Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 రాజులు 15:25-16:34

ఇశ్రాయేలు రాజుగా నాదాబు

25 యూదాకు రాజైన ఆసా పాలన రెండవ సంవత్సరం గడుస్తూ వుండగా యరొబాము కుమారుడు నాదాబు ఇశ్రాయేలుకు రాజయ్యాడు. నాదాబు ఇశ్రాయేలును రెండు సంవత్సరాలు పాలించాడు. 26 యెహోవా దృష్టిలో అతను చాలా తప్పులు చేశాడు. తన తండ్రి యరొబాము చేసిన తప్పులన్నీ ఇతడూ చేశాడు. యరొబాము ఇశ్రాయేలు ప్రజలు కూడ పాపం చేయటానికి కారకుడయ్యాడు.

27 బయెషా అహీయా కుమారుడు. వారు ఇశ్శాఖారు వంశస్థులు. రాజైన నాదాబును చంపి వేయటానికి బయెషా పధకం వేశాడు. అది నాదాబు, ఇశ్రాయేలు వారంతా కలిసి గిబ్బెతోను నగరంపై దాడి జరుపుతున్న సమయం. గిబ్బెతోను ఫిలిష్తీయుల నగరం. అక్కడ నాదాబును బయెషా హత్య చేశాడు. 28 యూదాపై ఆసా పాలన మూడవ సంవత్సరం జరుగుతుండగా ఇది జరిగింది. ఇశ్రాయేలుకు తరువాత బయెషా రాజు అయ్యాడు.

ఇశ్రాయేలు రాజుగా బయెషా

29 బయెషా రాజైన పిమ్మట అతడు యరొబాము కుటుంబాన్ని హతమార్చాడు. యరొబాము కుటుంబంలో ఒక్కడిని కూడా బయెషా ప్రాణంతో వదలలేదు. యెహోవా ఎలా జరుగుతుందని సెలవిచ్చాడో, అదే రీతిలో ఇదంతా జరిగింది. షిలోహులో తన సేవకుడైన అహీయా ద్వారా యెహోవా ఇది పలికాడు. 30 ఇదంతా ఎందుకు జరిగినదనగా రాజైన యరొబాము చాలా పాపకార్యాలు చేశాడు. అంతే కాకుండా, ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపకార్యాలు చేయటానికి యరొబాము కారకుడయ్యాడు. హేయమైన తన పనులతో యరొబాము ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మిక్కిలి కోపం కల్గించాడు.

31 నాదాబు చేసిన ఇతర కార్యాలన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి. 32 బయెషా ఇశ్రాయేలును యేలినంత కాలం యూదా రాజైన ఆసాతో యుద్ధాలు చేస్తూనేవున్నాడు.

33 ఆసా యూదా రాజ్యాన్ని మూడవ సంవత్సరం పాలిస్తూండగా, అహీయా కుమారుడైన బయెషా ఇశ్రాయేలుకు రాజయ్యాడు. బయెషా ఇరువది నాలుగు సంవత్సరాలు తిర్సాలో పరిపాలించాడు. 34 కాని బయెషా యెహోవాకు వ్యతిరేకంగా అనేక దుష్టకార్యాలు చేశాడు. యరొబాము చేసిన పాపాలే ఇతడు కూడ చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపం చేయటానికి యరొబాము కారకుడయ్యాడు.

16 తరువాత యెహోవా హనానీ కుమారుడైన యెహూతో మాట్లాడాడు. యెహోవా రాజైన బయెషాకు వ్యతిరేకంగా మాట్లాడాడు. “నిన్నొక ముఖ్యమైన వ్యక్తిగా నేను చేశాను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలపై నిన్ను యువరాజుగా చేశాను. నీవు కూడా యరొబాము మార్గాన్నే అనుసరించావు. నా ప్రజలైన ఇశ్రాయేలీయులు తప్పుదారి పట్టేలా చేశావు. వారి పాపకార్యాలతో వారు నాకు కోపం కలుగజేశారు. కావున ఓ బయెషా, నిన్ను నీ కుటుంబాన్ని నేను నాశనం చేస్తాను. నెబాతు కుమారుడైన యరొబాము కుటుంబానికి చేసినదంతా నీ కుటుంబానికి కూడా చేస్తాను. నీ కుటుంబం వారు నగర వీధుల్లో పడి చనిపోతారు. వారి శవాలను కుక్కలుతింటాయి. నీ సంతతిలో కొందరు పొలాల్లో చనిపోతారు. వారి శవాలను పక్షులు తిని పోతాయి.”

బయెషా చేసిన ఇతర విషయాలన్నిటిని గురించి, అతని సైనిక బలం గురించి ఇశ్రాయేలు రాజుల చరిత గ్రంధంలో వ్రాయబడింది. బయెషా చనిపోయినప్పుడు అతనిని తిర్సాలో సమాధి చేశారు. అతని కుమారుడు ఏలా అతని స్థానంలో రాజు అయ్యాడు.

కావున ప్రవక్తయగు యెహూకు యెహోవా ఒక వర్తమానం అందించాడు. ఆ వర్తమానం బయెషాకు, అతని కుటుంబానికి వ్యతిరేకంగా వుంది. యెహోవా దృష్టిలో నీచమైన కార్యాలనేకం బయెషా చేశాడు. ఇది యెహోవాకు కోపకారణమయ్యింది. అతనికి ముందు యరొబాము సంతతి వారు చేసిన పనులే బయెషా కూడ చేశాడు. బయెషా యరొబాము కుటుంబం వారినందరినీ చంపివేసినందుకు కూడా యెహోవా కోపంగా వున్నాడు.

ఇశ్రాయేలు రాజుగా ఏలా

యూదా రాజుగా ఆసా పాలన ఇరువది ఆరవ సంవత్సరం గడుస్తూ వుండగా ఏలా ఇశ్రాయేలుకు రాజు అయ్యాడు. ఏలా అనువాడు బయెషా కుమారుడు. అతడు తిర్సాలో రెండేండ్లు పరిపాలించాడు.

రాజైన ఏలా కింది అధికారులలో జిమ్రీ ఒకడు. ఏలా యొక్క రథబలంలో సగానికి జిమ్రీ అధిపతి. కాని ఏలాకు వ్యతిరేకంగా జిమ్రీ కుట్ర పన్నాడు. రాజైన ఏలా తిర్సాలో ఉన్నాడు. అతడు అర్సాఇంటిలో బాగా మద్యపానం చేసి మత్తుగా ఉన్నాడు. తిర్సాలో వున్న రాజుభవన నిర్వాహకుడు అర్సా. 10 జీమ్రీ ఆ ఇంటిలో ప్రవేశించి రాజైన ఏలాను చంపేశాడు. ఆసా పాలన యూదాలో ఇరువది ఏడవ సంవత్సరం జరుగుతూ వుండగా ఇది జరిగింది. తరువాత ఏలా స్థానంలో జిమ్రీ ఇశ్రాయేలుకు రాజు అయ్యాడు.

ఇశ్రాయేలు రాజుగా జిమ్రీ

11 జిమ్రీ రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించగానే, అతడు బయెషా కుటుంబం వారినందరినీ సంహరించాడు. బయెషా వంశంలోని మగవారినెవ్వరినీ అతడు ప్రాణాలతో వదలలేదు. బయెషా స్నేహితులను కూడ జిమ్రీ చంపేశాడు. 12 జిమ్రీ ఆ విధంగా బయెషాయొక్క వంశనాశనం గావించాడు. ప్రవక్తయైన యెహూ ద్వారా బయెషాకు వ్యతిరేకంగా ఏమి జరుగుతుందని యెహోవా పలికాడో ఆ రీతిగా ఇది జరిగింది.

13 బయెషా, అతని కుమారుడు ఏలా చేసిన పాపాల ఫలితంగా ఇది జరిగింది. వారు పాపం చేయటమే కాకుండా, ఇశ్రాయేలీయులు పాపం చేయటానికి కూడా వారు కారకులయ్యారు. వారు విగ్రహాలను చేయటానికి పాల్పడినందుకు కూడా యెహోవా కోపగించాడు.

14 ఏలా చేసిన ఇతర కార్యాలన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.

15 ఆసా పాలన యూదాలో ఇరువది ఏడవ సంవత్సరం జరుగుతూ వుండగా, జిమ్రీ ఇశ్రాయేలుకు రాజయ్యాడు. జిమ్రీ తిర్సాలో ఏడు రోజులు పాలించాడు. అసలు జరిగిన విషయమేమనగా: ఫిలిష్తీయుల నగరమైన గిబ్బెతోను వద్ద ఇశ్రాయేలు సైన్యం దిగియుండెను. 16 రాజుకు వ్యతిరేకంగా జిమ్రీకుట్ర పన్నుతున్నాడని సైనికులు విన్నారు. అతడు రాజును చంపివేశాడని కూడ విన్నారు. అదే రోజున ఇశ్రాయేలీయులు ఒమ్రీని రాజుగా అదే శిబిరంలోనే ప్రకటించారు. ఒమ్రీ సైన్యాధ్యక్షుడు. 17 తరువాత ఒమ్రీ, ఇశ్రాయేలు సైన్యం గిబ్బెతోనును వదిలి తిర్సాపైకి దండెత్తి వెళ్లారు. 18 నగరాన్ని ముట్టడించి పట్టుకున్నారని జిమ్రీ తెలుసుకున్నాడు. అతడు రాజభవనంలోకి వెళ్లి దానికి నిప్పుపెట్టాడు. అతడు భవనంతో పాటు కాలిపోయాడు. 19 జిమ్రీ పాపం చేయబట్టి అతడు నాశనమయ్యాడు. అతడు పాపం చేశాడు. యెహోవా దృష్టిలో అనేక చెడు కార్యాలు చేశాడు. యరొబాము మాదిరిగానే అతను కూడా పాపం చేశాడు. యరొబాము ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపం చేయటానికి కారకుడయ్యాడు.

20 జిమ్రీ పన్నిన కుట్ర విషయం, అతను చేసిన తదితర కార్యాలు ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంధంలో వ్రాయబడ్డాయి. జిమ్రీ రాజైన ఏలాకి వ్యతిరేకంగా తిరిగి నప్పుడు జరిగిన సంఘటనలు కూడ ఆ గ్రంథంలో పొందు పర్చబడ్డాయి.

ఇశ్రాయేలు రాజుగా ఒమ్రీ

21 ఇశ్రాయేలు ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం గీనతు కుమారుడైన తిబ్నీని బలపర్చి, అతనిని రాజుగా చేయ సంకల్పించింది. రెండవ వర్గం ఒమ్రీని అనుసరించింది. 22 ఒమ్రీ అనుచరులు గీనతు కుమారుడైన తిబ్నీ వర్గం వారికంటె బలంగా వున్నారు. అందువల్ల తిబ్నీ చంపబడ్డాడు. ఒమ్రీ రాజయ్యాడు.

23 ఆసా పాలన యూదాలో ముప్పైయొకటో సంవత్సరం జరుగుతూ వుండగా, ఒమ్రీ ఇశ్రాయేలుకు రాజయ్యాడు. ఒమ్రీ ఇశ్రాయేలును పన్నెండు సంవత్సరాలు పాలించాడు. అందులో ఆరు సంవత్సరాలు తిర్సాలో వుండి ఏలాడు. 24 కాని ఒమ్రీ షోమ్రోను కొండను కొన్నాడు. దానిని షెమెరు అను వానియొద్ద నాలుగు మణుగుల[a] వెండి నిచ్చి కొన్నాడు. ఆ కొండ మీద ఒమ్రీ ఒక నగరాన్ని కట్టాడు. ఆ కొండ యజమానియైన షెమెరు జ్ఞాపకార్థం ఆ నగరానికి షోమ్రోను[b] అని పేరు పెట్టాడు.

25 కాని ఒమ్రీ యెహోవా దృష్టిలో అనేక దుష్ట కార్యాలు చేశాడు. తనకు ముందు యేలిన రాజులందరి కంటె అతడు ఎక్కువ పాపం చేశాడు. 26 అతడు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన తప్పులన్నీ చేశాడు. ఇశ్రాయేలీయులు పాపకార్యాలు చేయటానికి యరొబాము కారకుడయ్యాడు. కావున వారంతా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మిక్కిలి కోపం కలుగజేశారు. యెహోవాకు కోపం రావటానికి కారణ మేమనగా వారు పనికిమాలిన విగ్రహారాధన చేశారు.

27 ఒమ్రీ చేసిన ఇతర కార్యాలు, తన సైనికబలం మొదలగు విషయాలన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంధంలో వ్రాయబడ్డాయి. 28 ఒమ్రీ చనిపోయాడు. అతనిని షోమ్రోనులో సమాధి చేశారు. అతని కుమారుడు అహాబు అతని స్థానంలో రాజు అయ్యాడు.

ఇశ్రాయేలు రాజుగా అహాబు

29 యూదాలో ఆసా పాలన ముప్పై ఎనిమిదవ సంవత్సరం జరుగుతూండగా ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలుకు రాజైనాడు. షోమ్రోను నుండి ఇరువది రెండు సంవత్సరాల పాటు ఇశ్రాయేలును పాలించాడు. 30 అహాబు యెహోవా చేయవద్దన్న కార్యాలను చేశాడు. తనకు ముందు పాలించిన వారందరికంటె అహాబు ఎక్కువ చెడుకార్యాలు చేశాడు. 31 నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపక్రియలు అహాబుకు చాలా సామాన్యమైనవిగా కన్పించాయి. ఆ తప్పులు చాలవన్నట్లు అతడు ఎత్బయలు కుమార్తెయగు యెజెబెలును వివాహం చేసుకున్నాడు. ఎత్బయలు సీదోనుకు రాజు. దానితో అహాబు బయలు దేవతను కొలవటం మొదలు పెట్టాడు. అహాబు అతనిని ఆరాధించాడు. 32 షోమ్రోనులో బయలు ఆరాధనకు ఒక ఆలయాన్ని కట్టించాడు. ఆ ఆలయంలో ఒక బలిపీఠం ఏర్పాటు చేశాడు. 33 అషేరా దేవతను ఆరాధించటానికి అహాబు ఒక ప్రత్యేక స్తంభాన్ని నిర్మించాడు. తనకు ముందు యేలిన రాజులందరి కంటె అహాబు ఎక్కువ పాపం చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మిక్కిలి కోపాన్ని కలుగజేశాడు.

34 అహాబు రాజ్యం చేసే కాలంలో బేతేలు వాడైన హీయేలు యెరికో పట్టణాన్ని మరల‌ నిర్మించాడు. హీయేలు నగర నిర్మాణపు పనిని మొదలు పెట్టగానే, అతని పెద్ద కుమారుడగు అబీరాము చనిపోయాడు. హీయేలు నగర ద్వారాలు నిర్మించేటప్పుడు అతని చిన్న కుమారుడగు సెగూబు చనిపోయాడు. నూను కుమారుడైన యెహోషువ ద్వారా ఏది ఎలా జరుగుతుందని యెహోవా చెప్పాడో ఇదంతా ఆ విధంగా జరిగింది.[c]

2 దినవృత్తాంతములు 17

యూదారాజుగా యెహోషాపాతు

17 ఆసా స్థానంలో యెహోషాపాతు యూదాకు కొత్తగా రాజయ్యాడు. యెహోషాపాతు ఆసా కుమారుడు. యెహోషాపాతు యూదా రాజ్యాన్ని ఇశ్రాయేలుతో పోరాడగల శక్తిగలదిగా రూపొందించాడు. కోటలుగా మార్చబడిన పట్టణాలన్నిటిలో అతడు సైనిక స్థావరాలను ఏర్పాటు చేశాడు. యెహోషాపాతు యూదాలోను, తన తండ్రియైన ఆసా వశపర్చుకున్న ఎఫ్రాయిము పట్టణాలలోను కోటలు నిర్మించాడు.

యెహోవా యెహోషాపాతు పక్షాన వున్నాడు. ఎందువల్లనంటే, యెహోషాపాతు చిన్న వాడైనప్పటికి, తన పూర్వీకుడైన దావీదు చేసిన మంచి పనులన్నీ చేశాడు. యెహోషాపాతు బయలు విగ్రహాలను పూజించలేదు. తన పూర్వీకులు అనుసరించిన యెహోవా కోసమే యెహోషాపాతు నిరీక్షించాడు. అతడు దేవుని ఆజ్ఞలను పాటించాడు. ఇశ్రాయేలు ప్రజలు జీవించిన విధంగా అతడు జీవనాన్ని గడపలేదు. యూదాపై యెహోషాపాతును ఒక శక్తివంతమైన రాజుగా దేవుడు చేశాడు. యూదా ప్రజలంతా యెహోషాపాతుకు కానుకులు సమర్పించారు. ఆ విధంగా యెహోషాపాతుకు ఎక్కువ ధనం, గౌరవం లభించాయి. యెహోవా మార్గాల ననుసరించటానికి యెహోషాపాతు హృదయం సంతోషంతో యిష్టపడింది. అతడు ఉన్నత స్థలాలను, అషేరా దేవతా స్తంభాలను యూదా రాజ్యం నుండి తీసివేశాడు.

యెహోషాపాతు కొందరు పెద్దలను యూదా రాజ్యంలో ధర్మశాస్త్రాన్ని బోధించేందుకు పంపించాడు. అది యెహోషాపాతు పాలనలో మూడవయేట[a] జరిగింది. ఆ పెద్దలు ఎవరంటే బెన్హయీలు, ఓబద్యా, జెకర్యా, నెతనేలు, మరియు మీకాయా. ఈ పెద్దలతో పాటు యెహోషాపాతు లేవీయలను కూడ పంపాడు. ఆ లేవీయులు ఎవరంటే షెమయా, నెతన్యా, జెబద్యా, అశాహేలు, షెమిరామోతు, యెహోనాతాను, అదోనీయా, మరియు టోబీయా. యెహోషాపాతు యాజకులైన ఎలీషామా, యెహోరాములను కూడా పంపాడు. ఆ పెద్దలు, లేవీయులు, యాజకులు యూదాలో ప్రజలకు బోధించారు. వారి వద్ద యెహోవా ధర్మ శాస్త్ర గ్రంథం వుంది. వారు యూదా పట్టణాలన్నిటికీ వెళ్లి ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించారు.

10 యూదా పొరుగు రాజ్యాల వారు యెహోవాకు భయపడ్డారు. అందువల్ల వారు యెహోషాపాతుపై యుద్ధం ప్రకటించలేదు. 11 కొంతమంది ఫిలిష్తీయులు యెహోషాపాతుకు కానుకలు తెచ్చారు. వారు యెహోషాపాతుకు వెండిని కూడా తెచ్చారు. కారణమేమంటే యెహోషాపాతు చాలా శక్తివంతుడైన రాజని వారికి తెలియటమే. అరబీయులు కొందరు గొర్రెల మందలను యెహోషాపాతుకు కానుకలుగా తెచ్చారు. వారు ఏడువేల ఏడు వందల గొర్రెపొట్టేళ్ళను ఏడువేల ఏడు వందల మేకలను తెచ్చారు.

12 యెహోషాపాతు రాను రాను చాలా బలమైన రాజుగా రూపొందాడు. అతడు యూదా రాజ్యంలో కోటలను, గిడ్డంగుల పట్టణాలను కట్టించాడు. 13 సరుకు నిల్వచేసే ఆ పట్టణాలకు నిత్యావసర, తదితర సామగ్రిని అతడు బాగా రవాణా చేశాడు. బాగా శిక్షణ పొందిన సైనికులను యెరూషలేములో యెహోషాపాతు వుంచాడు. 14 ఈ సైనికులువారి పితరుల వంశాలలో చేర్చబడినవారు. యెరూషలేములో వున్న సైనికుల వివరాలు ఏవనగా:

యూదా వంశం నుండి నియమింపబడిన వారిలో సేనాధిపతులున్నారు. అద్నా క్రింద మూడు లక్షల మంది సైనికులున్నారు.

15 యెహోహానాను రెండు లక్షల ఎనబై వేలమంది వున్న సేనకు అధిపతి.

16 అమస్యా రెండు లక్షల మంది సైనికులకు అధిపతి. అమస్యా జిఖ్రీ కుమారుడు. అతడు యెహోవా సేవకు సంతోషంతో అంకితమయ్యాడు.

17 బెన్యామీను వంశం నుండి ఎంపిక చేయబడిన సేనాధిపతుల వివరాలు.

ఎల్యాదా క్రింద విల్లంబులు, డాళ్లు పట్టగల రెండు లక్షల మంది సైనికులున్నారు. ఎల్యాదా మిక్కిలి ధైర్యశాలియైన సేనాని.

18 యెహోజాబాదు క్రింద యుద్ధ సన్నద్ధులైన లక్షా నలబై వేల మంది సైనికులున్నారు.

19 ఈ సైనికులంతా రాజైన యెహోషాపాతుకు సేవ చేశారు. రాజుకు యూదాలో వున్న అన్ని కోటలలో ఇతర సైనికులున్నారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International