Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 సమూయేలు 24

దావీదు తన సైన్యాన్ని లెక్కింప నిర్ణయం

24 యెహోవా మరోసారి ఇశ్రాయేలీయుల పట్ల కోపం చెందాడు. యెహోవా దావీదును ఇశ్రాయేలీయులకు వ్యతిరేకమయ్యేలా చేశాడు. యెహోవా దావీదుతో, “వెళ్లు, ఇశ్రాయేలు వారిని, యూదా వారిని లెక్కించు” అని అన్నాడు.

దావీదు రాజు సైన్యాధక్షుడైన యోవాబును పిలిచి, “దాను నుండి బెయేర్షెబా వరకు తిరిగి ఇశ్రాయేలీయుల వంశాల వారందరినీ లెక్కించు. దానివల్ల వారెంత మంది వున్నారో నాకు తెలుస్తుంది,” అని అన్నాడు.

కాని యోవాబు రాజైన దావీదుతో ఇలా అన్నాడు, “ఇప్పటి జనాభా ఎంతైనా వుండనీ; నీ ప్రభువైన దేవుడు అంతకు వంద రెట్లు ప్రజలను నీకు యిచ్చుగాక! ఇది జరుగగా నీవు చూడాలని కాంక్షిస్తున్నాను. అయినా ఈ పని నీవెందుకు తల పెట్టావు?”

రాజు అది విని యోవాబును, సైన్యాధికారులను జనాభా లెక్కలు తీయమని తీవ్రంగా ఆజ్ఞాపించాడు. దానితో యోవాబు, సైన్యాధికారులు ఇశ్రాయేలులో జనాభా లెక్కలు తీయటానికి రాజును విడిచి వెళ్లారు. వారు యోర్దాను నదిదాటారు. అరోయేరు వద్ద గుడారాలు వేశారు. వారి గుడారాలు లోయలోని నగరానికి కుడిప్రక్కగా వున్నవి. (నగరం గాదులోయ మధ్యలో వుంది. యాజేరుకు వెళ్లే మార్గంలోనే నగరంవుంది)

వారు గిలాదుకు, తహ్తింహోద్షీ దేశానికి వెళ్లారు. వారింకా దానాయానుకు, సీదోను ప్రాంతానికి వెళ్లారు. వారు తూరు కోటను, మరియు హివ్వీయుల, కనానీయుల యొక్క నగరాలను దర్శించారు. వారు యూదా దేశపు దక్షిణ ప్రాంతాన గల బెయేర్షెబా చేరారు. ఇలా దేశమంతా వారు తొమ్మిది నెలల, ఇరువది రోజుల పాటు తిరిగి చివరికి యెరూషలేముకు వచ్చారు.

జనాభా పట్టికను యోవాబు రాజుకు సమర్పించాడు. ఇశ్రాయేలులో కత్తి పట్టగల జనం ఎనిమిది లక్షలవరకు వున్నారు. యూదాలో ఐదులక్షల మంది వున్నారు.

దావీదును యెహోవా శిక్షించటం

10 జనాభా లెక్కలు చూసినందుకు దావీదు సిగ్గుపడ్డాడు. దావీదు యెహోవాకి ఇలా విన్నవించుకున్నాడు, “నేను చేసిన ఈ పనివల్ల నేను చాలా పాపం మూటగట్టుకున్నాను. ప్రభూవా, నా పాపాన్ని క్షమించమని వేడుకుంటున్నాను. నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను.”

11 దావీదు ఉదయం నిద్రలేచే సరికి యెహోవా వాక్యం గాదుకు చేరింది. గాదు ప్రవక్త దావీదుకు సన్నిహితుడు. 12 గాదుకు యెహోవా ఇలా చెప్పాడు: “దావీదు వద్దకు వెళ్లి నా మాటగా ఈ విషయం చెప్పు: యెహోవా మూడు విషయాలు నీ ముందు వుంచుతున్నాడు. ఆయన నీకు చేయవలసిన దాని నొకటి నీవు ఎన్నుకో.”

13 దావీదుతో గాదు ఇలా చెప్పాడు: “నేను చెప్పేవాటిలో ఒక దానిని కోరుకో: ఏడేండ్ల కరువు నీకూ, నీ రాజ్యానికీ రావాలా? లేక నీ శత్రువులు నిన్ను మూడు నెలల పాటు వెన్నంటి తరమాలా? లేక మూడు రోజుల పాటు నీ దేశంలో వ్యాధులు ప్రబలాలా? బాగా ఆలోచన చేసి ఈ మూడింటిలో నీవు దేనిని కోరుకుంటున్నావో చెప్పు. నేను నీ నిర్ణయాన్ని నన్ను పంపిన యెహోవాకి అందజేయాలి.”

14 గాదుతో దావీదు, “నిజంగా నేను చాలా క్లిష్ట పరిస్థితిలో పడ్డాను! యెహోవా దయామయుడు కావున ఆయనే మమ్మల్ని శిక్షించనీ, నాకు శిక్ష ప్రజలనుండి మాత్రం రానీయకు!” అని అన్నాడు.

15 అందువల్ల యెహోవా ఇశ్రాయేలులో వ్యాధులు ప్రబలేలా చేశాడు. ఉదయం మొదలైన వ్యాధులు నిర్ణయించిన గడువు వరకు ప్రబలినాయి. ఉత్తర దేశంలో దానునుండి దక్షిణ ఇశ్రాయేలులోని బెయేర్షెబా వరకు డెబ్బై వేల మంది చనిపోయారు. 16 దేవదూత యెరూషలేమును నాశనం చేసేందుకు చేయి పైకి లేపాడు. కాని జరిగిన విషాద సంఘటనలకు యెహోవా విచారించాడు. ప్రజలను నాశనం చేసిన దేవదూతతో యెహోవా, “ఇది చాలు! నీ చేయిదించు!” అని అన్నాడు. యోహోవాదూత యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్లం[a] వద్దవున్నాడు.

దావీదు అరౌనా కళ్లము కొనటం

17 ప్రజలను నశింపజేసిన దేవదూతను దావీదు చూశాడు. దావీదు యెహోవాకి యిలా విన్నవించుకున్నాడు, “నేను పాపం చేశాను! నేను తప్పు చేశాను! కాని నా ప్రజలంతా నన్ను గొర్రెలవలె అనుసరించారు! వారు చేసిన తప్పేమీ లేదు! కావున దయచేసి నీ కోపం నామీద, నా తండ్రి కుటుంబం మీద మాత్రమే చూపించు!”

18 ఆరోజు మరల గాదు దావీదు వద్దకు వచ్చి, “యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్లం మీద యెహోవాకి ఒక బలిపీఠం నిర్మించమని చెప్పాడు”.

19 గాదు చెప్పిన రీతి దావీదు అంతా చేశాడు. యెహోవా ఆజ్ఞలను దావీదు శిరసావహించాడు. దావీదు అరౌనాను చూడటానికి వెళ్లాడు. 20 అరౌనా తలెత్తి చూడగా అక్కడ రాజు (దావీదు) వున్నాడు. ఆయన మనుష్యులు తన వైపు రావటం చూశాడు. అరౌనా ఎదురేగి తన శిరస్సు నేలను ఆనే వరకు వంగి రాజుకు నమస్కరించాడు. 21 “నా ప్రభువైన రాజు నావద్దకు ఎందుకు వచ్చినట్లు?” అని అడిగాడు అరౌనా.

అందుకు దావీదు, “నీనుండి నూర్పిడి కళ్లం కొనడానికి. అది కొని దానిపై యెహోవాకు ఒక బలిపీఠం నిర్మిస్తాను, అప్పడు ఈ వ్యాధులన్నీ అరికట్ట బడతాయి,” అని అన్నాడు.

22 “నా ప్రభువైన రాజు బలికి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. దహనబలికి కొన్ని ఎద్దులున్నాయి. అగ్నిని ప్రజ్వలింప చేయటానికి ధాన్యం రాలగొట్టే బల్లలు, మరియు ఎద్దులపై వేసే కాడికర్రలు వున్నాయి! 23 ఓ రాజా! ఇవన్నీ నీకు నేను ఇస్తాను.” అని అరౌనా దావీదుతో అన్నాడు. “నీ ప్రభువైన దేవుడు నీ పట్ల ప్రీతి చెందుగాక!” అని కూడ అన్నాడు.

24 అప్పుడు అరౌనాతో రాజు ఇలా అన్నాడు: “కాదు! నేను నిజం చెబుతున్నాను. నీకు వెలయిచ్చి నీ నుండి ఈ భూమిని కొంటాను. నాకు వెల లేకుండా వచ్చిన వాటితో నా ప్రభువైన దేవునికి దహనబలులు ఇవ్వను!”

కావున నూర్పిడి కళ్లాన్ని, ఎద్దులను, ఏబైతులాల వెండి వెల ఇచ్చి దావీదు కొన్నాడు. 25 తరువాత యెహోవాకి అక్కడ ఒక బలిపీఠాన్ని దావీదు నిర్మింపజేశాడు. దహనబలులు, సమాధాన బలులు దావీదు అర్పించాడు.

దేశంకొరకు దావీదు చేసిన ప్రార్థనను యెహోవా ఆలకించి, ఇశ్రాయేలులో ప్రబలిన వ్యాధులను ఇంకా వ్యాపించకుండా ఆపాడు.

1 దినవృత్తాంతములు 21-22

ఇశ్రాయేలీయులను లెక్కించిన దావీదు పాపం

21 ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా సాతాను పనిచేస్తూవున్నాడు. ఇశ్రాయేలీయుల జనాభా లెక్కలు తీసేటందుకు అతడు దావీదును ప్రోత్సహించాడు.[a] కావున దావీదు యోవాబును, ఇతర ప్రజా నాయకులను పిలిచి ఇశ్రాయేలు ప్రజలందరినీ లెక్కపెట్టి ఎంతమంది వున్నారో చెప్పమన్నాడు. “దేశంలో బెయేర్షెబా నుండి దాను పట్టణం వరకు ప్రతి ఒక్కరినీ లెక్కపెట్టి నాకు చెప్పండి. అప్పుడు దేశ జనాభా వివరాలు నాకు తెలుస్తాయి” అని అన్నాడు.

కాని యోవాబు ఇలా సమాధానమిచ్చాడు: “యెహోవా తన రాజ్యాన్ని వందరెట్లు అభివృద్ధి చేయుగాక! నా ఏలినవాడా, మహారాజా! ఇశ్రాయేలు ప్రజలంతా నీ సేవకులు. ఈ పని నీవెందుకు చేయదలిచావు? దీనివల్ల నీవు ఇశ్రాయేలు ప్రజలందరినీ పాపం చేసిన నేరస్థులుగా చిత్రిస్తున్నావు!”

కాని రాజైన దావీదు మొండివైఖరి దాల్చాడు. రాజు చెప్పినట్లు యోవాబు చేయక తప్పలేదు. అందువల్ల యోవాబు ఇశ్రాయేలు దేశంలో ప్రజలను లెక్కిస్తూ నలుమూలలా తిరిగాడు. తరువాత యోవాబు యెరూషలేముకు తిరిగి వచ్చి దేశంలో ఎంత జనాభా వున్నదీ దావీదుకు చెప్పాడు. ఇశ్రాయేలులో కత్తి పట్టగల యోధులు పదకొండు లక్షల మంది వున్నారు. యూదాలో కత్తి పట్టగల శూరులు నాలుగు లక్షల డెబ్బది వేలమంది వున్నారు. లేవి, బెన్యామీను వంశీయులను మాత్రం యోవాబు లెక్కించలేదు. రాజైన దావీదు ఆజ్ఞ తనకు ఇష్టం లేనిదైనందుననే యోవాబు ఆ వంశీయులను గణించలేదు. దేవుని దృష్టిలో దావీదు గొప్ప తప్పిదం చేశాడు. అందువల్ల దేవుడు ఇశ్రాయేలును శిక్షించాడు.

ఇశ్రాయేలును దేవుడు శిక్షించటం

పిమ్మట దేవునితో దావీదు ఇలా విన్నవించుకున్నాడు: “నేను చాలా తెలివితక్కువ పనిచేశాను. ఇశ్రాయేలు జనాభా లెక్కలు తీయించి నేను ఒక మహాపాపం చేశాను. ఇప్పుడు నీ సేవకుడనైన నా తప్పు మన్నించి నా పాపాన్ని తొలగించమని వేడుకుంటున్నాను.”

9-10 గాదు ఒక దీర్ఘదర్శి (ప్రవక్త), దావీదుకు భవిష్యత్తును చెప్పే మార్గదర్శకుడు. ఒకనాడు గాదుతో యెహోవా ఇలా అన్నాడు: “నీవు వెళ్లి దావీదుకు ఇలా చెప్పుము: ‘యెహోవా ఈ విధంగా తెలియజేస్తున్నాడు: నేను నీకు మూడు అవకాశాలు సూచిస్తున్నాను. వాటిలో నీవు ఒక దానిని ఎంపిక చేయాలి. అప్పుడు నీవు కోరిన విధంగా నిన్ను శిక్షిస్తాను.’”

11-12 ప్రవక్తయగు గాదు తరువాత దావీదు వద్దకు వెళ్లి ఈ విధంగా చెప్పాడు: “యెహోవా సెలవిచ్చునదేమనగా, ‘దావీదూ, నీకు ఏ శిక్ష కావాలో నీవే కోరుకో మూడు సంవత్సరాల కరువు పరిస్థితి, లేక నీ శత్రువులు కత్తిపట్టి మిమ్మల్ని తరుముకుంటూ రాగా మూడు నెలల పాటు మీరు వారి నుండి పారిపోవుట లేక యెహోవా మిమ్మల్ని మూడు రోజులు శిక్షకు గురిచేయుట. అనగా ఈ మూడు రోజుల్లో దేశమంతా భయంకర వ్యాధులు ప్రబలుతాయి. యెహోవా దూత దేశం నలుమూలలా తిరుగుతూ ప్రజానాశనం చేస్తాడు’. దావీదూ, దేవుడు ఇప్పుడు నన్ను పంపియున్నాడు. కావున దేవునికి నేను ఏమి సమాధానం చెప్పాలో నిర్ణయించి నీవు నాకు తప్పక తెలియజేయాలి.”

13 అందుకు ప్రవక్తయగు గాదుతో దావీదు ఇలా అన్నాడు: “నేను ఆపదలో వున్నాను. నాకు శిక్ష విధించటానికి వేరొక మనుష్యుని నిర్ణయం నాకు అక్కరలేదు. యెహోవా దయామయుడు. కావున నన్ను ఎలా శిక్షించాలో యెహోవానే నిర్ణయించనీయుము.”

14 అప్పుడు యెహోవా ఇశ్రాయేలంతా భయంకర వ్యాధులు సోకేలా చేశాడు. దానితో డెబ్బయి వేల మంది ప్రజలు చనిపోయారు. 15 యెరూషలేమును నాశనం చేయటానికి దేవుడు ఒక దేవదూతను పంపాడు. ఆ దేవదూత యెరూషలేమును నాశనం చేయ మొదలు పెట్టినప్పుడు యెహోవా చూసి బాధపడ్డాడు. అందువల్ల ఇశ్రాయేలును నాశనం చేయకూడదని ఆయన అనుకున్నాడు. ఇశ్రాయేలును నాశనం చేస్తున్న దేవదూతతో యెహోవా. “అది చాలు! ఆపివేయి” అని అన్నాడు. యెహోవాదూత యెబూసీయుడగు[b] ఒర్నాను నూర్పిడి కళ్లం వద్ద నిలబడివున్నాడు.

16 దావీదు తలఎత్తి చూడగా యెహోవాదూత ఆకాశంలో కన్పించాడు. దేవదూత తన ఖడ్గాన్ని యెరూషలేము పైకి చాపివున్నాడు. అప్పుడు దావీదు, తదితర పెద్దలు సాష్టాంగ నమస్కారం చేశారు. దావీదు, ఇతర పెద్దలు తమ సంతాపాన్ని తెలియజేసే ప్రత్యేక దుస్తులు ధరించారు. 17 దావీదు యెహోవాతో ఇలా విన్నవించుకున్నాడు: “పాపం చేసిన వాణ్ణి నేను! జనాభా లెక్కలు తీయమని నేనే ఆజ్ఞాపించాను! నేను పొరపాటు చేశాను! కాని ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏమి నేరం చేశారు? నా దేవుడైన యెహోవా, నన్ను, నా కుటుంబాన్ని శిక్షించుము! నీ ప్రజలను నాశనం చేస్తున్న మహావ్యాధులను అరికట్టుము!”

18 అప్పుడు యెహోవాదూత ప్రవక్తయగు గాదుతో ఇలా అన్నాడు: “యెహోవాను ఆరాధించటానికి ఒక బలిపీఠం నిర్మించమని దావీదుకు చెప్పుము. యెబూసీయుడగు ఒర్నాను నూర్పిడి కళ్లం వద్దనే దావీదు ఆ బలిపీఠాన్ని నిర్మించాలి.” 19 గాదు ఆ విషయాలను దావీదుకు తెలియజేశాడు. దావీదు ఒర్నాను నూర్పిడి కళ్లం వద్దకు వెళ్లాడు.

20 ఒర్నాను గోధుమ పోతపోస్తున్నాడు. అతను తిరిగి చూసి యెహోవా దూతను గమనించాడు. ఒర్నాను నలుగురు కుమారులూ పారిపోయి దాక్కున్నారు. 21 దావీదు ఒర్నాను వద్దకు వస్తున్నాడు. ఒర్నాను తన కళ్లం వదిలి దావీదు వద్దకు వెళ్లి అతని ముందు సాష్టాంగపడ్డాడు.

22 దావీదు ఒర్నానుతో, “నీ నూర్పిడి కళ్లాన్ని నాకివ్వు. ఈ స్థలంలో యెహోవాని ఆరాధించటానికి నేనొక బలిపీఠాన్ని నిర్మిస్తాను. ఈ కళ్లాన్ని పూర్తి ధరకు నాకు అమ్మివేయి. అప్పుడు ఈ భయంకర వ్యాధులు ఆగిపోతాయి” అని చెప్పాడు.

23 ఒర్నాను దావీదుకు ఇలా సమాధానమిచ్చాడు: “ఈ నూర్పిడి కళ్లాన్ని తీసుకొనుము! నీవు నా ఏలినవాడవైన రాజువు. నీవు కోరిన విధంగా చేయుము. దహన బలులుగా సమర్పించటానికి నేను నీకు పశువులను కూడ ఇస్తాను. పీఠం మీద అగ్ని వెలిగించటానికి కళ్లంలో వేసే బల్ల చెక్కలను కూడ ఇస్తాను. ధాన్యార్పణను చెల్లించటానికి నేను గోధుమలు కూడ ఇస్తాను. నేను ఇవన్నీ నీకు ఇస్తాను!”

24 కాని దావీదు ఒర్నానుతో ఇలా అన్నాడు: “వద్దు నేను పూర్తి వెలయిచ్చే దీనిని కొనాలి. నీకు చెందినదేదీ నేను ఉచితంగా తీసుకొని యెహోవాకి ఇవ్వను. నాకు ఊరకనే వచ్చిన దానినేదీ నేను యెహోవాకి అర్పణగా చెల్లించను.”

25 కావున దావీదు ఒర్నానుకు సుమారు ఆరువందల తులాల (పదిహేను పౌనులు) బంగారం ఇచ్చి ఆ స్థలం తీసుకున్నాడు. 26 యెహోవాను ఆరాధించటానికి అక్కడ దావీదు ఒక బలిపీఠం కట్టించాడు. దావీదు దహన బలులు, సమాధాన బలులు సమర్పించాడు. దావీదు యెహోవాని ప్రార్థించాడు. ఆకాశం నుండి అగ్నిని క్రిందికి పంపి యెహోవా దావీదు ప్రార్థనను ఆలకించాడు. దహనబలులు ఇచ్చే పీఠం మీదికి అగ్ని దిగింది. 27 అప్పుడు తన కత్తిని ఒరలో పెట్టుమని యెహోవా తన దూతకు ఆజ్ఞాపించాడు.

28 యెహోవా ఒర్నాను కళ్లంలో తన ప్రార్థన ఆలకించాడని దావీదు తెలుసుకొని ఆయనకు బలులు సమర్పించాడు. 29 (పవిత్ర గుడారం, దహనబలుల బలిపీఠం గిబియోనులో ఎత్తైన స్థలంలో వున్నాయి. ఇశ్రాయేలీయులు ఎడారిలో వున్నప్పుడు మోషే ఈ పవిత్ర గుడారాన్ని తయారు చేశాడు. 30 దావీదు భయపడిన కారణంగా అతను పవిత్ర గుడారంలోకి వెళ్లి దేవునితో మాట్లాడలేక పోయాడు. దావీదు యెహోవా దూతకు, అతని కత్తికి భయపడ్డాడు.)

22 “యెహోవా దేవుని ఆలయం మరియు దహనబలులకు బలిపీఠం ఇశ్రాయేలు ప్రజల ఉపయోగార్థం ఇక్కడ నిర్మింపబడతాయి” అని దావీదు అన్నాడు.

ఆలయ నిర్మాణానికి దావీదు ప్రణాళిక

ఇశ్రాయేలులో వుంటున్న అన్యజాతి వారందరినీ ఒకచోట చేరుమని దావీదు ఉత్తరువు ఇచ్చాడు. వారిలో నుండి రాళ్లు కొట్టే వారిని ఎంపిక చేశాడు. దేవాలయ నిర్మాణానికి రాళ్లు చెక్కి సిద్ధం చేయటం వారి పని. దేవాలయ ద్వారపు తలుపులకు, బందులకు, మేకులకు కావలసిన ఇనుమును దావీదు సేకరించాడు. బరువు తూకం వేయలేనంత కంచును కూడ దావీదు సమకూర్చాడు. దావీదు ఇంకా లెక్కలేనన్ని దేవదారు దూలాలను కూడా తెప్పించాడు. సీదోను, తూరు నగర ప్రజలు దావీదుకు చాలా దేవదారు కలప పంపారు.

దావీదు ఇలా అన్నాడు: “మనం యెహోవాకు ఒక గొప్ప ఆలయం కడదాము. నా కుమారుడు సొలొమోను చిన్నవాడు కావటంతో, అతను నేర్చుకోవాల్సిన విషయాలు ఇంకా నేర్చుకోలేదు. యెహోవా ఆలయం చాలా గొప్పదై వుండాలి. దాని అందచందాలలోను, ఔన్నత్యంలోను ఆ దేవాలయం సాటి రాజ్యాలన్నిటిలోను మేటిదై వుండాలి. అందువల్ల దేవాలయ నిర్మాణానికి అవసరమైన అనేక ఏర్పాట్లు చేస్తాను.” తాను చనిపోయే ముందు దేవాలయ నిర్మాణానికి దావీదు అనేక ఏర్పాట్లు చేశాడు.

పిమ్మట దావీదు తన కుమారుడైన సొలొమోనును పిలిచాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఒక ఆలయాన్ని కట్టుమని దావీదు సొలొమోనుకు చెప్పాడు. సొలొమోనుతో దావీదు ఇలా అన్నాడు: “నా కుమారుడా! నా దేవుడైన యెహోవా నామమున నేనొక ఆలయం కట్టించాలనుకున్నాను. కాని యెహోవా నాతో, ‘దావీదూ, నీవు చాలా యుద్ధాలు చేసి అనేకమందిని చంపావు. కావున నా పేరుమీద నీవు ఆలయం కట్టించలేవు. కాని నీకొక శాంతి పరుడైన కుమారుడున్నాడు. నీ కుమారునికి శాంతియుత వాతావరణాన్ని కల్పిస్తాను. తనచుట్టూ వున్న అతని శత్రువులు అతనిని ఏమీ బాధపెట్టరు. అతని పేరు సొలొమోను.[c] సొలొమోను రాజుగా వున్న కాలంలో ఇశ్రాయేలు శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లేలా చేస్తాను. 10 నా పేరు మీద సొలొమోను ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు. సొలొమోను నాకు కుమారినిలా వుంటాడు. నేనతనికి తండ్రిలా వుంటాను. నేను సొలొమోను రాజ్యాన్ని బలపరుస్తాను. పైగా అతని కుటుంబంలో నుండి ఎవ్వరో ఒక్కరు శాశ్వతంగా రాజవుతూనే వుంటారు!’”

11 దావీదు ఇంకా ఇలా అన్నాడు: “కుమారుడా ఇప్పుడు యెహోవా నీకు తోడై వుండుగాక! యెహోవా నీవు నిర్మిస్తావని చెప్పినట్లు, దేవాలయ నిర్మాణంలో నీవు విజయం సాధించెదవుగాక! 12 యెహోవా నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను సమర్థవంతంగా పాలించే విధంగా యెహోవా నీకు తెలివితేటలు, అవగాహన యిచ్చు గాక! నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించు. 13 ఇశ్రాయేలు సంక్షేమం కొరకు దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని, నియమాలను నీవు పాటించే జాగ్రత్త తీసుకొంటే, నీవు విజయం సాధిస్తావు. నీవు శక్తిమంతుడవై, ధైర్యంగావుండు. నీవు భయపడవద్దు.

14 “సొలొమోనూ! యెహోవా ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేయటంలో నేను చాలా కష్టపడ్డాను. నేను మూడువేల ఏడువందల ఏభై టన్నుల బంగారాన్ని, ముఫై ఏడువేల ఐదువందల టన్నుల వెండిని, తూకం వేయటానికి సాధ్యం కానంత కంచును, ఇనుమును ఇచ్చాను. కలపను, రాయిని కూడ ఇచ్చాను. సొలొమోనూ, నేనిచ్చిన దానికి తోడు నీవింకా కొంత సామగ్రిని సమకూర్చవచ్చు. 15 నీ వద్ద చాలా మంది రాతిని చెక్కే శిల్పులు, వడ్రంగులు వున్నారు. ప్రతి పనిలోనూ నిపుణులైన వారు నీకున్నారు. 16 బంగారం, వెండి, కంచు, ఇనుము పనులలో నేర్పరులు, అనుభవం వున్న వారు నీవద్ద వున్నారు. ప్రవీణతగల పనివారు నీ వద్ద లెక్కకు మించి వున్నారు. ఇప్పుడు పని మొదలు పెట్టు. యెహోవా నీకు తోడై ఉండుగాక!”

17 తరువాత ఇశ్రాయేలు పెద్దలందరికీ తన కుమారుడు సొలొమోనుకు సహాయపడుమని దావీదు ఆజ్ఞ ఇచ్చాడు. 18 ఆ పెద్దలందరికీ దావీదు యిలా చెప్పాడు: “మీ దేవుడైన యెహోవా మీతో వున్నాడు. ఆయన మీకు శాంతి నెలకొన్న కాలాన్ని ప్రసాదించాడు. మన చుట్టూ వున్న దేశాలను ఓడించేలా యెహోవా నాకు సహాయం చేశాడు. యెహోవా, ఆయన ప్రజలు ఇప్పుడీ దేశంమీద ఆధిపత్యం వహించి వున్నారు. 19 యెహోవా సంకల్పం నెరవేరటానికి మీరంతా హృదయపూర్వకంగా ఆయనకు అంకితమవ్వండి. యెహోవా దేవునికి పవిత్ర ఆలయాన్ని నిర్మించండి. యెహోవా పేరున ఆలయ నిర్మాణం చేయండి. పిమ్మట ఒడంబడిక పెట్టెను, ఇతర పవిత్ర పరికరాలను ఆలయంలోకి తీసుకురండి.”

కీర్తనలు. 30

దావీదు కీర్తన. ఆలయ ప్రతిష్ఠ కీర్తన.

30 యెహోవా, నా కష్టాల్లో నుంచి నీవు నన్ను పైకి ఎత్తావు.
    నా శత్రువులు నన్ను ఓడించి, నన్ను చూచి నవ్వకుండా నీవు చేశావు. కనుక నేను నిన్ను ఘనపరుస్తాను.
యెహోవా, నా దేవా నేను నిన్ను ప్రార్థించాను.
    నీవు నన్ను స్వస్థపరచావు.
సమాధిలో నుండి నీవు నన్ను పైకి లేపావు.
    నీవు నన్ను బ్రతకనిచ్చావు. చచ్చిన వాళ్లతోబాటు నేను గోతిలొ[a] ఉండవలసిన పనిలేదు.

దేవుని అనుచరులారా! యెహోవాకు స్తుతులు పాడండి.
    ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
దేవునికి కోపం వచ్చింది కనుక “మరణం” నిర్ణయం చేయబడింది. కాని ఆయన తన ప్రేమను చూపించాడు.
    నాకు “జీవం” ప్రసాదించాడు.
రాత్రి పూట, నేను ఏడుస్తూ పండుకొంటాను.
    మర్నాటి ఉదయం నేను సంతోషంగా పాడుతూ ఉంటాను.

ఇప్పుడు నేను ఇది చెప్పగలను, ఇది సత్యం అని నాకు గట్టిగా తెలుసు.
    నేను ఎన్నటికీ ఓడించబడను.
యెహోవా, నీవు నామీద దయ చూపావు.
    బలమైన పర్వతంలా నీవు నన్ను నిలువబెట్టావు.
కొద్దికాలంపాటు, నీవు నా నుండి తిరిగిపోయావు.
    మరి నేను చాలా భయపడిపోయాను.
దేవా, నేను మరల, నిన్ను ప్రార్థించాను.
    నామీద దయ చూపించమని నేను నిన్ను అడిగాను.
“దేవా, నేను మరణించి,
    సమాధిలోకి దిగిపోతే ఏమి లాభం?
ధూళి నిన్ను స్తుతిస్తుందా?
    అది నీ నమ్మకమును గూర్చి చెబుతుందా?
10 యెహోవా, నా ప్రార్థన విని నామీద దయ చూపించుము.
    యెహోవా, నాకు సహాయం చేయుము” అని అడిగాను.

11 నేను ప్రార్థించినప్పుడు, నీవు నాకు సహాయం చేశావు.
నా ఏడ్పును నీవు నాట్యంగా మార్చావు. నా దుఃఖ వస్త్రాలను నీవు తీసివేశావు.
    నీవు నాకు సంతోషమనే వస్త్రాలు ధరింపజేశావు.
12 యెహోవా, నా దేవా, నిన్ను నేను శాశ్వతంగా స్తుతిస్తాను.
    ఎన్నటికీ మౌనంగా ఉండను. నా దేవా! నిన్ను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International