఎవ్వరూ ఆలయంలో ప్రవేశించకుండా యెహోయాదా ఆలయ ద్వారాల వద్ద కాపలాదారులను నియమించాడు.
20 యెహోయాదా సైన్యాధిపతులను, ప్రజానాయకులను, ప్రాంతీయ పాలకులను, ఇతర ప్రజలందరినీ తనతో తీసికొని వెళ్లాడు. ఆలయం నుండి రాజును కూడ తనతో తీసుకొని పై ద్వారం గుండా రాజభవనానికి వెళ్లాడు. అక్కడ వారు రాజును సింహాసనంపై కూర్చుండబెట్టారు. 21 యూదా ప్రజలంతా చాలా సంతోషపడ్డారు. అతల్యా కత్తివేటుకు గురియై చనిపోవటంతో యెరూషలేము నగరంలో శాంతి నెలకొన్నది.
© 1997 Bible League International